అరవై ఒకటవ తరంగం .
ఆ రాత్రి ఆంధ్రుడు మధుఛ్చంద్రునికి వర్తమానము పంపాడు . అన్న చెప్పాలనుకున్న విషయమేమిటో తమ్ముడికి తెలుసు. అయినా , పెద్దవాడు అని తమ్ముడు అన్న వద్దకు వచ్చాడు . చేతులు కట్టుకొనే నిలుచున్నాడు . అన్న బలవంతము చేసి కూర్చోబెట్టుకున్నాడు . " ఒక విషయములో సలహా అడగవలెనని నిన్ను పిలిపించినాను . " అని సన్నగా వక్రముగా నున్ననూ , క్రూరత్వములేని పలుకుతో అన్నాడు .
" ఆజ్ఞ "
" ఇప్పుడా దేవరాతుని విషయము నన్ను చాలా కష్టపెడుతున్నది . భగవానులు వాడిని సర్వ జ్యేష్ఠుడిగా అంగీకరించునట్లు కనిపిస్తున్నది . దీనికి నువ్వేమి చేయవలెనని ఉన్నావు ? "
" అన్నా , బ్రాహ్మణులలో వయోనుక్రమముగా జ్యేష్ఠత్వము రాదు . మనలో ఎవరూ కూడా మంత్ర ద్రష్ట లగుట అటుంచి , మంత్ర కర్తలు కూడా కాలేదు . అవగలమో లేదో కూడా తెలియదు . అతడు అప్పుడే ప్రజాపతి , వరుణ , అగ్ని , ఇంద్ర, అశ్వినీ దేవతలు , ఉషస్ ....వీరినందరినీ ప్రసన్నులను చేసుకున్న సంగతి విశ్వవిదితమైనది . అతడికి అథమ పక్షము నా అంత వయసు వచ్చియున్ననూ మధుపర్కానికి అర్హత వచ్చెడిది . వయసు చాలదని స్నాతకుడు కాలేదు అంతేకానీ అతని యోగ్యతకేమి తక్కువ ? కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని ఇలాగే చూడవలెను అని వేడుకుంటున్నాను . గుణ పక్షపాతులైన భగవానులు నీ అభిప్రాయము తెలిస్తే ఏమనుకుంటారు ? "
" రేపు నేనే చెపుతాను . అయినా , నువ్వు వెయ్యి చెప్పు , నేనప్పుడే ఇలాగని రూఢి చేసుకున్నాను , ’ ఔరస పుత్రులకన్నా దత్త పుత్రుడికి అధికారము ఎక్కువ అంటే ధర్మ పురుషుడు కూడా ఒప్పుకోడు ’ . "
" అన్నా , దుడుకు వద్దు . ఇది దత్తత విషయము కాదు . దేవరాతుడు అని పేరు పెట్టినపుడే నీకు తెలియలేదా ? ధర్మ రక్షకులైన దేవతలు ఇతనిని భగవానులకు ఇచ్చినారు . "
" మధుఛ్చంద్రా , సరిగ్గా అర్థము చేసుకొని మాట్లాడు . దీనిలో దేవతలకు సంబంధము లేదు . అవిద్యావంతుడైన ఒక అనామకుడి కొడుకు , తన అతి తెలివితో భగవానులను పట్టి , వారి ఆస్తికి తానుకూడా హక్కుదారు కావాలని వారి తొడపై కూర్చోగా , భగవానులు అజ్ఞాత కుల గోత్రుడిని దేవరాతుడని కాక , ఇంకే పేరుతో పిలువలెను ? ఏమైనా కానీ , రేపటి దినము పూర్వాహ్ణము లోపలే భగవానులను చూచి దీని విషయము నిర్ధారించుకుంటాను . అయితే నువ్వు మా జట్టులో ఉండవా ? "
" అన్నా , నాపైన కోపగించ వలదు . నేను భగవానుల సిద్ధాంతము ప్రకారమే నడచుకుంటాను . "
" ఒక వేళ ధర్మము నా వైపు ఉంటే ? "
" మనకు ధర్మము తెలుసు అనుకొనుట సాహసము . అన్నా , ధర్మాధర్మాలు , నేను ధర్మము , నేను అధర్మము అని నుదుటి పైన రాసుకొని తిరగవు . ఇక , రాగద్వేషముల వలన మన దృష్టి దుష్టమైనపుడు ధర్మాధర్మ స్వరూపము తెలుస్తుందనుకున్నావా ? వలదు . నేను చిన్నవాడిని . నీ ఎదురుగా ఇంతవరకూ ఇలాగ నోరు తెరచి మాట్లాడినది లేదు . నువ్వేమి చేసినా , దుడుకు లేకుండా , సావధానముగా శాంతముగా ఆలోచించి చూడు . ఇంతవరకూ నువ్వు ఆడిన మాటలు మాత భగవతి కి ఎంత అప్రియమైనవి అన్నది నీకూ తెలుసు . "
" మధుఛ్చంద్రా , నేను సావధానముగా , శాంతముగా మీమాంస చేసితిని అనుటకు కనిష్టుడవైన నీ మాటలను శాంతముగా వినుచుండుటే సాక్షి . నాకు నేను చెప్పినదే సరైనది అనిపించినది . నేను నమ్మినదానికై ప్రాణమును కూడా పణముగా పెట్టుటకు సిద్ధముగా ఉన్నాను . నేను ఇంతవరకూ ఊరికే ఉన్నది , భగవతీ భగవానులకు అసమ్మతము కాకూడదని . అయితే ఇది నేను ఎదురు నిలచి మాట్లాడితే గానీ సరిపోదని నమ్మకము బలమవుతున్నది . అన్నిటికన్నా , ఆ దేవరాతుడితో భగవానులు చర్చిస్తున్న రహస్యములు , ఎపుడైనా నాతో....నేను వద్దులే , నేను అయోగ్యుడిని , నీతో , అదీ , అగ్ని సాక్షాత్కారము పొంది అప్పుడే ఋషి అనిపించుకున్న నీతో చర్చించినారా ? దీనివలన హాని ఏముంది అంటావేమో ? ఈ విద్యా రహస్యాలే మన కుల ధనము . ఆశ్రమములో నున్న గో ధనము నంతటినీ వాడికి ఇవ్వనీ , ఆశ్రమములోని స్వర్ణము సర్వమునూ వాడికి ధారపోయనీ . కానీ మన వంశస్థులకు మాత్రమే పరిమితమైన ఆ రహస్యములను చెప్పుట నేనెంత మాత్రమూ సహించను . "
" అన్నా , అన్నా...ఇక్కడే నువ్వు దుడుకు చూపిస్తున్నావు . భగవానుల విద్యా వైభవము అంతా వారి స్వార్జితము . అదీకాక , ’ ఆత్మా వై పుత్ర నామాసి ’ అను శ్రుతి ప్రకారము , వారే స్వయముగా మేధా జననము చేసినట్టి మనకు వారి విద్యా వైభవమంతా జన్మ సిద్ధముగానే వచ్చియున్నపుడు , ఇక ఇవ్వ వలసినదేమిటి ? ( మేధా జననము అంటే , శిశువు పుట్టునపుడు , నాభి నాళఛేదనము నకు ముందే తండ్రి చేయవలసిన కార్యము . నాళ ఛేదనము అగు వరకూ ఆ శిశువుకు వ్యక్తిత్వము రాదు . వ్యక్తిత్వము రాక మునుపే , తండ్రియైన వాడు వచ్చి , ఆ శిశువు కుడి భుజమును ముట్టి , విహితములైన మంత్రోచ్చారణ చేస్తే , ఆ శిశువు మనసూ బుద్ధీ , తండ్రి మనో బుద్ధుల కనుసారముగా వచ్చును . పెరిగే శిశువుతో పాటు మనో బుద్ధులు కూడా పెరుగును . అలా చేయకున్న , శిశువు తన వంశపు విశిష్ట లక్షణములను పొందుటకు బదులుగా , తన పూర్వ జన్మ వాసనలకు అనుగుణముగా పెరిగి , తన వ్యక్తిత్వాన్ని దృఢము చేసుకొనును . ) మనము దానిని అనుష్ఠానముతో పొందగలము . కొత్తవాడికి వారు ఇవ్వనిదే వచ్చేదెలాగ ? కాబట్టి దానిని నువ్వు చూస్తున్న దృష్టి , వక్రము ."
" మధుఛ్చంద్రా , మనమిద్దరమూ భిన్న ప్రస్థానములలో నున్నాము . మనకిది విరుద్ధమత స్థానము . ఇక్కడికి వదలివేయుదము . "
" భగవానులయందు కూడా విరుద్ధమత స్థానమని భావించి , వదలి వేసి , వారు కావలసినది చేసుకోనీ , అని ఊరకే ఉండు . "
" నువ్వు మాకు నియమ్యుడవు . నియామకుడవు కాదు . భగవానులు నియామకులు . నియమ్యులు కాదు . కాబట్టి వారు ఒక సిద్ధాంతమును పట్టితే , దాని వలన మనకు హాని ఉంటే , మనము దానిని ప్రతిఘటించి తీరవలెను . నువ్విక వెళ్ళిరా . ఈ దినము నుండి మా గుంపు వేరే , మీ గుంపు వేరే . "
" అయినా మనమిద్దరమూ ఒకే చెట్టు చిగురులము . అన్నా , మీరు పెద్దవారు . మీ ఆశ్రయములో ఉన్నవారము మేము . అనుజ్ఞ ఇవ్వు , వెళ్ళివస్తాను . "
" మధుఛ్చంద్రా , నీతో మాట్లాడుటయే ఒక సంతోషము . నీ నాలుక ఒక మధు గ్రంధుల ఊట . నాకు నీ వలెనే ఉండవలెను అనిపిస్తుంది . కానీ ఏమి చేయుదును ? నాకేమో ఇలాగ , ఈ దేవరాతుడి కారణముగా కోపము వచ్చింది . ప్రవాహము ఎక్కువైంది . గట్టు తెగుతుంది అని అప్పుడపుడు భీతి కూడా అగుతున్నది . అయినా ధర్మము కోసము ఏమైనా కానీ , భగవానులనే అడిగివేస్తాను . ఒకవేళ నువ్వు చెప్పినట్లే జరిగి మాకు భగవానుల కోపము తగిలితే , దానివలన నీకేమీ హాని కారాదు . ఇదిగో , నా తపస్సంతా నీకు రక్ష అవనీ . నీ వినయమే నీకు రక్షా కవచము . మరల శపథ పూర్వకముగా చెబుతున్నాను , దేవతలు , ధర్మ పురుషుడూ సాక్షులు . నేను ధర్మమనుకొని చేయబోవు ఈ యుద్ధములో పితృకోపాన్ని పొంది , దానివలన హాని జరిగితే , అది మా యాభై మందికి మాత్రమే వర్తించనీ . మధుఛ్చంద్రాది పంచాశులకు దానివలన ఆవగింజంత కూడా హాని జరగకుండు గాక. తథాస్తు : తథాస్తు . "
తమ్ముడి కంట నీరు పెల్లుబికింది . దానిని తుడుచుకొని , అన్నకు నమస్కారము చేసి వెళ్ళాడు .
janardhana sarmagaru,
ReplyDeletemee prayatnamu slaaghaneeyamu, abhinandaneeyamu.....
chinna sandehamu teerchamani praardhana........
maa gotram GOWRVITASA ANGEERASA SANKRUTYA TRAYARUSHEYAM......... indulo GOWRVITASA maharshi evaru....... angeerasuni gurunchi, sankrutyuni gurunchi koddiga telusu...... ee maharshi evaru...... ithanu maharshi aenaa?? leka manuvaa??? dayachesi naa sandeham teerchamani prardhana chestunna......
అనంత రామ కృష్ణ చైతన్య గారూ , నమస్కారము.
ReplyDeleteనాకు తెలిసినంతవరకూ
అంగీరస గౌరువీత సాంకృత్య --వీరు ముగ్గురూ ఋషులే . మీది ఆశ్వలాయన సూత్రము .
ఎక్కువ వివరాలు తెలిసిన , తప్పక తెలియజేయగలను .
ధన్యవాదములు