యాభై తొమ్మిదవ తరంగం .
అయోధ్యా నగర వాసులందరూ యజ్ఞ మంటపము నుండీ ఆనందపరవశులై వెను తిరిగి వెళుతున్నారు . అందరికీ ఆశ్చర్యమే ఆశ్చర్యము ! తమ కన్నులతో చూచినారు కాబట్టి నమ్మ వలెను , లేకుండిన , నమ్ముటకు అసాధ్యము అన్నటువంటి విశేషము ఒకటి జరిగింది .
దారిలో ఒకడన్నాడు , " ఈ కాలము యాగ యజ్ఞములు జరుగునపుడు హవిస్సును అర్పించగా , దేవతలే వచ్చి తమ యజ్ఞ భాగములను తీసుకొని వెళ్ళెదరు అని విన్నాను . ఈ దినము అది నిజమైనది "
" అవునవును , ఆ స్వర్ణ రథము వచ్చినపుడు అందరూ ఆశ్చర్యములో మునిగిపోయినారు . అదేమి రథము ! అవేమి అశ్వములు ! అబ్బా ! అటువంటివి ఎక్కడైనా ఉంటాయేమయ్యా ? గరిక వర్ణపు గుర్రములు . దానిలో ఉన్నదెవరయ్యా ? "
" గరిక వర్ణపు గుర్రములు ఉంటే అది ఇంద్రుడే కదేమయ్యా ! ఆ కంచరగాడిద కట్టిన రథము వచ్చియుండెను కదా , దానిలో ఉండినవారు అశ్వినీ దేవతలు . ఆ ఎరుపు వర్ణపు గుర్రము కట్టిన రథములో వచ్చినది ఉషాదేవి . "
" అవునూ , నువ్వు ఇంకొక విశేషము చూచినావా ? ఆ ఉషాదేవి వచ్చింది కదా ! అప్పుడు జనమంతా చేతులతో చప్పట్లు కొట్టినారు కద , ఎందుకో తెలిసిందా ? "
" లేదు , నేను దూరములో ఉంటిని . అదేదో పాశము , గీశము అని అరుపులు వినిపించినాయి . ఆ గందరగోళములో సరిగా తెలియలేదు . "
" అదా ? ఆ పిల్లవాడిని యాగ పశువుగా యూప స్థంభానికి బిగించినారు కదా , ఆ దేవతలు వస్తూ ఉండగా , ఇక్కడ ఒక్కొక్క పాశము సడలి , కట్లు విప్పుకుంటూ వచ్చాయి . అలాగు ఆ పిల్లవాడిని బంధించిన పాశములు తమకు తామే విడిపోతుండగా , అక్కడ మహరాజు రోగము తగ్గుముఖము పడుతూ వచ్చింది . "
" ఏమిటి ? మహోదరము తగ్గుతూ వచ్చిందా ? గుణమై పోయిందా ? "
" గుణమై పోయిందా ? ...అదేమి , మహారాజే లేచి నిలుచుని , ఋత్త్విక్కులకు సంభావనలను తమ స్వహస్తాలతో అందించలేదా ? "
" ఓయీ వీతిహోత్రా ! నేను గున్న ఏనుగు పరిమాణములో ఉన్న పొట్టతో యజ్ఞ మంటపమునకు వచ్చిన మహారాజును చూచితిని . చదునుగా రొట్టె పరిమాణముతో ఉన్న పొట్ట గల వాడిని చూచి మహారాజే అని ఎలా అనుకోగలను ? ఎవరో రాజుగారి సమీప బంధువు రాజు వలెనే అలంకారము చేసుకొని ఉన్నాడే ? అనుకున్నాను . "
" ఏదేమైననూ , వెనుక త్రిశంకు మహారాజు కాలములో ఇటులనే అద్భుతములు జరుగుట చూచినాము . ఈ హరిశ్చంద్రుని కాలములో నడచినదీ చూచితిమి . అప్పుడు అంతా విశ్వామిత్రుల మహిమ. ఇప్పుడు వీరంతా చేరియున్నారు కదా , ఎవరి మహిమో తెలియకున్నది . "
"అదైతే నిజమే . ఇప్పుడు వారితో పాటు వశిష్ఠులు కూడా వచ్చియున్నారు . అది సరే , నీకు తెలుసా , ఇప్పుడు వారు వట్టి విశ్వామిత్రులు కాదు నాయనా , వారు భగవాన్ విశ్వామిత్రులు . అక్కడెక్కడో హిమాలయాల్లో బ్రహ్మర్షుల సభ ఒకటి జరిగిందట . అక్కడ వీరిని బ్రహ్మర్షి అని అంతా ఒప్పుకున్నారట . "
" నేనీమాట అప్పుడే చెప్పలేదా ? విశ్వామిత్రులు ఏ బ్రహ్మర్షికీ కూడా తక్కువ కారు . అప్పుడు వారిని రాజర్షి అని సంబోధించుట ఎక్కడి న్యాయము అని నేను అడిగి ఉన్నాను కూడా ! "
" ఏమిటో , ఈ ఋషుల సంగతి మనకు తెలియదు . ఇదంతా ఎటైనా పోనీ ! మొత్తానికి బ్రహ్మర్షులందరూ చేరి , చావబోతున్న పిల్లవాడిని కాపాడుకున్నారు . మహారాజు రోగము గుణము చేసినారు . కావలసినట్లు బళ్ళ నిండా బంగారు , వెండి , మందలుగా పశువులనూ రాలగొట్టుకుని పోయినారు . "
" ఆ మహారాజు తన రోగము గుణము చేసినవారికి అర్ధ రాజ్యము నిస్తానని దండోరా కూడా వేయించి ఉన్నాడు . "
" అటువంటి రోగము మానితే అర్ధ రాజ్యము ఇచ్చుట అదేమి గొప్ప ? "
" సరే , ఇప్పుడు ఆ పిల్లవాడు బతికి బయట పడినాడు కదా , వాడు ఎవరి పాలు ? "
" ఎవరి పాలేమిటి ? వాడి నాయన లేడా ? "
" అమ్ముకున్నవాడు వాడెక్కడి నాయన ? వీడు వెళితే వాడు , " వీడు నా కొడుకు " అని ఇంట చేర్చుకొనుటకు ముఖము ఉంటుందా ? "
" వాడు బ్రతికినది ముఖ్యము . ఎవరి కొడుకైతేనేమి ? అదంతా చూచుకొనుటకు ఋషులున్నారు కదా , అది వారి పని . "
" చూచితివా గౌతమా , దీనికే , ’ మహా సన్నిధి ’ ఉండవలెను అనునది ! గొప్ప గొప్ప వారు వచ్చి కూర్చున్నారు . దానితో దేవతలు కూడా పశువును వదలివేసినారు . "
" చాల్లేవయ్యా , ఆ పిల్లవాడు పాడిన మంత్రమున కన్నా హవిస్సు ఎక్కువా ? నువ్వే హవిర్భాగానికి వచ్చిన దేవతవై ఉంటే , ఆ మంత్రములు పలికిన సొగసుకు మైమరచి , ’ కుమారా , నీకేమి కావాలో కోరుకో ’ అని అనుగ్రహించే వాడవు . "
" అవును , నువ్వు అన్నది మిక్కిలి బాగున్నది . అంతే కాదు . వాడు ఋక్కు పాడుతుంటే , నిజంగా అగ్ని దేవుడో , వాగ్దేవియో కూర్చొని పాడుతున్నారా అనిపించింది . నిజంగా అవన్నీ కొత్త మంత్రాలు "
" ఆ వరుణుడు వచ్చినపుడు జ్వాలలన్నీ నీలమై ఆకాశమునే దహించున్నట్లు పైకి లేస్తున్నాయో అన్నట్లుండినది చూచినావా ? నేను , దేవతలు యజ్ఞ కుండములో నిలిచి హవిర్భాగములు తీసుకొనుట ఎన్నో చోట్ల చూసినవాడిని . దేవతలు రథములలో వచ్చి వెళ్ళుటను చూచుట ఇదే మొదటిసారి . "
" ముఖ్యంగా , భగవంతులైన ఆ వశిష్ఠ విశ్వామిత్రులు ఒకటిగా చేరినది ఇదే మొదటి సారి . ఆ యోగమే దీనికంతటికీ కారణము . మన మహారాజు , వారి తండ్రిగారి కన్నా భాగ్యశాలి . "
" సందేహమా ? చూడు , పశుఘాతము జరగలేదు . వస్తున్న బ్రహ్మ హత్య తప్పినది . వచ్చిన రోగము తప్పింది . దేవ బ్రాహ్మణుల అనుగ్రహము దొరికింది . ఇంకేమి కావలెను ? "
" బ్రహ్మ హత్యా పాతకము వచ్చేది కాదులే , యాగ పశువును చంపితే హత్యా దోషము రాదు . శామిత్ర్య యాగములో మాత్రము పేరుకే బ్రహ్మహత్యా దోషము . అదికూడా ప్రాయశ్చిత్తముతో పోగొట్టవచ్చు . ఏదేమైననూ , యాగ పశువు బ్రతికి పోయి , యాగ ఫలము దొరుకుట ఇదే మొదటిసారి . "
" నువ్వేమైనా చెప్పవయ్యా, నరమేధము మాత్రము కూడదు . మనలాంటి మనుష్యుని పశువుగా చేయుట నాకు సమ్మతము కాదు . "
" చాల్చాల్లే , పశువంటే పశువే . ప్రోక్షణ అయిన తరువాత , పశువుకు జ్ఞానముంటుందా ? వ్యాపారముంటుందా ? అన్నీ నిలచిపోయి ఉంటాయి . కళ్ళు మాత్రము మిడి గుడ్లతో తెరుచుకొని ఉంటాయి . "
" పశువు సంగతి సరే , బతికిన ఈ పశువు పశు వర్గానికి చేరునా లేక మానవుడే అవుతుందా ? "
" అంటే , నేననేది , ఇప్పుడు వాడు ఎవరి పాలు ? వాడి గోత్రమేది ? లేక గోత్రము లేని బ్రాహ్మణులు కూడా ఉంటారు అన్నట్టవుతుందా ? "
" కాదయ్యా , ’ ఈ కుమారుడు మహర్షి తుల్యుడు ఇతడు యాగమును సంపూర్ణము కావించనీ ’ అని బ్రహ్మ అనుజ్ఞ అయినపుడు , ’ అటులనే అగుగాక ’ అని అందరూ ఒప్పుకున్నారే , అప్పుడు తల ఎత్తవలసిన ప్రశ్న ఇది . ఇప్పుడు ఎత్తుతున్నావే ? "
" ఋషిమండలములో నేనొక్కడినే బుద్ధిమంతుడిని అనికాదు . నిజంగా అది ఇప్పుడే నాకు తలయెత్తింది . "
" నాయనా , ఆలోచింపకుము . కుమారుడు అతి ప్రతిభావంతుడు . మీవంటి ధర్మ శాస్త్రజ్ఞులు పైన పడతారు అని తెలిసి అతడు ముందే జాగ్రత్త పడినాడు . అధ్వర్యానికి నిలచి , పూర్ణాహుతి ఇచ్చుటకు ముందే వాడు వెళ్ళి విశ్వామిత్రుల తొడపై కూర్చున్నాడు . అప్పుడు నాకు కూడా ఇదెందుకు అనిపించినది . అర్థము కాలేదు . ఇప్పుడర్థమయినది . "
" నిజము . ఇంకొకటి తెలుసా ? వారు కూడా ఆ కుమారుడిని , ’ వత్సా దేవరాతుడా , వెళ్ళు , వెళ్ళి పూర్ణాహుతినివ్వు ’ అన్నారు . అంటే, వారు , వాడిని కొడుకని ఒప్పుకొని , నామ కరణము కూడా చేసినారన్నమాట ! "
" నామ కరణపు బొబ్బట్లు తిందువు గాని , ఆగు. అక్కడ చూడు . శుక్రాచార్యుడూ , బృహస్పత్యాచార్యుడూ ఒకటైనట్లు , భగవానులిద్దరూ నిలచి మాట్లాడుతున్నారు . రా, రా.! ఇటువంటి యోగము మనకిక ఎప్పుడు దొరుకుతుంది ? దగ్గరగా వెళ్ళి చూద్దాము . "
విశ్వామిత్ర వశిష్ఠుల సమీపమునకు వెళ్ళి నిలుచున్నారు . వశిష్ఠులు , " నేను ఈ వేళకు ఎప్పుడో తమరి దర్శనము చేసుకోవలసినది . ఏవేవో కార్య కలాపాలు . మొత్తానికి ఇక్కడైనా దర్శనము నిచ్చినారు . తమరు ఒకసారి దక్షిణమునకు వెళ్ళి అక్కడ అగస్త్యాశ్రమ ప్రాంతమునందు ఉండి , రండి . లోపాముద్రా దేవి , నది యై ప్రవహించిన ఆ ప్రాంతము భూలోకము లోని సర్వ విశేష , మహిమాసంపన్నమైనది , మేము తమరిని నర్మదా తీరములో సందర్శనము చేసెదము . తమరు భగవాన్ అయినందు వలన మాకు పరమ సంతోషమైనది " అన్నారు .
విశ్వామిత్రులు , గుడ్డివాడికి కూడా స్పష్టముగా కనిపించునంతటి సంతోషముతో నమస్కారము చేసి , " అంతా తమరి అనుగ్రహము " అన్నారు . వశిష్ఠులు దానిని ఒప్పుకుంటూ , " సందేహమా ? ఈ భూమి స్థిరముగా నున్నదీ , నదులు ప్రవహించుతున్నదీ , అగ్ని జ్వలిస్తున్నదీ , వాయువు వీచునదీ, ఆకసము పరచుకున్నదీ, ఆదిత్యుడు ప్రకాశించునదీ ...ఇవన్నీ మా వల్లనే !! " అని నవ్వి విశ్వామిత్రులను ఆదరముతో వీడ్కొలిపి పంపించారు .
No comments:
Post a Comment