SHARE

Thursday, August 9, 2012

58. " మంత్ర ద్రష్ట "యాభై ఎనిమిదవ తరంగం .



యాభై ఎనిమిదవ తరంగం .

     సరయూ నదీ తీరము లోని ఒక విశాల బయలు ప్రదేశములో యజ్ఞ మంటపము శోభిల్లుతున్నది . ఇక్ష్వాకు వంశపు రాజుల కీర్తి స్థంభములవలె అనేకానేక యూప స్థంభములు అజరామరములై నిలిచున్నాయి . నట్టనడుమ యాగముకోసము ఒక పెద్ద పర్ణశాల. దాని చుట్టూ ఋత్త్విక్కులకు , దాని చుట్టు అభ్యాగతులకు , ఇతరులకు ప్రశస్తమైన , యథోచితమైన పర్ణ శాలలు ఏర్పడినవి . అక్కడినుండి కొంచము ముందుకు వెళితే భోజన గృహము . కావలసినన్ని అన్న పానీయములు సిద్ధముగా ఉన్నవి . 

     విశ్వామిత్రులు వశిష్ఠుల దర్శనము చేసుకున్నారు . ఋత్త్విక్కులందరూ పరస్పర దర్శన కుశల ప్రశ్న సల్లాపములతో ఒకరినొకరు సంభావించుకొనినారు . వశిష్ఠులే యాగ క్రమమునంతటినీ తెలిపి , " ఇందులో మనమేమీ చేయునది లేదు . వరుణ దేవుడే ఈ యాగము ఇలాగ జరగవలెనని విధాయకము చేసినాడు " అన్నారు . అందరూ , " శకునములను చూస్తే యాగము పూర్తి అగునట్లు లేదు " అని త్రికాలజ్ఞులైన వశిష్ఠ విశ్వామిత్రుల వైపు  చూస్తారు . వశిష్ఠులు , " అటుల కాదు , మేము ఎప్పటికీ శుభమునే కోరు వారము . అంతా బాగా జరగనీ , అంతా సరిగా జరగనీ , అంటూ ఉండవలెను . కర్మపు ఉద్దేశమేమి ? యజమానునికి శ్రేయస్సు కలుగవలెను . అది జరిగితే చాలు ’ అని నవ్వుతారు . అందరూ సరి , సరి అంటారు . విశ్వామిత్రుడు మాత్రము  పెదవి విప్పలేదు . కిమ్మనకుండా కూర్చున్నాడు . 

     విశ్వామిత్రులు తమ పర్ణశాలకు  వచ్చినారు . సంధ్యా కర్మలన్నీ సాంగముగా నడచినవి . ఇక వారు ఏకాంతమునకు వెళ్ళ వలెను . అప్పుడు ఒక ఆశ్రమ వాసి వచ్చి , " బీద బ్రాహ్మణుడు ఒకడు దర్శనార్థియై వచ్చినాడు " అని తెలిపినాడు . వారు కొంచము యోచన చేసి , " రమ్మని చెప్పు . అతడు ఇక్కడ ఉండువరకూ ఇంకెవరూ రాకూడదు . " అని చెప్పి పంపారు . 

     బ్రాహ్మణుడు వచ్చినాడు . ఆ ముఖమును చూస్తే కడుక్కొని ఎన్ని రోజులైనదో అనునట్లుంది . కళ్ళు ఎంతగానో ఏడ్చినట్లు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి . గొంతు బలహీనముగా ఉంది . ముఖములో నైతే తేజస్సు ఆవగింజంత కూడా లేదు . వచ్చినవాడే , " అకార్యకారియైనది . నన్ను ఉద్ధరించ వలెను " అని కాళ్ళు పట్టుకున్నాడు . వారి నోటి నుండీ , " ఏమైనా సరే , నీకొచ్చిన భయమేమీ లేదు , లే " అని వరమును పొంది లేచినాడు . 

     వచ్చినవాడు తన కథను చెప్పుకున్నాడు , " నేనే ఆంగీరస గోత్రుడనైన అజీగర్తుడను . రేపటి రోజు యాగ పశువు కావలసిన శునశ్యేఫుడి తండ్రిని . కుల క్రమాగతమైన అగ్ని విద్యను అల్ప స్వల్పముగా ఏక దేశీయముగా తెలిసిన వాడిని . శునశ్యేఫుడు పుట్టినపుడే మాకు కులోద్ధారకుడగు పుత్రుడు పుట్టగలడని స్వప్నమైనది . అయినా  , దానిని మరచి  రోహితాశ్వుడు వచ్చి అడిగినపుడు బీదరికము బాపుటకని ఆ పిల్లవాడిని అమ్మివేశాము . ఇప్పుడు మేము చేసిన అకార్యమునకు పశ్చాత్తాప పడుచున్నాము . ఏదైనా చేసి భగవానులు వాడిని కాపాడవలెను . ఒకవేళ వాడు మరలా మాకు దక్కక పోయినా సరే , ఎవరి కొడుకుగానో అయినా బతికి ఉండాలి . తమరే తమరి కొడుకుగా చేసుకోండి . మొత్తానికి వాడిని బ్రతికించండి " అని అంగలారుస్తూ వేడుకుంటున్నాడు . పదే పదే నమస్కారము చేస్తాడు . చేతులు జోడిస్తాడు . కాళ్ళు పట్టుకుంటాడు . " నా అపరాధము క్షమించరానిదైననూ దయ చేసి మన్నించండి . "  "  ఏ ప్రాయశ్చిత్తమునకైననూ సిద్ధముగా ఉన్నాను "   " భగవానులు కృప జూపవలెను "  అని రకరకాలుగా వేడుకుంటున్నాడు . 

     భగవానులు తమ పరివారములో ఒకడిని పంపి , శునశ్యేఫుడిని పిలిపించారు . వాడు వచ్చి , భగవానునికి, తండ్రికీ నమస్కరించి నిలుచున్నాడు . ముఖము తేజస్సుతో నిండి ఉంది . ఏ వికారమూ లేదు . ఆడుకుంటున్న పిల్లవాడి వలె నిర్మలముగా ఉంది . 

     భగవానులు అడిగినారు , " ఏమి వత్సా , రేపటి దినము నువ్వు పశువు అగుటకు ఒప్పుకున్నావా ? " 

     పిల్లవాడు చేతులు జోడించి అన్నాడు , " భగవాన్ , దేహము తల్లిదండ్రులది . రాజకుమారుడు వచ్చి అడిగినపుడు వారు చెప్పిన మాటలు విన్నాను . ఇంటిలో దారిద్ర్యము అంతా ఇంతా కాక ఇల్లంతా నిండిపోయినది . కాబట్టి వారు ఒక పుత్రుడిని అమ్ముటకు ఒప్పుకున్నారు . పరిస్థితి  అనుకూలముగా నుండినచో అమ్మెడు వారు కాదు . అన్న పైన తండ్రిగారికి ఆశ. తమ్ముడి పైన అమ్మకు అభిమానము . కాబట్టి , నేనే వెళ్ళి " నన్ను అమ్మేయండి , మీ దారిద్ర్యము తీరనీ " అని చేతులు జోడించాను . ఈ జీవితము క్షణ భంగురమైనది .  నేను ఏనాటికైనా చావ వలసినదే కదా , దేవకార్యమునకై పర ప్రయోజనమునకై చచ్చిన , నాకూ సద్గతి దొరకును . కాబట్టి నా గురించి నాకు ఆలోచన లేదు . కానీ మా తండ్రి , పుత్రుడిని పోగొట్టుకున్నా కూడా ఇల్లు నింపుకొనునట్లు లేదు . అదే నా వ్యథ. నూరు గోవులను కాక ఒక వేయి గోవులను అడిగి ఉంటే వీరికి అవి కూడా దొరికేవి . దారిద్ర్యమూ తీరేది . ఇప్పుడు వీరికి చెడ్డపేరు రావడమే కాక , ప్రయోజనము కూడా లేకుండా పోయినది " అని మరలా చేతులు జోడించాడు . 

     ఆ పిల్లవాడు స్థిరముగా మాట్లాడుతుంటే బ్రహ్మజ్ఞుడైన ఋషి ఒక్కడు మాట్లాడుతున్నట్లుంది . దేహాభిమానముతో దుఃఖించకుండా , కేవలము తన తండ్రి దారిద్ర్యమునకు వ్యథ చెందుతున్న ఆ బాలకుని చూసి భగవానుని మనసు కరిగింది . ఒక అప శబ్దము కూడా లేకుండా , స్వర వికారము లేకుండా , శరీరము , అంగములను  నిటారుగా ఉంచుకొని గంభీరముగా మాట్లాడినది చూసి వారికి ఆ బాలకుడిపై గౌరవము కలిగింది . 

భగవానులు ఇంకా రెండు మాటలు అడిగినారు , " ఏమేమి పాఠములు నేర్చుకున్నావు ? " 

" మేము ఆంగీరసులము . అథర్వణమును సాంగముగా అధ్యయనము చేసినాను . అయితే నేను ప్రయోగ సిద్ధుడిని కాను . " 

" నీకు బ్రతకాలని ఆశ లేదా ? " 

     " భగవాన్ , నాకు అధ్యయనము అయిన మంత్రములలో , అమృతత్త్వము , స్వర్గతి , స్వర్గము మొదలైనవి ఉన్నాయి . అవి ఉన్నాయా అనే సంశయము ఒకటి నాకు కలిగి ఉండినది . ఇపుడు ప్రత్యక్షముగా తెలుసుకొను అవకాశము వచ్చింది . ఎందుకు వదల వలెను ? అదీగాక హౌత్రము తమరిది . భగవాన్ వశిష్ఠులు బ్రహ్మ . అధ్వర్యు ఉద్గాతృలు కూడా తమతో సమానమైనవారు . ఈ యజ్ఞములో దేవతలు  సాక్షాత్తూ తామే వచ్చి హవిర్భాగములను తీసుకోకుండా ఉండరు . ఏ దేవతల సాక్షాత్కారము కోసము బ్రాహ్మణుడు పగలూ రాత్రీ అధ్యయన వ్రతాది తపస్సు చేస్తాడో , ఆ దేవతల సాక్షాత్కారము  , గంగాది పవిత్ర తీర్థముల కన్నా పవిత్రమై ఉన్న తమ వంటి తీర్థ పాదుల సన్నిధిలో హరిశ్చంద్రుడంతటి మహారాజు యొక్క ఉదర వ్యాధి నివృత్తి కోసము దేవతలకు బలియగుట . దీనికన్నా  నాకు వేరే శ్రేయస్సు ఇంకేమి ఉంటుంది ? కాబట్టి నాకు వ్యథ లేదు . తమరు అన్నారు , బ్రతకవలెనను ఆశ లేదా ?  అని . భగవాన్ , జీవ , జంతువులలో బ్రతకాలనే ఆశ దేనికి ఉండదు ? నాకు ప్రోక్షణ అయిపోయింది . ఈ దేహములో వరుణుడు వ్యాపారము చేయుట నాకు కొంచమో ఎక్కువో తెలుస్తున్నది . " 

     భగవానులు ఆ పిల్లవాడి మాటలు విని బలు మెచ్చుకొని తలఊపారు . అతని బుద్ధి ధర్మమునందు ఎలాగున్నదీ పరీక్షించాలని , " నాయనా , నీ ఆస్తిక్య బుద్ధి , నీ నిర్వచన సామర్థ్యము వలన నాకు బహు సంతోషమయినది . నీకు ఒక వేయి గోవులను ఇస్తున్నాను. తీసుకో " అన్నారు . 

     పిల్లవాడు మరలా అదే గంభీర భావముతో , వినయముగా అన్నాడు , " భగవాన్ , తండ్రి నన్ను అమ్ముట వలన నాకు ఇప్పుడు పితృగోత్రము లేదు . విక్రయము వలన దొరికినవాడను కాబట్టి నేను హరిశ్చంద్రుని ఆస్తి అయినా కూడా అతని గోత్రము నాకు రాదు . కాబట్టి గోత్రము లేని నేను ఇప్పుడు శూద్ర సమానుడిని . నాకు సొంత అధికారము లేదు కాబట్టి గ్రహణాధికారమూ లేదు . మీరు ఇచ్చినది నాకెలా చేరుతుంది ? కానీ , తమరు ఇచ్చినది వద్దన్ననూ అపరాధమవుతుంది అని బెదరి , తమకు అభ్యంతరము లేకున్న , ఆ గో ధనమును ఈ నా వెనుకటి తండ్రికి ఇచ్చి , వారి దారిద్ర్యమును నివారిస్తే , నాకు అంతరాయములు తొలగును .. " 


     " ఔను , వీడు ఋషి . సందేహము లేదు . వీడిని కాపాడాలి . " అనిపించింది విశ్వామిత్రులకు . అయినా , ఇంకా పరీక్షిస్తూ , " సరే , నీ మాటకు సమ్మతించి , నీ తండ్రికి ఒక సహస్ర గో ధనమును ఇప్పించుతాము . ఇప్పుడు వారు వచ్చి నిన్ను బ్రతికించవలెనని కోరుతున్నారు . నువ్వు ప్రోక్షణ అయినదని అంటున్నావు . నువ్వు బ్రతికితే , అప్పుడు నువ్వు ఎవరి సొంతమవుతావు ? " 

     " భగవాన్ , బాల బుద్ధి చేత ధర్మ శాస్త్రమును చెప్పుట విహితము కాదు . అయినా , పెద్దలు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పకుంటే చదివిన శాస్త్రానికీ , అడిగిన పెద్దలకూ ద్రోహము కాగలదని బెదరి తెలిసినంత చెబుతాను  . ధర్మ శాస్త్రమును సాక్షాత్తుగా తెలిసిన వారు లేనందున , నా మాట అధర్మమై ఉంటే ధర్మ పురుషునికీ , తమకూ కోపము రాకుండాలి . నేను ఇప్పుడు మా తండ్రి గారి కొడుకును కాను . విక్రయము వలన అతని అధికారము లోపించినది . విక్రయము వలన నన్ను పొందిన హరిశ్చంద్ర మహారాజు నాకు ప్రోక్షణను చేసి ఈ యాగ ప్రధాన దేవత యైన వరుణునికి ఒప్పించినందు వలన అతనికీ నామీద అధికారము లేదు . ఇప్పుడు నేను వరుణుని సొమ్ము . నేను బ్రతికితే , వరుణ దేవుడు నన్ను ఎవరికి ఇస్తే , వారి వాడను . " 

" అజీగర్తా , నువ్వేమి అంటావు ? " 

     " భగవాన్ , వంశ భూషణుడైన ఇంతటి కొడుకును అమ్ముకొన్న నాకు ఇక్కడ మాట్లాడుటకు అధికారము లేదు . వాడు ఎవరి కొడుకైననూ కానీ , ఏ గోత్రానికైననూ చెందనీ , చివరికి బ్రతికించండి . వాడు బ్రతుకవలెను . . " 

     భగవాన్ విశ్వామిత్రులు శునశ్యేఫుడిని దగ్గరకు పిలచి కూర్చోబెట్టుకున్నారు . తలపైన చేయి పెట్టినారు . అజీగర్తుడు తానక్కడ ఉండకూడదని వాకిటి నుండీ బయటికి వెళ్ళినాడు . భగవానులు , " ఏమవుతున్నది ? " అన్నారు . బాలుడు అన్నాడు , " భగవాన్ , నమస్కారము . హిమవత్ పర్వత శిఖరము నుండీ కిందకు దిగుతున్న భాగీరథి వలె తమరి హస్తమునుండీ ఏదో ఒక శక్తిధార తరంగ తరంగములుగా నా దేహమును ప్రవేశిస్తున్నది . నాకు కొత్త శక్తి వస్తున్నది . ఏదో ఒక విధమైన అపూర్వ వ్యాపారములు నాలో నడచి , నానుండీ మంత్రములు వెడలుతున్నాయి . తమ ఆజ్ఞ అయితే నేనిప్పుడు మంత్ర కర్తను అవుతాను . అలాగ నేను మంత్ర కర్తను అగుట వరుణునికీ సమ్మతమే అని తోచుచున్నది . " అన్నాడు .

     విశ్వామిత్రులు చేతిని తీసేసినారు : " రేపటి రోజు నిన్ను యూప స్థంభానికి కట్టినపుడు నీకు వంటిపై స్పృహ ఉంటుంది . నీ శరీరములో వ్యాపారములన్నీ సవ్యముగానే జరుగుతాయి  . : అప్పుడు నువ్వు నా ముఖమును చూడు . నేను ఆజ్ఞ ఇస్తాను . అప్పుడు భగవాన్ వశిష్ఠులకు చేతులు జోడించి , అధ్వర్యు ఉద్గాతృలను , అక్కడ చేరిన ఋషి మండలమునూ భావించి , వరుణ దేవుని మనస్సు లోనే ప్రార్థించి , నువ్వు నీ మంత్ర గానమును ప్రారంభించు . అప్పుడు ఏ దేవత వచ్చి ఏమి చెప్పునో ఆ విధముగనే చేసి బంధ విముక్తుడవు కమ్ము . తరువాతి కార్యము దేవతలది " అని మనః పూర్వకముగా ఆశీర్వదించి పంపించినారు . వారి మనసు శునశ్యేఫుడి సంగతే ఆలోచిస్తుండినది . 



1 comment: