SHARE

Sunday, August 19, 2012

68. " మంత్ర ద్రష్ట " అరవై ఎనిమిదవ తరంగం .



అరవై ఎనిమిదవ తరంగం .

     విశ్వామిత్రులు ఆ రోజు నిద్రలేస్తుండగనే , ఈ రోజు వశిష్ఠులు దయచేస్తున్నారు అన్నది బోధపడినట్లాయెను . సరే , వారు వచ్చు ఉద్దేశము కూడా తెలుసు , సిద్ధముగా ఉన్నారు .

     సుమారు ఒకటిన్నర ఝాము అయి యుండవచ్చును . విశ్వామిత్రులు ఎందుకో తలయెత్తి పైకి చూచినారు . దూరంగా ఆకాశంలో ఒక తేజోమండలము ఆశ్రమపు వైపుకే వస్తున్నది . లేచి నిలబడి , దానికి స్వాగతము పలుకుతున్నంత లోనే ఆ జ్యోతిర్మండలము వీరున్న చోటికి వచ్చి దిగింది . ఆ తేజోరాశిని ఛేదించుకొని భగవాన్ వశిష్ఠులు బయటికి వచ్చినారు . 

     విశ్వామిత్రులు వారికి మధుపర్కమును అర్పించినారు . అతిథి సత్కారము చేసినారు . పరస్పర కుశల ప్రశ్నల తరువాత , వశిష్ఠుల పరమ సంతోషము హృదయము నుండీ పొంగి , ముఖములో దేదీప్యమానముగా వెలుగుచుండగా , " సాధించినారు , భగవాన్ ,  విశ్వామిత్రా , లోకమును ఉద్ధరించినారు " అన్నారు . వశిష్ఠుల స్తోత్రాన్ని సులభముగా ఒప్పుకొనక , విశ్వామిత్రులు , " ఆ గౌరవమంతా పరిషత్తుకు చెందును . నాదేమున్ననూ ఆజ్ఞా పాలకుడనై చేసిన కార్యము . పరిషత్తు కావాలన్నది , ఎక్కడకు వెళ్ళిన కార్యమగునో యనుదానిని తమరు సూచించినారు . ఏమి చేయవలెననునది లోపాముద్రాగస్త్యులు నేర్పించినారు . మిగిలినదంతా దేవగురువుల కృప వలన అయినది . కాబట్టి దేనికోసమై ఈ పొగడ్త నాకు చెందును ? "  అని నవ్వినారు . 

     వశిష్ఠులు , " యుద్ధమంతా సైనికులది . నిజమే , గెలుచునదీ , ఓడునదీ వారే ! కానీ కీర్తియంతా సేనానిది కదా ! అటులనే , పరిషత్తు కావాలన్నదీ , అది ఇదీ , అన్నీ నిజమే . మేమందరమూ , ఇది తమ వల్లనే కావలెను , వేరెవరివల్లా ఇది సాధ్యముకాదు , అన్నది తెలుసుకొని ఈ పని తమకు అప్పగించినాము . దానిని మరవకండి , సరే , తమ శిష్యులు ఎక్కడ ? " 

     విశ్వామిత్రులు తమ శిష్యులను పిలచి చూపించినారు . వశిష్ఠులు వారందరినీ చూచి , చాలా ఆనందించి , " అందరూ ఋషి కల్పులైయున్నారు . వీరికి కావలసినది వేదాధ్యయనము . అది కూడా అయితే , వీరందరూ బ్రాహ్మణులే ! సందేహము లేదు . వీరికి అగ్ని విద్యనివ్వండి . మిగిలిన దానినంతా ఆ యజ్ఞేశ్వరుడే చూచుకొనును. " అని అందరినీ ఆశీర్వదించి , వారిని పంపించినారు . ఆశ్రమములో వశిష్ఠ , విశ్వామిత్రులిద్దరే నిలచినారు . 

     వశిష్ఠులన్నారు , " ఈ దినము వైశ్వానరుడెందుకో చెలరేగి కనిపిస్తున్నాడు , ఆత్మారాముడు ఘోష పెడుతున్నాడు . నేను నర్మదలోకి వెళ్ళి స్నానము చేసి వచ్చేస్తాను . అంతలోపల ఏదైనా పాకము సిద్ధము కాగలదా ? " 

" ఏమి ఆజ్ఞ ఇచ్చిన అది సిద్ధమగును " 

" మానస సృష్టి వద్దు , మానవ సృష్టి గావించండి . పరమాన్నమయితే సులభము . త్వరగా చేయవచ్చును , కదా ? " 

" అవును " 

     " అయితే , ఒకమాట. నేనేమో ఆకలికి తాళలేక త్వరగానే రావలెనని యున్నాను . ఎంతైనా నేను వేదాభ్యాస జడుడను కదా , నర్మదా నదేమో శివమయమైనది .  ఆ శివసన్నిధిలో వేగిరమే సమాధి స్థితి కలుగుతుది . ఒకవేళ అటులయిన , నిదానమగును కాబట్టి , ఆ పరమాన్నమును వేడిగానే యుంచండి . సౌకర్యమే కదా ? " 

" సౌకర్యమే " 

     " సరే , నేనిక వెళ్ళి వస్తాను . అయినంత వేగముగా వస్తాను . బ్రాహ్మణ దేహము  కాకపోతే ఏదైనా శాంతి చేసుకొనే వెళ్ళియుండవచ్చును అన్నట్లుంది , వైశ్వానరుడి కోపము " అని నవ్వుచూ కమండలము తీసుకొని నదివైపుకు అడుగులు వేశారు . వారికి దారి చూపుటకు ఒక శిష్యుడిని వెంట పంపారు . 

     విశ్వామిత్రులు తాము కూడా నదికి వెళ్ళి యథావిధిగా స్నానమును త్వర త్వరగా ముగించుకొని వచ్చి పొయ్యి వెలిగించినారు . ఒక ఘడియలోపలే పాయసము సిద్ధమైనది . పాకము చేసినవారి శ్రద్ధాభక్తుల ప్రకట రూపమో అన్నట్లు , ఆ పాయసపు సువాసన చుట్టుపక్కలంతా వ్యాపించి , ఆకలి లేనివారికి కూడా తీవ్రాకలి పుట్టించునట్లుంది . దాని సుగంధముతో ఆశ్రమమంతా నిండిపోయినది . 

     చాలా సేపే అయినది . వశిష్ఠులు రాలేదు . మరికొంత సేపయినది . వారింకా రాలేదు . శిష్యుడొకనిని పంపించారు . వారు భస్మోద్ధూళిత గాత్రులై పద్మాసనము నందు కూర్చున్నారని వాడు వచ్చి చెప్పినాడు . ఇంకొంచము సమయమైనది . విశ్వామిత్రులు తామే వెళ్ళి చూచినారు , వారికి సమాధి కలిగినది . అది కూడా శిథిల సమాధి కాదు , దృఢ సమాధి . ఎప్పుడు బహిర్ముఖులవుతారో ? చేసినది పాయసము . దానిని పొయ్యిపై నుంచితే పొంగిపోతుంది . తీసి పక్కన పెట్టితే ఆరిపోతుంది . ఆరిపోతే, చల్లబడి , గ్రహించుటకు అయోగ్యమవుతుంది . 

     " చేసిన వంట వేడిగా నున్నంత వరకే దానిలో ప్రాణ శక్తి యుండునది . దాని తరువాత అది చల్లబడిన కొలదీ దానిలో అపాన శక్తి వచ్చి చేరుతుంది . దానిలోయున్న ఆహారపు గుణము , యోగ్యత నష్టమవుతుంది . పాయసము ఇంకా సులభముగా ఆరిపోతుంది , పెళుసవుతుంది . భగవానులెందుకు , ఈ విధముగా చేసినారు ? కావాలనే చేసియుండ వచ్చునా ? అదే నిజము , అవును . ఆ దినము పరిషత్తులో మా పరీక్ష వశిష్ఠ ముఖముగా జరగవలెనన్నది తీర్మానించబడినది , ఇప్పుడు వారు దయచేసినది అందుకే !" 

     " అటులనే యగుగాక , కానీ , పాయసపు పరీక్ష ఎందుకు ? ఓహో , దేశకాల స్వరూపుడై సర్వమునూ పాకము చేయు వైశ్వానరుని నిరోధించి , ఏక స్థితిని కాపాడగలడో లేడో యన్నదే ఈ దినపు పరీక్ష కావచ్చును . లోక రక్షణ కోసము శక్తి సామర్థ్యములను సంపాదించినవారు, ఆ శక్తి సామర్థ్యములు పాకాభిముఖముగా ముందుకు దూకుటను కూడా నిరోధించగల వారైయుండవలెను , నిజమే . భగవానులు చేసినది సరియైనదే ! నేనీ పరీక్షలో గెలిచియే తీరవలెను . కానిమ్ము , దేవతలున్నారు , గెలిపిస్తారు, నాకెందుకు ?" 

     విశ్వామిత్రులు శిష్యుడిని పిలచినారు . " అప్పుడే మిట్ట మధ్యాహ్నమయినది , ఇంకా ఒక ఝాము చూడండి , భగవానులు వచ్చిన, సరి. లేదంటే మీరు వంట చేసుకొని భోజనము చేయండి . నేను సమాధిలో కూర్చుంటాను . భగవానులు వచ్చువరకూ నేను సమాధిలో ఉంటాను . రెండు దినములు మా కోసము చూసి , మూడవ దినము మీరంతా యథేఛ్ఛగా వెళ్ళిరండి . ముందు కాలములో హిమాలయములో బ్రహ్మర్షి పరిషత్తు చేరుతుంది . అప్పుడు మనము మళ్ళీ కలుసుకుందాము " అని వారికి చెప్పవలసినదంతా చెప్పి , తాము పర్ణశాలలో ఒక మూలలో పాయస పాత్రను నెత్తిపై పెట్టుకొని సమాధిలో కూర్చున్నారు . దేహములోనున్న వైశ్వానరుణ్ణి ప్రజ్వలించి , ఆ పరమాన్నములోనున్న అన్నశక్తి జర్జరితము కాకుండా  ( తెట్టు కట్టుకొని శిథిలము కాకుండా ) దానిని కాపాడమని అతనిని ప్రార్థించి , ప్రాణాపానములను ఒకదానిలో ఒకదానిని కలిపినారు . ఉదానమును ప్రణవ నాదము చేస్తుండ వలెనని ఒప్పించినారు . వ్యానము జాగృతమై దేహమును కాపాడుతుండవలెనని వేడుకున్నారు . సమానము శాంతమై కూర్చోవలెనని ప్రార్థించినారు . తాము పరమాన్నమై , పరమాన్నమే తామై సమాధిలో కూర్చున్నారు . 

     ఇలాగ విశ్వామిత్రులు అజర , అమర భావములో కూర్చొనుటతో , ఆ పర్ణశాల జగద్ధర్మాన్ని అతిక్రమించినది . జడ చేతనములను భేదము చూపక , సర్వమునూ పాకాభిముఖముగా చేసి పరిణామమును కలిగించుతున్న దిక్కాలములు ఆ మహా మునీంద్రుడు నిశ్చలముగా , అజర , అమర దివ్య అన్న స్వరూపమై కూర్చున్న దేహమును అనుగ్రహించి , తమ ప్రభావము అక్కడ ప్రసరించకుండా అతడి చుట్టూ ఒక కోటను గట్టి , దానికి తామే కాపలా కాస్తూ కూర్చున్నాయి . 







1 comment:

  1. quotes:
    1.చేసిన వంట వేడిగా నున్నంత వరకే దానిలో ప్రాణ శక్తి యుండునది . దాని తరువాత అది చల్లబడిన కొలదీ దానిలో అపాన శక్తి వచ్చి చేరుతుంది .

    2.నేనీ పరీక్షలో గెలిచియే తీరవలెను . కానిమ్ము , దేవతలున్నారు , గెలిపిస్తారు, నాకెందుకు ?"

    3.పాయస పాత్రను నెత్తిపై పెట్టుకొని సమాధిలో కూర్చున్నారు . దేహములోనున్న వైశ్వానరుణ్ణి ప్రజ్వలించి , ఆ పరమాన్నములోనున్న అన్నశక్తి జర్జరితము కాకుండా ( తెట్టు కట్టుకొని శిథిలము కాకుండా ) దానిని కాపాడమని అతనిని ప్రార్థించి , ప్రాణాపానములను ఒకదానిలో ఒకదానిని కలిపినారు . ఉదానమును ప్రణవ నాదము చేస్తుండ వలెనని ఒప్పించినారు . వ్యానము జాగృతమై దేహమును కాపాడుతుండవలెనని వేడుకున్నారు . సమానము శాంతమై కూర్చోవలెనని ప్రార్థించినారు . తాము పరమాన్నమై , పరమాన్నమే తామై సమాధిలో కూర్చున్నారు .

    4. విశ్వామిత్రులు అజర , అమర భావములో కూర్చొనుటతో , ఆ పర్ణశాల జగద్ధర్మాన్ని అతిక్రమించినది
    -k

    ReplyDelete