SHARE

Tuesday, August 14, 2012

63. " మంత్ర ద్రష్ట "అరవై మూడవ తరంగం .



అరవై మూడవ తరంగం .

     భగవాన్ విశ్వామిత్రులు ఈ దినము భగవాన్ అగస్త్యుల ఆశ్రమమునకు వచ్చినారు . మంత్ర పతియైన మహా బ్రాహ్మణునికి సలుపవలసిన మధుపర్కాది సత్కారములనన్నిటినీ యథా విధిగా సమర్పించి , అగస్త్యులు సతీ సమేతులై వారి వద్ద కూర్చొని లోకాభిరామం గా రెండు మాటలను ఆడుతున్నారు . ఆశ్రమమునందంతా సంభ్రమమే సంభ్రమము . వచ్చినవారు ఒక్కరే ఒక్కరయినా , సంభ్రమము మాత్రము వేల మంది వచ్చినంత ఉంది . 

     భగవానులిద్దరికీ భగవతీ లోపాముద్రా దేవి వైశ్వదేవమునకు ఏర్పాటు చేసినారు . ఆమె దృష్టిలో ఈ రోజు విశ్వానికే సమారాధన జరుగుతున్నది . చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్తంభమను అగోచరమైన అణుప్రాయమైన క్రిమి వరకూ ఉన్న సమస్త జీవ జంతువులకు మాత్రమే కాదు , జడ భూతములకూ , స్థావర జంగమములతో పాటూ అన్నిటికీ ఈ దినము మహా సమారాధనము యగునని అత్యంత నియమ నిష్ఠలతో , ఉత్సాహముతో , సంభ్రమముతో, విధాయకముగా , పద్దతిగా అన్నిటినీ సిద్ధము చేసినది . విశ్వభుక్ అయిన ఆ పరమాత్ముడు నేడు తమ ఆశ్రమమునకు దయచేసినాడు . అతడికి తృప్తి యయిన , ఒక విశ్వజిత్ యజ్ఞము అయినట్టే అని ఆమె సర్వమునూ సంసిద్ధము చేస్తున్నారు . 

     మధ్యాహ్నమయినది . బ్రహ్మర్షులిద్దరూ మాధ్యాహ్నిక కర్మలను నెరవేర్చుకొని గృహలక్ష్మి ఆహ్వానమును అంగీకరించి వచ్చి భోజన పాత్రల ముందర కూర్చున్నారు . మంచి అరిటాకులు వేసి , చిన్న చిన్న కంచు గిన్నెలలో చోష్యములు , లేహ్యములు , మధుర రసములు నింపి , విస్తర్ల చుట్టూ పెట్టింది . ఆయుః స్వరూపమైన ఘృతము , తాను సద్యోఘృతమునని చెప్పుటకు తన పరిమళమును వెదజల్లుతూ , వైశ్వానరునికి తనను అర్పించుకొనుటకు వేచి కూచున్నది . భక్ష్య భోజ్యములు , పక్వాన్నములు , ఫలమూలములు , యథావిధిగా సంస్కారమును పొంది భోజ్యములైన ధాన్యములు , అన్నియూ యజ్ఞములో భాగము వహించుటకు సిద్ధమై యున్నాయి . మక్షికాదులనుండీ బాధ కలగకుండా చిన్న విసనకర్రలను తీసుకొని విసురుతున్నారు . చీమలు మొదలైనవి రాకూడదని , కర్పూరపు ధూళి , పసుపు కలిపి ఆకుల చుట్టూ రంగవల్లులు తీర్చినారు . ప్రతియొక్క ప్రాణి హృదయమునందూ ఉండి , సర్వ సాక్షియైన ఆత్మ జ్యోతిని , లోక నిర్వాహక భారమును వహించిన ధర్మ జ్యోతినీ సాక్షాత్కరించుకొన్నట్లు , రెండు దీపములు ఆకుల ముందర వెలుగుతున్నాయి . నిర్మలమైన ఉదకము పానీయమై సిద్ధముగా ఉంది . 

     బ్రహ్మర్షులిద్దరూ అన్నస్వరూపమైన పరబ్రహ్మను ధ్యానించినారు . అన్నాదుడై సర్వ ప్రాణుల అంతర్గతుడైయున్న పరమాత్మను స్మరించినారు . అన్నమును మంత్రముతో ప్రోక్షణ చేసి , దృష్టి దోషాదులు తగలకుండా దానికి పరిషేచనము చేసినారు . ప్రతిదేహములోనూ కూర్చొని ప్రాణాపాన వ్యాపారములచేత అన్నమును పచనము చేయు వైశ్వానరుడిని సంబోధించి , అన్నము జఠరమునందు నిలుచుటకు , అమృతపు ఉపస్తరణము కానివ్వమని జల ప్రాశన చేసి , పంచ ప్రాణములకు ఆహుతినిచ్చి , దేహములోని విశ్వేదేవతలను ధ్యానము చేస్తూ వైశ్వదేవమును ముగించినారు . ఈ భుక్తాన్నమునకు అమృతము పిధానము యగుగాక  అని ( మరుగు పడుట ) మరలా జలప్రాశనము చేసి , ప్రత్యక్షముగా అన్నమును పొందలేక , పాపులై ’ అన్నముకోసము ఆతురము పడుచున్న , అపుణ్యనిలయము నందున్న ఆర్తులకు ’ అని ఉదకమును విడచి , భోజనమును ముగించి లేచినారు . మంత్రర్షి యైన లోపాముద్రా దేవి , ఆ వైశ్వదేవము వలన సర్వ దేవతలూ తృప్తులగుటను చూచి , " వేదవిదుడైన బ్రాహ్మణునిలో సర్వసమస్త దేవతలూ ఉన్నారు అనుమాట నిజము . లేనిచో పెద్దలు ఊరికే చెప్పెదరా ? వారు చూచినది చెప్పినారు . మనము చూడలేక , అబద్ధము అంటే , వారిదా అపరాధము ? " అనుకొని ముందరి కార్యక్రమములో నిమగ్నమైనారు . 

     ఒకింత సేపు విశ్రాంతి యయిన పిదప అగస్త్యులు విశ్వామిత్రులను , వారిని అక్కడికి రప్పించిన గౌరవ కార్యము గురించి విచారించినారు . వీరు కూడా , క్లుప్తముగా యైననూ , మృదువుగనూ , అర్థపూరితముగానూ పలికినారు , " భగవాన్ వశిష్ఠుల అనుజ్ఞ యయినది . ఇక్కడికి వచ్చి కొన్నిరోజులు ఉండి రావలెను అని . అది , ఆనాడు బ్రహ్మర్షి పరిషత్తు అయిన దినము , భగవతి గార్గి మొదలుగా తమరెల్లరూ ఒప్పించిన కార్యమునకై అని తోచుచున్నది . ఇదంతా అయినాక భగవాన్ వశిష్ఠులను నర్మదా నదీ తీరములో దర్శనము చేసుకొనిన, సర్వమూ ముగిసినట్లే అనిపిస్తున్నది . " 

     " భగవాన్ , అది అంత సులభము కాదు . నది ,  సముద్రములో ఐక్యమగు వరకూ నదియే ! నదియై ఉన్నంతవరకూ ప్రవహిస్తూనే ఉండాలి . భగవాన్ వశిష్ఠుల పరీక్షలో గెలిచి బ్రహ్మర్షులు అనిపించుకొని విరాజిల్లవలెను కదా ? దాని తరువాత సప్తర్షి కల్పులైన తమకు తమ కర్తవ్యమేమీ ఉండదు . నిజము . అయితే , ఈ బ్రహ్మాండమును కాపాడు భారమును వహించిన మహాదేవుడు తనకు సహాయము కోసము అపేక్షించునది , తమ వంటి కృతకృత్యులనే కదా !  . కానివ్వండి , దానికింకా దూరముంది . ఇప్పట్లో జరగవలసిన కార్యమును గురించి ఏమి ఆలోచించినారు ? " 

     " భగవానుల అనుజ్ఞ అయినదాని అర్థము , తమరు ఎలాగు చెప్పిన , అలాగు చేయవలెనని కావచ్చును . కాబట్టి ఇప్పటి కర్తవ్యమును నిశ్చయించు భారము తమదే అని తోచుచున్నది . తమరి అనుజ్ఞ ఎలాగయిన , అలాగు . " 

     " అటులనా ? కానీ , మేము కూడా మాట ఇచ్చిన వారము కదా , మావలన కావలసినదేమున్ననూ చేయుటకు సిద్ధముగా యున్నాము యని ? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి కావలెను ? ఎవరైనా బ్రాహ్మణుడు కావలెను అన్నచో వారికి బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లుగా ఒక సాధనము ఏర్పడ వలెను . మంచిది . దేవి గారిని కూడా పిలువ వచ్చునా ? " 

" అవశ్యము " 

     లోపాముద్రా దేవి వచ్చినారు . శృతీ భగవతియే లోకమునంతా ఆర్యమయము చేయుటకు వచ్చినదా అన్నట్లు వచ్చి కూర్చున్నారు . అగస్త్యులు అన్నారు , " ఆనాడు ఉత్సాహముతో ఆడినమాట ఈనాడు నిలుపుకో వలసిన తరుణమిది , దేవీ ! బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లు ఒక సాధనము ఏర్పడు కాలము వచ్చినది . ఏర్పడవలెను . ఏమి చేసిన  అది సఫలము అవుతుంది అని సలహా అడుగుటకు నిన్ను పిలచినాము . " 

     " ఈ దినము తమరిద్దరూ భోజనము చేస్తున్నపుడే నాకు ఈ మాట గుర్తుకు వచ్చినది . అదీకాక , ఎటుల కావలెను అని మొదటి నుంచీ తమరు ఆలోచిస్తూనే ఉంటిరి . తమ చింతనము నా మనసులో ప్రేరేపించినదానిని అనుమతి అయిన ప్రస్తావించెదను . " 

" అటులనే , దేవీ " 

     " నాకు తోచినదేమనిన , ధ్యాన యోగము అందరికీ సాధ్యము కాదు . కొన్ని దేహములలో ధ్యానము ప్రవహిస్తుంది , కొన్ని దేహములలో ప్రవహించదు . కాబట్టి ధ్యాన యోగము మార్గము కాదు . కర్మ యోగమందామా , అనధికారుల కర్మ వలన సంకల్పము ఫలవంతము కాదు కాబట్టి , అది కూడా ప్రయోజనము లేదు . ఉపాసనా మార్గములో దేవాప్యయమవుతుందే తప్ప జీవన సంస్కారము ఉత్తమమై దేహము బ్రాహ్మణము అగుట జరగదు  ( దేవాప్యయము అనగా , దేవతలను తృప్తి పరచి వారి కృప పొందుట )  , దేహము బ్రాహ్మణము కానిదే బ్రాహ్మణ్యము లభించదు . కాబట్టి , మిగిలినది మంత్ర యోగమొకటే సాధనము . " 

4 comments:

  1. The transition from the previous chapter to the present one is rather abrupt. It appeared as if a few lines of the original story got overlooked / removed in the translation...kindly have a relook...

    Regards

    ReplyDelete
  2. హహ , దేవుడిగారి శైలి అదేనండీ , ఎంత అవసరమో అంతే రాస్తారు . మిగిలినది మన ఊహకే వదిలేసి ...!! ఇక్కడ ఏమీ వదలివేయ బడలేదు . కథ ప్రకారమైతే , ఇది సరిగ్గానే ఉంది . విశ్వామిత్రులకు రెండు లక్ష్యాలు . ఒకటి , యాభై మంది పుత్రులను బలి ఇచ్చి , ఋణము తీర్చుట , రెండోది , విశ్వాన్ని ఆర్యమయము చేసే సాధనము కనిపెట్టుట . ఒకటైపోయింది . ఇప్పుడు రెండో దానికి వచ్చారు .

    మీ పరిశిలన అద్భుతం . దన్యవాదాలు .

    ReplyDelete
  3. మిగిలిన తరంగాలలో కూడా మీకు ఇటువంటిదే కనపడ వచ్చు . పుస్తకము చివరికి వచ్చేటప్పటికి కొంత తేడా కనిపిస్తున్నది . నేను అక్కడక్కడ , పాత్రోచితముగా , కథానుసారముగా కొన్ని సంఘటనలు , వివరాలు పొందుపరచడము జరిగింది . ( పుస్తకములో లేనివి ) . నేను ఎక్కువగా చేసిన మార్పులు తరువాతి తరంగాలలో వస్తాయి . గమనింపగలరు . దేవుడు గారికి క్షమాపణలతో ...

    ReplyDelete
  4. Sai Ram. Thanks for your kind clarifications. There would have been some such abrupt transitions in the earlier chapters too but the mind noticed it this time.

    Just as Sri Devudu garu wrote the book based on his reading, understanding and interpretation of several texts that you mentioned in the foreword, you too should add what you are inspired to do so. I am sure all the Sages esp. Viswamitra and Sri Devudu Garu are guiding you.

    Best regards.

    ReplyDelete