అరవై రెండవ తరంగం .
భగవానులు తొలికోడి కూయగానే నిద్ర లేచారు . నిత్యమూ వారు లేచు వేళకే భగవతీ కౌశికి లేచి , వాకిలి దగ్గర కసవు ఊడ్చి గోమయము కలిపిన నీళ్ళు చల్లి రంగవల్లి వేసేవారు . ఈ రోజు ఎందుకో వారింకా లేవలేదు. నిద్రలో ఉన్నవారిని లేపుటకూ లేదు . కడగని గడప దాటి బయటికి పోవుటకూ లేదు . వారికి సన్నగా నవ్వు వచ్చింది . ’ సూచన తగినట్లే ఉంది ’ అనుకొని , మంత్ర స్నానము చేసి అనుష్ఠానానికి కూర్చున్నారు .
అదేమో ఈ దినము సింధూ ద్వీపుల దర్శనమైంది . ప్రాణ దేవుడు ధ్యానం లో త్వరగా దొరకలేదు . వైశ్వానరుణ్ణి ఆవాహన చేసుకొని ప్రాణ పంచక దర్శనము చేయవలసినది . అదంతా ముగిసింది అనుకొను వేళకి భగవతి నిద్ర లేచారు . ’ ఇదేమిటీ ఈ దినము ఇంత పొద్దు అయిందీ ? ’ అనుకొని గాబరా పడి త్వర త్వరగా లేచారు . చీర కుచ్చిళ్ళు కాలి కడ్డము పడి కింద పడ్డారు . ఆ చప్పుడు విని భగవానులు ఈ లోకం లోనికి వచ్చినారు భగవతి కి దెబ్బ తగిలి నొప్పి కలిగింది . అయినా కష్టపడి లేచి వెళ్ళి వాకిలి ఊడ్చి కడిగినది . భగవానులు నవ్వుకుంటూ లేచి స్నానానికి వెళ్ళినారు .
దేవరాతుడు నదిలో స్నానము చేసి ఒడ్డున కూర్చొని ఆహ్నికము చేస్తున్నాడు . మిగిలినవారంతా అప్పుడప్పుడే లేచి నదికి వస్తున్నారు . శుక్రోదయమైననూ పూర్వ నిశలో మబ్బులు కమ్ముకొని నక్షత్రాలు కూడా కనబడకుండా పోయినాయి . అందరికీ ఏదో ఒక విధముగా ఆలస్యమైనది . భగవానులు నదిలో దిగుతుండగనే భగవతి కూడా అక్కడికి వచ్చినారు . వారి ముఖం లో ఏదో ఆదుర్దా.
సూర్యోదయమై సుమారు ఒక ఝాము గడచి ఉండవచ్చును . మేఘముల వలన సూర్యదర్శనమే కాలేదు . అదేమో , ఆకాశము మేఘావృతమైనదని కలవరమో , లేక , ఆశ్రమమును ఏదో నల్లటి వెలుగు ఆవరించినదో ? ఏమోగానీ , ఆశ్రమములో ఎప్పటి వలె ఉదయ నాదాలు , సవ్వడులు లేవు . పక్షుల కిలకిలలూ లేవు . దుర్భోజనము చేసినవాడు వ్యథ చెందునట్లు ఏదో అరట ఎక్కడ చూసినా నిండినట్లుంది .
భగవానులు ఆశ్రమానికి వచ్చి విశ్రాంతి గృహములో కూర్చున్నారు . దేవరాతుడిని పిలిపించి నారు . ఎన్నడూ లేని ఆత్రముతో , " దుఃఖము వచ్చినపుడు అది ఇంద్రియ మనో బుద్ధులను పట్టి దుర్బలము చేస్తుంది . ఇంద్ర , చంద్ర , బృహస్పతులను ధ్యానము చేసి వారి వలన బలము పొంది ఇంద్రియ మనో బుద్ధులలో నింపితే దుఃఖము అణగుతుంది . దీనిని మరువకుండా చూసుకో " అని చెప్పి ముగిస్తున్నారు . అంతలో ఆంధ్రుడు వచ్చినాడు .
దేవరాతుడు తనకన్నా ముందే వచ్చియుండుట చూచి అతనికి కోపము రేగిపోయినది . అయినా అనునయమును వదలలేక , తండ్రి గారికి మాత్రము నమస్కారము చేసి , దేవరాతుడిని లక్షింపకుండా నిలిచాడు . భగవానులు అది చూచి , ’ ఇతడు కూడా నమస్కారానికి అర్హుడే ! ’ అన్నారు . ఆంధ్రుడు , " తమరి ఆజ్ఞ అని ఇప్పుడు చేస్తాను . కానీ ఆంధ్రుడు శునశ్యేఫుడి కన్నా శ్రేష్ఠుడు " అని నమస్కారము చేసినాడు .
భగవానులు తలఊపుతూ , " వాదమేమో బాగానే ఆరంభమయింది . ధర్మ మందిరమునకు వెళదామా " అని బయలుదేరినారు . " మీ అమ్మను కూడా రానీ " అన్నారు . ఆంధ్రుడు తల్లిని పిలుచుటకు వెళ్ళినాడు . భగవానులు దేవరాతునితో , " చూడు , మెలకువగా విని గుర్తుంచుకో . ధర్మ విచారము చేయునపుడు ప్రాణము పైన దృష్టి ఉండవలెను . అక్కడ ఏ కొంచము వికారము కనబడినా , మనసు ఉద్రిక్తమైనదని తెలుసుకొని , మరలా సమాహిత మనస్కుడవై కూర్చోవలెను . " అని పలుకుతూ ధర్మ మందిరపు వైపుకు వచ్చినారు .
ఆంధ్రుడు తల్లినీ , తమ్ముళ్ళనూ పిలుచుకొని వచ్చినాడు . భగవానులు పత్నిని పిలచి , పక్కనే కూర్చోబెట్టుకుని , " నీ కొడుకు మాపైన అభియోగమును తెచ్చినాడు . ధర్మ మందిరానికి వచ్చినాము . అతని పరిషత్తును పిలవమను . " అన్నారు .
భగవతి ఆమాట విని నేల పైకి కుంగి పోయినారు . " ఆంధ్రా ! ఇదేమిటి ? ఈ మాట నిజమేనా ? భగవానులను నువ్వు ధర్మ మందిరమునకు పిలచుకొచ్చినావా ? " దానికతడు , " మేమంతా నీ కాలిపై పడి వేడుకున్నాము . నువ్వు భగవానులకు చెప్పలేదు . కాబట్టి ఈ దినము మేమే వారికి తెలియజేయవలెనని వచ్చినాము . వారే ఇక్కడికి రమ్మని చెప్పినారు . మేము కూడా వారి ఆజ్ఞ అని వచ్చినాము . "
భగవానులు ధర్మ మందిరమునకు వచ్చినారు అన్న సమాచారము వచ్చినదే తడవుగా ఆశ్రమము ఆశ్రమమే అక్కడికి వచ్చి మూగింది . అందరూ వచ్చి తమ తమ స్థానాలలో కూర్చున్నారు . ధర్మాసనములో దర్భలతో చేసిన కూర్చ నొకదానిని కట్టి ఉంచి , " ధర్మ పురుషుడు మా వాద , వివాద , ప్రతి వాదములను పరీక్షించి నిర్ణయము చేయుగాక " అని సభ ప్రార్థించింది .
భగవానులు లేచి , " మేము అభియోగము ఆపాదించ బడిన వారము . దేవరాతుడిని జ్యేష్ఠ పుత్రునిగా అంగీకరించి , ఔరసులైన ఆంధ్రాదులకు వారి జన్మ సిద్ధమైన అధికారమున లోపము కలిగించినాము అనునది మాపైని ఆరోపణము . కులహీనుడైన శునశ్యేఫుడు కులీనులైన ఆంధ్రాదుల అధికారమును అపహరిస్తున్నాడు అనునది అతనిపైని ఆరోపణము . ఇది అధర్మమని వారి సిద్ధాంతము . దీనిని మేము అంగీకరించవలెను , లేదా నిరాకరించవలెను . ఇదిగో , ఈ ధర్మ సభ ముందర మేము ప్రమాణ పూర్వకముగా పలుకుచున్నాము . హరిశ్చంద్రుని యాగములో దేవతలు కరుణించి ఈ పుత్ర రత్నమును మాకు అనుగ్రహించినారు . ఇతడు వయోమానము చేత చిన్న వాడైననూ గుణము వలన , విద్య వలన , ప్రభావము వలన , తపస్సు వలన , జ్ఞానము వలన , మా ఔరసులు నూరుమంది కన్నా శ్రేష్ఠుడు . దాని వలననూ , దేవతలు అనుగ్రహించి ఇచ్చినవాడు అన్న కారణము చేతా ఇతడిని వీరందరికన్నా జ్యేష్ఠుడు అని మా దంపతులము అంగీకరించినాము . ఇది మా పిల్లలు కూడా అంగీకరించ తగినది . దానితో పాటు , దేవరాతుడు ద్వాముష్యాయణుడై ఆంగీరస విశ్వామిత్ర గోత్రములు రెండింటికీ భూషణుడై ఉండుటకు తగినవాడు . మాకు తోచిన విధముగా మేము దీనిని ధర్మమని అంగీకరించి ఆచరిస్తున్నాము . దీనిని ఆమోదించువారూ , విరోధించు వారూ ముందుకు వచ్చి తమ అభిప్రాయములను సకారణ సహేతుకముగా ధర్మ పరిషత్తుకు నివేదించవచ్చును . మాది అధర్మమని సప్రమాణముగా , లేదా సహేతుకముగా తెలిపిన యెడల మమ్ములను సరిదిద్దుకొనుటకు సిద్ధముగా ఉన్నాము " అని గంభీరముగా , నిర్వికారముగా పలికి , చేతులు జోడించి కూర్చున్నారు .
సభ ఒక ఘడియ నిశ్శబ్దమై నీరవమైనది . మధుఛ్చంద్రుడు అన్నగారి అనుమతి కనుసైగతో పొంది లేచినాడు . అతడి వెనుకనే అతని నలభై తొమ్మిది మంది తమ్ములూ లేచి నిలుచున్నారు . అంతమందీ ముందుకు వచ్చి సభకూ , తల్లిదండ్రులకూ నమస్కారము చేసి నిలచి , " ధర్మ పురుషునికి నమస్కారము . ధర్మిష్ఠులకు నమస్కారము . ధర్మజ్ఞులకు నమస్కారము . భగవానులు అనుజ్ఞయిచ్చి చెప్పినది సర్వథా ధర్మ సమ్మతముగా ఉన్నదని మేము ఒప్పుకున్నాము . వీరే గోత్ర ప్రవర్తకులైనందు వలన , వంశ క్రమానుగతముగా ఆచరణలో అధికారముల లోపమగుట అనునది లేనందు వలన ఔరసులమైన మేము , ధర్మ , కర్మ , గుణ , విద్యా తపస్సుల వలన జ్యేష్ఠుడైన ఇతడిని సర్వ జ్యేష్ఠుడు అని అంగీకరిస్తున్నాము . ఈతనికి జ్యేష్ఠాంశము చెందుటకు మా అభ్యంతరమేదియూ లేదు " అని నమస్కారము చేసినాడు . తమ్ములు కూడా నమస్కారము చేసినారు .
సభ కూడా మధుఛ్చంద్రుని మాటకు అంగీకారము ఇచ్చినది . ఆంధ్రుడూ , అతని తమ్ములూ లేచి నిలుచున్నారు . " ధర్మజ్ఞులకు ధర్మిష్ఠులకు ధర్మ పురుషునికి నమస్కారములు . నేను ఈ తమ్ములందరి పరముగా చెప్పుచున్నాను . మేము చెప్పుచున్నదానిని మేమే విమర్శ చేసుకొని చూసి , ’ ఇది ధర్మము , సప్రమాణమైనది , సలక్షణమైనది ’ అని నమ్మి ఈ సభ ముందర మా అభిప్రాయమును నివేదిస్తున్నాము . ఒక వేళ మేము క్రోధాది దుర్బుద్ధులను ఆశ్రయించి అధర్మమని మాకు తెలిసి కూడా దీనిని సాధించవలెనని అనుకొని ఉంటే , ధర్మ పురుషుడు మాకు ప్రాణాంతకమైన శిక్షను విధించనీ . భగవానులు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము శిరసా వహించవలెనని మేము ఒప్పుకొను వారమే అయినా , వారి ఆజ్ఞ మేము ఒప్పుకోదగినదిగా ఉండవలెను . అటువంటి ఆజ్ఞను ఇచ్చి , వారు మమ్ములను అనుగ్రహించవలెను . అటుల కాక , వారి సిద్ధాంతము వలన మా అధికారమునకు వచ్చు లోపమును గమనింపకుండా తమ సిద్ధాంతమును మాపై రుద్దునట్లయితే అది పితృ ధర్మపు దుర్వినియోగము . ఎవరు చెప్పినా ఈ శునశ్యేఫుడు శునశ్యేఫుడే తప్ప ఇంకొకడు కాలేడు . అదే కారణము వలననే ఇతడు ఆంగీరస గోత్రుడే తప్ప విశ్వామిత్ర గోత్రుడవలేడు . గోత్రము , పారంపర్యముగా ప్రాప్తమగు అధికార విశేషము . భగవానులే అయినా అటుల తాము మెచ్చిన వారికి , తమను మెప్పించినవారికి తమ గోత్రమును ఇవ్వవలెనన్న , ఉత్తరాధికారులయిన మమ్ములను అడిగి ఇవ్వవలసినది . అలాగ ఇచ్చినా అతడు మాకు తమ్ముడవగలడే కానీ అన్న కాకూడదు . అందు వలన మేము ఈ శునశ్యేఫుడి జ్యేష్ఠత్వాన్ని అన్ని విధములా విరోధిస్తున్నాము . "
" ఈ మీ సిద్ధాంతమును పుత్ర ధర్మముతో పాటు సమన్వయ పరచగలరా ? "
" లోకములో ధర్మము సామాన్యము , విశేషము అని రెండు విధములు . సామాన్యమునకు విశేషము వలన భంగము ఉంటుంది . ఇది విశేష ధర్మము . కాబట్టి సమన్వయము అవసరము లేదు . "
ధర్మాసనము నుండీ ఒక హుంకారము వినిపించినది .
మధుఛ్చంద్రుడు " అన్నా , హెచ్చరిక ! నువ్వు ప్రాణమును పణముగా పెట్టి ధర్మ విచారము చేయుచున్నావు . ఏ విధముగా కూడా ధర్మమునకు గ్లాని కలుగరాదు " అని మొక్కినాడు .
ఆంధ్రుడు తిరస్కారపు గర్వముతో , అహంభావపు నవ్వు నవ్వుచూ , " జ్యేష్ఠులు జ్యేష్ఠులు మాత్రమే కాదు . శ్రేష్ఠులు కూడా ! దానిని కనిష్ఠులు మరువరాదు " అన్నాడు .
మధుఛ్చంద్రుడు గడ గడ వణకుచూ , భీతితో , వినయముతో అడిగినాడు , " ఇదే మాట భగవానులకు కూడా అన్వయిస్తుంది కదా ? "
" జ్యేష్ఠులని అంగీకరిస్తే జ్యేష్ఠులు . ప్రతిఘటించిన తర్వాత ? "
భగవతి , " ఆంధ్రా , హెచ్చరిక , హెచ్చరిక ! " అన్నారు .
మధుఛ్చంద్రుడు మరలా వేడుకున్నాడు , " అన్నా , ఈ మాట కేవలము నీ నోరు పలికినది . వెనుకకు తీసుకో "
" లేదు , ఇది ఆడిన మాట "
" ఇది అన్యాయము "
" నేను చెప్పుచున్నాను , ఇది న్యాయము "
ధర్మాసనపు వైపునుండీ పిడుగు వంటి ధ్వని వినిపించినది . నిశ్శబ్దముగా , నీరవముగా కూర్చున్న సభ , ఆ అనిరీక్షితమైన మహా ధ్వని వలన వణకిపోయి పైకి ఎగసి పడినట్లాయెను . భగవానులు కిందికి చూస్తున్నవారు , పైకి తలయెత్తి చూచేలోపు , ఒకే జ్వాల వారి యాభై మంది పుత్రులను భగ్గుమని కాల్చి బూడిద చేసేసింది . భగవతి దానిని చూచి , అయ్యో అని అరుస్తూ కూర్చున్నట్లే కిందపడి మూర్ఛ పోయినారు . భగవానులయితే , తామే ఆ మంటలలో చిక్కిన వారివలె నిశ్చేష్టులై నిలబడినారు . మధుఛ్చంద్రాదులు ఏమి జరిగినదో అర్థము కాక కర్తవ్య విమూఢులైనారు . సభ వారు కనులు మూసుకున్నారు .
తెల్లటి మేఘము ఒకటి వచ్చి భగవతిని మోసుకొని వెళ్ళడము ఎవరూ చూడలేదు .
విశ్వామిత్రుని కుమారులు శునశ్శేపుని అన్నగా అంగీకరించక తండ్రి చేత శపించబడి దక్షిణాపథానికి వచ్చారని కదా ఐతరేయ బ్రాహ్మణంలో కథ. మరిక్కడ అగ్నికి ఆహుతవ్వటం ఏమిటి? దేవుడుగారు చేసిన మార్పా, లేక నేను విన్న కథ తప్పా? వివరించగలరు.
ReplyDeleteఇవి ఒక్కోచోట ఒక్కో రకముగా చిన్న చిన్న మార్పులతో కనిపిస్తాయి . విశ్వామిత్రుడు ఆంధ్రకాది కుమారులకు శాపము ఇచ్చినట్లూ , ఆ శాప ఫలితముగా వారికి కూడా వశిష్ఠ పుత్రుల గతే పట్టినట్టు కూడా ఉంది . అంటే , వీరు కూడా మరణించడము . దక్షిణాపథానికి వచ్చారని చదివిన గుర్తు లేదు . మరొకటి , శునశ్యేఫుడు నిజానికి విశ్వామిత్రునికి మేనల్లుడు . అజీగర్తుడెవరో కాదు , విశ్వామిత్రుని అక్క సత్యవతి భర్త అయిన ఋచీకుడే . ఆ విషయము విశ్వామిత్రునికి హరిశ్చంద్ర యాగ సమయములో తెలుస్తుంది . కానీ దేవుడు గారు అవి రాయలేదు . ఇలాంటి అనేక విషయాలు కారణాంతరముల వలన మరుగున పడిపోవడమో , మార్పు చెందడమో జరుగుతుంది .
ReplyDeleteమీ పరిశీలనకూ , స్పందనకూ ధన్యవాదాలు .