అరవై ఐదవ తరంగం .
విశ్వామిత్రులు తపస్సు సాగిస్తున్నారు . ఉదయము బ్రాహ్మీ ముహూర్తానికి సరిగ్గా శ్వాస నిరోధము చేసి ప్రాణ దేవుని దర్శనము చేసి అతని అనుమతి పొంది ప్రాణాగ్ని హోత్రమును ప్రారంభించినారు . ప్రాణ పంచకములు కూడా అగ్నులై కూర్చొని మండుతున్నాయి .
క్రమముగా జ్వాలలు దేహము నుండీ బయటికి వెలువడుట మొదలైనది . శాంతమై , హితముగా నున్ననూ , ఇతరులకు సహించుటకు అసాధ్యమై ఆ జ్వాలా మండలము నదీతీరము నుండీ నదీ జలాలకూ వ్యాపించుతుండగా , భగవానులు , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసుకొని అతనికి ఈ విషయమును నివేదించినారు , " దేవా , నా పేరు విశ్వామిత్రుడు . నీ దయ వలన నా పేరు సార్థకము కావలెను . ఇప్పుడు జరుగుతున్న అగ్నిహోత్రపు ఫలముగా , ఈ దేహము నుండీ జ్వాలలు ఎగసి పడుతున్నవి . ఈ జ్వాలలు నాకు హితమైనవి . నాకు శాంతములుగానే కనిపిస్తున్నవి . అయినా నీరు కాగుతున్నది . కాగిన నీటనున్న ఈ జల చరములకు అప్రియమైనటులే , ఇక ముందు ఖేచర , భూచరములకూ అప్రియము అవనున్నవి . విశ్వానికి బ్రాహ్మణ్యమును సంపాదించుటకు బయలుదేరిన నానుండీ మొదటగా కలుగ వలసిన ఉపకారము ఇతరులకు అప్రియమా ? అందు వలన దీనిని తప్పించవలెను . "
ప్రాణ దేవుడు నవ్వినాడు , " భగవాన్ విశ్వామిత్రులు ఒక దహించని అగ్నిని వెదకుతున్నారు . కానిమ్ము , దానికీ ఒక దారి ఉంది . ఇకపైన , ప్రాణాగ్ని పంచకమును పంచకముగా ధ్యానించక , ఏకాండముగా , సమిష్టిగా ధ్యానము చేయండి . అలాగ ఏకాండముగా చేసిన ధ్యానము సత్త్వముగా పరిణామము చెంది , సర్వ హితమవుతుంది . " అని అనుజ్ఞ యయినది .
భగవాన్ విశ్వామిత్రులు ఏకాండ ధ్యానమును ఆరంభించినారు . మొదట ప్రాణ దేవుడిని సాక్షాత్కరించుకొని , అతని అనుమతితో పంచకమును చూచి , వారిని యథావిధిగా అర్చించి , వారి అనుమతితో వారు ఐదుగురినీ సమిష్టిగా అర్చించినారు . ఐదు అగ్నులూ చేరి కూడి ఒకటే అగ్ని అయినది . అగ్ని ధ్యానములో విశ్వామిత్రులు బాహ్య ప్రపంచమును మరచి కూర్చున్నారు .
అలాగ ఎంతోసేపు ఏకాంతముగా కూర్చొని ఉండగా , హఠాత్తుగా వారిని ఎవరో కుదిపి లేపినట్లాయెను . కనులు తెరచి చూస్తే , ఒకరు , వృద్ధులు కాకున్ననూ వృద్ధుల తేజస్సు ఉన్నవారు ఎదుట నిలిచున్నారు . దేహమంతయూ పోతపోసిన వెండి ముద్దలాగా ఉంది . కళ్ళు రెండూ , రెండు తెల్లటి వజ్రఫలకములపై రెండు గోమేధికములను తాపినట్టున్నాయి . కొండ శిఖరమునందున్న సరోవరపు తేటదనమూ , నిర్మలత్వమూ , ప్రసన్నతా , గాంభీర్యమూ ఆ కళ్లలో గూడుకట్టుకొని ఉండి , చూచువారి నందరినీ యనుగ్రహించు అనుగ్రహ మూర్తి వలె నున్నారు . ఎక్కడో చూసినట్లే ఉన్నారు . అలా చూస్తుండగా , విశ్వామిత్రునికి అది ఒక దివ్య దేహమని అర్థమయింది . ఎవరు ? ఏమిటి అన్న ఆలోచన తరువాత చేయవచ్చు అనుకొని , తత్క్షణమే మానస పూజ ఒనర్చినారు . ఈ సారి విచిత్రమేమనిన , వీరు సంకల్పము చేసి నోటినుండీ మాట వచ్చునంత లోపలే , అక్కడ , ఆ కార్యానికి కావలసిన సాధనములన్నీ సమకూరి ఆయా కార్యములై , పూజ సమాప్తి యగుటను కళ్ళు చూస్తున్నవి .
పూజను గైకొని , ఆ వచ్చినవారు , " భగవానులకు ఆయాసమై ఉండాలి . లోకానుగ్రహము చేయనున్నవారికి కూడా ఆయాసము తప్పలేదు కదా " అని ఆరంభించినారు .
విశ్వామిత్రులకు , ఈతడే క్షేత్ర పతి యైన బృహస్పతి అయి ఉండవలెను అనిపించినది . అదీకాక , వెనుక ఒకసారి చూసిన జ్ఞాపకము , ’ తప్పక అతడే ’ అన్నది . పలకరించినారు , " దేవగురువులకు సుఖాగమనమైనదా ? "
బృహస్పతి నవ్వుతూ అన్నారు , " భలే విశ్వామిత్రా , జాడను పట్టుకోగల ఘటికుడవైనావు . నువ్వేమో కనులు మూసి కూర్చున్నావనుకున్నావు . నీ ప్రతాపమును చూచినావా ? "
దేవగురువు చూపించిన చేతివెంటే తిరిగిన కనులు , తన వలెనే ఉన్న వందలాది ప్రతి కృతులు తనవలెనే తపోనిష్ఠులై కూర్చున్నది చూచాయి . ఒకటే గరిక గడ్డి సర్వతో ముఖమై , వ్యాపించిన అన్ని దిక్కులలోనూ వేర్లూని ఒక్కొక మూలమైనట్లే , కోవిల దుంపలూ , చిలగడ దుంపలూ వేరులు వ్యాపించి పోయి , కణుపు కొక గడ్డ అగునట్లు , చుట్టుపక్కల అంతా తన ప్రాణమే ప్రవహించి అక్కడొకటీ అక్కడొకటీ తన ప్రతి బింబమై కూర్చొని యుండుట చూసి విశ్వామిత్రులకు అంతులేని ఆశ్చర్యమైనది .
విస్మయావేష్టులై మౌనులైపోయిన భగవానులను దేవగురువులే మరలా మాట్లాడించినారు : " సుఖాగమనమా ? అని అడుగుతున్నావు . నేను ప్రతి శుద్ధ పంచమి దినమూ ఇక్కడికి వచ్చి వెళ్ళుట వాడుక యైనది . కడచిన సారియే నేను దీనిని గమనింపవలసినది . చూచెదము అనుకొని వెడలిపోతిని . ఇప్పుడు , ఇదేమిటి , ఈ క్షేత్రమంతయూ నీదే అయిపోయినదా ? ఇతరులు వచ్చుటకు కూడా అవకాశము లేకుండా నీ ప్రాణ శక్తివ్యూహము పరచుకొని కూచున్నావే ? మిగతా వారు ఈ పుణ్య నదీ స్నానానికి కూడా రాకూడదేమి ? "
విశ్వామిత్రులు దేవ గురువులు చూపిన దృశ్యము , ఆడిన మాట , రెంటికీ ముగ్ధులై " దేవా , ఎంతైనా మానవులు అల్ప బుద్ధులు . సంకల్పము లేకుండానే , తమకే తెలియకుండానే అపరాధము చేయు జాతి ఇది . క్షమించవలెను . " అని చేతులు జోడించారు .
" అటుల కాదు , అపరాధము చేయుటకు శక్తి ఉన్నందువల్లనే మీవల్ల ఉపకారము కూడా కాగలదు . మనుష్యుడు స్వతంత్రుడనని అనుకొని స్వేఛ్చగా ఉద్యుక్తుడైతే అప్పుడది అపరాధము . వెనుక ముందులు చూచి కార్యపరుడైతే స్వసంకల్పుడి కన్నా హెచ్చుగా , ఆజ్ఞాతుడైనపుడు వాడి వలన లోకానికి ఉపకారము . నీ సందేహము అర్థమైనది , ప్రేరకులు మేమే ! దేవతలు ప్రేరేపించనిదే యే కార్యమూ నడవదు . అయితే , మాది కనబడని చేయి . అదుండనీ , విశ్వామిత్రా , నువ్వు మొదట నన్ను ఈ నీ ప్రాణశక్తి వ్యూహము నుండీ దాటించు . ఇది నన్ను పట్టి నిశ్చేష్టుడిని చేసినది . నేను దీని వలననే నీకు అంతరాయము కలిగించినది . "
" అది కూడా తమరే నేర్పించవలెను కదా ! "
" ఔను , ఇప్పుడు ప్రాణ ధ్యానము చేస్తున్నావు కదా , అది నీ హృదయము నందు జరుగుతున్నది . అది ముఖ్య ప్రాణ ధ్యానము . ఈ ముఖ్య ప్రాణుడి ధ్యానము వలననే నీకు ఇలాగు ప్రతిసృష్ఠి కర్త అగుటకు యోగ్యత వచ్చినది . అయితే , ఇది నువ్వు వెనుక అనుకొన్నట్లు సంకల్ప ప్రభావము కాదు . ప్రాణము బలీయమై బయట పడి , భూత పంచకముల తన్మాత్రలను అన్ని వైపులనుండీ పీల్చి వేసి వేరే మూర్తులైనది . ఈ ముఖ్య ప్రాణ ధ్యానము నుండీ ఇంకా ముందుకు వెళ్ళి మూల ప్రాణ ధ్యానమును చేయి . అప్పుడు ఈ ప్రాణ విజృంభణము ఉపశాంతమవుతుంది . నేను కూడా విడుదల అవుతాను . "
విశ్వామిత్రులు మరలా ధ్యానారూఢులయినారు . ప్రాణ దేవుని సాక్షాత్కరించుకొని , దేవగురువు యొక్క అనుజ్ఞను తెలియజేసినారు . ప్రాణదేవుడు నవ్వుచూ , అన్నాడు , " ఇటుల అగునని నాకు తెలిసి యుండినది . దేవగురువులే వచ్చి చెప్పినది కడు రమ్యముగా నున్నది . మన ముందరి కార్యమంతా సుముఖమైనది . ఇప్పుడు మూల ప్రాణుడిని ధ్యానించు . అయితే ఒక హెచ్చరిక . దేహాద్యంతమూ ధ్యానముండవలెను . ఇంతవరకూ హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడులలో మాత్రమే నన్ను ధ్యానించినావు . ఇప్పుడు దేహాద్యంతమూ ధ్యానము నడవవలెను . దానికి ముందు దేవ గురువుల యనుమతి కోరు . అతని వలన ఇంకొక రహస్యము నీకు తెలియవలెను . అది తెలియనిదే ఈ మూల ప్రాణ ధ్యానము అసాధ్యము . "
భగవానులు ప్రాణ దేవుల యనుజ్ఞను దేవ గురువులకు తెలిపినారు . వారు నవ్వుతూ , " మంచి పనే ! నేనుగా వచ్చి నీకు చిక్కుకు పోయి దేవ రహస్యములను నీకు తెలుపవలసినట్లాయె కదా ! " అన్నారు .
" దేవా , నిజము . నువ్వుగా వచ్చి దొరికినావు కదా , కృపతో మీ రహస్యములనన్నిటినీ తెలియజేయక పోతే ఇంకెవరు తెలియజేస్తారు ? బ్రహ్మర్షి పరిషత్తు అనుమతి నిచ్చింది . అందుకే నేను వచ్చినది . పెద్ద మనసు చేయవలెను ."
" అది కాదయ్యా , నీ మాట నీదే గానీ , నేను చిక్కుకున్న విషయము నీకు పట్టినట్లు లేదు . ఇక్కడ చూడు , నీ ప్రాణ శక్తి , నీ తపోబలముతో బలపడి నాగ పాశములై నన్ను బంధించి వేసినది . దీని నుండీ నన్ను విడుదల చేయవయ్యా అంటే పరిషత్తు అనుమతి అంటున్నావే , నీకిది న్యాయమా ? "
" ప్రభూ , నీకు నువ్వే విడుదల కాగల ప్రభువూ నువ్వే అయి , నాతో ఆటాడుచున్నావా ? ఏమి చేయవలెనో అనుమతి నివ్వు . చేయుటకు సిద్ధముగా నున్నాను . "
" అటులనే విశ్వామిత్రా , నువ్వు పేరుకే కాదు , మనోభావము వలననూ విశ్వానికి ఆమిత్రుడవై యున్నావని నీకు చెప్పుచున్నాను . ఇదిగో , ఆ దేవరహస్యము విశ్వానికి ఆర్యత్వమును కరుణించును . అయితే ఒక హెచ్చరిక . దీని శుద్ధ మనస్కుడూ , శుద్ధ బుద్ధి గలవాడూ మాత్రమే జీర్ణించుకోగలడు . ఇతరులకు ఇది కరగతమైననూ ఫలించదు . దీనికి నువ్వు అంగీకరిస్తావా ? "
" దేవా , దేవతలు తమ రహస్యమును కాపాడుకొనుటకు సమర్థులై యుండగా , నా అంగీకారముతో కాగల పనియేమున్నది ? "
" అది కూడా ఒక రహస్యము . విశ్వామిత్రా , నువ్వు ఈ రహస్యమును భేదించు పరమర్షివి . నువ్వు ఇట్టి నా నిబంధనకు ఒప్పుకున్న , ముందు ముందు ఎవరైనా నీ మంత్రమును దురుపయోగము చేసిననూ , దానికి వారే బద్ధులవుతారు . అటులకాక , బంధ విమోచనము చేసి మంత్రమును నువ్వు పొందినా , దానిని ఎవరైనా దురుపయోగ పరచినపుడు , దానికి నువ్వే బాధ్యుడవు అవుతావు . అదీకాక , బంధవిమోచనమైన మంత్రమును మేము ఇవ్వము . అందువలనే, ఉపనిషత్తులో ఉన్న ధర్మాలలో తనదాక వచ్చు వరకూ ఉపనిషత్తు సిద్ధి కాకుండునది . "
" ప్రభూ , స్పష్టముగా చెప్పి అనుగ్రహించండి . ఇప్పుడు మీరు నాకు దయచేయు మంత్రమేది ? ఏ నిబంధనలతో దానిని అనుష్ఠానము చేయవలెను ? దాని సిద్ధి ఏమిటి ? "
" విశ్వామిత్రా , పరిషత్తు నీ ద్వారా అన్వేషించుచున్నది గాయత్రమను మంత్రము . దానిని అనుష్ఠానము చేయుటకు విశ్వామిత్రుడై యుండవలెను . అది వాడిని బ్రాహ్మణుడిని చేయును . బ్రాహ్మణమన్న నేమి యని అంటావేమి ? అదికూడ చెప్పెదను విను . ఇప్పుడు మనుష్యులందరూ ఆగ్నేయులు . అనగా , ఎల్లప్పుడూ ఈ దేహమునకు అన్నపానాదులు కావలసియే యుండును . దానితో పాటు , గంధర్వులూ , సోముడూ మానుష దేహములో ఇల్లు కట్టు కొని యుండెదరు. గంధర్వుల వలన కామమూ , సోముడి వలన సంగ్రహమూ ( బాగుగా గ్రహించుట ) ప్రబలమై ఉంటాయి . గంధర్వులూ , సోముడూ , అగ్నియూ కట్టిన ఇల్లు ఈ మనుష్య దేహము . వీరు ముగ్గురి ప్రభావమునూ మీరి , అనగా , కామమునూ , సంగ్రహమునూ భోగమునూ దాటినవాడు బ్రాహ్మణుడు . దీని కోసము , ప్రాజాపత్య వ్రత రూపమైయున్న బ్రహ్మచర్యమే నిబంధనము . బ్రహ్మ చారిగా ఉండి ఈ మంత్రమును అనుష్ఠానము చేసిన వాడిని గంధర్వ , సోమ , అగ్నులు కట్లు విప్పి అనుగ్రహిస్తారు . ఇదే వృద్ధి . ఇంతటివాడే ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . వీడివలన విశ్వపు ఉద్ధారము . సిద్ధముగానున్నావా ? "
" ఉన్నాను "
" సరే , నువ్వు విశ్వోద్ధారము చేయువాడివి కాబట్టే నీకు విశ్వామిత్రుడని మేము పేరు పెట్టినది . అది ఇప్పుడు సార్థకమయినది ... "
" ఆ పేరు నేనే పెట్టుకున్నది కాదా ? "
" భగవాన్ , చూచితిరా దేవతల చేతివాటము ? వారు మీ మనసులో వెనుక ఉండి , సూత్రధారులై సూత్రములను లాగుచుందురు . మీ మనుష్యులు ఆ ప్రేరణను తెలుసుకోక , మీరే సంకల్పము చేయగల వారికన్నా హెచ్చుగా మిడిసి పడుతారు . ఇప్పుడు చూడు , వశిష్ఠులే నేరుగా నిన్ను కావేరీ తీరములో తపస్సు చేయమని ఎందుకు చెప్పలేదు ? వారెందుకు భగవాన్ అగస్త్యులను చూడమన్నది ? వారెందుకు నన్ను పిలచి , ఇతడికి కావలసినది ఇవ్వండి అని అడుగలేదు ? నా క్షేత్రమునకు నిన్నెందుకు పంపించినారు ? నువ్వూ , లోపా ముద్రా , అగస్త్యులూ మాట్లాడుకున్న దినమే నీ విషయము అంతా నా మనసుకు తెలిసినది . నీ ప్రాణ శక్తి వ్యూహములో నేను చిక్కుకున్నాను కదా , ఇది కూడా మా ఆటే ! ఇదిగో చూడు , నేనే విడిపించుకోగలను . అయితే , నేను నీ వ్యూహమును ఛేదించితే మరలా నువ్వు వ్యూహమును కట్టలేవు . అందుకని నువ్వే విడిపించాలి అంటున్నాను . ఇది నీ చేత కాదన్నదీ నాకు తెలుసు . చూడు , ఇప్పుడు హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడుల ధ్యానము చేస్తున్నావు . దేహాద్యంతమూ ఆ ధ్యానము నడవనీ . పూషుడిని ధ్యానించు . పూషుడి అనుగ్రహము వలన దేహాద్యంతమూ ఉన్న నాడీ చక్రములన్నీ శుద్ధమై ప్రాణ శక్తిని ధరించుటకు సిద్ధమూ , శక్తమూ అవుతాయి . అటుల శుద్ధమైన నాడీ మండలము , నీ మహా ప్రాణ ధ్యానము వలన సృష్ఠియైన ప్రాణ శక్తిని , ధారణ చేయ గలదు . ప్రాణ శక్తిని సృష్ఠించునది , మహా ప్రాణ ధ్యానమే ! అటుల సృష్ఠియయిన శక్తిని బయటికి వదలక , దేహములోనే సంగ్రహించి ధారణ చేయునదే మూల ప్రాణ ధ్యానము . నువ్వు ఆ మూల ప్రాణమును పట్టుకోవలెనన్న , పూషుడి అనుగ్రహము కావలెను . ఇదిగో చూడు , పూషా దేవుడు వచ్చియున్నాడు . "
విశ్వామిత్రులు పూషుని దర్శనము చేసినారు . హిరణ్య వర్ణపు గుర్రములవలె ఉన్న మేకలను కట్టిన హిరణ్మయ రథములో కూర్చున్న కపర్దియైన ఆ మహా పురుషుని చూస్తుండగనే దేహాద్యంతమూ నాడీ చక్రములన్నీ దారి వదిలినాయి . ఇక , పూషా దేవుని పూజ ముగియుచున్నట్లే ప్రతి కృతులన్నీ నూనె నిండుకుని కొండెక్కిన దీపాలవలె అస్తమయమైనవి . విశ్వామిత్రుల దేహములో ప్రాణ శక్తియొక్క సంచయమగుట వారికే బాగుగా అర్థమయినది . బృహస్పతి చెఱ తొలగింది .
పూషుడు విశ్వామిత్రులను కృపా దృష్టితో చూసి " బ్రహ్మర్షులకు నావలన ఏమి కావలెను ? " అని అడిగినాడు . వారు వినయముతో బ్రహ్మర్షి పరిషత్తు కోరికను ఈడేరునట్లు చేయమని ప్రార్థించినారు . పూషుడు సుప్రసన్నుడై , మందహాస సుందర వదనముతో అన్నాడు , " దేవ గురువులు చెప్పినట్లు ఈ విషయములో నిబంధన రహితముగా మంత్రమును ఇచ్చుట లేదు . దీనికి ఒప్పుకుందురా ? "
" అది ఇచ్చువారి ఇష్టము . మీరు ఇచ్చుదానిని మీకు తోచినట్లు ఇచ్చెదరే గానీ , మాకు తోచినట్లు ఇచ్చుట ఉందా ? "
" సరే , ఇక్కడ చూడు , ఇప్పుడు నీ దేహము ప్రాణ కోశమైనది . ఇలాగ ప్రాణ కోశమైతేనే నీకు మూలప్రాణుడి దర్శనమగునది . ఆ మూల ప్రాణుడు ప్రతి దేహము లోనూ ఉన్నాడు . అతడు వచ్చి కూర్చొను వరకూ గర్భములోని ప్రాణి దేహము పెరగదు . అతడు రావలెనని అనుకుంటున్నపుడే అగ్ని ష్టోమ శక్తులు భిన్నములై స్త్రీ గర్భమును చేరి అక్కడ తమ కార్యమును ఆరంభిస్తాయి . బాహ్యముగా సమిష్టి స్వరూపమై యున్న ఇతడే సవితృ నామధేయముతో సూర్యుడిలో నిలచి స్థావర జంగములకన్నిటికీ ఆత్మయై ఉంటాడు . అతడు తనలోపల నిలచి సర్వమునూ నడపుచుండుట చూచి అతని ఇఛ్చకు తనను అర్పించుకొన్న వాడు బ్రాహ్మణుడగును . ఉదయాస్తమయములలో , మిట్ట మధ్యాహ్నములో సూర్యుడిలో నున్న సావిత్రాంశము ప్రకటమవుతుంది . దానిని గ్రహించి తనలో నింపుకొను వాడు బ్రాహ్మణుడు . చూడు , జ్ఞాపకము ఉంచుకో , మూడు సంధ్యలలో గ్రహణము చేయక పోతే , మరలా మిగిలిన వేళలలో గ్రహణము చేయుట కష్ట మగును . దీనికంతటికీ సిద్ధముగా ఉన్నావా ? "
" అటులనే "
" సరే , చూడు , సూర్య మండలపు మధ్యవర్తి యైన సవితృ దేవుని బాహ్య చక్షువులతో చూస్తూ , అక్కడినుండీ వెడలు ఆ హిరణ్మయ తేజస్సును నీ హృదయములో నింపుకొని , అది దేహాద్యంతమూ వ్యాపించునట్లు చేయి . దేహములోనున్న అంగాంగములు మాత్రమే కాదు , రోమకూపములన్నిటా ఈ తేజస్సు నిండనీ . అక్కడ నడచు కార్యములన్నీ ఈ తేజస్సు వల్లనే నడచునని తెలియునా ? ఇలాగు , పిండాండములో నడచినట్లే బ్రహ్మాండములో కూడా నడచును . ఇప్పుడు చెప్పు , నీకు కర్తృత్వము ఉంటుందా ? "
" లేదు "
" ఇప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు ? "
" దేవా , దేహమంతా అనిర్వచనీయమయిన ప్రకాశముతో నిండినది . "
" ఆ ప్రకాశపు మూలము ఎక్కడుందో వెదకి చూడు "
" మూలము నాభిలో ఉంది . అది హృదయములో ప్రకటమగుచున్నది "
" సరే , అదే ! ఆపోజ్యోతి . చూడు . అది మండు చున్ననూ , దానిలో వెలుగుందే తప్ప వేడిమి లేదు . ఇది బ్రాహ్మణుని లక్ష్యము కావలెను . ఇంకా ఒక అడుగు ముందుకు వేయి . సవితృ మండలమును చూడు . అక్కడ ద్విదళ ధాన్యము లలో అణగియున్న అంకురము వలె , ఇటువైపు అగ్నిమండలపు ఎరుపు , అటు సోమ మండలపు నీలిమ - వీటి మధ్య సూక్ష్మముగా పీత వర్ణములో కనిపిస్తున్నదే , అదే సవితృ మండలము . చూడు , నువ్వు చూస్తుండగనే అది నీకు అభిముఖముగా కిరణమును ప్రసరించును . ఆ కిరణమే సావితృము . దానిని పట్టి నువ్వు మూల ప్రాణమునకు తెచ్చి , మూల ప్రాణము నుండీ మహా ప్రాణమునకు తెచ్చి , అక్కడినుండీ ప్రాణ మండలమునకు తెచ్చి , అక్కడినుండీ దానిని ఉదాన వాయువులో వహించు . ఆ ఉదానము ఆ తేజస్సును శబ్ద మాత్రముగా పరిణమింపజేసి , పలుకుతుంది . ఆ శబ్దమే వాక్కై , మంత్రమై , ఆ మంత్రము లోకోద్ధారము చేస్తుంది . జాగ్రత్త ! అయోగ్యుడికి ఇచ్చిన మంత్రము ఇచ్చిన వాడిని చంపుతుంది . పాత్రులకు దానిని ఇస్తే , అది రెండు కొనలనూ కాపాడును . "
" దేవా , అపాత్రుడిని అనుగ్రహించు శక్తి ఆ మంత్రానికి ఇవ్వు "
" భలే , విశ్వామిత్రా , భలే . జాగ్రత్తగా ఉన్నావే ! ..సరే , ఇప్పుడు చెప్పు , నీ నోట వచ్చిన ఈ మాట నీదేనా ? "
" కాదు , బృహస్పతి పలికించినది "
" భలే , భలే . ఇలాగే ఆరంభమునుండీ అంత్యము వరకూ సర్వ భావనలూ ప్రచోదితములే అనునది తెలిసి , దేహ , కాల , ఆహార , సంగ , ధర్మములతో ప్రచోదితమైన దానిని వదలి , ఆత్మ హితము కోసము , లోక హితము కోసము వచ్చు ప్రచోదనమును పట్టి కార్యము చేయువాడు బ్రాహ్మణుడు . ఇంతటి బ్రాహ్మణుడిని మా దేవతలము కూడా బలిదానముల చేత ఆరాధించెదము . అతడు కామ వశుడై స్వఛ్చంద వర్తనుడగు వరకూ విశ్వ దేవతలందరూ అతని దేహమునందుంటారు . మేము ఎప్పటికీ పరోక్ష ప్రియులము . మమ్ములను దర్శించవలెనంటే మాకు బలిదానము ఇవ్వ వలెను . మమ్ములను వరము కోరవలెను . దీనినంతటినీ నియమముగా ఆచరించి , నీ సావితృ మంత్రమును అనుష్ఠానము చేస్తే అది గాయత్రమవుతుంది . తృప్తి కలిగినదా ? "
" దేవా , అటులనే , నీ అనుగ్రహముతో బ్రహ్మర్షుల కార్యము నెరవేరినట్లే . అయితే , ఇదంతా కూడా పాత్రులైన వారికి మాత్రమే . అపాత్రులను అనుగ్రహించు విధానమును చెప్పు . "
పూషుడు దిక్కు దిక్కులన్నీ వెలిగిపోవునటువంటి నవ్వు నవ్వి , " బ్రహ్మర్షీ , చూచితివా ? నీ అంతస్తు వారు ఈ కృత యుగములో కూడా , ఎంత వెదకినా నూరు మంది దొరికితే ఎక్కువ . ఇటువంటి నీకు కూడా సంశయము ఉంది , చూచితివా ? ఎంతవరకూ అహంకారము ఉంటుందో , అంతవరకూ సంశయము వదలదు . ఇదే హృదయ గ్రంధి . సవితృడిని ఇంకొక సారి ధ్యానము చేసి ఈ హృదయ గ్రంధిని విసర్జించి , పాత్రులు ఎవరు ? అపాత్రులు ఎవరు ? అన్నది చూడు ."
" అవును దేవా , తప్పయినది . లోకములో అందరూ పాత్రులే ! కొందరు సిద్ధముగా ఉన్నారు . ఇంకొందరు సిద్ధమగుచున్నారు . ఇదిగో , ఇదెవరో అంటున్నారు , " జాత మాత్రస్య గాయత్రీ " అని "
" అవును , నిజము . అది పలికిన వారిని దర్శనమివ్వమని అడుగు "