యాభై మూడవ తరంగం .
విశ్వామిత్రుని ఆశ్రమోపాంతము లో మెరుపు మంటపము వంటి ఒక విమానము వచ్చి దిగింది . దానినుండీ ఇద్దరు దివ్యాంగనలు దిగి వచ్చారు . ఇద్దరికీ దిగులు . ఏదో గాబరా . వేటగాడి భయము చేత బెదరి ఉన్న హరిణుల వలె కళ్ళు వెడల్పు చేసుకొని చుట్టు చూస్తూ , వేయబోయే అడుగులో ఏ విపత్తు పొంచి ఉందో అని బెదురుతూ నడుస్తున్నారు . చూడబోతే అభిసారికల్లాగా ఉన్నారు . అభిసారికలై ప్రియుడిని వెతుక్కుంటూ వెడలిన వారికి , అందులోనూ దివ్యాంగనలకు ఇంతటి దిగులెందుకో ...
" రంభా , నువ్వు ఇంతగా భయపడుతున్నది చూస్తే ఏదో ఒక అనర్థమవుతుంది అనే చెప్పాల్సివస్తుంది . ఆ రాజర్షి మన మేనక పైన అంతటి అభిమానము చూపినవాడు , మనము మేనక ప్రియ సఖులము అని తెలిస్తే అతని అభిమానము మనకు కూడా ఎంతో కొంత దొరక్కపోదు . లేదు , అతడు తపస్వి అంటావా , తనతో పాటు తపస్సు చేయమని అంటాడు , అంతే కదా ? . మన మనోభిలాషను ఈడేర్చుకొనుటకు మనము కూడా ఆ ఆటను ఆడితే సరిపోదా ? "
" ఘృతాచీ , నా స్థితి ఆడదానినైన నాకే అర్థము అగుట లేదు . ఈ తపస్వులు ధర్మ సంమూఢులు . మనము కామము కోసము ఏదైనా బలి ఇచ్చునట్లే , వీరు ధర్మము పేరు చెబితే ఏమైనా చేసేస్తారు . తపస్సు చేత దగ్ధమైపోయిన ఆ పాడు హృదయములో ఇంకే లలిత భావనలకూ అవకాశమే ఉండదు . కాబట్టి , కొండ పైనుంచీ అత్యుత్సాహముతో కిందకు దిగిన నది , ఇసుక మేట లను చూసి , అయ్యో , ఇసుకలో ఇంకి పోవలసినదేనా అని విధి లేక , దారిలేక ముందుకు పోవునట్లు వస్తున్నాను . "
" ఏమి మాట్లాడుతున్నావే ? నువ్వు దేవతవు కావా ? ఏమి జరగనున్నదో చూడు . దానికి తగినట్లు నడుచుకో "
" పిచ్చిదానా , దేవతలను విధి కాపాడుతుంది , ఆ భయము లేదు , కానీ నేను దేవతనే అయినా , నా స్వభావము నాకు తెలుసు . ఆడది తాను ఓడిపోతేనే గెలుపు పొందేది . మొదట ఓటమి , ఆ తరువాతే గెలుపు . కానీ నా పాడు స్వభావానికి అది లేదు . నేను మగవాడి మనసును జోడించిన ఆడ దేహాన్ని . గెలవాలి , గెలవాలి అని మాత్రమే ప్రయత్నించి ఓడిపోతాను . అందుకే నాకు కామ తృప్తి లేదు . లేకపోతే , నన్ను ఇష్ట దేవత వలె ఆరాధిస్తున్న యక్షేశ్వరుని కుమారుని కన్నా నాకు ఇంకెవరు కావాలి ? ఈ పుణ్యాత్మునికి నేను కావాలో వద్దో ? ఏదైతేనేమి , సముద్రములో పడు నది వలె నేను ముందుకు దూకుతున్నాను . "
" ఇది మిక్కిలి బాగున్నదే , రంభా ! నీ రూపము ఎంతటి అద్వితీయమైనదో నీకు తెలిసినట్లు లేదు . ఈ మొక్కలు , తీగలు , చెట్లు మొదలుకొని ఈ వనస్థలి అంతా చేతనములైనట్లు కనిపిస్తున్నాయి , ఎందుకో తెలుసా ? నీ రూపాన్ని చూసి ఉద్రిక్తమై కంపించుతున్నవి . ఈ నది ఏమిటో తెలుసా ? ఈ వనస్థలి , ఇంతటి రూపరాశిని పొంది కూడా అనుభవించు భాగ్యము లేదు కదా అని నీరవముగా రోదించి పెట్టుకున్న కన్నీరు . పిచ్చిదానా , భగవాన్ వశిష్ఠులను మించినవారున్నారా ? వారు కూడా నిన్ను చూస్తే ఒక్క ఘడియ యైనా మనోవైకల్యమును పొందగలరు . అటువంటప్పుడు నువ్వు వెళితే ఇక్కడ నీకు జయము తప్ప వేరే ఇంకేమీ లేదు . గెలుచుటకే పుట్టినావు , గెలుస్తావు : మాలాగా నువ్వు ఆడ స్త్రీవి కాదు కదా ? "
" అదే నాకు తగిలిన శాపము . ఘృతాచీ , మేనక ఇతడిని ఆరాధించుటను ఆ దినము చూచితివి కదా , అటులనే నేను ఎవరినైనా ఆరాధించవలెనని ఆశ. కానీ ఏమి చేయుట , ఆ వచ్చినవారే నన్ను ఆరాధించవలెను అనిపించి , మగవాడిని కసవు కన్నా తక్కువ చేయుట నాకు అభ్యాసమైపోయింది . నేను ఇప్పుడు చేస్తున్నది అనుచితమైనది . దానివలన నాకు మహత్తరమైన హాని కాగలదు . కానీ , దానిని తప్పించుకొనుటకు దారి ఉన్నా , నాకు అసాధ్యము . అహంకారము కోసము కామాన్ని బలి ఇచ్చిన దాన్ని నేను . హూ ...కావలసినది కానీ , నేనేమి చేయగలను ? "
" నువ్వు భయపడుతున్నది చూస్తే రంభా , నీ భయానికి ఇంకేదో వేరే కారణమున్నదని అర్థమగుచున్నది . నువ్వు బయలు దేరునప్పుడు ఇంద్రుని అనుమతి తీసుకున్నావా ? "
" లేదు . ఆ దినము ఇంద్రుడు వస్తాడని సందేశము వచ్చింది . వచ్చినపుడు అక్కడే ఊ కొట్టిద్దాము లే , అనుకున్నాను . అతడు రాలేదు . నేను చెప్పకనే బయలుదేరాను . నువ్వు అనుమతి తోనే వచ్చావా ? "
" ఊ .. ఎప్పటి లాగానే ఇంద్రభవనానికి వెళ్ళి అనుమతి తీసుకొనివచ్చాను . నువ్వూ అలాగే చేసి ఉంటే బాగుండెడిది . "
" చెప్పితిని కదా , మనసు అనర్థాన్ని కాచియున్నది . దాన్ని తప్పించుకొనుట కూడా ఇష్టము లేక , జరిగేది జరగనీ అన్న మొండితనము వచ్చేసింది . సరే , అదలా ఉంచు , నువ్వు అనుమతి అడిగినపుడు ఇంద్రుడేమన్నాడు ? "
" ’ ఆతడిప్పుడు భగవాన్ అయి ఉన్నాడు . అతడు నాకు చాలా ఆప్తుడైన వాడు . నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆశపడుట నాకు మిక్కిలి ప్రియము . అయితే , నీ కోరికపై వెళుతున్నావు కాబట్టి సర్వవిధములా నువ్వు అతనిని ఆరాధించి తృప్తి పరచెదనని మాట ఇవ్వ వలెను . దానిని తు చ తప్పకుండా పాటించ వలెను . జాగ్రత్త ! అలాగని ప్రమాణము చేయి ’ అన్నాడు "
" చూచితివా ? నేను వెళ్ళకపోవడమే మంచిదైంది . నేను గనక అటువంటి ప్రమాణము చేసి ఉండినా , నా తుంటరి బుద్ధి నాచేత ఏదో ఒక చేష్ట చేయించి వెయ్యి చిత్రాలను ఒకే మసి పాడు చేసినట్లు చేసి , మద్దెల లాగా రెండు వైపులా వాయింపులు తినునట్లు చేసేది . ఇప్పుడు వాయింపు వస్తే , ఒకే వైపు . అదే లాభము . "
" నువ్వు అటువంటి పాడు ఆలోచనలు చేయవద్దు . ఇదిగో , ఇదే ఆ ఆశ్రమము అనిపిస్తున్నది . రా , సౌమ్యముగా ప్రవేశిస్తాము "
" నువ్వు ప్రసన్న వై ప్రసాదాన్ని కోరు దానివి . నువ్వు ముందు వెళ్ళు . నేను ఒక ఘడియ ఇక్కడే ఉండి , ఒకసారి స్నానము చేసి ఈ విహ్వలత నుండీ మనసును కుదుట పరచుకొని వస్తాను . "
ఘృతాచీ పెదాలు వీడకుండా ముసి ముసిగా నవ్వి , ఆమాటకు ఒప్పుకుని , తనతో పాటు నవ్వుతున్న వనస్థలి తో కలసిపోయినట్లు ఆ చెట్లు పొదలలో మాయమైంది .
రంభ , స్నానాదులు చేసి , తనను అలంకరించుకున్నది . అక్కడున్న ఒక శిలా ఫలకాన్ని తన ప్రభావము చేత నిలువుటద్దముగా మార్చి , అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది . అప్పుడే కురిసి గడ్డ కట్టిన శుభ్రమైన మంచు , ఎగిరి పోతున్న డేగ ఒకటి పట్టుకొన్న పావురపు శరీరము నుండీ , తనలో పడి ఇంకిన వేడి రక్త బిందువు యొక్క ఉష్ణానికి కొంత కరగిపోగా , ఆ రక్తాన్ని చుట్టూ వ్యాపింపజేసుకొని కొంచము ఎర్ర బడిన విధంగా , తెల్లటి మంచు ముద్ద వలెనున్న ఆమె శరీరము , కామరాగముతో ఎర్రనై , ఎర్రటి దంతపు బొమ్మ వలె ఆకృతి చెంది , ఎర్ర మందారపు వర్ణాన్ని అద్దుకొన్నట్లున్న ఆ పగడాల చీర తో పాటు సర్వమూ ఎరుపు మయము . . అపరంజిలో అద్దినట్లున్న కెంపు నగలు . అంతేనా , ఎర్రబడిన ఆ ముఖములో దిద్దుకున్న కుంకుమ బొట్టు కనపడాలంటే వెదకి చూడవలెను అనునట్లున్నది .
ఆ రూప దర్శనముతో తానే తృప్తి పడి , మద్య పానము చేత మత్తెక్కిన దానివలె విహ్వలయై , వేటను గురించియే చింతిస్తున్న వేటగానివలె ముందరి వ్యాపారాన్ని ఆలోచిస్తూ అద్దములో చూసుకుంటుండగా , తన వెనుక ఏదో కరాళాకృతి ఒకటి నిలచి ఉన్నది గమనించింది .
చివుక్కున వెనక్కు తిరిగి , " ఎవరు ? " అంది
" నేను భైరవుడిని . ఈ ధర్మారణ్యపు పాలకుడిని నేను . "
" నా వద్దకు ఎందుకు వచ్చినావు ? "
" ఆశ్రమములో నడచు కార్యములకు నీవలన విఘ్నములు అవుతాయి . నువ్వు ఆశ్రమము లోనికి రాకూడదు అని చెప్పుటకు "
" నీ ఆజ్ఞ ను మీరి లోపలికి వెళ్ళిన ? "
" అనర్థమవుతుంది "
" నేను భగవానులను చూచియే తీరాలి "
" అది సాధ్యము కాదు "
" కారణము ? "
" కామమొకటే జీవనపు లక్ష్యము అనుకొని , ఈనిన పులి వలె వేటాడి తినుదానివి నువ్వు . నీకు ఆ ధర్మమూర్తి దర్శనమెలా అవుతుందనుకున్నావు ? "
" ఆతడే కావాలంటే ? "
" అప్పుడు నీ కామ వాసనే నిర్మూలమవుతుంది . "
" నేను దేవతను . ఎక్కడికి కావాలన్నా వెళ్ళవచ్చు "
" ఔను , ఇంద్రుడి అనుమతితో వచ్చి ఉంటే అది నిజము . దుడుకు వద్దు . నీ దూకుడుతో అనర్థానికి గురి కావద్దు . నేను ఆడ , మగ అని చూడకుండా, బ్రహ్మ కర్మకు అడ్డు వచ్చు వారిని ఎవరినైనా సరే , ప్రహారము చేయు వాడిని . వద్దు , వద్దు ."
రంభ లెక్క చేయకుండా ముందుకు కదిలి , ఆశ్రమపు భూమిలో ఒక కాలు పెట్టింది . ఇంకొక కాలు పెట్టేలోపు భైరవుని బడితె తగిలి , మహా శిలగా మారిపోయింది .
No comments:
Post a Comment