SHARE

Monday, July 23, 2012

49. " మంత్ర ద్రష్ట " నలభైతొమ్మిదవ తరంగం .



నలభైతొమ్మిదవ తరంగం .

     మరునాడు వామదేవ, విశ్వామిత్రులిద్దరూ మహర్షి నచికేతుని ఆశ్రమమునకు బయలుదేరి వెళ్ళారు . అక్కడి వారికి వీరిద్దరూ వస్తారన్నది తెలిసి ఉన్నట్టుంది , సాక్షాత్తు నచికేత భగవానులే వీరికోసము ఆశ్రమ వాకిటి దగ్గర వేచియున్నారు . బ్రహ్మవిద్యా సంప్రదాయాన్ని వెలికి తెచ్చినట్టి కర్తలలో ఒకరైన నచికేతుని ఆశ్రమంటే సామాన్యమా ? బ్రహ్మవిదులు , బ్రహ్మజ్ఞులు , బ్రహ్మిష్ఠులు, బ్రాహ్మణులు  అక్కడ లెక్కలేనంత మంది ఉన్నారు . అందరూ ఉపనిషత్ పారాయణము చేస్తూ వీరికై ప్రతీక్షిస్తున్నారు . 

     ఆకాశ మార్గములో వచ్చి ఇద్దరూ ఆశ్రమపు ఉపాంతములో దిగారు . అక్కడున్న మృగ పక్ష్యాదులు సంభ్రమముతో వీరి రాకను ఘోషిస్తూ ఆశ్రమపు వాకిలి వరకూ వెంట తీసుకొని వచ్చాయి . అక్కడున్న చెట్లూ పొదలూ కూడా తమ కొత్త చిగురులను మెరిపిస్తూ కొత్త బట్టలను కట్టుకున్న ఆడ పిల్లల వలె వారికి స్వాగతము పలికాయి . పక్కనే ప్రవహిస్తున్న భాగీరథి కూడా తన మంజుల నాదముతో మంగళ గీతాలను ఆలపించింది . 

     భగవాన్ నచికేతులే ఇద్దరికీ అర్ఘ్య పాద్యాదులను ఇచ్చి , పిలుచుకొని వెళ్ళి వారిని అతిథి గృహములో ఆశీనులను చేశారు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాయి . మధుపర్క దానముతో అతిథి పూజ ముక్తాయించారు . 

     మిగిలిన అందరినీ వీడ్కొలిపి నచికేతులొక్కరే మిగిలారు . " అతిథులకు ఆయాసము లేనియెడల , స్నానానికి లేవవచ్చును " అని ఉపచార పూర్వకముగా వారికి స్నానాదులు కల్పించి , అయిన తర్వాత తమ అగ్ని గృహానికి పిలుచుకొని వెళ్ళారు . అక్కడ వామదేవుడి ని సాక్షిగా యుంచుకొని , " బ్రహ్మర్షులకు అగ్ని విద్య , బ్రహ్మ విద్య లలో ఏది కావాలనిన , దానిని తీసుకొన వచ్చును . సమ్మతమైతే రెంటినీ అంగీకరించ వచ్చును  . అయితే , ఉపదేశ పూర్వకముగా కాదు : దానముగా ! . యజ్ఞేశ్వర భగవానుల అనుజ్ఞ అయినది " అన్నారు .

     విశ్వామిత్రునికి ఆశ్చర్యము పైన ఆశ్చర్యము . భగవానులు తనకు వామదేవునితో సరి సమానముగా మధు పర్కాలను ఇచ్చినదీ , తనను బ్రహ్మర్షి యని సంబోధించినదీ అతనికి బ్రహ్మానందాన్ని కలిగించి , తన జన్మ సార్థకమైనదన్న కృత కృత్యతా  భావాన్ని తెచ్చిపెట్టాయి . అతనికి ఏమి మాట్లాడాలన్నదే తోచకుండా పోయింది . మూగవాడివలె కూర్చున్నాడు . అది చూసి , వామదేవుడే మాట్లాడాడు . 

     " భగవానులు త్రికాలజ్ఞులు . హృదయ గ్రంధి విఛ్చేదన సంప్రదాయాన్ని భగవాన్ వైశ్రవణుల నుండీ పొందిన మహానుభావులు . తమరు ఈ మహావిద్యలను ఇచ్చెదరను మాట మాత్రముననే ఈతడు తృప్తుడై ఆనంద పరాకాష్ట దశకు వచ్చాడు . ఇంక కావలసిన దేమున్నది  ? తమంతటి వారు ఇచ్చెదను అని సంకల్పించిన క్షణమే  ఆ విద్యలు ఈ పాత్రుడిని చేరి అనుగ్రహించాయి . కాబట్టి , ఏది కావాలి అని అతడిని అడిగి ఇచ్చుట కన్నా , ప్రదాతృలైన తమరే , తమకు అనుజ్ఞ అయినట్లు ఉభయ విద్యలనూ ఇచ్చి ఈతడిని అలంకృతుడిని చేయండి. " అన్నాడు . 

     భగవానునికి ఆ మాట సొంపుగా అనిపించింది . " వశిష్ఠుల శిష్యులకు కాక , ఇతరులకు ఈ వినయము ఎక్కడనుంచీ రావలెను ! మొత్తానికి వామదేవులు , " ఉభయ విద్యలనూ ఇవ్వండి , లోభము చేయకండి " అని అనుజ్ఞ ఇచ్చారు . అలాగే . వాశిష్ఠుల ఆజ్ఞ . ముఖ్యముగా భగవాన్ యజ్ఞేశ్వరుని కృప విశ్వామిత్రులకు అయాచితముగా వచ్చినపుడు , మిగిలినవి తమంతట తామే ఎందుకు లభ్యము కావు ? " అని విశ్వామిత్రుని ముఖమును చూశారు . 

     అతడు లేచి , చేతులు జోడించి , " నేను ఎంతైనా తమ అనుగ్రహపు వర్గము లో చేరిన వాడిని . తమ ఆజ్ఞను పాలించుటకు బద్ధుడను " అని నమస్కారము చేశాడు . 

     భగవానులు నవ్వుతూ అతడిని పట్టుకొని చిన్న పిల్లవాడిలా పైకెత్తి , " అగ్నిలో పెద్దదేది ?  , చిన్నదేది ? అన్ని వ్యత్యాసములూ అగ్ని అగువరకే . అయిన తరువాత ఏ భేదమూ లేదు . అక్కడ తారతమ్యాలు చూచుట కార్యానుగుణముగా మాత్రమే . అదుండనీ , గౌరవానికి మేము ఎంత పాత్రులమో , మీరూ అంతే పాత్రులు . తమరు కూడా గోత్ర ప్రవర్తకులవుతారు . అంతే కాదు , మంత్ర పతులూ , మంత్ర ద్రష్టలూ అవుతారు . వేదపురుషుడు తమనుంచీ అపారసేవను పొందుటకు వేచియున్నాడు . మేము భూతార్థపు బలము చేత గౌరవ పాత్రులమైతే ,  తమరు భవిష్యదర్థపు సంపత్తు చేత గౌరవార్హులు . " అని అభిమానముతో పలికి పక్కనే కూర్చోబెట్టుకున్నారు . విశ్వామిత్రుడు కూడా వినమ్రుడైన శిష్యుడు కూర్చొనునట్లే పక్కనున్న ఇంకొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . 

     నచికేతులు అనుసంధానము చేసి ’ నాచికేతాగ్ని ’ అన్న స్వనామ విఖ్యాతమైన అగ్ని విద్యను దానము చేశారు . యజ్ఞేశ్వరుడు కృపతో తన విశ్వ రూపమును ప్రకటించి ,  బ్రహ్మాండమునంతటినీ తాను ధరించిన మర్మమును చూపించి , యేయే లోకమేదో , ’ ఇది ఈ లోకము ’ అని నామ నిర్దేశ పూర్వకముగా చూపించి , " బ్రహ్మర్షీ , ఇప్పుడు నీకు ఈ విద్య అబ్బినది అన్న విషయము సావధానముగా తెలుసుకో . ఇకముందు ఈ మహానుభావుడి వలన బ్రహ్మ విద్యను కూడా పొందు " అని అనుమతి నిచ్చెను . 

     నచికేతులు , యజ్ఞేశ్వరుడు విశ్వామిత్రునిపై చూపించిన ఆదరమును చూచి పరమ సంతుష్టులై , " అయ్యా , ఇలాగున దేవతానుగ్రహమును సంపూర్ణముగా సాధించినవారే బ్రహ్మ విద్యార్హులు , అధికారులు . ఇంతటి వారు దొరికినపుడు వారికి విద్యా దానము చేయకుండిన , మేము ఋషి ఋణమును తీర్చనట్లే . ఈ దినము నేను కూడా కృతార్థుడ నయినానని అనిపించుతున్నది . మీ అంతటి అధికారులు జన్మలో ఒక్కరైనా దొరుకుతారో , లేదో " అని మనఃపూర్వకముగా పొగడుతూ ఆచమనము చేసి మరియొక విద్యను ఇచ్చుటకు సంసిద్ధులైనారు . 

     విశ్వామిత్రుడు కూడా ఆచమనశుద్ధుడై విద్యా గ్రహణమునకు సంసిద్ధుడైనాడు . వారు ప్రణవోచ్చారణ చేస్తుండగానే విశ్వామిత్రునికి దేహమంతా ఏకాగ్రత కు వచ్చి , తాను పండులోపలి గింజ వలెనే , దేహము నుండి ప్రత్యేకమైన వాడు అన్న అనుభవము వచ్చింది . శాంతి పాఠమును పఠించుతుండగానే దేహములోని సర్వాంగముల యందూ అమృతప్రవాహము జరిగినట్లై , వాటికి ఒక కొత్త జీవము వచ్చినట్లై , బ్రహ్మ విద్యను ధరించుటకోసమే నవ నూతనమైన చేతనమును వహించినట్లాయెను . 

     నచికేతుల ముఖము నుండీ వెడలినది కేవలము శబ్దములు  కాదు  : అయః పిండముల వలె ( పూర్వ సుకృతము వలన వస్తూ  తిరుగునట్టి అంకురములు  ) విశ్వామిత్రుని హృదయమున దిగి , దేహములో ఇల్లు కట్టుకొని కూర్చొని , అతని వాక్కులను పల్లవింపజేసి పెంచినవి . ఏదో ఒక , కొత్తగా కనిపిస్తున్నా కూడ , ఇది పాతదే , తెలిసినదే అని అర్థమగుతున్నట్టున్న చైతన్యము తనలోపలికి చేరి , అక్కడ వున్న చైతన్యమును జాగృతము చేసి దాన్ని లోకము నందు  అంతటా పరచుతున్నట్లు అయినది . ఘనముగా , ఒక పిండము వలె ఉన్నట్టి ’ తాను ’ అను ఒక భావము అగ్ని పుటము వలన ధూమమైనట్లు లోక లోకాంతరముల నన్నిటా , బ్రహ్మాండ బ్రహ్మాండముల నన్నిటా వ్యాపించినట్లాయెను . తాను గుహలో ఏకాంతముగా కూర్చొని ప్రాణాగ్ని పంచక దర్శనాది వ్యాపారమగ్నుడైనపుడు , ఋత్త్విజుడై తన నుండీ లేచి వెళ్ళి స్నానాహ్నికములను చేసి వస్తున్న ఆ రూపము ఇప్పుడు ఇంద్రియ గోచరమైనట్టు సూక్ష్మముగా బ్రహ్మాండమునంతా ఆవరిస్తుండుటను , తాను వెనుక దర్శనము చేసిన కాల పురుషుని వ్యాపించి , అతనిని ఛేదించుకొని అతని లోపలా బయటా వ్యాపించి , అతనిని ఒక శిశువు వలే ఎత్తుకొనుటను ఆ మహానుభావుడు చూచెను . 

     విశ్వామిత్రునికి జాగృదవస్థ లో నడుస్తున్నట్టే అవుతున్న ఈ వ్యాపారమంతా , వామదేవునికి కలయై కనిపిస్తున్నది . దేశకాలములన్నీ హ్రస్వములై వాటి బయటనున్న ఏదో ఒక పదార్థము బ్రహ్మాండమునంతటినీ వ్యాపించి దాన్ని ధరియించి నట్లూ , ఆ ’ నేను ’ అన్నది ఆ పదార్థపు అంశమై తానే కావాలని ఏరి కోరి ఆకాశ కోశాన్ని చేరుకొని ఉన్నట్టూ భావన కలిగింది . 

     నచికేతులు విద్యా దాన కర్మను సాంగముగా నెరవేర్చారు . విశ్వామిత్రుని వలెనే , వామదేవుడు కూడా ప్రకృతి లో నిండిపోయాడు . నచికేతులు వారిద్దరి సామర్థ్యమునూ చూచి మిక్కిలి సంతోషముతో , " అయ్యా , మా గురువులు ఈ దినము సంతుష్టులయినారు . వారు నాలో ఉంచిన ఈ నిక్షేపము ఈ దినము సత్పాత్రలో వినియోగమై వారి సంకల్పము ఈడేరినది అని నేను కూడా కృతార్థుడనయ్యాను . ఇప్పుడు మీకు దర్శనమయినది జ్ఞాత్యుడు. దేహ దేహములయందూ కూర్చొని కార్యమును నడిపిస్తున్న ప్రత్యగాత్మ ఇతడు . ఇకపైన దీనిని వృద్ధి చేసుకొని వ్యష్ఠి , సమిష్ఠులలో ఆత్మ దర్శనము చేసి కృతార్థులు కండి " అని ఆశీర్వదించారు . 

2 comments:

  1. అయ్యా , నమస్కారం ఈ రోజు సుదినం , పితృ తర్పణం వ్యాసం ద్వారా మంత్ర ద్రష్ట " నలభైతొమ్మిదవ తరంగం చదువుట జరిగినది , కఠోపనిషద్ తరువాత నచికేతుల ప్రస్తావన ఇందు వున్నది . బ్రహ్మవిద్య , అగ్ని విద్య వివరములు వున్నవి , విషయం పరిజ్ఞానమునకు తోడ్పడే గలవు . రేపు ఆబ్దికం వున్నది కర్తగా నా కర్తవ్యము , అందులో భాగముగా ఈ రోజు సాయత్రం కఠోపనిషద్ పారాయణం చేయు చుండగా ఈ భగ్యము కలిగినది , నమస్కారముళ్లతో - సత్యం ఓరుగంటి

    ReplyDelete
  2. చాలా సంతోషం, సత్యం గారు

    ReplyDelete