మరునాడు ప్రాతఃకర్మలను తీర్చుకుని విశ్వామిత్రుడు ఏ పనీ లేక ఊరికే కూర్చున్నపుడు వామదేవుడు అగ్ని గృహానికి పిలిచాడు . " మునీంద్రులు దయ చేయవలెను . అగ్నిదేవుని యనుజ్ఞ అయినది . తమరు వైశ్వానర విద్యను స్వీకరించవలెను . "
విశ్వామిత్రుడు ఆ మర్యాద మాటలను విని నవ్వుతూ , " అటులనే . వామదేవ మహర్షులు అనుగ్రహించి అగ్ని రహస్యాన్ని బోధించవలెను . మైత్రితో అప్పుడు రుద్ర విద్యను ఇచ్చి సాత్త్వికుడిని చేసినారు . ఇప్పుడు ఈ వైశ్వానరాన్ని అనుగ్రహించి నన్ను బ్రాహ్మణుడిని చేయవలెను " అన్నాడు .
" నువ్వు బ్రాహ్మణుడివి కావని నీకు ఎవరైనా చెప్పినారా ఏమి ? "
విశ్వామిత్రుడు , " ఆ విషయాన్ని తరువాత ప్రస్తావిస్తాను . ఇప్పుడు తమరు అభిముఖులై యున్నారు . తమరే అగ్నియై కూర్చొని నాకు వైశ్వానర విద్యను కరుణించునట్లు కానివ్వండి . " అని చేతులు జోడించాడు .
వామదేవుడు సమాహిత చిత్తుడై కూర్చున్నాడు . హోమము చేసి అగ్ని దేవుని అనుమతి పొంది వైశ్వానర విద్యను దానము చేశాడు . విశ్వామిత్రుడు గ్రహించాడు . అగ్నిదేవుని అనుగ్రహము వలన ఆ విద్య అతనికి ఒప్పింది . అతనికి అగ్ని సాక్షాత్కారమైనది . ఆనందములో మైమరచాడు . ఆ యజ్ఞేశ్వరుని దయయే వాక్కుగా మారి ప్రవహించి మంత్రమైనది . వైశ్వానర సూక్తమొకటి తొమ్మిది మంత్రములతో కూడినదై తీగకు పూయు పువ్వు వలె సహజముగా సుందరమై ప్రకటమైనది .
వామదేవునికి ఆశ్చర్యము . భరతుల కుల దైవమూ , తన ఇష్టదైవమూ అయిన యజ్ఞేశ్వరుడు తన మిత్రునికి కూడా ఒద్దిక అయ్యాడని అతని సంతోషానికి అంతే లేదు . బహు రహస్యముగా ఉండి , జాత శుద్ధులని ప్రసిద్ధులైన బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన ఈ విద్య ఉపదేశ మవుతుండగానే ఈ కౌశికునికి ఫలించినది కదా అన్న ఆనందము అతనికి అంతా ఇంతా కాదు .
జాతదేవుని అనుగ్రహము చేత జాతవేదుడే అయి కూర్చున్న మునీంద్రుని యథోచితమైన ఉపచారములతో సత్కరించి , ముందరి కార్యమేమిటని వామదేవుడు వినయముతో ప్రార్థించాడు . జాత వేదుడు , " రేపటి రోజు నచికేతుని ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఋషి పరిషత్తును పిలిపించు . అక్కడ జరుగుదానిని చూచి సంతోషించండి " అని అనుజ్ఞ ఇచ్చి ఉప శాంతుడయ్యాడు .
విశ్వామిత్రునికి జాగృతావస్థ కలిగింది . అలా మెలకువ అగుతున్నంతలోనే తన దేహమునుండీ సుందర జ్వాలా మాలలు ప్రసరించుచున్నట్లు భావమైంది . " వామదేవా ! ఇదేమిటిది ? " అన్నాడు .
వామదేవుడు నవ్వుతూ చెప్పాడు , " అగ్నిహోత్రులవారు అగ్నియే అయ్యారు . ఇప్పుడు ఏమిటి అని అడిగితే నేనేమి చెప్పాలి ? నువ్వు రుద్రుని అనుగ్రహాన్ని పొందావు . తరువాత ఆపోదేవి అనుగ్రహాన్ని సంపాదించి ఆ రుద్రుని శంకరుడిగా చేసుకున్నావు . ఆ శివుడి కృప వలన స్వర్గము నీ ఇంటి వాకిలికే వచ్చి కర్మజ దేవతవయ్యావు . ఆ రుద్రుని అనుగ్రహమే ముందుండి నీకు ప్రాణ దర్శనాన్ని చేయించింది . దేహములోనున్న పంచభూతములూ శుద్ధమై అన్నీ శాంతమై తేజోమయాలయ్యాయి . స్థాలీ పాకము వలన ప్రాణాపానాదులు ప్రసన్నమైనాయి . ఇప్పుడు వైశ్వానర విద్యను పొంది బృహత్ప్రాణ మండలమే పరిశుద్ధమైనది . ఇప్పుడు తేజోమయ మూర్తివైనావు . ఇంతవరకూ స్థూల చక్షువులకు కనపడని తేజస్సు ఇప్పుడా స్థూల చక్షువులకు కూడా కనపడునట్లాయెను . ఈ తేజస్సు ఇప్పుడు ప్రస్ఫుటమై నీ క్షేత్రమైన ఈ దేహములో ఉన్న పంచ భూతాలలో జ్ఞాతాజ్ఞాతముగా , స్వయంకృతంగా సంభవించిన మల మాలిన్యాలనన్నిటినీ దహిస్తున్నది . అందువలననే నీ స్థూల చక్షువులకు అలాగ కనపడుతున్నది . ఆ భూత పంచకము నిర్మలమవుతున్న కొలదీ ఇది కూడా మరలా శాంతమై శమీ యందున్న తేజస్సు వలె అంతర్హితమవుతుంది . "
విశ్వామిత్రుడడిగాడు , " ప్రాణాగ్ని పంచక దర్శనమయినపుడు తేజో వికిరణమయినది కదా , అదేమిటి ? "
’ అది , భూతముల తన్మాత్రలలో ప్రాణ సంచారమగుట యొక్క లక్షణము . తన్మాత్రల వలననే ప్రాణాలు పుట్టినవి . అయిననూ , జన్మము వలన కానీ , మణిమంత్రాది కర్మల వలన కానీ ఈ ప్రాణాలు బహిర్ముఖ వృత్తిని వదలి అంతర్ముఖమైనపుడు భూతములలో కూడా ప్రాణ సంచారమవుతుంది . అప్పుడు ఆ భూతాలు తేజోమయ మూర్తులవుతాయి . తేజస్సు యొక్క స్ఫురణ వాటికి కూడా లభించి , భూత భూతములూ ప్రాణ మయము లయినట్టు వ్యాపారములు సవ్యముగా జరుగును . అప్పుడు ఏ దేహములో ఇదంతా జరుగుతున్నదో ఆ దేహము విప్రుడవుతుంది . అలాగ నువ్వు విప్రుడవగుట వలననే నీకు అగ్ని రహస్యము తెలిసినది . ఇక నచికేతాశ్రమమునకు వెళ్ల వలెననీ , అక్కడ ఋషి పరిషత్తును పిలవాలనీ అనుజ్ఞ అయినది . అక్కడ ఏమేమి విచిత్రాలు జరుగునో ! ఇలాగ నువ్వు విప్రుడగుటను చూచియే , " నువ్వు బ్రాహ్మణుడివి కావని నీకు ఎవరు చెప్పారు ? " అని నేను అడిగినది ! "
" మేనకను నేను అడిగినపుడు ఆమె , ఈ నీ పుత్రిక ఎవరిని వరిస్తుందో అదే కులము నీది కూడా అన్నది . పురూరవాశ్రమము లో ఉన్నపుడు , ’ ఆ కన్య దుష్యంతుని వివాహమాడినది ’ అని వార్త వచ్చింది "
" అవును , మేనక గర్భధారణ చేసినపుడు నీలో ఇంకా క్షత్రియాంశము ఉండినది . అదీ మంచికే , కర్మఠులు ఏ స్వర్గము కోసము పగలూ రాత్రీ హోమ , ఇధ్మా దానాది ఇష్టాపూర్త కర్మల వలన పుణ్యమును సంపాదిస్తారో , ఆ స్వర్గమే నీ చెంతకు వచ్చింది కదా ! నువ్వు క్షత్రియుడవు కాకుండా బ్రాహ్మణుడవయి ఉంటే అది సాధ్యమయ్యేదేనా ? "
" ఎందుకు , బ్రాహ్మణుడనయి ఉంటే స్వర్గ సుఖమును అనుభవించుటకు లేదా ఏమి ? "
" పిచ్చి వాడా , కర్తృత్వ భోక్తృత్వములు రెండూ పరులవి అని తెలుసుకో . లోకాను గ్రహము కోసము తనవి కాని ఆ రెంటినీ వహించి , ఈ లోకానికి వచ్చి వెళ్ళు దేవతలందరికీ తన దేహములో అవకాశము ఇస్తూ , ఏ విధమైన మోహాలకూ పరవశుడు కాకుండా ఉండువాడు బ్రాహ్మణుడు . అంతటి బ్రాహ్మణుడవై నువ్వు స్వర్గ భోగాలను అనుభవిస్తావా ? సాక్ష్యము కావాలన్న , చూడు . భార్గవులు జాతి బ్రాహ్మణులైననూ , భోగ పరాయణులు అని వారికి క్షత్రియుల వలన హాని జరిగినది . దానికి విరుద్ధముగా , వశిష్ఠులు భోగపరాయణులు కానందున , సంకల్పాలను సన్యసించిన వారైనందున , మహా క్షత్రియుడవైన నువ్వు వారి పై దండెత్తుటకు పోయి , ఓడిపోయి , నీ క్షాత్రాన్నే బలి ఇచ్చి నువ్వూ బ్రాహ్మణుడవైనావు . కాదా ? చెప్పు . "
వామదేవుడు ఇంకా కొనసాగించాడు , " నీలో ఉండిన భోగ ప్రవృత్తి అంతా తపశ్శుద్ధమై పిండమై , పరిశుద్ధ క్షాత్ర తేజోధనియై బిడ్డ కలిగింది . ఆమెకు చంద్రవంశ ప్రతిష్ఠాపకుడైన మహా పురుషుడు , చతుస్సముద్ర ముద్రితమైన భూమండలములో ఇక ధర్మ వ్యవస్థను సంస్థాపించగల మహా చక్రవర్తి పుట్టిఉన్నాడు . అటుల నీ క్షాత్ర తేజస్సు పిండమై తన గర్భానికి వచ్చినదని తెలియని మేనక నువ్వడిగిన ప్రశ్నకు ఏమని ఉత్తరమివ్వాలి ? అదీకాక , నీకోసము మానవ ధర్మాన్ని అంగీకరించినది ఆమె . మానవ దేహములో ఆపః పృత్వీ భూతాలు రెండూ బలమై ఉండి , తేజస్సు అణగి ఉండినందువలన , దేవతా దేహములో కనిపించు సిద్ధులు ఆ క్షేత్రములో చూచుటకు తపస్సు కావలెను . ఆమె వెళ్ళిపోవునపుడు నిదానించి చూసి చెప్పవలసినది . కానీ ఆమెకు వెళ్ళిపోవలెనను ఆత్రము . "
" ఆ నచికేతుడు పరమర్షి . సాక్షాత్ వైశ్రవణుని నుండీ అగ్ని విద్య , బ్రహ్మ విద్యలు రెండింటినీ సంపాదించిన మహానుభావుడు . అతని ఆశ్రమములో ఇంకా ఏమేమి విచిత్రాలు కాచుకొని ఉన్నాయో ! . వెనుక నీ పూర్వజులలో ఒకడైన సింధూ ద్వీపుడూ , మీ వంశానికి చెందిన దేవాపి కూడా బ్రాహ్మణ్యాన్ని సంపాదించి బ్రహ్మర్షులైనారు . కానీ వారి జీవితములో ఇన్ని విచిత్రాలు జరగలేదు . నువ్వు మహా పురుషుడవు . మాతా పితృ వంశాలు రెండూ ఉద్ధరింపబడినాయి .
adbhutamaina gramtharaajaanni amdistunnaaru dhanyavaadamulu
ReplyDelete