ముప్పై ఎనిమిదవ తరంగము
దంపతులు నిర్విషయానందాన్ని పొందినవారి లాగా దేశ కాలాలను మరచి , ఎక్కడో , ఎందులోనో లీనమై పోయినా , జగత్తు కాలాన్ని మరవలేదు . సూర్య భగవానుడు ఎప్పటిలాగే అహస్కరుడై తూర్పు దిశను అలంకరించు సువేళ అయినదని కోడి జగాన్ని హెచ్చరించింది . యోగి , భోగులిద్దరికీ సమంగా ప్రియమైన ఆ సమయం లో నిద్ర లేచిన విశ్వామిత్రుడు కాంతా దేహపు గాఢాలింగనము ఇంకా సడలిపోక , దాన్ని అలాగే అనుభవిస్తూ మెలకువ వచ్చినా కన్ను తెరవక , " దిన దినమూ ఇష్టాపూర్తి కర్మలను చేయుట దీనికోసమే కాదా ? స్వర్గపు వేశ్యాంగనల భోగము కోసమే కదా ? అవే ఇక్కడికి వచ్చాక , ఈ కర్మల కష్ట నిష్టూరాలెందుకు ? " అని ఏమేమో ఆలోచిస్తున్నాడు . అతని ఇంకొక మనసు , ’ నీకు కర్మలు అవసరము లేదు . కానీ లోక రక్షణ భారమును వహించిన వారికి అవసరమే కదా ? నీ వంటి వారే కర్మ సన్యాసము చేస్తే లోకపు గతి ఏమి ? ’ అంటుంది . చివరికి ఇలా సిద్ధాంతము చేసుకున్నాడు , ’ ఈమెకు వరము నిచ్చాను . ఈమె సహవాసము నాకు కూడా కావాలనిపిస్తుంది . నా మిత్రులైన దేవతలకు కావలసిన బలి మొదలైనవి సకాలానికి అందకపోతే వారికి ఇక్కట్లు తప్పవు . అలా జరగకుండా , నా తపోబలము నుండీ హవిర్భాగాలు వారికి సకాలానికి అందునట్లు చూడాలి . ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంకొంత కాలము నిరాటంకముగా దాంపత్య సౌఖ్యమును అనుభవించుటకు అనుకూలము కావాలి . " ఆ సిద్ధాంతము రూపు చెందుతున్నంతలోనే మూసుకున్న కళ్ళకి మరలా నిద్ర వచ్చింది . లేదా , వచ్చినట్టైంది . అందులో ఒక చిన్న కల:
ఆ కలలో మరలా మోహిని యైన మేనక మోహ ప్రసాదాన్ని వేడుటకు వ్రతము చేసింది . ప్రసన్నుడై విశ్వామిత్రుడు వరము నిచ్చుటకు చేయి చూపుతున్నాడు . దేవతలందరూ విషణ్ణులై , దీనులై తమకు న్యాయంగా చెందవలసినది ఏదో తప్పిపోయినట్లు , చప్పిడి ముఖాలు వేసుకుని నిలుచున్నారు . అప్పుడు కౌశికుడు , " లేదు , లేదు , ఇదిగో , మీది మీకే , ఈమెది ఈమెకే " అని ఏమో భాగములు చేస్తాడు . దేవతలు సంతోష పడి , నీ తపస్సు అక్షయమగు గాక అని ఆశీర్వదిస్తారు . మేనక సంతోషముతో తేలిపోయి నట్టవుతుంది . వెనక నుంచీ ఎవరో ముసలి వారు ఒకరు , వెనకటి కల్పము వారు , అనేక కల్పాల తెరలను తొలగించుకొని వచ్చినవారి వలె ఎదురుగా వచ్చి " సిద్ధం సాధ్యాయ కల్ప్యతే " అని గర్జిస్తారు . దేవతలు ఆ భవ్య మూర్తి ఎదురుగా వినమ్రులై నిలచి , మా రహస్యాన్ని నువ్వొక్కడవు ఛేదించినది చాలదా ? అని వేడుకుంటున్నారు . ఆ మహా పురుషుని గర్జన , దేవతల ప్రార్థన , వీటి మధ్య హవిస్సును ఎత్తి అగ్నిలో వినియోగించు దీక్షితుడి లాగా , విశ్వామిత్రుడు మేనకను విసర్జనము చేస్తాడు .
కలలో అలా అయినట్లే నిజంగా మేనకను దూరంగా చేత్తో తోసి , ఆ చేతికి ఏమో అయినట్లై అతడికి మెలకువ వచ్చింది . మేనకకు కూడా ఏదో కల. పలవరిస్తున్నది . స్పష్టాస్పష్టంగా ఉన్న మాటలు కౌశికుని కుతూహలాన్ని ఇనుమడించాయి . " ఊహూ , ఒక సంవత్సరము " ’ లేదు , లేదు ’ ’ అలాగైతే నాకు మీ స్వర్గమే వద్దు ’... మేనకకు మెలకువైపోయింది . తనకన్న ముందే లేచిన పతిని చూచి అతడిని హత్తుకొని ఏడ్చింది .
అతనికి కుతూహలమై , ’ ఏమిటిది ? ఏమిటిది ? ’ అని ఓదారుస్తాడు . ఆమే పూర్తిగా మేలుకుని , " దేవా , నేను తొందర పడ్డాను " అంది .
" ఏమి తొందర ? "
" నేను నీ మోహ ప్రసాదాన్ని కోరి , దాన్ని పొందుట మానవధర్మము కదా . ఈ ధర్మాన్ని ఆశ్రయించి మానవ స్త్రీని అయ్యానని దేవతలు నాపై కోపగించారు "
’ దాని ఫలితము ? "
" నాకు స్వర్గవాసాన్ని నిరాకరించవచ్చు . ఇంకా కోపమయితే , సంతోష పడు శక్తిని లాగివేసుకొని , నిత్య దుఃఖినిని గా చేయవచ్చు . "
" అలాగైతే ఇప్పుడు వారి కోపము ఏ ఫలాన్నిచ్చింది ? "
" ఈ మానవ ధర్మాన్ని వదలి , వెంటనే వెనుకకు తిరిగి రావాలని వారు , రానని నేను . చివరికి ఒక మాసము , ఒక ఋతువు , ఒక ఆయనము అని పెంచుకుంటూ పోయి అంతిమంగా ఒక సంవత్సరము పాటు ఇక్కడ ఉండి , ప్రేమ ఫలాన్ని నీకు అప్పజెప్పి , వెనుకకు రావాలని తెలియజేశారు . "
" మరి , నాకు మీ స్వర్గమే వద్దు అన్నావు కదా ? అదేమిటి ? "
మేనక ఎండా వానా కలసినట్లు , అశ్రువులు రాలుతున్న నవ్వుతో చెప్పింది. ఆ ముద్దు , ఆ మోహము , ఆ చెలువము , ఆ సుఖము..అన్నిటినీ పలికించు ఒక ముత్యము , కౌశికుని దేహము , మనసు , బుద్ధులలో ఆనంద తరంగాలను రేపుతుండగా " చెప్పే తీరాలా ? " అంది . బ్రతిమాలితేనే చెప్పేది అన్న అర్థము ధ్వనించగా , ముఖ ముద్రలో , అంగ భంగిమలో స్పష్టముగా కనిపించింది .
కౌశికుడు జిగ జిగా మెరుస్తున్న ఆ రసికత్వపు కొంటెతనాన్ని ఆమెకే పంపుతూ , " నీకు చెప్పాలని లేకపోతే వద్దు . కష్టమైతే కూడదు . ఆయాసమైతే దాన్నలాగే ఉంచు " అని పలికాడు. మాట వద్దంటున్నా , " చెవులు చేటలు చేసుకుని వింటాను : చెప్పకపోతే పీడిస్తాను . ఏమైనా కానీ , చెప్పే తీరాలి " అని ఆమె నడుమును పట్టుకొని ఉన్న అతని కుడి చేయి అంటున్నది .
పైకి కాదన్నా , కావాలి-వద్దు అన్న మనో భావాన్ని చూచిన మేనక మురిసిపోతూ , ప్రియుడి ముంగురులు సవరిస్తూ , " స్వర్గములో దొరకని వస్తువొకటి దొరికింది . దాన్ని వదలి వచ్చేయి అన్నారు . రానన్నాను . స్వర్గవాసాన్ని తప్పిస్తాము అన్నారు . మీ స్వర్గమే వద్దు అన్నాను , అంతే ! " అంది .
కౌశికునికి సంతోష సాగరములో తానొక కలకండ ముక్కలా కరగిపోతున్న భావన కలిగింది . ఏమి చెప్పాలో తోచక , " ప్రేమ ఫలమంటే ఏమి ? " అని అడిగాడు . మేనక స్త్రీ సహజమైన సిగ్గును పక్కకుపెట్టి , ఒక ముద్దు ఇచ్చి , " ఒక బిడ్డ " అంది .
" ఎలాంటి బిడ్డ? "
" ఆడ పిల్ల "
" ఆడపిల్లే ఎందుకు ? "
" భార్యకు మోహము ఎక్కువైతే ఆడపిల్ల . భర్తకు మోహము ఎక్కువైతే మగ పిల్లవాడు "
కౌశికుడు ఏమీ పలుకలేక , భావశూన్యుడై మోహపూరితమైన మనసుతో పడతి ఒడిలో చేరాడు . ఆమె వద్దనలేదు .
No comments:
Post a Comment