నలభై ఒకటవ తరంగము
విశ్వామిత్రుడు ఒక్క ఘడియ ధ్యానములో ఉండి , పరశురాముని మాటకు ప్రత్యుత్తరము ఇవ్వకనే బయటికి వచ్చి పారిజాతపు నీడలో రాతి పానుపు పై కూర్చున్నాడు . సమాహితమైన మనసుతో స్తబ్దుడై మహా సముద్రము వలె ఉన్న అతని పాదాల దగ్గర , ఏక కాలము లో అనేక జంఝా మారుతాలు వీస్తుండగా క్షుబ్దుడై , తన ప్రాణమానాలను ఎత్తుకొని పైకి పోతున్న మేఘాలను పట్టుకోడానికి పైకి చేతులు చాచాడా అన్నట్టు , ఆకాశపు ఎత్తుకు ఎగసి విసరుతున్న అలలను కలిగిన సముద్రుడిలా , పరశురాముడు కూర్చున్నాడు .
విశ్వామిత్రుడు అడిగాడు , " రామా , నువ్వు నన్నేదో అడగాలని వచ్చావు ? ఎందుకు ? "
" మా కులదేవతలందరూ ముక్త కంఠముతో అంగీకరించారు , అయినా మేమంతా ముక్కు చివర కోపాన్ని కట్టుకున్న వారము . అది చాలదన్నట్టు అగ్ని భక్తులము . భార్గవులంటే కారణము లేకుండానే కోపగించువారు అని మాకు అపప్రథ వచ్చింది . నువ్వైతే ఆపో దేవి భక్తుడవు . నీ శాంతి మాకెక్కడిది అని అందరూ నీకు చెప్పి ఈ కార్యమును చేయుట మంచిది అని అంటున్నారు . మా కులమంతా తన తేజస్సునూ , తన తపస్సునూ , తన వర్చస్సునూ నాకు ఇచ్చింది . అస్త్రాస్త్ర సంపన్నులైన ఆ దుష్ట క్షత్రియుల నుండీ నాకేమీ భయము లేదు . వారి వారి అకార్యాలే వారిని చంపుతాయి . నేను నిమిత్త మాత్రుడిని . మామా , నన్ను చూస్తే చాలు , నా హుంకారమును వింటే చాలు, నేను ఈ గండ్ర గొడ్డలిని ఎత్తితే చాలు , వారు చచ్చి ఊరుకుంటారు . ఇలాగ అప్పుడే మృత్యు వశులైన ఆ ఖలులను వారి కంఠపు వేడి రక్తము కోసము మాత్రమే నేను చంపాలి , అంతే ! భార్గవుల తేజస్సంటే , సామాన్యము కాదనీ , సంకల్ప మాత్రము చేతనే లోకాలన్నిటినీ దహించి వేయగలదనీ తెలుసుకుంటారు . అయినా , పెద్దల మాట ప్రకారము నీకు అంతా చెప్పి నిన్ను ఒప్పించడానికి వచ్చాను . ఈ దొంగలు , అబద్ధాల కోరులు , పర ద్రవ్య అపహర్తలు బ్రాహ్మణుడి తేజస్సును కూడా చూడనీ " అని పళ్ళు పట పట కొరికాడు .
ఆ తేజో విజృంభణమును చూచి విశ్వామిత్రునికి ముచ్చటైంది . తన వెనకటి రూపము గుర్తొచ్చింది . వీడు నిజంగా బ్రాహ్మణుడేనా అనిపించింది . జమదగ్ని చెప్పినదంతా జ్ఞాపకము వచ్చింది . దానితో పాటు ఆనాడు వామ దేవుడు హిమవన్నగ చరియల వద్ద చెప్పిన భవిష్యము కూడా జ్ఞప్తి అయింది . " సరే , కాలము సమీపించింది . కావలసిన కార్యము నేను ఆపితే నిలుస్తుందా ? " అనుకొని , " ఊ , అలాగే కానీవయ్యా , కానీ జాతి క్షత్రియులు లేకుంటే భూమి దాస్యముతో నిండి పోతుంది . కాబట్టి వారిని వదలి , దుష్టులను మాత్రమే సంహారము చేయి " అన్నాడు .
" క్షత్రియుడొకడు ఎదురు వస్తే వాడు దుష్టుడా , శిష్టుడా అని ఎలాగ మామా, కనుక్కొనేది ? "
" అదేమీ కష్టము కాదు . శిష్టులు ఎప్పుడూ సంప్రదాయబద్ధులు . నిన్ను చూచి మధు పర్కాన్ని ఇచ్చిన వాడు శిష్టుడు . "
" నేను సూతకములో ఉన్నాను కదా , మధుపర్కాన్ని గ్రహించుటెలా ? "
" నీది స్వేఛ్చా ప్రారబ్ధము . విధి విహితము కాదు . కాబట్టి , తానుగా వచ్చిన మధుపర్కాన్ని గ్రహించవచ్చు . "
" సరే , మామా , నీ అనుమతి దొరికింది , నేనిక బయలు దేరుతా . నువ్వు ఆతిథ్యమివ్వలేదే అనుకోవద్దు . నాకు ఇంకా ఏదో మంట మండుతున్నది కాబట్టి ఇప్పుడు ఆకలి లేదు . మంచిది , మామా , అక్కడ నీ పక్కన ఉండిన ఆ శిశువు ఎవరిది ? "
" దేవతలు ఇచ్చినది "
" ఆడా ? , మగా ? "
" ఆడ పిల్ల "
" మామా , కోపగించవద్దు , ఆ అమ్మాయిని మాత్రము క్షత్రియునికి ఇవ్వవద్దు . సద్బ్రాహ్మణుడిని చూచి ఇవ్వు . లేదా నాకు చెప్పు , భూప్రదక్షిణలో నీకు సరియైన అల్లుడిని వెదకికొని వస్తాను . "
విశ్వామిత్రుడు నవ్వాడు: " పువ్వు పుట్టినపుడే దాని గర్భములో కాయ ఉండదా ? అలాగే పుట్టి వచ్చిన ప్రతిదానితో పాటూ ఒక కనిపించని చేయి ఉంది , రామా . అది తెప్పను నడిపించు తెడ్డు లాగే జీవితాన్ని నడిపిస్తుంది . కాబట్టి , ఆ పాప సంగతి వదిలేయి , పైగా నువ్వు బయలు దేరినది మృత్యు దూతవై ! , కదా ? " అన్నాడు .
రాముడికీ నవ్వు వచ్చింది . గలగలా నవ్వి , " ఔనౌను , మృత్యు దూతను కావాలని మహర్షి అనుమతి అడగటానికి వచ్చాను . "
" నువ్వు పుట్టుటకు ముందే నీ తండ్రికి తెలుసు : అతని తల్లికీ తెలుసు : నాకూ తెలుసు : క్షత్రియ కులాంతకుడైన భార్గవుడొకడు పుడతాడని : పుట్టినావు . నీ పని నువ్వు చేయుటకు దైవము ప్రేరేపిస్తుంది . అలాగే , వెళ్ళి రా ! మంగళమగు గాక ! కానీ , పాప కార్యము . వీలైనంత తక్కువగా చేయి . "
" మామా , చివరగా ప్రాయశ్చిత్తము చేసుకుంటాను . వారి అంతమయ్యే వరకూ వేరే ఆలోచన లేదు . మొదట హైహయ మారణ హోమము . దాని అవభృతమవగానే దాని ప్రాయశ్చిత్తము కోసము ఇంకొక హోమము . " అని విశ్వామిత్రునికి నమస్కరించి , వీడ్కొని , బయలుదేరాడు .
జాతి క్షత్రియులు లేకుంటే భూమి దాస్యముతో నిండి పోతుంది
ReplyDelete