యాభయ్యవ తరంగం .
ఋషి పరిషత్తు నచికేతాశ్రమములో సమావేశమయినది . దూర దూరములనుండీ , ప్రసిద్ధులైన బ్రహ్మర్షి , మహర్షి , దేవర్షులంతా దయచేసియున్నారు . అందరూ మధుపర్కానికి యోగ్యులైనవారు . వేద పురుషుని అనుగ్రహము వలన అనేకానేక ఋక్సామములను ప్రత్యక్షముగా దర్శించి , పాడి , లోకోద్ధారకులైన వారు . వేద వేదాంగ పారంగతులు . అనేకములైన యజ్ఞములలో సోమపానము చేసి కృతార్థులైనవారు . ధర్మజ్ఞులై , బ్రహ్మ వేత్తలై తమ తపోబలము చేత బ్రహ్మాండమును ప్రళయము గావించి మరలా సృష్ఠించగల సమర్థులు . అందరికీ , " వశిష్ఠులు వచ్చియుండిన బాగుండెడిది . " అన్న ఆలోచనే ! వారు వరుణ లోకమునకు వెళ్ళియున్నారు . ఎప్పుడు వచ్చెదరో తెలియదు , వారికోసము వేచియుండుటకు కాదు .
భగవాన్ పిప్పలాదులు అధ్యక్షులు కావలెనని నచికేతులు సూచించారు . భగవాన్ యాజ్ఞవల్క్యులు దానిని అనుమోదించారు . భగవతి గార్గి , " ఈ ధర్మబ్రహ్మ పరిషత్తుకు అధ్యక్షులు అగుటకు భగవాన్ పిప్పలాదులు సర్వవిధములా అర్హులు " అని శ్లాఘించినది . సుమంతు , కహూళ , బభ్రు మొదలైన బ్రహ్మర్షులు తథాస్తు అన్నారు . పిప్పలాదుల అధ్యక్షతలో సభ మొదలైంది .
సభను సమావేశపరచిన నచికేతులు లేచి నిలచి , " పెద్దలకు నమస్కారము , పిన్నలకు నమస్కారము , సమానులకు నమస్కారము . ఈ రోజు మనము సమావేశమైనది , తపోబలము చేత బ్రాహ్మణ్యమును సాధించి , బ్రహ్మర్షి అగునట్టి విశ్వామిత్రుల బ్రహ్మర్షిత్వాన్ని అంగీకరించుటకు . ఈ సూచనకు సాధకబాధకములు , అభ్యంతర ఆమోదములు యేమి ఉన్ననూ సభముందు ఉంచుట మనందరి కర్తవ్యము . " అన్నారు .
భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి , " ప్రత్యక్షముగా విశ్వామిత్రులను చూచినది ఇదే మొదటిసారి . త్రిశంకు మహారాజును స్వర్గానికి పంపించిన మహానుభావులు వశిష్ఠులకు ప్రాప్తమైన పుత్ర శోకాన్ని తుడిచివేయుటకు కారణులైనవారు . బ్రహ్మర్షి యగుటకు ఈ రెండింటిలో ఏ ఒక్కటైననూ చాలు . అటువంటప్పుడు రెండూ ఉన్నపుడు మనము వెనుకాడుటకు ఏ కారణమూ లేదు . వీటికి తోడు , సింధూ ద్వీపుల వంశస్థులు , మరియూ వీరి తండ్రియైన కుశిక మహారాజు , చ్యవన మహర్షికి సేవలు చేసి బ్రాహ్మణ్యమును అనుగ్రహించమని వేడుకున్నాడు . అప్పుడు వారు ’ నీకు ఆ యోగము లేదు , నీ కొడుకు బ్రాహ్మణుడు కాగలడు ’ అని అనుగ్రహించారు . అందువలన , ఆ ఋషివాక్కును నెరవేర్చుటకే ఈ రోజు మనము చేరినది . అది నిరాటంకముగా , నిస్సందేహముగా కాగలదు . ధర్మ బ్రహ్మ పరాయణులైన నచికేతుల సూచనను నేను త్రికరణశుద్ధిగా ఆమోదిస్తున్నాను . " అన్నారు .
భగవతి గార్గి లేచి అన్నారు , " భగవాన్ నచికేతులు సూచించి , భగవాన్ యాజ్ఞవల్క్యులు ఆమోదించిన మీదట ఏదేమైననూ ఒక స్త్రీ గా నేను సమర్థించియే తీరవలెను . అయితే , బ్రహ్మర్షిత్వము ఒకరి , ఇద్దరి అభిమానము వలన వచ్చు పదవి కాదు . క్షత్రియుడై యుండిన ఇతడి దేహములోనున్న పంచభూత తన్మాత్రలన్నీ పరిశుద్ధమై సత్వగుణానికి వచ్చినవి అని పరీక్ష జరిగి సిద్ధాంతము కానివ్వండి . ఆ వెంటనే నేను ఒప్పుకుంటాను . " అన్నారు .
భగవాన్ పిప్పలాదులు లేచి నిలుచున్నారు . " సభకూ , సభికులకూ నమస్కారములు . భగవతీ గార్గి యంతటివారు అడిగిన ప్రశ్న సాధు సముచితమైనది . నేను ఈ అధ్యక్ష స్థానములో లేకుండా , అక్కడ సభలో కూర్చొని ఉంటే , నేను కూడా అదే మాట అడిగెడివాడను . బ్రహ్మర్షిత్వమంటే సామాన్యము కాదు . రేపటి దినములలో సప్తర్షుల స్థానమునకు పొందుటకు యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఆ పదవి . సప్తర్షుల స్థానమంటే సామాన్యమైనదా ? సృష్ఠికి వచ్చు ప్రతియొక్క ప్రజ పైననూ అధికారము చూపవలెను . సృష్ఠి కర్తయైన ప్రజాపతికి సహాయము చేయవలెను . కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న చాలా సాధుసమ్మతమైనది . ప్రతియొక్కరూ పర్యాలోచించి , నిర్దాక్షిణ్యముగా , నిష్పక్షపాతముగా అడగ వలసినవి అడిగి , వినవలసినదంతా విని , తర్వాత తీర్మానించవలసిన మాట ఇది . అధ్యక్ష స్థానములో ఉండి ఈ మాటలు ఆడినది తప్పైతే మన్నించవలెను " అని చేతులు జోడించి కూర్చున్నారు .
మహర్షి నోఢా లేచారు . " సభవారికీ , సభికులకూ , సభాపతులకూ నమస్కారములు . ఇక్కడ కూర్చున్న మనమంతా వేద పురుషుని అనుగ్రహము వలన మహర్షులమైన వారము . ఆ వేద పురుషుని సాక్షాత్కారము చేసుకొని , అతడు చెప్పినట్లే విందాము . మనము స్వతంత్రించుట వద్దు " అన్నారు .
భగవతీ విశ్వావరా లేచి నిలుచున్నారు , " సదస్సుకూ , సదస్యులకూ , సదసస్పతులకూ నమస్కారములు . వేద పురుషుని ప్రార్థించి అతని అనుజ్ఞ అయిన విధముగా నడచుకొనుట మనకందరికీ విహితమే . అయితే , భగవాన్ నచికేతులు సూచించిన తర్వాత , విశ్వామిత్రులకు వేదపురుషుని ఆజ్ఞ కాలేదు అని మనము భావించుట మనము వారిపై యుంచిన గౌరవమునకు తగినట్లు లేదు . మనము వేదపురుషుని పిలిచి యడుగుట యంటే , మనకు ఆవగింజంత కూడా స్వాతంత్ర్యము లేకుండా పోయినట్లే . బుద్ధిమంతులైనవారు , ప్రమాణములనూ , లక్షణములనూ ఆధారము చేసుకొని స్వతంత్రముగా సిద్ధాంతము చేస్తారు . అలాకాక , కేవలము యుక్తి వల్ల మాత్రమే సిద్ధాంతము చేస్తే , దానికన్నా ప్రబలమైన యుక్తి వచ్చినపుడు అనుతాపము చెందవలసి యుండును . కేవలము శృతి వచనము ప్రకారము సిద్ధాంతము చేస్తే , అప్పుడు , సందేహము నివారణ కాకపోగా , ప్రభువుల సమ్మతి వలన తప్పనిసరిగా నడచిన కార్యమని ఎప్పుడో ఒకప్పుడు శంకించ వలసి యుంటుంది . ఈ రెండూ వద్దు . కాబట్టి , ఈ సభ , ప్రమాణ లక్షణములను బాగుగా తెలుసుకొని , ఎవరైనా ఒకరిద్దరిని సభాముఖముగా ఉంచుకుని పరీక్ష చేయుట మంచిది . అని వినయముతో తెలియజేసి కూర్చున్నది .
మహర్షులూ , బ్రహ్మర్షులు అందరూ ఆమాటకు ఒప్పుకున్నారు . అందరూ , బ్రహ్మత్వమూ , ఋషిత్వమూ విశ్వామిత్రునికి ప్రాప్తమైనవి అని ఒప్పుకుని , అయినా పరీక్ష కావలెను అన్నారు . భారధ్వాజులు అన్నారు , " అక్కడ చూడండి , వేద పురుషుని పరమానుగ్రహము లేకపోతే ముఖములో ఆ తేజస్సూ , వర్ఛస్సూ ఉంటుందా ? మనమేమి , పామరులమా ? దేవతలను సాక్షాత్కరించుకొని వందలాది యాగములయందు భాగము వహించిన మనకు తెలియకపోతే , ఇంకెవరికి తెలుస్తుంది ? "
గౌతములు అన్నారు , " అగ్ని రహస్యము తెలియనివారికి ముఖములో ఈ కాంతి యుండుట అసాధ్యము . "
భార్గవులు అన్నారు , " గౌతముల మాట నిజము . అగ్ని మా కులదైవము . అగ్ని విషయము నేను తెలిసినవాడను . ఇతడు నిజముగా బ్రహ్మర్షి యైనాడు . "
ప్రతి ఒక్కరూ , " సభాపతులే పరీక్షా కార్యమును నెరవేర్చవలెను . మరుసటి రోజు సభలో వారు జరిపిన పరీక్ష ఫలితాంశమును తెలుపవలెను . దాని ప్రకారమే సభ నడచును " అన్న సిద్ధాంతాన్ని అంగీకరించారు .
ఆరోజుకి సభ ముగిసింది . అందరూ స్వకర్మానుష్ఠానములకు తరలినారు .
మనము వేదపురుషుని పిలిచి యడుగుట యంటే , మనకు ఆవగింజంత కూడా స్వాతంత్ర్యము లేకుండా పోయినట్లే . బుద్ధిమంతులైనవారు , ప్రమాణములనూ , లక్షణములనూ ఆధారము చేసుకొని స్వతంత్రముగా సిద్ధాంతము చేస్తారు .
ReplyDeleteSharma ji, this is what i asked you earlier, with reference to some story in pancha tantra.
Asking the devatas only as a last resort, when there is no witness or pratyaksha or paroksha pramana. 'fcourse i did not pursue further on the story. == kumara swamy v