SHARE

Thursday, July 19, 2012

47. " మంత్ర ద్రష్ట " నలభై ఏడవ తరంగం



నలభై ఏడవ తరంగం

     విశ్వామిత్రుడు నేరుగా వామదేవుని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ వామదేవుడు కూడా విశ్వామిత్రుని రాక కోసము ఎదురు చూస్తున్నాడు . మిత్రులిద్దరూ బహు సంతోషము చేత ఒకరినొకరు ఆలింగనము చేసుకున్నారు . వామదేవుడు తన మిత్రునికి అర్ఘ్య పాద్యాది కాలోచితమైన ఉపచారాలన్నిటినీ చేసి , " విశ్వామిత్రా , నువ్వు సామాన్యుడవు కాదు ! మన అగ్నిదేవుడిని కూడా బుట్టలో వేసుకున్నావు కదా ! " అన్నాడు . 

     అది విశ్వామిత్రునికి అర్థము కాలేదు . " అదేమీ లేదు కదా , నేను అగ్నివిద్యలో వేలుపెట్టినవాడినే కాదు . దారిలో వస్తుండగా పురూరవ దంపతుల ఆశ్రమములో విడిది చేయవలసి వచ్చెను . వారు యథోచిత ఉపచారాలు చేసినారు . అక్కడ ఆ రాజర్షి , తనకు అగ్ని దేవుని అనుజ్ఞ అయినదని స్థాలీ పాకాన్ని ఇచ్చాడు . అగ్ని ఇంకొకరికి అనుకూలుడగుట ఉంటుందా ? అటువంటిదేమున్నా మీ మూడు కులాల వారికే సొంతము : భారతులు , భృగువులు , భరధ్వాజులు . మిగిలిన వారికి అగ్ని దొరికాడంటే అది మీ అనుగ్రహము . నాకు కూడా , జమదగ్ని ఉన్నపుడు అగ్ని విద్యను గ్రహించవలెనను ఆశ ఉండినది . కానీ ఆ వంశానికి మేము ఆడపిల్ల నిచ్చినవారము . అందువలన ఏమీ తీసుకోరాదని నేను అతడిని అడుగలేదు . దీని తర్వాత ఒకవేళ , ఏదైనా దొంగదారిలో మేము అగ్నిని సాధిస్తే , మీ ముల్లె ఏమి పోయింది ? అగ్ని ప్రసాదము మాకు లభిస్తే మీకు పోయినదేమి ? "  అన్నాడు .

     వామదేవుడు నవ్వి , " అది కాదయ్యా , నువ్వు వచ్చుటకు ముందు అగ్ని దేవుడు ప్రత్యక్షమై వైశ్వానర విద్యను వాడికి ఇవ్వు అని చెప్పినాడాయె ! నన్ను అడిగి ఉంటే నేనే ఇచ్చే వాడిని కానా ?  ఏది కాకపోయినా , మా గురుదేవుల కష్టములో సహాయము చేసినవాడవని యైనా నేను నీకు ఆ విద్యను ఇచ్చేవాడిని కానా ? " అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అతనికి వామదేవుని గురువుగారు ఎవరు అన్నది ఇంతవరకూ తెలీదు . అడిగే సందర్భమూ రాలేదు . అతని ముఖములో ఆశ్చర్య ముద్రను చూసి వామదేవుడే అడిగాడు , " మా గురువు గారు అంటే ఎందుకలా ఆశ్చర్య పడుతున్నావు ? మా గురుదేవులను చూచినావా ? నువ్వు ఎవరిని సరస్వతీ నదిలో తడిపివేసినది ? అది కూడా మరచావేమి ? " 

     విశ్వామిత్రునికి నమ్మ శక్యము కాలేదు . వెనుక నడచినదంతా ఒకసారి మనో ఫలకము పైన కనపడి మాయమైంది . తాను వామదేవుని వలన రుద్రుని పొందినది , రుద్రుని అనుగ్రహము వలన తాను అస్త్ర గ్రామమును సంపాదించినది , ఆ అస్త్రాలను తాను ఆశ్రమములో ప్రయోగించినది , అక్కడ తాను తేజోభిభూతుడై పడి ఉన్నపుడు వామదేవుడు తనను తీసుకొచ్చి ఉపచారములు చేసినది , తరువాత త్రిశంకువు ప్రసక్తి , అంతా గుర్తొచ్చి , " అంటే వశిష్ఠులే నీ గురువు గారా ? " అన్నాడు . 

     వామదేవుడు సహజమైన స్వరంతో , " ఔను , . అది నీకు తెలుసా ? ఇంకొక అడుగు వెనకకు వేసి చెబుతాను విను ,  నువ్వు ఆశ్రమములో నానా బీభత్సమూ చేసి వెళ్ళిపోయావుకదా , అప్పుడు వారే నన్ను పిలచి , ’ నువ్వు ఇంకొక చోట ఆశ్రమము చేసుకొని ఉండు . కౌశికుడు అక్కడికి వస్తాడు . అతనికి రుద్రానుగ్రహము లభించునట్లు సహాయము చేయి  ’ అని చెప్పి , నాకు ఇష్టము లేకున్ననూ నన్ను పంపించినదీ వారే ! నువ్వు శత్రు పక్షము . ఆశ్రమాన్ని ధ్వంసము చేస్తావు అని తెలిసినపుడే నీకు గురువుల అనుజ్ఞ యని రుద్రవిద్యను ఇచ్చినవాడను , ఇప్పుడు , మనమిద్దరమూ మిత్రులై ఉన్నాము : మా గురువు గారికి అపారమైన ఉపకారము చేసినవాడవు : అలాంటపుడు నీకు వైశ్వానర విద్య ఇవ్వక పోదునా ? అని అడిగాను , అంతే ! " 

     విశ్వామిత్రునికి ,  వశిష్టుడను పర్వతము ముందర తానొక ఆవగింజ అంత కూడా కాదు , అనిపించింది . ఇక అతని వలె బ్రహ్మర్షి అగుట సాధ్యమా అని సందేహము అలముకుంది . వశిష్ట సమానుడగుట అసాధ్యము అన్న నమ్మకము అయింది . అలాగ అతడు నిరాశలో మునిగిపోతున్నపుడు వామదేవుడు మాట్లాడినది ఒక్కటీ అర్థము కాక , ’ ఆ ’ అన్నాడు . 

     వామదేవుడు  అతని మనక్షోభను చూసి , " ఏమిటి , వశిష్టుల స్మరణ కాగానే మరలా అంతటినీ పక్కకు పంపించావా ? " అన్నాడు . ఆ సూటి మాట విశ్వామిత్రుని బహిర్ముఖుడిని చేసింది . అతడు గంభీరముగా " అది కాదు , వామదేవా  !  కౌశికుడు సంపూర్ణముగా చచ్చిపోయి ఇపుడు విశ్వామిత్రుని అవతారమయినది . కాబట్టి ద్వేషము లేదు . అతని గొప్పతనము ఎంతటిది ?  నా అల్పత్వము ఎంతటిది ? అన్నది ఈ రోజు తెలిసింది . ఇక , అతనికి సముడను అగుట అంటే భూమిని చుట్ట చుట్టి ఒడిలో ఉంచుకుంటా నన్నట్లే కదా ! " అని ఏదో తెలియని నిరాశ నుండి కష్టము మీద బయటికి వస్తున్నట్లు అన్నాడు . వామదేవుడు నవ్వి , " పాలు పొంగినట్లు అంతఃకరణము పొంగుతుంది . ఆ పొంగుకు వస్తువు అభిమతమైతే విషయము రాగమవుతుంది . అన్యథా అయిఉంటే ద్వేషమవుతుంది . ఇలాగ సహజముగా విజృంభించిన రాగ ద్వేషములవలన మహాత్ములకు సుఖ దుఃఖములు కలుగును అని అనుకున్నావా  ? వారు దానిని పర్వకాలములో సముద్రము పొంగునట్లే అనుకుంటారు . మా గురుదేవులు నువ్వేమి చేస్తావో అన్నది తెలిసినవారు . వారికి సర్వమూ విదితమే . దాని వలన  వారు వికారము పొందలేదు . పొంగుతున్న సముద్రపు పక్కనున్న రాయి సముద్రపు ఆటుపోట్ల వలన ఎలాగైతే వికారము పొందదో , అలాగే మహాత్ములు సుఖ దుఃఖాలకు అతీతులు . " 

     విశ్వామిత్రుడడిగాడు , " సరే , మరి వామదేవా , వశిష్టులు సుఖ దుఃఖాలకు అతీతులైతే ఆ శోకమెందుకు వారిని అంత క్షోభింప జేసింది ? " 

     " అదా ? అది వారి దుఃఖము కాదు . యుగ సంధిలో పంచ మహా భూతాల శక్తి క్షయమై అవి దుఃఖించాయి . ఆ పంచ మహాభూతాల దుఃఖమును వహించుటకు ఇక వేరెవరూ శక్తులు కారని , కలి దేవుడు స్వయముగా వచ్చి వశిష్ఠులను ప్రార్థించాడు . వారు , సరే, వహిస్తాను అన్నారు . పుత్రశోక రూపముగా అది వచ్చింది . వారు దానిని ఆ రూపముగానే  అనుభవించారు . వారు కావాలనుకొన్న , దానినంతటినీ సుఖరూపముగానే అనుభవించి ఉండవచ్చు . అయితే , వరమునిచ్చారు కాబట్టి , దానిని దుఃఖముగానే అనుభవించారు . " 

" దుఃఖమును సుఖముగా అనుభవించుట ఎట్లు  " 

     " అయ్యో , ఇదొక పెద్ద విషయమా ,  విశ్వామిత్రా ? ఇప్పుడు నేనిక్కడ శిలాసనములో కూర్చున్నాను . కింద పడ్డాననుకో , భూమికీ , నా దేహానికీ సంపర్కమైనపుడు , భూమి యొక్క కాఠిన్యము బలమై దాన్ని నా దేహము తట్టుకొనలేక పోతే అది నొప్పియై దేహానికి దుఃఖమవుతుంది . దేహములో ఆ భూమికన్నా హెచ్చుగా కాఠిన్యముంటే , లేదా భూమిలో దేహము సహించగలిగినంత కాఠిన్యముంటే , లేదా భూమిలో మృదుత్వముంటే , అప్పుడు దేహానికి నొప్పి ఎక్కడిది ? రాశిపోసిన ప్రత్తి పై  పడితే , లేదా  ఇసుక రాశిపై పడితే నీకు నొప్పి కలుగుతుందా ? అలాగే దుఃఖము వచ్చేది లోపము వలన : దేహములో సమంగా ఉన్న వ్యానపు ఒత్తిడి ఎక్కువ తక్కువ అగుట వలన. ఆ వ్యానాన్ని అనుసంధానము చేయగలిగినవాడు , ధ్యానము నందు తన దేహ కాఠిన్యమును పెంచుకుంటే చాలు . బండపై పడినా నొప్పి తెలియదు . నొప్పి అసలే కాదు . అలాగే , ఇంద్రియాలకు కొంత సహన శక్తి ఉంది . దాన్ని పెంచుకున్నా కూడా దుఃఖపు ఆవేశము తక్కువగును . అంతే కాక , దుఃఖాన్ని అమ్ముకొనుట అను విద్య కూడా ఒకటుంది . " 

     విశ్వామిత్రుడు అది విని ఇంకా ఆశ్చర్యములో మునిగాడు . " ఏమిటీ ! ?  దుఃఖాన్ని అమ్ముకొనుటా ? "  అన్నాడు . వామదేవుడు మునుపటి వలెనే గంభీరముగా , " అవును , నీ ఇంట్లోని గోవు పైన నీకు అభిమానముంటుంది . దాన్ని నేను కొనుక్కున్నపుడు  నువ్వు ఇస్తావు . ఇచ్చునపుడు నీకు సంకటము అగుట లేదా ? అయితే ,  దానికి తగినంత వెల నీకు ముట్టింది అని తెలిస్తే నీకు ఆ అమ్మకము వలన దుఃఖము కలుగదు . అలాగే నీకు అవసరములేని వస్తువు యొక్క గుణాన్ని లెక్క చేయకుండా , దోషాన్ని మాత్రమే ఎంచితే , పోయినది క్షేమమయినది అన్న సుఖము కలుగును . ఇదే నేను చెప్పిన వినిమయము . అన్నాడు . 

     రాజ్యాన్ని ఏలుతుండిన విశ్వామిత్రునికి ఈ వినిమయము , ఈ అమ్మకము కొత్త కాదు . అయితే అతడు దానిని తన సొంతానికి ఉపయోగించుట గురించి ఆలోచించి ఉండలేదు . ముందు ముందు తాను అనుభవించవలసిన దుఃఖాన్ని సుఖముగా మార్చుకొను సాధనము ఒకటుంది అన్నది అతనికి తెలిసినట్లాయెను . 

     వామదేవుడు ఇలాగే కథా కాలక్షేపము నందున్నపుడు సాయంత్రమైంది . అదేమిటా హిమాచలపు సంధ్య ? ఇంకా సూర్యాస్తమయానికి అర్ధ యామము ఉండగానే చలి మొదలు . చీకటి పడుటకు ముందే  మిత్రులిద్దరూ సంధ్యా కార్యక్రమమును ముగించి అలాగే మాట్లాడుతూ నిద్రకుపక్రమించారు . విశ్వామిత్రునికి రాత్రంతా నిద్ర లేదు . వశిష్ఠునిదే ఆలోచన. 

1 comment:

  1. అద్భుతం గా నడుస్తోంది విశ్వామితృని ప్రయాణం. ఇవి ప్రతి మనిషిలో చెలరేగు భావనల వలె కనిపిస్తున్నవి. కామెంటు కోసం వర్డ్ వెరిఫికేషన్ తీసివేయగలరు.

    ReplyDelete