SHARE

Wednesday, July 18, 2012

46. " మంత్ర ద్రష్ట " నలభై ఆరవ తరంగం



నలభై ఆరవ తరంగం

      అలాగ కొన్ని రోజులు గడిచాయి . ప్రాణ దేవుడు ఒకరోజు , " విశ్వామిత్రా , నీ హృదయములో ఉన్న సందేహాలు తీరనీ . వామదేవుని వద్దకు వెళ్ళి రా " అన్నాడు . విశ్వామిత్రుడు ఆజ్ఞను అంగీకరించి , " దేవా , ఈ శక్తి వికిరణము వల్ల ఇతరులకు కష్టమవుతుందేమో ? అన్న బెదురు  " అన్నాడు . ప్రాణ దేవుడు అదివిని నవ్వేశాడు . " ఏమిటి మునీంద్రా , జగము అంత అరక్షితమైనదా ఏమి ? తమరొక్కరే కాదు ఇలాగ కిరణాలను ప్రసరిస్తున్నది . జడ చేతన పదార్థాలన్నీ కిరణాలను చల్లుతున్నాయి . సూర్య చంద్ర నక్షత్రాల వలెనే , అణు , రేణు , తృణ కాష్టాదులన్నీ తేజో మండలాలే ! తమరు ఆలోచించనవసరము లేదు . వెళ్ళి వచ్చునపుడు దారిలో ఏమేమవుతున్నదో కళ్ళు తెరచి చూచుకుంటూ రండి . అంతా సరిగ్గా అవుతుంది " అని ఆశీర్వాదము చేసి పంపించాడు . 

     విశ్వామిత్రుడు దేహములోనున్న పృథ్వీ భూతాన్ని , జల భూతాన్నీ అనుసంధానము చేసి సూక్ష్మ ప్రమాణము నకు తెచ్చి , లాఘవముగా పైకి ఎగసి ,  ఆకాశమార్గములో బయలుదేరాడు . అతనికి వామదేవుని ఆశ్రమానికి పోవలెనను సంకల్పము . అయితే ప్రబలమైన వాయువు ఒకటి , హింసారహితముగా పైకిలేచి , శరత్కాల మేఘాన్ని మోసుకొని పోవునట్లు అతడిని సుఖంగా మోసుకొని పోయి , ఒక ఆశ్రమములో దింపింది . వాక్పూర్వకముగా కాక పోయినా , ఇక్కడ దిగవలెను అని నమ్రతతో కూడిన భంగిమతో , ముద్రతో  సూచించిన వినయ గౌరవ నమ్రుడైన మిత్రుని వలె , ఆ వాయువు తన స్పర్శతోనే ఆ మునీంద్రునికి తన ఉద్దేశాన్ని వెల్లడించాడు . అతడు కూడా గతి స్తంభనము చేసి అక్కడ దిగుతాడు . తిరిగి చూస్తే , వేదఘోష చేస్తూ వానప్రస్థుడొకడు స్త్రీ సమేతుడై వస్తున్నాడు . 

     ఆగంతకుడు దగ్గరికి వచ్చి , అర్ఘ్య పాద్యాలను అర్పించి , " మునీంద్రులు దయయుంచి నా ఆశ్రమమునకు వచ్చి మధుపర్కమును గ్రహించు కృప చూపించవలెను . " అని ప్రార్థించాడు . విశ్వామిత్రుడు ఆహ్వానమును అంగీకరించి అతని వెంట వెళ్ళి , అతడెవరని విచారించాడు . అతడు పురూరవుడు . అతని వెంట ఉన్న స్త్రీ ఔశీనరి . ఈతడు వచ్చు విషయము తెలిసినది అగ్ని దేవుని వలన. అతని అనుజ్ఞ ప్రకారము ఈతనికి మధుపర్కాన్ని సమర్పించుటకు అతడు వచ్చినది . 

     మధుపర్క సమర్పణ అయిన తరువాత , " మునీంద్రులు మన్నించాలి . మధుపర్క సమయములో తమకు అర్పించుటకు మా దగ్గర గోవు లేదు . అందువలన అగ్నిదేవుని అనుజ్ఞ ప్రకారము తమకు స్థాలీపాక విద్యను సమర్పించెదను . దానిని స్వీకరించి మమ్ములను అనుగ్రహించవలెను . " అని ప్రార్థించాడు . విశ్వామిత్రుడు సరేనని ఒప్పుకొని , ఆ విద్య పూర్వోత్తరాలను , అది వచ్చు రీతిని అడిగాడు . 

     పురూరవుడు అన్నాడు , " మునీంద్రులు ఆలకించాలి . జరుగుతున్న దానిని చెప్పెదను . అది ఆత్మ కథ అయిననూ , దానిలో అహంభావము లేనిచేత ,  ’ నేను ’ అన్నది వచ్చినా , దానిని సహించండి . నేను ఒకసారి ఊర్వశి అను దివ్య స్త్రీ యందు అనురక్తుడనయ్యాను . ఆమె కూడా నాపై భావముంచి గౌరవించినది . ఈమె అనుమతితోనే మేమిద్దరమూ పతి, పత్ని అయ్యాము . దేవలోకమును వదలి భూలోకములో ఉండుట గంధర్వులకు సమ్మతము కాక , ఆమెతో నేను లేని సమయము చూసి గంధర్వులు ఆమెను పిలుచుకొని వెళ్ళినారు . తరువాత అధికముగా దుఃఖించి , చివరికెటులనో ఆమెను చూచి ప్రార్థించగా , ఆమె గంధర్వ హోమమును చేసి సకాముడవు కమ్ము అని అనుగ్రహించినది . దానిప్రకారము గంధర్వ అనుగ్రహము పొందుటకు వారు ఈ స్థాలీ పాకాన్ని కరుణించారు . అధియజ్ఞమైనపుడు ఈ స్థాలీపాకము , వికోపముచేత విముఖమైయున్న ప్రాణాపానాలను శాంతపరచి , అభిముఖముగా చేస్తుంది . లోకములో దీన్ని అధిభూతముగా ఆచరిస్తే పతిపత్నుల ప్రేమ , ఆయుస్సూ దృఢమవుతాయి . అధిదైవికముగా దీన్నిచేస్తే స్వర్ణ విద్య లభిస్తుంది . సృష్టి కాముడై , ఆధ్యాత్ముడై దీనిని ఆచరిస్తే ఇష్ట ప్రజ లభిస్తుంది . దీనిని దేవతలూ , ఋషులూ తమ సభలో అనుమోదనము చేసినపుడు అగ్నిదేవుని దయవలన ఇది రూపము చెంది , పద్దెనిమిది మంత్రములు గల ఊర్వశీ పురూరవ సూక్తమయినది . " 

     విశ్వామిత్రుడు దానిని విని బహుళముగా  సంతోషించాడు . ప్రాణదేవుని మాట తలచి , " దేవతలు ఏమేమి విచిత్రములు చేస్తారో ? మొత్తానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడకపోతే మేమే చెడిపోతాము "  అనుకొని , పురూరవునితో , " ఓ రాజర్షీ , నువ్వు శ్రమ కోర్చి , దంపతుల ప్రేమను దృఢము చేసి లోకమును ఉద్ధరించు అగ్ని విద్య నొకదానిని తెచ్చి ఇచ్చి లోకోపకారివయ్యావు . ఈ నీ ఉపకారాన్ని లోకాలన్నీ చిరకాలమూ స్మరిస్తాయి " అని ఆనందముతో పొగిడాడు . 

     పురూరవుడు  " విశ్వామిత్రా , మా సంగతికేమి, నువ్వెంతటి పుణ్యవంతుడవై ఉండాలి ! ’ అగ్ని హోత్రి వస్తున్నాడు , వెళ్ళి ఆతనిని దర్శనముచేసి , పిలుచుకొని వచ్చి నీ దగ్గరున్న అగ్ని విద్యను అతనికి నేర్పించు ’ అని సాక్షాత్తూ అగ్నిదేవుడే అనుజ్ఞ ఇచ్చాడు కదా , నీ భాగ్యమది ఎంతటిది ! " అని శ్లాఘించాడు . 

     విశ్వామిత్రుడు రెండు మూడు దినములక్కడ ఉండి , ఆ రాజర్షివర్యుని ఆతిథ్యాన్ని స్వీకరించెను . అతనికి , అక్కడ ఆ రాజర్షి దంపతుల సన్నిధిలో ఉంటే దేహము శాంతముగా ఉండును . ఏకాంతములో ఉంటే శక్తి కిరణాలను చిమ్మును . దానిని చూసి ఆశ్చర్యమైననూ , అతడు అదేమిటలా  అని వెదుకలేదు .

      అతడు  ఆ ఆశ్రమములో నుండగా అక్కడికి హస్తినాపురము నుండీ వార్త వచ్చెను , " దుష్యంతుడు కణ్వాశ్రమములో , వారి పెంపుడు కూతురైన శకుంతలను వివాహమాడెను . ఆ దంపతుల కడుపున చక్రవర్తి కాగల భరతుడను మహా పురుషుడు పుట్టి ఉన్నాడు " అని . 

     ఆ మాట విని రాజర్షి దంపతులు మిక్కిలి సంతోషించారు . విశ్వామిత్రుడుకూడా ఆ సంతోషాన్ని పంచుకున్నాడు . అయినా  అతనికి , సంతోషమూ-- దుఃఖమూ కాని ఇంకేదో భావము ఉండింది . అతనికి అక్కడ ఇంకా రెండు రోజులు ఉండి వెళ్ళాలని ఒక మనసు , అయినా  ఎందుకో , ఏమో  రాజ కార్యమున్నవానివలె అక్కడనుండీ బయలుదేరి వెళ్ళాడు . 

No comments:

Post a Comment