యాభై రెండవ తరంగం .
విశ్వామిత్రుడు అందరినీ వీడ్కొలిపి , సింధూ నదీ తీరానికి వచ్చి నిలిచాడు . చుట్టూ కొండలు . వాయవ్యము నుండీ నది ముందుకు దుముకుతూ అర్ధ చంద్రాకారముగా ప్రవహించి దక్షిణానికి ప్రవహించి వెళుతుంది . ఆ నదికి రెండు వైపులా కొండలవంటి ఎత్తైన చెట్లు . గిరి కన్య , ఎవరో తనకు కావలసినవారికోసము , ఉత్తమోత్తమమైన పచ్చటి బట్టలను తెచ్చి , గాలికి పరచినట్టున్న ఆ అడవి యొక్క పచ్చదనము వ్యాపించి , ఆ శ్రేష్ఠమైన భూమి సొగసులీనుతున్నది . అక్కడే విశ్వామిత్రుని ఆశ్రమము .
ఇప్పుడు వారికి రెండే రెండు ఆలోచనలు . విశ్వము మొత్తాన్ని ఆర్యమయము చేయాలంటే ఏమి చేయవలెను .? ఏ యోగము , ఏ యాగము , ఏ ఉపాసన , ఏ కర్మ , ఏ వ్రతమును చేస్తే అది సాధ్యమవుతుంది ? బ్రహ్మర్షులు కోరిన ఆ లోకపు కోరిక ఎప్పటికి తీరును ? అను దీర్ఘాలోచనకు తోడు ఒక సమాధానము కూడా ! : " దీని వెనుక , ఈ కల్పమును , ఈ సాధనమును కనిపెట్టవలెనను దాని వెనుక , ఎంతెంతో గొప్పవైన మహా సంకల్పాలు , వాటి బలాలు ఉన్నాయి . కాబట్టి , ఏదో ఒకరోజుకు అది ఒక వాన లాగా రానే రావాలి . లేదా, వాన ఇప్పటికే వచ్చింది ; ఆ నీరంతా ఒకచోట చేరుతున్నది , నదియై , ప్రవాహమై రావాలి . వస్తుంది . "
రెండవ ఆలోచన , అప్పు తీర్చుట. ఇప్పుడది అంతగా కొరకడము లేదు . చేతిలో ధనము ఉన్నవాడు , " ఇంకేమి , ధనము వచ్చినది కదా ? చాలు , తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే సరి " అన్న ఊరటతో ఉన్నట్టే , ఇక్కడా ఊరట ఉంది . అయితే ఒక భేదము . అప్పుడు దాన్ని ఇంద్రుడి అప్పు అనుచున్న విశ్వామిత్రులు ఇప్పుడు అది భగవంతుని అప్పు అంటారు . అది అయినంత వేగముగా తీరాలి , లేదంటే దానికి ఎక్కువ సమయము లేదు అనిపించు కొరత కూడా ఉంది .
ఇవి రెండూ ఒక్కసారే రావచ్చు . అప్పుడు తప్పకుండా రెండో దానికే ప్రథమ స్థానము . " సొంత అప్పును తీర్చి , తాను అనృణి అయి , భారాన్ని దింపుకుని , ఆత్మోద్ధారము చేసుకున్న వాడే విశ్వోద్ధారములో చేతులు పెట్టాలి . లేకపోతే , ఈత రాని వాడు , నీటిలో పడ్డవాణ్ణి రక్షించుటకు పోయినట్లే అగును . కాబట్టి మొదట ఒక వివాహము చేసుకోవాలి . ధర్మ సంతానముగానే యాభై మంది పిల్లలను పొందాలి . వారిని తానే బలి ఇవ్వాలి . ఆ దుఃఖాన్ని కొట్టివేయుటకు ఇంకొక లోభాన్ని ఎదురుగా ఉంచుకొని , ముల్లును ముల్లుతో తీయునట్లే చేసి , తాను నిశ్చింతుడు కావాలి .
నిశ్చింతుడగుట ఏమో , బాగానే ఉంది , అయితే పిల్లలు అనగా దంపతుల సొమ్ము . తండ్రి ఒక్కడిదే కాదు . కాబట్టి , నాకు యాభై మంది పిల్లలు కావాలన్న , నూరుగురు పిల్లల్ని పొంది , వారిలో యాభై మందిని కన్న కడుపు చలువ కోసము వదలి మిగిలిన వారిని నేను ఉపయోగించుకోవాలి . అందులోనూ , తల్లులకు కనిష్టునిపై ప్రేమ . కాబట్టి మొదటి యాభై మందిని నేనుంచుకోవాలి . వారు గర్భానికి వచ్చునపుడే దుష్టులుగానే పుట్టనీ , వారి దౌష్ట్యమే వారిని చంపనీ . నేను అడ్డు వెళ్ళకుండా ’ అయిపోనీ ’ అని ఊరకుంటే సరి ."
అది సాధ్యము కాదు . వశిష్ఠ పుత్రుల మరణానికి నేను ఎలాగైతే కారణమయ్యానో ; లేక నేనే కర్తగా నిలచి ఆ ఋషివధ ఎలాగ నడచిందో , అలాగే , ఇక్కడ కూడా నేనే కర్తగా నిలచి ఆ కార్యాన్ని నడిపించాలి . ఈ నరమేధము లో ఇంద్రియ సంతర్పణార్థమై , చిత్తోపశాంతి కోసమై ప్రత్యక్షమైన ఫలమొకటి ఉండాలి . ఔను , ఔను . ఇంద్రియాల కర్మమే అటువంటిది . అప్రత్యక్షముగా ఒక మేరు పర్వతమో , ఒక కాంచన గిరి యో దొరకునట్లైతే దానిని వదలి , ప్రత్యక్షముగా ఒక ముద్ద పిండి దొరికితే దానిని పట్టుకొనుట . ఇలాగ గోచరమగు అల్పము కోసము , అగోచరమగు అధికమును వదలి వేయుటయే ఈ ఇంద్రియాల కర్మ . నేను కూడా ఈ ఉపాయాన్నే అనుసరించి ఆ నరమేధాన్ని నిర్వహించవలెను . "
" అలాగయితే , ఈ నూరుమంది పిల్లల్ని పొందడానికి సమయము కావలెను . మానవ గర్భములో శత పుత్రులగుటకు శతమానమే కావాలి . నాకు శతమానము ఒక లెక్క కాదు . అయితే చేయవలసిన ఇతర కార్యములు ఉన్నపుడు , ఒక శతమానము ఈ చంపడాలు , కడగడాలలో కూర్చుంటే ఎలాగ ? కాబట్టి ఎవరైనా ఒక దివ్య కన్యను వివాహమాడాలి . ఆమెకు తపస్సును నేర్పించాలి . ఒకే గర్భములో శత పిండములను ఉత్పత్తి చేసి అవి ఏకాండము గా బయటకు వచ్చి , ఘృత కుంభములలో పక్వమగునట్లు చేసుకొనవలెను . మంచిదే , ఇది ప్రాణ దేవుల దయ వలన జరగవలసిన కార్యము . వైశ్వానరుడు మనసు చేస్తే , ఈ పని సాధ్యమవుతుంది . తన పడతి అవబోవు ఆమెను మచ్చిక చేసి ఒద్దికకు తెచ్చుకొను సాధనము తనలోని రాజర్షికి తెలుసు . ఔనౌను , నాకు అన్నీ ఉన్నాయి . పిల్లలు కావాలను కోరిక ఉంది . ఒకే సారి నూరు మంది పిల్లలను పుట్టించు విద్య తెలుసు , అయితే పడతి లేదు . చిత్రకారునికి రంగులు , లేఖిని , బుద్ధి , అన్నీ ఉన్నాయి, పటము ఒక్కటే దొరకలేదు . కానీలే , దేవతలు ఉన్నారు కదా : మావల్ల కాలేని కార్యములు చేయుటకే గదా వారున్నది ? లేదా , వారి కార్యమును చేయుటకే గదా మేమున్నది ? వారేమి చేస్తారో చూద్దాము . ఇప్పటికింకా దక్షిణాయణము ప్రారంభము కాలేదు . ఇప్పుడే కదా వానలు మొదలయ్యాయి ? ఇంకొక దక్షిణాయన అవధి లోపలే అదంతా కావాలి . ఈ చింతా పరిహారానికి ఒక హోమమో , హవనమో , ఉపాసనో , ఏదో ఒకటి చేయాలి . "
ఇంతా చేసి ముఖ్యమైన దాన్నే మరచానే ? మా దంపతులు ఇద్దరమూ ఒప్పుకున్నంత మాత్రాన ఈ నరమేధము అవుతుందా ? మేమిద్దరమూ వంశపు సొమ్ము . వంశము పితృదేవతలది . వంశపు సొమ్ము ఏదైనా కానీ పితృ దేవతల ఆమోదముతోనే వినియోగము చేయతగినది . వారి అనుమతి లేనిదే మేము ఎంత పోరాడితే మాత్రము ఆ వినియోగము సద్వినియోగమై సత్ఫలము వస్తుందా ? వారి ఇఛ్చ కు విరోధముగా మేము దేనిని ఉపయోగిస్తామో అది లేకుండా పోయి దాని దారిద్ర్యము కలుగుతుంది . కాబట్టి వారి సమ్మతి తోనే ఈ నరమేధము జరగాలి . పితృదేవతలు ఎప్పుడూ వంశాభివృద్ధి కావాలి అని కోరుతూ ఉంటారు . మరి వంశ నాశనాన్ని ఒప్పుకుంటారా ? మరి నా ముందరి గతి ఏమి ? "
" గతి ఏమి ? అక్కడ కూడా ఒక లాభపు లోభము కావాలి . పితృ దేవతల ఉద్దేశమేమి ? తమ వంశము ఉండాలి : ఉజ్వలంగా , కీర్తి సంపన్నముగా , మహోన్నతముగా బ్రతుకుతూ ఉండాలి . కాదా ? సరే . తేజస్వియై , ఋషి ప్రతిభలున్నవాడై , దైవానుగ్రహ సంపన్నుడైన వాడు ఎవరైనా దొరికితే , వాడిని తీసుకోవడము , వాడికోసము ఈ యాభై మందినీ స్వాహా అనుట సరి . ఇదే సరి . ’ సిద్ధం సాధ్యాయ కల్ప్యతే ’ "
ఇప్పటికి అంతా సరిపోయింది . ఈ నదిని దాటి వెళ్ళి నేను చేయవలసినది ఏమి ? దేనిని పట్టాలి ? సాధనమేది ? సిద్ధి ఏది ? అంతటినీ నిర్ణయించుకోవడమైనది . ఈ నర మేధము కావాలంటే ఇంకొక నాటకమే నడవాలి . దాన్ని దేవతలు ఆడించాలి . పోయిన సారి మేనకను కట్టుకున్నపుడు కామమే ప్రధానమయినది . ఈ సారి పెళ్ళాడునపుడు ఆ కామము దమనమై , చేతికి చిక్కిన గుర్రము వలె ఉండాలి . ఋషులు అగువారు యాభై మంది . ఋషి కల్పులగు వారు యాభై మంది . మొత్తానికి నూరు మంది పిల్లలను పొందుటకు మరలా గృహస్థుడను కావలెను . దేవతలు ఈ నాటకాన్ని నిర్వర్తించి నన్ను కృతార్థుడిని చేయాలి "
జనార్ధన్ గారు
ReplyDeleteనమస్తే. రచన లోతుగా అద్భుతంగా సాగుతోంది. ఇది ఏ పురాణంలోనిది. ఇదంతా గాయత్రీ మంత్రద్రష్ట అయిన విశ్వామిత్రుని గురించేనా. ఇప్పుడు ఆయనకు ఋషిలోకం ఇచ్చిన పని గాయత్రీ మంత్రదర్శనం లోకానికి అందించమనే కదా. బాగుంది.
శ్రీవాసుకి
srivasuki గారూ నమస్తే.. , అవునండీ . ఇది ఆ విశ్వామిత్రుని గురించిన కథే . విశ్వామిత్రులు అనేకులు గలరని తెలుస్తున్నది . కృత యుగపు మొదటి పాదములో ఉన్న ఈ విశ్వామిత్రుడూ , త్రేతాయుగములో శ్రీరాముడికి విద్యలు నేర్పిన విశ్వామిత్రుడూ ఒకడేనా అన్నది అనేకుల సందేహము . ఆకాలములో ఋషులు వందలాది సంవత్సరాలు జీవించే వారని ఒప్పుకున్నా , ఇలా రెండు యుగాలలోనూ ఉండడము కొంత ఆశ్చర్యమే .
Deleteవిశ్వామిత్రుడి తదుపరి కార్యము గాయత్రీ మంత్ర దర్శనమే...అది ఎలా జరుగుతుందనేది చదివి తీరవలసినది ..
ఇది ఏ ఒక్క పురాణములోదో కాదు . పురాణాలు , వేదాలలోని విషయాలను క్రోడీకరించుకొని శ్రీ దేవుడు గారు రాసినది ." ముందు మాట " చదవండి . అందులో వివరాలున్నాయి .
Delete