SHARE

Tuesday, July 17, 2012

45. " మంత్ర ద్రష్ట " నలభై ఐదవ తరంగం



నలభై ఐదవ తరంగం

     విశ్వామిత్రుడు మౌనాన్ని సాధించాలనుకున్నవాడు ,  అది సాధ్యము కాదని కనుక్కున్నాడు . మాటలాడకుండా ఊరికే ఉండుట మౌనమయితే , నాలుక అను యంత్రము చలనము లేక , బయటి వారితో ఏమీ చెప్పక ఊరికే ఉండుటయే మౌనమయితే , అది అతనికి కావలసినంత ఉంది . కానీ అతనికి కావలసిన మౌనమదికాదు . 

     కళ్ళు తాము చూసిన వస్తువును ఇంకొక్క సారి యైననూ తెచ్చి చూపించకుండా వదలుతాయా ? చెవి , తాను వినిన శబ్దాన్ని మరలా వినకుండా ఉండుట ఉందా ? ఇలాగ తనకు ఇష్టము లేకున్నా వచ్చు ఇంద్రియ స్మృతులు ఒక్కటి కూడా మిగలకుండా బయటికి వెళ్ళి పోయి , లోలోపల ఉన్న ఇంకేదో ,  అది బయటకు రానీ ! దాన్నీ చూదాము అని బాహ్యాంతరాలలో నిశ్చలముగా ఉండుటను అతడు కోరుతున్నాడు . అయితే అది దొరకలేదు . 

     ఆ ఏకాంతముగా నున్న గుహలో విశ్వామిత్రుడు తప్ప ఇంకే ప్రాణి కూడా లేదు . దోమలూ చీమలూ లేవు . అక్కడ ఒక కృష్ణాజినపు ముక్కను కట్టుకొని , ఇంకొక ముక్కను ఉత్తరీయము చేసుకొని , దేహపు అధిక భాగము ఆఛ్చాదనము లేకుండా విశ్వామిత్రుడు కూర్చున్నాడు . ఉదయ సంధ్య వరకూ వేరే పని లేదు . పద్మాసనము లో కూర్చొని , పంచాగ్ని దర్శనము చేస్తూ కూర్చుండుటయే పని . అతనికి సూర్యోదయ , సూర్యాస్తమయములలో మాత్రము ఒక విచిత్ర మైన అనుభవమవుతున్నది . పంచాగ్నుల దర్శనము చేస్తూ కూర్చున్న విశ్వామిత్రుని తో పాటు  అప్పుడు ఇంకొక విశ్వామిత్రుడు దేహమునుండీ బయటికి వస్తాడు . అతడు దేహము నుండీ బయటికి రాగానే దేవ గంగ వచ్చి గుహ వాకిట్లో అతడికి స్నానము చేయించి వెళుతుంది . ఎవరెవరో వచ్చి అతనికి మడి కట్టి వెళతారు . ఇంకెవరెవరో వచ్చి ఆహ్నికానికి కావలసినదంతా సిద్ధము చేస్తారు . ఇంకా ఎవరో వచ్చి దివ్య హవిస్సును అందిస్తారు . అతడు దానితో కొంత హోమము చేస్తాడు . దేవతలంతా వచ్చి హవిస్సును స్వీకరిస్తారు . మిగిలినదాన్ని అతడు స్వీకరించి , తృప్తి చెంది , మరలా వెనుకకి తిరిగి , ఇల్లు వదలి బయటికి వెళ్ళినవాడు మరలా ఇంటికి వచ్చునట్లు వచ్చి దేహాన్ని చేరుతాడు . 

     విశ్వామిత్రునికి ఈ నాటకము చూసి చాలా కుతూహలమైనది . అలాగన్నచో , దేహములో ఇద్దరుంటారా ? ఒకడు వెళ్ళి తన పనిని చేస్తుంటే ఇంకొకడు కూర్చుండుట సాధ్యమా ? అనేదే పెద్ద ఆలోచన అయ్యింది . ఆ ఆలోచన తన మౌన సాధనకు విఘ్నమవుతుందని దానిని పక్కకు నెట్టాడు . ఆలోచన పుట్టు వరకూ ఒక ఘట్టము , పుట్టిన తర్వాత ఇంకొక ఘట్టము . పుట్టిన ఆలోచన నీటి అడుగున పుట్టిన బుడగ పైకి వచ్చియే తీరునట్లు జాగృతమైన మనస్సుకు వచ్చే తీరాలి . అది ఏమిటో అర్థము కావలసినదే , లేకున్న మనసుకు శాంతి ఎక్కడిది ? 

     ఆ ఆలోచనకన్నా ఇంకొక ఆలోచన అతన్ని బలంగా పట్టుకుంది . "  ఈ పంచ వాయువులు సరిగ్గా ఉన్నంతవరకూ , అంతా సరిగ్గానే ఉంటుంది , అయినా , హెచ్చు తగ్గులు అవుతుంటాయి అని ప్రాణదేవుడే చెప్పాడు . అలా అగుటకు కారణమేమైనా కానీ , అలా అయినపుడు ఏం చేస్తే మరలా సరిపోతాయి ? " అదొక భారమైన ఆలోచన . 

     మౌనముగా కూర్చుందామా అంటే , ఈ అగ్నులే మనో వృత్తులను ప్రేరేపిస్తాయి . దేహేంద్రియాలు ప్రేరేపింపబడిన తర్వాత ఊరికే ఉంటాయా ?  చెలుకోలు దెబ్బలు తిన్న గుర్రమైనా ఊరికే ఉంటుందేమో కానీ , ప్రచోదింపబడిన దేహేంద్రియాలు ఊరకుంటాయా ? 

     దానికి తోడు ఆలోచనలు . ఈ ఆలోచనలతో విశ్వామిత్రుడు పండిపోయినట్టయ్యాడు . వెనుక మంత్ర యోగము నందున్నపుడు అతడు ఇలాగ సతమత మవుతుండ లేదు . కళ్ళు మూసుకుని , లేదా ఏకాగ్ర దృష్టితో కూర్చుంటే మనస్సు కులీనురాలైన పత్ని వలె వశమునకు వచ్చేది  . ఇప్పుడలాగు కాదు . ఈ ధ్యానములో ఉన్నపుడు పంచాగ్ని సన్నిధానములో ఉన్నా , దేన్నైనా చూస్తే దానికి ప్రాణము వచ్చి లేచి ఆడుతుందా అన్నట్టుంది . కింద పడిఉన్న ఏదైనా గడ్డిపరక  విశ్వామిత్రుని కంట పడితే అతని హృదయము నుండీ ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి బయటికి వెళ్ళి దానిని చేరి దానిలో చైతన్యము వస్తుంది . ఇప్పుడు విశ్వామిత్రుడు గుహను వదలి బయటికి రాకుండుటకు అదీ ఒక కారణము. అతడు బయటికి వస్తే అతని దృష్టిలో పడిన అచేతనమైన స్థావరాలన్నీ చైతన్యము కలిగి జంగమముల వలె వ్యాపారములు  చేస్తున్నాయి . రాళ్ళుకూడా కదలినట్లు కనిపిస్తాయి . అతడు ఊపిరి వదిలితే , ఆ గాలి బయటి గాలితో చేరితే , ఆ బయటి గాలికి ఏదో నవ చేతనత్వము వచ్చినట్లై అది ఏదో ఒక నూతన వ్యవహారాన్ని ప్రారంభిస్తుంది . అతడు నదికి వెళ్ళి నీరు ముట్టుకుంటే , నీటికి కొత్త జీవము వచ్చినట్లై అది ఏమేమో అయిపోతుంది . అయితే , ఆ వ్యాపారాల వలన దుఃఖము లేదు : సుఖముంది : ప్రియముంది : హితముంది : ఆనందమవుతుంది . అయినా , విశ్వామిత్రునికి లోలోపల , ’ కూడదు , ఈ వ్యాపారము కూడదు’ అనిపిస్తుంది . అంచేత అతడు గుహ వదలి బయటికి రాడు . అంతేకాదు , గుహలో నడిస్తే , నేల తో పాటు , కాలికి తగిలిన మట్టి , గడ్డి పరకలూ అన్నీ కూడా సచేతనమైనట్టు భావన కలుగుతుంది . కూర్చుంటే మాత్రమేమి ? అదేదో ఒక విచిత్రమైన శక్తి దేహము నుండీ బయటికి చిమ్మినట్లవుతుంది . అతడు దాన్ని తట్టుకొనలేడు . అతని ప్రయత్నము లేకనే , సతతమూ , దేహమునుండీ బయటికి చిమ్ముతున్న కాంతి వలె తేజః ప్రవాహమొకటి , తేజస్సే అయినా కంటికి కనపడక , మనస్సుకు మాత్రము అర్థమవుతూ , ఏదో ఒక శక్తి ప్రవాహమై , సుమ గంధము వలె సూక్ష్మమై , బయటి వాతావరణముతో వెళ్ళి చేరుకుంటుంది . గుహ , గాలివాటులో లేకున్ననూ  , ఆ సూక్ష్మ శక్తిని పొందాలనో ఏమో అన్నట్టు ఎక్కడి నుండో గాలి వచ్చి తిరిగి తిరిగి వెళుతుంది .  

     అయితే , ఉదయాస్తమయాలలో మాత్రము దేహము నుండీ ఆ ఇంకొక మూర్తి లేచి బయటికి వెళ్ళినపుడు ఆ శక్తి వికిరణము లేదు . దీన్ని గురించి ప్రాణ దేవుడినే అడగాలని మనసుకు అనిపిస్తుంది . అయితే , గురువు వద్ద కూర్చున్న శిష్యుడు గురు ముఖము నుండీ వచ్చు అమృత ధారను సేవించు ఆనందములో మిగిలినవన్నీ మరచినట్లే , ఆ ప్రాణ దేవుని సందర్శనానందములో అడగాలి , చెప్పాలి మొదలైన మనో వృత్తులన్నీ నిద్రించినట్లు , సర్వమూ నిలిచిపోయి నట్లు విశ్వామిత్రుడు సుఖముగా ఉంటాడు. 

No comments:

Post a Comment