SHARE

Monday, July 30, 2012

53. " మంత్ర ద్రష్ట " యాభై మూడవ తరంగం .



యాభై మూడవ తరంగం .

     విశ్వామిత్రుని ఆశ్రమోపాంతము లో మెరుపు మంటపము వంటి ఒక విమానము వచ్చి దిగింది . దానినుండీ ఇద్దరు దివ్యాంగనలు దిగి వచ్చారు . ఇద్దరికీ దిగులు . ఏదో గాబరా . వేటగాడి భయము చేత బెదరి ఉన్న హరిణుల వలె కళ్ళు వెడల్పు చేసుకొని చుట్టు చూస్తూ , వేయబోయే అడుగులో ఏ విపత్తు పొంచి ఉందో అని బెదురుతూ నడుస్తున్నారు . చూడబోతే అభిసారికల్లాగా ఉన్నారు . అభిసారికలై ప్రియుడిని వెతుక్కుంటూ వెడలిన వారికి , అందులోనూ దివ్యాంగనలకు ఇంతటి దిగులెందుకో ...

     " రంభా , నువ్వు ఇంతగా భయపడుతున్నది చూస్తే ఏదో ఒక  అనర్థమవుతుంది అనే చెప్పాల్సివస్తుంది . ఆ రాజర్షి మన మేనక పైన అంతటి అభిమానము చూపినవాడు , మనము మేనక ప్రియ సఖులము అని తెలిస్తే అతని అభిమానము మనకు కూడా ఎంతో కొంత దొరక్కపోదు . లేదు , అతడు తపస్వి అంటావా  , తనతో పాటు తపస్సు చేయమని అంటాడు , అంతే కదా ? . మన మనోభిలాషను ఈడేర్చుకొనుటకు మనము కూడా ఆ ఆటను ఆడితే సరిపోదా ? " 

     " ఘృతాచీ , నా స్థితి ఆడదానినైన నాకే అర్థము అగుట లేదు . ఈ తపస్వులు ధర్మ సంమూఢులు . మనము కామము కోసము ఏదైనా బలి ఇచ్చునట్లే , వీరు ధర్మము పేరు చెబితే ఏమైనా చేసేస్తారు . తపస్సు చేత దగ్ధమైపోయిన ఆ పాడు హృదయములో ఇంకే లలిత భావనలకూ అవకాశమే ఉండదు . కాబట్టి , కొండ పైనుంచీ అత్యుత్సాహముతో కిందకు దిగిన నది , ఇసుక మేట లను చూసి , అయ్యో , ఇసుకలో ఇంకి పోవలసినదేనా అని విధి లేక , దారిలేక ముందుకు పోవునట్లు వస్తున్నాను . " 

     " ఏమి మాట్లాడుతున్నావే ? నువ్వు దేవతవు కావా ? ఏమి జరగనున్నదో  చూడు . దానికి తగినట్లు నడుచుకో " 

     " పిచ్చిదానా , దేవతలను విధి కాపాడుతుంది , ఆ భయము లేదు , కానీ  నేను దేవతనే అయినా ,  నా స్వభావము నాకు తెలుసు . ఆడది తాను ఓడిపోతేనే గెలుపు పొందేది . మొదట ఓటమి , ఆ తరువాతే గెలుపు . కానీ నా పాడు స్వభావానికి అది లేదు . నేను మగవాడి మనసును జోడించిన ఆడ దేహాన్ని . గెలవాలి , గెలవాలి అని మాత్రమే ప్రయత్నించి ఓడిపోతాను . అందుకే నాకు కామ తృప్తి లేదు . లేకపోతే , నన్ను ఇష్ట దేవత వలె ఆరాధిస్తున్న యక్షేశ్వరుని కుమారుని కన్నా నాకు ఇంకెవరు కావాలి ? ఈ పుణ్యాత్మునికి నేను కావాలో వద్దో ? ఏదైతేనేమి , సముద్రములో పడు నది వలె నేను ముందుకు దూకుతున్నాను . " 

     " ఇది మిక్కిలి బాగున్నదే  , రంభా ! నీ రూపము ఎంతటి అద్వితీయమైనదో నీకు తెలిసినట్లు లేదు . ఈ మొక్కలు , తీగలు , చెట్లు మొదలుకొని ఈ వనస్థలి అంతా చేతనములైనట్లు కనిపిస్తున్నాయి , ఎందుకో తెలుసా ? నీ రూపాన్ని చూసి ఉద్రిక్తమై కంపించుతున్నవి . ఈ నది ఏమిటో తెలుసా ? ఈ వనస్థలి , ఇంతటి రూపరాశిని పొంది కూడా అనుభవించు భాగ్యము లేదు కదా అని నీరవముగా రోదించి పెట్టుకున్న కన్నీరు . పిచ్చిదానా , భగవాన్ వశిష్ఠులను మించినవారున్నారా ?  వారు కూడా నిన్ను చూస్తే ఒక్క ఘడియ యైనా మనోవైకల్యమును పొందగలరు . అటువంటప్పుడు నువ్వు వెళితే ఇక్కడ నీకు జయము తప్ప వేరే ఇంకేమీ లేదు . గెలుచుటకే పుట్టినావు , గెలుస్తావు : మాలాగా నువ్వు ఆడ స్త్రీవి కాదు కదా ? " 

     " అదే నాకు తగిలిన శాపము . ఘృతాచీ , మేనక ఇతడిని ఆరాధించుటను ఆ దినము చూచితివి కదా , అటులనే నేను ఎవరినైనా ఆరాధించవలెనని ఆశ. కానీ ఏమి చేయుట , ఆ వచ్చినవారే నన్ను ఆరాధించవలెను అనిపించి , మగవాడిని కసవు కన్నా తక్కువ చేయుట నాకు అభ్యాసమైపోయింది . నేను ఇప్పుడు చేస్తున్నది అనుచితమైనది . దానివలన నాకు మహత్తరమైన హాని కాగలదు . కానీ , దానిని తప్పించుకొనుటకు దారి ఉన్నా , నాకు అసాధ్యము . అహంకారము కోసము కామాన్ని బలి ఇచ్చిన దాన్ని నేను . హూ ...కావలసినది కానీ , నేనేమి చేయగలను ? " 

     " నువ్వు భయపడుతున్నది చూస్తే రంభా , నీ భయానికి ఇంకేదో వేరే కారణమున్నదని అర్థమగుచున్నది . నువ్వు బయలు దేరునప్పుడు ఇంద్రుని అనుమతి తీసుకున్నావా ? " 

     " లేదు . ఆ దినము ఇంద్రుడు వస్తాడని  సందేశము వచ్చింది . వచ్చినపుడు అక్కడే ఊ కొట్టిద్దాము లే , అనుకున్నాను . అతడు రాలేదు . నేను చెప్పకనే బయలుదేరాను . నువ్వు అనుమతి తోనే వచ్చావా ? " 

     " ఊ .. ఎప్పటి లాగానే ఇంద్రభవనానికి వెళ్ళి అనుమతి తీసుకొనివచ్చాను . నువ్వూ అలాగే చేసి ఉంటే బాగుండెడిది . " 

     " చెప్పితిని కదా , మనసు అనర్థాన్ని కాచియున్నది . దాన్ని తప్పించుకొనుట కూడా ఇష్టము లేక , జరిగేది జరగనీ అన్న మొండితనము వచ్చేసింది . సరే , అదలా ఉంచు , నువ్వు అనుమతి అడిగినపుడు ఇంద్రుడేమన్నాడు ? " 

     "  ’ ఆతడిప్పుడు భగవాన్ అయి ఉన్నాడు . అతడు నాకు చాలా ఆప్తుడైన వాడు . నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆశపడుట నాకు మిక్కిలి ప్రియము . అయితే , నీ కోరికపై వెళుతున్నావు కాబట్టి  సర్వవిధములా నువ్వు అతనిని ఆరాధించి తృప్తి పరచెదనని మాట ఇవ్వ వలెను . దానిని తు చ తప్పకుండా పాటించ వలెను . జాగ్రత్త ! అలాగని ప్రమాణము చేయి ’  అన్నాడు " 

     " చూచితివా ? నేను వెళ్ళకపోవడమే మంచిదైంది . నేను గనక అటువంటి ప్రమాణము చేసి ఉండినా , నా తుంటరి బుద్ధి నాచేత ఏదో ఒక చేష్ట చేయించి వెయ్యి చిత్రాలను ఒకే మసి పాడు చేసినట్లు చేసి , మద్దెల లాగా రెండు వైపులా వాయింపులు తినునట్లు చేసేది . ఇప్పుడు వాయింపు వస్తే , ఒకే వైపు . అదే లాభము . " 

     " నువ్వు అటువంటి పాడు ఆలోచనలు చేయవద్దు . ఇదిగో , ఇదే ఆ ఆశ్రమము అనిపిస్తున్నది . రా , సౌమ్యముగా ప్రవేశిస్తాము " 

     " నువ్వు ప్రసన్న వై ప్రసాదాన్ని కోరు దానివి . నువ్వు ముందు వెళ్ళు . నేను ఒక ఘడియ ఇక్కడే ఉండి , ఒకసారి స్నానము చేసి ఈ విహ్వలత నుండీ మనసును  కుదుట పరచుకొని  వస్తాను . " 

     ఘృతాచీ పెదాలు వీడకుండా ముసి ముసిగా నవ్వి , ఆమాటకు ఒప్పుకుని , తనతో పాటు నవ్వుతున్న వనస్థలి తో కలసిపోయినట్లు ఆ చెట్లు పొదలలో మాయమైంది . 

     రంభ , స్నానాదులు చేసి , తనను అలంకరించుకున్నది . అక్కడున్న ఒక శిలా ఫలకాన్ని తన ప్రభావము చేత నిలువుటద్దముగా మార్చి  , అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది . అప్పుడే కురిసి గడ్డ కట్టిన శుభ్రమైన మంచు , ఎగిరి పోతున్న డేగ ఒకటి  పట్టుకొన్న  పావురపు శరీరము నుండీ , తనలో పడి ఇంకిన వేడి రక్త బిందువు యొక్క ఉష్ణానికి కొంత కరగిపోగా  , ఆ రక్తాన్ని చుట్టూ వ్యాపింపజేసుకొని కొంచము ఎర్ర బడిన విధంగా , తెల్లటి మంచు ముద్ద వలెనున్న ఆమె శరీరము , కామరాగముతో ఎర్రనై , ఎర్రటి దంతపు బొమ్మ వలె ఆకృతి చెంది  , ఎర్ర మందారపు వర్ణాన్ని అద్దుకొన్నట్లున్న ఆ పగడాల చీర తో పాటు సర్వమూ ఎరుపు మయము . . అపరంజిలో అద్దినట్లున్న కెంపు నగలు . అంతేనా , ఎర్రబడిన ఆ ముఖములో దిద్దుకున్న కుంకుమ బొట్టు కనపడాలంటే వెదకి చూడవలెను అనునట్లున్నది . 

     ఆ రూప దర్శనముతో తానే తృప్తి పడి , మద్య పానము చేత మత్తెక్కిన దానివలె విహ్వలయై , వేటను గురించియే చింతిస్తున్న వేటగానివలె ముందరి వ్యాపారాన్ని ఆలోచిస్తూ అద్దములో చూసుకుంటుండగా , తన వెనుక ఏదో కరాళాకృతి ఒకటి నిలచి ఉన్నది గమనించింది . 

చివుక్కున వెనక్కు తిరిగి , " ఎవరు ? " అంది 

" నేను భైరవుడిని . ఈ ధర్మారణ్యపు పాలకుడిని నేను . " 

" నా వద్దకు ఎందుకు వచ్చినావు ? " 

     " ఆశ్రమములో నడచు కార్యములకు నీవలన విఘ్నములు అవుతాయి . నువ్వు ఆశ్రమము లోనికి రాకూడదు అని చెప్పుటకు " 

" నీ ఆజ్ఞ ను మీరి లోపలికి వెళ్ళిన ? " 

" అనర్థమవుతుంది " 

" నేను భగవానులను చూచియే తీరాలి " 

" అది సాధ్యము కాదు " 

" కారణము ? " 

     " కామమొకటే జీవనపు లక్ష్యము అనుకొని , ఈనిన పులి వలె వేటాడి తినుదానివి నువ్వు . నీకు ఆ ధర్మమూర్తి దర్శనమెలా అవుతుందనుకున్నావు ? " 

" ఆతడే కావాలంటే ? " 

" అప్పుడు నీ కామ వాసనే నిర్మూలమవుతుంది . "

" నేను దేవతను . ఎక్కడికి కావాలన్నా వెళ్ళవచ్చు " 

     " ఔను , ఇంద్రుడి అనుమతితో వచ్చి ఉంటే అది నిజము . దుడుకు వద్దు . నీ దూకుడుతో అనర్థానికి గురి కావద్దు . నేను ఆడ , మగ అని చూడకుండా, బ్రహ్మ కర్మకు అడ్డు వచ్చు వారిని ఎవరినైనా సరే , ప్రహారము చేయు వాడిని .  వద్దు , వద్దు ." 

     రంభ లెక్క చేయకుండా ముందుకు కదిలి , ఆశ్రమపు భూమిలో ఒక కాలు పెట్టింది . ఇంకొక కాలు పెట్టేలోపు భైరవుని బడితె తగిలి , మహా శిలగా మారిపోయింది .

Sunday, July 29, 2012

52. " మంత్ర ద్రష్ట " యాభై రెండవ తరంగం .



యాభై రెండవ తరంగం .


     విశ్వామిత్రుడు అందరినీ వీడ్కొలిపి , సింధూ నదీ తీరానికి వచ్చి నిలిచాడు . చుట్టూ కొండలు . వాయవ్యము నుండీ నది ముందుకు దుముకుతూ అర్ధ చంద్రాకారముగా ప్రవహించి దక్షిణానికి ప్రవహించి వెళుతుంది . ఆ నదికి రెండు వైపులా కొండలవంటి ఎత్తైన చెట్లు . గిరి కన్య ,  ఎవరో తనకు కావలసినవారికోసము , ఉత్తమోత్తమమైన పచ్చటి బట్టలను తెచ్చి , గాలికి పరచినట్టున్న ఆ అడవి యొక్క పచ్చదనము వ్యాపించి ,  ఆ శ్రేష్ఠమైన భూమి సొగసులీనుతున్నది . అక్కడే విశ్వామిత్రుని ఆశ్రమము .

     ఇప్పుడు వారికి రెండే రెండు ఆలోచనలు . విశ్వము మొత్తాన్ని ఆర్యమయము చేయాలంటే ఏమి చేయవలెను .? ఏ యోగము , ఏ యాగము , ఏ ఉపాసన , ఏ కర్మ , ఏ వ్రతమును  చేస్తే అది సాధ్యమవుతుంది ? బ్రహ్మర్షులు కోరిన ఆ లోకపు కోరిక ఎప్పటికి తీరును ?  అను దీర్ఘాలోచనకు తోడు ఒక సమాధానము కూడా !  : " దీని వెనుక , ఈ కల్పమును , ఈ సాధనమును కనిపెట్టవలెనను దాని వెనుక , ఎంతెంతో గొప్పవైన మహా సంకల్పాలు , వాటి బలాలు ఉన్నాయి . కాబట్టి , ఏదో ఒకరోజుకు అది ఒక వాన లాగా రానే రావాలి . లేదా, వాన ఇప్పటికే వచ్చింది ; ఆ నీరంతా ఒకచోట చేరుతున్నది , నదియై , ప్రవాహమై రావాలి . వస్తుంది . " 

     రెండవ ఆలోచన , అప్పు తీర్చుట. ఇప్పుడది అంతగా కొరకడము లేదు . చేతిలో ధనము ఉన్నవాడు , " ఇంకేమి , ధనము వచ్చినది కదా ? చాలు , తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే సరి " అన్న ఊరటతో ఉన్నట్టే , ఇక్కడా ఊరట ఉంది . అయితే ఒక భేదము . అప్పుడు దాన్ని ఇంద్రుడి అప్పు అనుచున్న విశ్వామిత్రులు ఇప్పుడు అది భగవంతుని అప్పు అంటారు . అది అయినంత వేగముగా తీరాలి , లేదంటే దానికి ఎక్కువ  సమయము లేదు అనిపించు కొరత  కూడా  ఉంది . 

     ఇవి రెండూ ఒక్కసారే రావచ్చు . అప్పుడు తప్పకుండా రెండో దానికే ప్రథమ స్థానము . " సొంత అప్పును తీర్చి , తాను అనృణి అయి , భారాన్ని దింపుకుని ,  ఆత్మోద్ధారము చేసుకున్న వాడే  విశ్వోద్ధారములో చేతులు పెట్టాలి . లేకపోతే , ఈత రాని వాడు ,  నీటిలో పడ్డవాణ్ణి రక్షించుటకు పోయినట్లే అగును . కాబట్టి మొదట ఒక వివాహము చేసుకోవాలి . ధర్మ సంతానముగానే యాభై మంది పిల్లలను పొందాలి . వారిని తానే బలి ఇవ్వాలి . ఆ దుఃఖాన్ని కొట్టివేయుటకు ఇంకొక లోభాన్ని ఎదురుగా ఉంచుకొని , ముల్లును ముల్లుతో తీయునట్లే చేసి , తాను నిశ్చింతుడు కావాలి . 

     నిశ్చింతుడగుట ఏమో , బాగానే ఉంది , అయితే పిల్లలు అనగా దంపతుల సొమ్ము . తండ్రి ఒక్కడిదే కాదు . కాబట్టి , నాకు యాభై మంది పిల్లలు కావాలన్న , నూరుగురు పిల్లల్ని పొంది , వారిలో యాభై మందిని కన్న కడుపు చలువ కోసము వదలి మిగిలిన వారిని నేను ఉపయోగించుకోవాలి . అందులోనూ , తల్లులకు కనిష్టునిపై ప్రేమ . కాబట్టి మొదటి యాభై మందిని నేనుంచుకోవాలి . వారు గర్భానికి వచ్చునపుడే దుష్టులుగానే పుట్టనీ , వారి దౌష్ట్యమే వారిని చంపనీ . నేను అడ్డు వెళ్ళకుండా  ’ అయిపోనీ ’ అని ఊరకుంటే సరి  ." 

     అది సాధ్యము కాదు . వశిష్ఠ పుత్రుల మరణానికి నేను ఎలాగైతే కారణమయ్యానో ; లేక  నేనే కర్తగా నిలచి ఆ ఋషివధ ఎలాగ నడచిందో , అలాగే , ఇక్కడ కూడా నేనే కర్తగా నిలచి ఆ కార్యాన్ని నడిపించాలి . ఈ నరమేధము లో ఇంద్రియ సంతర్పణార్థమై , చిత్తోపశాంతి కోసమై ప్రత్యక్షమైన ఫలమొకటి ఉండాలి . ఔను , ఔను . ఇంద్రియాల కర్మమే అటువంటిది . అప్రత్యక్షముగా ఒక మేరు పర్వతమో ,  ఒక కాంచన గిరి యో దొరకునట్లైతే దానిని వదలి , ప్రత్యక్షముగా ఒక ముద్ద పిండి దొరికితే దానిని పట్టుకొనుట . ఇలాగ గోచరమగు అల్పము కోసము , అగోచరమగు అధికమును వదలి వేయుటయే ఈ ఇంద్రియాల కర్మ . నేను కూడా ఈ ఉపాయాన్నే అనుసరించి ఆ నరమేధాన్ని నిర్వహించవలెను .  " 

     " అలాగయితే , ఈ నూరుమంది పిల్లల్ని పొందడానికి సమయము కావలెను . మానవ గర్భములో శత పుత్రులగుటకు శతమానమే కావాలి . నాకు శతమానము ఒక లెక్క కాదు . అయితే చేయవలసిన ఇతర కార్యములు ఉన్నపుడు , ఒక శతమానము ఈ చంపడాలు , కడగడాలలో కూర్చుంటే ఎలాగ ? కాబట్టి ఎవరైనా ఒక దివ్య కన్యను వివాహమాడాలి . ఆమెకు తపస్సును నేర్పించాలి . ఒకే గర్భములో శత పిండములను ఉత్పత్తి చేసి అవి ఏకాండము గా బయటకు వచ్చి , ఘృత కుంభములలో పక్వమగునట్లు చేసుకొనవలెను . మంచిదే , ఇది ప్రాణ దేవుల దయ వలన జరగవలసిన కార్యము . వైశ్వానరుడు మనసు చేస్తే , ఈ పని సాధ్యమవుతుంది . తన పడతి అవబోవు ఆమెను మచ్చిక చేసి ఒద్దికకు తెచ్చుకొను సాధనము తనలోని రాజర్షికి తెలుసు . ఔనౌను , నాకు అన్నీ ఉన్నాయి . పిల్లలు కావాలను కోరిక ఉంది . ఒకే సారి నూరు మంది పిల్లలను పుట్టించు విద్య తెలుసు , అయితే పడతి లేదు . చిత్రకారునికి రంగులు , లేఖిని , బుద్ధి , అన్నీ ఉన్నాయి,  పటము ఒక్కటే దొరకలేదు . కానీలే , దేవతలు ఉన్నారు కదా : మావల్ల కాలేని కార్యములు చేయుటకే గదా వారున్నది ? లేదా , వారి కార్యమును చేయుటకే గదా మేమున్నది ? వారేమి చేస్తారో చూద్దాము . ఇప్పటికింకా దక్షిణాయణము ప్రారంభము కాలేదు . ఇప్పుడే కదా వానలు మొదలయ్యాయి ? ఇంకొక దక్షిణాయన అవధి లోపలే అదంతా కావాలి . ఈ చింతా పరిహారానికి ఒక హోమమో , హవనమో , ఉపాసనో , ఏదో ఒకటి చేయాలి . " 

     ఇంతా చేసి ముఖ్యమైన దాన్నే మరచానే ? మా దంపతులు ఇద్దరమూ ఒప్పుకున్నంత మాత్రాన ఈ నరమేధము అవుతుందా ? మేమిద్దరమూ వంశపు సొమ్ము . వంశము పితృదేవతలది . వంశపు సొమ్ము ఏదైనా కానీ పితృ దేవతల ఆమోదముతోనే వినియోగము చేయతగినది . వారి అనుమతి లేనిదే మేము ఎంత పోరాడితే మాత్రము ఆ వినియోగము సద్వినియోగమై సత్ఫలము వస్తుందా ?  వారి ఇఛ్చ కు విరోధముగా మేము దేనిని ఉపయోగిస్తామో అది లేకుండా పోయి దాని దారిద్ర్యము కలుగుతుంది . కాబట్టి వారి సమ్మతి తోనే ఈ నరమేధము జరగాలి . పితృదేవతలు ఎప్పుడూ వంశాభివృద్ధి కావాలి అని కోరుతూ ఉంటారు . మరి వంశ నాశనాన్ని ఒప్పుకుంటారా ?  మరి నా ముందరి గతి ఏమి ? "  

     " గతి ఏమి ? అక్కడ కూడా ఒక లాభపు లోభము కావాలి . పితృ దేవతల ఉద్దేశమేమి ? తమ వంశము ఉండాలి : ఉజ్వలంగా , కీర్తి సంపన్నముగా , మహోన్నతముగా బ్రతుకుతూ ఉండాలి . కాదా ? సరే . తేజస్వియై , ఋషి ప్రతిభలున్నవాడై , దైవానుగ్రహ సంపన్నుడైన వాడు ఎవరైనా దొరికితే , వాడిని తీసుకోవడము , వాడికోసము ఈ యాభై మందినీ స్వాహా అనుట సరి . ఇదే సరి . ’ సిద్ధం సాధ్యాయ కల్ప్యతే ’ " 

     ఇప్పటికి అంతా సరిపోయింది . ఈ నదిని దాటి వెళ్ళి నేను చేయవలసినది ఏమి ? దేనిని పట్టాలి ? సాధనమేది ? సిద్ధి ఏది ? అంతటినీ నిర్ణయించుకోవడమైనది . ఈ నర మేధము కావాలంటే ఇంకొక నాటకమే నడవాలి . దాన్ని దేవతలు ఆడించాలి . పోయిన సారి మేనకను కట్టుకున్నపుడు కామమే ప్రధానమయినది .  ఈ సారి పెళ్ళాడునపుడు ఆ కామము దమనమై ,  చేతికి చిక్కిన గుర్రము వలె ఉండాలి . ఋషులు అగువారు యాభై మంది . ఋషి కల్పులగు వారు యాభై మంది . మొత్తానికి నూరు మంది పిల్లలను పొందుటకు మరలా గృహస్థుడను కావలెను . దేవతలు ఈ నాటకాన్ని నిర్వర్తించి నన్ను కృతార్థుడిని చేయాలి " 

Friday, July 27, 2012

51. " మంత్ర ద్రష్ట " యాభై ఒకటవ తరంగం .



యాభై ఒకటవ తరంగం .

     మరుసటి రోజు యథాకాలములో సభాసదులు చేరినారు . నిన్నటిరోజు అధ్యక్షులైన భగవాన్ పిప్పలాదులే ఈ దినము కూడా అధ్యక్షులు కావలెనని నచికేతులు కోరినారు . భగవాన్ పిప్పలాదులు లేచి నిలుచుని , " సదస్సుకు నమస్సులు . సదస్యులకు నమస్సులు . నిన్నటి దినము ఒక విశేషము జరిగినది . నేను సాయం హోమమును పూర్తి చేసుకుని కూర్చున్నపుడు భగవతి శృతి వచ్చి , " వత్సా ! నాకొక వరము కావలెను " అన్నది . యథావిధిగా అర్చించి , " అటులనే " అన్నాను . " నీదగ్గర ఉన్న ఆపోజ్యోతిర్విద్యను విశ్వామిత్రునికి దానము చేయి " అని యనుజ్ఞను ఒసగినది . దాని ప్రకారముగనే , ఈ దినమే విశ్వామిత్రులను వెదకుతూ వెళ్ళి , వారిని పిలుచుకొని వచ్చి , వారికి ఈ విద్యను అప్పజెప్పినాను . దాని వలన వారూ , నేనూ ఒకే స్థాయి వారమైనాము . ఇందుచేత నిన్నటి రోజు సభలో అనుజ్ఞ అయినట్లు పరీక్ష నడుపుటకు నేను సరియైన సాధనమును గాను . వారిని పరీక్షించ వలసిన అవసరము నాకు లేదు : క్షమించవలెను . బ్రహ్మర్షిత్వమును ఒప్పుకొనుటకు మాత్రమే అయితే నేను అధ్యక్షుడనగుటకు అవరోధము లేదు " అన్నారు . 

     సభవారు , " భగవానులు చెప్పినది సూనృతమే . ఇంకొకరిని అధ్యక్షులుగా చేయండి . " అన్నారు . అందరూ భగవాన్ యాజ్ఞవల్క్యులు అన్నారు . వారు లేచి , " సగము తెలిసి , సగము తెలియక ఉన్నపుడు పరీక్ష జరుపవలెను . నాకు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు అను విషయములో ఆవగింజంత కూడా అపనమ్మకము లేదు .  చూస్తుండగానే ఈతడు బ్రహ్మర్షి అనునది ఆత్మకు అర్థమవుతున్నది . ఇంకే పరీక్ష దానిని తెలియ జేయగలదు ? కాబట్టి , పరీక్ష అవసరము లేదు అంటాను నేను " అని ఊరకున్నారు . 

     తర్వాత , " భగవాన్ నచికేతులే ఎందుకు కాకూడదు ? " అన్నారొకరు . భగవానులు లేచి , " భగవాన్ పిప్పలాదులూ , యాజ్ఞవల్క్యులూ ఏ కారణముల చేత అధ్యక్ష పదవిని అంగీకరించలేదో , ఆ రెండు కారణాలూ నాకు కూడా ఉన్నాయి . కాబట్టి నాకూ , ఆ స్థానానికీ దూరము " అన్నారు . 

     " భగవాన్ వామదేవులు భరత కుల భూషణులు . అగ్ని దేవుని కృప వలన రహస్య విద్యలను పొందిన వారు . అదీకాక , భగవాన్ వశిష్ఠుల ప్రియ శిష్యులు . వారు కావచ్చు " అని ఇంకొక సలహా వచ్చింది . భగవాన్ వామదేవులు లేచి , " మేము కూడా పిప్పలాద నచికేతుల వలెనే విశ్వామిత్రులకు మా విద్యలను అప్పజెప్పిన వారము . అందువలన నేను ఇక్కడే ఉండాలి " అన్నారు . చివరికి సర్వానుమతితో భగవతీ గార్గి అధ్యక్ష స్థానాన్ని అలంకరించినది . 

      ఆమె చెప్పిన ’ పరీక్షా పూర్వకముగా ’ అన్న మాటను సభ ఒప్పుకున్నది . అయితే పరీక్ష ఎవరు జరపాలి ? అన్న విషయమై బహు పెద్ద చర్చయే యైనది . చివరికి సప్తర్షులలో ఒకరు మాత్రమే దానిని జరపాలి అన్నది అందరూ అంగీకరించారు . 

     సర్వులూ , ఈ పరీక్ష వశిష్ఠుల వల్లనే జరగాలి అని ఒప్పుకున్నారు . అయితే ఒకరు లేచి , విశ్వామిత్రులపైన వశిష్ఠులకు కొంచము కోపము ఉండవచ్చేమో అని వశిష్ఠ పుత్రుల సంగతి తీసుకొచ్చారు . " భాగీరథి కన్నా శాంతులు వారు . వారికి ఆ సంగతి గుర్తు కూడా ఉండి ఉండదు . ఒకవేళ ఉన్నా , పృథ్వి కన్నా వారు క్షమాగుణము ఎక్కువున్నవారు కారా ? " అని సమాధానము కూడా వచ్చింది .  ’ బహుశః వశిష్ఠులు విశ్వామిత్రులకు అనుకూలమై ఉంటారేమో ? ఎందుకంటే వారి దుఃఖాన్ని పోగొట్టుటలో వీరు పాత్ర పోషించినారు కదా ? " అని ఇంకొక్కరు అడిగారు . అయితే సభ అంతా ముక్త కంఠముతో , ’ భగవాన్ వశిష్ఠులు రాగ ద్వేష వశులగుతారు అన్నది , గాలి  హిమవత్ పర్వతాన్ని ఎగరేసుకు పోతుంది అన్నదీ , రెండూ ఒకటే ! " అంది. 

     చివరికి సభలో రెండు సూచనలు పరిశీలనకు వచ్చాయి . ’ మొదటిది , ఈ పరిషత్తు విశ్వామిత్రుల బ్రహ్మర్షిత్వమును వశిష్ఠుల ద్వారానే అంగీకరించవలెను . రెండవది , ఇక ముందు విశ్వామిత్రులను భగవాన్ అని సంబోధించవలసినది .’  రెండింటినీ సభ ఆమోదించింది . 

      భగవాన్ వశిష్ఠులకు ఈ విషయము తెలుపునది ఎవరు ? అన్నది చర్చకు వచ్చింది . చివరికి వరిష్ఠులంతా , " భగవానులు అగ్ని ముఖము నుండీ వస్తే ఒప్పుకుంటారు తప్ప , ఇక ఎవరు చెప్పినా వినువారు కాదు . కాబట్టి భగవాన్ యాజ్ఞవల్క్యులు అగ్ని ద్వారా ఈ విషయాన్ని వశిష్ఠులకు తెలియజేయ వలెను . " అని నిర్ణయించారు . 

     సభ ముగిసింది . భగవాన్ నచికేతులు అక్కడ విరాజమైన వారికందరికీ యథావిధిగా అర్చనాదులను సలిపినారు . అందరూ భగవానుల ఆశ్రమములో పరిషత్తు కోసము జరిగిన వితరణలను కొనియాడుతూ అందరినీ వీడ్కొని వెనుతిరిగారు . 

     ఆ పరిషత్తుకు వచ్చినవారంతా భగవాన్ విశ్వామిత్రులను ఒక్కొక్కరే వచ్చి పలకరించి , కుశల ప్రశ్నలను వేసి , తమ తమ అభినందనలను సమర్పించి తరలినారు . 

     భగవతీ గార్గి వచ్చి సాష్టాంగ ప్రణామము చేసినది . " భగవానులు నాపై ప్రసన్నులై ఉంటే నాకొక వరమునివ్వాలి " అని ప్రార్థించినది . 

" భగవతి ఆజ్ఞను ఆ శృతిభగవతీ ఆజ్ఞగా భావించి శిరసావహించెదను " 

     " దేవా , ఇక ముందు బ్రాహ్మణత్వ సాధన సులభమగునట్లు ఏదైనా ఉపాయమును కల్పించవలెను . రానురానూ కాలానుగుణముగా శక్తి , శ్రద్ధా సామర్థ్యాలు హ్రస్వమగుతూ వస్తున్నాయి . రాబోవు కాలములో తమవలె దీర్ఘ తపము చేయువారే లేకుండా పోయెదరు . బ్రాహ్మణ్యము ఖిలమవుతుంది . కాబట్టి సులభసాధ్యమగు ఒక కల్పము ఏర్పడవలెను . దానిని ఇక వేరెవ్వరూ చేయువారు లేరు . తమరే చేయవలెను . " 

     " ఇది సామాన్యమైన కోరిక కాదు , అయినా అలాగే కానివ్వండి , దేవతలు ఉన్నారు కదా ! ఈ బ్రహ్మాండపు వ్యవహారమంతా వారికి చెందినది . తమ కోరికను నెరవేర్చుట వారికి భారము కాదు . కానివ్వండి , నా తపస్సర్వస్వమునూ వినియోగించి అయినా దేవతలను ప్రార్థిస్తాను . ప్రయత్న లోపము లేకుండా చూచుకొనుట నా పని . ఇంతకు మించి దీనిపై ఏమి చెప్పగలను ? " 

     " భగవానులు నాకు ఇచ్చినది వరము . ఇచ్చిన మాట తీరువరకూ వాగ్దేవి హఠము చూపియైనా ప్రబోధించునన్నది లోకవిదితమైన విషయము . ఇవి రెండూ గుర్తుంచుకోండి . ఇదిగో , దేవా , నా తపస్సునంతటినీ తమకు ధారపోస్తాను . లోకమంతా బ్రాహ్మణ్యము తో నిండవలెను . దానికేమి కావాలో అది అగుగాక . " 

     ఆ మాట విని బయటికి వెళ్ళినవారిలో ఒకరు మరలా లోపలికి వచ్చారు . " అస్తు , అస్తు . భగవతీ వారి కోరిక అన్నివిధాలా సాధు సమ్మతమైనది . మంటలో వేసిన వంట చెరకు మంట అవుతుంది . అటులనే , ఆర్యులమైన మనము లోకము నంతటినీ ఆర్యమయము చేయుటా ? లేక దాని తోపాటు మనము కూడా అనార్యులమగుటా ? ఇది ఆమె ప్రశ్న. లోకమంతా బ్రాహ్మణమయమైతే  అనగా , ఆర్యమయము కావలెను . దాని సాధనమును కనిపెట్టుటకు ’ అన్యమింద్రం కరిష్యామి ’ ( వేరొకరిని ఇంద్రుని చేస్తాను ) అని నేలను తట్టి  ఘోషించిన ధీరుడు కాకపోతే ఇంకెవరు సమర్థులు ? ప్రయత్న లోపమంటిరి . తపస్సుకు సాధ్యము కానిది ఏదీ లేదు . ఇదిగో , ఈ యాజ్ఞవల్క్యునికి ఉన్న తపస్సు ఆవగింజ కానీ , పర్వతము కానీ , అదంతా తమది . తమరు గెలిచి లోకాన్ని గెలిపించండి . " 

     ఆ వేళకు భగవాన్ నచికేతులు  వృద్ధ దంపతుల ద్వయాన్ని  పిలుచుకొని , ’ భగవానులకు సమయమున్నదా ? ’ అంటూ లోపలికి వచ్చారు . వచ్చినవారు లోపాముద్ర , అగస్త్యులు -మరియు అనసూయ అత్రులు . అందరూ లేచి వచ్చినవారికి అష్టాంగముగా అభివాదన చేసినారు . పరమ పూజ్యులైన ఆ దంపతులు వస్తుండగానే ఆ పర్ణశాల ,  బ్రహ్మ సభ వలె దేదీప్యమానమైనది . అందరికీ ఆనందమే ఆనందము . 

     వచ్చినవారైతే , " భగవాన్ విశ్వామిత్రులకు క్షేమమా ? మేము నిన్ననే రావలసినది . కానీ భగవానుల ఆహ్వానము వచ్చు వేళకు ఒక ఇష్టి ప్రారంభించి యున్నాము . దానిని పూర్తి చేయకుండా వచ్చుటకు లేదు . అందువలన ఆలస్యమైనది . కోపము చేసుకొనకూడదు " అని యథోచితముగా సమాధానమిస్తూ తమ ఆనందాన్ని ప్రకటించినారు . 

     ఇక్కడ ఇలాగ వీరంతా మాట్లాడుతుండగనే ఇంకా ఇద్దరు వచ్చినారు . పిప్పలాదులు , వామదేవులు . ఇద్దరూ వస్తూనే లోపాముద్రాగస్త్యులనూ , అనసూయాత్రులనూ చూసి విస్మయము చెంది , " ఇంకేమి ? మేము వచ్చిన పని కాకెట్లుండును ? ఉమా మహేశ్వరుల వలె , లక్ష్మీ నారాయణులవలె , రెండు రూపములై వచ్చిన భూమ్యాకాశాలవలె  ఈ దంపతులు వచ్చియున్నారు . అవంధ్య దర్శనులు వీరు . వీరి సమ్ముఖములో సలిపిన ప్రార్థన సఫలము కాక పోవుటయే లేదు . బహుశః వీరు మా ప్రార్థనను సఫలీకృతము చేయుటకే వచ్చినారేమో ? " అని సంతోషించారు . 

     పరస్పర కుశల ప్రశ్నల తర్వాత అందరూ తమ తమ ఆసనములలో కూర్చున్న తరువాత , అగస్త్యులు " మీ కోరిక ఏమిటది ? విని ఆనందించాలని మా చెవులు తహ తహ లాడుచున్నవి . అది నెరవేరుటకు మా తపస్సు ఏమైనా కావాలన్న తప్పక ఇచ్చెదము . " అన్నారు . అత్రి మహర్షి మాట్లాడుతూ , " తప్పకుండా కోరిక తీరుగాక . మేము చేయవలసినదేమైనా ఉంటే దానికి మేమూ సిద్ధమే " అన్నారు .

     పిప్పలాదుల కోరిక పైన వామదేవులు చెప్పినారు , " పెద్దలందరూ చేరినారు . కాలవశమున హ్రస్వమగు శక్తి సామర్థ్యములను  చూచి ముందు కాలముల వారు బ్రాహ్మణ్యమును పొందుటకు సులభమైన కల్పమొకదానిని కనిపెట్టవలెనని భగవాన్ విశ్వామిత్రులను వేడుకొనవలెనని వచ్చినాము . తమరందరూ ఉన్నారు . తమరి అనుజ్ఞ ప్రకారము  కానివ్వండి . " అన్నారు . 

     అత్రి సూచన మేరకు అగస్త్యులు చెప్పినారు " మేము కూడా దీనికోసమే వచ్చియున్నాము . మేము వచ్చు వేళకు పరిషత్తు ముగిసిపోతుంది అని మాకు తెలుసు .  అయితే , భగవాన్ విశ్వామిత్రులు విశ్వ మిత్రులై ’ సర్వేషాం హితాయ ’ ఒక కల్పాన్ని సిద్ధము చేయవలెను . లోకోపకారము చేయవలెను . వయో వృద్ధులమైన మేము జ్ఞాన వృద్ధులైన వీరిని యాచించుటకు వచ్చినాము . " 

     విశ్వామిత్రునికి కంట నీరు చిప్పిల్లింది . అక్కడ చేరిన మహానుభావుల తపోజ్వాల యొక్క వేడి తగిలి , హిమవత్పర్వత శిఖరమొకదానిలో ఉన్న హిమము కరిగి నీరై దిగివస్తున్నదా అన్నంత ధారాళముగా కంట నీరు తిరుగుతుండగా , లేచి నిలబడి  వినయముతో చేతులు జోడించి అన్నారు , " ఒక్కొక్క బ్రహ్మాండపు తపస్సే ఒక్కొక్క మూర్తియై వచ్చినదా అన్నట్టు వచ్చిన తమలో ఒక్కరు ఆజ్ఞ ఇచ్చిననే శిరసా ధరించుటకు చాలినట్లున్నపుడు , వేదమూర్తులైన తమరందరూ చేరి ఇచ్చిన ఈ ఆజ్ఞ నన్ను మిక్కిలి యనుగ్రహించుటకే . నేను ఏదో అహంకారమున లోకానికంతా మిత్రుడనని విశ్వామిత్రుడని పేరు పెట్టుకున్నాను . ఈ పేరు సార్థకము కావలెనని తమరు అనుగ్రహిస్తున్నారు . తమ ఆశీర్వాద బలము వల్లనే ఈ కార్యము కాగలదు . కానీ కీర్తి నాకు కలగవలెనని నాపై పరమ విశ్వాసముతో ఈ కార్యమునకు నన్ను నియోగించుచున్నారు . మీలో ఎవరైనా ఒక్కరు చిటికె వేయు నంతటి సులభముగా చేయగలిగినట్టి ఈ కార్యమును నాకు అప్పజెప్పినారు . శిరసావహించి తమ ఆజ్ఞ నెరవేరుస్తాను " అని సాష్టాంగ నమస్కారము చేసినాడు . 

     అక్కడున్న వారందరి కోరిక పైన అత్రి మహర్షి అన్నాడు , " భగవాన్ , తమరు నుడివినది సత్యము . ఇక్కడ చేరినవారిలో  ఒక్కొక్కరూ ఈ అఖండ బ్రహ్మాండపు యోగ క్షేమమును వహించగలరు . అయినా కూడా , త్రికాలజ్ఞులైన ఈ మహానుభావులు తమ ఆగమనము కోసమే ఎదురు చూస్తున్నారు . వశిష్టాశ్రమములో నందిని ధేనువు కోసము తమరు లోభము పడినపుడే మేమంతా , ’ సరే , లోక హితపు కార్యము ఆరంభమయినది , కౌశికుడు విశ్వామిత్రుడై విశ్వోపకారి యగు కాలము వేగముగా సన్నిహితము కావలెను ’ అని  ఆశలు పెంచుకున్నాము . ఆ సత్కాలము వచ్చినది . అగుగాక , మా అందరి ఆశీర్వాదములు , తపస్సు అన్నీ తమవి యై  లోకోపకారమగు గాక " అన్నారు . 

     అందరూ తథాస్తు , తథాస్తు  అన్నారు . విశ్వామిత్రుడు మరల ప్రణామము చేసి ఆ నియోగమును గ్రహించాడు . 

Thursday, July 26, 2012

50. " మంత్ర ద్రష్ట " యాభయ్యవ తరంగం .



యాభయ్యవ తరంగం .

     ఋషి పరిషత్తు నచికేతాశ్రమములో సమావేశమయినది . దూర దూరములనుండీ , ప్రసిద్ధులైన బ్రహ్మర్షి , మహర్షి , దేవర్షులంతా దయచేసియున్నారు . అందరూ మధుపర్కానికి యోగ్యులైనవారు . వేద పురుషుని అనుగ్రహము వలన అనేకానేక ఋక్సామములను ప్రత్యక్షముగా దర్శించి , పాడి , లోకోద్ధారకులైన వారు . వేద వేదాంగ పారంగతులు . అనేకములైన యజ్ఞములలో సోమపానము చేసి కృతార్థులైనవారు . ధర్మజ్ఞులై , బ్రహ్మ వేత్తలై తమ తపోబలము చేత బ్రహ్మాండమును ప్రళయము గావించి మరలా సృష్ఠించగల సమర్థులు . అందరికీ , " వశిష్ఠులు వచ్చియుండిన బాగుండెడిది . " అన్న ఆలోచనే ! వారు వరుణ లోకమునకు వెళ్ళియున్నారు . ఎప్పుడు వచ్చెదరో తెలియదు , వారికోసము వేచియుండుటకు కాదు . 

     భగవాన్ పిప్పలాదులు అధ్యక్షులు కావలెనని నచికేతులు సూచించారు . భగవాన్ యాజ్ఞవల్క్యులు దానిని అనుమోదించారు . భగవతి గార్గి , " ఈ ధర్మబ్రహ్మ పరిషత్తుకు అధ్యక్షులు అగుటకు భగవాన్ పిప్పలాదులు సర్వవిధములా అర్హులు " అని శ్లాఘించినది . సుమంతు , కహూళ , బభ్రు మొదలైన బ్రహ్మర్షులు తథాస్తు అన్నారు . పిప్పలాదుల అధ్యక్షతలో సభ మొదలైంది . 

     సభను సమావేశపరచిన నచికేతులు లేచి నిలచి , " పెద్దలకు నమస్కారము , పిన్నలకు నమస్కారము , సమానులకు నమస్కారము . ఈ రోజు మనము సమావేశమైనది , తపోబలము చేత బ్రాహ్మణ్యమును సాధించి , బ్రహ్మర్షి అగునట్టి విశ్వామిత్రుల బ్రహ్మర్షిత్వాన్ని అంగీకరించుటకు . ఈ సూచనకు సాధకబాధకములు , అభ్యంతర ఆమోదములు యేమి ఉన్ననూ సభముందు ఉంచుట మనందరి కర్తవ్యము . " అన్నారు . 

     భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి , " ప్రత్యక్షముగా విశ్వామిత్రులను చూచినది ఇదే మొదటిసారి . త్రిశంకు మహారాజును స్వర్గానికి పంపించిన మహానుభావులు  వశిష్ఠులకు ప్రాప్తమైన పుత్ర శోకాన్ని తుడిచివేయుటకు కారణులైనవారు . బ్రహ్మర్షి యగుటకు ఈ రెండింటిలో ఏ ఒక్కటైననూ చాలు . అటువంటప్పుడు రెండూ ఉన్నపుడు మనము వెనుకాడుటకు ఏ కారణమూ లేదు . వీటికి తోడు , సింధూ ద్వీపుల వంశస్థులు , మరియూ వీరి తండ్రియైన కుశిక మహారాజు , చ్యవన మహర్షికి సేవలు చేసి బ్రాహ్మణ్యమును అనుగ్రహించమని వేడుకున్నాడు . అప్పుడు వారు ’ నీకు ఆ యోగము లేదు , నీ కొడుకు బ్రాహ్మణుడు కాగలడు ’ అని అనుగ్రహించారు . అందువలన , ఆ ఋషివాక్కును నెరవేర్చుటకే ఈ రోజు మనము చేరినది . అది నిరాటంకముగా , నిస్సందేహముగా కాగలదు . ధర్మ బ్రహ్మ పరాయణులైన నచికేతుల సూచనను నేను త్రికరణశుద్ధిగా ఆమోదిస్తున్నాను . " అన్నారు .

     భగవతి గార్గి లేచి అన్నారు , " భగవాన్ నచికేతులు సూచించి , భగవాన్ యాజ్ఞవల్క్యులు ఆమోదించిన మీదట ఏదేమైననూ ఒక స్త్రీ గా నేను సమర్థించియే తీరవలెను . అయితే , బ్రహ్మర్షిత్వము ఒకరి , ఇద్దరి అభిమానము వలన వచ్చు పదవి కాదు . క్షత్రియుడై యుండిన ఇతడి దేహములోనున్న పంచభూత తన్మాత్రలన్నీ పరిశుద్ధమై సత్వగుణానికి వచ్చినవి అని పరీక్ష జరిగి సిద్ధాంతము కానివ్వండి . ఆ వెంటనే నేను ఒప్పుకుంటాను . " అన్నారు .

     భగవాన్ పిప్పలాదులు లేచి నిలుచున్నారు . " సభకూ , సభికులకూ నమస్కారములు . భగవతీ గార్గి యంతటివారు అడిగిన ప్రశ్న సాధు సముచితమైనది . నేను ఈ అధ్యక్ష స్థానములో లేకుండా , అక్కడ సభలో కూర్చొని ఉంటే , నేను కూడా అదే మాట అడిగెడివాడను . బ్రహ్మర్షిత్వమంటే సామాన్యము కాదు . రేపటి దినములలో సప్తర్షుల స్థానమునకు పొందుటకు యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఆ పదవి . సప్తర్షుల స్థానమంటే సామాన్యమైనదా ? సృష్ఠికి వచ్చు ప్రతియొక్క ప్రజ పైననూ అధికారము చూపవలెను . సృష్ఠి కర్తయైన ప్రజాపతికి సహాయము చేయవలెను . కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న చాలా సాధుసమ్మతమైనది . ప్రతియొక్కరూ పర్యాలోచించి , నిర్దాక్షిణ్యముగా , నిష్పక్షపాతముగా అడగ వలసినవి అడిగి ,  వినవలసినదంతా విని , తర్వాత తీర్మానించవలసిన మాట ఇది . అధ్యక్ష స్థానములో ఉండి ఈ మాటలు ఆడినది తప్పైతే మన్నించవలెను " అని చేతులు జోడించి కూర్చున్నారు .

     మహర్షి నోఢా లేచారు . " సభవారికీ , సభికులకూ , సభాపతులకూ నమస్కారములు . ఇక్కడ కూర్చున్న మనమంతా వేద పురుషుని అనుగ్రహము వలన మహర్షులమైన వారము . ఆ వేద పురుషుని సాక్షాత్కారము చేసుకొని , అతడు చెప్పినట్లే విందాము . మనము స్వతంత్రించుట వద్దు " అన్నారు . 

     భగవతీ విశ్వావరా లేచి నిలుచున్నారు , "  సదస్సుకూ ,  సదస్యులకూ , సదసస్పతులకూ నమస్కారములు . వేద పురుషుని ప్రార్థించి అతని అనుజ్ఞ అయిన విధముగా నడచుకొనుట మనకందరికీ విహితమే . అయితే , భగవాన్ నచికేతులు సూచించిన తర్వాత  , విశ్వామిత్రులకు వేదపురుషుని ఆజ్ఞ కాలేదు అని మనము భావించుట మనము వారిపై యుంచిన గౌరవమునకు తగినట్లు లేదు .  మనము వేదపురుషుని పిలిచి యడుగుట యంటే , మనకు ఆవగింజంత కూడా స్వాతంత్ర్యము లేకుండా పోయినట్లే . బుద్ధిమంతులైనవారు , ప్రమాణములనూ , లక్షణములనూ ఆధారము చేసుకొని స్వతంత్రముగా సిద్ధాంతము చేస్తారు . అలాకాక , కేవలము యుక్తి వల్ల మాత్రమే సిద్ధాంతము చేస్తే , దానికన్నా ప్రబలమైన యుక్తి వచ్చినపుడు అనుతాపము చెందవలసి యుండును . కేవలము శృతి వచనము ప్రకారము సిద్ధాంతము చేస్తే , అప్పుడు , సందేహము నివారణ కాకపోగా , ప్రభువుల సమ్మతి వలన తప్పనిసరిగా నడచిన కార్యమని ఎప్పుడో ఒకప్పుడు శంకించ వలసి యుంటుంది . ఈ రెండూ వద్దు . కాబట్టి , ఈ సభ , ప్రమాణ లక్షణములను బాగుగా తెలుసుకొని , ఎవరైనా ఒకరిద్దరిని సభాముఖముగా ఉంచుకుని పరీక్ష చేయుట మంచిది . అని వినయముతో తెలియజేసి కూర్చున్నది . 

     మహర్షులూ , బ్రహ్మర్షులు అందరూ ఆమాటకు ఒప్పుకున్నారు . అందరూ , బ్రహ్మత్వమూ , ఋషిత్వమూ విశ్వామిత్రునికి ప్రాప్తమైనవి అని ఒప్పుకుని , అయినా పరీక్ష కావలెను అన్నారు . భారధ్వాజులు అన్నారు , " అక్కడ చూడండి , వేద పురుషుని పరమానుగ్రహము లేకపోతే ముఖములో  ఆ తేజస్సూ , వర్ఛస్సూ ఉంటుందా ? మనమేమి , పామరులమా ? దేవతలను సాక్షాత్కరించుకొని వందలాది యాగములయందు భాగము వహించిన మనకు తెలియకపోతే  , ఇంకెవరికి తెలుస్తుంది ? "

     గౌతములు అన్నారు , " అగ్ని రహస్యము తెలియనివారికి ముఖములో ఈ కాంతి యుండుట అసాధ్యము . " 

     భార్గవులు అన్నారు , " గౌతముల మాట నిజము . అగ్ని మా కులదైవము . అగ్ని విషయము నేను తెలిసినవాడను . ఇతడు నిజముగా బ్రహ్మర్షి యైనాడు . " 

     ప్రతి ఒక్కరూ , " సభాపతులే పరీక్షా కార్యమును నెరవేర్చవలెను . మరుసటి రోజు సభలో వారు జరిపిన పరీక్ష ఫలితాంశమును తెలుపవలెను . దాని ప్రకారమే సభ నడచును " అన్న సిద్ధాంతాన్ని అంగీకరించారు . 

ఆరోజుకి సభ ముగిసింది . అందరూ స్వకర్మానుష్ఠానములకు తరలినారు . 

Wednesday, July 25, 2012

పితృ తర్పణము --విధానము




శ్రీః

శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను )

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..
.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,


-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||


| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )









తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి
తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...
ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.
దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)
అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...
( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)
మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..
|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||
|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం
--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |


తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం
------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి
అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి
|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |
ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||


దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||


అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే...ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||


ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్


( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి ... బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )
( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )


ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

Monday, July 23, 2012

49. " మంత్ర ద్రష్ట " నలభైతొమ్మిదవ తరంగం .



నలభైతొమ్మిదవ తరంగం .

     మరునాడు వామదేవ, విశ్వామిత్రులిద్దరూ మహర్షి నచికేతుని ఆశ్రమమునకు బయలుదేరి వెళ్ళారు . అక్కడి వారికి వీరిద్దరూ వస్తారన్నది తెలిసి ఉన్నట్టుంది , సాక్షాత్తు నచికేత భగవానులే వీరికోసము ఆశ్రమ వాకిటి దగ్గర వేచియున్నారు . బ్రహ్మవిద్యా సంప్రదాయాన్ని వెలికి తెచ్చినట్టి కర్తలలో ఒకరైన నచికేతుని ఆశ్రమంటే సామాన్యమా ? బ్రహ్మవిదులు , బ్రహ్మజ్ఞులు , బ్రహ్మిష్ఠులు, బ్రాహ్మణులు  అక్కడ లెక్కలేనంత మంది ఉన్నారు . అందరూ ఉపనిషత్ పారాయణము చేస్తూ వీరికై ప్రతీక్షిస్తున్నారు . 

     ఆకాశ మార్గములో వచ్చి ఇద్దరూ ఆశ్రమపు ఉపాంతములో దిగారు . అక్కడున్న మృగ పక్ష్యాదులు సంభ్రమముతో వీరి రాకను ఘోషిస్తూ ఆశ్రమపు వాకిలి వరకూ వెంట తీసుకొని వచ్చాయి . అక్కడున్న చెట్లూ పొదలూ కూడా తమ కొత్త చిగురులను మెరిపిస్తూ కొత్త బట్టలను కట్టుకున్న ఆడ పిల్లల వలె వారికి స్వాగతము పలికాయి . పక్కనే ప్రవహిస్తున్న భాగీరథి కూడా తన మంజుల నాదముతో మంగళ గీతాలను ఆలపించింది . 

     భగవాన్ నచికేతులే ఇద్దరికీ అర్ఘ్య పాద్యాదులను ఇచ్చి , పిలుచుకొని వెళ్ళి వారిని అతిథి గృహములో ఆశీనులను చేశారు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాయి . మధుపర్క దానముతో అతిథి పూజ ముక్తాయించారు . 

     మిగిలిన అందరినీ వీడ్కొలిపి నచికేతులొక్కరే మిగిలారు . " అతిథులకు ఆయాసము లేనియెడల , స్నానానికి లేవవచ్చును " అని ఉపచార పూర్వకముగా వారికి స్నానాదులు కల్పించి , అయిన తర్వాత తమ అగ్ని గృహానికి పిలుచుకొని వెళ్ళారు . అక్కడ వామదేవుడి ని సాక్షిగా యుంచుకొని , " బ్రహ్మర్షులకు అగ్ని విద్య , బ్రహ్మ విద్య లలో ఏది కావాలనిన , దానిని తీసుకొన వచ్చును . సమ్మతమైతే రెంటినీ అంగీకరించ వచ్చును  . అయితే , ఉపదేశ పూర్వకముగా కాదు : దానముగా ! . యజ్ఞేశ్వర భగవానుల అనుజ్ఞ అయినది " అన్నారు .

     విశ్వామిత్రునికి ఆశ్చర్యము పైన ఆశ్చర్యము . భగవానులు తనకు వామదేవునితో సరి సమానముగా మధు పర్కాలను ఇచ్చినదీ , తనను బ్రహ్మర్షి యని సంబోధించినదీ అతనికి బ్రహ్మానందాన్ని కలిగించి , తన జన్మ సార్థకమైనదన్న కృత కృత్యతా  భావాన్ని తెచ్చిపెట్టాయి . అతనికి ఏమి మాట్లాడాలన్నదే తోచకుండా పోయింది . మూగవాడివలె కూర్చున్నాడు . అది చూసి , వామదేవుడే మాట్లాడాడు . 

     " భగవానులు త్రికాలజ్ఞులు . హృదయ గ్రంధి విఛ్చేదన సంప్రదాయాన్ని భగవాన్ వైశ్రవణుల నుండీ పొందిన మహానుభావులు . తమరు ఈ మహావిద్యలను ఇచ్చెదరను మాట మాత్రముననే ఈతడు తృప్తుడై ఆనంద పరాకాష్ట దశకు వచ్చాడు . ఇంక కావలసిన దేమున్నది  ? తమంతటి వారు ఇచ్చెదను అని సంకల్పించిన క్షణమే  ఆ విద్యలు ఈ పాత్రుడిని చేరి అనుగ్రహించాయి . కాబట్టి , ఏది కావాలి అని అతడిని అడిగి ఇచ్చుట కన్నా , ప్రదాతృలైన తమరే , తమకు అనుజ్ఞ అయినట్లు ఉభయ విద్యలనూ ఇచ్చి ఈతడిని అలంకృతుడిని చేయండి. " అన్నాడు . 

     భగవానునికి ఆ మాట సొంపుగా అనిపించింది . " వశిష్ఠుల శిష్యులకు కాక , ఇతరులకు ఈ వినయము ఎక్కడనుంచీ రావలెను ! మొత్తానికి వామదేవులు , " ఉభయ విద్యలనూ ఇవ్వండి , లోభము చేయకండి " అని అనుజ్ఞ ఇచ్చారు . అలాగే . వాశిష్ఠుల ఆజ్ఞ . ముఖ్యముగా భగవాన్ యజ్ఞేశ్వరుని కృప విశ్వామిత్రులకు అయాచితముగా వచ్చినపుడు , మిగిలినవి తమంతట తామే ఎందుకు లభ్యము కావు ? " అని విశ్వామిత్రుని ముఖమును చూశారు . 

     అతడు లేచి , చేతులు జోడించి , " నేను ఎంతైనా తమ అనుగ్రహపు వర్గము లో చేరిన వాడిని . తమ ఆజ్ఞను పాలించుటకు బద్ధుడను " అని నమస్కారము చేశాడు . 

     భగవానులు నవ్వుతూ అతడిని పట్టుకొని చిన్న పిల్లవాడిలా పైకెత్తి , " అగ్నిలో పెద్దదేది ?  , చిన్నదేది ? అన్ని వ్యత్యాసములూ అగ్ని అగువరకే . అయిన తరువాత ఏ భేదమూ లేదు . అక్కడ తారతమ్యాలు చూచుట కార్యానుగుణముగా మాత్రమే . అదుండనీ , గౌరవానికి మేము ఎంత పాత్రులమో , మీరూ అంతే పాత్రులు . తమరు కూడా గోత్ర ప్రవర్తకులవుతారు . అంతే కాదు , మంత్ర పతులూ , మంత్ర ద్రష్టలూ అవుతారు . వేదపురుషుడు తమనుంచీ అపారసేవను పొందుటకు వేచియున్నాడు . మేము భూతార్థపు బలము చేత గౌరవ పాత్రులమైతే ,  తమరు భవిష్యదర్థపు సంపత్తు చేత గౌరవార్హులు . " అని అభిమానముతో పలికి పక్కనే కూర్చోబెట్టుకున్నారు . విశ్వామిత్రుడు కూడా వినమ్రుడైన శిష్యుడు కూర్చొనునట్లే పక్కనున్న ఇంకొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . 

     నచికేతులు అనుసంధానము చేసి ’ నాచికేతాగ్ని ’ అన్న స్వనామ విఖ్యాతమైన అగ్ని విద్యను దానము చేశారు . యజ్ఞేశ్వరుడు కృపతో తన విశ్వ రూపమును ప్రకటించి ,  బ్రహ్మాండమునంతటినీ తాను ధరించిన మర్మమును చూపించి , యేయే లోకమేదో , ’ ఇది ఈ లోకము ’ అని నామ నిర్దేశ పూర్వకముగా చూపించి , " బ్రహ్మర్షీ , ఇప్పుడు నీకు ఈ విద్య అబ్బినది అన్న విషయము సావధానముగా తెలుసుకో . ఇకముందు ఈ మహానుభావుడి వలన బ్రహ్మ విద్యను కూడా పొందు " అని అనుమతి నిచ్చెను . 

     నచికేతులు , యజ్ఞేశ్వరుడు విశ్వామిత్రునిపై చూపించిన ఆదరమును చూచి పరమ సంతుష్టులై , " అయ్యా , ఇలాగున దేవతానుగ్రహమును సంపూర్ణముగా సాధించినవారే బ్రహ్మ విద్యార్హులు , అధికారులు . ఇంతటి వారు దొరికినపుడు వారికి విద్యా దానము చేయకుండిన , మేము ఋషి ఋణమును తీర్చనట్లే . ఈ దినము నేను కూడా కృతార్థుడ నయినానని అనిపించుతున్నది . మీ అంతటి అధికారులు జన్మలో ఒక్కరైనా దొరుకుతారో , లేదో " అని మనఃపూర్వకముగా పొగడుతూ ఆచమనము చేసి మరియొక విద్యను ఇచ్చుటకు సంసిద్ధులైనారు . 

     విశ్వామిత్రుడు కూడా ఆచమనశుద్ధుడై విద్యా గ్రహణమునకు సంసిద్ధుడైనాడు . వారు ప్రణవోచ్చారణ చేస్తుండగానే విశ్వామిత్రునికి దేహమంతా ఏకాగ్రత కు వచ్చి , తాను పండులోపలి గింజ వలెనే , దేహము నుండి ప్రత్యేకమైన వాడు అన్న అనుభవము వచ్చింది . శాంతి పాఠమును పఠించుతుండగానే దేహములోని సర్వాంగముల యందూ అమృతప్రవాహము జరిగినట్లై , వాటికి ఒక కొత్త జీవము వచ్చినట్లై , బ్రహ్మ విద్యను ధరించుటకోసమే నవ నూతనమైన చేతనమును వహించినట్లాయెను . 

     నచికేతుల ముఖము నుండీ వెడలినది కేవలము శబ్దములు  కాదు  : అయః పిండముల వలె ( పూర్వ సుకృతము వలన వస్తూ  తిరుగునట్టి అంకురములు  ) విశ్వామిత్రుని హృదయమున దిగి , దేహములో ఇల్లు కట్టుకొని కూర్చొని , అతని వాక్కులను పల్లవింపజేసి పెంచినవి . ఏదో ఒక , కొత్తగా కనిపిస్తున్నా కూడ , ఇది పాతదే , తెలిసినదే అని అర్థమగుతున్నట్టున్న చైతన్యము తనలోపలికి చేరి , అక్కడ వున్న చైతన్యమును జాగృతము చేసి దాన్ని లోకము నందు  అంతటా పరచుతున్నట్లు అయినది . ఘనముగా , ఒక పిండము వలె ఉన్నట్టి ’ తాను ’ అను ఒక భావము అగ్ని పుటము వలన ధూమమైనట్లు లోక లోకాంతరముల నన్నిటా , బ్రహ్మాండ బ్రహ్మాండముల నన్నిటా వ్యాపించినట్లాయెను . తాను గుహలో ఏకాంతముగా కూర్చొని ప్రాణాగ్ని పంచక దర్శనాది వ్యాపారమగ్నుడైనపుడు , ఋత్త్విజుడై తన నుండీ లేచి వెళ్ళి స్నానాహ్నికములను చేసి వస్తున్న ఆ రూపము ఇప్పుడు ఇంద్రియ గోచరమైనట్టు సూక్ష్మముగా బ్రహ్మాండమునంతా ఆవరిస్తుండుటను , తాను వెనుక దర్శనము చేసిన కాల పురుషుని వ్యాపించి , అతనిని ఛేదించుకొని అతని లోపలా బయటా వ్యాపించి , అతనిని ఒక శిశువు వలే ఎత్తుకొనుటను ఆ మహానుభావుడు చూచెను . 

     విశ్వామిత్రునికి జాగృదవస్థ లో నడుస్తున్నట్టే అవుతున్న ఈ వ్యాపారమంతా , వామదేవునికి కలయై కనిపిస్తున్నది . దేశకాలములన్నీ హ్రస్వములై వాటి బయటనున్న ఏదో ఒక పదార్థము బ్రహ్మాండమునంతటినీ వ్యాపించి దాన్ని ధరియించి నట్లూ , ఆ ’ నేను ’ అన్నది ఆ పదార్థపు అంశమై తానే కావాలని ఏరి కోరి ఆకాశ కోశాన్ని చేరుకొని ఉన్నట్టూ భావన కలిగింది . 

     నచికేతులు విద్యా దాన కర్మను సాంగముగా నెరవేర్చారు . విశ్వామిత్రుని వలెనే , వామదేవుడు కూడా ప్రకృతి లో నిండిపోయాడు . నచికేతులు వారిద్దరి సామర్థ్యమునూ చూచి మిక్కిలి సంతోషముతో , " అయ్యా , మా గురువులు ఈ దినము సంతుష్టులయినారు . వారు నాలో ఉంచిన ఈ నిక్షేపము ఈ దినము సత్పాత్రలో వినియోగమై వారి సంకల్పము ఈడేరినది అని నేను కూడా కృతార్థుడనయ్యాను . ఇప్పుడు మీకు దర్శనమయినది జ్ఞాత్యుడు. దేహ దేహములయందూ కూర్చొని కార్యమును నడిపిస్తున్న ప్రత్యగాత్మ ఇతడు . ఇకపైన దీనిని వృద్ధి చేసుకొని వ్యష్ఠి , సమిష్ఠులలో ఆత్మ దర్శనము చేసి కృతార్థులు కండి " అని ఆశీర్వదించారు . 

Friday, July 20, 2012

48. " మంత్ర ద్రష్ట " నలభై ఎనిమిదవ తరంగం


నలభై ఎనిమిదవ తరంగం

     మరునాడు ప్రాతఃకర్మలను తీర్చుకుని విశ్వామిత్రుడు ఏ పనీ లేక ఊరికే కూర్చున్నపుడు వామదేవుడు అగ్ని గృహానికి పిలిచాడు . " మునీంద్రులు దయ చేయవలెను . అగ్నిదేవుని యనుజ్ఞ అయినది . తమరు వైశ్వానర విద్యను స్వీకరించవలెను . " 

     విశ్వామిత్రుడు ఆ మర్యాద మాటలను విని నవ్వుతూ , " అటులనే . వామదేవ మహర్షులు అనుగ్రహించి అగ్ని రహస్యాన్ని బోధించవలెను . మైత్రితో అప్పుడు రుద్ర విద్యను ఇచ్చి సాత్త్వికుడిని చేసినారు . ఇప్పుడు ఈ వైశ్వానరాన్ని అనుగ్రహించి నన్ను బ్రాహ్మణుడిని చేయవలెను " అన్నాడు . 

" నువ్వు బ్రాహ్మణుడివి కావని నీకు ఎవరైనా చెప్పినారా ఏమి ? " 

      విశ్వామిత్రుడు , " ఆ విషయాన్ని తరువాత ప్రస్తావిస్తాను . ఇప్పుడు తమరు అభిముఖులై యున్నారు . తమరే అగ్నియై కూర్చొని నాకు వైశ్వానర విద్యను కరుణించునట్లు కానివ్వండి . " అని చేతులు జోడించాడు . 

      వామదేవుడు సమాహిత చిత్తుడై కూర్చున్నాడు . హోమము చేసి అగ్ని దేవుని అనుమతి పొంది వైశ్వానర విద్యను దానము చేశాడు . విశ్వామిత్రుడు గ్రహించాడు . అగ్నిదేవుని అనుగ్రహము వలన ఆ విద్య అతనికి ఒప్పింది . అతనికి అగ్ని సాక్షాత్కారమైనది . ఆనందములో మైమరచాడు . ఆ యజ్ఞేశ్వరుని దయయే వాక్కుగా మారి ప్రవహించి మంత్రమైనది . వైశ్వానర సూక్తమొకటి తొమ్మిది మంత్రములతో కూడినదై తీగకు పూయు పువ్వు వలె సహజముగా సుందరమై ప్రకటమైనది . 

      వామదేవునికి ఆశ్చర్యము . భరతుల కుల దైవమూ , తన ఇష్టదైవమూ అయిన యజ్ఞేశ్వరుడు తన మిత్రునికి కూడా ఒద్దిక అయ్యాడని అతని సంతోషానికి అంతే లేదు . బహు రహస్యముగా ఉండి , జాత శుద్ధులని ప్రసిద్ధులైన బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన ఈ విద్య ఉపదేశ మవుతుండగానే ఈ కౌశికునికి ఫలించినది కదా అన్న ఆనందము అతనికి అంతా ఇంతా కాదు . 

      జాతదేవుని అనుగ్రహము చేత జాతవేదుడే అయి కూర్చున్న మునీంద్రుని యథోచితమైన ఉపచారములతో సత్కరించి , ముందరి కార్యమేమిటని వామదేవుడు వినయముతో ప్రార్థించాడు . జాత వేదుడు , " రేపటి రోజు నచికేతుని ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఋషి పరిషత్తును పిలిపించు . అక్కడ జరుగుదానిని చూచి సంతోషించండి " అని అనుజ్ఞ ఇచ్చి ఉప శాంతుడయ్యాడు . 

     విశ్వామిత్రునికి జాగృతావస్థ కలిగింది . అలా మెలకువ అగుతున్నంతలోనే తన దేహమునుండీ సుందర జ్వాలా మాలలు ప్రసరించుచున్నట్లు భావమైంది . " వామదేవా ! ఇదేమిటిది ? " అన్నాడు . 

      వామదేవుడు నవ్వుతూ చెప్పాడు , " అగ్నిహోత్రులవారు అగ్నియే అయ్యారు . ఇప్పుడు ఏమిటి అని అడిగితే నేనేమి చెప్పాలి ?  నువ్వు రుద్రుని అనుగ్రహాన్ని పొందావు . తరువాత ఆపోదేవి అనుగ్రహాన్ని సంపాదించి ఆ రుద్రుని శంకరుడిగా చేసుకున్నావు . ఆ శివుడి కృప వలన స్వర్గము నీ ఇంటి వాకిలికే వచ్చి కర్మజ దేవతవయ్యావు . ఆ రుద్రుని అనుగ్రహమే ముందుండి నీకు ప్రాణ దర్శనాన్ని చేయించింది . దేహములోనున్న పంచభూతములూ శుద్ధమై అన్నీ శాంతమై తేజోమయాలయ్యాయి . స్థాలీ పాకము వలన ప్రాణాపానాదులు ప్రసన్నమైనాయి . ఇప్పుడు వైశ్వానర విద్యను పొంది బృహత్ప్రాణ మండలమే పరిశుద్ధమైనది . ఇప్పుడు తేజోమయ మూర్తివైనావు . ఇంతవరకూ స్థూల చక్షువులకు కనపడని తేజస్సు ఇప్పుడా స్థూల చక్షువులకు కూడా కనపడునట్లాయెను . ఈ తేజస్సు ఇప్పుడు ప్రస్ఫుటమై నీ క్షేత్రమైన ఈ దేహములో ఉన్న పంచ భూతాలలో జ్ఞాతాజ్ఞాతముగా , స్వయంకృతంగా సంభవించిన మల మాలిన్యాలనన్నిటినీ దహిస్తున్నది . అందువలననే నీ స్థూల చక్షువులకు అలాగ కనపడుతున్నది . ఆ భూత పంచకము నిర్మలమవుతున్న కొలదీ ఇది కూడా మరలా శాంతమై శమీ యందున్న తేజస్సు వలె అంతర్హితమవుతుంది . " 

     విశ్వామిత్రుడడిగాడు , " ప్రాణాగ్ని పంచక దర్శనమయినపుడు తేజో వికిరణమయినది కదా , అదేమిటి ? " 

      ’ అది , భూతముల తన్మాత్రలలో ప్రాణ సంచారమగుట యొక్క లక్షణము . తన్మాత్రల వలననే ప్రాణాలు పుట్టినవి . అయిననూ , జన్మము వలన కానీ , మణిమంత్రాది కర్మల వలన కానీ ఈ ప్రాణాలు బహిర్ముఖ వృత్తిని వదలి అంతర్ముఖమైనపుడు భూతములలో కూడా ప్రాణ సంచారమవుతుంది . అప్పుడు ఆ భూతాలు తేజోమయ మూర్తులవుతాయి . తేజస్సు యొక్క స్ఫురణ వాటికి కూడా లభించి , భూత భూతములూ ప్రాణ మయము లయినట్టు వ్యాపారములు సవ్యముగా జరుగును . అప్పుడు ఏ దేహములో ఇదంతా జరుగుతున్నదో ఆ దేహము విప్రుడవుతుంది . అలాగ నువ్వు విప్రుడవగుట వలననే నీకు అగ్ని రహస్యము తెలిసినది . ఇక నచికేతాశ్రమమునకు వెళ్ల వలెననీ , అక్కడ ఋషి పరిషత్తును పిలవాలనీ అనుజ్ఞ అయినది . అక్కడ ఏమేమి విచిత్రాలు జరుగునో ! ఇలాగ నువ్వు విప్రుడగుటను చూచియే ,  " నువ్వు బ్రాహ్మణుడివి కావని నీకు ఎవరు చెప్పారు ? " అని నేను అడిగినది ! " 

     " మేనకను నేను అడిగినపుడు  ఆమె ,  ఈ నీ పుత్రిక ఎవరిని వరిస్తుందో అదే కులము నీది కూడా అన్నది . పురూరవాశ్రమము లో ఉన్నపుడు  ,  ’ ఆ కన్య దుష్యంతుని వివాహమాడినది ’  అని వార్త వచ్చింది " 

     " అవును , మేనక గర్భధారణ చేసినపుడు నీలో ఇంకా క్షత్రియాంశము ఉండినది . అదీ మంచికే , కర్మఠులు ఏ స్వర్గము కోసము పగలూ రాత్రీ హోమ , ఇధ్మా దానాది ఇష్టాపూర్త కర్మల వలన పుణ్యమును సంపాదిస్తారో ,  ఆ స్వర్గమే నీ చెంతకు వచ్చింది కదా ! నువ్వు క్షత్రియుడవు కాకుండా బ్రాహ్మణుడవయి ఉంటే అది సాధ్యమయ్యేదేనా ? " 

     " ఎందుకు , బ్రాహ్మణుడనయి ఉంటే స్వర్గ సుఖమును అనుభవించుటకు లేదా ఏమి ? " 

      " పిచ్చి వాడా , కర్తృత్వ భోక్తృత్వములు రెండూ పరులవి అని తెలుసుకో . లోకాను గ్రహము కోసము తనవి కాని ఆ రెంటినీ వహించి , ఈ లోకానికి వచ్చి వెళ్ళు దేవతలందరికీ తన దేహములో అవకాశము ఇస్తూ , ఏ విధమైన మోహాలకూ పరవశుడు కాకుండా ఉండువాడు బ్రాహ్మణుడు . అంతటి బ్రాహ్మణుడవై నువ్వు స్వర్గ భోగాలను అనుభవిస్తావా ? సాక్ష్యము కావాలన్న , చూడు . భార్గవులు జాతి బ్రాహ్మణులైననూ , భోగ పరాయణులు అని వారికి క్షత్రియుల వలన హాని జరిగినది . దానికి విరుద్ధముగా , వశిష్ఠులు భోగపరాయణులు కానందున , సంకల్పాలను సన్యసించిన వారైనందున , మహా క్షత్రియుడవైన నువ్వు వారి పై దండెత్తుటకు పోయి , ఓడిపోయి , నీ క్షాత్రాన్నే బలి ఇచ్చి నువ్వూ బ్రాహ్మణుడవైనావు . కాదా ? చెప్పు . " 

     వామదేవుడు ఇంకా కొనసాగించాడు , " నీలో ఉండిన భోగ ప్రవృత్తి అంతా తపశ్శుద్ధమై పిండమై , పరిశుద్ధ క్షాత్ర తేజోధనియై బిడ్డ కలిగింది . ఆమెకు చంద్రవంశ ప్రతిష్ఠాపకుడైన మహా పురుషుడు , చతుస్సముద్ర ముద్రితమైన భూమండలములో ఇక ధర్మ వ్యవస్థను సంస్థాపించగల మహా చక్రవర్తి పుట్టిఉన్నాడు . అటుల నీ క్షాత్ర తేజస్సు పిండమై తన గర్భానికి వచ్చినదని తెలియని మేనక నువ్వడిగిన ప్రశ్నకు ఏమని ఉత్తరమివ్వాలి ? అదీకాక , నీకోసము మానవ ధర్మాన్ని అంగీకరించినది ఆమె . మానవ దేహములో ఆపః పృత్వీ భూతాలు రెండూ బలమై ఉండి , తేజస్సు అణగి ఉండినందువలన , దేవతా దేహములో కనిపించు సిద్ధులు ఆ క్షేత్రములో చూచుటకు తపస్సు కావలెను . ఆమె వెళ్ళిపోవునపుడు నిదానించి చూసి చెప్పవలసినది .  కానీ ఆమెకు వెళ్ళిపోవలెనను ఆత్రము . " 

     " ఆ నచికేతుడు పరమర్షి . సాక్షాత్ వైశ్రవణుని నుండీ అగ్ని విద్య , బ్రహ్మ విద్యలు రెండింటినీ సంపాదించిన మహానుభావుడు . అతని ఆశ్రమములో ఇంకా ఏమేమి విచిత్రాలు కాచుకొని ఉన్నాయో ! . వెనుక నీ పూర్వజులలో ఒకడైన సింధూ ద్వీపుడూ , మీ వంశానికి చెందిన దేవాపి కూడా బ్రాహ్మణ్యాన్ని సంపాదించి బ్రహ్మర్షులైనారు . కానీ వారి జీవితములో ఇన్ని విచిత్రాలు జరగలేదు . నువ్వు మహా పురుషుడవు . మాతా పితృ వంశాలు రెండూ ఉద్ధరింపబడినాయి . 

Thursday, July 19, 2012

47. " మంత్ర ద్రష్ట " నలభై ఏడవ తరంగం



నలభై ఏడవ తరంగం

     విశ్వామిత్రుడు నేరుగా వామదేవుని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ వామదేవుడు కూడా విశ్వామిత్రుని రాక కోసము ఎదురు చూస్తున్నాడు . మిత్రులిద్దరూ బహు సంతోషము చేత ఒకరినొకరు ఆలింగనము చేసుకున్నారు . వామదేవుడు తన మిత్రునికి అర్ఘ్య పాద్యాది కాలోచితమైన ఉపచారాలన్నిటినీ చేసి , " విశ్వామిత్రా , నువ్వు సామాన్యుడవు కాదు ! మన అగ్నిదేవుడిని కూడా బుట్టలో వేసుకున్నావు కదా ! " అన్నాడు . 

     అది విశ్వామిత్రునికి అర్థము కాలేదు . " అదేమీ లేదు కదా , నేను అగ్నివిద్యలో వేలుపెట్టినవాడినే కాదు . దారిలో వస్తుండగా పురూరవ దంపతుల ఆశ్రమములో విడిది చేయవలసి వచ్చెను . వారు యథోచిత ఉపచారాలు చేసినారు . అక్కడ ఆ రాజర్షి , తనకు అగ్ని దేవుని అనుజ్ఞ అయినదని స్థాలీ పాకాన్ని ఇచ్చాడు . అగ్ని ఇంకొకరికి అనుకూలుడగుట ఉంటుందా ? అటువంటిదేమున్నా మీ మూడు కులాల వారికే సొంతము : భారతులు , భృగువులు , భరధ్వాజులు . మిగిలిన వారికి అగ్ని దొరికాడంటే అది మీ అనుగ్రహము . నాకు కూడా , జమదగ్ని ఉన్నపుడు అగ్ని విద్యను గ్రహించవలెనను ఆశ ఉండినది . కానీ ఆ వంశానికి మేము ఆడపిల్ల నిచ్చినవారము . అందువలన ఏమీ తీసుకోరాదని నేను అతడిని అడుగలేదు . దీని తర్వాత ఒకవేళ , ఏదైనా దొంగదారిలో మేము అగ్నిని సాధిస్తే , మీ ముల్లె ఏమి పోయింది ? అగ్ని ప్రసాదము మాకు లభిస్తే మీకు పోయినదేమి ? "  అన్నాడు .

     వామదేవుడు నవ్వి , " అది కాదయ్యా , నువ్వు వచ్చుటకు ముందు అగ్ని దేవుడు ప్రత్యక్షమై వైశ్వానర విద్యను వాడికి ఇవ్వు అని చెప్పినాడాయె ! నన్ను అడిగి ఉంటే నేనే ఇచ్చే వాడిని కానా ?  ఏది కాకపోయినా , మా గురుదేవుల కష్టములో సహాయము చేసినవాడవని యైనా నేను నీకు ఆ విద్యను ఇచ్చేవాడిని కానా ? " అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అతనికి వామదేవుని గురువుగారు ఎవరు అన్నది ఇంతవరకూ తెలీదు . అడిగే సందర్భమూ రాలేదు . అతని ముఖములో ఆశ్చర్య ముద్రను చూసి వామదేవుడే అడిగాడు , " మా గురువు గారు అంటే ఎందుకలా ఆశ్చర్య పడుతున్నావు ? మా గురుదేవులను చూచినావా ? నువ్వు ఎవరిని సరస్వతీ నదిలో తడిపివేసినది ? అది కూడా మరచావేమి ? " 

     విశ్వామిత్రునికి నమ్మ శక్యము కాలేదు . వెనుక నడచినదంతా ఒకసారి మనో ఫలకము పైన కనపడి మాయమైంది . తాను వామదేవుని వలన రుద్రుని పొందినది , రుద్రుని అనుగ్రహము వలన తాను అస్త్ర గ్రామమును సంపాదించినది , ఆ అస్త్రాలను తాను ఆశ్రమములో ప్రయోగించినది , అక్కడ తాను తేజోభిభూతుడై పడి ఉన్నపుడు వామదేవుడు తనను తీసుకొచ్చి ఉపచారములు చేసినది , తరువాత త్రిశంకువు ప్రసక్తి , అంతా గుర్తొచ్చి , " అంటే వశిష్ఠులే నీ గురువు గారా ? " అన్నాడు . 

     వామదేవుడు సహజమైన స్వరంతో , " ఔను , . అది నీకు తెలుసా ? ఇంకొక అడుగు వెనకకు వేసి చెబుతాను విను ,  నువ్వు ఆశ్రమములో నానా బీభత్సమూ చేసి వెళ్ళిపోయావుకదా , అప్పుడు వారే నన్ను పిలచి , ’ నువ్వు ఇంకొక చోట ఆశ్రమము చేసుకొని ఉండు . కౌశికుడు అక్కడికి వస్తాడు . అతనికి రుద్రానుగ్రహము లభించునట్లు సహాయము చేయి  ’ అని చెప్పి , నాకు ఇష్టము లేకున్ననూ నన్ను పంపించినదీ వారే ! నువ్వు శత్రు పక్షము . ఆశ్రమాన్ని ధ్వంసము చేస్తావు అని తెలిసినపుడే నీకు గురువుల అనుజ్ఞ యని రుద్రవిద్యను ఇచ్చినవాడను , ఇప్పుడు , మనమిద్దరమూ మిత్రులై ఉన్నాము : మా గురువు గారికి అపారమైన ఉపకారము చేసినవాడవు : అలాంటపుడు నీకు వైశ్వానర విద్య ఇవ్వక పోదునా ? అని అడిగాను , అంతే ! " 

     విశ్వామిత్రునికి ,  వశిష్టుడను పర్వతము ముందర తానొక ఆవగింజ అంత కూడా కాదు , అనిపించింది . ఇక అతని వలె బ్రహ్మర్షి అగుట సాధ్యమా అని సందేహము అలముకుంది . వశిష్ట సమానుడగుట అసాధ్యము అన్న నమ్మకము అయింది . అలాగ అతడు నిరాశలో మునిగిపోతున్నపుడు వామదేవుడు మాట్లాడినది ఒక్కటీ అర్థము కాక , ’ ఆ ’ అన్నాడు . 

     వామదేవుడు  అతని మనక్షోభను చూసి , " ఏమిటి , వశిష్టుల స్మరణ కాగానే మరలా అంతటినీ పక్కకు పంపించావా ? " అన్నాడు . ఆ సూటి మాట విశ్వామిత్రుని బహిర్ముఖుడిని చేసింది . అతడు గంభీరముగా " అది కాదు , వామదేవా  !  కౌశికుడు సంపూర్ణముగా చచ్చిపోయి ఇపుడు విశ్వామిత్రుని అవతారమయినది . కాబట్టి ద్వేషము లేదు . అతని గొప్పతనము ఎంతటిది ?  నా అల్పత్వము ఎంతటిది ? అన్నది ఈ రోజు తెలిసింది . ఇక , అతనికి సముడను అగుట అంటే భూమిని చుట్ట చుట్టి ఒడిలో ఉంచుకుంటా నన్నట్లే కదా ! " అని ఏదో తెలియని నిరాశ నుండి కష్టము మీద బయటికి వస్తున్నట్లు అన్నాడు . వామదేవుడు నవ్వి , " పాలు పొంగినట్లు అంతఃకరణము పొంగుతుంది . ఆ పొంగుకు వస్తువు అభిమతమైతే విషయము రాగమవుతుంది . అన్యథా అయిఉంటే ద్వేషమవుతుంది . ఇలాగ సహజముగా విజృంభించిన రాగ ద్వేషములవలన మహాత్ములకు సుఖ దుఃఖములు కలుగును అని అనుకున్నావా  ? వారు దానిని పర్వకాలములో సముద్రము పొంగునట్లే అనుకుంటారు . మా గురుదేవులు నువ్వేమి చేస్తావో అన్నది తెలిసినవారు . వారికి సర్వమూ విదితమే . దాని వలన  వారు వికారము పొందలేదు . పొంగుతున్న సముద్రపు పక్కనున్న రాయి సముద్రపు ఆటుపోట్ల వలన ఎలాగైతే వికారము పొందదో , అలాగే మహాత్ములు సుఖ దుఃఖాలకు అతీతులు . " 

     విశ్వామిత్రుడడిగాడు , " సరే , మరి వామదేవా , వశిష్టులు సుఖ దుఃఖాలకు అతీతులైతే ఆ శోకమెందుకు వారిని అంత క్షోభింప జేసింది ? " 

     " అదా ? అది వారి దుఃఖము కాదు . యుగ సంధిలో పంచ మహా భూతాల శక్తి క్షయమై అవి దుఃఖించాయి . ఆ పంచ మహాభూతాల దుఃఖమును వహించుటకు ఇక వేరెవరూ శక్తులు కారని , కలి దేవుడు స్వయముగా వచ్చి వశిష్ఠులను ప్రార్థించాడు . వారు , సరే, వహిస్తాను అన్నారు . పుత్రశోక రూపముగా అది వచ్చింది . వారు దానిని ఆ రూపముగానే  అనుభవించారు . వారు కావాలనుకొన్న , దానినంతటినీ సుఖరూపముగానే అనుభవించి ఉండవచ్చు . అయితే , వరమునిచ్చారు కాబట్టి , దానిని దుఃఖముగానే అనుభవించారు . " 

" దుఃఖమును సుఖముగా అనుభవించుట ఎట్లు  " 

     " అయ్యో , ఇదొక పెద్ద విషయమా ,  విశ్వామిత్రా ? ఇప్పుడు నేనిక్కడ శిలాసనములో కూర్చున్నాను . కింద పడ్డాననుకో , భూమికీ , నా దేహానికీ సంపర్కమైనపుడు , భూమి యొక్క కాఠిన్యము బలమై దాన్ని నా దేహము తట్టుకొనలేక పోతే అది నొప్పియై దేహానికి దుఃఖమవుతుంది . దేహములో ఆ భూమికన్నా హెచ్చుగా కాఠిన్యముంటే , లేదా భూమిలో దేహము సహించగలిగినంత కాఠిన్యముంటే , లేదా భూమిలో మృదుత్వముంటే , అప్పుడు దేహానికి నొప్పి ఎక్కడిది ? రాశిపోసిన ప్రత్తి పై  పడితే , లేదా  ఇసుక రాశిపై పడితే నీకు నొప్పి కలుగుతుందా ? అలాగే దుఃఖము వచ్చేది లోపము వలన : దేహములో సమంగా ఉన్న వ్యానపు ఒత్తిడి ఎక్కువ తక్కువ అగుట వలన. ఆ వ్యానాన్ని అనుసంధానము చేయగలిగినవాడు , ధ్యానము నందు తన దేహ కాఠిన్యమును పెంచుకుంటే చాలు . బండపై పడినా నొప్పి తెలియదు . నొప్పి అసలే కాదు . అలాగే , ఇంద్రియాలకు కొంత సహన శక్తి ఉంది . దాన్ని పెంచుకున్నా కూడా దుఃఖపు ఆవేశము తక్కువగును . అంతే కాక , దుఃఖాన్ని అమ్ముకొనుట అను విద్య కూడా ఒకటుంది . " 

     విశ్వామిత్రుడు అది విని ఇంకా ఆశ్చర్యములో మునిగాడు . " ఏమిటీ ! ?  దుఃఖాన్ని అమ్ముకొనుటా ? "  అన్నాడు . వామదేవుడు మునుపటి వలెనే గంభీరముగా , " అవును , నీ ఇంట్లోని గోవు పైన నీకు అభిమానముంటుంది . దాన్ని నేను కొనుక్కున్నపుడు  నువ్వు ఇస్తావు . ఇచ్చునపుడు నీకు సంకటము అగుట లేదా ? అయితే ,  దానికి తగినంత వెల నీకు ముట్టింది అని తెలిస్తే నీకు ఆ అమ్మకము వలన దుఃఖము కలుగదు . అలాగే నీకు అవసరములేని వస్తువు యొక్క గుణాన్ని లెక్క చేయకుండా , దోషాన్ని మాత్రమే ఎంచితే , పోయినది క్షేమమయినది అన్న సుఖము కలుగును . ఇదే నేను చెప్పిన వినిమయము . అన్నాడు . 

     రాజ్యాన్ని ఏలుతుండిన విశ్వామిత్రునికి ఈ వినిమయము , ఈ అమ్మకము కొత్త కాదు . అయితే అతడు దానిని తన సొంతానికి ఉపయోగించుట గురించి ఆలోచించి ఉండలేదు . ముందు ముందు తాను అనుభవించవలసిన దుఃఖాన్ని సుఖముగా మార్చుకొను సాధనము ఒకటుంది అన్నది అతనికి తెలిసినట్లాయెను . 

     వామదేవుడు ఇలాగే కథా కాలక్షేపము నందున్నపుడు సాయంత్రమైంది . అదేమిటా హిమాచలపు సంధ్య ? ఇంకా సూర్యాస్తమయానికి అర్ధ యామము ఉండగానే చలి మొదలు . చీకటి పడుటకు ముందే  మిత్రులిద్దరూ సంధ్యా కార్యక్రమమును ముగించి అలాగే మాట్లాడుతూ నిద్రకుపక్రమించారు . విశ్వామిత్రునికి రాత్రంతా నిద్ర లేదు . వశిష్ఠునిదే ఆలోచన. 

Wednesday, July 18, 2012

46. " మంత్ర ద్రష్ట " నలభై ఆరవ తరంగం



నలభై ఆరవ తరంగం

      అలాగ కొన్ని రోజులు గడిచాయి . ప్రాణ దేవుడు ఒకరోజు , " విశ్వామిత్రా , నీ హృదయములో ఉన్న సందేహాలు తీరనీ . వామదేవుని వద్దకు వెళ్ళి రా " అన్నాడు . విశ్వామిత్రుడు ఆజ్ఞను అంగీకరించి , " దేవా , ఈ శక్తి వికిరణము వల్ల ఇతరులకు కష్టమవుతుందేమో ? అన్న బెదురు  " అన్నాడు . ప్రాణ దేవుడు అదివిని నవ్వేశాడు . " ఏమిటి మునీంద్రా , జగము అంత అరక్షితమైనదా ఏమి ? తమరొక్కరే కాదు ఇలాగ కిరణాలను ప్రసరిస్తున్నది . జడ చేతన పదార్థాలన్నీ కిరణాలను చల్లుతున్నాయి . సూర్య చంద్ర నక్షత్రాల వలెనే , అణు , రేణు , తృణ కాష్టాదులన్నీ తేజో మండలాలే ! తమరు ఆలోచించనవసరము లేదు . వెళ్ళి వచ్చునపుడు దారిలో ఏమేమవుతున్నదో కళ్ళు తెరచి చూచుకుంటూ రండి . అంతా సరిగ్గా అవుతుంది " అని ఆశీర్వాదము చేసి పంపించాడు . 

     విశ్వామిత్రుడు దేహములోనున్న పృథ్వీ భూతాన్ని , జల భూతాన్నీ అనుసంధానము చేసి సూక్ష్మ ప్రమాణము నకు తెచ్చి , లాఘవముగా పైకి ఎగసి ,  ఆకాశమార్గములో బయలుదేరాడు . అతనికి వామదేవుని ఆశ్రమానికి పోవలెనను సంకల్పము . అయితే ప్రబలమైన వాయువు ఒకటి , హింసారహితముగా పైకిలేచి , శరత్కాల మేఘాన్ని మోసుకొని పోవునట్లు అతడిని సుఖంగా మోసుకొని పోయి , ఒక ఆశ్రమములో దింపింది . వాక్పూర్వకముగా కాక పోయినా , ఇక్కడ దిగవలెను అని నమ్రతతో కూడిన భంగిమతో , ముద్రతో  సూచించిన వినయ గౌరవ నమ్రుడైన మిత్రుని వలె , ఆ వాయువు తన స్పర్శతోనే ఆ మునీంద్రునికి తన ఉద్దేశాన్ని వెల్లడించాడు . అతడు కూడా గతి స్తంభనము చేసి అక్కడ దిగుతాడు . తిరిగి చూస్తే , వేదఘోష చేస్తూ వానప్రస్థుడొకడు స్త్రీ సమేతుడై వస్తున్నాడు . 

     ఆగంతకుడు దగ్గరికి వచ్చి , అర్ఘ్య పాద్యాలను అర్పించి , " మునీంద్రులు దయయుంచి నా ఆశ్రమమునకు వచ్చి మధుపర్కమును గ్రహించు కృప చూపించవలెను . " అని ప్రార్థించాడు . విశ్వామిత్రుడు ఆహ్వానమును అంగీకరించి అతని వెంట వెళ్ళి , అతడెవరని విచారించాడు . అతడు పురూరవుడు . అతని వెంట ఉన్న స్త్రీ ఔశీనరి . ఈతడు వచ్చు విషయము తెలిసినది అగ్ని దేవుని వలన. అతని అనుజ్ఞ ప్రకారము ఈతనికి మధుపర్కాన్ని సమర్పించుటకు అతడు వచ్చినది . 

     మధుపర్క సమర్పణ అయిన తరువాత , " మునీంద్రులు మన్నించాలి . మధుపర్క సమయములో తమకు అర్పించుటకు మా దగ్గర గోవు లేదు . అందువలన అగ్నిదేవుని అనుజ్ఞ ప్రకారము తమకు స్థాలీపాక విద్యను సమర్పించెదను . దానిని స్వీకరించి మమ్ములను అనుగ్రహించవలెను . " అని ప్రార్థించాడు . విశ్వామిత్రుడు సరేనని ఒప్పుకొని , ఆ విద్య పూర్వోత్తరాలను , అది వచ్చు రీతిని అడిగాడు . 

     పురూరవుడు అన్నాడు , " మునీంద్రులు ఆలకించాలి . జరుగుతున్న దానిని చెప్పెదను . అది ఆత్మ కథ అయిననూ , దానిలో అహంభావము లేనిచేత ,  ’ నేను ’ అన్నది వచ్చినా , దానిని సహించండి . నేను ఒకసారి ఊర్వశి అను దివ్య స్త్రీ యందు అనురక్తుడనయ్యాను . ఆమె కూడా నాపై భావముంచి గౌరవించినది . ఈమె అనుమతితోనే మేమిద్దరమూ పతి, పత్ని అయ్యాము . దేవలోకమును వదలి భూలోకములో ఉండుట గంధర్వులకు సమ్మతము కాక , ఆమెతో నేను లేని సమయము చూసి గంధర్వులు ఆమెను పిలుచుకొని వెళ్ళినారు . తరువాత అధికముగా దుఃఖించి , చివరికెటులనో ఆమెను చూచి ప్రార్థించగా , ఆమె గంధర్వ హోమమును చేసి సకాముడవు కమ్ము అని అనుగ్రహించినది . దానిప్రకారము గంధర్వ అనుగ్రహము పొందుటకు వారు ఈ స్థాలీ పాకాన్ని కరుణించారు . అధియజ్ఞమైనపుడు ఈ స్థాలీపాకము , వికోపముచేత విముఖమైయున్న ప్రాణాపానాలను శాంతపరచి , అభిముఖముగా చేస్తుంది . లోకములో దీన్ని అధిభూతముగా ఆచరిస్తే పతిపత్నుల ప్రేమ , ఆయుస్సూ దృఢమవుతాయి . అధిదైవికముగా దీన్నిచేస్తే స్వర్ణ విద్య లభిస్తుంది . సృష్టి కాముడై , ఆధ్యాత్ముడై దీనిని ఆచరిస్తే ఇష్ట ప్రజ లభిస్తుంది . దీనిని దేవతలూ , ఋషులూ తమ సభలో అనుమోదనము చేసినపుడు అగ్నిదేవుని దయవలన ఇది రూపము చెంది , పద్దెనిమిది మంత్రములు గల ఊర్వశీ పురూరవ సూక్తమయినది . " 

     విశ్వామిత్రుడు దానిని విని బహుళముగా  సంతోషించాడు . ప్రాణదేవుని మాట తలచి , " దేవతలు ఏమేమి విచిత్రములు చేస్తారో ? మొత్తానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడకపోతే మేమే చెడిపోతాము "  అనుకొని , పురూరవునితో , " ఓ రాజర్షీ , నువ్వు శ్రమ కోర్చి , దంపతుల ప్రేమను దృఢము చేసి లోకమును ఉద్ధరించు అగ్ని విద్య నొకదానిని తెచ్చి ఇచ్చి లోకోపకారివయ్యావు . ఈ నీ ఉపకారాన్ని లోకాలన్నీ చిరకాలమూ స్మరిస్తాయి " అని ఆనందముతో పొగిడాడు . 

     పురూరవుడు  " విశ్వామిత్రా , మా సంగతికేమి, నువ్వెంతటి పుణ్యవంతుడవై ఉండాలి ! ’ అగ్ని హోత్రి వస్తున్నాడు , వెళ్ళి ఆతనిని దర్శనముచేసి , పిలుచుకొని వచ్చి నీ దగ్గరున్న అగ్ని విద్యను అతనికి నేర్పించు ’ అని సాక్షాత్తూ అగ్నిదేవుడే అనుజ్ఞ ఇచ్చాడు కదా , నీ భాగ్యమది ఎంతటిది ! " అని శ్లాఘించాడు . 

     విశ్వామిత్రుడు రెండు మూడు దినములక్కడ ఉండి , ఆ రాజర్షివర్యుని ఆతిథ్యాన్ని స్వీకరించెను . అతనికి , అక్కడ ఆ రాజర్షి దంపతుల సన్నిధిలో ఉంటే దేహము శాంతముగా ఉండును . ఏకాంతములో ఉంటే శక్తి కిరణాలను చిమ్మును . దానిని చూసి ఆశ్చర్యమైననూ , అతడు అదేమిటలా  అని వెదుకలేదు .

      అతడు  ఆ ఆశ్రమములో నుండగా అక్కడికి హస్తినాపురము నుండీ వార్త వచ్చెను , " దుష్యంతుడు కణ్వాశ్రమములో , వారి పెంపుడు కూతురైన శకుంతలను వివాహమాడెను . ఆ దంపతుల కడుపున చక్రవర్తి కాగల భరతుడను మహా పురుషుడు పుట్టి ఉన్నాడు " అని . 

     ఆ మాట విని రాజర్షి దంపతులు మిక్కిలి సంతోషించారు . విశ్వామిత్రుడుకూడా ఆ సంతోషాన్ని పంచుకున్నాడు . అయినా  అతనికి , సంతోషమూ-- దుఃఖమూ కాని ఇంకేదో భావము ఉండింది . అతనికి అక్కడ ఇంకా రెండు రోజులు ఉండి వెళ్ళాలని ఒక మనసు , అయినా  ఎందుకో , ఏమో  రాజ కార్యమున్నవానివలె అక్కడనుండీ బయలుదేరి వెళ్ళాడు . 

Tuesday, July 17, 2012

45. " మంత్ర ద్రష్ట " నలభై ఐదవ తరంగం



నలభై ఐదవ తరంగం

     విశ్వామిత్రుడు మౌనాన్ని సాధించాలనుకున్నవాడు ,  అది సాధ్యము కాదని కనుక్కున్నాడు . మాటలాడకుండా ఊరికే ఉండుట మౌనమయితే , నాలుక అను యంత్రము చలనము లేక , బయటి వారితో ఏమీ చెప్పక ఊరికే ఉండుటయే మౌనమయితే , అది అతనికి కావలసినంత ఉంది . కానీ అతనికి కావలసిన మౌనమదికాదు . 

     కళ్ళు తాము చూసిన వస్తువును ఇంకొక్క సారి యైననూ తెచ్చి చూపించకుండా వదలుతాయా ? చెవి , తాను వినిన శబ్దాన్ని మరలా వినకుండా ఉండుట ఉందా ? ఇలాగ తనకు ఇష్టము లేకున్నా వచ్చు ఇంద్రియ స్మృతులు ఒక్కటి కూడా మిగలకుండా బయటికి వెళ్ళి పోయి , లోలోపల ఉన్న ఇంకేదో ,  అది బయటకు రానీ ! దాన్నీ చూదాము అని బాహ్యాంతరాలలో నిశ్చలముగా ఉండుటను అతడు కోరుతున్నాడు . అయితే అది దొరకలేదు . 

     ఆ ఏకాంతముగా నున్న గుహలో విశ్వామిత్రుడు తప్ప ఇంకే ప్రాణి కూడా లేదు . దోమలూ చీమలూ లేవు . అక్కడ ఒక కృష్ణాజినపు ముక్కను కట్టుకొని , ఇంకొక ముక్కను ఉత్తరీయము చేసుకొని , దేహపు అధిక భాగము ఆఛ్చాదనము లేకుండా విశ్వామిత్రుడు కూర్చున్నాడు . ఉదయ సంధ్య వరకూ వేరే పని లేదు . పద్మాసనము లో కూర్చొని , పంచాగ్ని దర్శనము చేస్తూ కూర్చుండుటయే పని . అతనికి సూర్యోదయ , సూర్యాస్తమయములలో మాత్రము ఒక విచిత్ర మైన అనుభవమవుతున్నది . పంచాగ్నుల దర్శనము చేస్తూ కూర్చున్న విశ్వామిత్రుని తో పాటు  అప్పుడు ఇంకొక విశ్వామిత్రుడు దేహమునుండీ బయటికి వస్తాడు . అతడు దేహము నుండీ బయటికి రాగానే దేవ గంగ వచ్చి గుహ వాకిట్లో అతడికి స్నానము చేయించి వెళుతుంది . ఎవరెవరో వచ్చి అతనికి మడి కట్టి వెళతారు . ఇంకెవరెవరో వచ్చి ఆహ్నికానికి కావలసినదంతా సిద్ధము చేస్తారు . ఇంకా ఎవరో వచ్చి దివ్య హవిస్సును అందిస్తారు . అతడు దానితో కొంత హోమము చేస్తాడు . దేవతలంతా వచ్చి హవిస్సును స్వీకరిస్తారు . మిగిలినదాన్ని అతడు స్వీకరించి , తృప్తి చెంది , మరలా వెనుకకి తిరిగి , ఇల్లు వదలి బయటికి వెళ్ళినవాడు మరలా ఇంటికి వచ్చునట్లు వచ్చి దేహాన్ని చేరుతాడు . 

     విశ్వామిత్రునికి ఈ నాటకము చూసి చాలా కుతూహలమైనది . అలాగన్నచో , దేహములో ఇద్దరుంటారా ? ఒకడు వెళ్ళి తన పనిని చేస్తుంటే ఇంకొకడు కూర్చుండుట సాధ్యమా ? అనేదే పెద్ద ఆలోచన అయ్యింది . ఆ ఆలోచన తన మౌన సాధనకు విఘ్నమవుతుందని దానిని పక్కకు నెట్టాడు . ఆలోచన పుట్టు వరకూ ఒక ఘట్టము , పుట్టిన తర్వాత ఇంకొక ఘట్టము . పుట్టిన ఆలోచన నీటి అడుగున పుట్టిన బుడగ పైకి వచ్చియే తీరునట్లు జాగృతమైన మనస్సుకు వచ్చే తీరాలి . అది ఏమిటో అర్థము కావలసినదే , లేకున్న మనసుకు శాంతి ఎక్కడిది ? 

     ఆ ఆలోచనకన్నా ఇంకొక ఆలోచన అతన్ని బలంగా పట్టుకుంది . "  ఈ పంచ వాయువులు సరిగ్గా ఉన్నంతవరకూ , అంతా సరిగ్గానే ఉంటుంది , అయినా , హెచ్చు తగ్గులు అవుతుంటాయి అని ప్రాణదేవుడే చెప్పాడు . అలా అగుటకు కారణమేమైనా కానీ , అలా అయినపుడు ఏం చేస్తే మరలా సరిపోతాయి ? " అదొక భారమైన ఆలోచన . 

     మౌనముగా కూర్చుందామా అంటే , ఈ అగ్నులే మనో వృత్తులను ప్రేరేపిస్తాయి . దేహేంద్రియాలు ప్రేరేపింపబడిన తర్వాత ఊరికే ఉంటాయా ?  చెలుకోలు దెబ్బలు తిన్న గుర్రమైనా ఊరికే ఉంటుందేమో కానీ , ప్రచోదింపబడిన దేహేంద్రియాలు ఊరకుంటాయా ? 

     దానికి తోడు ఆలోచనలు . ఈ ఆలోచనలతో విశ్వామిత్రుడు పండిపోయినట్టయ్యాడు . వెనుక మంత్ర యోగము నందున్నపుడు అతడు ఇలాగ సతమత మవుతుండ లేదు . కళ్ళు మూసుకుని , లేదా ఏకాగ్ర దృష్టితో కూర్చుంటే మనస్సు కులీనురాలైన పత్ని వలె వశమునకు వచ్చేది  . ఇప్పుడలాగు కాదు . ఈ ధ్యానములో ఉన్నపుడు పంచాగ్ని సన్నిధానములో ఉన్నా , దేన్నైనా చూస్తే దానికి ప్రాణము వచ్చి లేచి ఆడుతుందా అన్నట్టుంది . కింద పడిఉన్న ఏదైనా గడ్డిపరక  విశ్వామిత్రుని కంట పడితే అతని హృదయము నుండీ ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి బయటికి వెళ్ళి దానిని చేరి దానిలో చైతన్యము వస్తుంది . ఇప్పుడు విశ్వామిత్రుడు గుహను వదలి బయటికి రాకుండుటకు అదీ ఒక కారణము. అతడు బయటికి వస్తే అతని దృష్టిలో పడిన అచేతనమైన స్థావరాలన్నీ చైతన్యము కలిగి జంగమముల వలె వ్యాపారములు  చేస్తున్నాయి . రాళ్ళుకూడా కదలినట్లు కనిపిస్తాయి . అతడు ఊపిరి వదిలితే , ఆ గాలి బయటి గాలితో చేరితే , ఆ బయటి గాలికి ఏదో నవ చేతనత్వము వచ్చినట్లై అది ఏదో ఒక నూతన వ్యవహారాన్ని ప్రారంభిస్తుంది . అతడు నదికి వెళ్ళి నీరు ముట్టుకుంటే , నీటికి కొత్త జీవము వచ్చినట్లై అది ఏమేమో అయిపోతుంది . అయితే , ఆ వ్యాపారాల వలన దుఃఖము లేదు : సుఖముంది : ప్రియముంది : హితముంది : ఆనందమవుతుంది . అయినా , విశ్వామిత్రునికి లోలోపల , ’ కూడదు , ఈ వ్యాపారము కూడదు’ అనిపిస్తుంది . అంచేత అతడు గుహ వదలి బయటికి రాడు . అంతేకాదు , గుహలో నడిస్తే , నేల తో పాటు , కాలికి తగిలిన మట్టి , గడ్డి పరకలూ అన్నీ కూడా సచేతనమైనట్టు భావన కలుగుతుంది . కూర్చుంటే మాత్రమేమి ? అదేదో ఒక విచిత్రమైన శక్తి దేహము నుండీ బయటికి చిమ్మినట్లవుతుంది . అతడు దాన్ని తట్టుకొనలేడు . అతని ప్రయత్నము లేకనే , సతతమూ , దేహమునుండీ బయటికి చిమ్ముతున్న కాంతి వలె తేజః ప్రవాహమొకటి , తేజస్సే అయినా కంటికి కనపడక , మనస్సుకు మాత్రము అర్థమవుతూ , ఏదో ఒక శక్తి ప్రవాహమై , సుమ గంధము వలె సూక్ష్మమై , బయటి వాతావరణముతో వెళ్ళి చేరుకుంటుంది . గుహ , గాలివాటులో లేకున్ననూ  , ఆ సూక్ష్మ శక్తిని పొందాలనో ఏమో అన్నట్టు ఎక్కడి నుండో గాలి వచ్చి తిరిగి తిరిగి వెళుతుంది .  

     అయితే , ఉదయాస్తమయాలలో మాత్రము దేహము నుండీ ఆ ఇంకొక మూర్తి లేచి బయటికి వెళ్ళినపుడు ఆ శక్తి వికిరణము లేదు . దీన్ని గురించి ప్రాణ దేవుడినే అడగాలని మనసుకు అనిపిస్తుంది . అయితే , గురువు వద్ద కూర్చున్న శిష్యుడు గురు ముఖము నుండీ వచ్చు అమృత ధారను సేవించు ఆనందములో మిగిలినవన్నీ మరచినట్లే , ఆ ప్రాణ దేవుని సందర్శనానందములో అడగాలి , చెప్పాలి మొదలైన మనో వృత్తులన్నీ నిద్రించినట్లు , సర్వమూ నిలిచిపోయి నట్లు విశ్వామిత్రుడు సుఖముగా ఉంటాడు.