SHARE

Thursday, March 14, 2013

64. " మహాదర్శనము " --అరవై నాలుగవ భాగము--శారదా మంటపము


64. అరవై నాలుగవ భాగము--  శారదా మంటపము


         యాగ మంటపమునకు శారదా మందిరమని పేరు పెట్టినారు. దానిలో వేదికకు కుడివైపు విశేషాతిథులు కూర్చొను పక్క గోడకు ఒక శారదా దేవి చిత్రము . పురుష ప్రమాణములోనున్న ఆ చిత్రములో దేవి వీణా వాదనము చేయుచూ కూర్చున్నది. పైనున్న చేతులలో ఒక దానిలో అక్షమాలికనూ , ఇంకొకదానిలో పుస్తకమునూ ధరించినది. తలపైనున్న రత్న కిరీటము ఆమె తేజస్సంతయూ పైకి లేచి గోపురాకృతి యయినదో అన్నట్లున్నది. చెవిలో నున్న రత్నపు కుండలములు ప్రతిభా స్వరూపురాలైన ఆమె ప్రతీకలవలె ప్రకాశమానముగా మెరుస్తున్నవి. నాసికలో ధరించిన ముక్కెర స్వాతీ నక్షత్రమును తెచ్చి చెరపట్టినట్టుండి , దాని కాంతి ఆమె సుందర కపోలముల మీద పడి అవి కొంచము ఎర్రబడినట్టు కనిపిస్తుంది. కంఠాభరణములు ఒకదాని కన్నా ఇంకొకటి విచిత్రముగా నున్నవి. అన్నిటికన్నా మిక్కిలిగా కనిపించు ఆ బిల్వ పత్రపు హారము. ఒక్కొక్క దళమునకూ రత్నములు పొదిగియున్నవి. అటు ఇటూ ఉన్న దళములు చిన్నవి. మధ్యలోని దళము పెద్దది. ఇటువైపు పదమూడు , అటువైపు పదమూడు మధ్యలో నాయక మణి స్థానములో ఒకటి పెద్దది. మొత్తము , ఇరవైఏడు దళముల ఆ సుందర హారము ఆమె నిండైన వక్షస్థలములో విరాజిల్లుతున్నది. నవరత్న ఖచితమైన మేఖల రారాజిల్లుతున్నది. పాదములను మెట్టెలు ,కడియములు , అందెలు , ఉంగరములు ప్రకాశింపజేయుచున్నవి. అటులే , ముంజేతులలోని వంకీలు , మణికట్టులలోని వెండి కడియములు , అంగుళులలో అంగుళీయకములు మెరుస్తున్నవి. మాత దర్శనము కాగానే ఆమె యొక్క దివ్యవీణా మంజుల గానము వినపడినట్లగును. ఆమె ముడుచుకున్న పుష్పమాల దివ్య సౌరభమును ఆఘ్రాణింప జేసినట్లగును.  ఆమె కటాక్షము పరచుకొన్న చోటల్లా పవిత్రత నిండి , జ్ఞానము తాండవము చేస్తున్నట్లనిపించును. 

         ఆ పటమునకు ఎదురుగానున్న ఇంకొక గోడపై గాయత్రీ మాత చిత్రము. చిన్న అలలతో సుందరమైన నీల జలరాశి. దాని మధ్యలో జగత్సౌందర్యము నంతటినీ రాశిచేసి అచ్చుపోసినట్లున్న పెద్ద కమలము. దాని మీద మాత కూర్చున్నది. ఒక కాలు మడుచుకొని ఇంకొకకాలు కిందికి వాలుగా వదలినది. ఆ కాలు నీటిని తాకుతున్నట్లుంది యనుట కన్నా ఆ జలరాశి ఆ పాదమును కడిగి కృతార్థము కావలెనని , భయభక్తులతో అలలను పైకి విసరుతున్నట్టుంది. ఆ కాలిలో రత్న నూపురములు శోభిస్తున్నవి. కాలి వేళ్ళకు ధరించిన రత్నపుటుంగురములు పడిపోకుండా బంగారపు చిన్న చిన్న సరములు. అవి సంధించు స్థానములో ఒక రత్నపతకము. ఆ పతకము నుండీ ఇంకొక సరము వెళ్ళి కాలి యందియకు ఉన్న ఉంగరమునకు కట్టుబడియున్నది. సరిగ్గా చూస్తే తప్ప, దేవి ఒంటి స్వర్ణఛాయలో ఈ బంగారపు సరపు వర్ణము కలసి పోయినట్లు కనిపిస్తుంది. ఆ కాలిపై పడియున్న చీర అంచు యొక్క కళాకృతి రత్న నూపుర బంగారపు కాలి యందెలను కొంచము కొంచముగా కప్పి యున్నది. దేవి ధరించిన రత్నాంబరము చంద్రకాంతిని పట్టివేసి వస్త్రముగా పరచి దాని మధ్య మధ్యలో ఉజ్వలమైన నక్షత్రములను పొదిగి నేసినట్లుంది. ఆమె మేఖల సూర్య రశ్మిని పట్టి చేసిన గుళ్ళతో చేసినట్లుండి, ప్రకాశమానముగా ఉండి , కన్నులను మిరుమిట్లు గొలుపుతున్నది. 

            చూడగా , ఎవరికో ప్రత్యక్షమైన జగన్మాత వలెనున్నది. ఒక ఘడియ అలాగే నిలబడి చిత్రమును చూడవలెను అనిపిస్తుంది. చూడగా చూడగా మైమరచిపోవునట్లున్నది. ఏదో అలౌకిక దేశ , కాలములకు చిక్కి ఎక్కడికో వెళ్ళి ఏదో చూచినట్లు భాసమవుతుంది. అలాగే గనక చూస్తుంటే ఒక్క ఘడియయైనా సమాధిలోకి వెళ్ళెదము. 

        ఆ మంటపమునకు నాలుగు వాకిళ్ళు. ఆ నాలుగు వాకిళ్ళలోనూ నాలుగు చిత్రపటములు. వెనుకటి మహారాజు దేవతార్చనలో ఉన్న చిత్రమొకటి , దాని ఎదురుగా వైదీకవేషములో విద్వద్బృంద సమేతుడై ఉన్న ఇప్పటి జనక మహారాజు. ఇంకొకటి మూలలో సింహాసనము పై కూర్చున్న మహారాజు. దాని ఎదురుగా యోధుడి వేషములోనున్న సైన్య సమేతుడైన రాజు. అన్నీ పురుష ప్రమాణములో ఉన్న చిత్రములు. 

        మిగిలిన చోట్ల , ఒక వైపు ఒక దేవస్థానపు దృశ్యము. గోపురపు వాకిటి నుండీ చూస్తే లోపల హజారము. దానిలోపల నవరంగము. దానిలోపల గర్భగుడిలో స్వామికి మంగళ హారతియగుచున్నది. చూస్తే , సమీపములో నున్నట్టే అనిపించి , ఇంకేమి అర్చకులు మంగళారతి తెస్తారు , మనము మంగళారతి తీసుకుంటాము అని అనిపిస్తుంది. 

         ఇంకొకవైపు దేవస్థానము ఎదురుగా యజ్ఞమంటపపు దృశ్యము. యజ్ఞవేదిక పైన ఆహవనీయము జ్వాలామాలా సుందరమైనది. ఒకవైపు దక్షిణాగ్ని సన్నగా మండుచున్నది. ఇంకొక వైపు గార్హపత్యాగ్ని సన్నగా తెల్లటి ధూమమును చిమ్ముతూ మండుతున్నది. ఆహవనీయపు పక్కన భవ్య కాయుడైన అధ్వర్యువు స్రుక్కు , స్రువములను పట్టుకొని హోమము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. చాచిన చేతిలో పట్టుకున్న స్రువము నుండీ నెయ్యి అగ్నిలోకి ధారగా పడుతున్నది. అటువైపు ఒక స్తూపము కాపలా కాయు యోధుని వలె నిలుచున్నది. ఇటు యజమానుడు పత్నీ సమేతుడై సంతోషపు మూర్తియా యన్నట్లు కూర్చున్నాడు. చూచేవారికి , ఇప్పుడే హోమము జరుగుతున్నట్లూ , తాము సకాలములో వచ్చినట్లూ అనిపిస్తుంది. 

         మూడవది గురుకులపు దృశ్యము. భగవానులొకరు వేదికపైన ఆసీనులైనారు. తాము వింటున్న మంత్రముల అధి దేవతలను సాక్షాత్కరించు కొంటున్నారో అన్నట్లు అరకన్నులు మూసి కూర్చున్నారు. వారు కూర్చున్న దర్భాసనమూ , వారు కట్టుకున్న మడి పంచ, వారు కప్పుకున్న అజినమూ ఆ చుట్టుపక్కలకంతా పవిత్రతను ఆపాదించునట్లునది. పక్కన ఉపవేదిక పైన అధ్యాపకులు కూర్చొని వేళ్ళు లెక్కిస్తూ, పక్కకు ఎత్తిన తల స్వంత స్వరమును (  వేదములో ఉదాత్తము , అనుదాత్తము , స్వరితము , ప్రచయములను నాలుగు స్వరములు ఉంటాయి . అనుదాత్తము తక్కువ స్థాయి. దానిపైన ఉదాత్తము , దానిపైన స్వరితము )  సూచిస్తుండి , శిష్యులకు అధ్యయనము చేయిస్తున్నారు. సమీపములో నున్న పర్ణ కుటీరములు అక్కడున్న గృహస్థులు లక్ష్మికన్నా లక్ష్మీపతినే ఎక్కువగా ఆరాధిస్తున్నట్లు చూపుతున్నవి. అవి పరిశుభ్రమైన ముంగిళ్ళతో తీర్చిన రంగవల్లులతో శోభితమైనది వారి తృప్తిని చూపుతున్నవి. అనతి దూరములోనే ఆశ్రమమునకు ప్రదక్షిణముగా పారుతున్న నది ఈ ఆశ్రమపు పక్కన ప్రవహించి తాను కృతకృత్యురాలైతినని అనుకొన్నట్లు నిర్మలముగా ఉంది. వెనుక నున్న పర్వతము ’ నేనిక్కడి రక్షకుడను ’ అని ఎత్తుగా ఉన్న వృక్షములు అనెడు చేతులనెత్తి , ’ జాగ్రత్త ! నేను సహస్ర బాహువును ’ అని హెచ్చరిస్తున్నట్లుంది. ఆ చిత్రపు ముందరి భాగములో కనపడు పచ్చిగడ్డి , వెనుక కనిపించు తెల్లటి ఆకాశము, అక్కడి నివాసులు కూడా మా లాగ పరిశుద్ధ చిత్తులైయున్నారు అని ఉద్ఘోషిస్తున్నట్లుంది.

         నాలుగవది ఒక గోవులమంద చిత్రము. మడమల ఎత్తు వరకూ పెరిగిన గడ్డిగాదములు. అక్కడక్కడా పరచుకొని పెరిగియున్న ఛాయావృక్షములు. చిత్రపు మధ్యలో ఏనుగంతటి ఆంబోతు. దాని వెనుక భాగము బాగా పెరిగి వంగిపోయినది. అది వీరావేశముతో వచ్చి పుట్టను కొమ్ములతో పొడుచునట్లుంది. ఆవులన్నీ చుట్టు నిలిచి చూస్తున్నవి. ఆంబోతు వీరావేశమును తామూ పంచుకున్నట్లు అవి ముక్కు పుటములనూ , కనులనూ పెద్దవి చేసియున్నవి. ఒక్కొకటీ బాగా బలిసియున్నవి. ఒక్కోదాని వాలమూ గడ్డిపరకలపైన వాలాడుతున్నవి. చూచినవారి మనసుకు ఒకవిధమైన హర్షము , ఒక ఉత్సాహము కలుగునట్లుంది. సమృద్ధికి చిహ్నమైన గోవును చూచి సంతోషపడని వారెవ్వరు ? 

         వైశాఖపు అమావాస్యకు అన్నీ సిద్ధమైనాయి. జ్యేష్ఠశుద్ధ తదియనాడు మంటప ప్రవేశము అని నిర్ణయించినారు. వెనుకటి దినమే మంటపపు సింగారము , అలంకరణ మొదలైంది. ప్రతి స్థంభమునకూ చిత్ర చిత్రమైన రంగు రంగుల బట్టలను చుట్టినారు. ప్రతి స్థంభమునకూ పూలను , చిగురుటాకులనూ కట్టినారు. స్థంభమునుండీ స్థంభమునకు పూలు , చిగురు , ఆకుల తోరణములను కట్టినారు. గోడలకు సున్నమును మెలకువగా దప్పముగా పూసినారు. నేల అంతా ఊడ్చి కడిగి , ముగ్గులు వేసినారు. మంటపమునకు వచ్చు దారులన్నీ శుచి చేసి అక్కడ ఉన్న రాళ్ళూ రప్పలూ , పెరిగిన గడ్డినీ తీసివేసి శుద్ధము చేసినారు. తటాకముల నన్నిటినీ స్వఛ్చపరచినారు. మంటపము ఎదురుగా రాజశకటములకు కేటాయించిన స్థలమంతా నిర్మలమయినది. అంతేనా , మంటపమునకు మంటపమే పరిశుభ్రముగా స్వఛ్చముగా తళతళా మెరుస్తున్నది. మామిడాకుల తోరణములకు లెక్కేలేదు. ఎక్కడ చూచిననూ అందచందాల గని అనిపిస్తున్నది. 

తదియ నాడు రాజపురోహితుడు అశ్వలుడు , ముత్తైదువలు , బ్రాహ్మణులతో మంటపమునకు వచ్చినాడు. అక్కడ ప్రవేశ హోమము చేసి సిద్ధముగా వేచియున్నాడు. 

ఇటు రాజభవనములో విద్వాంసులు , రాజపురుషులు , నాగరిక ప్రముఖులూ , సైనికులు , మొదలైనవారంతా సమయానికి సరిగ్గా వచ్చి వేచియున్నారు. 

         మహారాజు సకాలములో ప్రాతః కర్మలను ముగించుకొని వచ్చినారు. రాజ పరివారము మంటపము వద్దకు బయలుదేరింది. ముందు రాజధ్వజమును ఊరేగిస్తూ గజములు వెళ్ళినవి. వాటి వెనుక పదాతి దళములు వెడలినవి. వాటి వెనుక మూలబలము వచ్చినది. దాని వెనుక వృషభ రథములలోనూ , అశ్వ రథములలోనూ రాజపురుషులు వెడలినారు. వారి వెనుక మహారాజు ఏనుగు పైన అంబారీ లో కూర్చొని వెడలినాడు. అతడి వెనుక అశ్వ , గజ రథములలో కూర్చొని విద్వాంసులు వెళ్ళినారు. వారి వెనుక గజ సైన్యము వచ్చింది. కొమ్ములు , బూరలు , డప్పులు మొదలైన వాద్యములు సైన్యముల ముందర మోగుతూ వెళ్ళినవి. రాజుగారి ముందర వృషభ రథములపైన వేసిన అరుగులపై నర్తకీ మణులు వీణా , వేణు మృదంగముల గతికి అనుసారముగా నర్తిస్తూ వెళ్ళినారు. రాజు వెనుక భాగములో నాదస్వరము వారు మంగళముగా స్వరములు పలికిస్తూ వెళ్ళినారు. కుడి, ఎడమవైపుల ఆస్థాన విద్వాంసులూ వందిమాగధులూ మంగళ పద్యములను పాడుచూ ఉద్ఘాటిస్తూ వెళ్ళినారు. 

         ఊరేగింపు ఈ విధముగా బయలు దేరి , మందగమనముతో సాగి , సకాలములో మంటపము వద్దకు చేరినది. సైన్యములన్నీ వెళ్ళి తమకు నిర్ణయించిన స్థానములలో నిలుచున్నాయి. నర్తకులూ , గాయకులూ , ఉభయ పార్శ్వములలో నిలిచినారు. విద్వాంసులూ రాజ పురుషులూ రాజువెనుక వచ్చినారు. వందులు రాజు ముందర  బిరుదావళులను ఉద్ఘోషిస్తూ నడచినారు. 

          పురోహితుడు బ్రాహ్మణులనూ ముత్తైదువలనూ పిలుచుకొని ఎదురు వచ్చి రాజునూ పరివారమునూ స్వాగతము చెప్పి ఆహ్వానించినాడు. బ్రాహ్మణులు వేదమంత్రములతో ఆశీర్వాదములు చేసినారు. ముత్తైదువలు మంగళ ద్రవ్యములతో వచ్చి మంగళము పాడి , హారతిచ్చి ఆశీర్వదించినారు. పురోహితుడు రాజును హోమకుండము వద్దకు పిలుచుకు వెళ్ళి రాజుచేత ఒకసారి ఆజ్య హోమము చేయించి తాను మిగిలినదంతా చేసి హోమమును ముగించినాడు. రాజు యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణ నమస్కారములను అర్పించినాడు. కలశోదకమును తీసుకొని రాజుకూ , మిగతా ముఖ్యాధికారులకూ , విద్వాంసులకూ ఇచ్చి , మిగిలినదానిని అందరిపైనా ప్రోక్షణ చేసి , అదే విధముగా యజ్ఞేశ్వరుని రక్ష కూడా వినియోగించినాడు. 

         మంటపమును విరచించిన రాజశిల్పి వచ్చి రాజును దర్శించినాడు. " సన్నిధానము పెద్దమనసుతో , ఈ వేదికను ప్రదక్షిణ చేసినట్లే ఈ మంటపమునకూ ప్రదక్షిణ చేసి రావలెను. " అని తెలిపినాడు. రాజు పరివారముతో కదలినాడు. రాజశిల్పి అప్పటివరకూ అక్కడ జరిగినది చూడనివాడికి వివరించునట్లు అంతా రాజుకు విన్నవించినాడు. రాజు కూడా అంతా కొత్తగా చూస్తున్న వాడివలె అక్కడక్కడా ప్రశ్నలు వేస్తూ నడచినాడు. 

         " మహా స్వామీ , ఈ తటాకమును పరామర్శించవలెను. దీనివలెనే ఉన్న , మోకాలు లోతు నీటితో ఉన్న నాలుగు తటాకములు ఈ మంటపము నాలుగు మూలలలోనూ ఉన్నాయి. దీనిలో నీలపు తామరలు ఉన్నట్లే మిగిలిన వాటిలో క్రమముగా తెల్ల తామరలు , పసుపు తామరలు , ఎర్ర తామరలూ ఉన్నాయి. ఈ తటాకపు ఉద్దేశాలు రెండు. ఒకటి ఈ మంటపములో చలువ ఉండవలెననీ , ఇంకొకటి తామరల గుంపు ఉన్నచోట మహావిష్ణువు వెలసియుంటాడని ప్రతీతి. ఆ విష్ణువును యజ్ఞమంటారు. యజ్ఞస్వరూపుడైన మహా విష్ణువు ఈ శారదా మంటపము నాలుగు వైపులా ఉండి దీనిని కాపాడుతాడని నమ్మకము. దీనితో పాటూ ఇంకొక ప్రయోజనము కూడా ఉంది. ఇక్కడికి వచ్చినవారు కాళ్ళు కడుగుకొనకుండా మంటపము లోపలికి వెళ్ళకూడదని , ఇక్కడ కాళ్ళు కడుగుకొనుటకు వసతులు చేయడమైనది. ఇదిగో , ఈ గార తో కట్టిన స్థలములో కాళ్ళు కడుగుకొన వచ్చును. ఆ నీరంతా మరలా ప్రవహించి పోవునట్లు గారతో బచ్చలులు కట్టబడినవి. వీటిలో నీరు సమానముగా ఉండునట్లు భూమిలోపల కాలువలతో జలాశయమునకు సంబంధమును కల్పించబడినది. 

         " అలాగే ముందుకు దయచేయవలెను. ఈ తటాకముల మధ్య తులసి , మరువము , దవనము , కస్తురి పట్టియలు , వట్టివేర్లను పెంచినాము . వీటి పైనుండీ వీచు గాలి వీటి సుగంధమును తెచ్చి మంటపములో నింపవలెను అను మా ఆశ సఫలమైనదని మహా పాదములు మంటపము లోపలికి వెళ్ళగనే అవగతమగును. ఈ చుట్టూ ఉన్న వసారాలలో,  వచ్చినవారు తమ పాదరక్షలను విడుచుటకు అనుకూలముగా ఉంటుంది. ఇక ముందర చూడవలసినదేమీ లేదు. ప్రదక్షిణము చేసి మంటప ప్రవేశము చేయవలసినదిగా మహా స్వాములకు విన్నపము. " 

         రాజు మందస్మితుడై వెనుక తిరిగి చూచినాడు. శిల్పి చెప్పినదంతా వారు ఆమోదించినారని వారి ముఖ ముద్రల వల్లనే చూపిస్తూ , ప్రసన్నుడై యజ్ఞేశ్వరుడిని కుడివైపుకు వదలి , సపరివార సమేతుడై మంటప ప్రవేశము చేసినాడు. 

No comments:

Post a Comment