61. అరవై ఒకటవ భాగము-- దేవతానుగ్రహము
మహారాజు, మంత్రి మొదలగు రాజ పురుషులను పిలిపించుకొని జ్ఞాన సత్రము జ్యేష్ఠ శుద్ధ సప్తమి నుండీ పౌర్ణమి వరకూ జరగవచ్చునని నిర్ధారించినాడు. దూరపు మిశ్ర , ఫణి , హిమాలయములకు అవతల అక్షమాల , చీనా దేశముల నుండీ , దక్షిణ దేశపు ప్రసిద్ధ గురుకులములనుండీ, బ్రహ్మ , శ్యామ , మలయ దేశముల నుండీ విద్వాంసులు రావలెను అని అతని ఇచ్ఛ. " మా ఆహ్వానము వెళ్ళి చేరుటకు ఒక నెల. అక్కడినుండీ దూతలు తిరిగి వచ్చుటకు ఒక నెల , దూర దేశముల నుండీ విద్వాంసులు వచ్చుటకు ఒకటిన్నర నెల , మొత్తానికి ఎలాగైననూ మూడు నెలలు కావలెను. కాబట్టి జ్యేష్ఠ శుద్ధమే సరియైనది. " అని అందరూ చేరి సిద్ధాంతము చేసినారు. ఆ దినపు విశేషమేమంటే రాజు మంత్రాలోచనా మండలములో రాజపురోహితుడు భార్గవుడు లేడు.
రాజాజ్ఞ ప్రకారము ఆ నాటి నుండే యజ్ఞ మంటపము , విద్వద్వసతి , జలాశయముల నిర్మాణము ఆరంభమైనది. మరుసటి దినము శుభ ముహూర్తములో రాజు అమృత హస్తములతో జ్ఞాననగరపు శంఖు స్థాపన , శిలాన్యాస ప్రతిష్ఠ అయినది. నగరోద్యానములో వసతులు , అక్కడక్కడ కృత్రిమ జలాశయములు , దానికి దక్షిణాన విశాలమైన బయలులో యజ్ఞమంటప ఏర్పాట్లయినాయి.
యజ్ఞ మంటపము విద్వాంసులు , మహారాజులు , ప్రేక్షకులూ మొదలైనవారు కూర్చొనుటకు అనుకూలముగా విశాలముగా రచింపవలెను అని రూఢి అయినది.
గంగా యమునా తీరములలో, సింధూ సరస్వతుల సమీపములో , దక్షిణాన నర్మదా , తపతీ , కృష్ణా , గోదావరీ , కావేరీ , తామ్రపర్ణీ తీరములలోను , సముద్ర తీరములలోనూ గురుకులములనూ , ఆశ్రమములనూ కట్టుకొని ఉన్న విద్వద్వరేణ్యుల కందరికీ ఆహ్వానములు వెళ్ళినాయి. అట్లే, దూర దేశపు రాజులకు , తమ వద్దనున్న మహా విద్వాంసులను పిలుచుకొని జ్ఞాన సత్రమునకు రావలెనని పిలుపు వెళ్ళింది. అలాగే హిమాచలము నుండీ దక్షిణపు సముద్రము వరకూ ఉన్న నానా దేశముల అధిపతులందరూ విద్వాంసులతో పాటు రావలెనని ఆహ్వాన పత్రికలు వెళ్ళినవి.
జ్ఞాన నగరపు నిర్మాణము వేగముగా జరుగుతున్నది. చెరువులు , బావులు , తటాకములు రూపు దిద్దుకుంటున్నాయి. కృత్రిమ కొండలు , వనాలు , కట్టలతో కూడిన మహా వృక్షములూ రాజవీధులూ అన్నీ సృష్టియగుచున్నవి. విశాలమైన భవ్యమైన యజ్ఞ మంటపము పైకి లేస్తున్నది. నగరపు వర్తకులు రాబోవు జన సమూహములకని ధాన్యాదులను రాజ సహాయముతో సేకరిస్తున్నారు. రాజాజ్ఞగా రాజధాని అంతా సింగారిస్తున్నారు. రాజధాని చుట్టు పక్కల గోపాలులు ఏడు దినముల జ్ఞాన సత్రమునకు వచ్చువారికి కావలసిన పాలు , పెరుగు , నెయ్యి , మొదలగునవి సేకరించుటకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా జాగృతమై నగర నిర్మాణము వైపుకు పరుగెడుతున్నది. రాజు ప్రతి దినమూ మిత్రులూ , పరివారముతో కూడి గుర్రములపై కూర్చొని వచ్చి అన్నీ వీక్షిస్తూ పర్యవేక్షిస్తూ వెళుతున్నారు.
ఒక దినము రాజుకు ఏదో ఆలోచన వచ్చి, " నేనెంతటి వాడను ? ఈ భారీ కార్యమునకు చెయ్యి వేసి నగుబాటయితే గతి యేమిటి ? భారత ఖండపు రాజులందరికీ , దేశపు రాజులందరికీ , మా రాజ్యపు చుట్టు పక్కల ఉన్న రాజ్యముల , మహానదీ తీరముల గురుకులాధ్యక్షులకందరికీ ఆహ్వానములను పంపించుట అయినది కదా ? వారంతా వస్తే గతి యేమి ? " అని కలవరమైనది. ఒకోసారి , " ఆలోచన ఎందుకు ? మా నగరములో కుబేరులనే కొనుక్కోగల వర్తకులున్నారు , రాజ దివాణము లోని ధనము చాలకపోతే వారితో తీసుకుంటే సరి. " అని ధైర్యము తెచ్చుకొనును.
ఇటునుండీ తరిమేస్తే మరలా అటునుండీ వచ్చు వేసవి ఈగల వలె మరుక్షణమే ఆలోచన వచ్చి కలచి వేయును. " వచ్చు విద్వాంసులకు వారికి దారి వెచ్చములకు కాక ఒక వెయ్యి సువర్ణములైనా సంభావనలు ఇవ్వక పోతే జ్ఞాన సత్రము అదెంతటిది ? వచ్చే విద్వాంసులు ఒక్కొక్కరే వస్తారా ? వారి ప్రధాన శిష్యులని నలుగురైదుగురునైనా వెంట పిలుచుకొని వస్తారు. వారినందరినీ వట్టి చేతులతో పంపుటకగునా ? వారికి ఒక్కొక్క నూరైనా ఇచ్చుట వద్దా ? వారందరూ ఇక్కడున్నంత వరకూ వారికి భోజనాది ఉపచారములు కావద్దా ? ఎలాగెలాగ చూచిననూ ఒక కోటి సువర్ణములైననూ లేకపోతే ఎలాగ ? ’ అని మరలా భీతి అయినది.
రాజుకు , ఆ రాత్రి భోజనము సహించలేదు. హంస తూలికా తల్పము పై పడుకున్ననూ కంటికి నిద్ర రాలేదు. తన రాజ్యపు ఉత్పత్తి యెంత ? వెనకటి వారు సేకరించి పెట్టిన ధనము ఎంత ఉంది ? తాను ప్రయత్నిస్తే ఇంకా ఎంత సమకూర్చవచ్చు ? అని అంతా లెక్క వేసినాడు. ఎలాగెలాగ లెక్క వేసిననూ యాభై లక్షలకన్నా మించుట లేదు. తనకు ఈ జ్ఞాన సత్రమునకు కావలసినది ఒక కోటి. రాజుకు యోచన బలమై శిరోభారము మొదలైనది. తీరని యోచన కొనసాగి జ్వరము కూడా వచ్చినది. ఇంకా ఒక్క క్షణము కూడా నిద్ర లేదు. రాజభవనపు బయటి ప్రాకారము నుండీ పిలచినా వినపడునంత నిశ్శబ్దముగా ఉన్న సమయములో , తన నిశ్వాసపు శబ్దము చెవికి ఉరుము వలె వినిపించునట్లై రాజు ఇక పండుకొనలేక లేచి కూర్చున్నాడు.
అప్పుడు ఇంకొక యోచనా లహరి వచ్చినది., " ఔను , ఇదంతా నేను చేస్తున్నది దేనికోసము ? బ్రహ్మిష్ఠుడైన గురువును సంపాదించుటకు. ఇంతవరకూ నాకు తెలిసినవారిలో భగవానులు ఆ పట్టమునకు యోగ్యులు. సరే , విదేశములలో విద్వాంసులే లేరా ? వారెవరైనా వీరికన్నా ప్రబలులైతే ఏమి చేయవలెను ? నేనుగా ఇతడి అవమానమునకు కారణమవుతాను కదా ? మరి , నేను అంత అభిమానవశుడనై చేస్తున్నానా ? లేదు , అలా అనుటకు లేదు. ఆనాడు ఆతని ఆశ్రమమునకు వెళ్ళి సంహితా బ్రాహ్మణోపనిషత్తులను విన్నపుడు మొదలై , దినదినమూ పల్లవించి పెరిగిన అభిమాన మహా వృక్షము ఇప్పుడు హృదయమంతా నిండిపోయినది. నేను కూడా ఆ అభిమానమునకు వశుడనై పోకూడనంత దూరము , తిరిగిరాలేనంత దూరము వెళ్ళినాను. ఇక వెనుతిరిగి వచ్చుట కానిపని. ఇప్పుడు నాకున్న సర్వస్వమునూ , దానితో పాటు భవిష్యత్తును కూడా చేర్చి వితరణ చేసి ఈ సత్రమును సాధించవలెను. సాధ్యమా ? సాధ్యమా ? "
రాజుకు ఆందోళన , భయమూ దిగులూ పట్టుకున్నాయి. " అవివేకమైనది కదా , దీనిని సరిదిద్దుకొనుటకు సాధ్యమయ్యేటట్లు లేదు కదా ? " అని హృదయ భారము ఎక్కువైంది. వేలకొద్దీ , కాదు ..లక్షలకొద్దీ సైన్యము ఎదురైనా బెదరక ముందుకురికే వాడు ఇప్పుడు బెదిరిపోయినాడు. పిల్లవాడికి గొగ్గయ్యను చూపినట్లై , ఒణికి పోయేటట్లు బెదరినాడు. ఆ అర్ధరాత్రిలో ఒళ్ళంతా చెమట్లు పట్టి స్నానము చేసినట్లయినది. ఆ చింతా భీతి లో , కలవరపు భయము లో రాజుకు తానెక్కడున్నానన్నది మరపు వస్తున్నది. ఏమి చేయవలెనన్నదీ అర్థము అగుట లేదు. కమ్మిన చీకటిలో ఉన్న కనులు కూడా పోయినట్లైనది. చెవులతో నైనా ఏదైనా విని గుర్తు పట్టి వెళదామన్నా చెవులు కూడా మూసుకు పోయినట్లు అయింది. పైకి లేచుటకు ఊపిరి చాలదు , పండుకొని యుండుటకు అగుట లేదు , కనులు తెరచుటకు కూడా భయమగుచున్నది. చివరికి తాను ఎవరు ? ఏమిటి ? అనునది మరచిపోయి, ఎందుకు భయపడుతున్నదీ మరచిపోయి , భయము మాత్రము మిగిలి శరీరమంతా గడ గడ ఒణుకుతున్నది.
అట్లే కొంతసేపు అతడు నలుగుతుండగా , ఆయాసము మితిమీరినట్లై జీవుడు స్వస్థానమును వదలి గొంతుకు దిగినాడు. " ఛీ, ఇంత బెదరిన వాని దేహములో మేముండ కూడదు " అని కరణములన్నీ వదలివెళ్ళినాయా అన్నట్లు కరణములు నిశ్చేష్టమౌతున్నాయి. దేహము అలసిపోయి , ఊరికే పడిఉన్నది. జీవుడు కలగంటున్నాడు.
కలలో ఒక భారీగా ఉన్న పెద్ద తోపు. అక్కడ చీకటి చేతితో దేవుకొని నింపుకోగలిగినంత దట్టముగా కమ్ముకొని ఉంది. ఎటు తిరిగిననూ ఒక భారీ వృక్షము అడ్డముగా ఉంది. చెట్లమధ్యలో సందు చూసుకొని వచ్చుటకు కనులున్ననూ వాటి సహాయము విఫలమైనట్లుంది. ఏదో భయమగుచున్నది. చీకటి జంతువులైన ద్విపాద , చతుష్పాదములన్నీ అక్కడ చేరి తనపై దాడి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లున్నవి. తానొకడే , చేతిలో ఒక ఎండు పుల్ల కూడా లేదు. అవి వందలకొద్దీ ఉన్నట్టనిపిస్తున్నది , ఏమి చేయుటో పాలు పోవుటలేదు.
అప్పుడు ఎవరో ఒకరు , ’ జనకా ’ అని పిలుస్తూ వస్తున్నారు. " భయమెందుకు ? జనకా , ఈ చీకటి , ఈ చెట్లు , ఈ పైన పడుటకు కాచుకున్న జంతువులు అన్నీ నీ మనో సృష్టి. ’ మీరంతా నేనే ’ అను . దానికదే మందు. నువ్వు ప్రత్యేకుడివి కాదు అను. ఇదంతా చేరితే ఒకటి , ఆ ఒకటి నువ్వే అను. " అంటున్నారు. జనకుడు తనకు అది అర్థము కాకున్ననూ వారు చెప్పినట్లే అంటున్నాడు. దేహమే తాను అన్న భావము కరగిపోతున్నట్లనిపిస్తున్నది. చైతన్యుడైన తాను అంతటా ఉన్న సర్వ వ్యాప్తుడను అను అనుభవము కలుగు తున్నది. అప్పుడు వేటిని చూచి భయపడ వలెనో , వాటిలో ఉన్న వాడూ , అవి అయి ఉన్నవాడూ తానే అని గోచరమగుచున్నది. పైన ఆకాశములోనూ , చుట్టుపక్కల ఉన్న జడ చేతనములన్నీ ప్రసన్నమగుచున్నవి. మనసూ శరీరము లలో నిండిపోయిన కలవరమూ , భయమూ , దిగులూ అన్నీ మాయమగుచున్నవి. ఎవరో , " అభయం వై ప్రాప్తోసి జనకా " అని తలపై చేయి పెడతారు. తాను సంతోషముతో వారికి పాదాభివందనము చేస్తాడు. లేచి చూస్తే వారు తనకు చిర పరిచితులే అనిపిస్తుంది. అయినా పరిచయము గుర్తు రాదు. అలాగే కళ్ళప్పగించి చూస్తూ ’ తమరు భగవానులు కాదా ?’ అంటాడు. వచ్చినవారు నవ్వుతారు.
నవ్వు గలగల శబ్దము తగ్గుతుండగా దృశ్యము మారిపోవు చున్నది. సువర్ణమయ కాంతి ఉన్న ఏదో దివ్య లోకము. అక్కడ ఒక కొండంత ఇల్లు. దాని ముందర తాను సర్వాభరణ భూషితుడై , దివ్య వస్త్రాలంకృతుడై నిలుచుకొని ఉన్నాడు. తన మెడలోనున్న హారముల ప్రసూనములు అప్పుడే వికసిస్తూ చుట్టుపక్కల వ్యాపించియున్న గంధమునకు గంధానులేపనము చేస్తున్నట్లున్నాయి.
వాకిటనున్న వారు వచ్చి చేతులు జోడించి ," దయచేయవలెను , తమకోసమై దేవగురువులు వేచియున్నారు " అని లోపలికి పిలుచుకొని వెళతారు. లోపల ఒక మాళిగ దాటి ఇంకొక మాళిగకు వెళితే అక్కడ గోడకి ఆనుకొని కట్టినట్లున్న ఒక బంగారు మంటపము. అటు ఇటు బంగారు స్థంభములపై బంగారు కుంభములలో నేతి దీపాలు వెలుగుచున్నాయి. ఆ మంటపములో ఒక రత్న పీఠముపై ఒకరు విరాజిల్లుతున్నారు. పిలుచుకొని వచ్చినవాడు ద్వారములోనే నిలచి , జనకునితో , ’ అదిగో , వారే దైవగురువులు. దయ చేయండి ’ అని చేయి నోటికడ్డము పెట్టుకొని చెప్పి తాను వెనుతిరిగిపోతాడు.
జనకుడు భయభక్తులతో ఆ పురుష చిన్మయ విగ్రహము వద్దకు వెళ్ళి , నమస్కారము చేసి ప్రసాదాకాంక్షి వలె చేతులు జోడించి నిలుచున్నాడు. దేవగురువు తరుణ ప్రాయుడి వలె కనిపించు వృద్ధుడని తోచును. అతడు నవ్వితే దిక్కు దిక్కులన్నీ వెలుగుచున్నట్లున్నాయి. చూడగా , ఆ కాంతివేరే అతడు వేరే అనుటకు లేదు. ఆతడు మాట్లాడిస్తాడు, " జనకా , నీ భయమంతా నివారణ అయినదా ? "
ఆ ప్రశ్నతోనే జాగృతిలో తనను ఆవరించిన భీతి మరలా వచ్చినట్లవుతుంది . ముఖము వివర్ణమవుతుంది . దేహము కాలినట్లవుతుంది. ఒంటిలో చెమటలు కనిపిస్తాయి, " దేవా , కాపాడవలెను. ఈ భీతి చెరగిపోవునట్లు అనుగ్రహించవలెను" అని రాజు మరలా నమస్కారము చేస్తాడు.
దేవగురువు నవ్వి అంటాడు, " భీతి పోయినది . కానీ దాని స్మరణము నిన్నింకా వదలలేదు. విను, నువ్వు చేయుటకు పూనుకున్న కార్యము దేవతలది. కాబట్టి దీని వ్యయము నంతా దేవతలే వహిస్తారు. నీ రాజ భవనపు దక్షిణములో అరటి తోట ఉంది కదా ! అక్కడున్న పనస చెట్టు పక్కనే ఒక మనిషిలోతు తవ్వించు. అక్కడ నాలుగు భోషాణములలో సువర్ణము దొరకును. దానిని తీసుకొని వినియోగించు. దానిని నీకు కావలసినట్లు వెచ్చము చేయి. నీ రెండవ భీతికి కారణము లేదు. సర్వజ్ఞుడు ఓడిపోవుట ఉంటుందా ? ఇకమీద నీవెనుక మేమున్నామని నమ్మకముంచుకొని ధైర్యంగా వర్తించు. అంతా జయమవుతుంది" అని చేయెత్తి ఆశీర్వాదము చేసినాడు, రాజు తేలికైన మనసుతో దేవగురువుకు నమస్కారము చేసినాడు.
అతడికి మెలకువ అయింది. ముఖము వాడిపోయి పానుపుపై పడిఉన్నవాడు పైకి లేచినాడు. నిన్నటి రాత్రి ఉన్న చెడ్డ గుర్తులేవీ లేవు. దేహము లఘువుగా ఉంది. చిత్తాదులన్నీ ప్రసన్నముగా ఉన్నాయి. సన్నగా వీస్తున్న చల్లగాలి ఉదయమవుతున్న సూచనను తెచ్చింది. తొలగుతున్న చీకటి అది నిజమేనని సాక్ష్యము చెపుతున్నది. అక్కడొకటి , ఇక్కడొకటిగా అరుస్తున్న పక్షులు ఔను, ఔను అంటున్నట్లున్నాయి .
రాజు కిందటి రాత్రి జరిగినదంతా జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఆశ్చర్యమైనది. అయినంతలో ఏ కొంచమూ మరచిపోలేదు. అలాగే , కల గుర్తొచ్చింది. అదికూడా ఏ మాత్రమూ మరపు రాకుండా అన్నీ గుర్తొచ్చినాయి. మొదటినుండీ చివరివరకూ వివరాలన్నీ గుర్తున్నాయి.
రాజుకు తాను కన్న కల తన కలవరము వల్ల కలిగినది అనిపించలేదు. భగవానులు వచ్చినారు , ’ అంతా నువ్వే ’ అన్నారు. ’ అభయం వై ప్రాప్తోసి జనకా ’ అన్నారు. ఆ తరువాత దేవ గురువుల దర్శనమై , వారు నిధి విషయము చెప్పినారు. ’ ఇకమీద నీవెనుక మేమున్నామన్న నమ్మకముతో వర్తించు. అంతా జయమవుతుంది ’ అన్నారు." సర్వజ్ఞుడే గెలుస్తాడు " అన్నారు. ఇంకొంచము సేపటికి స్నానము చేసి , నిత్య కర్మలన్నీ ముగించి అరటితోటలో తవ్విస్తే అప్పుడు కల నిజమగునా కాదా అని తెలుస్తుంది ’ అని నిర్ణయించుకొన్నారు. అంతలో ప్రాతః కాలపు మంగళవాద్యములూ , దాని వెనకే వందిమాగధుల స్తుతీ వినిపించినాయి. ఆ సుశ్రావ్యమైన వాద్య గీతములు భవిష్యత్తు యొక్క దూతలవలె ఉండి అతనిని ఉత్తేజపరచినాయి.
" మంత్రి , కోశాధికారులకు అయినంత వేగముగా వచ్చుటకు వర్తమానము చేయి. తవ్వుటకు నలుగురైదుగురు మనుషులను సిద్ధముగా ఉండమని చెప్పు " అని సేవకుడికి చెప్పి రాజు స్నానమునకు వెళ్ళినాడు.
రాజు అన్నీ ముగించుకొని వచ్చు వేళకు మంత్రి , కోశాధికారి ఇద్దరూ వచ్చి కనిపించినారు. రాజు వారి మర్యాదను స్వీకరించి , తనకు ఆదినము పొద్దున్నే అయిన కల లోవి ఎంత చెప్పవలెనో అంత చెప్పి ,వారిని పిలుచుకొని అరటి తోటకు వచ్చినాడు. అరటితోటలో ఉన్న పనస చెట్టు పక్కన తవ్వుటకు అవకాశమున్నది పూర్వ దిక్కులో మాత్రమే. పడగ విప్పిన ఫణిరాజు అక్కడ వీరికోసమే కాచుకొనియున్నట్లు , వీరిని చూడగనే పడగ దింపి వెళ్ళిపోయినాడు. అక్కడే రాజు తవ్వించినాడు. మనిషి లోతు తవ్వగానే పారకు ఏదో లోహపాత్ర తగిలింది. ఖణేల్ మని శబ్దమయింది. అందరి కుతూహలమూ ఇనుమడించింది.
ఇంకొంచము తవ్వగనే ఒక లోహ భోషాణము దొరికింది. దానిని పైకి తీసినారు. దానిని ఎత్తుటకు లావుగా పుష్టిగా ఉన్న నలుగురు కావలసినంత భారముగా ఉంది. దాని పైన ఒక రాతి ఫలకముతో మూసినారు. రెండువైపులా పట్టుకొనుటకు లోహపు చెవులవంటి కొండీలున్నాయి. భోషాణము ఇత్తడిది. అయినా కొంచము కూడా రంగు మాయలేదు.
మంత్రీ , కోశాధికారి చేరి భోషాణమును ఎత్తినారు. పైకి వస్తుండగా రాజుకూడా దానిని పట్టి పైకి లాగినాడు. మూతతీసి చూడగా దానిలో మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సువర్ణపు నాణెములు. ఆ నాణేములపై , ఒకవైపు ఛత్రమున్న సింహాసనము పై ఆశీర్వాదము చేస్తున్న ముద్రయున్న రాజొకడు , ఇంకొకవైపు ఏదో అజ్ఞాత లిపిలో ఉన్న ఏదో ఒక శ్లోకము. మధ్యలో ఒక చెట్టూ, దాని మొదట్లో ఒక ఆవు.
దానికింద ఇంకొక భోషాణము. దానిని పైకి తీస్తే , దానికింద ఇంకొక భోషాణము. దానినీ పైకి తీసి చూస్తే దానికింద కూడా ఇంకొక భోషాణము. మంత్రి , కోశాధికారులు తోటమనుషులను పిలచి వారి సహాయముతో ఆ భోషాణములను తీయించి అన్నీ రాజభవనమునకు పంపించినారు. కోశాధికారి , ఇతరుల సహాయముతో , ఒక భోషాణములోని నాణెములను లెక్కించినారు. ఒక్కొక్క భోషాణములోనూ ఒక్కొక్క లక్ష ప్రకారము మొత్తం నాలుగు లక్షల నాణెములున్నాయి. కోశాధికారి , " ఇవి ఒక్కొక్క దానికీ మన నాణెములు ఇరవై అయిదు , ఆ లెక్క ప్రకారము దీని వెల ఒక కోటి. " అన్నాడు.
రాజుకు వెనుకటి దినము తాను కోరినది ఒక కోటి అని గుర్తొచ్చింది. " ఇదంతా జ్ఞాన సత్రము కోసమే ప్రత్యేకంగా వినియోగించవలెను ’ అన్నాడు.
కోశాధికారి, " అనుమతి అయితే దీనినంతా కరగించి మన నాణెములుగా అచ్చు వేయిస్తాను " అన్నాడు.
రాజు , " పది వేల నాణెములు తీసి ఉంచండి , మిగిలినవి మన నాణెములు చేయండి " అన్నాడు.
ఆ దినము సంజ లోపల రాజధాని నిండా సమాచారము వ్యాపించింది. ఎక్కడ చూచినా జనాలు గుంపులు గుంపులుగా అదే వార్తను చిన్న గొంతులతో చర్చిస్తూ ఔనా ? అనేవారే ! వీధి జనాల నోటిలో పడిన వార్త క్రమేణా ఇళ్ళకు కుడా వ్యాపించింది. గృహిణులు చేస్తున్న పనిని వదలి , పక్క ఇంటికి వెళ్ళి, ’ ఏమండీ , అది నిజమేనా ? అంటారు. ఆమె, " ఏమోనమ్మా! వారు మాట్లాడుకుంటున్నారు, రాజభవనములో అది ఏదో తోటలో దొరికిందంట. లెక్క పొద్దుటినుంచీ చేస్తున్నా ఇంకా ముగియలేదంట" అంటుంది.
ఇంకో చోట ఒకడు అడిగినాడు , " మీరెన్నైనా చెప్పండి , నిక్షేపము దొరకవలెనంటే దేవాంశ ఉండవలెను. మన మహారాజులు దేవతలపై చాలా భక్తికలవారు. అదీకాక వారే దేవాంశ సంభూతులు. లేకపోతే ఇంత ధనము దొరుకుతుందా ? "
" అది ఎవరు దాచినదో ? అదేమైనా తెలిసిందా ? "
" ఇంకో విశేషమేమిటో తెలుసా ? దొరికినవన్నీ నాణెములు. ఒక్కొక్క నాణెమూ అరచేతి వెడల్పూ అరచేతి మందము. ఆ నాణెము చెడగొట్టి ఇప్పటి నాణెములు చేస్తే ఒక్కొక్కటీ నూరు అవుతాయంట ! "
" ఇదంతా అయినాక , మహారాజులు దొరికినదంతా జ్ఞాన సత్రానికే ఖర్చుపెడతారంట ! అది కాదా అసలు గొప్ప ? "
" అదేమి గొప్ప లెండి , మీకు మనుష్య స్వభావము తెలియదు , అంతే. ఇప్పుడు జ్ఞాన సత్రము చేయవలెను అని పూనుకున్నారు. సమయానికి సరిగ్గా ఒక నిక్షేపము దొరికింది. దానిని, ఉద్దరగా దొరికినది ఊరి నిర్మాణానికి అని ఆ సత్రానికి కేటాయించినారు. ఏమి మహా ! "
" అదీ నిజమే అనండి , లేకపోతే ఈ కోట్లాది సువర్ణాలు ఎక్కడనుండీ తేవలెను ? మూడునాలుగు తరాలనుండీ రాజ భవనములో కూడబెట్టిన ధనమంతా తీయాల్సి వచ్చేది. "
" రాజ భవనములో నిజంగా ఎంత సేకరించి ఉంటారండీ ? "
" ఎంతేమిటి ? ఒక కోటి ఉంటే ఎక్కువ. మన విదేహరాజులు ఇతరులవలె కాదు. వీరు చేస్తున్నట్లు వెనుక జ్ఞాన సత్రములు జరిగి ఉండక పోవచ్చు . కానీ ప్రతి సంవత్సరమూ విద్వత్ సభలు జరిగి , విద్వాంసులకు కావలసినంత ఇచ్చేవారు. వీరు కూడా ఇతర రాజుల వలె భద్రముష్టి గల వారైతే ఎంతో కూడబెట్టి ఉండవచ్చును. "
ఆ వేళకు ఇంకొకడు వచ్చి గుంపులో చేరినాడు. " ఇంకొక సంగతి తెలుసా ? ఆ నాణెములపైన ఏదో రాసి ఉందట. దానిని చదువుటకు మన ఈ నగరములోనే ఎవరూ లేరంట ! "
" అది మధ్యాహ్నపు వార్త. సంజ వార్త తెలుసా ? ఆ ముసలి శిల్పి చదివినాడంట ! వాడికి నూరు సువర్ణాలు ఇచ్చినారంట ! "
" ఏమి రాసి ఉందంట ? "
" అదేమో దేవేంద్రుడు , మనువు , మన మహారాజు పేరు చెప్పి ఇది జ్ఞాన సత్రమునకు అని రాసి ఉందంట. "
" హా! అలాగ చెప్పండి . లేకపోతే ఆ ధనమునంతా ఈ జ్ఞాన సత్రానికి కేటాయించేవారో కాదో ? "
ఇలాగే రాత్రి ఒక జాము వరకూ వ్యర్థపు మాటలు నడచినాయి. జనాలకు వ్యర్థపు మాటలు మాట్లాడడమంటే అదేమి పిచ్చో ? అందులోనూ కాంత, కనకం అంటే ఒళ్ళంతా చెవులవుతాయి. మిథిలలోనూ అలాగే అయింది.
No comments:
Post a Comment