SHARE

Friday, March 1, 2013

49. " మహాదర్శనము " --నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము


49.  నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము


          యాజ్ఞవల్క్యుడు వ్రతుడై , కాత్యాయని ఆతని సతియై , పాయస భోజనము చేస్తూ ఒక సంవత్సరము ఆదిత్యోపాసన చేసినారు . కొన్ని దినములగుచుండగా , యాజ్ఞవల్క్యుడు మంత్ర జపమునకు కూర్చొనువేళకు , ఒక పచ్చటి మైదానములో మేస్తున్న ఎర్రటి గుర్రమొకటి కనిపిస్తుంది . అతడు  జపంలో ఉన్నంత సేపూ అది ఎదురుగనే ఉండును . 

         కాత్యాయనికి ఆమె పితామహుని వలననూ , ఇంటి లోని వారు ఆడుకొను మాటల వలనా, భర్త ఒక అలౌకిక మహాపురుషుడు అన్నది తెలిసియుండినది . అందుకే ఆమె , భర్తను వ్రతమెందుకు చేయుచున్నావు మొదలైన ప్రశ్నలను ఒక్కటీ అడుగలేదు . 

         రాను రాను యాజ్ఞవల్క్యుని ముఖము తేజస్సుతో వెలుగుచున్నది . తేజస్సంటే సామాన్యమైన తేజస్సు కాదు , అది కనులకు మిరుమిట్లు గొలుపు నంతటి తేజస్సు . ముట్టుకుంటేనే కాదు , చూస్తేనే కాలుస్తుందేమో అనునట్టి తేజస్సు . ఒకటి రెండు సార్లు అతడు జపమగ్నుడై యున్నపుడు అతని తల్లి ఏదో కారణము వలన వచ్చి తొంగి చూచినది. పదునై తీవ్రముగా నున్న , ఆ శీతలమైన తేజస్సును చూచి , గుడిసె దేదీప్యమానంగా వెలుగుతుంటే ఎక్కడైనా అంటుకుంటే ? అని శంకించి , తన భర్తకు తన శంకను చెప్పినది . అతడు నవ్వి , " పిచ్చిదానా , మంత్ర జపము చేయువాడు మంత్రాధిదేవత వలెనే అగును , నిజము . కానీ గుడిసె ఏమీ అంటుకోదు . దిగులు పడవద్దు . ఒకవేళ నీ కొడుకు యొక్క  తపోజ్వాల వలన గుడిసె అంటుకున్నా , అతడిని ఏమీ చేయలేదు . " అని శాంతింప జేసినాడు . 

         అయితే దినమూ భర్త తోపాటు అగ్ని సేవ చేయునపుడు కాత్యాయనికి శాఖము , వేడిమి ఏమీ తగులుట లేదు . పైగా దేహమంతా ఏదో సౌభాగ్యమును పొంది సంతోష పడినట్లగును . ఆమె అదంతా గమనించలేదు . ఆమెకు కావలసినది ఒకటే ఒకటి : అది , భర్త కృతార్థుడగుట. 

        ఇలాగ కొన్ని దినములు గడచినాయి . నెలలూ గడచినవి . గుర్రము ఒకరోజు సకిలిస్తూ యాజ్ఞవల్క్యుని ఎదురుగా వచ్చింది . అతడికి ఇది సామాన్యమైన గుర్రము కాదు అనిపించి , దానికి పంచోపచార పూజను అర్పించినాడు . గుర్రము మానవులు స్వీకరించుట కన్నా ఎక్కువగా పూజను స్వీకరించి , ’ నా వలన ఏమి కావలెను , చెప్పు ’ మానవ భాషలో అడిగింది . 

        యాజ్ఞవల్క్యుడు , " దేవా , నువ్వు ఎవరు అని అడుగవలెనని ఆశ. అయితే ఆదిత్యమంత్రమును జపము చేయునపుడు దర్శనము ఇస్తున్నావు కాబట్టి ఆదిత్యుడవే అయి ఉండవలెను అని నమ్మకము " అన్నాడు . 

        గుర్రము సకిలించినది . ఆ సకిలింపు యాజ్ఞవల్క్యునికి నవ్వు వలె అనిపించినది . ’ చూడ వలెనా , చూడు ’ అన్నది . చూడగా , గుర్రము ఉన్న వైపంతా ఆదిత్య మండలము జ్వాలాయమానం గా మనోహరముగా ఉంది . నానా వర్ణపు జ్వాలలు మండలమును వెలిగిస్తూ వెలుగుచున్ననూ , తెల్లటి వెలుగు అంతటా పరచుకొని సుందరముగా ఉన్నది . మండల మధ్యస్థుడైన హిరణ్మయ పురుషుడు విరాజిల్లుతున్నాడు . రక్త మాల్యాంబరములను ధరించినాడు . సర్వాభరణ భూషితుడైనాడు . ఆతడే ఆదిత్యుడై యుండవలెనని యాజ్ఞవల్క్యునికి బోధయగుచున్నది . 

 ఆ మహాపురుషుడు అడిగినాడు , " ఏమి యాజ్ఞవల్క్యా , నా వలన ఏమి కావలెను ? " 

         యాజ్ఞవల్క్యుడు ’ నేను అర్పించిన పూజను గైకొనుము ’ అంటున్నాడు . ఆ మహా పురుషుడు , " మీ దంపతులు నిత్యమూ అర్పిస్తున్న పూజవలన నేను ప్రసన్నుడనైనాను . కాబట్టి మరలా పూజ అవసరము లేదు . నీకేమి కావలెనో అడుగు "  అంటాడు . 

       యాజ్ఞవల్క్యుడు " దేవా , మేము మానవులము . లోభపు మూర్తులము . మేము మా మనసు ప్రేరేపించునట్లు పలికెడివారము . కాబట్టి , నేను అడుగుట , నువ్వు ఇచ్చుట వద్దు . ఏమిస్తే నేను కృతార్థుడ నగుదును అని నీకనిపిస్తుందో , నువ్వు నీ అంతస్తుకు తగినట్లు ఏమిస్తే సరిపోతుందో , నాకు నువ్వేమిస్తే లోకము కృతార్థమగునో , దానిని ఇవ్వు " అంటాడు . 

         ఆదిత్యుడు ఆ మాట విని తల ఊపుతాడు . " యాజ్ఞవల్క్యా , నువ్వు నా మంత్రమును నాకే అప్పజెప్పినావు , భలే !  కానిమ్ము , అటులనే ఇచ్చెదను . నీ అహంకారమును ముందుంచుకొని , అదివ్వు , ఇదివ్వు అనకుండా , ఏమి ఇచ్చుట అనుదానిని నీకే వదలినాను అన్నదీ బాగుంది . అది సదహంకారపు పరమావధి . కానిమ్ము , నువ్వు పుట్టినది ఎందుకు అన్నది నాకు తెలుసు . ఈ ఉద్దేశము నెరవేరనీ యనే , మేమే నీచేత ఈ వ్రతమును చేయించు చున్నాము . సరే , ఇంకొన్ని దినములు వ్రతమును చేస్తూ ఉండు . ఇప్పుడే కదా ఉత్తరాయణము గడచింది, మరలా ఉత్తరాయణములో నేను నీకు మరలా వరప్రదానము చేయుదును . ఇక వెళ్ళి వస్తాను " అని అంతర్థానమవుతాడు . యాజ్ఞవల్క్యుడు మరలా జపములో మగ్నుడవుతాడు . 

          మరలా ఉత్తరాయణము వచ్చింది . జగత్తును ఆవరించిన శీతలము ఓడిపోయిన సైనికుడివలె మెలమెల్లగా వెనక్కి వెళుతూ వేసవికి దారి ఇస్తూ వచ్చింది . రథసప్తమి కూడ వచ్చి  , సూర్యుని రథము ఉత్తరమునకు తిరిగింది . యాజ్ఞవల్క్యుడు అంతర్ముఖుడయి ఉండుట ఎక్కువైంది . కాత్యాయని , యాజ్ఞవల్క్యుని ప్రతిబింబము వలె , బహిర్ముఖముగా వ్యాపారములను నడిపిస్తున్ననూ , ఆదిత్య మంత్రమును ఎడము లేకయే జపిస్తున్నది . చూచేవారికి , ’ ఈ పిల్లకు మాటలే రావా ? ’ అనిపించేంత మౌనముగా ఉంటున్నది . దినమునకు ఒకటో రెండో మాటలు మాట్లాడుతుంది , అదికూడా అత్తతోటే ! 

         ఎప్పటి వలెనే తోటలో సూర్యారాధన జరుగుతున్నది . నమస్కారములన్నీ అయినవి . అర్ఘ్య ప్రదానాదులు కూడా ముగిసినాయి . ఆ దినము పూజ జరుగుచుండగా ఏమి విచిత్రము జరిగిందో ఏమో , యాజ్ఞవల్క్యుడు భార్యను పిలచి , " సాధ్యమైతే నువ్వు ఈ దినము గుడిసెలో ఉండు " అన్నాడు . కాత్యాయని మౌనముగా , వినయముగా ’ సరే’ నని తలాడించినది . ఇంకా సూర్యుడు ముఖాని కెదురుగా వస్తున్నాడు , అంతే ! మొదటి ఝాము గడచింది . సుమారు రెండో ఝాములో కూడా కొంత గడచింది . 

యాజ్ఞవల్క్యుడు ఎప్పటిలా జపములో మగ్నుడైనాడు . కాత్యాయని వాకిటి లోపల తానూ జపములో కూర్చున్నది . 

          ఎప్పటి వలె గుర్రము కనిపించినది . గుర్రము ఒకటి ఉన్నది , ఒకటి రెండైనది . అలాగే మరలా ఒకటే అగుచున్నది . అదికూడా గుర్రము పిల్లగా అగుచున్నది . పరుగెత్తుతూ నేరుగా యాజ్ఞవల్క్యుని వద్దకు వచ్చి , " యాజ్ఞవల్క్యా , వచ్చేదా ? " అని అడుగుతుంది . అతడు దానికి పూజ చేసి , " దేవా , నీ ఇఛ్చయే నా ఇఛ్చ " అంటాడు . 

         " చూడు , నువ్వు నన్ను ధరించగలవా ? " అని గుర్రము కాళ్ళు తాటిస్తూ ఆడుచున్నది . చూడగా , ఇప్పుడది గుర్రము పిల్ల కాదు , ఒక మనిషి కన్నా ఎత్తైన గుర్రము . అంతే కాదు , జ్వాలామయమైనది . నిగనిగమని నిప్పులకన్నా ఎర్రగా మెరుస్తున్నది . 

          యాజ్ఞవల్క్యునికి బెదురు కలుగుట లేదు . " దేవా , అప్పుడే తెలిపియున్నాను . నీకు సరి యనిపించిన దానిని కరుణించు . నాకు హితమైనది ఏదో దానిని కరుణించు . లోకానికి ఏది కావలెనో దానిని కరుణించు " 

          గుర్రము పలుకుతుంటే ఉరుము ఉరిమినట్లుంది , " సరే , భారమును నాపై వేసి నువ్వు కృతార్థుడవైనావు . లేకపోతే , ఇప్పుడు నేనివ్వవలె ననుకొన్న ఈ వరమును ధరించుటకు నీకు చేతనయ్యెడిది కాదు . ఇదిగో  , నువ్వు నావలె అయి , నా వరమును గ్రహించు " అని గుర్రము మరలా ఒకసారి సకిలించి ఆతని హృదయమును ప్రవేశించినది . 

        యాజ్ఞవల్క్యుడు ప్రజ్వలిస్తున్న అగ్నిగుండమైనాడు . అతని రోమ కూపము లన్నిటినుండీ అగ్ని పురుషుని కన్నా ఎక్కువగా జ్వాలలు లేచినవి . ఒక ముహూర్త కాలము  అలాగే ఉండినది . 

         గుర్రము మరలా బయటికి తిరిగి వచ్చినది . యాజ్ఞవల్క్యుని దేహము వెదజల్లుతున్న మంటలన్నీ శమించినాయి . గుర్రమన్నది , " యాజ్ఞవల్క్యా , కృతార్థుడవైనావు . నీ వలన లోకము కృతార్థమైనది . నువ్వు వేద పురుషుడవైనావు . నీనుండీ లోకము ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , రెండు ఉపనిషత్తులను పొందును . వాటిలో ఒక ఉపనిషత్తు నీ గురించినది . ఇంకొకటి బ్రహ్మను గురించినది . ఆ రెండింటినీ అధ్యయనము చేసి , వాటిలోనున్న రహస్యమును ఛేదించువానికి తప్పకుండా మహాదర్శనమగును . ’

          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక ఒక గడియ మౌనముగా ఉన్నాడు . గుర్రము అంత సేపూ యాజ్ఞవల్క్యుని తన మూతితో నిమురుతూ తన విశ్వాసమును చూపిస్తూ అక్కడే నిలిచింది . కొంతసేపైన తరువాత ప్రకృతస్థుడై యాజ్ఞవల్క్యుడు గుర్రానికి పూజ సలిపినాడు . వెనుక అయినట్లే మరలా , గుర్రము ఉన్న చోట మండలస్థుడైన ఒక మహాపురుషుడు  కనిపించి ఆతని పూజనంతా స్వీకరించి , " యాజ్ఞవల్క్యా , నువ్వు ఋషివైనావు . మహర్షియైనావు . బ్రహ్మర్షియైనావు . నీవంటి అదృష్టవంతుడు లేడు . ఇప్పుడు నువ్వు సర్వజ్ఞుడవు . సర్వ దేవతామయుడవు . అంతే కాదు , బ్రహ్మమై యున్న బ్రహ్మర్షి , వృక్షము లోపల గుజ్జు తో కూడిననూ బయట చిగురు , పూలు , కాయలతో మెరయునట్లే అంతర్ముఖుడవైనను బహిర్ముఖుడవై సంసారిగా ఉండు . కాలము వచ్చినపుడు హెచ్చరించెదము . అప్పుడు నువ్వు నువ్వు అగుదువు గాని . నేనిక వెళ్ళి వస్తాను , మేమంతా నీలో ఉపస్థితులము . మరవ వద్దు " అని అతనిని వీడ్కొని వెళ్ళినాడు . 

          యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరచు వేళకు కాత్యాయని కూడా కళ్ళు తెరచింది . అతనికి కనిపించినదంతా ఆమెకూ కనిపించినది . ఆమె ప్రసన్న వదనయై , తన హృదయములోని సంతోషము కన్నులలో నీరుగా వర్షిస్తున్నది . " నేను జన్మాంతరములలో ఈశ్వరుని బాగా అర్చించి యుండవలెను . లేకపోతే తమ వంటి మహానుభావుల చేయి పట్టుకొను భాగ్యమును పొందేదానిని కాదు . " అన్నది . మాటలో , " మీరు పర్వతము , నేను పరమాణువును " అన్న ధ్వనియుండినది . 

No comments:

Post a Comment