ఈ బ్లాగులో , సనాతన ధర్మము నకు సంబంధించిన వివిధ ఆచరణలు , ఇతర విశేషాలు , వివరణలు మాత్రమే ఉంటాయి.
SHARE
Sunday, March 3, 2013
52. " మహాదర్శనము " -- యాభై రెండవ భాగము--ఉపనిషత్తు యొక్క అర్థము
52. యాభై రెండవ భాగము-- ఉపనిషత్తు యొక్క అర్థము
యాజ్ఞవల్క్యునికి బ్రాహ్మణమును రాయుటకు ఆదిత్యుని అనుమతి అయినది . వెనుకటి వలెనే , అది అతని నిత్య కర్మలలో ఒకటయినది . ఎప్పటి వలెనే కాత్యాయని కూడా పతి సేవనూ , వేదపురుషుని సేవనూ చేస్తూ ఉన్నది . ఆ బ్రాహ్మణము నూరు అధ్యాయముల పరిమితి యున్నది అని అది శతపథ బ్రాహ్మణమైనది .
బ్రాహ్మణమును రాయుచున్నపుడు ఒక దినము గార్గి వచ్చినారు . ఆమె బుడిలుల శిష్యుడైన వాచక్నువు కూతురు . తండ్రికి ఒకతే సంతానమగుట చేత ఆమెను చాలా ప్రేమాభిమానములతో పెంచినారు . వాచక్నువు , కూతురు వివాహము చేసుకొని వెళ్ళిపోతే తన ఇంటిలో దీపము పెట్టువారు లేకపోయెదరని కూతురును కొడుకు వలెనే పెంచినారు . సకాలములో ఉపనయనము చేసి , ముఖ్యముగా బ్రహ్మవిద్యను కూడా బోధించినారు . గార్గి కూడా ఎందుకో అందరి వలెనే వివాహము చేసుకొని సంసారములో ఉండుట వద్దనుకున్నది . తండ్రి అనుమతితో బ్రహ్మవాదిని అయినది . ఆమె లక్షణవతి. అయిననూ జనులు ఆమె కఠోర తపస్సునే మెచ్చుకొన్నారు . సాంప్రదాయము , శాస్త్రముల పేరుతో ఆమెకు ఇబ్బందులు కలిగించలేదు . విద్వద్వర్గములో ఆమెకు గణ్యమైన స్థానముండినది . విదేహపు ఆశ్రమములలో నైతే నేమి , చుట్టుముట్ల ఆశ్రమములలో నైతేనేమి , ఆమెకు తగిన గౌరవము లభించెడిది . ఆమెయొక్క శాస్త్ర నిష్ట , ప్రవచనములు , విచక్షణ , అగాధమగు అనుభవమును చూచి ఆమెను అందరూ పూజిస్తారు .
గార్గి అంటే జరత్కారు వంశపు అరుణి కి ఎంతో మెచ్చికోలు. " నువ్వు సరస్వతీ దేవి యొక్క అపరావతారమమ్మా ! " అని పొగడేవాడు . ఆమె నమస్కారము చేయుటకు వస్తే లేచి నిలబడి ఆదరముగా ఆహ్వానించేవాడు. విదగ్ధ శాకల్యుడైతే , " ఏమి చేయుట ? ఈమె మగ ప్రాణి . దానిని ఆడ దేహములో పెట్టి అన్యాయము చేసినాడు ఈశ్వరుడు ! ఎన్ని చెప్పినా , ఆడదానికి కర్మాధికారమెక్కడిది ? కర్మము లేనిదే బ్రహ్మ విచారమెలాగ పూర్ణమగును ? " అన్ననూ ఆమె అంటే అపార గౌరవము చూపించేవాడు .
విదేహపు రాజాస్థానములో ఆమెకు ప్రథమ వర్గపు విద్వత్పదవి . ఆమెకు ’ అభినవ సరస్వతి ’ యను బిరుదు నివ్వవలెనని వెనుకటి మహారాజు ప్రతిపాదన చేసినారు . ఆమె అది విని నవ్వేసింది . " మేము అద్వైతులము . జ్ఞాన దృష్టితో ఆత్మ ఆత్మకూ భేదము లేదు అనెడివారము . మేము బిరుదును ఒప్పుకున్న దినమే మా అద్వైతమునకు తర్పణము వదలినట్లవుతుంది " అని గౌరవముగా తిరస్కరించినది . అప్పటినుండీ ఆమె పైన గౌరవము ఇంకా ఎక్కువయినది .
గార్గి యాజ్ఞవల్క్యుని చూచుటకు వచ్చినది . అప్పుడు దేవరాతుడు ఇంట్లో లేడు . ఆలంబిని ఆమెను ఆహ్వానించి కొడుకు వద్దకు పిలుచుకొని వెళ్ళింది . యాజ్ఞవల్క్యునికి కూడా గార్గి వచ్చిందని సంతోషమయినది . తన విలేఖన కర్మను ఒక ఘడియ పక్కన పెట్టి ఆమె వైపుకు తిరిగినాడు . " దయచేసి అర్ఘ్య పాద్యాదులను స్వీకరించవలెను " అని ప్రార్థించినాడు .
గార్గి నవ్వుతూ అంది , " మేము స్త్రీలము. మాకు మధుపర్కాధికారము లేదు "
" నిజమే . మధుపర్కాధికారము స్త్రీలకు లేదు . కానీ తమరు బ్రహ్మవాదినులు. తమ దేహములో అగ్ని ఉండనే ఉన్నాడు . కాబట్టి అగ్ని తృప్తికని మేము అర్పించు అర్ఘ్యపాద్యాదులను తమరు స్వీకరించకుండుట ఎక్కడి న్యాయము ? "
" తమరు నన్ను ధర్మ శృంఖలతో కట్టేసినారే . అగ్ని తృప్తికని తమరు అర్పించినది నిరాకరించుటకు మాకు అధికారము లేదు , నిజమే . కాబట్టి నేను స్వీకరించవలసినదే , కానివ్వండి . "
గార్గికి కాత్యాయని అర్ఘ్యపాద్య ఆచమనీయ అల్పాహారములను అందించినది . ఆమె అవన్నీ స్వీకరించి సమాహితురాలై కూర్చున్నది . " యాజ్ఞవల్క్యా , తమరు కొత్త వేదమును పొందిన సంగతి నాకు తెలుసు. ఈ మధ్య దానితో పాటు ఉపనిషత్తు కూడా ఉందని తెలిసింది . దానికోసమే వచ్చినాను . లౌకికముగా ఇంకొక కారణము ముడిపడు నట్లుండెను . కానీ దానిని నేను పట్టించు కోలేదు . "
" లౌకిక కారణమేమిటని అడుగవచ్చునా ? "
" దానికేమి ? రాజ భవనము వారు మిమ్ములను అక్కడికి పిలుచుకు వెళ్ళుటకు నన్ను దర్విగా ఉపయోగించు కోవాలనుకున్నారు . నేనన్నాను : " మహారాజులు లోకానికి మాత్రమే పెద్దవారు . లోకానికన్నా గొప్పది ఒకటుందని దానివైపుకు తిరిగినవారిని మహారాజువారే స్వయముగా వెళ్ళి చూచుట వలన , జనులకు బ్రహ్మవిద్యపై ఆదరము పెరుగును. వారు తమ దగ్గరికి వస్తే తిరుపెము కోసము వచ్చినట్లవుతుంది . కాబట్టి బ్రహ్మజ్ఞానులను తిరుపెపు వారి అంతస్తుకు తెచ్చుట నా వల్ల కాదు " అని నిక్కచ్చిగా చెప్పినాను . మహారాజు మామాటను ఒప్పుకున్నట్లే కనబడుతుంది . వారు వచ్చినా రావచ్చు. "
మాటలు అటు ఇటూ తిరిగి ఉపనిషత్తు వైపుకు వచ్చినాయి . " ఈశావాస్యమిదం సర్వ యత్కించ జగత్యాం జగత్ " అనునది మొదటి మంత్రపు మొదటి అర్థము . గార్గి దానిని బహు మెచ్చుకున్నది . ఆ మంత్ర భాగమును కొన్ని సార్లు తానే చెప్పుకున్నది . " అయితే యాజ్ఞవల్క్యా , తమరి ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమిదం సర్వ అనునదే నిష్ఠయా ? " ( ఆధారమా ?)
" కాదు , మొదటి రెండు మంత్రములూ చేరితే నిష్ఠ. "
" అలాగయితే తమరే ఒక అర్థము చెప్పండి "
" ఈ జగత్తులోనున్న సర్వులలోనూ ఈశ్వరుడున్నాడు . వాడు తప్ప ఎవరూ ఏమీ చేయలేరు . కాబట్టి ఏమి కావలసిననూ వాడినే అడగండి . అతడు కాని వేరొకడి నుండి దానిని పొందవలెను అనుకోవద్దు . "
" ఇక్కడ అంత అర్థమున్నదా ? "
" ఇది మంత్రము . ఇది ఉన్నది అలౌకిక భాషలో . కాబట్టి ఇలాగే అర్థము చెప్పవలెను . "
" సరే , రెండవ మంత్రము ? "
" అదికూడా అంతే , అలౌకిక భాష నుండీ లౌకిక భాషకు పరివర్తనము చేయునపుడు అర్థమును మాత్రమే గమనములో ఉంచుకోవలెను కదా ? కాబట్టి ఇలాగ అర్థము చెప్పెదను : ఈశ్వరుడు అన్నిటా ఉన్నాడనుకొని , శాస్త్ర విహితములైన కర్మములనే , అవి యజ్ఞమగునట్లు చేయుచూ ఆయుష్షు పూర్తియగు వరకూ జీవించవలెను . మధ్యలో , చచ్చిపోయిన చాలు కదా , నాకింకనూ చావు ఎప్పటికి వచ్చునో అని ఏడుస్తూ కూర్చోరాదు . ఎందుకంటే , ఈశ్వరుడు అన్నిటిలోనూ ఉన్నపుడు శోకమెందుకు ? మోహమెందుకు ? ఇలాగ కాక వేరే దారే లేదు . ఇలాగ కాక అంటే , చేసే కర్మలన్నీ యజ్ఞమగునట్లు చేస్తూ ఉంటే కర్మ లోపమగు సంభవమే లేదు . అదీకాక, కర్మము యజ్ఞమైన తరువాత , అది జగద్భాండారమునకు ఇచ్చిన కానుక అవుతుంది . మరి అది లోపమెలా అవుతుంది ? "
" అవును. కర్మ చేస్తూ ఉంటేనే జీవితము అనునదే మీ అర్థమైతే , కర్మాధికారము లేనివారి మాటేమిటి ? "
" దేవి గార్గి అంత కాతరము చెంద పనిలేదు . ఈ జగత్తులోనున్న సర్వములోనూ ఈశ్వరుడున్నాడన్న తరువాత , స్త్రీలలో లేడా ? కాబట్టి కర్మాధికారము లేనివారికి కూడా శృతి ఒక మార్గమును కల్పించినది . "
" అదేమిటో చెప్పండి , వింటాను . "
" కర్మాధికారము లేనివారు యజ్ఞములను గురించి చెప్పు మంత్రములను పారాయణ చేసిన చాలు . కర్మాధికారము లేనివారు ఇలాగ మంత్ర కర్మను చేసియే తీరవలెను . తప్పించుకొనుటకు లేదు . "
" అలాగయిన , స్త్రీలు అనిపించుకున్న మేము ఇప్పుడు అశ్వ మేధమును గురించిన పాఠము చదివినాము అనుకోండి , మాకు అశ్వమేధపు ఫలము వస్తుందా ? "
" తప్పక వస్తుంది . అదీకాక, అశ్వమేధము వంటి శ్రేష్ఠతమమైన కర్మము ఇంకోటి లేదు . మీకు నా మాటలో నమ్మకము లేనిచో , మీరు ఒకసారి అధ్యయనము చేసి చూడండి . "
" ఇది సరియైన సమాధానము . చేసి చూడండి అన్న తరువాత ఇక మాట్లాడుటకేమున్నది ? చేస్తాను . ఏ దినము ఆరంభించవలెను ? అని అడుగుట ఒకటే మిగిలింది . "
" ఇది సరిగ్గా అన్నారు . నేను చెప్పిన విధముగా చేయండి . నేను చెప్పిన ఫలము వస్తే ఒప్పుకోండి, సరేనా కాదా ? "
" సరే "
" ఇప్పుడొచ్చినది ఒక మహా యజ్ఞపు సంగతి కదా ? దాని ఫలమేమిటని అడిగెదరా ? అశ్వమేధాది యాగములను చేసినవారికి శరీరమూ అంతఃకరణమూ శుద్ధమగును . శుద్ధ శరీరాంతఃకరణములున్న వారికి కర్మ కాండలో చెప్పియున్న దేవతలందరూ దేహములో ఉన్నది తెలియును . "
" అలాగయిన చెప్పండి , ఎప్పుడు ఆరంభించేది ? "
" నేను మీకు గురువును కాను . మీ గురువు గారిని అడగండి . వారు చెప్పిన దినము ఆరంభించండి . "
ఈ మాట ముగుస్తుండగా ఆలంబిని గబ గబా వచ్చినది . ఆమె ముఖములో కనిపిస్తున్న గాబరా చూచి కొడుకు , " ఏమిటమ్మా , ఏమైనది ? " అని అడిగినాడు.
ఆలంబిని చెప్పింది : " వైశంపాయనులకు దేహస్థితి క్షీణించినదంట. రెండు మూడు దినములనుండీ వస్తున్న జ్వరము ఇప్పుడు ఇంకా ఎక్కువైనదంట. "
" ఈ వార్తను తెచ్చినదెవరు ? "
" మనిషి వచ్చినాడు . మీ తండ్రిగారేమో బండి కట్టించుకొని వెళ్ళిపోయినారు . నీకు చెప్పమన్నారు. ఏమి చేయవలెనో నీకు తెలుసంట. "
యాజ్ఞవల్క్యుడు వార్త విని కొంచము కలత చెందినాడు . ఎడమ కన్ను అదిరి , వైశంపాయనుల ఆశ్రమములో అంతా సుఖముగా లేదు అని సూచించినది . అక్కడికి వెళ్ళవలెనని నిర్ణయించుకొని లేచి నిలుచున్నాడు .
" గార్గి దేవి క్షమించవలెను. ఎంతైనా నాకది గురుస్థానము . ఈ చివరి కాలములో నేను అక్కడ లేకపోతే పాపభాగిని అవుతాను . ఈ బ్రాహ్మణపు పని కొంతకాలము వేచి యుండవలసినది . కానీ ఇవన్నీ మనచేతిలో లేవు . కాబట్టి ఈశ్వరుడు చేయించినట్లు అవనీ అని వాడి పైన భారము వేసి , మనము చేయు పనిని శ్రద్ధతో చేయుటయే మన పని ! అనుమతి అయితే వెళ్ళి వస్తాను , " అని చేతులు జోడించినాడు .
గార్గి కూడా లేస్తున్న యాజ్ఞవల్క్యుని తోపాటూ తానూ లేచింది ." వైశంపాయనులు మన విద్వద్వరేణ్యులలో ఒకరు. గురుస్థానము లేకున్ననూ ఈ అంత్య కాలములో వెళ్ళి వారి దర్శనము చేసుకొనుట తమవంటి విద్వాంసుల కర్తవ్యము . దానిపైన గురుస్థానము . ఇక ఆలోచించవలసినదేమీ లేదు. నేను మరొక దినము వచ్చి తమరిని చూచెదను. తమరి ఉపనిషత్తు , దానికన్నా తమరు చేయు భాష్యము బహు స్వారస్యముగా నున్నది . త్వరలోనే నేనుకూడా వస్తాను. వారి ఆశ్రమమునకు నేను కూడా రావలెను. కానీ ఇంటికి వెళ్ళి వచ్చి చూచెదను. " అని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళినది.
ఆలంబిని , " బండి కట్టించవలెనా ? " అన్నది .
" పరుగిడే బండి నడచే నాకన్నా త్వరగా వెళ్ళగలదు అన్నది నాకు తెలుసు. అయినా పెద్దవారికి అస్వస్థమన్న తరువాత తక్షణమే వెళ్ళవలెను. కాబట్టి నేను ముందు వెళతాను. వెనుకనుండీ బండిని అయినంత వేగముగా పంపించు. నువ్వూ కాత్యాయినీ ఇక్కడే ఇంటిలోనే ఉండి అగ్నిని చూచుకొని ఉండండి. నేనూ , తండ్రిగారూ ఈ దినము వచ్చుట ఆలస్యమైతే , రేపుకూడా స్నానపు వేళకు రాకపోతే , మీరు కాచుకోవద్దు. " అని ఉత్తరీయముతో పాటు ఇంకొక వస్త్రమును తీసుకొని వెళ్ళిపోయినాడు.
యాజ్ఞవల్క్యుడు ఆశ్రమమును చేరు వేళకు అక్కడ పెద్ద ఏడుపు వినిపించింది. ఎవరో, " తాళుకోండి , వారికి వినిపించకూడదు " అని ఆపుటకు ప్రయత్నిస్తున్నారు.
వైశంపాయనులకు జ్వరము విపరీతమై అపస్మారక స్థితి వస్తున్నది. వారు బతుకుతారను ఆశ పోయి నిరాశ నిండిపోయినది. అది తెలిసి కూడా కొంతసేపయినది. స్థితి దారుణముగా ఉన్నదని తెలియగానే అంతవరకూ వారి సేవ చేస్తూ ఉన్న కదంబిని లేచి పతికి పాదాభివందనము చేసి, వెళ్ళిపోయినది. ఇంకొక గడియలో పక్క గదిలో ఏదో పడినట్లాయెను. ఏమిటా శబ్దమని వెళ్ళి చూడగా కదంబిని దేవి జీవపక్షి ఎగిరిపోయి ఉండినది. పద్మాసనములో కూర్చొని ఉన్న వారి దేహము కిందికి వాలి పడిఉన్నది.
యాజ్ఞవల్క్యుడు వచ్చినది చూచి అందరూ వారికి దారి వదలినారు . అతడు వెళ్ళి గురువుల పక్కన కూర్చున్నాడు. వారికి అతి తాపము నిస్తున్న జ్వరము ఈతనిని చూచి బెదరి పారిపోయినదా అన్నట్టు అరక్షణములోనే విడిచింది. దాని గుర్తుగా శరీరమంతా స్నానము చేసినట్లు చెమటలు పట్టినాయి. ఇంకొక ఘడియ లోపలే వారు లేచి కూర్చొని శుద్ధాచమనము చేసినారు.
అక్కడ భార్య లేకపోవుటను చూచి ’ తానేదీ ? " అని అడిగినారు. చుట్టు ఉన్నవారు విధిలేక, జరిగినది చెప్పినారు. వైశంపాయనులు తల ఊపి, " సరిపోయినది. నా మార్గము నిర్విఘ్నమైనది " అని వృద్ధ శిష్యునొకడిని పిలచి , " ఆశ్రమము మీది. మీరు కావలసిన వాడిని ఎంచుకొని ఆతని యాజమాన్యములో ఉండండి" అని చెప్పి యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు.
" యాజ్ఞవల్క్యా, నువ్వు ఇప్పుడు వచ్చినది చాలా మంచిదైనది. నాకిక ఆజ్ఞనివ్వు. నువ్వు దైవానుగ్రహ సంపన్నుడవు. నన్ను ఉండమని బలవంతము చేయవద్దు. చావూ బ్రతుకూ మావంటి వారికి ఒకటే ! ఇదిగో పితరులు వచ్చి పిలుస్తున్నారు. పోయివస్తాను , శం సర్వేభ్యః " అన్నారు.
వారు కనులు మూసుకున్నారు. ఇంకొక ఘడియలోపలే దేహము చల్లబడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment