SHARE

Sunday, March 3, 2013

51. " మహాదర్శనము "--- యాభై ఒకటవ భాగము --సమారాధన


 51.  యాభై ఒకటవ భాగము  సమారాధన


          ఆచార్య దేవరాతుని ఇంటిలో ఈ దినము సమారాధన. బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుడు ఆదిత్య దేవుని అనుగ్రహము వలన లభించిన యజుర్వేద లేఖనమును  ముగించినాడు . దానికే ఈ సంభ్రమపు సమారాధన. ఇరవై నలుగురు దంపతులకు దంపతీ పూజ. వచ్చిన వారిలో రాజపురోహితుడు భార్గవుడు , ఇద్దరు కులపతులూ ముఖ్యులు. 

         భార్గవులు కులపతుల ప్రశ్నకు ఉత్తరముగా అన్నారు , " వెనుకటి మహారాజులు ’ కావలసినది జరగవలెను , కురు పాంచాలులను మించునట్టి విద్వాంసుడు మనలో పుట్టిమన దేశము కీర్తి సంపన్నము కావలెను ’  అనేవారు . ఇప్పుడున్నవారు విద్వత్సంభావనా విషయములో ఏమీ తక్కువ వారు కాదు . ’ అయినా వారింకా ప్రాతస్సూర్యులే . అయినప్పుడు చూద్దాములే , ’ అనునది ఒక స్వభావముగా మారినట్టున్నది . లేకపోతే ఇంతటి సందర్భములో రాజ భవనము నుండీ ఇంకా కానుకలూ లాంఛనాలూ రాకుండా ఉండటము ఏమిటి ? " 

          ఆచార్యుడు అక్కడే ఉన్నాడు . వారు అది విని అన్నారు : " దానికి కారణము లేకపోలేదు . ఒక దినము రాజభవనము నుండీ పిలుపు వచ్చినది . అనగా , నేను చెపుతున్నది ఇప్పటి మహారాజు గురించి . యాజ్ఞవల్క్యుడు అప్పుడేమనవలెను ? ’ నేను ఇప్పుడు చేపట్టిన కార్యము ముగియు వరకూ నేను ఎవ్వరినీ చూడబోను ’ అనేసినాడు .  ఇంకా వేడి రక్తమున్న ఆ మహారాజుకు అది విని చురుక్కుమనుట సహజమే కదా ? "

అది విని కులపతులిద్దరూ చాలా సంతోషించినారు . ఒకరు , " అతడికి ఇప్పుడు కావలసినది రాజానుగ్రహము కాదు , దేవతానుగ్రహము . రెంటిలో రెండవదే ముఖ్యము . అది లభిస్తే మొదటిది తానే దొరకును. " అని సంతోష పడితే , ఇంకొకరు , " ముఖ్యముగా , ఇంకా కాలము రాలేదు . దానివల్లనే దేవతలు అతడి నోటిలో ఆ మాట పలికించినారు . " అని సంతోష పడినారు . 

భోజనానికి ముందే దంపతీ పూజలు జరిగినవి . ఆదిత్యుని ద్వాదశ నామములు ఒక్కొక్క దానికీ ఇద్దరు దంపతులకు పూజలు జరిగినవి . చీర, రవిక , ధోవతులు , దక్షిణగా రెండ్రెండు ధేనువులు , పసుపు , కుంకుమ , పూలు , తట్టల నిండా పళ్ళు , అవి చూచి అందరూ , " ఇలాగ చేయుటకు కేవలము రాజాధిరాజులకు మాత్రమే సాధ్యము . ఏదేమైనా తీసుకొనుట మాత్రమే అలవాటైన బ్రాహ్మణులు ఇలాగ ఇచ్చుట ఆశ్చర్యమే !! " అని పొగిడినారు .  

భోజనానంతరము తాంబూలాదులను ఇచ్చి కాత్యాయనీ యాజ్ఞవల్క్యులు ఆశీర్వాదములను పొంది అందరినీ వీడ్కొలిపినారు . కులపతులూ , భార్గవులూ కొత్త వేదమును వినుటకు కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వినిపించుట మొదలుపెట్టినాడు . మొదట ప్రకృతి యానమైన దర్శేష్టి విన్నవారంతా చాలా ఆనందించినారు . " ఇప్పుడున్న యజుర్వేదములో ఇంతటి పరిష్కారము లేదు . బ్రాహ్మణపు సహాయము లేక దానిని సమన్వయము చేసుకొని పోవుట నిజముగా కష్టము . అయితే ఇది అలాగ కాదు , మంత్రముల వినియోగములు స్పష్టముగా వున్నాయి . ఇది  శుక్లమయితే , ఇప్పుడున్నదానిని కృష్ణ యజుర్వేదమనవలెను .  దేవరాతా , మీరు యజ్ఞవల్క్యులని ప్రసిద్ధులైతే , మీ కొడుకు వేద వల్క్యుడు . ప్రకృతి వికృతి యాగములను రెండు పాయలుగా విభజించినట్టు విభాగించి చూపునట్టి ఒక వేదమునే ఆదిత్యదేవుని దయ వలన పొంది తెచ్చినాడు " అని పొగడినారు . 

యాజ్ఞవల్క్యుడు లేచి వారికి సాష్టాంగ ప్రణామము చేసి చేతులు జోడించినాడు . " అంతా తమరి అనుగ్రహము ! " అన్నాడు . వైశంపాయనులు , " ఇలాగ నవోనవమైన వేదమును పొందుటకే పుట్టినవాడు , నాకు గనక శిష్యుడై ఉంటే అయ్యెడిదా ? దేవతలు ఒక ఆటను రచించి మమ్ములను వేరు చేసినారు . ఏమైనా సరే , మా యాజ్ఞవల్క్యుని ప్రాదుర్భావము మాకు హితమే కాదు , ప్రియము కూడా ! " అని యాజ్ఞవల్క్యుని వెన్ను తట్టినారు . 

ఉద్ధాలకులు ఏమీ మాట్లడకయే ముసి ముసి నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు . వైశంపాయనులు , " సమారోపణము ఎలాగయినది , చూద్దాము తియ్యవయ్యా " అన్నారు . యాజ్ఞవల్క్యుడు తీసి చదివినాడు . ’ ఈశావాస్యమిదం సర్వ...’  మొదలగు పద్దెనిమిది మంత్రములు . 

వైశంపాయనులు , " ఈ మంత్రములు ఏ కర్మలో వినియోగము ? " అన్నారు. వారికి సమాధానము చెప్పువారెవరు ? యాజ్ఞవల్క్యుడు  మిన్నకున్నాడు . 

ఇటు ఆడవాళ్ళ మధ్య గుసగుసలు మొదలైనాయి . మైత్రేయి అత్త చెవిలో ఏదో ఊదింది . ఆమె , " మా మైత్రేయి ఏమో అంటున్నది , వినండి .’  అని ఉద్ధాలకులకు చెప్పింది . వారు అందరి అనుమతితో , " అదేమిటమ్మా ? చెప్పు " అని మైత్రేయిని అడిగినారు . 

ఆమె రెండు మూడుసార్లు మొహమాట పడి , మళ్ళీ మళ్ళీ అడిగించుకొని , లేచి అందరికీ నమస్కారము చేసి, " ఈ నవీన వేదము లభించినది ఆదిత్యుని కృప వలన. ఆ మంత్రముల వినియోగము గురించి యాజ్ఞవల్క్యుని అడిగితే ఎలాగ ? ఆదిత్యుడినే అడగవలెను " అన్నది . 

సభ , ఆమె మాటను ఒప్పుకున్నది . యాజ్ఞవల్క్యుడు గురుజనుల అనుమతితో ఆచమనాదులను చేసి ఆదిత్యుని ప్రార్థించినాడు . ఆదిత్యుడు అతడి నోటిలో పలికించినాడు, " ఈ మంత్రములకు వినియోగము లేదు . ఇది ఉపనిషత్తు . తామెల్లరూ వేదమును బ్రహ్మము అంటున్నారు . ప్రత్యక్షముగా బ్రహ్మమును బోధించు ఉపనిషత్తు లేకుంటే వేదము బ్రహ్మమగుటెలా ? అందుకోసమే ఇది " 

ఆ వివరణ అందరికీ సమంజసమనిపించినది .  అందరూ ఒప్పుకున్నారు . కాత్యాయనికి మైత్రేయితో మైత్రి కుదిరింది . ఆమెకు , ఆ సభలో ఆ సందర్భములో తన భర్తకు కలగబోయే అవమానమును తప్పించినది అని మైత్రేయి అంటే ఏదో ఆత్మీయ భావము కలిగింది . దగ్గరికి వెళ్ళి కూర్చొని విశ్వాసముతో , " ఈ దినము నుండీ నువ్వు నాకు అక్కవి " అన్నది . మైత్రేయి కూడా ఆ విశ్వాసమును వద్దనలేదు . 

అంతా అయిన తరువాత వైశంపాయనులు , " మంచిది , ఆచార్యా , ఈ దినము గార్గి దేవిని ఎందుకు పిలవలేదు ? ఆమె ఉండి ఉంటే ఈ సభ బ్రహ్మసభకు సమానమయ్యెడిది . " అన్నారు . 

ఆచార్యుడు  , " దేవి గార్గి ఊరిలో లేరు . తమ గురువులైన కురు పాంచాల దేశపు విదగ్ధ శాకల్యులను చూచి వచ్చుటకు వెళ్ళియున్నారు " అన్నాడు . 

ఉద్ధాలకులన్నారు , " ఆతడు పేరు మోసిన విద్వాంసుడైతే కావచ్చు. కానీ దేవీ గార్గి వలె జ్ఞాన కాండలో అంత చెయ్యి తిరిగిన వారు కాదు అనిపిస్తుంది . అయినా విద్వద్వర్గములో గణ్యుడైన వాడు . ప్రథమ శ్రేణికి చేరినవాడు . " 

వైశంపాయనులు నవ్వుతూ అన్నారు : " అందువలననే మన వెనుకటి మహారాజు వారు , వారినందరినీ తోసిరాజన గల విద్వాంసుడు మనలో ఒకడు పుట్టవలెను  అనుచుండినది . మీ ఈ స్తుతి వచనమును గనక విని ఉంటే వారు ఎలాగయ్యెడివారో ? "

" దేనికీ ? కొంచము వేచియుండండి . యాజ్ఞవల్క్యుడు ఆ గార్గి , విదగ్ధ శాకల్యుడు మొదలగు వారికన్నా గొప్పవాడగు కాలము చాలా దూరము లేదు . మీ శిష్యుడు వారిని మించిపోవును . " 

" అలాగ అవుతుందంటే , ఇదిగో , ఇప్పుడే నేను నా తపస్సునంతా ధారపోయుటకు సిద్ధము . వైదేహులు విద్యార్థముగా కావలసినది ఇచ్చుటకు సిద్ధముగా నున్ననూ ఇంకా విద్యాలక్ష్మి విదేహమును తన గృహముగా చేసికొనలేదు . మీ ఆకాంక్ష వలన అలాగ అగుగాక. " 

" అవుతుంది , సందేహము లేదు " 

ఆచార్యుల ఇంటిలో జరిగినదంతా కూలంకషముగా రాజభవనమునకు నివేదిక వెళ్ళినది . మహారాజులు ,  యాజ్ఞవల్క్యులు రాజ భవనమునకు రానన్నది విని పదుగురు పలుమాట లాడతారేమో , పని చెడునో ఏమో అని శంకించి , రాజపురోహితుని వెంటనే పిలిపించుకున్నారు . అతని ద్వారా అక్కడ జరిగినది మళ్ళీ ఒకసారి విని , " మీ మాట ప్రకారము జరిగి ఉంటే బాగుండెడిది . ఇప్పుడు చేజారి పోయింది . ఏమి చేయుట ? ఇంతటి విద్వాంసులను గౌరవించక పోతే , మా వంశపు ఖ్యాతి మిగులుటెలాగ ? " అన్నారు . 

భార్గవుడు ఆలోచించి , " దేవీ గార్గి ఇక్కడికి వచ్చు వరకూ ఆగండి . ఆమెను ఉపయోగించి , యాజ్ఞవల్క్యుడను ఆ మదపుటేనుగును పట్టి తెచ్చు ప్రయత్నము చేద్దాము " అన్నాడు . 

No comments:

Post a Comment