60. అరవైయవ భాగము -- పూర్వ సిద్ధత
మాఘ శుద్ధ త్రయోదశి నాడు బయలుదేరుట అని నిర్ణయమైనది. ఇంకా పదునైదు దినములుంది. పుష్య బహుళ ద్వాదశి దినము ఆలంబిని కొడుకును చూచి వచ్చుటకు బయలుదేరింది. సంధ్య వేళకు బండి ఆశ్రమము చేరినది. సంధ్యాస్నానానికి వెళ్ళుటకు సిద్ధమైన భగవానులు తల్లివచ్చిందని ఆమెను తీసుకొని పోవుటకు వచ్చినారు. వెంట కాత్యాయని వచ్చినది. మైత్రేయికి తెలిసి , ఆమె కూడా అత్తను చూచుటకు పరుగెత్తి వచ్చింది.
ఆలంబినికి కొడుకునూ కోడళ్ళనూ చూసి సంతోషము ఉప్పొంగినది. కొడుకు తల్లిని చూసి అంతే సంతోషపడినాడు. ఇద్దరు కోడళ్ళూ అత్త వచ్చిందని తల్లిని చూచినదానికన్నా ఎక్కువ సంతోషపడి ఉబ్బిపోయినారు. కొంతసేపు కుశల ప్రశ్నలు అయినాయి.
భగవానులు , ’ అమ్మా , మిగిలిన మాటలు తరువాత మాట్లాడుదాము , ఇప్పుడు స్నానానికి వేళయింది ’ అని లేచినారు. కాత్యాయని కూడా లేచింది. భగవానులు , ’ ఇప్పుడు నువ్వు వద్దు. అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండు. మైత్రేయి స్నానానికి నీరు ఇస్తుందిలే , " అన్నారు. కాత్యాయని తల్లిదగ్గర గారాలుపోవు పిల్ల వలె గారాలుపోతూ అడిగింది : " అదంతా కాదు , చూడమ్మా , వీరు అక్కను చూడగానే అంతర్ముఖులై ఎక్కడంటే అక్కడ ధ్యానమునకు కూర్చుంటారు. ఈ పుణ్యాత్మురాలు కూడా వారిని చూడగానే కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు వీరిద్దరూ బచ్చలింట్లో కళ్ళు మూసుకుని కూర్చుంటే , తర్వాత నేనెక్కడికి వెళ్ళవలెను ? కాబట్టి స్నానము , భోజనము మొదలైన బాహ్య కర్మలన్నిటిలో నేను వెంట ఉండవలెను. ఔనా కాదా , మీరే చెప్పండమ్మా ! "
భగవానులు నవ్వుతూ అన్నారు: " చూచితివా అమ్మా ! ఈమె ఎంత మాటకారి అయినదో ! ఈమె అన్నది కాబట్టి చెపుతున్నాను. నీకు తెలుసు, మొదటినుండీ నేను అంతర్ముఖుడను. పెళ్ళినాడు ఉద్ధాలకులు " నువ్వు ఆమెతో ఉన్నపుడు బహిర్ముఖుడవై ఉండవలెను " అని అనుజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మైత్రేయితో ఉన్నపుడు నాకు సహజమైన అంతర్ముఖత్వము , ఈమె తో ఉన్నపుడు ఉద్ధాలకుల అనుజ్ఞ ప్రకారము అభ్యాసమైన బహిర్ముఖత్వము. నాదేమైనా తప్పుందా ? "
ఆలంబినికి ఆ మొగుడూ పెళ్ళాల మాటలు బహు ముచ్చట అనిపించినది. ఇద్దరినీ దగ్గరికి తీసుకొని ఒక్కొక తొడపై ఇద్దరినీ కూర్చోబెట్టుకోవలెను అనిపించినది. కానీ , ఏమి చేయుట ? ఇద్దరూ పెద్దవారు. తన మనోభావమునూ , తనకైన మనోల్లాసమునూ కన్నులతోనే వ్యక్త పరస్తూ , " కాత్యాయని చెప్పినట్లే కానీ. నేను మైత్రేయితో మాట్లాడుతూ ఉంటాను , మీరు స్నానము చేసి రండి. " అన్నది.
కాత్యాయని , " అక్కా , నేను అగ్నిహోత్రమయ్యే వరకూ రాను. కాబట్టి మా స్నానము తరువాత నువ్వూ స్నానము చేసి , అమ్మకూ స్నానము చేయించి మడి బట్టలివ్వు. ఆమె సంధ్యా కర్మలకు నీరు మొదలైనవి ఇచ్చి , ఆమె అనుష్ఠానమునకు కూర్చున్న తరువాత నువ్వు నీ అనుష్ఠానమునకు కూర్చో. అమ్మా ! మీ అనుష్ఠానము ముగిసేలోగా నేను వచ్చేస్తాను" అని వెళ్ళిపోయింది. వడివడిగా వెళుతున్న ఆ భామినిని ఆలంబిని కళ్ళప్పగించి చూస్తూ , ’ ఇటువంటి ఈమె ఆశ్రమపు రాణియగుటలో అతిశయమేముంది ? ’ అనుకున్నది.
ఎంతైనా మైత్రేయి కూడా ఆడది కదా ? అత్త చూస్తున్న రీతిని చూడగనే ఆమె కాత్యాయని విషయములో ఏమేమి ఆలోచించినదో గ్రహించినది, " ఆమె అలాగే అత్తా ! జనుల స్వభావములను ఎంత సూక్ష్మముగా గ్రహిస్తుందనుకున్నారు ? అది చాలదన్నట్టు తాను ఆజ్ఞ ఇస్తున్నపుడు అదేమో విశ్వాసమూ , వినయమూ చూపించి , ఆజ్ఞలోని నిష్ఠురత్వాన్ని పోగొడుతుంది. అలాగ ఉన్నందువల్లనే ఆశ్రమములోని జనాలు , గోవులు కూడా ఆమె మాటను మీరలేరు. నాకైతే ఆమె మాటంటే గౌరవము ! అత్తా , నిజంగా చెపుతున్నాను, ఈమె నన్ను సొంత అక్కలాగా చూసుకుంటుంది. ఎక్కడ , ఏమి చేస్తే , ఏమి పలికితే అక్కడ నొచ్చుకుంటానో అని ఒళ్ళంతా కళ్ళతో చూస్తూ ఉంటుంది. వరసకు నేను చెల్లెలు కదా ? అయినా నన్ను పెద్దదాని వలె చూస్తుంది. ఆమె గుణము ఎంత పొగడినా చాలదు. " అన్నది.
ఆలంబినికి ఆ స్తుతి మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. " అలాగైతే , నీ పని యేమిటి ? వంటా వార్పూ అంతా ఆమెదేనా ? "
" నా పని ఏమిటి ? పొద్దున్నే లేచి స్నానము చేసి అనుష్ఠానమునకు కూర్చోవడము. మరలా భోజనము వేళకు వచ్చి ఆమెతో పాటు భోజనము చేయడము. ఎప్పుడైనా ఆమె బయట చేరితే ఆమె పనులన్నీ నేను చేయడము. ముఖ్యముగా వారికి కావలసినది స్నానము, వేళకు సరిగా భోజనము. వారు మాత్రం ఇంకేమి ఉపచారములు అడుగుతారు ? "
" సరే , నీ భర్త నీతో సరిగ్గా ఉంటున్నారు కదా ? "
" వారు దేవతా పురుషులు. ప్రియ శిష్యుడితో ఉండుటకన్నా ఎక్కువగా విశ్వాసముతో ఉంటారు. అయినా , నా మనసు, వారికన్నా కాత్యాయనికే నా మీద ప్రేమ ఎక్కువ అంటుంది. "
" నాకు ఈ మాట విని చాలా సంతోషమైనది. మీ సవతులు ఇలాగ అక్కచెళ్ళెళ్ళ వలె ఉండుట మా భాగ్యము. ఈ జన్మంతా ఇలాగే ఉండండి అని నా ఆశీర్వాదము. మంచిది , మైత్రేయీ , కాత్యాయని ఊరగాయలు ఏమేమి పెట్టింది ? ఇంకా వడియాలు , వడలు , ఉప్పుమిరపకాయలు చేయలేదా ? ముఖ్యంగా మిడి మామిడికాయ పెట్టిందా లేదా ? "
మైత్రేయి నవ్వి అంది , " నేనింకా , కాత్యాయని భగవతియై ఆశ్రమములో ఎలాగ నడచుకొంటున్నది అని అడుగుతారనుకున్నాను. మీరు గృహిణి కార్య భారమును గురించి అడిగినారు. మిడి మామిడికాయ అయినది. పనిభారము ఎక్కువైతే నన్ను పిలుస్తుంది. అలాకాక ఎప్పటి వలె అయితే , ఆమె చేసే పనిలో చేయి వేసేందుకు వెళితే , " ఈ చాకిరీ అంతా నాకు వదిలేయి. నువ్వు పుట్టింది కళ్ళు మూసుకుని కూర్చొనుటకు. నువ్వు వెళ్ళు. నువ్వు నీ పని చేయి , మీ సేవ నన్ను చేయనీ " అంటుంది. నేను ఏ జన్మలో ఈశ్వరాధనను ఎంతబాగా చేసినానో ? దాని ఫలముగా మీ ఇంట చేరినాను. "
ఆ వేళకు కాత్యాయని స్నానము చేసి వచ్చి , ’ అక్కా, లే , ఇక నువ్వు స్నానము చేసి అమ్మకు స్నానానికి నీరు ఇవ్వవలెను ’ అన్నది. మైత్రేయి స్నానానికి వెళ్ళినది. కాత్యాయని ఘడియ కొకసారి వచ్చి ఆలంబినిని మాట్లాడిస్తుంది. " ఎంత పని చేసినారమ్మా , మీరు వచ్చేది ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండెడిది ? పైగా అక్కడినుండీ మాంచి ఎండలో బయలుదేరి వచ్చినారు. దారిలో ఎంత ఆయాసమైనదో, ఏమో ? " అని అనేక రకాలుగా ఉపచారము చేసినది.
రాత్రి మొదటి జాములో తల్లీ కొడుకులు ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. కాత్యాయని మంత్రదండము ఉన్నదాని వలె , పులుసు , కూర , పచ్చడి చేసింది. వాటితో పాటు వడియాలు , వడలు , సజ్జన హృదయము వలె సుఖమైన నెయ్యి , రాతి వలె గట్టిగా తోడుకున్న పెరుగులతో భోజనము తృప్తికరముగా ఉండినది.
మైత్రేయి , కాత్యాయినులు భోజనము చేసి వచ్చే వేళకు తల్లి తాంబూలము వేసుకుంటూ తాను వచ్చిన పని కొడుకుకు చెప్పింది. కొడుకు ఎవరెవరు వస్తారు అని విచారించినాడు. ఆమె , వచ్చువారందరినీ చెప్పింది. కొడుకు అడిగినాడు, " దేవి గార్గి మనతో పాటు వచ్చేదేమిటి ? ఆమె విద్యా ప్రస్థానమే వేరు కదా ? "
తల్లి , రాజ భవనము సమాచారము చెప్పి, జ్ఞాన సత్రపు సంగతి ఎత్తి , ఆమె వచ్చుటకు కారణమిదీ యని వివరంగా చెప్పింది.
కొడుకన్నాడు , : " మీరు అంత దూరము వెళ్ళనవసరము లేదు. జ్ఞాన సత్రము కావాలన్నా , వైశాఖ బహుళము వరకూ అగునట్లు లేదు. దేశ , విదేశములనుండీ విద్వాంసులనందరినీ పిలిపించవలెనంటే దానికి పూర్వ సిద్ధత ఎంత కావలెను ? ఏమి కథ ? ఒక వేళ మనము వచ్చులోపల అది జరిగిపోయిందనుకో , నష్టమేమిటి ? అదంతా అటుండనీ , నువ్వు బయలుదేరు అంటున్నావు. మాత్రాజ్ఞా పాలించుట మాత్రమే నాపని. వీరిని అడుగు , వీరేమంటారో ? "
కాత్యాయని " మేము కూడా తోక వెంబడి నారాయణా అంటాము , ఏమే అక్కా ? " అన్నది.
" మైత్రేయి, " అంతే కాక ? " అన్నది .
No comments:
Post a Comment