56. యాభై ఆరవ భాగము-- చెరువు ఆసరాతో భావి
ఆశ్రమపు ఒక మూల విశాలముగా పెరిగిన మర్రి చెట్టొకటి ఉంది. దాని మొదట్లో ఒక మూర ఎత్తుతో రాళ్ళగోడలపై ఫలకములతో కట్టిన అరుగు వంటి కట్ట ఒకటి. లోకవ్యాపారముల వలన ఆయాసమైతే భగవానులు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సామాన్యముగా అటువైపుకు ఎవరూ వెళ్లరు. ఇక భగవానులు అక్కడుంటే మాత్రము ఒక్కరు కూడా ఆ వైపే చూడరు.
ఇప్పుడు భగవానులు అక్కడ కాత్యాయనితో పాటూ కూర్చున్నారు. ఒక ఘడియ విశ్రామము తరువాత భగవానులే భగవతిని అడిగినారు. " కాత్యాయినీ , నీకేమి ఆశ ఉంది ? "
ఆమె అన్నది , " మీ సేవ చేయుట ఒకటి తప్ప వేరే ఆశేమీ లేదు. "
" మైత్రేయి అయితే బ్రహ్మ వాదిని. ఆమె నోటిలో ఇటువంటి మాట శోభిస్తుంది. కానీ నువ్వలాగ కాదు. నీకు ఏదో ఆశ ఉండే ఉంటుంది. పోనీ , స్త్రీ సహజమైన పుత్రాపేక్ష కూడా లేదా ? "
కాత్యాయని పకపకా నవ్వింది. ఆపుకోలేక ఆపుకుంటూ అన్నది. గొంతులో తారుణ్యపు సరళత్వము లేదు. ప్రౌఢత్వపు గాంభీర్యము నిండి ఉంది," నిజంగా చెప్పవలెనంటే నాకు పిల్లలు కలుగుతారేమోనని గాబరా. పిల్లలయితే నేను వారిని చూచుకొనేదా ? మీ సేవ చేసేదా ? పిల్లలవుతే నాకు రెంటికీ చెడిన రేవతి గతి తప్పదు. కాబట్టి నాకు పిల్లలు వద్దు. కొడుకూ వద్దు , కూతురూ వద్దు. మీ చేయి పట్టి మీ ఇంటికి రాగానే నాకేదో తృప్తి వచ్చేసింది. తమరు గురుకులపు అధిపతి అయిన దగ్గర నుండీ నా తృప్తికి హద్దే లేదు. కాబట్టి నాకు ఏమీ వద్దు. అలాగని చిన్న చిన్న ఆశలు లేకపోలేదు, బెండకాయ పులుసు , బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు , వడియాలు , అప్పడాలు...ఇటువంటి ఆశలింకా ఉన్నాయి. అయితేనేమి ? అవి తీరితే ఎంత సంతోషమో , తీరకున్నా అంతే సంతోషము. "
" ఇదేమిటి , నేను మాట్లాడుతున్నది మైత్రేయితోనా , కాత్యాయని తోనా ? "
" బాగుంది మీ హాస్యము. లోకాంతరములలో ఉన్న వాటినన్నిటినీ సంయమము చేసి తెలుసుకొనే వారికి ఎదురుగా గూటము వలె కూర్చున్నది సరిగ్గా కనబడక పోతే నేనేమి చెప్పవలెను ? "
" దేహమేమో కాత్యాయనిదే, సందేహము లేదు. కానీ , ఆశ్రమపు అధిరాజ్ఞియై లౌకిక వ్యాపార మగ్నురాలై యున్న కాత్యాయనికి ఆశలు లేవు, ఆమె వైరాగ్య సంపన్నురాలు అంటే నమ్మేదెలాగ ? ధర్మపత్ని సాధ్య విషయములను గురించి చెప్పితే సరి. భవిష్యత్తును అలాగ రూపించుకోవలెను , ఇలాగ రూపించుకోవలెను అంటే మాకు అర్థమవుతుంది . అది వదలి , మోక్షపత్ని వలె , నాకేమీ వద్దు , పిల్లలూ వద్దు అంటే ఎలా నమ్మమంటావు ? కాబట్టి అలాగ అడిగినాను. నీకు నెమరు వేసే ఆవును పాలు పిండుటకు లేపునట్లు ఒక దెబ్బ కొట్టినాను. "
" నేనన్న మాట వలన మీకింత నొప్పి కలిగితే , ఇదిగో , కాళ్ళు తాకుతున్నాను. మాటల జోరులో సంయమము పేరు తెచ్చినాను. ఆ మాత్రానికే మీకు నొప్పి కలిగినదా ? అదెలాగ ? మేము నీటిలోకి రాయి విసరితే ఆ నీరు రాతిని మింగునట్లు , మిమ్మల్ని మేము కావాలని నొప్పించినా , ఆ నొప్పి మీకు తగులుటే ఆలస్యము, ఆనందముగా మారిపోతుంది. కాబట్టి దాని గురించి మేము కూడా అంతగా నొప్పి పడే అవసరము లేదు . "
" అదికాదు కాత్యాయినీ , భూమికి దేనిని విసరినా అది దానిని తనలో కలుపుకొని తనవలె ఆత్మసాత్ చేసుకుంటుంది. అలాగే , నాకు వచ్చినదంతా నేను కూడా నాలో కలుపుకుని ఆత్మసాత్ చేసుకుంటే ఆశ్చర్యమేముంది ? ఆత్మ అంటే ఆనందము కదా ? కాబట్టి ప్రతియొక అనుభవమూ ఆనందమే కావలెను కదా ? "
" దేవా , ఇవన్నీ మైత్రేయికి ప్రత్యేకము. నేను సేవకోసమే పుట్టినదానిని. ఆమె విచారములకు చర్చలకూ జన్మనెత్తినది. ఆమె మీవలెనే తానుకూడా చెరువు కావలెను అనునది. నాకు ఆ ఆలోచనే లేదు. నేను చెరువు ఆసరాతో ఉన్న భావిని. కాబట్టి అన్నాను. నాకు ఎప్పుడూ దేనికీ దారిద్ర్యము లేదు. ఎల్లపుడూ నా హృదయములో అంతా నిండి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ నిండుదనము ఎక్కడిది అంటారా ? అది తమరిది. తమరి హృదయములో అదికావలెను , ఇది కావలెను , అది లేదు , ఇది లేదు అను ఆశ ఉండి ఉంటే నా హృదయములోనూ ఉండి ఉండేది. మాటిమాటికీ మీరు ’ కిమ్ తేన మర్మ..’ దానివలన ’ మాకేమికావలెను ’ అనుచున్నారు. కాబట్టి నాకూ అదే భావము వచ్చినది. అంతే ! "
" భలే , కాత్యాయినీ , ఈ దినమేమో మా కాత్యాయని సరస్వతి యైనది. మాట బహుబాగుంది. నేను చెరువు , నువ్వు భావి, ఈ ఉపమానమును ఇలాగే ముందుకు కొనసాగిస్తే నా గతి యేమి ? ఏక్కడినుండో ఏమేమో కొట్టుకొని వచ్చు మురికి నీరు నేను , తేటనైన , శుద్ధమైన నీరు నువ్వు. భలే బాగా తిడుతున్నావే "
కాత్యాయని పడీ పడీ నవ్వింది. " మీరు చెప్పింది నిజము. లాగితే ఆ అర్థము కూడా వస్తుంది. కానీ నాకా అభిప్రాయము లేదు. సరే , అదలా ఉంచుదాము , ఒక వరము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కావాలంటే ఆ ఆశ ఉంది "
" ఏమిటి , చెప్పు "
" నెలకు మూడు నాలుగు దినములు నాకు మీ సేవ తప్పుచున్నది . దానిని నివారించగలిగితే చెప్పండి , నిరంతరాయంగా మీ పాద సేవ చేసుకుంటూ పడి ఉంటాను. "
" అదేమంత పెద్ద విషయము కాదు. అయితే కాత్యాయనీ , ఆడదాని దేహము అలాగ అగుట దాని ధర్మము. కాబట్టి దానికి అడ్డు రాకూడదు. సరే , ఇప్పుడు గుర్తొచ్చింది , నువ్వు గోవులు కావలెను అన్నావు కదా ? "
" సరిపోయింది , అది ఆకాశానికి నిచ్చెన వేయుట వంటిది. ఒకానొక కాలములో మనవి అని చెప్పుకొనుటకు ఒక వేయి ఆవులు ఉండవలెను అను పిచ్చి ఉండినది. ఇప్పుడది అవివేకము అనిపిస్తుంది. వేయి గోవులంటే , వాటిని కట్టివేయుటకు ఎంతపెద్ద కొట్టము కావలెను ? వాటికి నీరు, పచ్చి గడ్డి వేయుట అటుంచి , ఆ కొట్టము కడుగుటకు నీరు ఎవరు మోసుకొని వస్తారు ? అని తలనిండా ఆలోచనలు వచ్చి , అన్ని ఉంటే పాలు పిండువారు ఎవరు ? అనిపించి , అది ఒక అవివేకము అను ఘట్టమునకు వచ్చినాను. "
" ఒక వేళ నీకా యోగముంటే ? "
" అప్పుడు దానిని అనుభవించక తప్పదు. ఇప్పుడే మన ఆశ్రమములోని ఇళ్ళలో ఉన్నవన్నీ కలిపితే సుమారు ఐదునూర్లు గోవులు లేవా ? వాటిని పంచినందువల్ల మనకు అంత ఇబ్బంది లేదు. అన్నీ ఒకచోటే ఉంటే ? అబ్బ! అదెక్కడాలేని కష్టము. మీ నోటిలో వచ్చిందంటే , ఏ పనిఅయినా జరగక పోదు. కాబట్టి వేయి ఆవులు వచ్చు యోగముంది అనిపిస్తున్నది. రానివ్వండి , అది సుఖయోగమగుటకు ఏమి చేయవలెను అని ఇప్పటినుండే ఆలోచిస్తాను. "
" అప్పుడే అన్నావు కదా , ఆశ్రమ వాసులందరికీ పంచివేయుట అని ? అలాగే చేస్తే సరిపోతుంది. "
" కష్టము తప్పించుకొనుటకు అది మంచి ఉపాయము. ఇప్పుడు నేను పిల్లలకు అదే ఉపాయము చేసినాను. తెల్లటి పాపడిని ఎత్తుకోవాలనిపిస్తే , తెల్లటి పాపడున్న ఇంటికి వెళతాను. వాడిని ఎత్తుకొని ఆటాడుకొని ఇంటికి వస్తాను. ఇలాగే ఎర్రటి పాప , నల్లటి పాప , అందమైన పాప, కురూపి పాపాయి , అంతేనా ? ఈ ఆశ్రమములోనున్న పిల్లలందరినీ నావాళ్ళుగా చేసుకొని సుఖముగా ఉన్నాను. అయితే ఆవుల విషయము అలాగ కాదు. మనవి అంటే మనవే కావలెను. వాటి స్వామిత్వపు విషయములో , వినియోగపు విషయములో ఇంకొకరు చేయి వేయునట్లు ఉండకూడదు. సరే , రానివ్వండి , చూద్దాము. "
" వచ్చిన తరువాత ఆలోచించుట వద్దు. వచ్చేలోపే ఆలోచించుకొని ఉండు. "
" అది న్యాయమే. మీరు వస్తాయంటే వచ్చేతీరుతాయి. కానీ మీరు వస్తాయి అనలేదు కదా ! ’ రావాలి ’ అని నేను కూడా బలవంతము చేయుట లేదు కదా "
" అలాగ కాదు , పుణ్యాత్మురాలా , ఇక్కడ చూడు , నువ్వు కోరినది నెరవేర్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. నువ్వు పిల్లలు వద్దన్నావు. పోనీ ధనము కావాలా అంటే అది కూడా వద్దన్నావు. కాబట్టి నీ వెనుకటి కాంక్షయైన వేయి గోవులను కట్టివేసుకొను విషయము వచ్చింది. దేవతలు ఇస్తారంట , కావాలి అను. "
" తమరి అనుజ్ఞకు ఎప్పుడూ ప్రతి లేదు. కావాలి అంటాను. అయితే వచ్చునపుడు ఒక నిబంధనతో రావలెను. "
" ఈ నిబంధన ఏమిటి , చెప్పు . "
" ఏమీ లేదు , వేయి ఆవులు వస్తే మనకు సంతోషము అగునట్లే , అవి కూడా తమకు తాముగా ఇష్టముగా , మనము అడిగినందుకు కాదు , - తమకు తామే ఇష్టముగా రావలెను. అంతే కాదు, అవి వచ్చినందుకు మనకు కొంచము కూడా శ్రమ కలుగకూడదు. ఇక్కడ సంతోషమంటే , మీ సంతోషము , మీరనుకునే సంతోషము కాదు , నేను , ఈ కాత్యాయని చెప్పు సంతోషము. ఆ వేయి ఆవులు వచ్చినాయి అని మనకళ్ళలో ఒకచుక్క కూడా నీరు రాకూడదు. మన శరీరాలకు ఆవగింజంత కూడా ఆయాసము కలుగరాదు. "
" భలే ! మంచి నిబంధనలాగానే ఉంది. దేవతలు నీ నిబంధనకు ఒప్పుకొని వేయి గోవులనిస్తే అప్పుడేమి చేస్తావు ? "
" ఔను, చూడండి , మీరు ఈ మాట అడిగినందుకు గుర్తొచ్చింది , ఆ పశువులు మన దగ్గర ఉండు వరకూ అవిగానీ , వాటి దూడలు గానీ రోగములూ , వ్యాధులతో బాధ పడరాదు. వాటికి ఎప్పుడూ గడ్డీ , నీరూ సమృద్ధిగా ఉండవలెను. అంటే ఏమిటి ? ఒకమాటలో , వాటి వల్ల మనకు గానీ , మనవల్ల వాటికి గానీ ఏ రీతిలోనూ ఆవగింజంత కూడా ఇబ్బంది కలుగరాదు. "
" మీ నిబంధనలన్నీ అయినాయా , ఇంకా ఉన్నాయా ? "
" అంతే! అప్పుడే అన్నాను కదా , మననుండీ వాటికీ , వాటి నుండీ మనకూ పరస్పర సంతోషము కలగవలెనే కానీ ఏ రీతిలో కూడా పరస్పర కష్టము కలుగరాదు. "
" ఇంకా ఆలోచించి చూడు "
" ఏమిటి ? మీరే వరము నిచ్చునట్లు అడుగుతున్నారే ? "
" ఔను. దేవతల పరముగా నేను తథాస్తు అంటాను. "
" అలాగయితే అనెయ్యండి "
కాత్యాయని లేచి సాష్టాంగ నమస్కారము చేసి లేచి నిలబడి చేతులు జోడించినది.
భగవానులు కూడా లేచి నిలచి గంభీరముగా ’ తథాస్తు ’ అన్నారు.
No comments:
Post a Comment