SHARE

Wednesday, March 13, 2013

62. " మహాదర్శనము " --అరవై రెండవ భాగము-- విచారము


62. అరవై రెండవ భాగము--  విచారము


         ఇక్కడ రాజభవనములో మహారాజు నిక్షేపము దొరికినప్పటి నుండి విచిత్రముగా మారిపోయినాడు. అతనికి ఒకటే ఆలోచన. " అట్లయితే , ఈ ప్రపంచములో మేము , మేము అని రొమ్ము చరుచుకుంటూ తిరిగేది తప్పా ? అన్నీ మొదటే నిర్ణయింపబడి ఉంటాయా ? మనమంతా నిమిత్త మాత్రులమా ? "

నాణెపు పైనున్న శ్లోకము గుర్తొచ్చింది

|| దేవరాజానుగ్రహేణ జ్ఞాన సత్రాయ సంభృతం |
మనునా మానవేంద్రేణ జనకాయ నివేదితం ||

         ఈ మనువు ఎవరు ? ఆతడు జ్ఞాన సత్రము జరగవలెను అన్న సంకల్పముతో ఈ నిధిని నాకోసము సేకరించి పెట్టినాడా ?  ఈ బ్రహ్మ జ్ఞాన సదస్సునకు ’ జ్ఞాన సత్రము ’ అను పేరు మేము పెట్టెదమని అతడికెలా తెలిసింది ? అతని కాలము ఏది ? ఇప్పటి కాలము ఏది ? నేను జనకుడనువాడిని వస్తానని అతడికి ఎలాగ తెలిసింది ? అన్నిటికన్నా మిన్నగా , ’ దేవరాజానుగ్రహేణ ’ అనగా , దేవతలు మామీద అనుగ్రహము చూపుటకు కాచుకొని కూర్చుని ఉంటారా ? వారికి అదే పనియా ? అలాగయితే వారిని వదలి మనమే చెడిపోయినామా ? "

         " అలాగనుటకూ లేదు. కొన్ని అప్రాచ్య దేశములలో మన దేవతలను పూజించరు. వారికేమి తక్కువ అయినది ? వారేమిటీ ? మనలోనే దేవతలంటే మనో భ్రాంతి అని తెగడేవారు ఉన్నారు కదా, వారు ఎప్పటికీ ఆస్తికుల కన్నా బాగున్నారు కదా ? ఇలాగున్నపుడు మనమెందుకు ఈ దేవుళ్ళ విషయములో ఇంత చింతను అంటించు కొనవలెను ? 

         " లేక , ఇదొక జాడ్యమా ? ఒక సంప్రదాయములో పుట్టి పెరిగి దానిని వదలలేక పెనుగులాడే మనో దౌర్బల్యమా ? అలాగనుటకు కూడా సమంజసమా ? "

         " ఈ దేవుళ్ళను నమ్మిన భక్తులు , ఇతరులకు సాధ్యము కాని అనేక కర్మలను లీలాజాలముగా చేస్తారు కదా ? అందరి సంగతీ అటుంచి , ఇప్పుడు మా విషయమునే తీసుకుందాము. జ్ఞాన సత్రమును చేయవలెనని నాకెందుకు అనిపించవలెను ? మధ్యలో ధనము లేదే యని చింత ఎందుకు రావలెను ? చివరికి ఆ చింత కలలో తీరిపోవుట ఏమిటి ? ఆ దేవగురువు ఈ నిధి విషయము చెప్పుట ఏమిటి ? దాని ప్రకారమే ఈ నిధి దొరకడమేమిటి ? దానిలో మనువు నా జ్ఞాన సత్రమునకై సేకరించినది అన్నాడంటే , ఏమిటీ విచిత్రం ? 

ఈ ప్రపంచ సమస్య ఇంత జటిలమా ? ఈ జగత్తు యొక్క నానాత్వము మనసుకు అర్థమే కాదా ? " 

        " లేక , ఈ నానాత్వము వల్లనే ఈ జటిలత్వమా ? మొక్క పెరిగిన కొద్దీ విశాలము అవుతుంది అన్నట్లు ఆలోచించినకొద్దీ గంభీరమగుటే దీని స్వభావమా ? మరి దీనిని తెలుసుకొనుటెట్లు ? " 

        " వీటిని పట్టించుకోని వారు , అంతర్ముఖులై ధ్యానములో మునుగువారు , ఈ జగము యొక్క నానాత్వమును ’ అదేమీ లేదు ’ అన్నట్లు సుఖముగా ఉన్నారు కదా ? అలాగయితే మేము కూడా దీనిని మరచిపోయి బ్రతుకవచ్చునా ? కన్నులు మూసుకొనిన ఏమీ లేదు , నిజము. దినమూ మేము నిద్రించునపుడు ఈ ప్రపంచమన్నదే గుర్తుకు రాదు. అలాగయితే , దీనిని మరచి పోవుటే , దీనిని కెదకకుండా ఉండుటే సౌఖ్యమా ? "

        " రాజునై నేను ఈ జగమును ఎలా గమనించకుండా ఉండగలను ? అందరూ సుఖముగా ఉంటే నేను వారిని మరచిపోవచ్చు ; వారు కుడా నన్ను మరచిపోవచ్చు. అయితే ఏదైనా విపత్తు వచ్చి మనసే విక్షోభమైనపుడు మరిచేదెలాగ ? " 

" మరి నిర్లిప్తమగుట ఎలాగ ? మరచిపోయి ఉండుట నిర్లిప్తమా ? గుర్తుండుట నిర్లిప్తమా ? "

      ఇలాగ ఆలోచన అనే గుర్రాన్ని ఎక్కి , వెళ్ళిన చోట గుర్రాన్ని వదలి తిరుగుతుండగా , తటాలున దేవగురువు మాట గుర్తొచ్చింది . " ఇక ముందు నీ వెనుక మేమున్నామన్న నమ్మకము నుంచుకొని ధైర్యముగా వర్తించు. అన్నీ గెలవవచ్చు. " 

        చింతలో మునిగి ఉన్న మనసు మరలా సుడికి చిక్కిన అలలవలె తిరుగుట మొదలిడింది. " అలాగయిన , జయమను ఫలమును పొందుటకు మేము నమ్మకము అను కానుకను అర్పించవలెనా ? దేవతలను మా వెనకే ఉన్నారని భావించి సాగవలెను. లేకపోతే జయము లేదు. అంటే , గెలిచిన వారందరూ దేవతల అనుగ్రహముతోనే గెలిచిన వారా ? వారెవరూ ఆమాట అనరే ? "

" మరి , గెలుపంటే ఏమి ? " 

         " గెలుపంటే ఎవరైనా ఒకడు తనకు కావలసినదానిని తనకు కావలసినరీతిలో దొరకునట్లు సాధించుట. కర్షకుడు భూమినంతా సమమగునట్లు దున్ని , విత్తి , పంట తీసుకొని గెలిచినాను అంటాడు. ధనార్థి మోసము , వంచన , దొంగతనము , హత్య అను భీతి లేకనే , నిర్లక్షముగా తన లక్ష్యాన్ని సాధించి , గెలిచినాను అంటాడు. క్షత్రియుడు గుంపు కట్టుకొని ప్రాణమును పణముగా పెట్టి ఇతరులను చంపి ఓడించి ద్వేషమును సాధించి, అక్కడ తన పాలనను స్థాపించి గెలిచినాను అంటాడు. వీరిలో ఎవరు గెలిచినవారు ? "

          " భూమిని సమము చేసినవాడు గెలిచినాడు అందామంటే మరలా వానలు వచ్చి ఆ నేలనంతా గుంతలు దిన్నెలు , మిట్టపల్లాలు చేస్తుంది కదా ? వీడి గెలుపేమయింది ? విత్తి , పంటను తీసుకున్నాడు కదా అంటే , అక్కడ కాల కాలములకూ వానలు రాకుంటే వాని గతి ఏమి ? అథవా , వానలొచ్చినా సకాలములో వ్యాపారము చేయకుంటే --నారు, నీరు , ఎరువు, కోత, నూర్పిళ్ళు వంటి పురుష వ్యాపారములు లేకుంటే గెలుపెలా వస్తుంది ? కాబట్టి మనుష్యుడు చేయు కార్యములో గెలవవలెనంటే అదృష్ట సహాయముకూడా సమకూరవలెను కదా ? ఇలాగ , తాను చేయునదీ , అదృష్ట సహాయము -రెండూ చేరితేనే గెలుపా ? 

         " పితికి , భద్రముగా మూత పెట్టిననూ పాలను పిల్లి వచ్చి ఎలాగో మాయచేసి తాగును. గోపాలకుడు చూస్తుండగనే పులి వచ్చి ఆవును ఎగరేసుకొని పోవును. రెండూ గెలిచినాయి కదా . రెండూ స్వార్థమును సాధించుకున్నాయి. అయితే , ఒకటి మోసము తోనూ , ఇంకోటి బలము తోనూ! వీటిలో ఏది సరియైనది ? మోసముతో కార్యమును సాధించుటా ? బలముతోనా ? లేక రెండూ తప్పా ? "

         " ఆహా! ఇంతసేపూ నేను చేసినది భలే బాగున్నది ? కన్య లేకుండా పెళ్ళి చేసుకున్నట్లాయెను. మనసు ఉంటేనే కదా మానవుడు మహాదేవుడగునది ! ఆ మనసే లేకుంటే మానవుడు చేయునదేమున్నది ? నేను ఇప్పుడు ఇంత ఆలోచించినది కూడా మనసు  నా చేతిలో ఉన్నపుడే కదా ? అయితే , నిజంగా చెప్పాలంటే మనసు నా చేతిలో ఉందా ? నేను మనసు చేతిలో ఉన్నానా ? ఇక్కడ కేనోపనిషత్తు యొక్క ’ కేనేషితం పతతి ప్రేషితం మనః ’ -మనసు తన ఇష్ట వస్తువును గురించి పరుగెడుతుంది కదా , అలాగ పరుగెత్తు అని దానిని ప్రేరేపించునది ఎవరు ? నేనింతసేపూ గెలుపు-ఓటముల గురించి ఆలోచించినాను కదా , వాటిని గురించి చింతించు అని మనసును ప్రేరేపించినది ఎవరు ? ఇష్టం పతతి మనః అంటే , ఆ విషయము నాకు ఇష్టమా ? అయితే మిగిలినవన్నీ అయిష్టములా ? 

         " ఈ మాట వలన ఒకటి తేలింది. మనసు ఇష్టానిష్టములను గమనించి పోవునది అని తెలిసింది. మరి , నిన్న రాత్రి నా గతి యేమిటి అని ఆలోచిస్తూ ఉన్నాను. శిరోభారము వచ్చి జ్వరమై , నేనెక్కడున్నానన్నదీ కూడా మరచిపోవునంత అయింది. అదీ మనసుకు ఇష్టమేనా ? అథవా అదంతా కాకపోతే ఈ నిధి దొరికేది కాదా ? "

        " అదలా ఉంచితే , మనసును ఎవరో ప్రేరేపిస్తూ ఉండాలి ? మనసు కూడా గుర్రమువ వలె ఎవరికోసమో అన్యార్థమై పరుగెడుతుండవలెను. పొయ్యి మీద పెట్టిన నీరు కింద మండుచున్న మంట శాఖముతో తనకు వద్దన్నా , కావాలన్నా మరుగునట్లే , ఈ మనసు కూడా ఎవరి ప్రేరణచేతనో నడుస్తుండవలెను. అది ఎవరు ? లేదా , వారు కంటికి కనపడ కుండా అణగి ఉండి , మనసును దర్వి వలె , గరిట వలె ఉపయోగిస్తుంటారో ? 

         " అలాగయితే , దీనినేనా నిన్న దేవగురువు చెప్పినది ? ’ మేము నీవెనుక ఉన్నామన్న నమ్మకము తో ధైర్యముగా వర్తించు ’ . అంటే ఇదే అర్థమా ? వారికీ మాకూ సంబంధమును కల్పించునది మనసేనా ? మనసు యొక్క ఇష్టాయిష్టములను నిర్ణయించి వాటివైపు పోవుటకో , నిలుపుటకో కారణులు ఈ దేవతలేనా యేమి ?"

       ఇప్పటికి జనకుని మనసు శాంతమైనది. ఆకళింపు అయినది. ఆలోచనలిక ముందుకు సాగలేదు. కాగిన నేలపై చల్లిన నీరు వలె ఇంకుతున్నవి. కనులు అరమూతలు పడుతున్నాయి. కూర్చున్న చోటనే కునుకు వచ్చినట్లాయెను. 

         ద్వారము వద్ద పహరా ఉన్న కాపలావాడు , ఒక యామము గడచినదని తన విధ్యుక్తాన్ని మరొకడికి అప్పజెప్పినాడు. వచ్చినవాడు వంగి చూచి , వారున్నారు అని సూచించినాడు. వెళుతున్నవాడు వెనక్కు తిరిగి , ’ సవారి ఎంత సేపటినుంచో ఇలాగే కూర్చున్నారు. ఎవరైనా చూడవలెనని వస్తే , శబ్దము చేసి లోపలికి వెళ్ళు ’ అన్నాడు. వాడు ఒప్పుకొని తలాడించినాడు. 

       వాడు వెళ్ళి పోయిన కొంచము సేపటికి రాజాధికారి యొకడు వచ్చెను. పహరావాడు అతడిని ఆపుటకు లేదు. రాజు మేలుకుని ఉన్నాడో లేదో తెలియదు. ఏమైనా కానీ యని పొడి దగ్గు దగ్గినాడు. రాజుకు మెలకువ అయినది. అప్పుడే రాజాధికారి లోపలికి వచ్చినాడు. రాజు ఏదో ఆలోచనలో ఉండి, ’ ఏమేమి చేయవలెననునది తెలిసినదా ? ’ అన్నాడు. 

         రాజాధికారి ,  ఆ ప్రశ్న అర్థము కాకున్ననూ , తాను నివేదించుటకు వచ్చిన విషయానికి సంబంధించినదే అయి ఉండవలెను అనుకొని , ’ అంతా అయినది. నిక్షిప్త స్థలములో ఒక గుండిగ వరి కూడు , నిక్షేపమునకు ఒక గుండిగ వరి కూడు బలిగా పెట్టినాము. రాజభవనములో ఒక వెయ్యిమంది జనులకు అలంకార పంక్తి. బయట ఛత్రములో భూరిభోజనములు. గజశాలలో , గోశాలలో , అశ్వశాలలో సార్వత్రిక సమారాధనలు " అని నివేదించినాడు. 

         రాజు తన ప్రశ్నకు తానే నవ్వుతూ అడిగినాడు , " దేవతలకు హుతము , ప్రహుతము అని రెండు విధములుగా పూజ. హోమము చేయునది హుతము. ఈ బలి మొదలైనవన్నీ ప్రహుతములు. సరే , హోమము సంగతి మరచినారేమి ? "

" దానిని పురోహితులకు అప్పజెప్పినాము. వారు వచ్చి దాని విషయమును చెప్పెదరు " 

         సరిగ్గా అప్పుడే రాజ పురోహితుడు అశ్వలుడు వచ్చినాడు. అతడు రాజ మర్యాదను , రాజాశీర్వాదమును  ఒప్పించి , " సన్నిధానములో అనుజ్ఞ అయిన విధముగా  రేపటి దినము ఒక హవనమునకు సర్వమునూ సిద్ధపరచి యున్నాము. అయితే , గృహ్యసూత్రములలో ఎక్కడా దీనికి తగిన క్రమము దొరకలేదు. కాబట్టి శ్రీ సూక్త విధానముతో హోమము , దానితో పాటు దేవరాజయిన ఇంద్రునికి ఒకటి , దేవ గురువైన బృహస్పతికి ఒకటి, చివరికి స్విష్టకృద్ధోమము , ఇవన్నీ చేయునది అని నిర్ణయమైనది. " 

         రాజు , ’ రేపు కూర్చుని , నిధి దొరికినపుడు ఏమి చేయవలె ననునది బ్రాహ్మణములలో ఎక్కడైనా చెప్పబడి ఉందేమో చూడండి. రేపటి నుండీ ఒక మండలము ఈ హోమము జరగనీ. అలాగే అలంకార పంక్తి , భూరిభోజనములూ జరగనీ. అలంకార పంక్తిలో కూర్చున్న వారికి రాజభవనములో హోమములో ఋత్త్విజులకు దొరికే దక్షిణనే ఇచ్చెదము. విత్తశాఠ్యం న కుర్యాత్--ఎక్కడా లోభపు పేరే రానివ్వకండి. " అన్నాడు. 

ఇద్దరూ , " చిత్తం , అటులనే " అన్నారు. 

No comments:

Post a Comment