57. యాభై యేడవ భాగము-- సంభాషణ
భగవానులు రాజ భవనమునకు వెళ్ళవలసిన దివసము సమీపించినది . ఆశ్రమపు కార్య భారమునంతటినీ భగవతి కాత్యాయని వహించుకొని వృద్ధ శిష్యుల సహాయముతో నిర్వహించవలెననీ , మైత్రేయి భగవానుల నిత్య సూర్యోపాసన చేయవలెననీ నిర్ణయమైనది. నిర్దిష్ట కాలములో ఇద్దరు శిష్యులతో రాజశకటములో బయలు దేరినారు. భగవానులు రాజధాని వద్దకు చేరగనే రాజ పురుషులు వచ్చి కనిపించినారు. వీరు వారిని పలకరించి , " మేము మా తండ్రి ఆచార్యుల ఇంటిలో దిగుతాము. ఈ దినము సంజ అయినది. కాబట్టి రేపటి దినము మహారాజుల అనుమతి అయినపుడు మేము వచ్చెదము. మాకోసము మధుపర్కము మొదలగు వ్యవస్థలు చేయనక్కరలేదు అని మహారాజులకు మా పరముగా విజ్ఞాపన చేయండి " అని గట్టిగా అయిననూ నవ్వుతూ చెప్పి పంపినారు.
ఆచార్యుల ఇంటికి గార్గి , భార్గవుడు వచ్చియున్నారు . యాజ్ఞవల్క్యులు వారిని చూచి సంతోషపడినారు. వారు కూడా వీరికి అభివాదనములను అర్పించినారు. భగవానులు , " ఇదేమిది , ఒకవేళ దేవి గార్గి అభివాదనమును సహించినా , మాకన్నా పెద్దవారు భార్గవుల అభివాదనమును సహించుటెట్లు ? ఒప్పుకొనుట సంగతి ఇంకా దూరపు మాట." అని ప్రత్యభివాదనములను చేయుటకు వెళ్ళినాడు. ఇద్దరూ దానిని ఆపి , " తమరు జ్ఞాన వృద్ధులు. కాబట్టి తమరికి మేము అభివాదనము చేయవలెను , తమరు మాకు కాదు " అన్నారు. భగవానులు తల్లిదండ్రులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొందినారు.
దారిలో ఒక విచిత్రము జరిగింది . హవ్యముగా ఉపయోగించవచ్చునని కొందరు సద్యో ఘృతమును ( తాజా నెయ్యి ) ఇచ్చినారు . బాగా పాలిచ్చు గోవులను అర్పించుటకు వచ్చినారు ఇంకొందరు. కానుకలను తెచ్చిచ్చినారు అనేకులు. విశేషమేమంటే , వారందరూ లోకమును ఉద్ధరించుటకు పుట్టిన మహాపురుషుడనీ , ఆదిత్య దేవుడి ప్రసాదముగా వేదాదులను పొందినవాడనీ గౌరవించువారే !
కుశల ప్రశ్నలయిన తరువాత గార్గి కొంతసేపు ఉండి వెళ్ళినారు. రాజపురోహితుడు ఇంకా ఉన్నాడు. భగవానులతో ఏదో చెప్పవలెనని అతడికి మనసులో ఉందని అతడి ముఖమే చెప్పుతున్నది. చివరికి దేవరాతుడు, " ఏమో చెప్పాలని ఉన్నట్లుంది , చెప్పేయండి . ఏకాంతములో చెప్పవలెనంటే మేము బయటికి వెళ్ళెదము " అన్నారు. భార్గవుడు , " నిజము. ఎలాగ ఆరంభించవలెను ? ఎక్కడినుండీ చెప్పవలెను ? అని ఆలోచిస్తున్నాను. మీరు ఉంటే నాకేమీ చింతలేదు. " అన్నాడు. భగవానులు కూడా అవునన్నారు.
చివరికి భార్గవుడు అన్నాడు , " అయ్యా, నిన్ను నువ్వు అని సంబోధించవలెను. అదీగాక నిన్ను శిశువుగా ఉన్నప్పటి నుండీ చూస్తున్న వాడిని నేను. కాబట్టి నువ్వు అంటే కోపము చేసుకోవద్దు. ఆదినము నీ ఉపనిషద్వ్యాఖ్యానమును విన్న దినము నుండి నాకు పిచ్చి పట్టినది. నేను రాజ పౌరోహిత్యమును వదలివేస్తాను. మీ గురు కులమునకు వచ్చేస్తాను. అయితే అక్కడ నావంటి వానికి అవకాశము ఉన్నదో లేదో అని వెనకా ముందూ చూస్తున్నాను."
భగవానులు నవ్వినారు. " ఇపుడిది మరీ బాగుంది. మీవంటి వారికి మా గురుకులములో స్థానము లేదంటే ఏమిటి ? గురు కులమున కంతా భగవాన్ అనిపించుకున్న వారు గొప్ప అయితే , మీరు అతడి తండ్రి స్థానములో ఉండండి. అయితే గురుకులమునకు వచ్చుట గొప్ప కాదు , అక్కడ ఏమి చేయవలెను అనునది మొదట నిర్ణయించుకొని రండి. అక్కడికి వచ్చునపుడు ఇక్కడివన్నీ ముగించుకొని , మరలా ఇక్కడికి వచ్చుట లేదు అన్నట్లు రండి. నేను , నా భార్యలూ సదా మీ సేవకై సిద్ధముగా ఉంటాము " అన్నారు.
భార్గవుడు అన్నాడు , " అయ్యా , నేనేమి చెప్పేది ? మొదట యేయే వస్తువులు ప్రియమని నెత్తిన పెట్టుకున్నానో అవన్నీ ఇప్పుడు అసహ్యములైనాయి. ఇంటిని అంత అక్కరగా అవస్థలు పడి కట్టించినానా ? ఇప్పుడు ఆ ఇంటిలో ఉండుటయే కష్టముగా ఉన్నది . తోడునీడగా ఉండి సేవ చేస్తున్న భార్యను వదలి పోలేనని కొన్నిరోజులు నలిగినాను. ఆమె మొన్న , " కావాలంటే మీరు వెళ్ళండి , నేను రాజధానిలో ఉంటాను " అన్నది. ఇంక ఇక్కడ నన్ను పట్టి ఉంచేది ఏదీ లేదు. "
దేవరాతుడు, " భార్గవులు చెప్పినదంతా నిజము. వారు ఈ మధ్య రాజ భవనమునకు కూడా అంతగా పోవుట లేదు " అన్నాడు.
భగవానులు అన్నారు , " భార్గవుల వారూ , ఈ భోగములు తమరికి చాలనిపించినాయా ? అది చెప్పండి. అవి వద్దనిపించు వరకూ ఇక్కడే ఉండండి. అవి వద్దు , మరలా వాటిని నేను కోరను అనిపించగానే వచ్చేయండి. మేము మిమల్ని కంటికి రెప్పలా చూచుకొనెదము. తమరికి కావలసినది మేము చెప్పెదము. " అన్నారు.
ప్రాతఃకాల విధులన్నీ ముగించుకొని, అగ్నిహోత్రము , సూర్య నమస్కారములు కానిచ్చి , వేదాదులు పారాయణము చేసి ముగిస్తుండగా భగవానుల కోసమని రాజశకటము వచ్చింది. వారు తలిదండ్రుల అనుమతి పొంది రాజభవనమునకు వెళ్ళినారు.
మహారాజులు సరస్వతీ విలాసములో ఏకాంతముగా వేచియున్నారు. భగవానుల అనుజ్ఞ మేరకు మధుపర్కాదులు ఉండలేదు. పూర్వాభిముఖముగా ఒరగుదిండు వేసియున్న మెత్త మీద పరచిన విశాలమైన కృష్ణాజినముతో సుందరముగా నున్న ఆసనమొకటి. దాని కుడిపక్కన అదేజాతివే ఇంకా రెండు అజినములు ఎక్కువగా వేసియున్న ఇంకొక ఆసనము. దూరములో వ్యజనములు , చామరములు పట్టుకొని సిద్ధముగా నున్న దాసీజనము.
మహారాజులు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి భగవానులను పిలుచుకొని వెళ్ళి పూర్వాభిముఖముగా నున్న ఆసనము మీద కూర్చోబెట్టినారు. కుశల ప్రశ్నల ఉపచారములు ముగిసిన తరువాత మహారాజు చేతులు జోడించి అన్నారు : " సంభాషణ తమరే ఆరంభించవలెను. "
మందస్మితముతో భగవానులు ఆరంభించినారు. " వెనుక బాలాకి గార్గ్యుడు అను విద్వాంసుడుండేవాడు. అతడికి తాను విద్వాంసుడనని అహంకారము బలు హెచ్చు. దానితో పాటు , అదేమి మహా బ్రహ్మ విద్య! గురువు లేకపోతే నేర్చుకోలేమా అని ఒక అహంకారము. అతడు ఒక దినము కాశీరాజైన అజాతశత్రువు వద్దకు వెళ్ళి , ’ నేను నీకు బ్రహ్మమును గురించి బోధిస్తాను ’ అన్నాడు. రాజుకు మిక్కిలి సంతోషమయినది. ’ అందరూ జనకుని కన్నా విద్వత్ ప్రియులు వేరొకరు లేరు అని అతని వద్దకే పోతారు. కానీ నువ్వు నాదగ్గరకు వచ్చినది చాలా బాగున్నది. బ్రహ్మవిద్యను చెప్పిస్తాను అన్న మాటకు నీకు సహస్ర సువర్ణములు ఇస్తాను ’ అన్నాడు. సంవాదము ఆరంభమయినది.
గార్గ్యుడు , ’ ఆదిత్యునిలో ఉన్న పురుషుడే బ్రహ్మ ’ అన్నాడు. అజాత శత్రువు, ’ ఓ బ్రాహ్మణా, బ్రహ్మము అనేది పుట్టి వచ్చినది కాదు. పుట్టి వచ్చిన , పుట్టి రానున్న సర్వ భూతములకూ అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని ఉపాసన చేసినవాడు సర్వభూత మహేశ్వరుడగును అనుదానిని నేనెరుగుదును. నువ్వు అది అయినావా ? చెప్పు .’ అన్నాడు.
గార్గ్యుడు ఇంకా ముందుకు కొనసాగించి , చంద్రాదులను గురించి చెప్పుతూ , చివరికి , ’ శరీరములోనున్న పురుషుడిని బ్రహ్మమని ఉపాసిస్తాను ’ అన్నాడు. అజాత శత్రువు, ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క ఫలమును చెప్పుచూ, ’ బ్రహ్మోపాసకుడు బ్రహ్మమే కావలెను. అది నువ్వు అయినావా ? చెప్పు. ’ అని అడిగినాడు.
చివరికి గార్గ్యుడు తన జంభపు ఫలమును తానే అనుభవించి , ఆ అజాత శత్రువు నుండీ బ్రహ్మోపాసనను నేర్చుకున్నాడు. "
ఈ కథను ఉపనిషత్తులో చేర్చవలెను అని అనుమతి అయినది . దీనిని ఇప్పుడెందుకు చెప్పినాను అంటే , నాకూ అలాగ ఎవరికీ తెలియనిది నేనెరుగుదును అన్న గర్వము వచ్చి నన్ను కిందకు తోసివేయకుండుటకు. మరియు, ’ పూర్ణోపాసన ఫలము పూర్ణుడనగుట ’ అని తెలిసి ఉండనీ అని దీనిని జ్ఞాపకము ఉంచుకొనుటకు. ఇక తమరు ఏమి చెప్పెదరో అనుజ్ఞనివ్వండి. "
మహారాజు అదివిని సంతోషముతో తలయూపినారు.
" బహు ముచ్చటైన ఆరంభము. ఈ కథ తమరికి మాత్రమే కాదు , నాకు కూడా మార్గదర్శకము. ఈ దృష్టితో చూస్తే మేము తెలుసుకున్నది సరియా తప్పా అని మాకు సందేహము కలుగుచున్నది. ఏమి చెప్పేది ? "
" ఆలోచిస్తూ కూర్చోవడానికేముంది ? ఈ దేహమే నేను అన్న భావము ఉన్నంతవరకూ సందేహములు వదలవు. కాబట్టి ఎక్కడో ఒకచోట నుండీ ఆరంభించండి. లేదా , నేనే అడిగేదా ? "
" అదే సులభమనిపిస్తున్నది "
" సరే , మొదటిది , తమరికి ఈ బ్రహ్మ జ్ఞానపు పిచ్చి , ఎందుకు , ఎలాగ వచ్చింది ? చెప్పండి . "
" విద్యాభిమానము మా వంశపు సొత్తు. అంతేకాక, మా తండ్రిగారు , మనలో ఒకరు విద్వద్వరిష్టుడు పుట్టవలెను అన్న అభిమానము కలవారు. నేను బాల్యములోనే , ’ యస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి ’ - ఏదైనా ఒకదానిని సరిగ్గా తెలుసుకుంటే సర్వమూ తెలియును అని విన్నాను. అలాగ అంతా తెలుసుకోవాలన్న జిజ్ఞాస నన్ను బ్రహ్మ జ్ఞానమునకు తీసుకు వచ్చింది. "
" మంచిది , తమరు ఎవరెవరిని సేవించినారు ? వారు ఏమేమి చెప్పినారు ? అనుజ్ఞ ఇవ్వండి. "
" నేను శైలిని , ఉదంకుడు , వార్ష్ణుడు , భారద్వాజుడు , సత్యకాముడు , శాకల్యుడు అను ఆరుగురు గురువులను సేవించినాను. "
" అటులనా , వీరందరూ మాతృ , పితృ , గురువుల వలన సుశిక్షితులైన వారు. వారు చెప్పునది సరిగ్గానే ఉండవలెను. ఏదీ , ఒక్కొక్కటే చెప్పండి. "
" శైలినుల వారు వాణియే బ్రహ్మము అన్నారు. "
" అవును , వాణి నుండే కదా అంతా , వేదశాస్త్రముతో సహా , తెలిసేది ! కాబట్టి వాణిని బ్రహ్మమన్నారు . తరువాత ? "
" ఉదంకులు ప్రాణమే బ్రహ్మము అన్నారు . "
" అది కూడా నిజమే. ప్రాణము లేనివాడు ఏమి చేయగలడు ? అదీగాక , లోకము నూరారు పనులను చేయుట ప్రాణము కోసమే కదా , అందువలన వారు అలాగన్నారు. పిదప ? "
" వార్ష్ణులు చక్షుస్సే బ్రహ్మమన్నారు. "
" అది కూడా సరియే. కన్నులతో చూడకనే ఏదైనా ఎలా తెలియును ? ఆ తరువాత ? "
" భారద్వాజులు శ్రోత్రమే బ్రహ్మము అన్నారు. "
" ఇది కూడా సరియే. శ్రోత్రము లేనివాడు ఉంటే ఏమి లేకుంటే ఏమి ? పిమ్మట ? "
" సత్యకాములు మనసే బ్రహ్మము అన్నారు. "
" అదియూ నిజమే . అన్నీ ఉన్నా మనసు లేకపోతే చేయుటకేముంది ? ఆమీదట ? "
" శాకల్యులు హృదయమే బ్రహ్మము అన్నారు . "
" అదీ సరియే , హృదయము లేకుండా ఇంకేముంటే ఏమి ? సరే , మీరు వీటిలో దేనిని అభ్యాసములో ఉంచుకున్నారు ? లేదా , దానికన్నా ముందే ఇది చెప్పండి , ఆయా గురువులు వీటి ఆయతనము , ప్రతిష్ఠ లను చెప్పినారేమి ? ’
" లేదు, వారు చెప్పలేదు. అలాగన్న నేమి ? "
" ఆయతనమంటే అది ఉన్న స్థలము. ప్రతిష్ఠ అంటే దేనిని పట్టుకుంటే అది దొరకునో , అది. కానివ్వండి , తమరి అభ్యాసములో ఉన్నదేది ? తమరి అనుభవమేమిటి ? "
" తమరి ప్రశ్నలే నాకు కొత్తగా ఉన్నాయి. బ్రహ్మమును గురించి అభ్యాసము చేయునదేమి ? దానివలన కలుగు అనుభవము ఎట్టిది ? "
" ఔను. బ్రహ్మము అన్నిటినీ తనలో ఉంచుకుని , అన్నిటిలోనూ తానుండి , వాటి బయట కూడా ఉండు అవ్యయము. దానిని గురించి అభ్యాసమంటే నేను , నేను అంటూ అన్నిటినీ ఆత్మ భిన్నముగా చూచు సంకుచిత దృష్టి లేకుండా చేసుకొనుట. ఆ సంకుచిత దృష్టి పోయేకొద్దీ మనుష్యుని ఆనందానుభవ శక్తి కూడా ఎక్కువగును. అప్పుడు గిన్నెడంత ఉన్న నీరు సముద్రమయినట్లగును. ఇప్పుడు తమరు చెప్పినవన్నీ ఏకాంశ బ్రహ్మములు. వాటిని ఉపాసన చేసిననూ ఫలముంటుంది. కానీ పూర్ణ బ్రహ్మోపాసన ఫలముండదు. "
" పూర్ణ బ్రహ్మోపాసన ఫలమంటే ఏమిటి ? "
" మనశ్శాంతి. రాత్రింబగళ్ళూ ఇది లేదు , అది చాలదు అని ఏడ్చే మనసు తన ఏడుపును పోగొట్టుకుని సుఖముగా ఉండుట. "
" ఆహా ! ఏమి మాట ? ఏమి మాట ! భగవాన్ , ఈ మాటకు , ఏడుపు పోవును అన్న తమరి మాటకు, ఏనుగంతటి కోడె దూడలున్న ఆవుల మంద నొకదానిని మీకు అర్పిస్తాను. స్వీకరించవలెను. "
భగవానులు సమాధానముగా యే ఉద్వేగమూ లేక అన్నారు , " తొందరేముంది ? ఉండండి. మీకు నేనింకా ఆ పూర్ణ విద్యను నేర్పలేదు. ఆ పూర్ణ విద్యను చెప్పనిదే మీరు బయట పడలేరు. అలాగ మీ శోకమును దాటించి ఉద్ధారము చేయకుండా మీరు ఇచ్చుదానిని గ్రహించుట ఎట్లు ? శిష్యుడిని ఉద్ధారము చేయకనే ఏమీ తీసుకోకూడదని తమరి తండ్రిగారు చెప్పేవారు. నాకు బాగా జ్ఞాపకము ఉన్నది. మీరు నాకు శిష్యులు కూడా కాలేదు. అలాంటపుడు ఎలా తీసుకోను ? "
మహారాజులు యోచించినారు. ఒక ఘడియ తరువాత, " నన్ను తమరి శిష్యునిగా అంగీకరించి నాకు పూర్ణ విద్యను అనుగ్రహించండి. "
" అలాగ వద్దు మహారాజా , శిష్యుడిని గురువు పరీక్షించునట్లే శిష్యుడు కూడా గురువును పరీక్షించవలెను. తన మనసు ఇతడు సరియైన వాడు అనుకున్న తరువాత యథావిధిగా గురువును వరించవలెను. కాబట్టి , తమరు పరీక్ష చేసి , తమరి పరీక్షలో గెలిచినవాడిని గురువుగా అంగీకరించవలెను. అంతవరకూ మీరు ఈ విషయపు రాజులు. తమరు అడిగినదానికి ఉత్తరమును చెప్పుట ఈ విషయ వాసులమైన మా ధర్మము. మీరు వింటున్నారు, నేను చెపుతున్నాను. మీకు విన్నామని సంతోషము, నాకు చెప్పినానని సంతోషము. నేనిక బయలుదేర వచ్చునా ? "
భగవానులు లేచినారు. మహారాజులు విధిలేక ఇష్టము లేకున్ననూ లేచి ప్రణామము చేసినారు. రాజ భవనము ముఖద్వారము వరకూ వచ్చి భగవానులు రాజ శకటములో కూర్చొన్న తరువాత చేతులు జోడించి వారిని వీడ్కొలిపినారు.
No comments:
Post a Comment