SHARE

Wednesday, March 6, 2013

55. " మహాదర్శనము " --యాభై అయిదవ భాగము --అక్కాచెళ్ళెళ్ళు


55. యాభై అయిదవ భాగము --  అక్కాచెళ్ళెళ్ళు


        ఎండవేడిమి తగ్గుతూ , ఎండ ఉంటే బాగుండును అను ఘట్టమునకు వచ్చినది. భగవాన్ ఆదిత్యదేవుడు తన కిరణములను వెనక్కు లాగుకొనుటకు ఆరంభించినాడు. పొద్దువాలు సమయము దగ్గరైంది. భగవానులు వచ్చి అరుగుమీద కూర్చున్నారు. కనులు అంతర్ముఖములై పంచభూత సంఘాతమైన ప్రపంచ చిత్రమును పరిభావిస్తున్నవి. ఆశ్రమ వాసులందరూ అక్కడక్కడా కూర్చొని చింతన చేస్తూ , ఆవృత్తి చేస్తూ , తమ తమ వ్యాపారములలో మగ్నులై ఉన్నారు. భగవానులు వారందరిచేతా వారి వారి కార్యములు చేయించు మాతరిశ్వుడి వలె ఉండి తూష్ణీ భావముతో కూర్చున్నారు. 

        ఆశ్రమవాసి యొకడు వచ్చినాడు. కాలి శబ్దము దగ్గరవగానే భగవానులు కనులు తెరచి , ’ ఏమిటి ? ’ అన్నారు. వచ్చినవాడు భయభక్తులతో రాజదూత ఒకడు వచ్చినాడని తెలియజేసినాడు. వారు లేచి వెళ్ళి అతిథి శాల లో ఉన్న రాజదూతను చూచినారు. అతడు తాను తెచ్చిన రాజ శాసనమును అందించినాడు. దానిలో , ’ భగవానులు వచ్చి తమరి పాదధూళిచే మా రాజభవనమును పవిత్రము చేయవలెను . తమరికి అనుకూలమైన దినము తెలిపితే ఆగమనమునకు కావలసిన వన్నిటినీ సిద్ధము చేయగలము" అని రాసి ఉంది. భగవానులు దానిని అక్కడే విప్పి చదువుకొని " మహారాజులకు తెలుపు , వారు రాసిన విషయమును ఆదిత్య దేవునికి తెలిపి ఉత్తరమును పంపించెదము అని. " అని చెప్పి రాజదూతకు యథా యోగ్యమైన ఉపచారములను చేయుటకు ఆశ్రమవాసి ఒకరికి ఆదేశమునిచ్చి తాము వచ్చేసినారు. 

          వారికి ఈ దినము ఏదో విశేషము జరుగుతుందని తెలుసు. అయితే అటు తిరిగి చూచి అది యేమిటి అని తెలుసుకొనెడు కుతూహలము లేదు. సరే , రాజదూత ఆగమనమే ఆ విశేషము అనుకున్నారు. స్నానానికి ఇంకొంత సేపు ఉందని మరలా వెళ్ళి అరుగుపై కూర్చొని కళ్ళు మూసుకున్నారు. భగవానులు అక్కడున్నారంటే , పక్షులే కాదు , క్రిమి కీటకాలు కూడా గట్టిగా శబ్దము చేయవు. 

         అలాగే వారు కొంతసేపు కూర్చున్నారు. వారు లోపల చూస్తున్న నిస్తరంగ చిదాంబుధి వలెనే బయట కూడా ప్రశాంతముగా ఉంది. చెవిలో ఎప్పుడూ వినిపించే గుంయ్ మనే నాదముకూడా వినిపించనంత దూరముగా వున్న వారు హఠాత్తుగా కన్నులు తెరచినారు. ఎదురుగా భగవతి. 

" వచ్చి ఎంత సేపైనది ? " భగవానులు అడిగినారు. 

" ఇప్పుడే వచ్చినాను. సంధ్యాస్నానపు పొద్దు. ఎందుకో రాలేదే , చూద్దామని వచ్చినాను. "

" చూడు , స్నానానికి పొద్దయింది అని నాకు ఎవరైనా వచ్చి జ్ఞాపకము చేయవలెను. ఇటువంటి పిచ్చివాళ్ళ మెడను కావలించుకుంది ఈ ఆశ్రమము. "

" మా తాత చెప్పునది నిజమయితే , ఆశ్రమము మాత్రమే కాదు , ఈ జగత్తంతా మిమ్మల్ని కావలించు కొనవలెను " 

" అలాగయితే మేము పెద్ద జోలె పెట్టుకోవలెను " 

" ఇంతకీ మీరేమనుకుంటున్నారు ? చేసేవారు వేరే ఉన్నారు , చేసుకుంటారు . అంతేనా ? "

          " చిలికి తీసుకున్న అర్థాలన్నీ అంతే. నువ్వు రాను రానూ మాటల నైపుణ్యము బలే చూపిస్తున్నావే ?  పదవే పద స్నానానికి పోదాం. ఆలస్యము కావలసినది , అయింది. ఈ దినమేమో ఇంట్లోనే స్నానము చేయాలనిపిస్తున్నదే ? "

" గంగ ఇంటికే వచ్చింది. అంతా సిద్ధముగా ఉంది. రాండి " 

          ఆ వేళ భగవానులు ఇంటిలోనే స్నానము చేసినారు. స్నానము చేసిన భగవతి, వారికి స్నానము చేయించి , సంధ్యావందనమునకు అన్నీ పెట్టి తాను అగ్నిగేహమునకు వెళ్ళింది. భగవానులు సంధ్యావందనము చేసి అగ్నిహోత్రమును ముగించినారు. 

          ఆ వేళకు నడిమింట్లో దీపము వెలిగింది. బయట నక్షత్రములు బాగా కనిపిస్తున్నాయి. కన్నులు ఉండీ ఏమీ కనిపించనంతగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. చంద్రుడు ఇంకా ముఖము చూపించలేదు. భగవానులు వచ్చి నడిమింట్లో వేసిన ఆసనము పైన గోడకానుకొని కూర్చున్నారు. వారు ఈ దినమెందుకో  ’ అగ్నే నయ సుపథా..’ మంత్రమును చెప్పుతున్నారు. మనస్సు దాని అర్థమును పరిభావిస్తున్నది. " యుయోధ్యస్మజ్జుహురాణమేనః  " అను  ’ మన కుటిలమైన పాపములను నాశనము చేయుటకు ’ అనే అర్థము ఉన్న మూడవ పాదము పైన ఒక ఘడియ నిలిచింది. " అంటే , మనలను తప్పుదారికి లాగు పాపము ఒకటుంది. ఆ పాపమేది ? మన అపూర్ణత. అపూర్ణతయే అశక్తత. దాని వలననే మనము పలు దారులగుట" అని అనేక రకాలుగా ఆలోచనలు పరచుకున్నాయి. 

          ఎవరో వచ్చి నమస్కారము చేసినారు. భగవానులకు అదేమీ కొత్తది కాదు. కానీ ఆ సమయములో వచ్చేది ఎవరు ? మనసు ఎక్కడికో పోయి ఉండినది. దీపము తగ్గిపోయి కనులు తమ పనిని సరిగ్గా చేయుట లేదు. వచ్చినవారు ఆడవారు అని చెప్పినాయే కానీ ఎవరు అని చెప్పలేదు. 

భగవానులు చిన్నగొంతుతో ’ ఎవరు ’ అన్నారు. 

వచ్చినామె కూడా అదే గొంతును అనుసరించి చిన్నగా ’ నేను మైత్రేయిని ’ అన్నది. 

" ఏమి వచ్చినావు ? "

" ఇప్పుడైతే భగవానులు ప్రసన్నముగా ఉంటారు , అడిగిన వరమునిస్తారు అని వచ్చినాను. " 

" ఆలాపినీ దేవి గారికి ఇష్టమైన కోడలివి. నువ్వు అడిగినదానిని ఎప్పుడూ కాదనము. అదినీకు తెలుసా ? "

" తెలుసు దేవా , అయితే అడిగే వరము నా యోగ్యతను మించినదేమో అని దిగులు. " 

" అదేమిటో చెప్పు "

" నేను కూడా ఈ ఆశ్రమములోనే ఉండాలనుకుంటున్నాను " 

" తప్పకుండా ఉండవచ్చును. నీకు ఇక్కడ ఉండుటకు అధికారము లేదా ? నన్ను అడిగి , అనుమతి పొంది ఉండవలెనా ? " 

" అటుల కాదు , నేను ఉంటే , నా రక్షణ , పోషణ , మార్గ దర్శనము అన్నీ మీ బాధ్యతలవుతాయి. "

" ఇప్పుడు ఆశ్రమవాసులందరికీ ఇవన్నీ లభ్యము కాలేదా ? " 

" నేను ఇతరులవలె అడుగుట లేదు " 

" సమస్య జటిలమన్నమాట. అప్పుడే మాట ఇచ్చినాను. ఏమైనా కానీ , వహించుటకు సిద్ధముగా ఉన్నాను. బెదరకుండా చెప్పు. " 

" నేను కోరుతున్నది వట్టి శిష్యత్వము కాదు " 

" మరి, ఇంకేమిటి ? "

" మార్గదర్శనము తో పాటూ...."

" సహ బ్రహ్మచారిణి అవుతానంటావా ? "

" ఔను "

" నాకు అప్పుడే పెళ్ళి అయినది నీకు తెలియదా ? " 

" దేవా , నేను అడుగుతున్నది ధర్మ పత్నీత్వము కాదు " 

" మరింకేమిటి ? " 

" మోక్ష పత్నీత్వమును. గురువుగా , పతిగా , నానుండీ తమరు సేవలందుకోవలెనని " 

భగవానులు ఒక్క ఘడియ ఊరకే ఉన్నారు . " అంటే, ఐహికమైన ధనాపేక్ష ఏమీ లేదనా ? "

" ఔను . నాకు కావలసినది ఆముష్మిక ధనము "

         భగవానులు ఒక ఘడియ ఆలోచించినారు. " తప్పేమీ లేదు. ఇలాగ చేస్తే అర్థము లేకుండా ఆడిపోసుకొను వారి నోటికి తాళము వేసినట్లే , సరే " అని నిశ్చయించుకొని, " కాత్యాయని అనుమతి లేకుండా మేము ఏమీ చేయుటకులేదు మైత్రేయీ .." 

" ఈ వేళకు వెళితే భగవానులు నిశ్శంకగా వరప్రదానము చేస్తారని చెప్పినది ఆమెయే. " 

భగవానులు తలాడించినారు, " అట్లయిన కావచ్చును . " 

మైత్రేయి లేచి నమస్కారము చేసినది. భగవానులు నవ్వినారు. 

No comments:

Post a Comment