SHARE

Thursday, March 14, 2013

63. " మహాదర్శనము " --అరవై మూడవ భాగము --సర్వమూ సిద్ధము


63. అరవై మూడవ భాగము--  సర్వమూ సిద్ధము


          జ్ఞాన నగరపు నిర్మాణము శరవేగముతో సాగుతున్నది. మొదట నీరు సమృద్ధిగా ఉండవలెనని , గంగా నదియొక్క ఒక ఉపనదికి చిన్న అడ్డుకట్ట కట్టి అక్కడినుండీ ఒక కాలువను తెచ్చి విశాలమైన తటాకము నొకదానిని సృష్టి చేసి, దానికి కాలువను వదలినారు. జ్ఞానగరములో అక్కడక్కడా తులసి వనములు , పూదోటలు , నగర ఉపవనములలో తామర చెరువులు , ఎక్కువగా శ్రద్ధగా చేయబడి , విశేష కళాకాంతులతో శోభిల్లుతున్నాయి. అక్కడున్న మల్లికా , జాజి , మాలతి , కనకాంబరముల వంటి సుగంధమునిచ్చు పూల వాటికలు అతి చక్కగా పెంచబడినవై జ్యేష్ఠ మాసములో పూలతో క్రిక్కిరిసి పోయినాయి. 

          అటులనే యాగమంటపము కూడా సిద్ధమైనది. నడుమ ఎత్తుగానున్న యొక వేదిక. దానికి రెండు పక్కలా విశేషాతిథులు , ఎదురుగా విద్వాంసులు , వెనుక అంతా రాజకాంతలు , చుట్టూరా ప్రేక్షకులకు పొడుగాటి మెట్లు. ఇలాగ నిర్ణయింపబడి , భవ్యమైన , విశాలమైన ఎత్తైన మంటపము సిద్ధమయినది. గాలి , వానలనుండీ సభికులకు ఇబ్బంది కలుగకుండా పందిళ్ళూ , చుట్టూ గోడలూ భద్రముగా నున్నవి. 

          వైశాఖమాసపు వేళకు సత్రమునకు వచ్చు విద్వాంసుల నుండీ , దేశ విదేశాధిపతుల నుండీ ఉత్తరములు వచ్చినాయి. విద్వాంసులు సుమారు ఒక వేయి మంది వస్తున్నట్లు రాసినారు. వారితోపాటు తలా పది మంది శిష్యులు రావచ్చునని వారికోసము విశాలమైన  వసతులు నిర్మాణమయినవి. పది మంది దొరలు వస్తున్నట్లు రాసినారు. వారినందరినీ నగరములో నున్న భవనములలో దింపవలెనని నిర్ణయించినారు. 

         వర్తకులు రాజ సహాయముతో ధాన్యాదులను నింపిపెట్టినారు. రాజాజ్ఞయని మిథిలా నగరపు చుట్టుపక్కల ఉన్న గ్రామసీమల లోని గొల్లలు పాలు , పెరుగు , నేయి వెన్నలు కావలసినంత జ్ఞాన నగరమునకు తెచ్చి ఇచ్చుటకు సిద్ధమైనారు. కావలసిన వారు , దేశములో నున్న , రాజభవనముల లోని ,  మందలనుండీ కావలసినన్ని ఆవులనూ , ఎనుములనూ తీసుకొని పోవచ్చునని యనుమతి యయ్యెను. 

          రాజాజ్ఞ ఒకటి మాత్రము అధికారులకు అర్థము కాలేదు. ఒక్కొక్క కడివెడు పాలనిచ్చు మొదటి లేదా రెండవ ఈత ఈనిన సుందరమైన ఒక వేయి గోవులను ఎంచుకొని వేరుగా పెట్టి ఉండవలెనని రాజాజ్ఞ. ఆ పశువులు ఎందుకన్నది ఎవరికీ తెలియదు. మంత్రిని అందరూ అడిగినారు. ఆతడు మహాస్వామినే నేరుగా అడిగినాడు. ఆ పశువులు రాజధానికి రెండు పయనముల దూరములో తృణోదక సమృద్ధమైనచోట విశ్రాంతి తీసుకొని ఉండవలెననీ , కావాలన్నపుడు రాజధానికి వచ్చుటకు సిద్ధముగా ఉండవలెననీ చెప్పి , " స్పష్టమగ్రే భవిష్యతి--ఎందుకు తొందర పడుతారు ? " అని ఊరకున్నాడు. మంత్రి ఇక ముందుకు మాట్లాడ లేక పోయినాడు. 

రాజు ఇల్లు కట్టు మేస్త్రీని  పిలిచినాడు. " ఏమయ్యా , వేయి గోవులున్న మందలో ఎన్ని ఆంబోతులుండ వలెను ? " అని అడిగినాడు. 

" ఇరవై అయిదు చాలు మహాస్వామీ " 

" మన ఆస్థానములో ఆ ఏనుగుల వంటి ఆంబోతులున్నాయి కదా , వాటిలో వయసులో ఉన్న ఒక ఇరవై అయిదు ఎంచుకొని ఉండండి. మేము కావాలన్నపుడు అవి దానమునకు సిద్ధముగా ఉండవలెను. " 

" సరే , మహా స్వామీ " 

         " వేయి గోవులనూ , ఈ ఆంబోతులనూ కట్టుటకు కావలసిన స్తలమెంత ? వాటిని ఇరుకు లేకుండా కట్టవలెను. వాటికి కావలసినంత మేత, కాయుటకు మనుషులు , పితుకుటకు పాత్రలు , మొదలైన సర్వమూ నికరముగా నిర్ణయించే లెక్కలూ , కట్టడమునకు కావలసిన నమూనాలు , చిత్రపటములు , చివరికి రాయి , మట్టి మొదలుకొని సర్వమూ సిద్ధముగా ఉండనీ. దానిని ఎనిమిది దినములలో కట్టి ముగించవలెను. దానికీ మనుషులు సిద్ధముగా ఉండవలెను. "

        " ఒక వేయి గోవులు , వాటి దూడలు , ఆంబోతులు వాటికి కావలసిన గింజలు , తౌడు , చెక్క,  గడ్డివాములకు స్తలము , వాటిని కట్టుటకు గూటములు , రాటలు , వాటి సేవకు కావలసిన మనుషులు , వారికి ఇండ్లు ,  ఇవన్నీ కావలెనని మహాస్వామి వారి అభిప్రాయము కదా ?  

" ఔను "

" సరే , సిద్ధపరచెదను " మేస్త్రీ నమస్కారము చేసి వెళ్ళిపోయినాడు. 

        అపరాహ్ణము గడచింది. పొద్దు వాలజొచ్చింది. రాజ భవనములో విద్వాంసుల గోష్ఠిలో రాజు వేద వ్యాఖ్యానము , మను వ్యాఖ్యానములను పరిశీలిస్తూ కూర్చున్నాడు. ద్వారపాలకుడు వచ్చి వంగి నమస్కరించి , " భగవతి గార్గి వచ్చినారు " అని తెలియజేసినాడు. రాజు ప్రకటముగా సంతోషపడుతూ , " దేవి గార్గి వారా , పిలుచుకొని రా " అని లేచినాడు. మిగిలిన వారంతా లేచి నిలుచున్నారు. 

         గార్గి వచ్చినది. ఆమె వెనుక ఇద్దరు ఆడవారు. ఒకరి చేతిలో గంగాజలముతో నిండిన ఒక బిందె. ఇంకొకరి చేతిలో ఒక భారీ పళ్ళెము. దానిలో వేరే వేరే క్షేత్రముల నుండీ తెచ్చిన ప్రసాదములు. గార్గి వచ్చి విద్వాంసులకు సాష్టాంగ నమస్కారము చేసి , రాజుగారికి ఆశీర్వాద పూర్వకముగా తన రాజ మర్యాదనూ , కానుకలనూ సమర్పించినది. అలాగే , అక్కడున్న ఒక పీట మీద గంగా కుంభమునూ , ప్రసాదములనూ దింపి , " మహా స్వామివారు ఇవన్నిటినీ పరిగ్రహించ వలెను" అన్నది. 

" వెళ్ళిన వారంతా క్షేమముగా తిరిగి వచ్చినారు కదా ? ఎప్పుడు వచ్చినారు ? " దొర విచారించినాడు. 

        గార్గి మందస్మితముతో ఉత్తరమిచ్చినది. " వెళ్ళిన వారు ఎవరెవరు ? మేమంతా ఒక పిడికెడు మందిమి. మాతో పాటూ ఆశ్రమపు వృద్ధ శిష్యులు కొందరు. కింకరులు కొందరు. వెళ్ళిన వారమంతా మహాస్వామి వారి కృప వలన తాగిన నీరు కదలకుండానే , తల వెంట్రుకలు చెదరకుండానే క్షేమముగా తిరిగి వచ్చినాము. భార్గవులు మార్గాయాసముతో బడలినారు. కాబట్టి వారు రేపటి దినము దర్శించు కుంటారు. దేవరాత దంపతులూ , భగవానులూ సన్నిధానములో అనుజ్ఞ అయినపుడు వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. " 

         " భార్గవులు మన వారు. దేవరాత దంపతులు వారికి అనుకూల మైనపుడు రావచ్చును. భగవానులు వచ్చినది ఇప్పుడు తమరి వలన తెలిసినది. మనమే వెళ్ళివద్దాము . కావచ్చునా ? "

          " నాకు తమరి మాట విని గంగా స్నానము చేసినంత సంతోషమయినది. న్యాయము. భగవానులు నిజముగనే ఎంతో పై మెట్టువారు. వారిని ఇక్కడికి పిలిపించుకోవడము కన్నా తమరే అక్కడికి వెళ్ళి దర్శనము చేసి వచ్చుట వలన దేశమునకే క్షేమము. " 

        " చూడండి, భగవతీ వారే ఇలాగన్న తరువాత ఇక మేమే మనగలము ? " అని దొర విద్వాంసులను చూచినాడు. " తమలో తొందర ఉన్నవారు వెళ్ళి రావచ్చును. మాకు వీరి దర్శనమై సుమారు మూడు నెలలయినది. ఈమె మా గురు పుత్రి. కాబట్టి మేము ఒక ఇంటి వారము. సుఖ దుఃఖములను చెప్పుకోనిదే మనసుకు తృప్తి కాదు. అందువలన మేము కొంతసేపు దీర్ఘముగా కూర్చోవలెను. " అన్నాడు. 

గార్గి , రాజు అనుజ్ఞ ప్రకారము ఆసనమును పరిగ్రహించినది. రాజుకూడా కూర్చున్నాడు. విద్వాంసులలో ఉన్నవారంతా గ్రంధములను కట్టుకొని కూర్చున్నారు. 

          గోష్టి ఆరంభమయినది. రాజు ప్రార్థన మేరకు గార్గి తాము వెళ్ళి వచ్చిన క్షేత్రముల విషయమై వివరాలన్నీ చెప్పినది : " రాజా , ఇక విషయము : మేము గంగా , భాగీరథీ , దేవలోకము నుండీ వచ్చినది , శివ జటాజూటము నుండీ కిందకు దిగివచ్చినది  అని అంటాము. కానీ గంగ తారక ( తరింపజేయునది ) ఎలాగ అనునది మాత్రము చూడలేము. ఈ సారి వెళ్ళినపుడు అదంతా తెలిసింది. " 

" మేము కూడా పావనమయ్యెదము, అదంతా అనుజ్ఞ ఇవ్వండి. "

         " చూడండి, ఈ బ్రహ్మాండ మనెడు భాండము చుట్టూ దివ్యోదకముంది. వెనుక వామనుడు త్రివిక్రముడయినపుడు, ఆతని కాలి వేళ్ళు తగిలి బ్రహ్మాండము పగిలింది. దివ్యోదకము లోపలికి దూకింది. అంతలో బ్రహ్మ వచ్చి ఆ దివ్యోదకమును తన కమండలములో సంగ్రహించుకొని ఆ రంధ్రమును మూసి , ఆ స్వామి పాదమును పూజించి వెళ్ళినాడు. ఆ దివ్యోదకమే గంగ. విష్ణు పాదోద్భవమై , బ్రహ్మ కమండలములో ఉన్న గంగను తెచ్చి తన పితరులను ఉద్ధారము చేయవలెనని బ్రహ్మను గూర్చి సూర్య వంశపు భగీరథుడు తపస్సు చేసినాడు. బ్రహ్మ ప్రసన్నుడై , " పైనుండీ కిందకు దిగు గంగ మరలా బ్రహ్మాండమును వదలివేయునో ఏమో ? ఆమె దిగునపుడు ఆ రభసను తట్టుకొనుటకు శంకరుడొక్కడే సమర్థుడు. ఆతనిని ప్రార్థించు. అతడు ఔనంటే నేను గంగను ఇస్తాను. " అని అనుమతి నిచ్చినాడు. అదేవిధముగా భగీరథుడు శంకరుని ప్రార్థించినాడు. ఆతడు గంగను తలపై ధరించినాడు. అనంతరము అతడు వదలిన గంగ భగీరథుని వెనుక వెళ్ళి , సాగరమును నింపి , పాతాళమునకు వెళ్ళి ఆతని పితరుల బూడిదను కడిగి ఉద్ధరించినది. ఈ కథ మనకు తెలిసిననూ , గంగ త్రిమూర్తులకు సంబంధించినదని మనోగతము కాలేదు, ఒకటాయెనా ? " ఇంకొకటి వినండి.

          " ఈ గంగా స్నానము చేస్తే పాపములన్నీ తొలగి పోతాయి అంటాము. ఎలాగన్నది మాత్రము తెలియదు. నేను ఈ ప్రశ్నను అడిగితిని. భగవానులు పెద్ద మనసుతో గంగా స్నానము చేసిన ఏమగునో వివరించినారు. "

భగవానులు చెప్పినారు అనగానే అందరూ ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నారు.

         " మన దేహములో అన్నమయాది పంచ కోశములున్నవి. వాటిలో ఒక్కొక్కదానిలో ఒక్కొక్క రకమైన పాపము సేకరింప బడుతుంది. గంగా స్నానము చేస్తే ఈ ఐదు కోశముల పాపమూ క్షయమవుతుంది. అవి ( కోశములు ) పరిపూర్ణత చెందుటకు అనుకూల మవుతుంది. "

" మన విదగ్ధులు ఎంత పుణ్యము చేసినారో ? వారికి గంగా స్నానము అప్పుడపుడు లభిస్తుంది ! "

         " నిజము. అయితే శాస్త్రము ఇంకొకటి చెప్పింది. విద్యా సంపన్నులు చేయు కార్యము విద్యా విహీనులు చేయు కార్యమున కన్నా శ్రేష్ఠము. ఈ దృష్టితో చూసినపుడు విదగ్ధులకు గంగా స్నానఫలము ఎంతవరకూ లభిస్తుందో చెప్పుటకు కాదు. "

" అదేమిటి ? మీరు ఇలాగంటున్నారు ? " 

          " ఔను , రాజా , మనమందరమూ నోటితో బ్రహ్మమును చెప్పుతూ నానిన రాళ్ళవలె ఉండువారము. మనము మాట తెలిసిన వారము , అయితే బ్రహ్మమును చూడలేని వారము. వానలో రాయి నానుతూ చల్లగా అవుతుంది. కానీ నేల వలె నీరు తాగుతుందా ? మనము  నేల వలెనే ఉండ వలెను. రాయి మట్టి కావలెను. ఆ మట్టి ఇసుకగా కాకుండా మృదువైన వెన్నవంటి మట్టి కావలెను. అప్పుడు దానిలో ఏమి విత్తిననూ పెరిగి పంట అగును. బహుశః మనమింకా రాతి ఘట్టము దాటినామో లేదో ? " 

గార్గి కనులు చెమర్చినాయి. విన్నవారు ఒకరి ముఖము నొకరు చూసుకున్నారు. రాజు అడిగినాడు , " అయితే ఇప్పుడైన గంగా స్నానము మీకు ఫలకారి అయినదా ? " 

         " అయినదని నా భావన. మొదట ’ నాకు తెలుసు , నాకన్నా ఇంక ఎవరూ తెలిసినవారు లేరు ’ అన్న అహంకారము నాలో నిండిపోయి ఉండినది. భగవానుల ఉపనిషత్తు శ్రవణమైనపుడు సందేహము వచ్చింది. ఈ యాత్రకు వెళ్ళి వచ్చినతరువాత ’ నాకు శబ్దములు , వట్టి వాక్కు మాత్రము తెలుసు. అర్థము ఇంకా మనసుకు తెలియలేదు ’ అని తెలిసింది. ఆ మాటను స్పష్టముగా  చెప్పు ధైర్యమూ వచ్చింది. అది వదిలేయండి , తమరి జ్ఞాన సత్రపు మాట చెప్పండి. " 

         రాజు అన్య మనస్కుడైనాడు. అలాగయితే నేను పూర్ణవిద్య పొందుటకు ముందే వెళ్ళి గంగా స్నానము చేయవలెను. పరిశుద్ధుడను కావలెను. అది కావలెనన్న, గంగాదేవీ దర్శనమునకు వెళ్ళుటకన్నా ముందే భగవానుల దర్శనము చేసి వారి అనుమతి పొంది వెళ్ళవలెను ’ అని చింతిస్తున్నాడు. గార్గి ఏదో చెప్పినదని , ’ ఆ! ఏమిటి ? " అన్నాడు. 

గార్గి నవ్వుతూ , " తమరి జ్ఞానసత్రము ఎంతవరకూ వచ్చింది ? అని అడిగితిని " అన్నది. 

         రాజు కూడా నవ్వుతూ , " అదా , వినండి " అని తనకు ఆరోజు రాత్రి జరిగినది , కలలో దేవగురువు నిక్షేపము సంగతి చెప్పినది , సర్వజ్ఞుడు గెలుచును అన్నది , మేము నీ వెనుక ఉన్నాము , నమ్మి ధైర్యముగా వర్తించు అన్నది , మరుదినము నిక్షేపము దొరికినది , అంతా చెప్పినాడు. అలాగే , దేశ విదేశముల నుండీ విద్వాంసులూ , తమ తమ విద్వాంసులతో పాటూ దేశాధిపతులూ వచ్చెదమని రాసినదీ చెప్పినాడు. అటులే కాలువ , చెరువు మొదలగు విషయములన్నీ చెప్పి , " రేపు మేము వెళ్ళునపుడు మాతో పాటు రండి. అన్నీ చూచి రావచ్చును " అన్నాడు. 

" తమరు గుర్రము పైన వెళ్ళెదరేమో ? "

        " రేపు అశ్వరథములో వెళ్ళిన సరి. అది సరే , మాలో ఒక మార్పు అయినది తెలుసా ? నిక్షేపము దొరికిన దినము నుండీ ఈ ప్రపంచమునకు కర్తలు ఎవరో ఉన్నట్టు , మేము వారి సర్వాధికారులై ఇక్కడ ఉన్నట్టు తోచుచున్నది. ఇప్పుడు రాచకార్యమంతా ఉదయము మాత్రమే. మధ్యాహ్నపు విశ్రాంతి లో జపము చేయవలెను. నిద్రపోరాదు అనిపిస్తుంది. అదింకా సాధించలేదు. అపరాహ్ణములో ఈ విద్వాంసులను కూర్చోబెట్టుకొని వెనుక చూచిన వేద శాస్త్రాదుల నన్నిటినీ పునర్విమర్శ చేస్తున్నాను. " 

          " చాలా సంతోషము. తమరు చేస్తున్నది కాలపు సద్వినియోగము. తమరికి నేను మొదటే ఈ మాట చెప్పలేదు, తమరికి ఇప్పుడిప్పుడే మనసు పక్వమగుతున్నది. జ్ఞాన సత్రమును ముగించి , నాకైన సర్వజ్ఞ దర్శనము తమకూ కావలెను. ఆ తరువాత ఏమేమవుతుందో చూచెదము. " 

" తమరికి సర్వజ్ఞ దర్శనమయినదా ? "

" అయింది , అంతే కాదు, వారు దయతో , ’ ప్రతిఒక్కరూ సర్వజ్ఞులు కావచ్చును. సర్వజ్ఞ బీజము అందరిలోనూ ఉంది. అయితే అది ఎవరికీ రుచించదు ’ అని కూడా చెప్పినారు "

" ఎవరా సర్వజ్ఞులు ? "

" ఎవరేమిటి , భగవానులు " 

రాజు అదివిని అవాక్కైనాడు. 

         గార్గి ప్రశ్న వచ్చినట్టు , ఉత్తరముగా అన్నది : " ఒకడు దేనిని ఎంచుకుంటారు అన్నదాని మీద అంతా ఆధారపడి ఉంది. కాల దేశముల వలన పరిమితములైన దేనిని కోరిననూ అదంతా కామము. కామము మనసులో బలముగా ఉన్నంత వరకూ సర్వజ్ఞ బీజము మొలకెత్తదు. కాల దేశముల బయట ఉన్న పూర్ణమును కోరినట్లయితే , అది మొలకెత్తును. వీటన్నిటికన్నా అది గొప్పదని నమ్మి అటు తిరిగినపుడు అది మొక్క అగును. పెరిగేకొద్దీ అది వీటిని తినుటకు మొదలగును. వీటిని అంటే , ఈ దృశ్యమును అది సంపూర్ణముగా ఆవరించినపుడు మనసు సర్వజ్ఞమగును. అయితే , అది అయినపుడు, మనసు వాక్కులో , వాక్కు మనసులో ప్రతిష్ఠితమై, మానవుడు మూగవాడై అంతర్ముఖుడగును. అంతటివాడు ఇతరుల అనుగ్రహార్థము ఏదైనా చెప్పబూనితే అప్పుడు అతని మనసు నుండీ వచ్చు వృత్తి సగర్భముగా వచ్చును. అప్పుడు తత్త్వ జ్ఞానమగును. అప్పుడు అతడికి ముందర బ్రహ్మ , వెనుక బ్రహ్మ , పైన బ్రహ్మ , కింద బ్రహ్మ , ఎడమకు బ్రహ్మ , కుడికి బ్రహ్మ అయి , సముద్రములో మునిగినవానికి అంతటా నీరే అయిఉన్నట్లు , అంతటా బ్రహ్మమే అగును. "

"
" అయితే , సర్వజ్ఞుని సాంగత్యము వలన మీరుకూడా సర్వజ్ఞురాలైనారు. " 

         " సర్వజ్ఞురాలిని కాలేదు , సర్వజ్ఞురాల నగుట సాధ్యమని కనుక్కున్నాను. ఇంక ఆమాటలు వదిలేయండి , నాకు ఆ వృత్తి వస్తే , ఒంటిపై స్పృహ ఉండదు. ఇంటికి వెళ్ళునదే కష్టమవుతుంది. " 

          " సరే , దేవరాతులకు చెప్పండి , వారు ఇక్కడికి వచ్చి మమ్ములను చూడనవసరము లేదు , మరునాడు మేము భగవానుల దర్శనమునకు వెళ్ళెదము. వారూ కొడుకుతో పాటు దర్శనమిచ్చి ఆశీర్వదించనీ . " 

" అటులనే "

        " మేము మిత పరివారముతో ఉష్ట్ర రథములో వెళ్ళి , భగవానులను దర్శించి , గంగా స్నానమునకు వెళ్ళి వచ్చెదము. మాతో పాటు వచ్చు వారుంటే రావచ్చును. "

రాజుతో పాటు ఉన్న పదిమందిలో ఒక్కరు కూడా వస్తామనలేదు. రాజూ , గార్గీ ఒకరి ముఖమునొకరు చూచుకొని నవ్వినారు. 

         రాజు , " తమకు దారి వెచ్చమున కిచ్చిన సువర్ణములు సరిపోయినవా ? " అని అడిగినాడు. ఆమె , " సరిపోయినవి. చాలకున్ననూ మా గుంపు వారిని అక్కడ అడిగేవారెవరూ లేరు " అని నమ్మకముగా చెప్పింది . 

No comments:

Post a Comment