SHARE

Friday, March 1, 2013

50. " మహాదర్శనము "--యాభైయవ భాగము--కీర్తి వ్యాపించినది


50.  యాభైయవ భాగము--- కీర్తి వ్యాపించినది


" మిథిలలో బ్రహ్మర్షి యొకడు పుట్టి యున్నాడంట ! " 

" మిథిలా నగరపు జనక మహారాజు విద్వాంసులకు కావలసినదంతా ఇస్తున్నది సార్థకమైనది "  

" విద్య ఎంతైనా కురు పాంచాలుల సొత్తు యనునది ముగిసింది " 

" ఏదో మద్ర వారూ , కాశీ వారూ విద్వాంసులు అయితే కావచ్చును అనుకున్నాము , ఇప్పుడు మిథిల వారు కూడా తలెత్తుకొని తిరుగునట్లాయెను . " 

"  మిథిలలో కూడా మహర్షి కల్పులూ , ఋషి కల్పులు ఉన్నారు , లేరనుటకు లేదు , ఎందుకు ?  ఋషి దేవరాతుడుండలేదా ? " 

"అలా అనవద్దు , మహర్షి వైశంపాయనులు తక్కువ వారా ? ఆ ఉద్ధాలక మహర్షులు మాత్రము సామాన్యులా ? "  

        " సరేలే వయ్యా , బ్రహ్మర్షి పుట్టవలెనంటే ఊరకే అవుతుందా ? కర్మ కాండ , బ్రహ్మ కాండ సిద్ధాంతములు రెండూ అనుభవ పూర్వకముగా తెలిసినవాడై , శిష్యులకు కూడా ఇదమిత్థం  ఇది ఇలాగ అని బోధించు వాడు కావలెను . అంతటివాడు పుట్టినాడంటే జగత్తు యొక్క అదృష్టమనవలెను . " 

          " నువ్వు చెప్పేదెవరి గురించి ? యాజ్ఞవల్క్యుడి గురించే కదా ? నాకు తెలుసు , విను : ఎన్నో సంవత్సరముల కిందటే వైశంపాయనులు అతడిని తమ ఆశ్రమము నుండీ వెడలగొట్టినారు . అంతటివారు ఇప్పుడు బ్రహ్మర్షి యైనారంటే ఏమి చెప్పేది ? ఊరికే ఉండవయ్యా ! " 

" అటుల కాదయ్యా , అతడికి అభ్యూహన మంత్ర సిద్ధి అయినదట. ఆ తరువాతే  వైశంపాయనుల ప్రసక్తి . " 

          " ఏమైనా చెప్పు , మేము ఏదీ చూడకుండా దేనినీ నమ్మము . నువ్వు చెప్పినదాని కన్నా ఎక్కువగా నాకు తెలుసు , అయినా నేను నీకన్నా ఎక్కువగా ప్రత్యక్షమును నమ్మేవాడిని . " 

" సరే పద , వెళ్ళి చూసుకొని వద్దాము "  

       " స్వామీ , మా వల్ల కాదు , మేము సన్యాసులు కాదు , ఉంటే ఈ ఊరు లేస్తే పక్క ఊరు అనుటకు మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు . మేము ఎక్కడికైనా వెళ్ళ వలెనంటే ఇంటిలో అంతా సంపన్నముగా ఉంటే మాత్రమే సాధ్యము . కాబట్టి అనుకున్న వెంటనే సాధ్యము కాదు "   

        " కానీవయ్యా , ఇంకేమి మాఘాది పంచకము వచ్చింది . ఎక్కడ చూచినా యాగములవుచున్నవి . నిన్ను ఆర్త్విజ్యమునకు పిలవనే పిలుస్తారు . కర్మ ధర్మ సంయోగముంటే నేనూ వస్తాను . ఇద్దరం వెళ్ళి చూచుకొని వద్దాము ."" 

        " అలాగయిన సరే . ఈ యాజ్ఞవల్క్యుని విషయములో ఒకటి మాత్రము నిజము . అతడు అసంగ్రహి . ఎవరినుండీ ఒక గుడ్డి గవ్వను కూడా తీసుకోడంట. "  

" సరే , అతడిని ఎవరూ అధ్వర్యమునకు పిలవరా ఏమిటి ? "  

" పిలవకేమి ? కానీ అతడు వెళ్ళడట. "

          ఇలాగ పరి పరివిధములుగా బ్రాహ్మణుల సంపత్తు చేరిన ప్రతిచోటా యాజ్ఞవల్క్యుని వృత్తాంతము తప్పక వచ్చును . నూరు మందిలో ఒక్కొక్కరు అతడి యోగ్యత విషయములో సందేహ పడుతారు . అదేమో ఎందుకో ఉద్ధాలకుల వద్ద యాజ్ఞవల్క్యుడు ఉండి బ్రహ్మోపాసన చేసినదానిని ఎవరూ మాట్లాడరు . కానీ వైశంపాయనుని వద్ద అతడుండి వచ్చినదీ , మరలా ఎలాగెలాగో బ్రహ్మర్షి యైనది మాత్రము అందరి నోటిలోనూ వస్తుంది . 

          ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ప్రాతః కర్మలన్నీ ముగిసిన తరువాత సూర్యోపాసనను ముగించి గుడిసెలో కూర్చొని వస్తూ ఉంటాడు . కాత్యాయని  ఒకతే అతనికి నీడలా ఉండి సేవ చేయును . భూర్జ పత్రములను తెచ్చి , వాటిని సరిగ్గా కత్తరించి ,ఈనెలు తీసి ,  బాగా కడిగి, నానవేసి , ఉంచుట ఆమె దైనందిన కార్యములలో ఒకటి . అప్పుడప్పుడు ఆలంబిని వచ్చి కొడుకును చూచి వెళ్ళేది . ఆమెకు కొడుకు ముఖములో తేజస్సు నిండియుండుట చూసి చాలా సంతోషము . 

          అదేమో ఈ వర్షము ఆచార్య దేవరాతునికి విరామమే లేదు . కొడుకు ద్వారా ఆదిత్యుడు లోకానికి వేరే వేదమును అనుగ్రహించినది అతడికి తెలుసు . ఒక దినము కూర్చొని , తమ వేదమునకూ , ఆ కొత్త వేదమునకూ గల వ్యత్యాసమేమిటో చూడాలన్న కుతూహలము అతనికి పెరిగిపోయింది . కానీ దానికి కావలసిన వ్యవధానము లేదు . 

         ఎలాగో ఆచార్యుడు ఒకరోజు వీలు చేసుకొని కొడుకును వెతుక్కొని వచ్చినాడు . గుడిసెలో కొడుకు పద్మాసనము వేసుకొని కూర్చొని రాస్తూ ఉన్నాడు . అతడికి ఒంటిమీద స్పృహలేనట్టు కూర్చొని రాస్తున్నాడు . చేతనున్న ఘంటము, రాస్తున్న భూర్జ పత్రము తప్ప , ఇంకొక దాని గమనమే లేకుండా రాస్తున్న అతని ముందు ఇంకొక ఘడియ అలాగే నిలుచొన్నాడు . దేవరాతుడు కట్టుకున్న గంజిపెట్టి ఉతికిన తెల్లటి గరగరలాడే ధోవతి ఆ గుడిసెలో కాంతి పెంచుతూ గాలికి సన్నగా సవ్వడి చేస్తున్నా యాజ్ఞవల్క్యునికి గమనమే లేదు . 

         అది చూచి ఆచార్యుడు వచ్చి భార్యతో , " నీ కొడుకు  రాయుటలో మునిగియున్నాడు . తానుగా మనలను పిలుచు వరకూ మనము వెళ్ళరాదు . ఈ దినము కాత్యాయని  కూడా అక్కడ లేదు . ఆమె ఎక్కడ ? " అన్నాడు .

       "  ఆమె బహుశః చెరువు దగ్గరకు వెళ్ళిఉండవచ్చు . అదేం మాయో , ఇక్కడి పనంతా  ఒక్క ఘడియలోనే పూర్తి చేసి గుడిసెకు పరుగెత్తి పోతుంది . అది చూసి నాకూ సంతోషమే . నాకేమో అడ్డు చెప్పుటకు మనసు రాదు . " 

          " వద్దు , వద్దు . అడ్డువెళ్ళవద్దు . అయినా ఆమె ఇప్పటినుండే భర్త సేవ చేసుకోవడమే కదా మనకు కావలసినది ?  అది సరే , నేనిక్కడికి వచ్చినది ఇది చెప్పాలని : మననుండీ వాడికి ఇబ్బంది కలుగకుండా చూసుకో . మనము పెద్దలము అక్కడికి వెళితే , వాడు చేస్తున్న పనిని వదలి మనవైపుకు తిరగవలెను . అలాగ తిరిగితే వాడి పనికి చేటు . ఇది చెప్పడానికే వచ్చినాను . " 

        " మొన్న వెళ్ళినాను . ’ ఇంకా కొంచము మిగిలిందమ్మా . అదవగానే వారికి చూపవలెను. వారు ఒప్పుకున్న తర్వాతే మిగతా మాటలు ’ అన్నాడు . ’ మిగతా మాటలు అంటే ఏమి ? ’ అన్నాను . ’ తండ్రిగారి అనుమతి అయితే ఒకసారి గురువులకు చూపించవలెను . కానీ వారు-’ ఏమీ ?  నీ వేదము లేకపోతే నాకు వేరే గతిలేదా ? చూడండి , కొత్త వేదాన్నే తెచ్చినాను - అని జంభము చూపించుటకు వచ్చినావా ? ’ అంటే ? అని దిగులు . కాబట్టి ఆ విషయములో తండ్రిగారు చెప్పినట్లే చేయవలెనని అనుకున్నాను ’ అన్నాడు " 

         " వాడు చెప్పినది సాధువుగా ఉంది. అయితే వైశంపాయనులు వాడి విషయములో అలాగ అనరు . అదేకాదు , వీడికి కొత్త వేదము వచ్చినది కూడా వారికి తెలుసు . వీడికి కొత్త వేదమును అనుగ్రహించిన ఆదిత్య దేవుడే వారికి కూడా దర్శనమిచ్చి, ’ ఆచార్యా , నీ దయ వలన జగత్కార్యము ఈనాడు నెరవేరినది . నీ శిష్యునికి ఈ నాడు వేదమును దేవతలు నా ద్వారా ఇచ్చినారు . ఇప్పుడు అతడు దానిని రాస్తున్నాడు .  అదయిన తరువాత నీ వద్దకు పంపిస్తాము . నువ్వు చూచి ఒప్పుకుంటే , ఆ తర్వాతే మిగిలిన మాటలు ’. అని అన్నాడట. ఈ పూట సమయము దొరికితే నేనే ఈ మాటను చెప్పేవాడిని . నువ్వు అవకాశము చూసి వాడికా మాట చెప్పు . ఏమైనా సరే , అందరూ అదేమిటో , ఎందుకో , యాజ్ఞవల్క్యుని బ్రహ్మర్షి అంటున్నారు . వారి మాటే నిజము కానీ అని నేను రాత్రీ పగలూ ఆకాంక్షిస్తున్నాను . సరే , ఇదంతా ఉండనీ , కాత్యాయని  వెళితే ఆడది వచ్చింది అని ఏమీ ఆరాటము లేదు కదా ? "

          " దైవము అలాగ జరగ నివ్వలేదు అనవలెను . పోయిన వర్షము భర్త ఆదిత్య వ్రతములో ఉన్నాడని ఆమె నియమములో ఉన్నది కదా ! అప్పటినుండి వాడికి ఆమెమీద మమత కావలసినంత ఉంది . అయినా మీరేమీ అనుకోవద్దు. వాడు పదిమంది లాగా సంసారమును లంపటముతో నడిపించువాడు కాదనే నా భావన. ఏదో సంత వేళకు మూడు మూరలు బట్ట నేస్తే చాలు అనుకునే వాడు . వాడికింకా నా యిల్లు , నా వాకిలి అన్న లంపటమే లేదు . " 

        " చూడు , మనకు వేరే పిల్లలు లేరు . ఇంట్లో అంతా సమృద్ధిగా ఉంది . కూర్చొని తిన్నా ఇంకా ఒక పది సంవత్సరాలకు మోసము లేదు . ఇప్పుడు వీడికి అప్పుడే నాకన్నా ఎక్కువ కీర్తి వచ్చింది . వీడు రానన్ననూ పట్టుకొని వెళ్ళి యజ్ఞ యాగములు చేయించని వారే లేరు . అన్నిటికన్నా మిన్నగా వీడు కొత్త వేదమును తెచ్చినవాడు . వీడిపాలిటి దైవము వీడిని కాపాడక చేయి వదలదు . ఇప్పటికి చేసుకున్న పెళ్ళాన్ని వదలక ఇంట్లో దీపము పెట్టుకుంటూ ఉంటే చాలు . " 

         " వాడు ధర్మ పరాయణుడు. కాబట్టి పెళ్ళాం విషయములో దిగులు పడనవసరము లేదు . అదీకాక, మీరు చెప్పినట్లు వాడి దేవతలు వాడి చేయి వదలరు . కానీ వాడు మీవలె కాదు . మీకు ఇంటి విషయములో ఉన్న అక్కర వాడికి లేదు అన్నాను , అంతే ! " 

          " అయితే ఒక్కొక్కసారి వాడి తేజస్సు కన్నులతో చూచుటకు కాదు . మండే సూర్యుడే దిగివచ్చి వాడిలో వెలసినాడా యేమి,  అనిపిస్తుంది . అప్పుడంతా నాకు ఏదో ఆలోచన , మీకు తెలుసా , వీడేమైనా తానున్న చోటునే వేరే లోకముగా చేసేస్తాడేమో యని సందేహమవుతుంది . అయితే పక్కనే ఉన్న కాత్యాయనిని చూసి , " ఓహో , ఇదే లోకము , వేరే లోకముకాదు " అని సందేహ నివారణ అవుతుంది . అట్లే , బయట గుడిసె పక్కన  ఉన్న  అవే మొక్కలు , అవే చెట్లు , అదే చెరువు ఉండుట చూసి నేను వేరే లోకమునకు వెళ్ళలేదు అని నమ్మకము వస్తుంది ." 

         ఆచార్యుడు ఆ వివరణను విని నవ్వినాడు .: " భలే ఆలంబినీ , నువ్వు పురాణ ప్రవచనము చెప్పితే చాలా బాగా ఆకట్టుకుంటావు . అది సరే , సమయము చూసి వైశంపాయనుల వృత్తాంతము వాడికి చెప్పు " 

No comments:

Post a Comment