SHARE

Thursday, March 14, 2013

63. " మహాదర్శనము " --అరవై మూడవ భాగము --సర్వమూ సిద్ధము


63. అరవై మూడవ భాగము--  సర్వమూ సిద్ధము


          జ్ఞాన నగరపు నిర్మాణము శరవేగముతో సాగుతున్నది. మొదట నీరు సమృద్ధిగా ఉండవలెనని , గంగా నదియొక్క ఒక ఉపనదికి చిన్న అడ్డుకట్ట కట్టి అక్కడినుండీ ఒక కాలువను తెచ్చి విశాలమైన తటాకము నొకదానిని సృష్టి చేసి, దానికి కాలువను వదలినారు. జ్ఞానగరములో అక్కడక్కడా తులసి వనములు , పూదోటలు , నగర ఉపవనములలో తామర చెరువులు , ఎక్కువగా శ్రద్ధగా చేయబడి , విశేష కళాకాంతులతో శోభిల్లుతున్నాయి. అక్కడున్న మల్లికా , జాజి , మాలతి , కనకాంబరముల వంటి సుగంధమునిచ్చు పూల వాటికలు అతి చక్కగా పెంచబడినవై జ్యేష్ఠ మాసములో పూలతో క్రిక్కిరిసి పోయినాయి. 

          అటులనే యాగమంటపము కూడా సిద్ధమైనది. నడుమ ఎత్తుగానున్న యొక వేదిక. దానికి రెండు పక్కలా విశేషాతిథులు , ఎదురుగా విద్వాంసులు , వెనుక అంతా రాజకాంతలు , చుట్టూరా ప్రేక్షకులకు పొడుగాటి మెట్లు. ఇలాగ నిర్ణయింపబడి , భవ్యమైన , విశాలమైన ఎత్తైన మంటపము సిద్ధమయినది. గాలి , వానలనుండీ సభికులకు ఇబ్బంది కలుగకుండా పందిళ్ళూ , చుట్టూ గోడలూ భద్రముగా నున్నవి. 

          వైశాఖమాసపు వేళకు సత్రమునకు వచ్చు విద్వాంసుల నుండీ , దేశ విదేశాధిపతుల నుండీ ఉత్తరములు వచ్చినాయి. విద్వాంసులు సుమారు ఒక వేయి మంది వస్తున్నట్లు రాసినారు. వారితోపాటు తలా పది మంది శిష్యులు రావచ్చునని వారికోసము విశాలమైన  వసతులు నిర్మాణమయినవి. పది మంది దొరలు వస్తున్నట్లు రాసినారు. వారినందరినీ నగరములో నున్న భవనములలో దింపవలెనని నిర్ణయించినారు. 

         వర్తకులు రాజ సహాయముతో ధాన్యాదులను నింపిపెట్టినారు. రాజాజ్ఞయని మిథిలా నగరపు చుట్టుపక్కల ఉన్న గ్రామసీమల లోని గొల్లలు పాలు , పెరుగు , నేయి వెన్నలు కావలసినంత జ్ఞాన నగరమునకు తెచ్చి ఇచ్చుటకు సిద్ధమైనారు. కావలసిన వారు , దేశములో నున్న , రాజభవనముల లోని ,  మందలనుండీ కావలసినన్ని ఆవులనూ , ఎనుములనూ తీసుకొని పోవచ్చునని యనుమతి యయ్యెను. 

          రాజాజ్ఞ ఒకటి మాత్రము అధికారులకు అర్థము కాలేదు. ఒక్కొక్క కడివెడు పాలనిచ్చు మొదటి లేదా రెండవ ఈత ఈనిన సుందరమైన ఒక వేయి గోవులను ఎంచుకొని వేరుగా పెట్టి ఉండవలెనని రాజాజ్ఞ. ఆ పశువులు ఎందుకన్నది ఎవరికీ తెలియదు. మంత్రిని అందరూ అడిగినారు. ఆతడు మహాస్వామినే నేరుగా అడిగినాడు. ఆ పశువులు రాజధానికి రెండు పయనముల దూరములో తృణోదక సమృద్ధమైనచోట విశ్రాంతి తీసుకొని ఉండవలెననీ , కావాలన్నపుడు రాజధానికి వచ్చుటకు సిద్ధముగా ఉండవలెననీ చెప్పి , " స్పష్టమగ్రే భవిష్యతి--ఎందుకు తొందర పడుతారు ? " అని ఊరకున్నాడు. మంత్రి ఇక ముందుకు మాట్లాడ లేక పోయినాడు. 

రాజు ఇల్లు కట్టు మేస్త్రీని  పిలిచినాడు. " ఏమయ్యా , వేయి గోవులున్న మందలో ఎన్ని ఆంబోతులుండ వలెను ? " అని అడిగినాడు. 

" ఇరవై అయిదు చాలు మహాస్వామీ " 

" మన ఆస్థానములో ఆ ఏనుగుల వంటి ఆంబోతులున్నాయి కదా , వాటిలో వయసులో ఉన్న ఒక ఇరవై అయిదు ఎంచుకొని ఉండండి. మేము కావాలన్నపుడు అవి దానమునకు సిద్ధముగా ఉండవలెను. " 

" సరే , మహా స్వామీ " 

         " వేయి గోవులనూ , ఈ ఆంబోతులనూ కట్టుటకు కావలసిన స్తలమెంత ? వాటిని ఇరుకు లేకుండా కట్టవలెను. వాటికి కావలసినంత మేత, కాయుటకు మనుషులు , పితుకుటకు పాత్రలు , మొదలైన సర్వమూ నికరముగా నిర్ణయించే లెక్కలూ , కట్టడమునకు కావలసిన నమూనాలు , చిత్రపటములు , చివరికి రాయి , మట్టి మొదలుకొని సర్వమూ సిద్ధముగా ఉండనీ. దానిని ఎనిమిది దినములలో కట్టి ముగించవలెను. దానికీ మనుషులు సిద్ధముగా ఉండవలెను. "

        " ఒక వేయి గోవులు , వాటి దూడలు , ఆంబోతులు వాటికి కావలసిన గింజలు , తౌడు , చెక్క,  గడ్డివాములకు స్తలము , వాటిని కట్టుటకు గూటములు , రాటలు , వాటి సేవకు కావలసిన మనుషులు , వారికి ఇండ్లు ,  ఇవన్నీ కావలెనని మహాస్వామి వారి అభిప్రాయము కదా ?  

" ఔను "

" సరే , సిద్ధపరచెదను " మేస్త్రీ నమస్కారము చేసి వెళ్ళిపోయినాడు. 

        అపరాహ్ణము గడచింది. పొద్దు వాలజొచ్చింది. రాజ భవనములో విద్వాంసుల గోష్ఠిలో రాజు వేద వ్యాఖ్యానము , మను వ్యాఖ్యానములను పరిశీలిస్తూ కూర్చున్నాడు. ద్వారపాలకుడు వచ్చి వంగి నమస్కరించి , " భగవతి గార్గి వచ్చినారు " అని తెలియజేసినాడు. రాజు ప్రకటముగా సంతోషపడుతూ , " దేవి గార్గి వారా , పిలుచుకొని రా " అని లేచినాడు. మిగిలిన వారంతా లేచి నిలుచున్నారు. 

         గార్గి వచ్చినది. ఆమె వెనుక ఇద్దరు ఆడవారు. ఒకరి చేతిలో గంగాజలముతో నిండిన ఒక బిందె. ఇంకొకరి చేతిలో ఒక భారీ పళ్ళెము. దానిలో వేరే వేరే క్షేత్రముల నుండీ తెచ్చిన ప్రసాదములు. గార్గి వచ్చి విద్వాంసులకు సాష్టాంగ నమస్కారము చేసి , రాజుగారికి ఆశీర్వాద పూర్వకముగా తన రాజ మర్యాదనూ , కానుకలనూ సమర్పించినది. అలాగే , అక్కడున్న ఒక పీట మీద గంగా కుంభమునూ , ప్రసాదములనూ దింపి , " మహా స్వామివారు ఇవన్నిటినీ పరిగ్రహించ వలెను" అన్నది. 

" వెళ్ళిన వారంతా క్షేమముగా తిరిగి వచ్చినారు కదా ? ఎప్పుడు వచ్చినారు ? " దొర విచారించినాడు. 

        గార్గి మందస్మితముతో ఉత్తరమిచ్చినది. " వెళ్ళిన వారు ఎవరెవరు ? మేమంతా ఒక పిడికెడు మందిమి. మాతో పాటూ ఆశ్రమపు వృద్ధ శిష్యులు కొందరు. కింకరులు కొందరు. వెళ్ళిన వారమంతా మహాస్వామి వారి కృప వలన తాగిన నీరు కదలకుండానే , తల వెంట్రుకలు చెదరకుండానే క్షేమముగా తిరిగి వచ్చినాము. భార్గవులు మార్గాయాసముతో బడలినారు. కాబట్టి వారు రేపటి దినము దర్శించు కుంటారు. దేవరాత దంపతులూ , భగవానులూ సన్నిధానములో అనుజ్ఞ అయినపుడు వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. " 

         " భార్గవులు మన వారు. దేవరాత దంపతులు వారికి అనుకూల మైనపుడు రావచ్చును. భగవానులు వచ్చినది ఇప్పుడు తమరి వలన తెలిసినది. మనమే వెళ్ళివద్దాము . కావచ్చునా ? "

          " నాకు తమరి మాట విని గంగా స్నానము చేసినంత సంతోషమయినది. న్యాయము. భగవానులు నిజముగనే ఎంతో పై మెట్టువారు. వారిని ఇక్కడికి పిలిపించుకోవడము కన్నా తమరే అక్కడికి వెళ్ళి దర్శనము చేసి వచ్చుట వలన దేశమునకే క్షేమము. " 

        " చూడండి, భగవతీ వారే ఇలాగన్న తరువాత ఇక మేమే మనగలము ? " అని దొర విద్వాంసులను చూచినాడు. " తమలో తొందర ఉన్నవారు వెళ్ళి రావచ్చును. మాకు వీరి దర్శనమై సుమారు మూడు నెలలయినది. ఈమె మా గురు పుత్రి. కాబట్టి మేము ఒక ఇంటి వారము. సుఖ దుఃఖములను చెప్పుకోనిదే మనసుకు తృప్తి కాదు. అందువలన మేము కొంతసేపు దీర్ఘముగా కూర్చోవలెను. " అన్నాడు. 

గార్గి , రాజు అనుజ్ఞ ప్రకారము ఆసనమును పరిగ్రహించినది. రాజుకూడా కూర్చున్నాడు. విద్వాంసులలో ఉన్నవారంతా గ్రంధములను కట్టుకొని కూర్చున్నారు. 

          గోష్టి ఆరంభమయినది. రాజు ప్రార్థన మేరకు గార్గి తాము వెళ్ళి వచ్చిన క్షేత్రముల విషయమై వివరాలన్నీ చెప్పినది : " రాజా , ఇక విషయము : మేము గంగా , భాగీరథీ , దేవలోకము నుండీ వచ్చినది , శివ జటాజూటము నుండీ కిందకు దిగివచ్చినది  అని అంటాము. కానీ గంగ తారక ( తరింపజేయునది ) ఎలాగ అనునది మాత్రము చూడలేము. ఈ సారి వెళ్ళినపుడు అదంతా తెలిసింది. " 

" మేము కూడా పావనమయ్యెదము, అదంతా అనుజ్ఞ ఇవ్వండి. "

         " చూడండి, ఈ బ్రహ్మాండ మనెడు భాండము చుట్టూ దివ్యోదకముంది. వెనుక వామనుడు త్రివిక్రముడయినపుడు, ఆతని కాలి వేళ్ళు తగిలి బ్రహ్మాండము పగిలింది. దివ్యోదకము లోపలికి దూకింది. అంతలో బ్రహ్మ వచ్చి ఆ దివ్యోదకమును తన కమండలములో సంగ్రహించుకొని ఆ రంధ్రమును మూసి , ఆ స్వామి పాదమును పూజించి వెళ్ళినాడు. ఆ దివ్యోదకమే గంగ. విష్ణు పాదోద్భవమై , బ్రహ్మ కమండలములో ఉన్న గంగను తెచ్చి తన పితరులను ఉద్ధారము చేయవలెనని బ్రహ్మను గూర్చి సూర్య వంశపు భగీరథుడు తపస్సు చేసినాడు. బ్రహ్మ ప్రసన్నుడై , " పైనుండీ కిందకు దిగు గంగ మరలా బ్రహ్మాండమును వదలివేయునో ఏమో ? ఆమె దిగునపుడు ఆ రభసను తట్టుకొనుటకు శంకరుడొక్కడే సమర్థుడు. ఆతనిని ప్రార్థించు. అతడు ఔనంటే నేను గంగను ఇస్తాను. " అని అనుమతి నిచ్చినాడు. అదేవిధముగా భగీరథుడు శంకరుని ప్రార్థించినాడు. ఆతడు గంగను తలపై ధరించినాడు. అనంతరము అతడు వదలిన గంగ భగీరథుని వెనుక వెళ్ళి , సాగరమును నింపి , పాతాళమునకు వెళ్ళి ఆతని పితరుల బూడిదను కడిగి ఉద్ధరించినది. ఈ కథ మనకు తెలిసిననూ , గంగ త్రిమూర్తులకు సంబంధించినదని మనోగతము కాలేదు, ఒకటాయెనా ? " ఇంకొకటి వినండి.

          " ఈ గంగా స్నానము చేస్తే పాపములన్నీ తొలగి పోతాయి అంటాము. ఎలాగన్నది మాత్రము తెలియదు. నేను ఈ ప్రశ్నను అడిగితిని. భగవానులు పెద్ద మనసుతో గంగా స్నానము చేసిన ఏమగునో వివరించినారు. "

భగవానులు చెప్పినారు అనగానే అందరూ ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నారు.

         " మన దేహములో అన్నమయాది పంచ కోశములున్నవి. వాటిలో ఒక్కొక్కదానిలో ఒక్కొక్క రకమైన పాపము సేకరింప బడుతుంది. గంగా స్నానము చేస్తే ఈ ఐదు కోశముల పాపమూ క్షయమవుతుంది. అవి ( కోశములు ) పరిపూర్ణత చెందుటకు అనుకూల మవుతుంది. "

" మన విదగ్ధులు ఎంత పుణ్యము చేసినారో ? వారికి గంగా స్నానము అప్పుడపుడు లభిస్తుంది ! "

         " నిజము. అయితే శాస్త్రము ఇంకొకటి చెప్పింది. విద్యా సంపన్నులు చేయు కార్యము విద్యా విహీనులు చేయు కార్యమున కన్నా శ్రేష్ఠము. ఈ దృష్టితో చూసినపుడు విదగ్ధులకు గంగా స్నానఫలము ఎంతవరకూ లభిస్తుందో చెప్పుటకు కాదు. "

" అదేమిటి ? మీరు ఇలాగంటున్నారు ? " 

          " ఔను , రాజా , మనమందరమూ నోటితో బ్రహ్మమును చెప్పుతూ నానిన రాళ్ళవలె ఉండువారము. మనము మాట తెలిసిన వారము , అయితే బ్రహ్మమును చూడలేని వారము. వానలో రాయి నానుతూ చల్లగా అవుతుంది. కానీ నేల వలె నీరు తాగుతుందా ? మనము  నేల వలెనే ఉండ వలెను. రాయి మట్టి కావలెను. ఆ మట్టి ఇసుకగా కాకుండా మృదువైన వెన్నవంటి మట్టి కావలెను. అప్పుడు దానిలో ఏమి విత్తిననూ పెరిగి పంట అగును. బహుశః మనమింకా రాతి ఘట్టము దాటినామో లేదో ? " 

గార్గి కనులు చెమర్చినాయి. విన్నవారు ఒకరి ముఖము నొకరు చూసుకున్నారు. రాజు అడిగినాడు , " అయితే ఇప్పుడైన గంగా స్నానము మీకు ఫలకారి అయినదా ? " 

         " అయినదని నా భావన. మొదట ’ నాకు తెలుసు , నాకన్నా ఇంక ఎవరూ తెలిసినవారు లేరు ’ అన్న అహంకారము నాలో నిండిపోయి ఉండినది. భగవానుల ఉపనిషత్తు శ్రవణమైనపుడు సందేహము వచ్చింది. ఈ యాత్రకు వెళ్ళి వచ్చినతరువాత ’ నాకు శబ్దములు , వట్టి వాక్కు మాత్రము తెలుసు. అర్థము ఇంకా మనసుకు తెలియలేదు ’ అని తెలిసింది. ఆ మాటను స్పష్టముగా  చెప్పు ధైర్యమూ వచ్చింది. అది వదిలేయండి , తమరి జ్ఞాన సత్రపు మాట చెప్పండి. " 

         రాజు అన్య మనస్కుడైనాడు. అలాగయితే నేను పూర్ణవిద్య పొందుటకు ముందే వెళ్ళి గంగా స్నానము చేయవలెను. పరిశుద్ధుడను కావలెను. అది కావలెనన్న, గంగాదేవీ దర్శనమునకు వెళ్ళుటకన్నా ముందే భగవానుల దర్శనము చేసి వారి అనుమతి పొంది వెళ్ళవలెను ’ అని చింతిస్తున్నాడు. గార్గి ఏదో చెప్పినదని , ’ ఆ! ఏమిటి ? " అన్నాడు. 

గార్గి నవ్వుతూ , " తమరి జ్ఞానసత్రము ఎంతవరకూ వచ్చింది ? అని అడిగితిని " అన్నది. 

         రాజు కూడా నవ్వుతూ , " అదా , వినండి " అని తనకు ఆరోజు రాత్రి జరిగినది , కలలో దేవగురువు నిక్షేపము సంగతి చెప్పినది , సర్వజ్ఞుడు గెలుచును అన్నది , మేము నీ వెనుక ఉన్నాము , నమ్మి ధైర్యముగా వర్తించు అన్నది , మరుదినము నిక్షేపము దొరికినది , అంతా చెప్పినాడు. అలాగే , దేశ విదేశముల నుండీ విద్వాంసులూ , తమ తమ విద్వాంసులతో పాటూ దేశాధిపతులూ వచ్చెదమని రాసినదీ చెప్పినాడు. అటులే కాలువ , చెరువు మొదలగు విషయములన్నీ చెప్పి , " రేపు మేము వెళ్ళునపుడు మాతో పాటు రండి. అన్నీ చూచి రావచ్చును " అన్నాడు. 

" తమరు గుర్రము పైన వెళ్ళెదరేమో ? "

        " రేపు అశ్వరథములో వెళ్ళిన సరి. అది సరే , మాలో ఒక మార్పు అయినది తెలుసా ? నిక్షేపము దొరికిన దినము నుండీ ఈ ప్రపంచమునకు కర్తలు ఎవరో ఉన్నట్టు , మేము వారి సర్వాధికారులై ఇక్కడ ఉన్నట్టు తోచుచున్నది. ఇప్పుడు రాచకార్యమంతా ఉదయము మాత్రమే. మధ్యాహ్నపు విశ్రాంతి లో జపము చేయవలెను. నిద్రపోరాదు అనిపిస్తుంది. అదింకా సాధించలేదు. అపరాహ్ణములో ఈ విద్వాంసులను కూర్చోబెట్టుకొని వెనుక చూచిన వేద శాస్త్రాదుల నన్నిటినీ పునర్విమర్శ చేస్తున్నాను. " 

          " చాలా సంతోషము. తమరు చేస్తున్నది కాలపు సద్వినియోగము. తమరికి నేను మొదటే ఈ మాట చెప్పలేదు, తమరికి ఇప్పుడిప్పుడే మనసు పక్వమగుతున్నది. జ్ఞాన సత్రమును ముగించి , నాకైన సర్వజ్ఞ దర్శనము తమకూ కావలెను. ఆ తరువాత ఏమేమవుతుందో చూచెదము. " 

" తమరికి సర్వజ్ఞ దర్శనమయినదా ? "

" అయింది , అంతే కాదు, వారు దయతో , ’ ప్రతిఒక్కరూ సర్వజ్ఞులు కావచ్చును. సర్వజ్ఞ బీజము అందరిలోనూ ఉంది. అయితే అది ఎవరికీ రుచించదు ’ అని కూడా చెప్పినారు "

" ఎవరా సర్వజ్ఞులు ? "

" ఎవరేమిటి , భగవానులు " 

రాజు అదివిని అవాక్కైనాడు. 

         గార్గి ప్రశ్న వచ్చినట్టు , ఉత్తరముగా అన్నది : " ఒకడు దేనిని ఎంచుకుంటారు అన్నదాని మీద అంతా ఆధారపడి ఉంది. కాల దేశముల వలన పరిమితములైన దేనిని కోరిననూ అదంతా కామము. కామము మనసులో బలముగా ఉన్నంత వరకూ సర్వజ్ఞ బీజము మొలకెత్తదు. కాల దేశముల బయట ఉన్న పూర్ణమును కోరినట్లయితే , అది మొలకెత్తును. వీటన్నిటికన్నా అది గొప్పదని నమ్మి అటు తిరిగినపుడు అది మొక్క అగును. పెరిగేకొద్దీ అది వీటిని తినుటకు మొదలగును. వీటిని అంటే , ఈ దృశ్యమును అది సంపూర్ణముగా ఆవరించినపుడు మనసు సర్వజ్ఞమగును. అయితే , అది అయినపుడు, మనసు వాక్కులో , వాక్కు మనసులో ప్రతిష్ఠితమై, మానవుడు మూగవాడై అంతర్ముఖుడగును. అంతటివాడు ఇతరుల అనుగ్రహార్థము ఏదైనా చెప్పబూనితే అప్పుడు అతని మనసు నుండీ వచ్చు వృత్తి సగర్భముగా వచ్చును. అప్పుడు తత్త్వ జ్ఞానమగును. అప్పుడు అతడికి ముందర బ్రహ్మ , వెనుక బ్రహ్మ , పైన బ్రహ్మ , కింద బ్రహ్మ , ఎడమకు బ్రహ్మ , కుడికి బ్రహ్మ అయి , సముద్రములో మునిగినవానికి అంతటా నీరే అయిఉన్నట్లు , అంతటా బ్రహ్మమే అగును. "

"
" అయితే , సర్వజ్ఞుని సాంగత్యము వలన మీరుకూడా సర్వజ్ఞురాలైనారు. " 

         " సర్వజ్ఞురాలిని కాలేదు , సర్వజ్ఞురాల నగుట సాధ్యమని కనుక్కున్నాను. ఇంక ఆమాటలు వదిలేయండి , నాకు ఆ వృత్తి వస్తే , ఒంటిపై స్పృహ ఉండదు. ఇంటికి వెళ్ళునదే కష్టమవుతుంది. " 

          " సరే , దేవరాతులకు చెప్పండి , వారు ఇక్కడికి వచ్చి మమ్ములను చూడనవసరము లేదు , మరునాడు మేము భగవానుల దర్శనమునకు వెళ్ళెదము. వారూ కొడుకుతో పాటు దర్శనమిచ్చి ఆశీర్వదించనీ . " 

" అటులనే "

        " మేము మిత పరివారముతో ఉష్ట్ర రథములో వెళ్ళి , భగవానులను దర్శించి , గంగా స్నానమునకు వెళ్ళి వచ్చెదము. మాతో పాటు వచ్చు వారుంటే రావచ్చును. "

రాజుతో పాటు ఉన్న పదిమందిలో ఒక్కరు కూడా వస్తామనలేదు. రాజూ , గార్గీ ఒకరి ముఖమునొకరు చూచుకొని నవ్వినారు. 

         రాజు , " తమకు దారి వెచ్చమున కిచ్చిన సువర్ణములు సరిపోయినవా ? " అని అడిగినాడు. ఆమె , " సరిపోయినవి. చాలకున్ననూ మా గుంపు వారిని అక్కడ అడిగేవారెవరూ లేరు " అని నమ్మకముగా చెప్పింది . 

64. " మహాదర్శనము " --అరవై నాలుగవ భాగము--శారదా మంటపము


64. అరవై నాలుగవ భాగము--  శారదా మంటపము


         యాగ మంటపమునకు శారదా మందిరమని పేరు పెట్టినారు. దానిలో వేదికకు కుడివైపు విశేషాతిథులు కూర్చొను పక్క గోడకు ఒక శారదా దేవి చిత్రము . పురుష ప్రమాణములోనున్న ఆ చిత్రములో దేవి వీణా వాదనము చేయుచూ కూర్చున్నది. పైనున్న చేతులలో ఒక దానిలో అక్షమాలికనూ , ఇంకొకదానిలో పుస్తకమునూ ధరించినది. తలపైనున్న రత్న కిరీటము ఆమె తేజస్సంతయూ పైకి లేచి గోపురాకృతి యయినదో అన్నట్లున్నది. చెవిలో నున్న రత్నపు కుండలములు ప్రతిభా స్వరూపురాలైన ఆమె ప్రతీకలవలె ప్రకాశమానముగా మెరుస్తున్నవి. నాసికలో ధరించిన ముక్కెర స్వాతీ నక్షత్రమును తెచ్చి చెరపట్టినట్టుండి , దాని కాంతి ఆమె సుందర కపోలముల మీద పడి అవి కొంచము ఎర్రబడినట్టు కనిపిస్తుంది. కంఠాభరణములు ఒకదాని కన్నా ఇంకొకటి విచిత్రముగా నున్నవి. అన్నిటికన్నా మిక్కిలిగా కనిపించు ఆ బిల్వ పత్రపు హారము. ఒక్కొక్క దళమునకూ రత్నములు పొదిగియున్నవి. అటు ఇటూ ఉన్న దళములు చిన్నవి. మధ్యలోని దళము పెద్దది. ఇటువైపు పదమూడు , అటువైపు పదమూడు మధ్యలో నాయక మణి స్థానములో ఒకటి పెద్దది. మొత్తము , ఇరవైఏడు దళముల ఆ సుందర హారము ఆమె నిండైన వక్షస్థలములో విరాజిల్లుతున్నది. నవరత్న ఖచితమైన మేఖల రారాజిల్లుతున్నది. పాదములను మెట్టెలు ,కడియములు , అందెలు , ఉంగరములు ప్రకాశింపజేయుచున్నవి. అటులే , ముంజేతులలోని వంకీలు , మణికట్టులలోని వెండి కడియములు , అంగుళులలో అంగుళీయకములు మెరుస్తున్నవి. మాత దర్శనము కాగానే ఆమె యొక్క దివ్యవీణా మంజుల గానము వినపడినట్లగును. ఆమె ముడుచుకున్న పుష్పమాల దివ్య సౌరభమును ఆఘ్రాణింప జేసినట్లగును.  ఆమె కటాక్షము పరచుకొన్న చోటల్లా పవిత్రత నిండి , జ్ఞానము తాండవము చేస్తున్నట్లనిపించును. 

         ఆ పటమునకు ఎదురుగానున్న ఇంకొక గోడపై గాయత్రీ మాత చిత్రము. చిన్న అలలతో సుందరమైన నీల జలరాశి. దాని మధ్యలో జగత్సౌందర్యము నంతటినీ రాశిచేసి అచ్చుపోసినట్లున్న పెద్ద కమలము. దాని మీద మాత కూర్చున్నది. ఒక కాలు మడుచుకొని ఇంకొకకాలు కిందికి వాలుగా వదలినది. ఆ కాలు నీటిని తాకుతున్నట్లుంది యనుట కన్నా ఆ జలరాశి ఆ పాదమును కడిగి కృతార్థము కావలెనని , భయభక్తులతో అలలను పైకి విసరుతున్నట్టుంది. ఆ కాలిలో రత్న నూపురములు శోభిస్తున్నవి. కాలి వేళ్ళకు ధరించిన రత్నపుటుంగురములు పడిపోకుండా బంగారపు చిన్న చిన్న సరములు. అవి సంధించు స్థానములో ఒక రత్నపతకము. ఆ పతకము నుండీ ఇంకొక సరము వెళ్ళి కాలి యందియకు ఉన్న ఉంగరమునకు కట్టుబడియున్నది. సరిగ్గా చూస్తే తప్ప, దేవి ఒంటి స్వర్ణఛాయలో ఈ బంగారపు సరపు వర్ణము కలసి పోయినట్లు కనిపిస్తుంది. ఆ కాలిపై పడియున్న చీర అంచు యొక్క కళాకృతి రత్న నూపుర బంగారపు కాలి యందెలను కొంచము కొంచముగా కప్పి యున్నది. దేవి ధరించిన రత్నాంబరము చంద్రకాంతిని పట్టివేసి వస్త్రముగా పరచి దాని మధ్య మధ్యలో ఉజ్వలమైన నక్షత్రములను పొదిగి నేసినట్లుంది. ఆమె మేఖల సూర్య రశ్మిని పట్టి చేసిన గుళ్ళతో చేసినట్లుండి, ప్రకాశమానముగా ఉండి , కన్నులను మిరుమిట్లు గొలుపుతున్నది. 

            చూడగా , ఎవరికో ప్రత్యక్షమైన జగన్మాత వలెనున్నది. ఒక ఘడియ అలాగే నిలబడి చిత్రమును చూడవలెను అనిపిస్తుంది. చూడగా చూడగా మైమరచిపోవునట్లున్నది. ఏదో అలౌకిక దేశ , కాలములకు చిక్కి ఎక్కడికో వెళ్ళి ఏదో చూచినట్లు భాసమవుతుంది. అలాగే గనక చూస్తుంటే ఒక్క ఘడియయైనా సమాధిలోకి వెళ్ళెదము. 

        ఆ మంటపమునకు నాలుగు వాకిళ్ళు. ఆ నాలుగు వాకిళ్ళలోనూ నాలుగు చిత్రపటములు. వెనుకటి మహారాజు దేవతార్చనలో ఉన్న చిత్రమొకటి , దాని ఎదురుగా వైదీకవేషములో విద్వద్బృంద సమేతుడై ఉన్న ఇప్పటి జనక మహారాజు. ఇంకొకటి మూలలో సింహాసనము పై కూర్చున్న మహారాజు. దాని ఎదురుగా యోధుడి వేషములోనున్న సైన్య సమేతుడైన రాజు. అన్నీ పురుష ప్రమాణములో ఉన్న చిత్రములు. 

        మిగిలిన చోట్ల , ఒక వైపు ఒక దేవస్థానపు దృశ్యము. గోపురపు వాకిటి నుండీ చూస్తే లోపల హజారము. దానిలోపల నవరంగము. దానిలోపల గర్భగుడిలో స్వామికి మంగళ హారతియగుచున్నది. చూస్తే , సమీపములో నున్నట్టే అనిపించి , ఇంకేమి అర్చకులు మంగళారతి తెస్తారు , మనము మంగళారతి తీసుకుంటాము అని అనిపిస్తుంది. 

         ఇంకొకవైపు దేవస్థానము ఎదురుగా యజ్ఞమంటపపు దృశ్యము. యజ్ఞవేదిక పైన ఆహవనీయము జ్వాలామాలా సుందరమైనది. ఒకవైపు దక్షిణాగ్ని సన్నగా మండుచున్నది. ఇంకొక వైపు గార్హపత్యాగ్ని సన్నగా తెల్లటి ధూమమును చిమ్ముతూ మండుతున్నది. ఆహవనీయపు పక్కన భవ్య కాయుడైన అధ్వర్యువు స్రుక్కు , స్రువములను పట్టుకొని హోమము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. చాచిన చేతిలో పట్టుకున్న స్రువము నుండీ నెయ్యి అగ్నిలోకి ధారగా పడుతున్నది. అటువైపు ఒక స్తూపము కాపలా కాయు యోధుని వలె నిలుచున్నది. ఇటు యజమానుడు పత్నీ సమేతుడై సంతోషపు మూర్తియా యన్నట్లు కూర్చున్నాడు. చూచేవారికి , ఇప్పుడే హోమము జరుగుతున్నట్లూ , తాము సకాలములో వచ్చినట్లూ అనిపిస్తుంది. 

         మూడవది గురుకులపు దృశ్యము. భగవానులొకరు వేదికపైన ఆసీనులైనారు. తాము వింటున్న మంత్రముల అధి దేవతలను సాక్షాత్కరించు కొంటున్నారో అన్నట్లు అరకన్నులు మూసి కూర్చున్నారు. వారు కూర్చున్న దర్భాసనమూ , వారు కట్టుకున్న మడి పంచ, వారు కప్పుకున్న అజినమూ ఆ చుట్టుపక్కలకంతా పవిత్రతను ఆపాదించునట్లునది. పక్కన ఉపవేదిక పైన అధ్యాపకులు కూర్చొని వేళ్ళు లెక్కిస్తూ, పక్కకు ఎత్తిన తల స్వంత స్వరమును (  వేదములో ఉదాత్తము , అనుదాత్తము , స్వరితము , ప్రచయములను నాలుగు స్వరములు ఉంటాయి . అనుదాత్తము తక్కువ స్థాయి. దానిపైన ఉదాత్తము , దానిపైన స్వరితము )  సూచిస్తుండి , శిష్యులకు అధ్యయనము చేయిస్తున్నారు. సమీపములో నున్న పర్ణ కుటీరములు అక్కడున్న గృహస్థులు లక్ష్మికన్నా లక్ష్మీపతినే ఎక్కువగా ఆరాధిస్తున్నట్లు చూపుతున్నవి. అవి పరిశుభ్రమైన ముంగిళ్ళతో తీర్చిన రంగవల్లులతో శోభితమైనది వారి తృప్తిని చూపుతున్నవి. అనతి దూరములోనే ఆశ్రమమునకు ప్రదక్షిణముగా పారుతున్న నది ఈ ఆశ్రమపు పక్కన ప్రవహించి తాను కృతకృత్యురాలైతినని అనుకొన్నట్లు నిర్మలముగా ఉంది. వెనుక నున్న పర్వతము ’ నేనిక్కడి రక్షకుడను ’ అని ఎత్తుగా ఉన్న వృక్షములు అనెడు చేతులనెత్తి , ’ జాగ్రత్త ! నేను సహస్ర బాహువును ’ అని హెచ్చరిస్తున్నట్లుంది. ఆ చిత్రపు ముందరి భాగములో కనపడు పచ్చిగడ్డి , వెనుక కనిపించు తెల్లటి ఆకాశము, అక్కడి నివాసులు కూడా మా లాగ పరిశుద్ధ చిత్తులైయున్నారు అని ఉద్ఘోషిస్తున్నట్లుంది.

         నాలుగవది ఒక గోవులమంద చిత్రము. మడమల ఎత్తు వరకూ పెరిగిన గడ్డిగాదములు. అక్కడక్కడా పరచుకొని పెరిగియున్న ఛాయావృక్షములు. చిత్రపు మధ్యలో ఏనుగంతటి ఆంబోతు. దాని వెనుక భాగము బాగా పెరిగి వంగిపోయినది. అది వీరావేశముతో వచ్చి పుట్టను కొమ్ములతో పొడుచునట్లుంది. ఆవులన్నీ చుట్టు నిలిచి చూస్తున్నవి. ఆంబోతు వీరావేశమును తామూ పంచుకున్నట్లు అవి ముక్కు పుటములనూ , కనులనూ పెద్దవి చేసియున్నవి. ఒక్కొకటీ బాగా బలిసియున్నవి. ఒక్కోదాని వాలమూ గడ్డిపరకలపైన వాలాడుతున్నవి. చూచినవారి మనసుకు ఒకవిధమైన హర్షము , ఒక ఉత్సాహము కలుగునట్లుంది. సమృద్ధికి చిహ్నమైన గోవును చూచి సంతోషపడని వారెవ్వరు ? 

         వైశాఖపు అమావాస్యకు అన్నీ సిద్ధమైనాయి. జ్యేష్ఠశుద్ధ తదియనాడు మంటప ప్రవేశము అని నిర్ణయించినారు. వెనుకటి దినమే మంటపపు సింగారము , అలంకరణ మొదలైంది. ప్రతి స్థంభమునకూ చిత్ర చిత్రమైన రంగు రంగుల బట్టలను చుట్టినారు. ప్రతి స్థంభమునకూ పూలను , చిగురుటాకులనూ కట్టినారు. స్థంభమునుండీ స్థంభమునకు పూలు , చిగురు , ఆకుల తోరణములను కట్టినారు. గోడలకు సున్నమును మెలకువగా దప్పముగా పూసినారు. నేల అంతా ఊడ్చి కడిగి , ముగ్గులు వేసినారు. మంటపమునకు వచ్చు దారులన్నీ శుచి చేసి అక్కడ ఉన్న రాళ్ళూ రప్పలూ , పెరిగిన గడ్డినీ తీసివేసి శుద్ధము చేసినారు. తటాకముల నన్నిటినీ స్వఛ్చపరచినారు. మంటపము ఎదురుగా రాజశకటములకు కేటాయించిన స్థలమంతా నిర్మలమయినది. అంతేనా , మంటపమునకు మంటపమే పరిశుభ్రముగా స్వఛ్చముగా తళతళా మెరుస్తున్నది. మామిడాకుల తోరణములకు లెక్కేలేదు. ఎక్కడ చూచిననూ అందచందాల గని అనిపిస్తున్నది. 

తదియ నాడు రాజపురోహితుడు అశ్వలుడు , ముత్తైదువలు , బ్రాహ్మణులతో మంటపమునకు వచ్చినాడు. అక్కడ ప్రవేశ హోమము చేసి సిద్ధముగా వేచియున్నాడు. 

ఇటు రాజభవనములో విద్వాంసులు , రాజపురుషులు , నాగరిక ప్రముఖులూ , సైనికులు , మొదలైనవారంతా సమయానికి సరిగ్గా వచ్చి వేచియున్నారు. 

         మహారాజు సకాలములో ప్రాతః కర్మలను ముగించుకొని వచ్చినారు. రాజ పరివారము మంటపము వద్దకు బయలుదేరింది. ముందు రాజధ్వజమును ఊరేగిస్తూ గజములు వెళ్ళినవి. వాటి వెనుక పదాతి దళములు వెడలినవి. వాటి వెనుక మూలబలము వచ్చినది. దాని వెనుక వృషభ రథములలోనూ , అశ్వ రథములలోనూ రాజపురుషులు వెడలినారు. వారి వెనుక మహారాజు ఏనుగు పైన అంబారీ లో కూర్చొని వెడలినాడు. అతడి వెనుక అశ్వ , గజ రథములలో కూర్చొని విద్వాంసులు వెళ్ళినారు. వారి వెనుక గజ సైన్యము వచ్చింది. కొమ్ములు , బూరలు , డప్పులు మొదలైన వాద్యములు సైన్యముల ముందర మోగుతూ వెళ్ళినవి. రాజుగారి ముందర వృషభ రథములపైన వేసిన అరుగులపై నర్తకీ మణులు వీణా , వేణు మృదంగముల గతికి అనుసారముగా నర్తిస్తూ వెళ్ళినారు. రాజు వెనుక భాగములో నాదస్వరము వారు మంగళముగా స్వరములు పలికిస్తూ వెళ్ళినారు. కుడి, ఎడమవైపుల ఆస్థాన విద్వాంసులూ వందిమాగధులూ మంగళ పద్యములను పాడుచూ ఉద్ఘాటిస్తూ వెళ్ళినారు. 

         ఊరేగింపు ఈ విధముగా బయలు దేరి , మందగమనముతో సాగి , సకాలములో మంటపము వద్దకు చేరినది. సైన్యములన్నీ వెళ్ళి తమకు నిర్ణయించిన స్థానములలో నిలుచున్నాయి. నర్తకులూ , గాయకులూ , ఉభయ పార్శ్వములలో నిలిచినారు. విద్వాంసులూ రాజ పురుషులూ రాజువెనుక వచ్చినారు. వందులు రాజు ముందర  బిరుదావళులను ఉద్ఘోషిస్తూ నడచినారు. 

          పురోహితుడు బ్రాహ్మణులనూ ముత్తైదువలనూ పిలుచుకొని ఎదురు వచ్చి రాజునూ పరివారమునూ స్వాగతము చెప్పి ఆహ్వానించినాడు. బ్రాహ్మణులు వేదమంత్రములతో ఆశీర్వాదములు చేసినారు. ముత్తైదువలు మంగళ ద్రవ్యములతో వచ్చి మంగళము పాడి , హారతిచ్చి ఆశీర్వదించినారు. పురోహితుడు రాజును హోమకుండము వద్దకు పిలుచుకు వెళ్ళి రాజుచేత ఒకసారి ఆజ్య హోమము చేయించి తాను మిగిలినదంతా చేసి హోమమును ముగించినాడు. రాజు యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణ నమస్కారములను అర్పించినాడు. కలశోదకమును తీసుకొని రాజుకూ , మిగతా ముఖ్యాధికారులకూ , విద్వాంసులకూ ఇచ్చి , మిగిలినదానిని అందరిపైనా ప్రోక్షణ చేసి , అదే విధముగా యజ్ఞేశ్వరుని రక్ష కూడా వినియోగించినాడు. 

         మంటపమును విరచించిన రాజశిల్పి వచ్చి రాజును దర్శించినాడు. " సన్నిధానము పెద్దమనసుతో , ఈ వేదికను ప్రదక్షిణ చేసినట్లే ఈ మంటపమునకూ ప్రదక్షిణ చేసి రావలెను. " అని తెలిపినాడు. రాజు పరివారముతో కదలినాడు. రాజశిల్పి అప్పటివరకూ అక్కడ జరిగినది చూడనివాడికి వివరించునట్లు అంతా రాజుకు విన్నవించినాడు. రాజు కూడా అంతా కొత్తగా చూస్తున్న వాడివలె అక్కడక్కడా ప్రశ్నలు వేస్తూ నడచినాడు. 

         " మహా స్వామీ , ఈ తటాకమును పరామర్శించవలెను. దీనివలెనే ఉన్న , మోకాలు లోతు నీటితో ఉన్న నాలుగు తటాకములు ఈ మంటపము నాలుగు మూలలలోనూ ఉన్నాయి. దీనిలో నీలపు తామరలు ఉన్నట్లే మిగిలిన వాటిలో క్రమముగా తెల్ల తామరలు , పసుపు తామరలు , ఎర్ర తామరలూ ఉన్నాయి. ఈ తటాకపు ఉద్దేశాలు రెండు. ఒకటి ఈ మంటపములో చలువ ఉండవలెననీ , ఇంకొకటి తామరల గుంపు ఉన్నచోట మహావిష్ణువు వెలసియుంటాడని ప్రతీతి. ఆ విష్ణువును యజ్ఞమంటారు. యజ్ఞస్వరూపుడైన మహా విష్ణువు ఈ శారదా మంటపము నాలుగు వైపులా ఉండి దీనిని కాపాడుతాడని నమ్మకము. దీనితో పాటూ ఇంకొక ప్రయోజనము కూడా ఉంది. ఇక్కడికి వచ్చినవారు కాళ్ళు కడుగుకొనకుండా మంటపము లోపలికి వెళ్ళకూడదని , ఇక్కడ కాళ్ళు కడుగుకొనుటకు వసతులు చేయడమైనది. ఇదిగో , ఈ గార తో కట్టిన స్థలములో కాళ్ళు కడుగుకొన వచ్చును. ఆ నీరంతా మరలా ప్రవహించి పోవునట్లు గారతో బచ్చలులు కట్టబడినవి. వీటిలో నీరు సమానముగా ఉండునట్లు భూమిలోపల కాలువలతో జలాశయమునకు సంబంధమును కల్పించబడినది. 

         " అలాగే ముందుకు దయచేయవలెను. ఈ తటాకముల మధ్య తులసి , మరువము , దవనము , కస్తురి పట్టియలు , వట్టివేర్లను పెంచినాము . వీటి పైనుండీ వీచు గాలి వీటి సుగంధమును తెచ్చి మంటపములో నింపవలెను అను మా ఆశ సఫలమైనదని మహా పాదములు మంటపము లోపలికి వెళ్ళగనే అవగతమగును. ఈ చుట్టూ ఉన్న వసారాలలో,  వచ్చినవారు తమ పాదరక్షలను విడుచుటకు అనుకూలముగా ఉంటుంది. ఇక ముందర చూడవలసినదేమీ లేదు. ప్రదక్షిణము చేసి మంటప ప్రవేశము చేయవలసినదిగా మహా స్వాములకు విన్నపము. " 

         రాజు మందస్మితుడై వెనుక తిరిగి చూచినాడు. శిల్పి చెప్పినదంతా వారు ఆమోదించినారని వారి ముఖ ముద్రల వల్లనే చూపిస్తూ , ప్రసన్నుడై యజ్ఞేశ్వరుడిని కుడివైపుకు వదలి , సపరివార సమేతుడై మంటప ప్రవేశము చేసినాడు. 

Wednesday, March 13, 2013

62. " మహాదర్శనము " --అరవై రెండవ భాగము-- విచారము


62. అరవై రెండవ భాగము--  విచారము


         ఇక్కడ రాజభవనములో మహారాజు నిక్షేపము దొరికినప్పటి నుండి విచిత్రముగా మారిపోయినాడు. అతనికి ఒకటే ఆలోచన. " అట్లయితే , ఈ ప్రపంచములో మేము , మేము అని రొమ్ము చరుచుకుంటూ తిరిగేది తప్పా ? అన్నీ మొదటే నిర్ణయింపబడి ఉంటాయా ? మనమంతా నిమిత్త మాత్రులమా ? "

నాణెపు పైనున్న శ్లోకము గుర్తొచ్చింది

|| దేవరాజానుగ్రహేణ జ్ఞాన సత్రాయ సంభృతం |
మనునా మానవేంద్రేణ జనకాయ నివేదితం ||

         ఈ మనువు ఎవరు ? ఆతడు జ్ఞాన సత్రము జరగవలెను అన్న సంకల్పముతో ఈ నిధిని నాకోసము సేకరించి పెట్టినాడా ?  ఈ బ్రహ్మ జ్ఞాన సదస్సునకు ’ జ్ఞాన సత్రము ’ అను పేరు మేము పెట్టెదమని అతడికెలా తెలిసింది ? అతని కాలము ఏది ? ఇప్పటి కాలము ఏది ? నేను జనకుడనువాడిని వస్తానని అతడికి ఎలాగ తెలిసింది ? అన్నిటికన్నా మిన్నగా , ’ దేవరాజానుగ్రహేణ ’ అనగా , దేవతలు మామీద అనుగ్రహము చూపుటకు కాచుకొని కూర్చుని ఉంటారా ? వారికి అదే పనియా ? అలాగయితే వారిని వదలి మనమే చెడిపోయినామా ? "

         " అలాగనుటకూ లేదు. కొన్ని అప్రాచ్య దేశములలో మన దేవతలను పూజించరు. వారికేమి తక్కువ అయినది ? వారేమిటీ ? మనలోనే దేవతలంటే మనో భ్రాంతి అని తెగడేవారు ఉన్నారు కదా, వారు ఎప్పటికీ ఆస్తికుల కన్నా బాగున్నారు కదా ? ఇలాగున్నపుడు మనమెందుకు ఈ దేవుళ్ళ విషయములో ఇంత చింతను అంటించు కొనవలెను ? 

         " లేక , ఇదొక జాడ్యమా ? ఒక సంప్రదాయములో పుట్టి పెరిగి దానిని వదలలేక పెనుగులాడే మనో దౌర్బల్యమా ? అలాగనుటకు కూడా సమంజసమా ? "

         " ఈ దేవుళ్ళను నమ్మిన భక్తులు , ఇతరులకు సాధ్యము కాని అనేక కర్మలను లీలాజాలముగా చేస్తారు కదా ? అందరి సంగతీ అటుంచి , ఇప్పుడు మా విషయమునే తీసుకుందాము. జ్ఞాన సత్రమును చేయవలెనని నాకెందుకు అనిపించవలెను ? మధ్యలో ధనము లేదే యని చింత ఎందుకు రావలెను ? చివరికి ఆ చింత కలలో తీరిపోవుట ఏమిటి ? ఆ దేవగురువు ఈ నిధి విషయము చెప్పుట ఏమిటి ? దాని ప్రకారమే ఈ నిధి దొరకడమేమిటి ? దానిలో మనువు నా జ్ఞాన సత్రమునకై సేకరించినది అన్నాడంటే , ఏమిటీ విచిత్రం ? 

ఈ ప్రపంచ సమస్య ఇంత జటిలమా ? ఈ జగత్తు యొక్క నానాత్వము మనసుకు అర్థమే కాదా ? " 

        " లేక , ఈ నానాత్వము వల్లనే ఈ జటిలత్వమా ? మొక్క పెరిగిన కొద్దీ విశాలము అవుతుంది అన్నట్లు ఆలోచించినకొద్దీ గంభీరమగుటే దీని స్వభావమా ? మరి దీనిని తెలుసుకొనుటెట్లు ? " 

        " వీటిని పట్టించుకోని వారు , అంతర్ముఖులై ధ్యానములో మునుగువారు , ఈ జగము యొక్క నానాత్వమును ’ అదేమీ లేదు ’ అన్నట్లు సుఖముగా ఉన్నారు కదా ? అలాగయితే మేము కూడా దీనిని మరచిపోయి బ్రతుకవచ్చునా ? కన్నులు మూసుకొనిన ఏమీ లేదు , నిజము. దినమూ మేము నిద్రించునపుడు ఈ ప్రపంచమన్నదే గుర్తుకు రాదు. అలాగయితే , దీనిని మరచి పోవుటే , దీనిని కెదకకుండా ఉండుటే సౌఖ్యమా ? "

        " రాజునై నేను ఈ జగమును ఎలా గమనించకుండా ఉండగలను ? అందరూ సుఖముగా ఉంటే నేను వారిని మరచిపోవచ్చు ; వారు కుడా నన్ను మరచిపోవచ్చు. అయితే ఏదైనా విపత్తు వచ్చి మనసే విక్షోభమైనపుడు మరిచేదెలాగ ? " 

" మరి నిర్లిప్తమగుట ఎలాగ ? మరచిపోయి ఉండుట నిర్లిప్తమా ? గుర్తుండుట నిర్లిప్తమా ? "

      ఇలాగ ఆలోచన అనే గుర్రాన్ని ఎక్కి , వెళ్ళిన చోట గుర్రాన్ని వదలి తిరుగుతుండగా , తటాలున దేవగురువు మాట గుర్తొచ్చింది . " ఇక ముందు నీ వెనుక మేమున్నామన్న నమ్మకము నుంచుకొని ధైర్యముగా వర్తించు. అన్నీ గెలవవచ్చు. " 

        చింతలో మునిగి ఉన్న మనసు మరలా సుడికి చిక్కిన అలలవలె తిరుగుట మొదలిడింది. " అలాగయిన , జయమను ఫలమును పొందుటకు మేము నమ్మకము అను కానుకను అర్పించవలెనా ? దేవతలను మా వెనకే ఉన్నారని భావించి సాగవలెను. లేకపోతే జయము లేదు. అంటే , గెలిచిన వారందరూ దేవతల అనుగ్రహముతోనే గెలిచిన వారా ? వారెవరూ ఆమాట అనరే ? "

" మరి , గెలుపంటే ఏమి ? " 

         " గెలుపంటే ఎవరైనా ఒకడు తనకు కావలసినదానిని తనకు కావలసినరీతిలో దొరకునట్లు సాధించుట. కర్షకుడు భూమినంతా సమమగునట్లు దున్ని , విత్తి , పంట తీసుకొని గెలిచినాను అంటాడు. ధనార్థి మోసము , వంచన , దొంగతనము , హత్య అను భీతి లేకనే , నిర్లక్షముగా తన లక్ష్యాన్ని సాధించి , గెలిచినాను అంటాడు. క్షత్రియుడు గుంపు కట్టుకొని ప్రాణమును పణముగా పెట్టి ఇతరులను చంపి ఓడించి ద్వేషమును సాధించి, అక్కడ తన పాలనను స్థాపించి గెలిచినాను అంటాడు. వీరిలో ఎవరు గెలిచినవారు ? "

          " భూమిని సమము చేసినవాడు గెలిచినాడు అందామంటే మరలా వానలు వచ్చి ఆ నేలనంతా గుంతలు దిన్నెలు , మిట్టపల్లాలు చేస్తుంది కదా ? వీడి గెలుపేమయింది ? విత్తి , పంటను తీసుకున్నాడు కదా అంటే , అక్కడ కాల కాలములకూ వానలు రాకుంటే వాని గతి ఏమి ? అథవా , వానలొచ్చినా సకాలములో వ్యాపారము చేయకుంటే --నారు, నీరు , ఎరువు, కోత, నూర్పిళ్ళు వంటి పురుష వ్యాపారములు లేకుంటే గెలుపెలా వస్తుంది ? కాబట్టి మనుష్యుడు చేయు కార్యములో గెలవవలెనంటే అదృష్ట సహాయముకూడా సమకూరవలెను కదా ? ఇలాగ , తాను చేయునదీ , అదృష్ట సహాయము -రెండూ చేరితేనే గెలుపా ? 

         " పితికి , భద్రముగా మూత పెట్టిననూ పాలను పిల్లి వచ్చి ఎలాగో మాయచేసి తాగును. గోపాలకుడు చూస్తుండగనే పులి వచ్చి ఆవును ఎగరేసుకొని పోవును. రెండూ గెలిచినాయి కదా . రెండూ స్వార్థమును సాధించుకున్నాయి. అయితే , ఒకటి మోసము తోనూ , ఇంకోటి బలము తోనూ! వీటిలో ఏది సరియైనది ? మోసముతో కార్యమును సాధించుటా ? బలముతోనా ? లేక రెండూ తప్పా ? "

         " ఆహా! ఇంతసేపూ నేను చేసినది భలే బాగున్నది ? కన్య లేకుండా పెళ్ళి చేసుకున్నట్లాయెను. మనసు ఉంటేనే కదా మానవుడు మహాదేవుడగునది ! ఆ మనసే లేకుంటే మానవుడు చేయునదేమున్నది ? నేను ఇప్పుడు ఇంత ఆలోచించినది కూడా మనసు  నా చేతిలో ఉన్నపుడే కదా ? అయితే , నిజంగా చెప్పాలంటే మనసు నా చేతిలో ఉందా ? నేను మనసు చేతిలో ఉన్నానా ? ఇక్కడ కేనోపనిషత్తు యొక్క ’ కేనేషితం పతతి ప్రేషితం మనః ’ -మనసు తన ఇష్ట వస్తువును గురించి పరుగెడుతుంది కదా , అలాగ పరుగెత్తు అని దానిని ప్రేరేపించునది ఎవరు ? నేనింతసేపూ గెలుపు-ఓటముల గురించి ఆలోచించినాను కదా , వాటిని గురించి చింతించు అని మనసును ప్రేరేపించినది ఎవరు ? ఇష్టం పతతి మనః అంటే , ఆ విషయము నాకు ఇష్టమా ? అయితే మిగిలినవన్నీ అయిష్టములా ? 

         " ఈ మాట వలన ఒకటి తేలింది. మనసు ఇష్టానిష్టములను గమనించి పోవునది అని తెలిసింది. మరి , నిన్న రాత్రి నా గతి యేమిటి అని ఆలోచిస్తూ ఉన్నాను. శిరోభారము వచ్చి జ్వరమై , నేనెక్కడున్నానన్నదీ కూడా మరచిపోవునంత అయింది. అదీ మనసుకు ఇష్టమేనా ? అథవా అదంతా కాకపోతే ఈ నిధి దొరికేది కాదా ? "

        " అదలా ఉంచితే , మనసును ఎవరో ప్రేరేపిస్తూ ఉండాలి ? మనసు కూడా గుర్రమువ వలె ఎవరికోసమో అన్యార్థమై పరుగెడుతుండవలెను. పొయ్యి మీద పెట్టిన నీరు కింద మండుచున్న మంట శాఖముతో తనకు వద్దన్నా , కావాలన్నా మరుగునట్లే , ఈ మనసు కూడా ఎవరి ప్రేరణచేతనో నడుస్తుండవలెను. అది ఎవరు ? లేదా , వారు కంటికి కనపడ కుండా అణగి ఉండి , మనసును దర్వి వలె , గరిట వలె ఉపయోగిస్తుంటారో ? 

         " అలాగయితే , దీనినేనా నిన్న దేవగురువు చెప్పినది ? ’ మేము నీవెనుక ఉన్నామన్న నమ్మకము తో ధైర్యముగా వర్తించు ’ . అంటే ఇదే అర్థమా ? వారికీ మాకూ సంబంధమును కల్పించునది మనసేనా ? మనసు యొక్క ఇష్టాయిష్టములను నిర్ణయించి వాటివైపు పోవుటకో , నిలుపుటకో కారణులు ఈ దేవతలేనా యేమి ?"

       ఇప్పటికి జనకుని మనసు శాంతమైనది. ఆకళింపు అయినది. ఆలోచనలిక ముందుకు సాగలేదు. కాగిన నేలపై చల్లిన నీరు వలె ఇంకుతున్నవి. కనులు అరమూతలు పడుతున్నాయి. కూర్చున్న చోటనే కునుకు వచ్చినట్లాయెను. 

         ద్వారము వద్ద పహరా ఉన్న కాపలావాడు , ఒక యామము గడచినదని తన విధ్యుక్తాన్ని మరొకడికి అప్పజెప్పినాడు. వచ్చినవాడు వంగి చూచి , వారున్నారు అని సూచించినాడు. వెళుతున్నవాడు వెనక్కు తిరిగి , ’ సవారి ఎంత సేపటినుంచో ఇలాగే కూర్చున్నారు. ఎవరైనా చూడవలెనని వస్తే , శబ్దము చేసి లోపలికి వెళ్ళు ’ అన్నాడు. వాడు ఒప్పుకొని తలాడించినాడు. 

       వాడు వెళ్ళి పోయిన కొంచము సేపటికి రాజాధికారి యొకడు వచ్చెను. పహరావాడు అతడిని ఆపుటకు లేదు. రాజు మేలుకుని ఉన్నాడో లేదో తెలియదు. ఏమైనా కానీ యని పొడి దగ్గు దగ్గినాడు. రాజుకు మెలకువ అయినది. అప్పుడే రాజాధికారి లోపలికి వచ్చినాడు. రాజు ఏదో ఆలోచనలో ఉండి, ’ ఏమేమి చేయవలెననునది తెలిసినదా ? ’ అన్నాడు. 

         రాజాధికారి ,  ఆ ప్రశ్న అర్థము కాకున్ననూ , తాను నివేదించుటకు వచ్చిన విషయానికి సంబంధించినదే అయి ఉండవలెను అనుకొని , ’ అంతా అయినది. నిక్షిప్త స్థలములో ఒక గుండిగ వరి కూడు , నిక్షేపమునకు ఒక గుండిగ వరి కూడు బలిగా పెట్టినాము. రాజభవనములో ఒక వెయ్యిమంది జనులకు అలంకార పంక్తి. బయట ఛత్రములో భూరిభోజనములు. గజశాలలో , గోశాలలో , అశ్వశాలలో సార్వత్రిక సమారాధనలు " అని నివేదించినాడు. 

         రాజు తన ప్రశ్నకు తానే నవ్వుతూ అడిగినాడు , " దేవతలకు హుతము , ప్రహుతము అని రెండు విధములుగా పూజ. హోమము చేయునది హుతము. ఈ బలి మొదలైనవన్నీ ప్రహుతములు. సరే , హోమము సంగతి మరచినారేమి ? "

" దానిని పురోహితులకు అప్పజెప్పినాము. వారు వచ్చి దాని విషయమును చెప్పెదరు " 

         సరిగ్గా అప్పుడే రాజ పురోహితుడు అశ్వలుడు వచ్చినాడు. అతడు రాజ మర్యాదను , రాజాశీర్వాదమును  ఒప్పించి , " సన్నిధానములో అనుజ్ఞ అయిన విధముగా  రేపటి దినము ఒక హవనమునకు సర్వమునూ సిద్ధపరచి యున్నాము. అయితే , గృహ్యసూత్రములలో ఎక్కడా దీనికి తగిన క్రమము దొరకలేదు. కాబట్టి శ్రీ సూక్త విధానముతో హోమము , దానితో పాటు దేవరాజయిన ఇంద్రునికి ఒకటి , దేవ గురువైన బృహస్పతికి ఒకటి, చివరికి స్విష్టకృద్ధోమము , ఇవన్నీ చేయునది అని నిర్ణయమైనది. " 

         రాజు , ’ రేపు కూర్చుని , నిధి దొరికినపుడు ఏమి చేయవలె ననునది బ్రాహ్మణములలో ఎక్కడైనా చెప్పబడి ఉందేమో చూడండి. రేపటి నుండీ ఒక మండలము ఈ హోమము జరగనీ. అలాగే అలంకార పంక్తి , భూరిభోజనములూ జరగనీ. అలంకార పంక్తిలో కూర్చున్న వారికి రాజభవనములో హోమములో ఋత్త్విజులకు దొరికే దక్షిణనే ఇచ్చెదము. విత్తశాఠ్యం న కుర్యాత్--ఎక్కడా లోభపు పేరే రానివ్వకండి. " అన్నాడు. 

ఇద్దరూ , " చిత్తం , అటులనే " అన్నారు. 

Tuesday, March 12, 2013

61. " మహాదర్శనము "-- అరవై ఒకటవ భాగము-- దేవతానుగ్రహము


 61.  అరవై ఒకటవ భాగము--  దేవతానుగ్రహము 

  
          మహారాజు, మంత్రి మొదలగు రాజ పురుషులను పిలిపించుకొని జ్ఞాన సత్రము జ్యేష్ఠ  శుద్ధ సప్తమి నుండీ పౌర్ణమి వరకూ జరగవచ్చునని నిర్ధారించినాడు. దూరపు  మిశ్ర , ఫణి , హిమాలయములకు అవతల అక్షమాల , చీనా దేశముల నుండీ , దక్షిణ దేశపు ప్రసిద్ధ గురుకులములనుండీ, బ్రహ్మ , శ్యామ , మలయ దేశముల నుండీ విద్వాంసులు రావలెను అని అతని ఇచ్ఛ. " మా ఆహ్వానము వెళ్ళి చేరుటకు ఒక నెల. అక్కడినుండీ దూతలు తిరిగి వచ్చుటకు ఒక నెల , దూర దేశముల నుండీ విద్వాంసులు వచ్చుటకు ఒకటిన్నర నెల , మొత్తానికి ఎలాగైననూ మూడు నెలలు కావలెను. కాబట్టి జ్యేష్ఠ శుద్ధమే సరియైనది. " అని అందరూ చేరి సిద్ధాంతము చేసినారు. ఆ దినపు విశేషమేమంటే రాజు మంత్రాలోచనా మండలములో రాజపురోహితుడు భార్గవుడు లేడు. 

          రాజాజ్ఞ ప్రకారము ఆ నాటి నుండే యజ్ఞ మంటపము , విద్వద్వసతి , జలాశయముల నిర్మాణము ఆరంభమైనది. మరుసటి దినము శుభ ముహూర్తములో రాజు అమృత హస్తములతో జ్ఞాననగరపు శంఖు స్థాపన , శిలాన్యాస ప్రతిష్ఠ అయినది. నగరోద్యానములో వసతులు , అక్కడక్కడ కృత్రిమ జలాశయములు , దానికి దక్షిణాన విశాలమైన బయలులో యజ్ఞమంటప ఏర్పాట్లయినాయి. 

          యజ్ఞ మంటపము విద్వాంసులు , మహారాజులు , ప్రేక్షకులూ మొదలైనవారు కూర్చొనుటకు అనుకూలముగా విశాలముగా రచింపవలెను అని రూఢి అయినది. 

          గంగా యమునా తీరములలో, సింధూ సరస్వతుల సమీపములో , దక్షిణాన నర్మదా , తపతీ , కృష్ణా , గోదావరీ , కావేరీ , తామ్రపర్ణీ తీరములలోను , సముద్ర తీరములలోనూ గురుకులములనూ , ఆశ్రమములనూ కట్టుకొని ఉన్న విద్వద్వరేణ్యుల కందరికీ ఆహ్వానములు వెళ్ళినాయి. అట్లే, దూర దేశపు రాజులకు , తమ వద్దనున్న మహా విద్వాంసులను పిలుచుకొని జ్ఞాన సత్రమునకు రావలెనని పిలుపు వెళ్ళింది. అలాగే హిమాచలము నుండీ దక్షిణపు సముద్రము వరకూ ఉన్న నానా దేశముల అధిపతులందరూ విద్వాంసులతో పాటు రావలెనని ఆహ్వాన పత్రికలు వెళ్ళినవి. 

          జ్ఞాన నగరపు నిర్మాణము వేగముగా జరుగుతున్నది. చెరువులు , బావులు , తటాకములు రూపు దిద్దుకుంటున్నాయి. కృత్రిమ కొండలు , వనాలు , కట్టలతో కూడిన మహా వృక్షములూ రాజవీధులూ అన్నీ సృష్టియగుచున్నవి. విశాలమైన భవ్యమైన యజ్ఞ మంటపము పైకి లేస్తున్నది. నగరపు వర్తకులు రాబోవు జన సమూహములకని ధాన్యాదులను రాజ సహాయముతో సేకరిస్తున్నారు. రాజాజ్ఞగా రాజధాని అంతా సింగారిస్తున్నారు. రాజధాని చుట్టు పక్కల గోపాలులు ఏడు దినముల జ్ఞాన సత్రమునకు వచ్చువారికి కావలసిన పాలు , పెరుగు , నెయ్యి , మొదలగునవి సేకరించుటకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా జాగృతమై నగర నిర్మాణము వైపుకు పరుగెడుతున్నది. రాజు ప్రతి దినమూ మిత్రులూ , పరివారముతో కూడి గుర్రములపై కూర్చొని వచ్చి అన్నీ వీక్షిస్తూ పర్యవేక్షిస్తూ వెళుతున్నారు. 

          ఒక దినము రాజుకు ఏదో ఆలోచన వచ్చి, " నేనెంతటి వాడను ? ఈ భారీ కార్యమునకు చెయ్యి వేసి నగుబాటయితే గతి యేమిటి ? భారత ఖండపు రాజులందరికీ , దేశపు రాజులందరికీ , మా రాజ్యపు చుట్టు పక్కల ఉన్న రాజ్యముల , మహానదీ తీరముల గురుకులాధ్యక్షులకందరికీ ఆహ్వానములను పంపించుట అయినది కదా ? వారంతా వస్తే గతి యేమి ? " అని కలవరమైనది. ఒకోసారి , " ఆలోచన ఎందుకు ? మా నగరములో కుబేరులనే కొనుక్కోగల వర్తకులున్నారు , రాజ దివాణము లోని ధనము చాలకపోతే వారితో తీసుకుంటే సరి. " అని ధైర్యము తెచ్చుకొనును. 

          ఇటునుండీ తరిమేస్తే మరలా అటునుండీ వచ్చు వేసవి ఈగల వలె మరుక్షణమే ఆలోచన వచ్చి కలచి వేయును. " వచ్చు విద్వాంసులకు వారికి దారి వెచ్చములకు కాక ఒక వెయ్యి సువర్ణములైనా సంభావనలు ఇవ్వక పోతే జ్ఞాన సత్రము అదెంతటిది ? వచ్చే విద్వాంసులు ఒక్కొక్కరే వస్తారా ? వారి ప్రధాన శిష్యులని నలుగురైదుగురునైనా వెంట  పిలుచుకొని వస్తారు. వారినందరినీ వట్టి చేతులతో పంపుటకగునా ? వారికి ఒక్కొక్క నూరైనా ఇచ్చుట వద్దా ? వారందరూ ఇక్కడున్నంత వరకూ వారికి భోజనాది ఉపచారములు కావద్దా ? ఎలాగెలాగ చూచిననూ ఒక కోటి  సువర్ణములైననూ లేకపోతే ఎలాగ ? ’ అని మరలా భీతి అయినది.   

          రాజుకు , ఆ రాత్రి భోజనము సహించలేదు. హంస తూలికా తల్పము పై పడుకున్ననూ కంటికి నిద్ర రాలేదు. తన రాజ్యపు ఉత్పత్తి యెంత ? వెనకటి వారు సేకరించి పెట్టిన ధనము ఎంత ఉంది ? తాను ప్రయత్నిస్తే ఇంకా ఎంత సమకూర్చవచ్చు ?  అని అంతా లెక్క వేసినాడు. ఎలాగెలాగ లెక్క వేసిననూ యాభై లక్షలకన్నా మించుట లేదు. తనకు ఈ జ్ఞాన సత్రమునకు కావలసినది ఒక కోటి. రాజుకు యోచన బలమై శిరోభారము మొదలైనది.  తీరని యోచన కొనసాగి జ్వరము కూడా వచ్చినది. ఇంకా ఒక్క క్షణము కూడా నిద్ర లేదు. రాజభవనపు బయటి ప్రాకారము నుండీ పిలచినా వినపడునంత నిశ్శబ్దముగా ఉన్న సమయములో , తన నిశ్వాసపు శబ్దము చెవికి ఉరుము వలె వినిపించునట్లై రాజు ఇక పండుకొనలేక  లేచి కూర్చున్నాడు.   

          అప్పుడు ఇంకొక యోచనా లహరి వచ్చినది., " ఔను , ఇదంతా నేను చేస్తున్నది దేనికోసము ? బ్రహ్మిష్ఠుడైన గురువును సంపాదించుటకు. ఇంతవరకూ నాకు తెలిసినవారిలో భగవానులు ఆ పట్టమునకు యోగ్యులు. సరే , విదేశములలో విద్వాంసులే లేరా ? వారెవరైనా వీరికన్నా ప్రబలులైతే ఏమి చేయవలెను ? నేనుగా ఇతడి అవమానమునకు కారణమవుతాను కదా ? మరి , నేను అంత అభిమానవశుడనై చేస్తున్నానా ?  లేదు , అలా అనుటకు లేదు. ఆనాడు ఆతని ఆశ్రమమునకు వెళ్ళి సంహితా బ్రాహ్మణోపనిషత్తులను విన్నపుడు మొదలై , దినదినమూ పల్లవించి పెరిగిన అభిమాన మహా వృక్షము ఇప్పుడు హృదయమంతా నిండిపోయినది. నేను కూడా ఆ అభిమానమునకు వశుడనై పోకూడనంత దూరము , తిరిగిరాలేనంత దూరము వెళ్ళినాను. ఇక వెనుతిరిగి వచ్చుట కానిపని. ఇప్పుడు నాకున్న సర్వస్వమునూ , దానితో పాటు భవిష్యత్తును కూడా చేర్చి వితరణ చేసి ఈ సత్రమును సాధించవలెను. సాధ్యమా ? సాధ్యమా ? "

          రాజుకు ఆందోళన , భయమూ దిగులూ పట్టుకున్నాయి. " అవివేకమైనది కదా , దీనిని సరిదిద్దుకొనుటకు సాధ్యమయ్యేటట్లు లేదు కదా ? " అని హృదయ భారము ఎక్కువైంది. వేలకొద్దీ , కాదు ..లక్షలకొద్దీ సైన్యము ఎదురైనా బెదరక ముందుకురికే వాడు ఇప్పుడు బెదిరిపోయినాడు. పిల్లవాడికి గొగ్గయ్యను చూపినట్లై , ఒణికి పోయేటట్లు బెదరినాడు. ఆ అర్ధరాత్రిలో ఒళ్ళంతా చెమట్లు పట్టి స్నానము చేసినట్లయినది. ఆ చింతా భీతి లో , కలవరపు భయము లో రాజుకు తానెక్కడున్నానన్నది మరపు వస్తున్నది. ఏమి చేయవలెనన్నదీ అర్థము అగుట లేదు. కమ్మిన చీకటిలో ఉన్న కనులు కూడా పోయినట్లైనది. చెవులతో నైనా ఏదైనా విని గుర్తు పట్టి వెళదామన్నా చెవులు కూడా మూసుకు పోయినట్లు అయింది. పైకి లేచుటకు ఊపిరి చాలదు , పండుకొని యుండుటకు   అగుట లేదు , కనులు తెరచుటకు కూడా భయమగుచున్నది. చివరికి తాను ఎవరు ? ఏమిటి ? అనునది మరచిపోయి, ఎందుకు భయపడుతున్నదీ మరచిపోయి , భయము మాత్రము మిగిలి శరీరమంతా గడ గడ   ఒణుకుతున్నది. 

          అట్లే కొంతసేపు అతడు నలుగుతుండగా , ఆయాసము మితిమీరినట్లై జీవుడు స్వస్థానమును వదలి గొంతుకు దిగినాడు. " ఛీ, ఇంత బెదరిన వాని దేహములో మేముండ కూడదు " అని కరణములన్నీ వదలివెళ్ళినాయా అన్నట్లు కరణములు నిశ్చేష్టమౌతున్నాయి. దేహము అలసిపోయి , ఊరికే పడిఉన్నది. జీవుడు కలగంటున్నాడు. 

          కలలో ఒక భారీగా ఉన్న పెద్ద తోపు. అక్కడ చీకటి చేతితో దేవుకొని నింపుకోగలిగినంత  దట్టముగా కమ్ముకొని ఉంది. ఎటు తిరిగిననూ ఒక భారీ వృక్షము అడ్డముగా ఉంది. చెట్లమధ్యలో సందు చూసుకొని వచ్చుటకు కనులున్ననూ వాటి సహాయము విఫలమైనట్లుంది. ఏదో భయమగుచున్నది. చీకటి జంతువులైన ద్విపాద , చతుష్పాదములన్నీ అక్కడ చేరి తనపై దాడి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లున్నవి. తానొకడే , చేతిలో ఒక ఎండు పుల్ల కూడా లేదు. అవి వందలకొద్దీ ఉన్నట్టనిపిస్తున్నది , ఏమి చేయుటో పాలు పోవుటలేదు. 

          అప్పుడు ఎవరో ఒకరు , ’ జనకా ’ అని పిలుస్తూ వస్తున్నారు. " భయమెందుకు ? జనకా , ఈ చీకటి , ఈ చెట్లు , ఈ పైన పడుటకు కాచుకున్న జంతువులు అన్నీ నీ మనో సృష్టి. ’ మీరంతా నేనే ’ అను . దానికదే మందు. నువ్వు ప్రత్యేకుడివి కాదు అను. ఇదంతా చేరితే ఒకటి , ఆ ఒకటి నువ్వే అను. " అంటున్నారు. జనకుడు తనకు అది అర్థము కాకున్ననూ వారు చెప్పినట్లే అంటున్నాడు. దేహమే తాను అన్న భావము కరగిపోతున్నట్లనిపిస్తున్నది. చైతన్యుడైన తాను అంతటా ఉన్న సర్వ వ్యాప్తుడను అను అనుభవము కలుగు తున్నది. అప్పుడు వేటిని చూచి భయపడ వలెనో ,  వాటిలో ఉన్న వాడూ , అవి  అయి ఉన్నవాడూ తానే అని గోచరమగుచున్నది. పైన ఆకాశములోనూ , చుట్టుపక్కల ఉన్న జడ చేతనములన్నీ ప్రసన్నమగుచున్నవి. మనసూ శరీరము లలో నిండిపోయిన కలవరమూ , భయమూ , దిగులూ అన్నీ మాయమగుచున్నవి. ఎవరో , " అభయం వై ప్రాప్తోసి జనకా " అని తలపై చేయి పెడతారు. తాను సంతోషముతో వారికి పాదాభివందనము చేస్తాడు. లేచి చూస్తే వారు తనకు చిర పరిచితులే అనిపిస్తుంది. అయినా పరిచయము గుర్తు రాదు. అలాగే కళ్ళప్పగించి చూస్తూ ’ తమరు భగవానులు కాదా ?’ అంటాడు. వచ్చినవారు నవ్వుతారు. 

          నవ్వు గలగల శబ్దము తగ్గుతుండగా దృశ్యము మారిపోవు చున్నది. సువర్ణమయ కాంతి ఉన్న ఏదో దివ్య లోకము. అక్కడ ఒక కొండంత ఇల్లు. దాని ముందర తాను సర్వాభరణ భూషితుడై , దివ్య వస్త్రాలంకృతుడై నిలుచుకొని ఉన్నాడు. తన మెడలోనున్న హారముల ప్రసూనములు అప్పుడే వికసిస్తూ చుట్టుపక్కల వ్యాపించియున్న గంధమునకు గంధానులేపనము చేస్తున్నట్లున్నాయి.

          వాకిటనున్న వారు వచ్చి చేతులు జోడించి ," దయచేయవలెను ,  తమకోసమై దేవగురువులు వేచియున్నారు " అని లోపలికి పిలుచుకొని వెళతారు. లోపల ఒక మాళిగ దాటి ఇంకొక మాళిగకు వెళితే అక్కడ గోడకి ఆనుకొని కట్టినట్లున్న ఒక బంగారు మంటపము. అటు ఇటు బంగారు స్థంభములపై బంగారు కుంభములలో నేతి దీపాలు వెలుగుచున్నాయి. ఆ మంటపములో ఒక రత్న పీఠముపై ఒకరు విరాజిల్లుతున్నారు. పిలుచుకొని వచ్చినవాడు ద్వారములోనే నిలచి , జనకునితో , ’ అదిగో , వారే దైవగురువులు. దయ చేయండి ’ అని చేయి నోటికడ్డము పెట్టుకొని చెప్పి తాను వెనుతిరిగిపోతాడు. 

          జనకుడు భయభక్తులతో ఆ పురుష చిన్మయ విగ్రహము వద్దకు వెళ్ళి , నమస్కారము చేసి ప్రసాదాకాంక్షి వలె చేతులు జోడించి నిలుచున్నాడు. దేవగురువు తరుణ ప్రాయుడి వలె కనిపించు  వృద్ధుడని తోచును. అతడు నవ్వితే దిక్కు దిక్కులన్నీ వెలుగుచున్నట్లున్నాయి. చూడగా , ఆ కాంతివేరే అతడు వేరే అనుటకు లేదు. ఆతడు మాట్లాడిస్తాడు, " జనకా , నీ భయమంతా నివారణ అయినదా ? " 

          ఆ ప్రశ్నతోనే జాగృతిలో తనను ఆవరించిన భీతి మరలా వచ్చినట్లవుతుంది . ముఖము వివర్ణమవుతుంది . దేహము కాలినట్లవుతుంది. ఒంటిలో చెమటలు కనిపిస్తాయి, " దేవా , కాపాడవలెను. ఈ భీతి చెరగిపోవునట్లు అనుగ్రహించవలెను" అని రాజు మరలా నమస్కారము చేస్తాడు. 

          దేవగురువు నవ్వి అంటాడు, " భీతి పోయినది . కానీ దాని స్మరణము  నిన్నింకా వదలలేదు. విను, నువ్వు చేయుటకు పూనుకున్న కార్యము దేవతలది. కాబట్టి దీని వ్యయము నంతా  దేవతలే వహిస్తారు. నీ రాజ భవనపు దక్షిణములో అరటి తోట ఉంది కదా ! అక్కడున్న పనస చెట్టు పక్కనే ఒక మనిషిలోతు తవ్వించు. అక్కడ నాలుగు భోషాణములలో సువర్ణము దొరకును. దానిని తీసుకొని వినియోగించు. దానిని నీకు కావలసినట్లు వెచ్చము చేయి. నీ రెండవ భీతికి కారణము లేదు. సర్వజ్ఞుడు ఓడిపోవుట ఉంటుందా ?  ఇకమీద నీవెనుక మేమున్నామని నమ్మకముంచుకొని ధైర్యంగా వర్తించు. అంతా జయమవుతుంది" అని చేయెత్తి  ఆశీర్వాదము చేసినాడు, రాజు తేలికైన మనసుతో దేవగురువుకు నమస్కారము చేసినాడు. 

          అతడికి మెలకువ అయింది. ముఖము వాడిపోయి పానుపుపై పడిఉన్నవాడు పైకి లేచినాడు. నిన్నటి రాత్రి ఉన్న చెడ్డ గుర్తులేవీ లేవు. దేహము లఘువుగా ఉంది. చిత్తాదులన్నీ ప్రసన్నముగా ఉన్నాయి. సన్నగా వీస్తున్న చల్లగాలి ఉదయమవుతున్న సూచనను తెచ్చింది. తొలగుతున్న చీకటి అది నిజమేనని సాక్ష్యము చెపుతున్నది. అక్కడొకటి , ఇక్కడొకటిగా అరుస్తున్న  పక్షులు ఔను, ఔను అంటున్నట్లున్నాయి .

          రాజు కిందటి రాత్రి జరిగినదంతా జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఆశ్చర్యమైనది. అయినంతలో ఏ కొంచమూ మరచిపోలేదు. అలాగే , కల గుర్తొచ్చింది. అదికూడా ఏ మాత్రమూ మరపు రాకుండా అన్నీ గుర్తొచ్చినాయి. మొదటినుండీ చివరివరకూ వివరాలన్నీ గుర్తున్నాయి. 

          రాజుకు తాను కన్న కల తన కలవరము వల్ల కలిగినది అనిపించలేదు. భగవానులు వచ్చినారు , ’ అంతా నువ్వే ’ అన్నారు. ’ అభయం వై ప్రాప్తోసి జనకా ’ అన్నారు. ఆ తరువాత దేవ గురువుల దర్శనమై , వారు నిధి విషయము చెప్పినారు. ’ ఇకమీద నీవెనుక మేమున్నామన్న నమ్మకముతో వర్తించు. అంతా జయమవుతుంది ’ అన్నారు." సర్వజ్ఞుడే గెలుస్తాడు " అన్నారు.  ఇంకొంచము సేపటికి స్నానము చేసి , నిత్య కర్మలన్నీ ముగించి అరటితోటలో తవ్విస్తే అప్పుడు కల నిజమగునా కాదా అని తెలుస్తుంది ’ అని నిర్ణయించుకొన్నారు. అంతలో ప్రాతః కాలపు మంగళవాద్యములూ , దాని వెనకే వందిమాగధుల స్తుతీ వినిపించినాయి. ఆ సుశ్రావ్యమైన వాద్య గీతములు భవిష్యత్తు యొక్క దూతలవలె ఉండి అతనిని ఉత్తేజపరచినాయి. 

          " మంత్రి , కోశాధికారులకు అయినంత వేగముగా వచ్చుటకు వర్తమానము చేయి. తవ్వుటకు నలుగురైదుగురు మనుషులను సిద్ధముగా ఉండమని చెప్పు " అని సేవకుడికి చెప్పి రాజు స్నానమునకు వెళ్ళినాడు. 

          రాజు అన్నీ ముగించుకొని వచ్చు వేళకు మంత్రి , కోశాధికారి ఇద్దరూ వచ్చి కనిపించినారు. రాజు వారి మర్యాదను స్వీకరించి , తనకు ఆదినము పొద్దున్నే అయిన కల లోవి ఎంత చెప్పవలెనో అంత చెప్పి ,వారిని పిలుచుకొని అరటి తోటకు వచ్చినాడు. అరటితోటలో ఉన్న పనస చెట్టు పక్కన తవ్వుటకు అవకాశమున్నది పూర్వ దిక్కులో మాత్రమే. పడగ విప్పిన ఫణిరాజు అక్కడ వీరికోసమే కాచుకొనియున్నట్లు , వీరిని చూడగనే పడగ దింపి వెళ్ళిపోయినాడు. అక్కడే రాజు తవ్వించినాడు. మనిషి లోతు తవ్వగానే పారకు ఏదో లోహపాత్ర తగిలింది. ఖణేల్ మని శబ్దమయింది. అందరి కుతూహలమూ ఇనుమడించింది. 

          ఇంకొంచము తవ్వగనే ఒక లోహ భోషాణము దొరికింది. దానిని పైకి తీసినారు. దానిని ఎత్తుటకు లావుగా పుష్టిగా ఉన్న నలుగురు  కావలసినంత భారముగా ఉంది. దాని పైన ఒక రాతి ఫలకముతో మూసినారు. రెండువైపులా పట్టుకొనుటకు లోహపు చెవులవంటి కొండీలున్నాయి. భోషాణము ఇత్తడిది. అయినా కొంచము కూడా రంగు మాయలేదు. 

         మంత్రీ , కోశాధికారి చేరి భోషాణమును ఎత్తినారు. పైకి వస్తుండగా రాజుకూడా దానిని పట్టి పైకి లాగినాడు. మూతతీసి చూడగా దానిలో మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సువర్ణపు నాణెములు. ఆ నాణేములపై , ఒకవైపు ఛత్రమున్న సింహాసనము పై ఆశీర్వాదము చేస్తున్న ముద్రయున్న రాజొకడు , ఇంకొకవైపు ఏదో అజ్ఞాత లిపిలో ఉన్న ఏదో ఒక శ్లోకము. మధ్యలో ఒక చెట్టూ,  దాని మొదట్లో ఒక ఆవు. 

         దానికింద ఇంకొక భోషాణము. దానిని పైకి తీస్తే , దానికింద ఇంకొక భోషాణము. దానినీ పైకి తీసి చూస్తే దానికింద కూడా ఇంకొక భోషాణము. మంత్రి , కోశాధికారులు తోటమనుషులను పిలచి వారి సహాయముతో ఆ భోషాణములను తీయించి అన్నీ రాజభవనమునకు పంపించినారు. కోశాధికారి , ఇతరుల సహాయముతో , ఒక భోషాణములోని నాణెములను లెక్కించినారు. ఒక్కొక్క భోషాణములోనూ ఒక్కొక్క లక్ష ప్రకారము మొత్తం నాలుగు లక్షల నాణెములున్నాయి. కోశాధికారి , " ఇవి ఒక్కొక్క దానికీ మన నాణెములు ఇరవై అయిదు , ఆ లెక్క ప్రకారము దీని వెల ఒక కోటి. " అన్నాడు. 

          రాజుకు వెనుకటి దినము తాను కోరినది ఒక కోటి అని గుర్తొచ్చింది. " ఇదంతా జ్ఞాన సత్రము కోసమే ప్రత్యేకంగా వినియోగించవలెను ’ అన్నాడు. 

కోశాధికారి, " అనుమతి అయితే దీనినంతా కరగించి మన నాణెములుగా అచ్చు వేయిస్తాను " అన్నాడు. 

రాజు , " పది వేల నాణెములు తీసి ఉంచండి , మిగిలినవి మన నాణెములు చేయండి " అన్నాడు. 

          ఆ దినము సంజ లోపల రాజధాని నిండా సమాచారము వ్యాపించింది. ఎక్కడ చూచినా జనాలు గుంపులు గుంపులుగా అదే వార్తను చిన్న గొంతులతో చర్చిస్తూ ఔనా ? అనేవారే ! వీధి జనాల నోటిలో పడిన వార్త క్రమేణా ఇళ్ళకు కుడా వ్యాపించింది. గృహిణులు చేస్తున్న పనిని వదలి , పక్క ఇంటికి వెళ్ళి, ’ ఏమండీ , అది నిజమేనా ? అంటారు. ఆమె, " ఏమోనమ్మా! వారు మాట్లాడుకుంటున్నారు, రాజభవనములో అది ఏదో తోటలో దొరికిందంట. లెక్క పొద్దుటినుంచీ చేస్తున్నా ఇంకా ముగియలేదంట" అంటుంది. 

          ఇంకో చోట ఒకడు అడిగినాడు , " మీరెన్నైనా చెప్పండి , నిక్షేపము దొరకవలెనంటే దేవాంశ ఉండవలెను. మన మహారాజులు దేవతలపై చాలా భక్తికలవారు. అదీకాక వారే దేవాంశ సంభూతులు. లేకపోతే ఇంత ధనము దొరుకుతుందా ? "

" అది ఎవరు దాచినదో ? అదేమైనా తెలిసిందా ? " 

          " ఇంకో విశేషమేమిటో తెలుసా ? దొరికినవన్నీ నాణెములు. ఒక్కొక్క నాణెమూ అరచేతి వెడల్పూ అరచేతి మందము. ఆ నాణెము చెడగొట్టి ఇప్పటి నాణెములు చేస్తే ఒక్కొక్కటీ నూరు అవుతాయంట ! "

" ఇదంతా అయినాక , మహారాజులు దొరికినదంతా జ్ఞాన సత్రానికే ఖర్చుపెడతారంట ! అది కాదా అసలు గొప్ప ? "

          " అదేమి గొప్ప లెండి , మీకు మనుష్య స్వభావము తెలియదు , అంతే. ఇప్పుడు జ్ఞాన సత్రము చేయవలెను అని పూనుకున్నారు. సమయానికి సరిగ్గా ఒక నిక్షేపము దొరికింది. దానిని, ఉద్దరగా దొరికినది ఊరి నిర్మాణానికి అని ఆ సత్రానికి కేటాయించినారు. ఏమి మహా ! " 

          " అదీ నిజమే అనండి , లేకపోతే ఈ కోట్లాది సువర్ణాలు ఎక్కడనుండీ తేవలెను ? మూడునాలుగు తరాలనుండీ రాజ భవనములో కూడబెట్టిన ధనమంతా తీయాల్సి వచ్చేది. "

" రాజ భవనములో నిజంగా ఎంత సేకరించి ఉంటారండీ ? " 

          " ఎంతేమిటి ? ఒక కోటి ఉంటే ఎక్కువ. మన విదేహరాజులు ఇతరులవలె కాదు. వీరు చేస్తున్నట్లు వెనుక జ్ఞాన సత్రములు జరిగి ఉండక పోవచ్చు . కానీ ప్రతి సంవత్సరమూ విద్వత్ సభలు జరిగి , విద్వాంసులకు కావలసినంత ఇచ్చేవారు. వీరు కూడా ఇతర రాజుల వలె భద్రముష్టి గల వారైతే ఎంతో కూడబెట్టి ఉండవచ్చును. "

          ఆ వేళకు ఇంకొకడు వచ్చి గుంపులో చేరినాడు. " ఇంకొక సంగతి తెలుసా ? ఆ నాణెములపైన ఏదో రాసి ఉందట. దానిని చదువుటకు మన ఈ నగరములోనే ఎవరూ లేరంట ! "

" అది మధ్యాహ్నపు వార్త. సంజ వార్త తెలుసా ? ఆ ముసలి శిల్పి చదివినాడంట ! వాడికి నూరు సువర్ణాలు ఇచ్చినారంట ! "

" ఏమి రాసి ఉందంట ? "

" అదేమో దేవేంద్రుడు , మనువు , మన మహారాజు పేరు చెప్పి ఇది జ్ఞాన సత్రమునకు అని రాసి ఉందంట. "

" హా! అలాగ చెప్పండి . లేకపోతే ఆ ధనమునంతా ఈ జ్ఞాన సత్రానికి కేటాయించేవారో కాదో ? "

          ఇలాగే రాత్రి ఒక జాము వరకూ వ్యర్థపు మాటలు నడచినాయి. జనాలకు వ్యర్థపు మాటలు మాట్లాడడమంటే అదేమి పిచ్చో ? అందులోనూ కాంత, కనకం అంటే ఒళ్ళంతా చెవులవుతాయి. మిథిలలోనూ అలాగే అయింది. 

Monday, March 11, 2013

60. " మహాదర్శనము " --అరవైయవ భాగము --. పూర్వ సిద్ధత


60.  అరవైయవ భాగము --  పూర్వ సిద్ధత


          మాఘ శుద్ధ త్రయోదశి నాడు బయలుదేరుట అని నిర్ణయమైనది. ఇంకా పదునైదు దినములుంది. పుష్య బహుళ ద్వాదశి దినము ఆలంబిని కొడుకును చూచి వచ్చుటకు బయలుదేరింది. సంధ్య వేళకు బండి ఆశ్రమము చేరినది. సంధ్యాస్నానానికి వెళ్ళుటకు సిద్ధమైన భగవానులు తల్లివచ్చిందని ఆమెను తీసుకొని పోవుటకు వచ్చినారు. వెంట కాత్యాయని వచ్చినది. మైత్రేయికి తెలిసి , ఆమె కూడా అత్తను చూచుటకు పరుగెత్తి వచ్చింది. 

         ఆలంబినికి కొడుకునూ కోడళ్ళనూ చూసి సంతోషము ఉప్పొంగినది. కొడుకు తల్లిని చూసి అంతే సంతోషపడినాడు. ఇద్దరు కోడళ్ళూ అత్త వచ్చిందని తల్లిని చూచినదానికన్నా ఎక్కువ సంతోషపడి ఉబ్బిపోయినారు. కొంతసేపు కుశల ప్రశ్నలు అయినాయి. 

          భగవానులు , ’ అమ్మా , మిగిలిన మాటలు తరువాత మాట్లాడుదాము , ఇప్పుడు స్నానానికి వేళయింది ’ అని లేచినారు. కాత్యాయని కూడా లేచింది. భగవానులు , ’ ఇప్పుడు నువ్వు వద్దు. అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండు. మైత్రేయి స్నానానికి నీరు ఇస్తుందిలే , " అన్నారు. కాత్యాయని తల్లిదగ్గర గారాలుపోవు పిల్ల వలె గారాలుపోతూ అడిగింది : " అదంతా కాదు , చూడమ్మా , వీరు అక్కను చూడగానే అంతర్ముఖులై ఎక్కడంటే అక్కడ ధ్యానమునకు కూర్చుంటారు. ఈ పుణ్యాత్మురాలు కూడా వారిని చూడగానే కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు వీరిద్దరూ బచ్చలింట్లో కళ్ళు మూసుకుని కూర్చుంటే , తర్వాత నేనెక్కడికి వెళ్ళవలెను ? కాబట్టి స్నానము , భోజనము మొదలైన బాహ్య కర్మలన్నిటిలో నేను వెంట ఉండవలెను. ఔనా కాదా , మీరే చెప్పండమ్మా ! " 

         భగవానులు నవ్వుతూ అన్నారు: " చూచితివా అమ్మా ! ఈమె ఎంత మాటకారి అయినదో ! ఈమె అన్నది కాబట్టి చెపుతున్నాను. నీకు తెలుసు, మొదటినుండీ నేను అంతర్ముఖుడను. పెళ్ళినాడు ఉద్ధాలకులు " నువ్వు ఆమెతో ఉన్నపుడు బహిర్ముఖుడవై ఉండవలెను " అని అనుజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మైత్రేయితో ఉన్నపుడు నాకు సహజమైన అంతర్ముఖత్వము , ఈమె తో ఉన్నపుడు ఉద్ధాలకుల అనుజ్ఞ ప్రకారము అభ్యాసమైన బహిర్ముఖత్వము. నాదేమైనా తప్పుందా ? " 

         ఆలంబినికి ఆ మొగుడూ పెళ్ళాల మాటలు బహు ముచ్చట అనిపించినది. ఇద్దరినీ దగ్గరికి తీసుకొని ఒక్కొక తొడపై ఇద్దరినీ కూర్చోబెట్టుకోవలెను అనిపించినది. కానీ , ఏమి చేయుట ? ఇద్దరూ పెద్దవారు. తన మనోభావమునూ , తనకైన మనోల్లాసమునూ కన్నులతోనే వ్యక్త పరస్తూ , " కాత్యాయని చెప్పినట్లే కానీ. నేను మైత్రేయితో మాట్లాడుతూ ఉంటాను , మీరు స్నానము చేసి రండి. " అన్నది. 

         కాత్యాయని , " అక్కా , నేను అగ్నిహోత్రమయ్యే వరకూ రాను. కాబట్టి మా స్నానము తరువాత నువ్వూ స్నానము చేసి , అమ్మకూ స్నానము చేయించి మడి బట్టలివ్వు. ఆమె సంధ్యా కర్మలకు నీరు మొదలైనవి ఇచ్చి , ఆమె అనుష్ఠానమునకు కూర్చున్న తరువాత నువ్వు నీ అనుష్ఠానమునకు కూర్చో. అమ్మా ! మీ అనుష్ఠానము ముగిసేలోగా నేను వచ్చేస్తాను" అని వెళ్ళిపోయింది. వడివడిగా వెళుతున్న ఆ భామినిని ఆలంబిని కళ్ళప్పగించి చూస్తూ , ’ ఇటువంటి ఈమె ఆశ్రమపు రాణియగుటలో అతిశయమేముంది ? ’ అనుకున్నది. 

         ఎంతైనా మైత్రేయి కూడా ఆడది కదా ? అత్త చూస్తున్న రీతిని చూడగనే ఆమె కాత్యాయని విషయములో ఏమేమి ఆలోచించినదో గ్రహించినది, " ఆమె అలాగే అత్తా ! జనుల స్వభావములను ఎంత సూక్ష్మముగా గ్రహిస్తుందనుకున్నారు ? అది చాలదన్నట్టు తాను ఆజ్ఞ ఇస్తున్నపుడు అదేమో విశ్వాసమూ , వినయమూ చూపించి , ఆజ్ఞలోని నిష్ఠురత్వాన్ని పోగొడుతుంది. అలాగ ఉన్నందువల్లనే ఆశ్రమములోని జనాలు , గోవులు కూడా ఆమె మాటను మీరలేరు. నాకైతే ఆమె మాటంటే గౌరవము ! అత్తా , నిజంగా చెపుతున్నాను, ఈమె నన్ను సొంత అక్కలాగా చూసుకుంటుంది. ఎక్కడ , ఏమి చేస్తే , ఏమి పలికితే అక్కడ నొచ్చుకుంటానో అని ఒళ్ళంతా కళ్ళతో  చూస్తూ ఉంటుంది. వరసకు నేను చెల్లెలు కదా ? అయినా నన్ను పెద్దదాని వలె చూస్తుంది. ఆమె గుణము ఎంత పొగడినా చాలదు. " అన్నది. 

ఆలంబినికి ఆ స్తుతి మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. " అలాగైతే , నీ పని యేమిటి ? వంటా వార్పూ అంతా ఆమెదేనా ? "

         " నా పని ఏమిటి ? పొద్దున్నే లేచి స్నానము చేసి అనుష్ఠానమునకు కూర్చోవడము. మరలా భోజనము వేళకు వచ్చి ఆమెతో పాటు భోజనము చేయడము. ఎప్పుడైనా ఆమె బయట చేరితే ఆమె పనులన్నీ నేను చేయడము. ముఖ్యముగా వారికి కావలసినది స్నానము, వేళకు సరిగా భోజనము. వారు మాత్రం ఇంకేమి ఉపచారములు అడుగుతారు ? " 

" సరే , నీ భర్త నీతో సరిగ్గా ఉంటున్నారు కదా ? " 

" వారు దేవతా పురుషులు. ప్రియ శిష్యుడితో ఉండుటకన్నా ఎక్కువగా విశ్వాసముతో ఉంటారు. అయినా , నా మనసు, వారికన్నా కాత్యాయనికే నా మీద ప్రేమ ఎక్కువ అంటుంది. " 

         " నాకు ఈ మాట విని చాలా సంతోషమైనది. మీ సవతులు ఇలాగ అక్కచెళ్ళెళ్ళ వలె ఉండుట మా భాగ్యము. ఈ జన్మంతా ఇలాగే ఉండండి అని నా ఆశీర్వాదము. మంచిది , మైత్రేయీ , కాత్యాయని ఊరగాయలు ఏమేమి పెట్టింది ? ఇంకా వడియాలు , వడలు , ఉప్పుమిరపకాయలు చేయలేదా ? ముఖ్యంగా   మిడి మామిడికాయ పెట్టిందా లేదా ? " 

          మైత్రేయి నవ్వి అంది , " నేనింకా , కాత్యాయని భగవతియై ఆశ్రమములో ఎలాగ నడచుకొంటున్నది అని అడుగుతారనుకున్నాను. మీరు గృహిణి కార్య భారమును గురించి అడిగినారు. మిడి మామిడికాయ  అయినది. పనిభారము ఎక్కువైతే నన్ను పిలుస్తుంది. అలాకాక ఎప్పటి వలె అయితే , ఆమె చేసే పనిలో చేయి వేసేందుకు వెళితే , " ఈ చాకిరీ అంతా నాకు వదిలేయి. నువ్వు పుట్టింది కళ్ళు మూసుకుని కూర్చొనుటకు. నువ్వు వెళ్ళు. నువ్వు నీ పని చేయి , మీ సేవ నన్ను చేయనీ " అంటుంది. నేను ఏ జన్మలో ఈశ్వరాధనను ఎంతబాగా చేసినానో ? దాని ఫలముగా మీ ఇంట చేరినాను. " 

           ఆ వేళకు కాత్యాయని స్నానము చేసి వచ్చి , ’ అక్కా, లే , ఇక నువ్వు స్నానము చేసి అమ్మకు స్నానానికి నీరు ఇవ్వవలెను ’ అన్నది. మైత్రేయి స్నానానికి వెళ్ళినది. కాత్యాయని ఘడియ కొకసారి వచ్చి ఆలంబినిని మాట్లాడిస్తుంది. " ఎంత పని చేసినారమ్మా , మీరు వచ్చేది ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండెడిది ? పైగా అక్కడినుండీ మాంచి ఎండలో బయలుదేరి వచ్చినారు. దారిలో ఎంత ఆయాసమైనదో, ఏమో ? " అని అనేక రకాలుగా ఉపచారము చేసినది. 

         రాత్రి మొదటి జాములో తల్లీ కొడుకులు ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. కాత్యాయని మంత్రదండము ఉన్నదాని వలె , పులుసు , కూర , పచ్చడి చేసింది. వాటితో పాటు వడియాలు , వడలు , సజ్జన హృదయము వలె సుఖమైన నెయ్యి , రాతి వలె గట్టిగా తోడుకున్న పెరుగులతో భోజనము తృప్తికరముగా ఉండినది. 

         మైత్రేయి , కాత్యాయినులు భోజనము చేసి వచ్చే వేళకు తల్లి తాంబూలము వేసుకుంటూ తాను వచ్చిన పని కొడుకుకు చెప్పింది. కొడుకు ఎవరెవరు వస్తారు అని విచారించినాడు. ఆమె , వచ్చువారందరినీ చెప్పింది. కొడుకు అడిగినాడు, "  దేవి గార్గి మనతో పాటు వచ్చేదేమిటి ? ఆమె విద్యా ప్రస్థానమే వేరు కదా ? " 

తల్లి , రాజ భవనము సమాచారము చెప్పి, జ్ఞాన సత్రపు సంగతి ఎత్తి , ఆమె వచ్చుటకు కారణమిదీ యని వివరంగా చెప్పింది. 

          కొడుకన్నాడు , : " మీరు అంత దూరము వెళ్ళనవసరము లేదు. జ్ఞాన సత్రము కావాలన్నా , వైశాఖ బహుళము వరకూ అగునట్లు లేదు. దేశ , విదేశములనుండీ విద్వాంసులనందరినీ పిలిపించవలెనంటే దానికి పూర్వ సిద్ధత ఎంత కావలెను ? ఏమి కథ ? ఒక వేళ మనము వచ్చులోపల అది జరిగిపోయిందనుకో , నష్టమేమిటి ? అదంతా అటుండనీ , నువ్వు బయలుదేరు అంటున్నావు. మాత్రాజ్ఞా పాలించుట మాత్రమే నాపని. వీరిని అడుగు , వీరేమంటారో ? "

కాత్యాయని " మేము కూడా తోక వెంబడి నారాయణా అంటాము , ఏమే అక్కా ? " అన్నది.

" మైత్రేయి, " అంతే కాక ? "  అన్నది .

Sunday, March 10, 2013

59. " మహాదర్శనము " --యాభై తొమ్మిదవ భాగము --తీర్థ యాత్ర


59.  యాభై తొమ్మిదవ భాగము --  తీర్థ యాత్ర


భార్గవుడు రాజభవనము నుండి నేరుగా దేవరాతుని ఇంటికి వచ్చినాడు. అతడూ ఇంటిలోనే ఉన్నాడు. 

         " ఆచార్యా నా ఇష్టము నెరవేరింది. బహు దినములనుండీ ఉప్పు తిన్న దేహము , ఆ ఉప్పునిచ్చిన ప్రభువు అనుమతి లేకనే వెళ్ళిపోవుట ఎలాగ ? అని ప్రబలమైన యోచన వచ్చియుండెను. ఈ దినము కాలము అనుకూలమైనది. నా చివరి సమాలోచనను నిర్వహించి ప్రభువు కొచ్చిన సంకటము దూరము చేసినాను. నా సంకటము కూడా దూరమైనది. "

        దేవరాతునికి అర్థము కాలేదు. భార్గవుడు రాజభవనములో జరిగినదంతా చెప్పినాడు. కొడుకు దొరగారిని లక్ష్యము లేకనే మాట్లాడినాడని అతనికి దిగులూ , సంతోషమూ రెండూ కలిగినవి. చివరికి మహారాజు అతడి మాటను అంగీకరించినాడని విని , ఒకటి పోయి రెండోది పూర్తిగా నిండిపోయింది. 

" సరే , మరి ఇప్పుడేమి చేయవలెనని ఉన్నారు ? "

" చేసేదేముంది ? ఒకసారి తీర్థ యాత్రకు వెళ్ళుట. అది ముగియగానే వెళ్ళి భగవానుల ఆశ్రమములో ఉండుట. "

" ఇదేమో ఇప్పుడే అంటిరి కదా ? దానిని చూచి మా దంపతులము కూడా మీతోపాటే వస్తాము. " 

         " సరిపోయింది , అది ఎప్పుడో ఏమో  అన్నది తెలియకనే మనము కాచుకుని కూర్చొనుటకు అవుతుందా ? మన పని మనది , వారి పని వారిది. ఇప్పుడు చూడండి , మాఘ మాసము రాబోతున్నది. నేను పాదచారినై హిమాలయముల వైపుకు వెళతాను. నేను హిమాలయములకు వెళ్ళేటప్పటికి మాఘమాసము ముగియవస్తుంది. ఆ తరువాత వసంత ఋతువంతా అక్కడ గడిపి మరలా వానలొచ్చేటప్పటికి ఈ బయలునాడుకు వచ్చేసేదనుకున్నాను. "

" మీ ఆలోచన బాగుంది . అటులనే, ఎవరెవరు వెళుతున్నారు ? " 

" వేరెవరూ లేరు, నేనొక్కడినే వెళుతున్నాను. "

" మీరొక్కరే వెళ్ళుటకు సన్యాసులు కాదు కదా , మీ కుటుంబము వారికి ఇలాగ తీర్థయాత్ర సంగతి చెప్పినారా ? " 

" ఆమె ఆశ్రమానికే రానన్నది , ఇక హిమాలయాలకు వస్తుందా ? " 

         "ఇక్కడే మీరు పొరపడినారు. ఆశ్రమమునకు వెళ్ళు నిబంధనయే వేరు. తీర్థయాత్రకు వెళ్ళు నిబంధనలే వేరు. కాబట్టి వెళ్ళీ,  ఆమెకు చెప్పండి. యోగ్యమైన తిథిని చూచుకొని మేమూ వస్తాము. మన రెండు కుటుంబాల వారూ జతగా కలసి వెళ్ళివద్దాము. కొంచముండండి. మీరు తెచ్చిన వార్త ఆలంబినికి కూడా చెప్పవచ్చుకదా ? " 

భార్గవుడు ఆలోచించి అన్నాడు , " ఆడవారి నోటిలో మాట నిలుచుట కష్టము. కాబట్టి సూక్ష్మముగా చెప్పండి. " 

         " అదంతా అయ్యేది కాదు. చెబితే పూర్తిగా చెప్పవలెను. లేకుంటే వద్దే వద్దు. ఇక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు అంటిరి, దానికి కావాలంటే భద్రము చేద్దాము. " 

" అలాగయితే సరే " 

         దేవరాతుడు భార్యను పిలచి, " ఇదొక రహస్యము , ఎవరికీ చెప్పకూడదు " అని కట్టుదిట్టము చేసి రాజభవనపు విశేషాలన్నీ చెప్పినాడు. " చూడు , జమా జెట్టీల పోటీకి బదులు , కొమ్ములు తిరిగిన ఆంబోతుల పోటీలకు బదులు , బ్రహ్మజ్ఞానుల పోటీ జరుగుతుంది. నీ కొడుకు కూడా ఈ ఆంబోతులలో ఒకడు. బహుశః నీ ఆంబోతే  గెలవవచ్చు. అది చూచి తీర్థ యాత్రకు పోదామా లేక , ముందే పోదామా ? భార్గవులు అప్పుడే బయలుదేరి ఒంటికాలి మీద నిలబడినారు. వారికి చెప్పినాను , మీరు గృహస్థులు , మీ అర్ధాంగపు ఇంకొక కాలు కూడా వస్తే రెండుకాళ్ళతో యాత్ర బాగా జరుగుతుంది అని. వారు కూడా అర్ధాంగీకారము ఇచ్చినారు . "

         " ఔను , నాకు కూడా చాలా దినములనుండీ తీర్థ యాత్ర పిచ్చి పట్టుకున్నది. వీరి ఇంటి ఆడవారికీ అది ఉంది. పోయిన ఏడాదే వెళదామా అంటే వీరే వద్దన్నారట. ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞాన సత్రము ఎప్పుడు జరుగుతుంది ? " 

        " జ్ఞాన సత్రము ...హహ మంచి పేరే పెట్టినావు, భార్గవుల వారూ , వీలైతే మహారాజు వారికి ఈ పేరు సూచించవలెను. ఆలంబీ , మహారాజుగారు ఇది చేయవలసిన కార్యము అని ఒప్పుకున్నారు. అయితే , ఎప్పుడు ? ఏ రూపముగా ? మొదలైన వివరాలు ఒక్కటీ తెలియలేదు. "

         " అలాగయితే ఒక పని చేద్దామా ? మీకొడుకు కూడా అందులో ఒక ముఖ్యుడు అన్నారు కదా ? ఇంకా ఇది ఎవరికీ తెలీదు. ఇక్కడి నుండీ ఆశ్రమానికి వెళ్ళి వాడినీ వాడి భార్యలనూ పిలుచుకొని తీర్థ యాత్రలకు వెళదాము. మనము వైశాఖమాసపు చివరిలో వస్తాము. వాడు లేకుండా జ్ఞాన సత్రము ఎక్కడిది ? వాడు వచ్చిన తరువాత అది జరిగితే మనకు తీర్థ యాత్ర కూడా అవుతుంది , జ్ఞాన సత్రమూ దొరుకుతుంది. "

         " భార్గవులూ చూచితిరా ? స్త్రీ బుద్ధి మనకన్నా చురుకు. ఈమె ఎంతటి ఉపాయమును చెప్పింది ? ఒకవేళ యాజ్ఞవల్క్యుని వదలి జ్ఞానసత్రము జరిగితే ? " దేవరాతుడు శంకించినాడు. 

         " ఈ దినము మహారాజులు చెప్పినదానిని బట్టి , భగవానులను అందరి సమక్షములో ఎంచుకొనుటకు ఆడుతున్న నాటకమిది. అదీగాక రాజుకు విదగ్ధ శాకల్యుడి పైన అభిమానము తగ్గింది. అయినా వెనుక ఉపాద్యాయుడై ఉన్నాడని ఊరకున్నారు. వారికి తమ దేశపు వారికే రాజగురువు పట్టమును కట్టవలెనని ఆశకూడా ఎక్కువైంది. అయినా రాజగురుత్వము రాజాభిమానమును అవలంబించి ఉండకూడదను ధర్మ జ్ఞానమూ ఉంది. అంతేగాక , రాజగురువు ఇతర విద్వాంసులెవ్వరికీ తక్కువ కాకూడదు అన్న మానోన్నతి కూడా ఉంది. ఇదంతా వారు ఆ దినము ఆశ్రమమునకు వచ్చినపుడే నిర్ణయించుకున్నారు. కానీ భగవానులు పరీక్ష కావలెను అన్న తరువాత విధిలేక ఈ ఉపాయము. కాబట్టి అతడు లేకుండా సత్రము ఎలా జరుగుతుంది ? " 

         ఆలంబిని మధ్యలో కల్పించుకుంది "  ఒకవేళ మీకు అటువంటి అనుమానముంటే ఒక పని చేయండి. గార్గిని కూడా వెంట తీసుకొని వెళదాము. ఆమెకు కూడా అభిలాష ఉంది. సరియైన వారు తోడుగా  దొరికితే ఆమె రానే వస్తుందని నాకు తెలుసు. "

         ఆ వేళకు వాకిట్లో ఎవరో పిలచినట్లాయెను. ఆలంబిని వెళ్ళి చూస్తే , గార్గి. ఆమె నవ్వుతూ ఆమెను పిలుచుకొని వచ్చింది. " ఇగో , చూడండి , మన గార్గికి సహస్ర వర్షములు ఆయుష్షు. మనము ఆమె గురించి అనుకుంటున్నపుడే వచ్చినారు. " 

భార్గవ దేవరాతులు లేచి వెళ్ళి ఆమెను ఆహ్వానించి ఆసనమును ఇచ్చినారు. 

" ఎంతైనా నేను ఆడదాన్ని. నేను మీతో సమానముగా కూర్చొనేదా ? "

" మీరు ఆడవారూ కాదు , మగవారూ కాదు: విద్వాంసులు "

        ఆమె ఏమో చెప్పుటకు నోరు విప్పి , వెంటనే మనసు మార్చుకొని , " పెద్దవారు చెప్పినట్లు వింటాను " అని వారు చూపిన వేత్రాసనములో కూర్చున్నది. ఆమె బలవంతము మీద ఆలంబిని కూడా కూర్చున్నది. 

" నా విషయమేమిటి వచ్చింది ? " ఆమె అడిగింది. 

        దేవరాతుడు, " మరేమో కాదు , మేము తీర్థ యాత్రకు వెళ్ళవలెననుకున్నాము. మా వెంట ఎవరెవరిని పిలుద్దామా అని ఆలోచించినాము. అప్పుడు మీ విషయము వచ్చింది " 

" మేము అంటే ఎవరెవరు ? "

" మేము అంటే , భార్గవుల దంపతులు , మా దంపతులము , యాజ్ఞవల్క్యుల దంపతులు"

" నిజంగా ? ఎన్ని నెలలు ? "

" రెండు , రెండున్నర నెలలు. మాఘమాసములో బయలు దేరుట, వైశాఖము వేళకు హిమాలయపు క్షేత్రములు చుట్టుకొని వచ్చేసేది. "

" యోచన బాగుంది. యాజ్ఞవల్క్యుల ..కాదు , భగవానుల వెంట అన్ని దినములు ఉండుట అంటే అదృష్టముండవలెను. వారిని ఒప్పించినారా ? " 

ఆలంబిని అన్నది " ఆ పని నాకొదిలేయండి " 

" సరే, మంచిది , అటులనే. భార్గవుల వారూ , తమరు రాజపౌరోహిత్యము వద్దన్నారట , ఔనా ? "

" నిజమే. మీకెవరు చెప్పినారు ? "

        " అది నాకింకెవరు చెపుతారు ? మీ పుత్రుడు వచ్చి పొద్దున చెప్పినాడు. సంగతేమిటో తెలుసుకుందామని మీ ఇంటికి వెళ్ళినాను. మీరు లేరు, సరే ఇక్కడున్నారంటే ఇక్కడికే వచ్చినాను. "

        " నేను ఇల్లువదలి , రాజ భవనమునకు వెళ్ళి అక్కడి నుండీ ఇక్కడికి నేరుగా వచ్చినాను. అక్కడ మహారాజు గారిని చూసి , రాజ పౌరోహిత్యము నాకిక వద్దు అను చెప్పి వారి ఆమోదము తీసుకొని వచ్చినాను. "

" అయితే ఆ తరువాత విన్నదీ నిజమేనా ? "

" ఏమిటి ? "

" మీరు ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ భగవానుల వద్ద ఉండాలనుకున్నది ? "

" అదీ నిజమే "

" అలాగయితే తీర్థయాత్ర సూచన దేవరాతులు ఇచ్చిఉండవలెను ? "

" అది కూడా నిజమే "

"సరే, మహారాజులకు ఏమో అనారోగ్యమట ? ఇప్పుడెలాగున్నారు ? "

భార్గవులు నవ్వుతూ అన్నారు, " ఆరోగ్యము పాడగునట్లు చేసినది మీ భగవానులే "

" అదెలాగ ? "

         " అదిలాగ " అని జరిగినదంతా భార్గవులు చెప్పినారు. గార్గి అది విని , " భలే, భలే, అదీ పరాక్రమమంటే. ఈ దేశమునేలే మహరాజు శిష్యుడనవుతాను అని అంటే , ’ నీ గురువును పరీక్ష చేసి ఎంచుకో ’ అనవలెనంటే ఎంత ధైర్యముండవలెను ? లక్ష్యము లేకపోవడము ప్రపంచాతీతమును చూచినవారి ఆనవాలు. అక్కడ చూడండి , మా యింటికి ఆవును తెచ్చుకోవాలంటే , దాని పుట్టుబడి చూచి , కొమ్ములు చూచి , సుడి చూచి , పాలు చూచి తెచ్చుకుంటాము. అటువంటపుడు గురు శిష్యులు ఒకరినొకరు పరీక్ష చేయకనే ఒప్పుకునేదెలాగ ? భగవానులు చాలా బాగా చెప్పినారు. సరే , ఆ కారణముచేత మహారాజులకు రోగము వచ్చినది. ఔను , ఒకరికి చెప్పుకొను నట్లు లేదు , మౌనముగా భరించుటకూ లేదు, మంచి పేచీనే ! " 

మరలా గార్గి అడిగినది: " బయలు దేరేది ఏ దినము ?"

దేవరాతుడు ఉత్తరమిచ్చినాడు: " అది రేపు నిర్ణయిస్తాము. "

" సరే, నాకెలా చెపుతారు ? "

" భగవానుల పుత్రుడొచ్చి చెపుతాడు " 

" అయితే నేను వెళ్ళిరానా ? "

గార్గి లేచి నమస్కార ప్రతి నమస్కారములతో వెళ్ళిపోయింది. ఆలంబిని ఆమె వెంట వెళ్ళి కుంకుమ ఇచ్చి వచ్చినది. 

        భార్గవులూ , దేవరాత దంపతులూ ఇంకొక ఘడియ అలాగే ఉన్నారు. భార్గవులకు ఇంటికి వెళ్ళుట ఇష్టము ఉండలేదు. భార్గవులు ఇంటికి వెళ్ళి తీర్థయాత్ర సంగతి భార్యకు చెప్పి ఆమెను ఒప్పించి వచ్చి చెప్పవలెననీ , ఆ  తరువాత ఆలంబినీ దేవరాతులు ఆశ్రమమునకు వెళ్ళి కొడుకునూ కోడళ్ళనూ ఒప్పించవలెననీ నిర్ణయించుకున్నారు. 

Saturday, March 9, 2013

58. " మహాదర్శనము "--యాభై ఎనిమిదవ భాగము --ఆందోళన


58. యాభై ఎనిమిదవ భాగము--  ఆందోళన 


          భగవానులు గురుశిష్య సంబంధమై కట్టె విరచి రెండు ముక్కలు చేసినట్లు కరాఖండిగా మాట్లాడి బయలు దేరి వచ్చిన తరువాత , జనక మహారాజు స్థితి విచిత్రముగా మారిపోయింది. " నేను మహారాజుగా శిష్యత్వమును యాచించిననూ ఈతడు గురువును పరీక్ష చేసి వరించు , అంతవరకూ నువ్వు శిష్యుడవూ కాదు , నేను గురువునూ కాదు " అనేసినారే అని కోపము. మరలా , " వారు చెప్పినదీ న్యాయమే. చూచిన వారినందరినీ గురువంటుంటే బతుకుట కష్టము కాదా ? అని సమాధానము. గురువులను వెదకుట ఎలాగ ? అని ఆందోళన. " 

          జనకుని అభిమానమునకు ఇది రెండవ చెంపపెట్టు. మొదటి సారికూడా ఇదే భగవానులు , అప్పుడు కుమార యాజ్ఞవల్క్యుడై దేవతా రహస్యమును గురించి దేవతనే అడిగితే చాలు అని తిరస్కారము చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు శిష్యునిగా అంగీకరించమంటే అన్యాపదేశముగా అది సాధ్యము కాదు అని తిరస్కారము చేసి వెళ్ళిపోయినారు. అయితే , అప్పటికన్నా ఈతూరి తిరస్కారము ఎక్కువ. అప్పుడు జనక యువరాజు, ఇప్పుడు జనక మహారాజు. 

          " సరే , వారిది తప్పు అందామా అంటే , ఆ దినము ఆశ్రమములో మాకు మాత్రమే కాదు , మావారందరికీ కావలసినట్లు యథేఛ్ఛగా ఉపచారములు చేసినారు. అదీగాక , విద్వన్మణియైన దేవి గార్గి కూడా వారిని , ఈ భరత ఖండములోనే అంతటి విద్వాంసులు ఉన్నారో లేరో అని మెచ్చుకున్నారు. ఇలాగున్నపుడు , విద్వదభిమానమునకు పేరు మోసిన విదేహ రాజవంశపు వాడినైన నేను వారిని ఎలా శిక్షించగలను ? నేను రాజాజ్ఞగా ఆ గురుశిష్య సంబంధమును మాట్లాడలేదు. ఏమున్ననూ అది వ్యక్తిగతం. ఈ ప్రశ్నను రాజావమానము అనుటకు లేదు. అలాగ అనవలెనంటే ధర్మమునే తలకిందలు చేసినట్లవుతుంది. ఏమి చేయుట ? " 

          జనకునికి ఇదే యోచన అయింది. ఎంత యోచించినా భగవానులే సరి అనిపిస్తుంది. ఎలాగెలాగ చూచిననూ గురు పరీక్ష జరగవలెనని మనసు ఒప్పుకుంటున్నది. అయితే పరీక్ష ఎలాగ జరగ వలెను ? అదే ఒక శిరోభారముగా మారింది. ఎంత ఆలోచించినా విధము తెలియరాలేదు. 

          ఈ చింతలో జనకునికి ఇంకేమీ కాబట్టలేదు. మంత్రి వచ్చినపుడు రాజు నిశ్చింతగా ఉన్నట్టు కనిపించిననూ మాట్లాడునపుడు తప్పించుకొని వస్తున్న దీర్ఘ నిఃశ్వాసలు మనోక్షోభను చూపించినాయి. దేనికీ బెదరని మంత్రి , రాజు కృశించుటనూ , రాజ కార్యములలో మొదటి వలె ఆసక్తి చూపకుండుటనూ చూచి చకితుడై , రహస్యముగా పరిజనమును విచారించినాడు. " భగవానులు వచ్చి వెళ్ళినప్పటినుండీ రాజుగారికి భోజనము మీద అంత అభిమానము లేదు , ఏదో బలవంతానికి తింటున్నట్లే భోంచేస్తారు. ముఖం గంటు పెట్టుకుని ఉండక పోయినా ఎప్పుడూ ఏకాంతములోనే ఉంటారు. తమ ఆలోచనలు ఇతరులెవ్వరికీ తెలియజేయరు. " మొదలైనవి తెలుసుకొని, దీనికేమి కారణముండవచ్చును ? అని విచారించి చూచినారు. భగవానులు వచ్చిన దినము చామర , వ్యజనములు ధరించిన వారిని పిలిపించి అడిగినారు. వారు , " మేము అంతగా గమనించలేదు. కానీ భగవానులు వెళ్ళునపుడు ఏదో గురుపరీక్ష జరగవలెను , ఆ తరువాత చూద్దాము అనో , ఇంకేదో చెప్పినట్లు జ్ఞాపకము. " అన్నారు. మంత్రి దానిపైన కట్టడమును కట్టుటకు సిద్ధుడైనాడు. 

          ఒకదినము వారికి తోచింది: " మహారాజుల చింతకు కారణమును వారినుంచే ఎందుకు తెలుసుకోరాదు ?  అక్కడా ఇక్కడా విచారించి నేను కట్టు ఊహ నిజమూ కావచ్చు , అబద్ధమూ కావచ్చు. " అని మరుదినము తానే వెళ్ళాలని నిర్ధారించుకున్నాడు. 

          మరుదినము మంత్రి రాజకారణపు నెపముతో దొరవారి వద్దకు వెళ్ళు వేళకు అక్కడికి భార్గవుడు వచ్చినాడు. రాజు అతడితో మాట్లాడుతున్నాడు. మంత్రి వచ్చినాడని తెలియగనే రాజు అతడిని రప్పించుకున్నాడు. " రండి , ఈ దినము తమరి ఆవశ్యకత ఎప్పటికన్నా మాకు ఎక్కువగా ఉంది . మావల్ల సాధ్యము కాని విషయములన్నీ తమరే కదా పరిహరించేది. ఆ సంగతి కన్నా ముందు మన పురోహితుల సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడవలెను. అడగండి " అని తన పక్క మంత్రిని కూర్చోబెట్టుకొని , " చెప్పండి , పురోహితులవారూ , తరువాత ? " అన్నారు. 

          " ఎన్ని సార్లు చెప్పేది , మహాస్వామీ , నేను వారి , అనగా భగవానుల తండ్రిగారి బాల్య మిత్రుడను. ’ నేను ఆశ్రమమునకు వస్తాను , ఇక్కడ అన్నీ కొడుకుకు అప్పజెప్పి ’ అని అడిగితే , ’ అంచెలుగా మీ వైరాగ్యము దృఢమై , మీరు మరలా ప్రపంచము వైపుకు తిరుగుటలేదని ధృవము చేసుకొని రండి ’ అన్నారు. వారన్నదీ మంచిదైంది. నా అహంకారము అంతవరకూ అంతటి దెబ్బ తినిఉండలేదు. అయితే దాని ఫలము మాత్రము నిజముగా మంచిదైంది. నాకు నాలుగు దినములనుండీ ఆలోచన. ఎందుకలాగన్నాడు అని విమర్శ చేసుకొని చూచినాను. అతని మాట నిజము. నాకు తెలియకుండానే అసహనము వచ్చి నిండి మనసును పట్టి పీడించేది. దీనినుండీ వదిలించుకొనుట ఎట్లు అని కూర్చొని ఆలోచించినాను. ఇది తానుగా వదలదు . కాబట్టి ఈ ఉదయము కొడుకునూ , భార్యనూ పిలిచి వ్యవహారముల నన్నిటినీ వారికి అప్పజెప్పినాను. నేను కొంతకాలము ఆశ్రమములో ఏకాంతముగా ఉంటానని చెప్పినాను. వారిని ఒప్పించినాను. ఇక నాకు బదులుగా మరియొకరిని రాజపురోహితుడిగా చేసుకొని నన్ను విడుదల చేయమని ప్రార్థించుటకు వచ్చినాను. "

జనకుడు అడిగినాడు: " అన్నీ వదలి భగవానుల ఆశ్రమానికి ఎందుకు వెళ్ళవలెను ? అలాగ ఆశ్రమవాసులు కావలెనంటే తమరే ఒక ఆశ్రమమును కల్పించుకుంటే చాలుకదా ? "

          భార్గవుడు నవ్వినాడు : " మహారాజులు చెపుతున్నది చూస్తే , ఈ సంసారము వద్దు , ఇంకొక సంసారము కట్టుకో అన్నట్లుంది. నేను సంసారమునే త్యాగము చేయవలెనని ఉన్నాను మహాస్వామీ , ఆశ్రమమును కట్టుకొంటే , దినమూ పొద్దుటినుండీ సాయంత్రము వరకూ దాని గురించే చింతయై నేను అంతర్ముఖుడను కావాలనుకున్నది జరగదు. కాబట్టి నేను ఆశ్రమమును కట్టను. ఆశ్రమమును కట్టిఉన్న వారి ఆశ్రమమునకు వెళ్ళెదను. అక్కడ స్వాతంత్ర్యముంటుందా ? అంటారా ? సంకల్పమునే వదల వలెను అనువానికి స్వాతంత్ర్యపు ప్రశ్న ఎందుకు ? వారు అక్కడి నుండీ పంపించి వేస్తేనో ? అంటారా ? ఇల్లు వదలి ఉండుట అభ్యాసమైతే , మనసును వదలుట కూడా అవుతుంది . కాబట్టి నిశ్శంకగా వెళ్ళిపోతాను. అనుమతి కావలెను. " 

          " మాకూ ఇటువంటిదే ఒక సందర్భమొచ్చింది. అయితే మేము తమంత సులభముగా బట్టకు కావిరంగు అద్దుకొని వెళ్ళలేము. మంత్రిగారు వినవలెను , మా సంకటము కూడా భగవానుల వలననే వచ్చింది . ఆ దినము వారు వచ్చినపుడు వారి మాట మాకు బాగా నచ్చింది. మమ్మల్ని శిష్యులుగా పరిగ్రహించి , పూర్ణవిద్యను అనుగ్రహించండి అన్నాము. వారేమనవలెను ?  ’ పరీక్ష చేసి గురువులను ఎంచుకోండి , అంతవరకూ మేము మేమే , మీరు మీరే ! మీ దేశములో ఉన్నాము . మీరు రాజులు , మీరు అడిగినదానికి సమర్పణా పూర్వకముగా  ఉత్తరమునివ్వ వలెను, ఇస్తాము ’ అన్నారు. అంటే ఏమిటి ? మాటలకు ఇలాగ మోహము చెందితే మీకు గురువు దొరకడు అని నోరు తెరచి చెప్పినట్లే కదా ? అంటే , నువ్వొక పిచ్చివాడివి , నీకెందుకు వేదాంతము ? అన్నట్లే. ఇప్పుడు నేనేమి చేయవలెను ? చెప్పండి , మీరిద్దరూ ప్రవీణులు. మాకోసం ఈ సమస్యను పరిష్కరించండి. " 

          మంత్రికి రాజు చర్యలన్నీ అర్థమైనవి. ఈ ప్రశ్న రాజు మనోబుద్ధులనే కాదు , అహంకారమునే కాదు , ఆతని తత్త్వమునే పట్టి కెలికివేసింది అన్నది అతడికి అర్థమైనది. అయినా , " తానెందుకు ఇప్పుడు నోరు విప్పవలెను ? పురోహితుడు ఏమి చెప్పునో విని తరువాత విషయమును విమర్శిద్దాము " అనుకొని , లాంఛనముగా రాజు ముఖము చూసి , అనంతరము పురోహితుని ముఖము చూసి , ’ అనుజ్ఞ ఇవ్వండి ’ అన్నాడు. 

          రాజ పురోహితుడన్నాడు: " మహా స్వామీ , గురు పరీక్ష కూడా ఒక జాతక పరీక్షలాగానే. దీనిని పరిష్కరించుటకు మూడు దారులున్నాయి. మొదటిది , దైవ నిర్భర చిత్తులై దైవము తలచినట్లు కానిమ్ము అని నిశ్చయించుకొని , దైవ వ్యాపారమును నిరీక్షిస్తూ కూర్చొనుట. అయితే అక్కడ అహంకారము నిరోధించుకొని ఉండవలెను. కాబట్టి పౌరుషవంతులకు అది అంతగా నచ్చదు. రెండోది శాస్త్ర మార్గము. కన్యాపరీక్ష , వర పరీక్ష చేసినట్లు ఇక్కడ కూడా శకునాదుల చేత మొదట యోగ్యతాయోగ్యతలను చూచుకొని అనంతరము ఋణాఋణీభావము విమర్శ చేసి నిర్ణయించుట. దీనిపై కూడా స్వాభిమానులకూ , పౌరుషవంతులకూ అంత గౌరవము ఉండదు. ఇక మిగిలినది మానుష మార్గము. ఒకే జాతివైన కొన్ని పదార్థములను చూచి , వాటిలో గుణ తారతమ్యములు మొదలైనవి కనిపెట్టి ఉత్తమమైన దానిని ఎంచుకొనుట. ఇది రాజస్థానము. కాబట్టి మూడవదైన మానుష మార్గమే సరియని తోచుచున్నది. " 

" అంటే ? " రాజు అడిగినాడు. 

          మంత్రి అన్నాడు:" పురోహితుల అభిప్రాయము ఇది : బ్రహ్మవిద్యా సంపన్నులని ప్రఖ్యాతులైన వారందరినీ పిలిపించేది. వారు పరస్పర వాదముల చేత తమ తమ యోగ్యతలను ప్రదర్శించెదరు. వారిలో ఉత్తములని మనసుకు తోచినవారిని ఎంచుకొనుట. అవునా పురోహితుల వారూ ? " 

          " ఔను కానీ అది అంత సులభము కాని కార్యము. ఇప్పుడు భగవానుల విషయమై చూస్తే , మొదటిది వారు ఆజన్మశుద్ధులు. వారు గురుద్రోహులు అని ఇతరులు వారిని నిందించుట నాకు తెలుసు. అదీ ఒక రహస్యము , వినండి. వైశంపాయనులకు వారిని వదలివేయవలెనని దైవ సందేశము వచ్చి యాజ్ఞవల్క్యులు అక్కడినుండీ వచ్చేసినారు. నిజముగా వారు గురుద్రోహులు కాదు  , అంతేకాదు , దైవానుగ్రహ సంపన్నులు. కర్మ కాండ , బ్రహ్మ కాండ రెండింటిలోనూ నిష్ణాతులు అనునది అందరూ ఒప్పుకొనియే తీరవలెను. అయినా రాజ గురువులగుటకు అర్హులా యని పరీక్ష చేసి నిర్ణయించుటయే మంచిది." 

" పరీక్ష ఎలా జరగవలెనన్నది చెప్పనేలేదే ? "

          పురోహితులు మంత్రుల ముఖమును చూచినారు. ఆ చూపులో , ’ ఆ వివరములను నిర్ణయించుటకు మాకన్నా మీరు సమర్థులు ’ అని స్పష్టముగా చెప్పినట్లుంది. మంత్రులు అది అంగీకరించి అన్నారు : " మహా స్వామీ , బ్రహ్మజ్ఞానులందరూ చేరునట్లు ఒక కూటమిని పిలవవలెను. స్వయంవరములో చేయునట్లు , ఒక భారీ పణమును ఒడ్డవలెను. తమలో బ్రహ్మిష్టులు ఎవరో వారు దానిని తీసుకోండి అనవలెను. అప్పుడు తమకు అపఖ్యాతి లేకుండా వారు వారే నువ్వెక్కువా ? నేనెక్కువా ? అని వాద వివాదములు చేయుదురు. వారిలో అందరికీ సమాధానము చెప్పి నిలుచువారే అందరి కన్నా ఎక్కువ. " 

" అది నోటి మాటలతో వాదము చేయు సభ గా మారితే ? " 

          " అలాగగుటకు లేదు. బ్రహ్మజ్ఞానమనునది వట్టి మాటలు కాదు. అలాగే వట్టి శాస్త్రమూ కాదు . అక్కడ అనుభవము ముఖ్యము. ఉత్త అనుభవము మాత్రము ఉన్నవారు వాదభూమిలో దిగి బతుకుటకు లేదు. కాబట్టి అనుభవపు వెనుక శాస్త్రపు బలమున్నవారు మాత్రము రంగభూమికి దిగుతారు. శాస్త్రానుభవముల తో పాటూ వాచోవైభవము కూడా ఉంటే ఇక చెప్పనవసరము లేదు. "

          పురోహితులు మధ్యలో మాట్లాడినారు: " శాస్త్రము చెప్పునదంతా భగవానులకు అన్వయిస్తుంది. వారికి శాస్త్రానుభవములతో పాటూ వాచోవైభవము కూడా ఉంది. అదీకాక, వారు సర్వజ్ఞులు. వారిని మించగలవారు ఎవరూ ఉన్నట్లు కనపడదు. " 

         రాజన్నాడు , " మేము కూడా భగవానులకన్నా వేరెవరూ లేరు అనేవారమే ! కానీ  , ప్రత్యక్షమైననూ ప్రమాణీకరించి చూడవలెను అని మనము ఈ ఆటను రచించవలసినదే. "

" సరే , నా ప్రార్థనను కూడా ఒప్పుకొన వలెనని మరొకసారి వేడుకుంటున్నాను "

         " నేను అప్పుడే చెప్పితిని , తమరు మా తండ్రిగారి కాలము నుండీ ఉన్నవారు. రాజభవనము లో ఎప్పుడేమి జరగ వలెనను దానిని తెలిసిన వారు. తమరిని వదలిపెట్టుట ఎలాగ ? " 

" దయచేసి వదిలేయండి "

మహారాజు చాలా ఆలోచించినారు. " తమకిష్టమైనట్లే కానీ " 

Friday, March 8, 2013

57. " మహాదర్శనము "--యాభై యేడవ భాగము--సంభాషణ


57. యాభై యేడవ భాగము--  సంభాషణ


          భగవానులు రాజ భవనమునకు వెళ్ళవలసిన దివసము సమీపించినది . ఆశ్రమపు కార్య భారమునంతటినీ భగవతి కాత్యాయని వహించుకొని వృద్ధ శిష్యుల సహాయముతో నిర్వహించవలెననీ , మైత్రేయి భగవానుల నిత్య సూర్యోపాసన చేయవలెననీ నిర్ణయమైనది. నిర్దిష్ట కాలములో ఇద్దరు శిష్యులతో రాజశకటములో బయలు దేరినారు. భగవానులు రాజధాని వద్దకు చేరగనే రాజ పురుషులు వచ్చి కనిపించినారు. వీరు వారిని పలకరించి , " మేము మా తండ్రి ఆచార్యుల ఇంటిలో దిగుతాము. ఈ దినము సంజ అయినది. కాబట్టి రేపటి దినము మహారాజుల అనుమతి అయినపుడు మేము వచ్చెదము. మాకోసము మధుపర్కము మొదలగు వ్యవస్థలు చేయనక్కరలేదు అని మహారాజులకు మా పరముగా విజ్ఞాపన చేయండి " అని గట్టిగా అయిననూ నవ్వుతూ చెప్పి పంపినారు. 

          ఆచార్యుల ఇంటికి గార్గి , భార్గవుడు వచ్చియున్నారు . యాజ్ఞవల్క్యులు వారిని చూచి సంతోషపడినారు. వారు కూడా వీరికి అభివాదనములను అర్పించినారు. భగవానులు , " ఇదేమిది , ఒకవేళ దేవి గార్గి అభివాదనమును సహించినా , మాకన్నా పెద్దవారు భార్గవుల అభివాదనమును సహించుటెట్లు ? ఒప్పుకొనుట సంగతి ఇంకా దూరపు మాట." అని ప్రత్యభివాదనములను చేయుటకు వెళ్ళినాడు. ఇద్దరూ దానిని ఆపి , " తమరు జ్ఞాన వృద్ధులు. కాబట్టి తమరికి మేము అభివాదనము చేయవలెను , తమరు మాకు కాదు " అన్నారు. భగవానులు తల్లిదండ్రులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొందినారు. 

         దారిలో ఒక విచిత్రము జరిగింది . హవ్యముగా ఉపయోగించవచ్చునని కొందరు సద్యో ఘృతమును ( తాజా నెయ్యి ) ఇచ్చినారు . బాగా పాలిచ్చు గోవులను అర్పించుటకు వచ్చినారు ఇంకొందరు. కానుకలను తెచ్చిచ్చినారు అనేకులు. విశేషమేమంటే , వారందరూ లోకమును ఉద్ధరించుటకు పుట్టిన మహాపురుషుడనీ , ఆదిత్య దేవుడి ప్రసాదముగా వేదాదులను పొందినవాడనీ గౌరవించువారే ! 

          కుశల ప్రశ్నలయిన తరువాత గార్గి కొంతసేపు ఉండి వెళ్ళినారు. రాజపురోహితుడు ఇంకా ఉన్నాడు. భగవానులతో  ఏదో చెప్పవలెనని అతడికి మనసులో ఉందని అతడి ముఖమే చెప్పుతున్నది. చివరికి దేవరాతుడు, " ఏమో చెప్పాలని ఉన్నట్లుంది , చెప్పేయండి . ఏకాంతములో చెప్పవలెనంటే మేము బయటికి వెళ్ళెదము " అన్నారు. భార్గవుడు , " నిజము. ఎలాగ ఆరంభించవలెను ? ఎక్కడినుండీ చెప్పవలెను ? అని ఆలోచిస్తున్నాను. మీరు ఉంటే నాకేమీ చింతలేదు. " అన్నాడు. భగవానులు కూడా అవునన్నారు. 

          చివరికి భార్గవుడు అన్నాడు , " అయ్యా, నిన్ను నువ్వు అని సంబోధించవలెను. అదీగాక నిన్ను శిశువుగా ఉన్నప్పటి నుండీ చూస్తున్న వాడిని నేను. కాబట్టి నువ్వు అంటే కోపము చేసుకోవద్దు. ఆదినము నీ ఉపనిషద్వ్యాఖ్యానమును విన్న దినము నుండి నాకు పిచ్చి పట్టినది. నేను రాజ పౌరోహిత్యమును వదలివేస్తాను. మీ గురు కులమునకు వచ్చేస్తాను. అయితే అక్కడ నావంటి వానికి అవకాశము ఉన్నదో లేదో అని వెనకా ముందూ చూస్తున్నాను." 

          భగవానులు నవ్వినారు. " ఇపుడిది మరీ బాగుంది. మీవంటి వారికి మా గురుకులములో స్థానము లేదంటే ఏమిటి ? గురు కులమున కంతా భగవాన్ అనిపించుకున్న వారు గొప్ప అయితే , మీరు అతడి తండ్రి స్థానములో ఉండండి. అయితే గురుకులమునకు వచ్చుట గొప్ప కాదు , అక్కడ ఏమి చేయవలెను అనునది మొదట నిర్ణయించుకొని రండి. అక్కడికి వచ్చునపుడు ఇక్కడివన్నీ ముగించుకొని , మరలా ఇక్కడికి వచ్చుట లేదు అన్నట్లు రండి. నేను , నా భార్యలూ సదా మీ సేవకై సిద్ధముగా ఉంటాము " అన్నారు.

          భార్గవుడు అన్నాడు , " అయ్యా , నేనేమి చెప్పేది ? మొదట యేయే వస్తువులు ప్రియమని నెత్తిన పెట్టుకున్నానో అవన్నీ ఇప్పుడు అసహ్యములైనాయి. ఇంటిని అంత అక్కరగా అవస్థలు పడి కట్టించినానా ?  ఇప్పుడు ఆ ఇంటిలో ఉండుటయే కష్టముగా ఉన్నది . తోడునీడగా ఉండి సేవ చేస్తున్న భార్యను వదలి పోలేనని కొన్నిరోజులు నలిగినాను. ఆమె మొన్న , " కావాలంటే మీరు వెళ్ళండి , నేను రాజధానిలో ఉంటాను " అన్నది. ఇంక ఇక్కడ నన్ను పట్టి ఉంచేది ఏదీ లేదు. " 

దేవరాతుడు, " భార్గవులు చెప్పినదంతా నిజము. వారు ఈ మధ్య రాజ భవనమునకు కూడా అంతగా పోవుట లేదు " అన్నాడు.  

         భగవానులు అన్నారు , " భార్గవుల వారూ , ఈ భోగములు తమరికి చాలనిపించినాయా ? అది చెప్పండి. అవి వద్దనిపించు వరకూ ఇక్కడే ఉండండి. అవి వద్దు , మరలా వాటిని నేను కోరను అనిపించగానే వచ్చేయండి. మేము మిమల్ని కంటికి రెప్పలా చూచుకొనెదము. తమరికి కావలసినది మేము చెప్పెదము. " అన్నారు. 

         ప్రాతఃకాల విధులన్నీ ముగించుకొని, అగ్నిహోత్రము , సూర్య నమస్కారములు కానిచ్చి , వేదాదులు పారాయణము చేసి ముగిస్తుండగా భగవానుల కోసమని రాజశకటము వచ్చింది. వారు తలిదండ్రుల అనుమతి పొంది రాజభవనమునకు వెళ్ళినారు. 

         మహారాజులు సరస్వతీ విలాసములో ఏకాంతముగా వేచియున్నారు. భగవానుల అనుజ్ఞ మేరకు మధుపర్కాదులు ఉండలేదు. పూర్వాభిముఖముగా ఒరగుదిండు వేసియున్న మెత్త మీద పరచిన విశాలమైన కృష్ణాజినముతో సుందరముగా నున్న ఆసనమొకటి. దాని కుడిపక్కన అదేజాతివే ఇంకా రెండు అజినములు ఎక్కువగా వేసియున్న ఇంకొక ఆసనము. దూరములో వ్యజనములు , చామరములు పట్టుకొని సిద్ధముగా నున్న దాసీజనము. 

          మహారాజులు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి భగవానులను పిలుచుకొని వెళ్ళి పూర్వాభిముఖముగా నున్న ఆసనము మీద కూర్చోబెట్టినారు. కుశల ప్రశ్నల ఉపచారములు ముగిసిన తరువాత మహారాజు చేతులు జోడించి అన్నారు : " సంభాషణ తమరే ఆరంభించవలెను. " 

          మందస్మితముతో భగవానులు ఆరంభించినారు. " వెనుక బాలాకి గార్గ్యుడు అను విద్వాంసుడుండేవాడు. అతడికి తాను విద్వాంసుడనని అహంకారము బలు హెచ్చు. దానితో పాటు , అదేమి మహా బ్రహ్మ విద్య! గురువు లేకపోతే నేర్చుకోలేమా అని ఒక అహంకారము. అతడు ఒక దినము కాశీరాజైన అజాతశత్రువు వద్దకు వెళ్ళి , ’ నేను నీకు బ్రహ్మమును గురించి బోధిస్తాను ’ అన్నాడు. రాజుకు మిక్కిలి సంతోషమయినది. ’ అందరూ జనకుని కన్నా విద్వత్ ప్రియులు వేరొకరు లేరు అని అతని వద్దకే పోతారు. కానీ నువ్వు నాదగ్గరకు వచ్చినది చాలా బాగున్నది. బ్రహ్మవిద్యను చెప్పిస్తాను అన్న మాటకు నీకు సహస్ర సువర్ణములు ఇస్తాను ’ అన్నాడు. సంవాదము ఆరంభమయినది. 

          గార్గ్యుడు , ’ ఆదిత్యునిలో ఉన్న పురుషుడే బ్రహ్మ ’ అన్నాడు. అజాత శత్రువు, ’ ఓ బ్రాహ్మణా, బ్రహ్మము అనేది పుట్టి వచ్చినది కాదు. పుట్టి వచ్చిన , పుట్టి రానున్న సర్వ భూతములకూ అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని ఉపాసన చేసినవాడు సర్వభూత మహేశ్వరుడగును అనుదానిని నేనెరుగుదును. నువ్వు అది అయినావా ? చెప్పు .’ అన్నాడు.

         గార్గ్యుడు ఇంకా ముందుకు కొనసాగించి , చంద్రాదులను గురించి చెప్పుతూ , చివరికి , ’ శరీరములోనున్న పురుషుడిని బ్రహ్మమని ఉపాసిస్తాను ’ అన్నాడు. అజాత శత్రువు, ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క ఫలమును చెప్పుచూ, ’ బ్రహ్మోపాసకుడు బ్రహ్మమే కావలెను. అది నువ్వు అయినావా ? చెప్పు. ’ అని అడిగినాడు. 

చివరికి గార్గ్యుడు తన జంభపు ఫలమును తానే అనుభవించి , ఆ అజాత శత్రువు నుండీ బ్రహ్మోపాసనను నేర్చుకున్నాడు. "

          ఈ కథను ఉపనిషత్తులో చేర్చవలెను అని అనుమతి అయినది . దీనిని ఇప్పుడెందుకు చెప్పినాను అంటే , నాకూ అలాగ ఎవరికీ తెలియనిది నేనెరుగుదును అన్న గర్వము వచ్చి నన్ను కిందకు తోసివేయకుండుటకు. మరియు, ’ పూర్ణోపాసన ఫలము పూర్ణుడనగుట ’  అని తెలిసి ఉండనీ అని దీనిని జ్ఞాపకము ఉంచుకొనుటకు. ఇక తమరు ఏమి చెప్పెదరో అనుజ్ఞనివ్వండి. " 

మహారాజు అదివిని సంతోషముతో తలయూపినారు. 

          " బహు ముచ్చటైన ఆరంభము. ఈ కథ తమరికి మాత్రమే కాదు , నాకు కూడా మార్గదర్శకము. ఈ దృష్టితో చూస్తే మేము తెలుసుకున్నది సరియా తప్పా అని మాకు సందేహము కలుగుచున్నది. ఏమి చెప్పేది ? "

         " ఆలోచిస్తూ కూర్చోవడానికేముంది ? ఈ దేహమే నేను అన్న భావము ఉన్నంతవరకూ సందేహములు వదలవు. కాబట్టి ఎక్కడో ఒకచోట నుండీ ఆరంభించండి. లేదా , నేనే అడిగేదా ? " 

" అదే సులభమనిపిస్తున్నది " 

" సరే , మొదటిది , తమరికి ఈ బ్రహ్మ జ్ఞానపు పిచ్చి , ఎందుకు , ఎలాగ వచ్చింది ? చెప్పండి . "

          " విద్యాభిమానము మా వంశపు సొత్తు. అంతేకాక, మా తండ్రిగారు , మనలో ఒకరు విద్వద్వరిష్టుడు పుట్టవలెను అన్న అభిమానము కలవారు. నేను బాల్యములోనే , ’ యస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి ’ - ఏదైనా ఒకదానిని సరిగ్గా తెలుసుకుంటే సర్వమూ తెలియును అని విన్నాను. అలాగ అంతా తెలుసుకోవాలన్న జిజ్ఞాస నన్ను బ్రహ్మ జ్ఞానమునకు తీసుకు వచ్చింది. "

" మంచిది , తమరు ఎవరెవరిని సేవించినారు ? వారు ఏమేమి చెప్పినారు ? అనుజ్ఞ ఇవ్వండి. " 

" నేను శైలిని , ఉదంకుడు , వార్ష్ణుడు , భారద్వాజుడు , సత్యకాముడు , శాకల్యుడు అను ఆరుగురు గురువులను సేవించినాను. "

" అటులనా , వీరందరూ మాతృ , పితృ , గురువుల వలన సుశిక్షితులైన వారు. వారు చెప్పునది సరిగ్గానే ఉండవలెను. ఏదీ , ఒక్కొక్కటే చెప్పండి. " 

" శైలినుల వారు వాణియే బ్రహ్మము అన్నారు. " 

" అవును , వాణి నుండే కదా అంతా , వేదశాస్త్రముతో సహా , తెలిసేది ! కాబట్టి వాణిని బ్రహ్మమన్నారు . తరువాత ? "

" ఉదంకులు ప్రాణమే బ్రహ్మము అన్నారు . " 

" అది కూడా నిజమే. ప్రాణము లేనివాడు ఏమి చేయగలడు ?  అదీగాక , లోకము నూరారు పనులను చేయుట ప్రాణము కోసమే కదా , అందువలన వారు అలాగన్నారు. పిదప ? "

" వార్ష్ణులు చక్షుస్సే బ్రహ్మమన్నారు. " 

" అది కూడా సరియే. కన్నులతో చూడకనే ఏదైనా ఎలా తెలియును ? ఆ తరువాత ? "

" భారద్వాజులు శ్రోత్రమే బ్రహ్మము అన్నారు. "

" ఇది కూడా సరియే. శ్రోత్రము లేనివాడు ఉంటే ఏమి లేకుంటే ఏమి ? పిమ్మట ? "

" సత్యకాములు మనసే బ్రహ్మము అన్నారు. "

" అదియూ నిజమే . అన్నీ ఉన్నా మనసు లేకపోతే చేయుటకేముంది ? ఆమీదట ? "

" శాకల్యులు హృదయమే బ్రహ్మము అన్నారు . " 

        " అదీ సరియే , హృదయము లేకుండా ఇంకేముంటే ఏమి ? సరే , మీరు వీటిలో దేనిని అభ్యాసములో ఉంచుకున్నారు ? లేదా , దానికన్నా ముందే ఇది చెప్పండి , ఆయా గురువులు వీటి ఆయతనము , ప్రతిష్ఠ లను చెప్పినారేమి ? ’

" లేదు, వారు చెప్పలేదు. అలాగన్న నేమి ? "

" ఆయతనమంటే అది ఉన్న స్థలము. ప్రతిష్ఠ అంటే దేనిని పట్టుకుంటే అది దొరకునో , అది. కానివ్వండి , తమరి అభ్యాసములో ఉన్నదేది ? తమరి అనుభవమేమిటి ? "

" తమరి ప్రశ్నలే నాకు కొత్తగా ఉన్నాయి. బ్రహ్మమును గురించి అభ్యాసము చేయునదేమి ? దానివలన కలుగు అనుభవము ఎట్టిది ? "  

          " ఔను. బ్రహ్మము అన్నిటినీ తనలో ఉంచుకుని , అన్నిటిలోనూ తానుండి , వాటి బయట కూడా ఉండు అవ్యయము. దానిని గురించి అభ్యాసమంటే నేను , నేను అంటూ అన్నిటినీ ఆత్మ భిన్నముగా చూచు సంకుచిత దృష్టి లేకుండా చేసుకొనుట. ఆ సంకుచిత దృష్టి పోయేకొద్దీ మనుష్యుని ఆనందానుభవ శక్తి కూడా ఎక్కువగును. అప్పుడు గిన్నెడంత ఉన్న నీరు సముద్రమయినట్లగును. ఇప్పుడు తమరు చెప్పినవన్నీ ఏకాంశ బ్రహ్మములు. వాటిని ఉపాసన చేసిననూ ఫలముంటుంది.  కానీ పూర్ణ బ్రహ్మోపాసన ఫలముండదు. " 

" పూర్ణ బ్రహ్మోపాసన ఫలమంటే ఏమిటి ? "

" మనశ్శాంతి. రాత్రింబగళ్ళూ ఇది లేదు , అది చాలదు అని ఏడ్చే మనసు తన ఏడుపును పోగొట్టుకుని సుఖముగా ఉండుట. " 

          " ఆహా ! ఏమి మాట ? ఏమి మాట ! భగవాన్ , ఈ మాటకు , ఏడుపు పోవును అన్న తమరి మాటకు, ఏనుగంతటి కోడె దూడలున్న  ఆవుల మంద నొకదానిని మీకు అర్పిస్తాను. స్వీకరించవలెను. "

         భగవానులు సమాధానముగా యే ఉద్వేగమూ లేక అన్నారు , " తొందరేముంది ? ఉండండి. మీకు నేనింకా  ఆ పూర్ణ విద్యను నేర్పలేదు. ఆ పూర్ణ విద్యను  చెప్పనిదే మీరు బయట పడలేరు. అలాగ మీ శోకమును దాటించి ఉద్ధారము చేయకుండా మీరు ఇచ్చుదానిని గ్రహించుట ఎట్లు ? శిష్యుడిని ఉద్ధారము చేయకనే ఏమీ తీసుకోకూడదని తమరి తండ్రిగారు చెప్పేవారు. నాకు బాగా జ్ఞాపకము ఉన్నది. మీరు నాకు శిష్యులు కూడా  కాలేదు. అలాంటపుడు ఎలా తీసుకోను ? "

మహారాజులు యోచించినారు. ఒక ఘడియ తరువాత, " నన్ను తమరి శిష్యునిగా అంగీకరించి నాకు పూర్ణ విద్యను అనుగ్రహించండి. "

          " అలాగ వద్దు మహారాజా , శిష్యుడిని గురువు పరీక్షించునట్లే శిష్యుడు కూడా గురువును పరీక్షించవలెను. తన మనసు ఇతడు సరియైన వాడు అనుకున్న తరువాత యథావిధిగా గురువును వరించవలెను. కాబట్టి , తమరు పరీక్ష చేసి , తమరి పరీక్షలో గెలిచినవాడిని గురువుగా అంగీకరించవలెను. అంతవరకూ మీరు ఈ విషయపు రాజులు. తమరు అడిగినదానికి ఉత్తరమును చెప్పుట ఈ విషయ వాసులమైన మా ధర్మము. మీరు వింటున్నారు, నేను చెపుతున్నాను. మీకు విన్నామని సంతోషము, నాకు చెప్పినానని సంతోషము. నేనిక బయలుదేర వచ్చునా ? " 

          భగవానులు లేచినారు. మహారాజులు విధిలేక ఇష్టము లేకున్ననూ లేచి ప్రణామము చేసినారు. రాజ భవనము ముఖద్వారము వరకూ వచ్చి భగవానులు రాజ శకటములో కూర్చొన్న తరువాత చేతులు జోడించి వారిని వీడ్కొలిపినారు.