SHARE

Monday, April 8, 2013

72. " మహాదర్శనము " --డెబ్భై రెండవ భాగము --సర్వజ్ఞాభిషేకము


72.  సర్వజ్ఞాభిషేకము


         గార్గి వెనుకకు తిరిగిన తరువాత , కురు పాంచాల విద్వాంసులు కూర్చున్న చోట కలకలమైనది. ప్రముఖులందరూ వచ్చి విదగ్ధులను చుట్టుకున్నారు. " విదగ్ధా , కురు పాంచాల దేశములు సరస్వతి ఆవాస స్థానములనీ , బ్రహ్మలోకమునకు సమానమైన భూమియనీ ఇంతవరకూ ప్రఖ్యాతమైనవి. ఈనాడు ఆ ప్రఖ్యాతి చెరగిపోవునట్లుంది. వైదేహుడొకడు అందరినీ ఓడించి , రణములో వచ్చిన ఇతర గజములను అణచి ఓడించిన మదగజము వలె తిరుగుతున్నాడు. ఇంకా కాలాతీతము కాలేదు. ఇంకొక ఘడియ చూసి ఎవరూ వాదమునకు రాకుంటే జనకుడు యాజ్ఞవల్క్యునికి సర్వజ్ఞాభిషేకమును చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. లేవండి , మా మానమును మిగిలించండి. మీ దేశపు మానమును కాపాడండి. " అని అందరూ విదగ్ధుని మెడకు చుట్టుకున్నారు. 

         విదగ్ధుడు ఆలోచించినాడు:" యాజ్ఞవల్క్యుడు ఇతరులవలె కాదు. మాంత్రికుని వలె ఏదో చేసి ఎదుటివారిని పట్టివేయును. గార్గి రెండవ సారి అడిగిన ప్రశ్నలను ఎంత సులభముగా గ్రహించినాడు ? అంతే సులభముగా ఉత్తరమును ఇచ్చినాడు. గార్గి అన్నది , " మీలో ఎవరూ ఇతడిని బ్రహ్మవాదములో గెలువలేరు " అన్నది. గార్గి అబద్ధమును చెప్పునది కాదు. "

          విదగ్ధుడు అన్యమనస్కుడై కూర్చున్నది చూసి ఆ విద్వత్ప్రముఖులు మరలా అన్నారు. " మన విద్వత్కులానికే అపమానకరమైన ఈ ఓటమిని ఒప్పుకొని మనము ఎంతకాలము బ్రతుకగలము విదగ్ధా ? మీ తండ్రిగారు ఎంతటి విద్వాంసులన్నది పరిగణించండి. విద్యకు విఖ్యాతమైన మన దేశములోనే ఆతనిని మించిన విద్వాంసులు ఉండలేదు. అంతటివారి పుత్రులైన మీరు ఈ వాదమునకు వెనుకంజ వేయుటయా ? " 

          విదగ్ధుడు మరలా ఆలోచించినాడు: " ఔను, శకలుల కొడుకు వాదానికి బెదరనవసరము లేదు. అయితే యాజ్ఞవల్క్యుడు అందరివలె వాదము చేయుట లేదు. కానీ మావాళ్ళు చెప్పుచున్న మాట కూడా నిజము. ఇక్కడేమవుతుంది ? వాదములో ఓటమో , గెలుపో.  అయితే , కురుపాంచాలములలో మాత్రమే కాదు , గంగా యమునా మధ్యనున్న దేశములన్నిటా ప్రఖ్యాతుడనైన విద్వాంసుడనై , ఈ బ్రహ్మవాదములో ఓడిపోయి బతుకుటకగునా ? తలయెత్తుకొని తిరుగుటకగునా ? అలాగని ఇక్కడ ప్రాణమును పణముగా పెట్టవచ్చునా ? ఆ సర్వజ్ఞాభిషేకమొకటి. నేను వాదములో ఓడి ఆ సర్వజ్ఞపీఠపు సోపానములలో చివరి మెట్టునవుతానా ? "

         చివరికొక విద్వాంసుడు రెచ్చిపోయి అన్నాడు:" విదగ్ధా , నువ్వు లేస్తావా ? నన్ను లేవమంటావా ? ఎంతైనా నేను నీ అంతటి వాడను కాను, నువ్వు అగ్రగణ్యుడవు. నేను రెండవ శ్రేణి వాడిని. కురు పాంచాలులు ఇంతమంది వచ్చినా ఎవరూ వాదభూమికి దిగలేదు అను అపఖ్యాతియైనా తప్పనీ. " 

         ఆ మాట ఎందుకో ఏమో విదగ్ధుని గ్రుచ్చినట్లాయెను. " సరేలేవయ్యా, మీయందరి కోరిక మేరకు నేను వాదమునకు వెళతాను. అయితే ఈ యాజ్ఞవల్క్యుడు నా కళ్ళముందు పెరిగిన పిల్లవాడు. వీడితో వాదము చేయుటయా అని శంక. "

          " నువ్వు శంక విశంక అని లెక్కపెడుతూ కూర్చో. ఇంకొక ఘడియలోపల సర్వజ్ఞాభిషేకము అయిపోనీ . నువ్వు రేపు , ’ నేను వాదమునకు వెళ్ళవలసినది , వెళ్ళిఉంటే ఆ అభిషేకము నాకు అయ్యెడిది, అనుకొని ఇంటిలోపల తిరుగు. విను , ఈ సర్వజ్ఞ పీఠమునకు నువ్వొక్కడవే అధికారివి. ఇంకెవరూ యోగ్యులే కాదు. నువ్వుగా వదలి ఇది ఇతరుల పాలు కాకూడదు. అలాగవరాదు. యేరీతిగా చూచిననూ ఇది మనవారిది. కురు పాంచాలులు తప్ప, వేరే దేశములలో విద్వాంసులెక్కడ ? కాబట్టి , లెమ్ము. ప్రాణమునైననూ పణముగా పెట్టి దీనిని ఏదో విధముగా సాధించు. ఈ రాజు కూడా నీ శిష్యుడే , మరవద్దు. "

          విదగ్ధుడు నిశ్చయించుకున్నాడు. పైకి లేచినాడు. అతని గాంభీర్యమునూ , గాంభీర్యమును ఉట్టిపడునట్లు ఆ నిలుచున్నదీ చూచి అనేకులు మెచ్చుకున్నారు. అతడు నిలుచున్న తీరే అతడు విద్వాంసుడని ఉద్ఘోషిస్తున్నది. కొందరు శంకించినారు : " ఈతడేమో మహా విద్వాంసుడి వలెనే కనబడుచున్నాడు , అయితే ఆ సింహముతో తలపడ గలడా ? "  

          విదగ్ధుడు కట్టుకున్న ధోవతి అంచులను సరి చేసుకొని, కప్పుకున్న ఉత్తరీయమును క్రమపరచుకున్నాడు. దానిపైనున్న శాలువను సరిగ్గా కప్పుకొన్నాడు. అది నేలపైన జీరాడుతున్నది. దానిని అంగుళీయకములతో అలంకృతమైన హస్తములతో పట్టుకొని మత్తగజము వలె అడుగులు వేస్తూ వేదిక  వైపుకు నడచినాడు. 

         కృష్ణాజినమును కప్పుకొని దర్భల పవిత్రమును ఉంచుకొని పవిత్రమూర్తి వలె కనబడుతున్న భగవానులు వయస్సులో తనకన్నా పెద్దవారైన విద్వాంసులు వస్తున్నది చూచి కూర్చున్నవాడు లేచి నిలబడినాడు. 

         విదగ్ధుడు వస్తూ దారిలో ఆలోచించినాడు. " ఈతడు నేను వస్తున్నది చూచే బెదరినాడు. " అని సంతుష్టుడై , ఆ సంతోషమును ప్రకటముగా చూపిస్తూ తనను లేవమన్న విద్వాంసుల వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి ముందుకు వచ్చినాడు. వేదిక సమీపమునకు వచ్చి , " యాజ్ఞవల్క్యుల వారూ,  ఈ మర్యాదను చూపించనవసరము లేదు. ఎంతైనా ఇది వాద భూమి. ఇప్పుడు మనమిద్దరమూ సమానము. కూర్చోండి. విద్వాంసులు వినయమును వదలరాదు. అట్లని ఇంత వినమ్రులు కూడా కాకూడదు. ఇంకొక ఘడియ లోపల సర్వజ్ఞాభిషేకమును పొందు తమరే ఇంత నమ్రమయితే ఎలాగ ? " అన్నాడు.

భగవానులు దానికి ప్రతిగా   ఏమీ మాట్లాడక ,  రెండు చేతులతో ఆసనమును చూపిస్తూ , " దయ చేయవలెను. సర్వ వృద్దులైన శకలుల పుత్రుడికి ఇవ్వకూడని మర్యాద ఉంటుందా ? " అని పలికి, వారు కూర్చున్న తరువాత తామూ కూర్చున్నారు. 

విదగ్ధుడు ఠీవిగా పద్మాసనములో నేరుగా కూర్చొని , చుట్టూ చూచి, రాజు వైపు చూచి , నవ్వి, వాదమును ఆరంభించినాడు: " యాజ్ఞవల్క్యా , దేవతలు ఎందరు ? "

భగవానులు నవ్వుతూ , " వైశ్వదేవములో నివిదవల్లి చెప్పినట్లు మూడువందల మూడు అథవా మూడువేల మూడు. అయితే ఇవన్నీ ముప్పైముగ్గురు దేవతల మహిమ. " అన్నారు.

" ఆ ముప్పైమూడు మంది ఎవరు ? "

" ఎనమండుగురు వసువులు , పదకొండు మంది రుద్రులు , పన్నెండు మంది ఆదిత్యులు , ఇంద్రుడు , ప్రజాపతి . కర్మఫలమును తమలో ఉంచుకున్నారని వసువులు , శరీరములో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ , మనోరూపములుగా ఉండి , అది పడిపోయినపుడు వెళ్ళిపోయి సంబంధములనన్నిటినీ చెరిపివేయువారు అని రుద్రులు , సంవత్సరపు పన్నెండు మాసములు ఆదిత్యులు-- ప్రాణులందరి ఆయుష్షునూ  కర్మఫలమునూ మోసుకొని వెళ్ళతారని ఆదిత్యులు . మెరుపులూ ఉరుములూ ఇంద్రుడు  , పశువులూ యజ్ఞమూ ప్రజాపతి. "

" సరే  , వీటిని సంకోచింపజేస్తే ? "

" ఆరు , మూడు, రెండు , ఒకటిన్నర , ఒకటి అగును. పృథ్వి  , అగ్ని  , అంతరిక్షము, వాయువు , ద్యులోకము, ఆదిత్యుడు అని ఆరు. ఆయా లోకములలో అగ్ని , వాయు , ఆదిత్య దేవతలను చేర్చితే అగు పృథ్వీ అంతరిక్ష ద్యులోకములే మూడు. దానిని కూడా సంకోచింపజేస్తే , అన్నము  అన్నాదమైన ప్రాణము; ఇలాగ రెండు. వాటినీ సంకోచింపజేస్తే , వాటిలో ముందుకు పెరుగు సూచన ఉన్నదొకటి  మరియూ సగమై ఉన్న వాయువు, ఇవి ఒకటిన్నర.  వాటినీ సంకోచింపజేస్తే, మిగిలేది ప్రాణమొక్కటే. ! "

" ప్రాణము పగిలి ఎనిమిది విధములై ఈ లోకములనన్నిటినీ ఏర్పరచినది. అదంతా తెలిసిన వాడే సర్వజ్ఞుడు యాజ్ఞవల్క్యా. " 

" ఔను, ఆ ఎనిమిది విధములైన పురుషులనూ , ఎనిమిది కార్యములనూ , ఎనిమిది కరణములనూ ఎనిమిది దేవతలనూ ఎరుగుదును. అది నిజమైన పాండిత్యము కాదు , శాకల్యా. " 

శాకల్యునికి ఆ మాట విచిత్ర మనిపించినది. ఈత రాని వాడిని నీటిలోకి తోసినట్లాయెను. ముందుకు సాగి అడుగుదామా అంటే ఏమీ తోచదు. లేచి వెళదామా అంటే ఆసనమునకు కీలలు కొట్టబడి అంటుకుపోయి నట్లయినది.

ఒక ఘడియయైనది. సభ ఆ మౌనమును సహించలేక అశాంత మయ్యే వరకూ వచ్చింది. అశాంతమూ అయ్యింది. అయినా శాకల్యుడు ఇంకా మౌన ముద్రను వీడలేదు. 

భగవానులు కరుణతో చూస్తూ అన్నారు : " శాకల్యా , మీరు నిష్ఠాపరులు. ఉపాసకులు , అయితే యేమి, పాపము ఈ కురు పాంచాల విద్వాంసులు తమరిని మంటను పట్టుకొను దీపము పురుగును చేసి  మంటలోకి తోసినారు. "

విదగ్ధుడు ఆ మాటను సహించలేదు , రేగిపోయినాడు. " నోరు మూసుకో యాజ్ఞవల్క్యా , మూసుకో. నువ్వు యే ’ మహాబ్రహ్మము’ ను ఎరుగుదువని కురుపాంచాల బ్రాహ్మణుల నందరినీ నిందిస్తున్నావు ? " అన్నాడు. తాను యాజ్ఞవల్క్యులను ఏకవచనముతో సంబోధిస్తున్నా నన్నది కూడా ఆతని మనసుకు తట్టలేదు. 

భగవానులు ఆ తిరస్కారముతో కొంచము కూడా ఖిన్నులు కాలేదు. :" శాకల్యా , మీరు చెప్పిన ప్రాణ పురుషులను మాత్రమే కాదు , ఆ ప్రాణము ఐదు  దిక్కులై, ఈ విశ్వమై , ఈ విశ్వపు దేవతలై,  ధ్యాత్మములో ప్రతిష్ఠితమై ఉన్నది ఎరుగుదును " అన్నారు. 

" అయితే ఏదీ , వాటిని ఒక్కొక్కటిగా చెప్పు." అన్నారు. 

" అటులనే , సావధానముగా వినండి. ఈ ప్రాచీ దిక్కులో ఆదిత్యదేవుడై , చక్షురూపములో ప్రతిష్టితుడై, ఇవన్నీ ( ఐదు దిక్కులు , విశ్వమూ , విశ్వ దేవతలు ) హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ దక్షిణ దిక్కులో యమ దేవుడై, యజ్ఞ దక్షిణా శ్రద్ధలలో ప్రతిష్టితుడై ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ పశ్చిమ దిశలో వరుణదేవుడై, బయట జలమై, లోపల రేతస్సై ప్రతిష్టితుడై,  ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ ఉత్తర దిశలో సోమదేవుడై బయట దీక్షయై , లోపల సత్యమై ప్రతిష్టితుడై ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. పైనున్న ధృవా దిశలో అగ్ని దేవత. అది వాక్కై , హృదయములో ప్రతిష్టితమై ఉండును. : శాకల్యా, మరలా ఒకసారి చెప్పెదను , వినండి. పూర్వదిక్కు రూపాత్మకమైనది, దక్షిణము కేవలము కర్మాత్మకమైనది , పశ్చిమము పుత్రోత్పాదన రూప కర్మాత్మకమైనది , ఉత్తరము  విద్యా సహిత కర్మాత్మకమైనది. ఊర్ధ్వము నామాత్మకమైనది. ఇలాగ రూప కర్మ నామాత్మకమైన సర్వమూ ఈ హృదయములో ఉండును. "

" అ హృదయము ఎక్కడ ఉండును ? "

" ఇదేమిటి ఇలాగ మాట్లాడుచున్నారు ? శాకల్యా , హృదయము శరీరములో ఉండును. ఆ శరీరమును నేను అని ప్రతిఒక్కరూ అంటున్ననూ , ఆ నేను వేరేగా ఉండును. " 

" ఆ శరీరములో నున్న ఆ నేను ఉండేదెక్కడ ? "

భగవానులు నిట్టూర్చినారు. బ్రహ్మవాదమునకని వచ్చి కూర్చున్న వాడు ఎదుటి మనిషి చెప్పినదాంట్లో , అదెక్కడ ఉంటుంది , దాని ప్రతిష్ట ఏమి అని అడిగినట్లాయెను అని వారికి అయ్యో పాపము అనిపించినది. అయితే , ఈతడు ఇలాగ వేరుపరచి చూచునపుడు , వీటన్నిటినీ ఒకటి చేసి పట్టగల ఔపనిషదీకరుడైన ( ఉపనిషత్తును తెచ్చిన )  పురుషుడు ముందుకు రావలెను కదా అనిపించి , నిట్టూర్చి ప్రశ్నకు ఉత్తరము చెప్పినారు:

" శరీరము ప్రాణ , అపాన , వ్యాన , ఉదాన , సమానములలో ఉండును. ఇలాగ ఒకదానినొకటి పట్టుకొని ఉండకపోతే ఒక్కొక్కటీ ఒక్కొక్క వైపుకు వెళ్ళి పోయెడివి. ఇవన్నీ కార్యములు. కరణమైన హృదయము నుండీ బయల్వెడలి జగద్రూప కార్యమై పరిణమించి , అక్కడినుండీ వెనుతిరిగి వచ్చి హృదయములో మరలా ప్రతిష్ఠితుడగు ఆత్ముడిని , శాకల్యా , ’ నేతి ’ ( ఇది కాదు , ఇది కాదు ) వాదమొక దానితో మాత్రమే తెలుసుకోవలెను. అలాగ తప్ప ఇంకే విధముగనూ దానిని తెలియలేము. కార్య కరణములు రెండూ తానే అయిఉన్ననూ , కారణమైన దానిని మరింకెలా తెలుసుకోగలము ? ఖండఖండములైన  ఈ సర్వమూ అఖండమగు పరిణామములో ఉన్నది. దానిని ఉపనిషత్తులచేత మాత్రమే తెలుసుకోగలమే తప్ప , ఇక దేనినుండీ తెలుసుకోలేము. దానిని తెలియకనే ఎరుగుదును అంటే అతడు మంటలో పడిన గడ్డిపోచ వలె యగును. ఆ ఆత్మను , ఈ మూర్తీభవించిన విశ్వము నంతటినీ నిండి , దీనినుండీ బయటికి కూడా ప్రసరిస్తున్న పురుషుడు అంటారు, అది తెలుసా శాకల్యా ? "

శాకల్యునికి ఖండము అఖండమగును అనునది తెలియదు. అతడు బిక్కచచ్చి చిన్న గొంతుతో '  నాకు తెలియదు ' అన్నాడు. అయితే తత్పురుషోపాసనలోనే ఉన్న భగవానుల "  దానిని తెలియకనే ఎరుగుదును అంటే అతడు మంటలో పడిన గడ్డిపోచ వలె యగును"  అన్న మాట ఆ తత్త్వమును , అగ్నిని కెలికినట్లే కెలికింది. విదగ్ధుడు దానికి స్వాహా అయినాడు. విదగ్ధుడు బ్రహ్మవాదములో విదగ్ధుడే అయిపోయినాడు. భగవానుల వాణి ఎక్కడినుండీ ఎక్కడికి ఎంతవరకూ వ్యాపించి ఉందో అంతవరకూ ఉన్న అందరికీ ఆ వాణి వినిపించినంత సేపూ ఒక రెప్పపాటు కాలములో అఖండపు జ్ఞానము అయినది. జ్ఞాన గంగా స్నానమయినది. సభలోని వారంతా దారుమయ యంత్రముల వలె , పర ప్రేషితులైన వారి వలె , స్వాతంత్ర్యము లేశమైనా లేనివారి వలె , లేచి కాయేన వాచా మనసా భగవానులకు నమస్కారములను సమర్పించినారు. జయ భగవతే యాజ్ఞవల్కాయ నమః అన్న నినాదము మంటపమును లేపి మోసుకొని పోవునా అన్నట్టయింది. 

భగవానులు అంతసేపూ సమాధిలో ఉన్నారు.

రాజా జనకుడు ముందుకు వచ్చి సర్వజ్ఞాభిషేకమునకు సభానుజ్ఞను పొంది భగవానులకు పాండిత్య కిరీటమును ధరింపజేసి , నమస్కరించినాడు. అక్కడున్న సర్వులూ అతనికి యథోచితముగా కానుకలను అర్పించి, నమస్కారము చేసినారు. 

No comments:

Post a Comment