SHARE

Friday, April 5, 2013

65. " మహా దర్శనము " --అరవై ఐదవ భాగము --వివరములు


65. అరవై ఐదవ భాగము--  వివరములు


         రాజశిల్పి మహారాజును పరివారముతో సహా మంటపము లోపలికి పిలుచుకొని వెళ్ళినాడు. వెళ్ళుచుండగా , ఎడమవైపు తండ్రి గారి చిత్రము ను చూసి , అప్పుడే దానిని మొదటి సారి చూచినవాడి వలె ఆనందపడుతూ పొంగిపోయినాడు. దేవుడి పూజ వంటి సాత్త్విక కర్మలోనున్ననూ , క్షాత్రోచితముగా ఉక్కువలె నున్న దేహము తన పౌరుషమును ప్రదర్శిస్తున్నది చూసి బహు సంతోష పడినాడు. పరివారము కూడా వెనుకటి మహారాజును చూచి చాలా మెచ్చుకున్నారు. రాజుతో పాటు అందరూ చేతులు జోడించి ముందుకు సాగినారు. 

        రాజశిల్పి వచ్చి చేతులు జోడించి నివేదించినాడు: " మహా ప్రభూ , ఇక్కడ పరామర్శించవలెను. ఈ మంటపమునకు వెలుతురు కోసము చేసినది విచిత్రమైన పద్దతి. నేలనుండి ఒక మూర ఎత్తులో ఉన్న కిటికీలు చల్లటి గాలిని లోపలికి తెస్తాయి. తలపైన ఒకటిన్నర పురుష ప్రమాణము  ఎత్తులోనున్న మూర పొడుగు గవాక్షములు సభ చేరినపుడు శాఖము తగిలిన గాలిని బయటికి పంపిస్తాయి. గోడ మధ్యలో కిటికీలు లేనందు వలన సభికుల గమనము మంటపములోనే ఉంటుంది. బయటి ఆకాశము కంటికి కనపడదు కాబట్టి ఇక్కడి వాతావరణము శాంతముగా ఉంటుంది. ఇలాగ గాలి , వెలుతురు , చలువ ఈ మూడూ ఇక్కడ సహజముగా వచ్చునట్లు చేసినాము. " 

         మహారాజు తలాడించి, దేవస్థానపు చిత్రమును చూసి , మొక్కి , ముందుకు నడచి సరస్వతీ దేవి ఎదురుగా నిలిచినారు. ఆ దేవి చిత్రమును చూచి పరివారము వారు బహు సంతోషపడి ఆమెకు నమస్కారము చేసి ముందుకు నడచినారు. 

         మంటపము మధ్యలో ఉపన్యాస వేదిక. అక్కడ రాజ యోగ్యములైన రెండు ఆసనములు. మహారాజు శిల్పికి అది చూపించినాడు. అతడు దానిని గురించి చెప్పినాడు, " మహాస్వామీ , విద్వాంసులు  ఉపన్యాసములు చేయవలెనన్నా , జటిలమైన సమస్యలను చర్చించవలెనన్నా, లేదా శాస్త్రార్థమును గురించి వాదము చేయవలెనన్నా ఇక్కడికి వచ్చి ఎదురుబదురుగా కూర్చొని అదంతా జరపవచ్చు. అందుకని రెండు ఆసనములు సిద్ధమైనవి. " 

రాజు వెనక్కు తిరిగి కోశాధికారి ముఖమును చూచినారు. అతడు ముందుకు వచ్చి కనిపించినాడు. 

" కిరీటము వచ్చినదా ? "

" వచ్చింది , మహాస్వామీ "

        ఇంకొక  ఘడియలోపలే ఒక చిన్న ముక్కాలు పీట మీద జలతారు వస్త్రపు ముసుగులో బంగారపు హరివాణములో ఒక చిన్న మెత్త మీద ఒక కిరీటము. కిరీటమంతా రత్నమయమైనది. పండితులు వేసుకొను టోపీ వలె ఉండి, దాని తలపైన కుందనపు గుండు ఒకటి , దాని పైన కూడా మనోహరముగా రత్నములను తాపి ఉంది. దానిని తెచ్చిపెట్టి జలతారు వస్త్రపు ముసుగు తీసివేయగా గాలిపొర వలె ఉన్న ఇంకొక వస్త్రపు వెనుక కిరీటము విరాజిల్లింది. 

       పరివారము వారంతా అది చూచి భేష్ అన్నారు. గార్గి , ’ ఇది ఏమిటి ? ఎందుకు ? అని అడిగితే మంచిదేనా ? " అన్నది. మహారాజు కోశాధికారిని చెప్పమని కనుసైగ చేసి సూచించగా , అతడు అన్నాడు,  ఇది సర్వ శ్రేష్టుడైన విద్వద్వరేణ్యులకు మహారాజు అర్పించు పాండిత్య కిరీటము. దీనిని అర్పించగనే వారికి సర్వజ్ఞ పట్టాభిషేకము జరుగును. "

కోశాధికారి ఇంకా ఏదో చెప్పబోయి మహారాజు గుడ్లు మిటకరించుట చూచి అక్కడికే ఆపినాడు. 

        ముందుకు సాగి పరివారముతో రాజు యజ్ఞమంటపము వద్దకు వచ్చినారు. అక్కడ చిత్రగతమైన ఆ దృశ్యమును చూచి , " ఇది బాగుంది , శారదా మంటపమంటే ఇలాగుండవలెను. ’ వ్యశేమ దేవహితం యదాయుః ’ బతికినంతకాలమూ దేవతలకు హితమగునట్లు బతక వలెను. అక్కడ దేవతార్చన చేస్తున్న మహారాజు , ముందర దేవస్థానము. దానిముందు సరస్వతీ చిత్రము. దాని ముందు యజ్ఞమంటపము. భలే! " అని ఒకరు తమ సంతోషమును సూచించినారు. అందరూ యజ్ఞేశ్వరునికి చేతులు జోడించి ముందుకు సాగినారు. అక్కడ సింహాసనము పైన కూర్చొని రాజసభను జరిపిస్తున్న మహారాజు. 

       రాజు వెనక్కు తిరిగి, " ఇది కూడా చెప్పండి మరి ? " అన్నాడు. ఒకరు , "  యజ్ఞాదుల చేత సంతుష్ఠులైన దేవతలు రాజ్యమును సుఖముగా ఉంచినారని చూపు దృశ్యమిది" అన్నారు. అందరూ అది విని ఆనందించినారు. 

        అక్కడనుండీ కుడివైపుకు తిరిగినారు. అక్కడ మంటపపు మహాద్వారమునకు ఆనుకొని యున్న ఇంకొక వాకిలి. దాని ముందు కూడా పందిరి. దానిని దాటి పక్కనున్న గోడ వద్దకు వస్తే , అక్కడ ససైన్యుడైన మహారాజు చిత్రము. ’ ఎదురాడినవారు ఎవరైనా సరే , వారిని పడగొట్టి తీరుటయే నా పట్టు ’ అని వీరోద్ధతుడైన రాజు, అతని వెనుక స్వర్గము కావాలన్నా సాధించెదము అను దర్పముతో నిలబడిన అతడి సైన్యము. 

        ముందుకు వెళ్ళగా అక్కడ శాంతముగా ఉన్న గురుకులపు ప్రదేశము. అధ్యయనము చేయిస్తున్న ఉపాధ్యాయుడు మరియు శిష్యులు ఇద్దరినీ  ఎదురుగా ఉంచుకొని కూర్చున్న గురు కులాధ్యక్షులు, సరిగ్గా చూస్తే భగవాన్ యాజ్ఞవల్క్యుల వలెనే కనబడతారు. 

       ఎవరూ చెప్పకనే ఆ చిత్రమునకు అందరూ మనసులోనే నమస్కారము చేసినారు. గార్గి అక్కడ ఒక ఘడియ నిలచి చూచి ముందుకు వెళ్ళినది. 

        ముందర గాయత్రీ దేవి చిత్రము. పరివారమునకు ఆ చిత్రమును ఎంత చూచిననూ చాలదు. ఆ దేవికి ఎన్నిసార్లు మొక్కిననూ తనివి తీరదు. ఒకరితోనొకరు గుసగుసగా మాట్లాడుకున్నారు , " మేము ఇంతటి చిత్రమును ఇంతవరకూ చూచియుండలేదు. "

         గార్గి ముందుకు వచ్చి మహారాజుకు చేతులు జోడించి  , ’ జ్ఞాన సత్రము అయిన తరువాత ఈ మంటపమును ఏమి చేయవలెననుకున్నారో సన్నిధానము వారు ? " అన్నది. రాజు హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకు ఉలికిపడి , తమాయించుకొని  " ఇంకా తెలియదు , ఎందుకు ? " అన్నారు. 

" మహాస్వామి వారి మనసుకు నచ్చితే , అన్ని చిత్రములనూ కాకపోయినా , ఈ రెండు దేవీ చిత్రములనూ రాజభవనములో ఉంచవలెను. " 

రాజు శిల్పి ముఖము చూసి  , " ఈ అంశము గుర్తుంచుకొనుడు " అన్నాడు. 

       పరివారము సాగి , ఆలమంద వైపుకు తిరిగింది. సమృద్ధియైన చిత్రమని దానిని చూచిన వారందరూ పొగడినారు. " ఆ ఎద్దు తుంటరితనము కూడా మనోహరముగా ఉంది. అదీ , దాని సొగసూ ! " అని ఒకరు పొగడినారు. 

        పరివారము వచ్చి చివరి చిత్రపు ఎదురుగా నిలచింది . మహారాజులు వైదీకుల వలె విద్వాంసులతో కలసి నిలుచున్నారు. వెనుకటి చిత్రములో లోకరక్షణార్థమై మూర్తీభవించిన క్షాత్ర పౌరుషము ఇక్కడ సౌమ్యమై బ్రహ్మ తేజస్సుతో నిండిఉంది. పౌరుషమూ తేజస్సూ ఒకటికానిదే లోకపు స్థితిలో సౌఖ్యముండదు అన్నది మనసుకు చూపునట్లుంది ఈ చిత్రము. 

      పరివారములోని ప్రతియొకరూ చిత్రములన్నీ చూచి చాలా సంతోషించినారు. వాటిని చిత్రించినవారినీ , చిత్రింపజేసిన వారినీ మనసారా పొగడినారు. 

       మంటపము నుండీ బయటికి రాగానే మహారాజు శిల్పిని పిలచి , " అన్నిటినీ ఏర్పాటు చేసినారు , సంతోషము. ఈ అలంకారములు పదునైదు దినములు నిలుస్తాయా ? " అని అడిగినారు. శిల్పి వినయముతో , "  మహాస్వామీ , ఈ తోరణములు ప్రతిదినమూ కొత్తవి వస్తాయి. ఈ పెద్ద ధ్వజములు మొదలైనవి మంచి బట్టతో తయారైనవి, కాబట్టి అవి అలాగే ఉంటాయి. మొత్తానికి సత్రము ముగియువరకూ వీటిని చూచుకుంటూ ఉంటాము " అని విన్నవించినాడు. 

         మంటపము నుండీ బయటికి వస్తుండగా మహారాజు , ’ ఆవులెక్కడ ? " అని అడిగినారు. శిల్పి ’ మంటపానికి పశ్చిమమున ఉన్న విశాలమైన తోపులో పశువులకు స్థానము ఏర్పరచినది చూపినాడు. 

         రాజు , పరివారముతో పాటూ ఉన్న మేస్త్రీని పిలచి , " గోవులు షష్టి నాడు పొద్దుటికి ఇక్కడ ఉండేలా చూడండి. షష్టి నాడు అన్నిటినీ మంగళ స్నానముతో అలంకరించి , పసుపూ కుంకుమలతో పూజించి , మాకు వచ్చి నివేదించవలెను. తరువాత సంగతి మేము చెప్పెదము " అన్నారు. 

        మేస్త్రీ , ’ ఆజ్ఞ ’ అని చేతులు జోడించినాడు. 
" ఆవులు ఎందుకు ? " అని పలువురు వచ్చి గార్గిని అడిగినారు. మేస్త్రీకి కూడా ఎందుకన్నది తెలియదు. " మీరే విన్నారు కదా , తరువాతి సంగతి మేము చెప్పెదము అని అనుజ్ఞ అయినది" అని అతడు సణుక్కున్నాడు. 

      గార్గి చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా మూగి ఉండుటను చూచి రాజు , " ఈ ఆవుల సంగతా ?  వాదములో అందరినీ గెలిచి సర్వజ్ఞుడైన వారికి ఇవి కానుక " అన్నారు. 

గార్గి అది విని అశాంతి పొందినది. రాజుకు ఆ అశాంతి తెలిసింది. దాని విషయమై అక్కడ ఇద్దరూ మాట్లాడలేదు. 

        ఇంకొక ఘడియలోపల రాజు తోపుకు వెళ్ళి , అక్కడ ఆవులను కట్టివేయుటకు చేసిన ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయని చూసుకొని రాజభవనమునకు వెళ్ళినారు. మొదటి వలెనే ఊరేగింపు బయలుదేరింది. 

         ఆనాటి మధ్యాహ్నము రాజాజ్ఞ మేరకు గార్గి వారిని చూచినది. వారు ఆమెను విశ్వాసముతో ఆహ్వానించి , " గోవులు సర్వజ్ఞునికి కానుక అన్నపుడు తమకు ఏమో అశాంతి కలిగినట్లు కనిపించినది. అదేమని అడుగుటకు తమరిని పిలిపించడ మయినది " అన్నారు.

         " మహాస్వామీ , చెప్పినా విన్నా , ఇది ఆడ దేహము. ప్రతిమాటకూ నేను వచ్చి అదలాగ ఉండ వలెను , ఇదిలాగ ఉండవలెను అని అంటుంటే బాగుండునా అని నేను ఊరకే ఉన్నాను. అలాగని మహాస్వామివారి శ్రేయస్సును కోరే నేను చెప్పకుండా ఉంటే ఎలాగ అని అనిపించినది. దానివలన అశాంతి అయినది. ఏమి చేయుట ? నేను నోటితో చెప్పకుండా దిగమింగుకున్నా , నాముఖము చెప్పేసింది. మన్నించవలెను. " 

" కానుక ఇచ్చుటలో అశ్రేయస్సు ఏముంది ?"

         " ఇక్కడే మాకూ మీకూ భేదము. తమరు పిలచినది విద్వాంస, మహా విద్వాంసులను, పండితులను కాదు. కేవలము పండితులై వట్టి శాస్త్రమును చదువుకొని అనుభవము లేనివారైతే ఒకరితోనొకరు వాదము చేయవచ్చును. ఎడ్ల పందాలలో వలె పోట్లాడ వచ్చు. గట్టిగా అరచి , శాస్త్రపంక్తికి బదులు శాస్త్ర పంక్తిని చెప్పి , ఎదురుదాడి చేసి , నోరు మూయించి తాను పండిత రాజును , పండిత ప్రవరుడను , అని ఊరేగవచ్చు. అయితే తమరు పిలిపించినది అటువంటి వారిని కాదు. వచ్చేవారందరూ అనుభవమున్న వారు. తమ తమ అనుభవమును ఇతరుల అనుభవముతో పోల్చుట ఎలాగ ? అనుభవమున్న వారు ఇద్దరు చేరితే , వారి అనుభవము వినిమయమై , సమన్వయము , అవిరోధములను గురించి మాట్లాడవలెనే కానీ , వాదోపవాదములను చేయుటకు అవుతుందా ? కాబట్టి , ’ వాదములో గెలిచి ’ అన్న తమరి మాటకు నేను భయపడినాను. " 

         రాజు గార్గి అభిప్రాయమును తెలుసుకున్నారు. తాను వెళుతున్న దారియే సరిగా లేదు అని అతనికి తెలిసింది. ఒక్క ఘడియ ఆలోచించి , ఆమెనే అడిగినారు, " తమరి ఆలోచన సరిగానే ఉంది. మరి , సర్వజ్ఞులని తెలుసుకొనుట ఎలాగ ? " 

         " వాదోపవాదములెప్పటికీ సగము సగము తెలిసినప్పుడే జరుగుతాయి. మరి సర్వజ్ఞత్వములో పోరాటమెక్కడిది ? తాము విద్వత్సభకు నమస్కారము చేసి , ’ తమరిలో సర్వజ్ఞులెవరో వారికి ఈ నమస్కారము ’ అనండి. అప్పుడు ఆ సభలో సర్వజ్ఞత్వము కోసము పోరాటము జరుగును. సర్వజ్ఞుడనని ముందుకు వచ్చినవాడిని విద్వాంసులందరు పరీక్షించెదరు. ఆ పరీక్షలో నిలిస్తే అతడు నిజమైన సర్వజ్ఞుడు, లేదా కొట్టుకొని పోతే కాదు. " 

" ఆ పోరాటము వాదోపవాదముల రూపమును దాలిస్తే ? "

          " కాదు , వాదోపవాదములు ఎప్పటికీ బుద్ధి చాతుర్యపు ఫలము. సర్వజ్ఞ పరీక్ష అలాగ కాదు. అక్కడ ప్రతి యొక్కడూ ఒక్కొక్క జాతి గీటురాయిని తెచ్చి అనుభవమను బంగారమును రుద్ది చూచును. బంగారము పదహారణాల వర్ణముదా ? లేక తక్కువా ? అనునది ప్రశ్న. అక్కడ గీటు పడిందంటే , కంసాలి తలపాగా పీకినట్లై , విధిలేక నోరు మూసుకొనును. ఇట్టి ఈ పరీక్ష ఎక్కడ ? వాద వివాదమెక్కడ ? రెంటికీ చాలా దూరము కదా. నువ్వు చెప్పింది తప్పు , నువ్వు చెప్పింది తప్పు అని మాటల చాతుర్యము తోనో శబ్దము తోనో తప్పొప్పులను నిర్ణయించేది వాదము. వాదము వేరే , జిజ్ఞాస వేరే. "

        రాజు మనసు ఒప్పుకుంది. " సరే , దీనిని మార్చెదము. ఇలాగ చేస్తే ? వేయి ధేనువులను వాటికి కావలసిన గూటములతో కూడా సర్వమూ సిద్ధపరచి , వాటి కొమ్ములకు ఇంతింత అని ధనము కట్టి బ్రహ్మిష్ఠులైనవారు తీసుకోండి అని నమస్కారము చేసి వదిలేయుట. ఎవరైనా తీసుకోనీ . అప్పుడు తమరు చెప్పినట్లు , మిగిలిన వారు ఒక్కొక్కరూ ఒక్కొక్క రాయిని తెచ్చి ఆ బంగారమును రుద్ది చూచెదరు. " 

" అదే సరియని అనిపిస్తున్నదా ? "

        " సరే , తమరు సామాన్యంగా ఈ గంగా యమునా తీరములలో నున్న విద్వాంసులను ఒక్కోవిధముగా ఎరుగుదురు. వీరిలో సర్వజ్ఞ పట్టమునకు వచ్చువారు ఎవరుంటారు ? "

" భగవానులు సర్వ విధములా దానికి అర్హులు. అయితే వారు ఈ జ్ఞాన సత్రమునకు వస్తారో లేదో చెప్పలేము. " 

         రాజుకు గొంతులో పచ్చి వెలగకాయ పడినట్లాయెను. దానితో గాభరా అయింది. " ఏమిటీ ? అలాగన్నచో ? రాజపురుషుడు వెళ్ళి ఆహ్వాన పత్రికను ఇచ్చి , తప్పక రావలెను అని విన్నవించి వచ్చినాడు కదా ? "

         " ఇక్కడే తమరు పొరపడేది. తమరి ఆహ్వాన పత్రికను గౌరవించువారు ఎవరెవరు ? లోక వాసనతో దూషితమైన అంతఃకరణ వున్నవారై , తాము ఏదైనా ఇస్తారేమోనని లోభపడువారు. అలాకాక , వాసనాతీతులై లోభము లేనివారు తమ పిలుపును మన్నించవలెను అను నియమము పెట్టినా వస్తారా ? "

          రాజుకు మనసుకు కష్టమనిపించినది. " ఔను , భగవతీ గార్గి చెప్పునది నిజము. బ్రహ్మవిద్యా సంపన్నుడైనవాడికి ఏదీ లక్షము కాదు. ఏదైనా బ్రహ్మ విపరీతమైన గురి ఉంటే వాడు బ్రహ్మవిద్యా సంపన్నుడు కాలేడు. తనకు కావలసినది బ్రహ్మవిద్యా సంపన్నత. కలలో కూడా దేవగురువులు సర్వజ్ఞుడు గెలుచును యని అనుజ్ఞనిచ్చినారు. ఇప్పుడు భగవతి గార్గి వేసిన ఈ బ్రహ్మాస్త్రమును నివారించు కోవలెను. లేకపోతే అనర్థమగును. కానిమ్ము , పంచమి వరకూ చూచేది. భగవానులు రాకుంటే నేనే వెళ్ళి పిలుచుకొని వస్తాను. " అనుకున్నారు. 

         రాజు మరలా అడిగినాడు: " సర్వప్రయత్నముల చేతా భగవానులను పిలుచుకు వద్దాము. ఒకవేళ వారు రాకుంటే  సర్వజ్ఞ పీఠమునకు అర్హులింకెవరు ? "

          గార్గి అన్నది , " భగవానులు రావాలనే మన అందరి కోరిక. ఒకవేళ అలాగ కాకున్న , మన విదగ్ధులు ఆ స్థానమునకు అర్హులు. విదగ్ధులకు బ్రహ్మానుభవము పెరిగియుండలేదు. కానీ ఆ వాచోవైఖరి, శాస్త్రార్థమును విడదీసి చెప్పడములో ఉన్న విచక్షణ , ఇవి అనన్య లభ్యములు. "

         రాజుకు తృప్తికూడా అయింది ,  అసంతృప్తి కూడా అయింది. విదగ్ధులు ఇప్పుడు అప్పుడే రాజగురువులు. కాబట్టి తృప్తి. కానీ వారు కురు పాంచాల దేశము వారు. అదీకాక , వారుచెప్పిన ’ హృదయమే బ్రహ్మ ’ అను దానిని భగవానులు ఏకదేశీయమన్నారు. అని అసంతృప్తి. అలాగ తృప్తి , అసంతృప్తుల మధ్య ఒక ఘడియ పడిలేచి , " కానిమ్ము , ఇంకా ఐదు దినములు. చూచెదము , ఏమేమగునో ? " అన్నారు. 

        " తమరు ఇంత వెచ్చము చేస్తున్నారు. నేననునది ఏమనిన , భగవానులను తమరే వెళ్ళి పిలచుటయే సరియగునో ఏమో ? ఆలోచించండి. తమకు ఎలాగ తోచిన అలాగ చేయండి. "

" తమరు చెప్పునది అర్థ పూర్ణముగా నున్నది. గమనించ వలసినది. చూచెదము"

ఆ  ' చూచెదము '  అనుటలో అలాగే చేసెదము అన్న నిశ్చయమున్నట్టే కనిపిస్తుంది , వెదకి చూచువారికి. 

No comments:

Post a Comment