SHARE

Friday, April 5, 2013

66. " మహాదర్శనము "--అరవై ఆరవ భాగము--జ్ఞాన సత్రమునకు పిలుపు


66.  అరవై ఆరవ భాగము జ్ఞాన సత్రమునకు పిలుపు


         కాత్యాయని మైత్రేయిని వెతుక్కుంటూ వచ్చింది. మైత్రేయి , తాను అంతర్ముఖియై కూర్చొనుటకు అన్నీ సిద్ధము చేసుకుంటున్నది. " అక్కా " అని లోపలికి వస్తున్న కాత్యాయనిని ఆమె అభిమానముతో రమ్మని పలికి , పక్కనే కూర్చోబెట్టుకొని , ఆదరముతో , " ఏమిటి చెల్లీ ? ఈ వేళకు నువ్వు వంట యింటిలో పొయ్యి ముందర వుంటావు కదా ! ఇదేమిటి ఇప్పుడు ఈ అకాలములో వచ్చినావు ? " అని అడిగినది. 

కాత్యాయని అడిగింది : " భగవానులు జ్ఞాన సత్రమునకు వెళ్ళు సంగతిని నీ దగ్గర ఏమైనా ప్రస్తావించినారా ? "

        మైత్రేయి నవ్వింది. " అటువంటి విషయము ఏదైనా ఉంటే అదంతా భగవతితోనే! నాదేమున్ననూ మీరిద్దరూ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మీ వెంట వచ్చుట. అవకాశముంటే ఏకాంతములో కనులు మూసుకొని కూర్చొనుట. అంతే! "

" సరే , అక్కా , నిన్ను చాలా నాళ్ళ నుండీ ఒకటి అడుగవలెను అనుకొంటున్నాను. ఇప్పుడు సమయము దొరికింది, అడిగేదా ? "

         " ఇది బాగుంది , నా సర్వస్వమూ నువ్విచ్చినది. ఇలాంటపుడు , నువ్వు నన్నేమైనా అడుగవలెనంటే నా అనుమతి కావలెనా ? అడుగు. నువ్వు ఏమి అడిగిననూ అదెంతటి రహస్యమైననూ నీకు చెప్పెదను. " 

" నువ్వు సందు దొరికితే కనులు మూసుకుని కూర్చుంటావు కదా , అప్పుడు ఏం చేస్తుంటావు ? "

         " ఇంతేనా ? ఇంకేదైనా రహస్యము అడుగుతావేమో అనుకున్నా. విను , నేను కనులు మూసుకొని ఉన్నపుడు కళ్ళు , ముక్కు , చెవి మొదలైనవి ఊరికే ఉండవు. పని చేస్తుంటాయి. మనకు మనసుంటే ఒక పని , లేకుంటే ఇంకొక పని. మనసు మాత్రం ఒక ఘడియ కూడా ఊరికే ఉండదు. ఏదైనా వెనకటిదో , ముందరిదో తెచ్చుకుని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అంతే కాదు , మనలను లాగుకు వెళ్ళి ఈ దేహమే నువ్వు అనిపిస్తుంది. దీనిని తప్పించుకొనుటకే మేము కళ్ళు మూసుకుని కూర్చొనేది. అప్పుడు ఏ పనీ లేక నిశ్చలముగా కూర్చొనుటే పని. "

" అది సాధ్యమా ? "

" చూడు చెల్లెమ్మా , నువ్వు దినమూ నిద్రపోతావుకదా ? అప్పుడు ఏమవుతుంది ? "

        " ఏమవుతుందో ఎవరికి తెలుసు ? తుండు బట్ట మాదిరి పడి ఉండుట ఒక్కటే తెలుసు. ఏమైనా కానీ , అలాగ పడి ఉండి , లేస్తే అప్పుడు ఒళ్ళునొప్పులు మటుమాయమవుతాయి. ఏదో కొత్తదనము వస్తుంది. " 

         " ఇక్కడ కూడా అట్లే చెల్లీ , నిద్రలో ’ నేను ’ అనునది ఎక్కడికో పోతుంది. ఇక్కడ కూడా అట్లే అవుతుంది . విశేషమేమంటే , నిద్ర లేచినవారికి, తానుగా , ’ నేను ఫలానా , ఈ దేహము నేను ’ అని నామరూపముల తెలివి ఉండనే ఉంటుంది. ఇక్కడ నిద్రలో వలె మైమరిచిపోము. ఎప్పుడూ మెలకువగా ఉంటాము. అయితే , అది ఈ మెలకువవలె ఇంద్రియ మనో వ్యాపార పూర్వకముగా కాదు , ఇంద్రియములూ మనసూ వ్యాపారము చేయకున్ననూ మెలకువగా ఉంటాము. "

" కాదే అక్కా , కొంచము నాకు తెలిసేటట్లు చెప్పవే ! " 

" అలాగేలేవే అట్లే చెపుతాను , కండ్లు మూసుకొని నన్ను ముట్టుకో. " కాత్యాయని అట్లే చేసింది. 

" ఇప్పుడేమవుతున్నది ? చెప్పు ? "

" ఇదేమిటే ఇది ? ఏదో అంతా నింపినట్లవుతున్నది.."

" అట్లే చూస్తూండు. "

కాత్యాయని గంభీరముగా అయింది. ఆమె నుండీ ఏ మాటా రాలేదు. ఒక ఘడియ తరువాత , మైత్రేయి మెల్లగా , " లేవే ..లే "  అంది. కాత్యాయని కనులు తెరచింది. 

" ఇప్పుడు చెప్పవే కాత్యాయినీ , ఏమయ్యింది ? "

        " నేను నేను అనేది కరగిపోయింది..ఇప్పుడేమో దట్టంగా పొగమంచు ముసురుకున్నట్లుంది. తెల్లవారినా , సూర్య దర్శనము కాకున్ననూ ఆ వెలుగు మందముగా పరచుకున్నట్లుంది కదా , కానీ కనులు మూసుకున్నపుడు , ఈ పొగమంచును కరగించి పారేసి ఎండ ఎక్కిపోతే ఎట్లో అట్లుండినది. "

" ఔను , అదే సమాధి  యంటే. సరే చెప్పు , అది నిద్ర అంటావా ? "

" కాదు, అది నిద్ర కాదు. " 

" అయితే ఇంకేమిటి ? "

       " అది నేను చెప్పలేను. నేను చూసి ఉన్న ఏదీ దానివలె లేదు. మనము ఏది చేసిననూ ఇంకేమో చేయలేదే అన్న కొరత ఉండనే ఉంటుంది. అయితే అప్పుడా కొరత ఉండలేదు."

        " నిజము చెల్లీ , నీ మాటలలో చెప్పవలెనంటే ఆ కొరతను పోగొట్టుకొనుటకే నేను కన్నులు మూసుకొని ఉండేది. ఇంకా ఏమవుతుందో తెలుసా ? పుల్లలను మంటలోకి వేస్తే , అవన్నీ మండుతాయి. కాలి బూడిద అయితే , పుల్లల బూడిద ఉన్ననూ పుల్లలు ఉండవు కదా , అట్లే , నేను అన్నది పుల్లవలె కాలి బూడిద అగును. చెల్లీ , ఆ వెలుగు చూచినావా ? అది చూస్తూ ఉండగా అంతా నిండిపోవును. అప్పుడేమవుతుందో తెలుసా ? ఇంకేమీ అవసరము లేదు అనిపిస్తుంది. "

        " అప్పుడపుడు భగవానుల సమీపములో ఉన్నపుడు నాకు ఇట్లయ్యేది. అయితే , ఉన్నమాట చెప్పవలెనంటే , నేను కాత్యాయనిని , భగవానుల సేవకే అంకితమైన దానిని అనునది మరచుట నాకు ఇష్టము లేదు. ఇలాగ కనులు మూసుకుంటే అది మరచిపోతాను. కాబట్టి అది నాకు వద్దు. సరే , భగవానులకు కూడా ఇట్లే తాను ఎవరన్నదీ మరపు వస్తుందా ? "

       " ఔను చెల్లీ , అది అలాగ మరచిపోవుట అనుట కన్నా , ఈ మన నిజ స్థితిలోకి రావడము ఆ సమాధిలోని సొగసు. నీమాటే చెప్పవలెనంటే ఏ కొరతా ఉండదు. "

" అప్పుడు , చేసినదీ , చేయనిదీ రెండూ ఒకటేయగును కదా ? "

" అవును , అయితే పెండ్లి కానపుడూ సంభ్రమము లేదు , పెండ్లి అయినపుడూ సంభ్రమము లేదు. రెండూ ఒకటేనా ? "

        " అదెట్లవుతుంది ? పిల్లలు లేకపోవుటను తీసుకో. ఇతరులు పిల్లలు లేరే యని కలత పడితే , నాకు పిల్లలు లేరని నిశ్చింత. అలాగే , అక్కడ మొదటిదానిలో సంభ్రమము లేకున్ననూ కలత ఉంది. రెండవదానిలో సంభ్రమమూ లేదు , కలత కూడా లేదు. "

" ఏది సరైనది అంటావు ? "

" రెండోదే సరి. దానిలో చింత లేదు"

" ఔను  , సమాధి అట్లుండును. " 

" అందుకేనేమో , భగవానులు జ్ఞాన సత్రపు పేరే ఎత్తడము లేదు. మరచినారో ఏమో ? "

" మరచినారనుట కన్నా, వారి మనసులో  అది లేదు అనుట సరికాదా చెల్లీ ? "

        " నువ్వు చెప్పేదే సరిగ్గా ఉందనుకుంటా. అప్పుడు తీర్థ యాత్రకు వెళ్ళినాము చూడు , అప్పుడూ ఇట్లే . అమ్మ చెప్పిందని బయలుదేరినారు. తమకు కావాలనలేదు , వద్దనలేదు. "

        " సరిగ్గా చెప్పినావు. భగవానులకు అవసరము లేదు. అట్లని అనవసరము కూడా కాదు. ఎవరైనా బలవంతము చేస్తే , పని అవుతుంది: లేదంటే లేదు. వారికి అయినా ఒకటే , కాకున్నా ఒకటే. " 

         " నువ్వేమయినా చెప్పు , నేనేమో ఈ లోకము దానిని. ఇంకొక లోకములో అంటే , మీ లోకములో ఎట్లుండునో అది నాకు తెలియదు. ఇక్కడున్నంత వరకూ ఇక్కడివారి లాగే ఆడవలెనా లేదా ? నేను మాత్రము ఈపొద్దు మధ్యహ్నము అయిన తరువాత భగవానుల వద్ద  జ్ఞానసత్రపు విషయము ప్రస్తావన చేస్తాను. " 

" చేయవమ్మా  చేయి. మాకేమి ? రమ్మంటే మీతోపాటూ వస్తాము. అంతే కదా ? " 

         " నువ్వు సరే , ఈ లోకమంతా కాలిపోయినా కండ్లు మూసుకొనే ఉంటావు. నీ మాదిరి నేనుంటే అవుతుందా ? ఈ ఆశ్రమమంతా  నా తలపై వేసినారు. ఇప్పుడు చూడు , ఇక్కడ మాట్లాడుతూ కూర్చున్నాను. అక్కడ వంట ఏమయిందో ? పప్పు వేసి ఇక్కడికి వచ్చినాను. "

" భయపడ వద్దు. అక్కడ పప్పు ఉడికింది. అన్నమయింది. "

" నీకెలాగే తెలిసిందీ ? "

         " అది నువ్వు నాకిచ్చిన వరము. ఇప్పుడు నువ్వు నీ దేహము ఉన్నచోట మాత్రమే నువ్వున్నావు అనుకుంటున్నావు. మా దారి పట్టితే , నువ్వైనా నేనైనా , ఉండని స్థలమే ఉండదు. " 

" అంటే , ఇక్కడ కూర్చొనే వంటింట్లో ఏమవుతున్నదో చూడవచ్చా ? "

         " ఏమి కష్టము ? అంతే కాదు, నువ్వు వంటమనిషిని ఉంచుకొని ఉంటే , నువ్వు చూసుకోకున్ననూ ఆమె వంట చేసిపెట్టేది కదా ? అట్లే వంట చూసుకో అంటే అదే చూసుకుంటుంది. అయితే , ఈ విద్యను నేర్చినవారు అటువంటివి పట్టించుకోరు , అంతే! "

         " నువ్వు ఏమేమో చెపుతున్నావు. అయితే , వారు చెప్పేదానికీ , నువ్వు చెప్పేదానికీ వ్యత్యాసము లేదు. కాబట్టి అబద్ధము కాదేమో ? మనకు తెలియనివి, ఏమేమి , ఎన్నెన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు ? నేనింక వస్తాను. "

         " న్యాయము. ఇంటి యజమానురాలివి నువ్వు. ఇంటి భారమునంతా నెత్తిన వేసుకొని ఉన్న నువ్వు మా వలె బాధ్యత లేకుండా కూర్చొనుటకవుతుందా ? వెళ్ళిరా. ఒక మాట. చెల్లీ , నువ్వు నిద్ర పోవునపుడు ఈ భారమునంతా ఎవరి తలపై ఉంచుతావు ? "

" పోవే , మాట్లాడ నివ్వకుండా చేసి నా నోరు కట్టివేయుటలో మీరిద్దరూ ఒకటే! " 

         కాత్యాయని భగవానులను చూసి జ్ఞాన సత్రము సంగతి మాట్లాడ వలెనని నిర్ధారించు కొని వంట ఇంటి వైపుకు పరుగెత్తింది. ఇంకో ఘడియలో ఆమె అన్నము దింపి , ఉడికిన పప్పుకు పులుసుపోసి దానికి ఉప్పు వేస్తుండగా భగవానులే అక్కడికి వచ్చినారు..

" ఏమి కాత్యాయినీ , పిలిచినావా ? "

        కాత్యాయని ఆ గొంతు విని తల తిప్పింది.  వారిని చూసి  తనకైన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ , " పిలవలేదు  , ధ్యానిస్తున్నాను " అన్నది. 

భగవానులు కూడా ఏమీ తెలియనివారి వలె అడిగినారు , " ఏ విషయము ? "

" మీతో కొంతసేపు మాట్లాడ వలెనని ఉన్నాను. కానీ అదేమో , మరచి పోయినానే ? "

        " ఒక్కోసారి అలాగ అవుతుంది. నువ్వు ఏదో మాట్లాడాలని ఉన్నావని వేళకన్నా ముందే మాధ్యాహ్నికాదులను ముగించుకొని వచ్చినాను. సరే , పోనివ్వు. తరువాత మాట్లాడ వచ్చును. " 

" ఆ..ఆ గుర్తొచ్చింది. అది సరే , ఇది వంట ఇల్లు కదా ? ఇక్కడే మాట్లాడుదామా ? "

         " మాట్లాడేది మనము మనమే. వంటిల్లయితే ఏమి ? ఇంకో గది అయితేనేమి ? పైగా ఇది నీ క్షేత్రము. నువ్వు చెప్పినట్లు వినాలని అనుకొనే ఇక్కడికి వచ్చినానో ఏమో ? సరే గానీ నువ్వు కూరకు ఒప్పులు తరుగుతూ కూర్చొని మాట్లాడు. నిన్ను అలాగ చూసి చాన్నాళ్ళయింది. రండి , ఈ కత్తిపీట ముందర సమాసీనులు కండి. " 

" మీ వినోదము మరీ చోద్యము. "

         " కాదు , వినోదము కాదు. నువ్వు  ఈ కత్తిపీట మీద కాలు వేసుకుని కూర్చో . నేను ఇక్కడ ఒక దర్భాసనమును వేసుకొని కూర్చుంటాను. మాటలు సాగనీ.."

     కాత్యాయని సంకోచపడింది. భగవానులు బలవంతము మీద ఆమెను అక్కడ కూర్చోబెట్టినారు. మాటలు ఆరంభమయినాయి. 

" జ్ఞాన సత్రపు సంగతి ఏమి చేసినారు ? "

   " నేను చేయుట ఏమి ? రాజు కావలసినట్లు ఖర్చు చేసి దానిని చేయిస్తున్నాడు. దేశ విదేశముల నుండీ విద్వాంసులు వస్తారు. జరుగుతుంది , నేనేమి చేయవలెను ? " 

" మీకు ఆహ్వానము వచ్చిందా లేదా ? "

" వచ్చింది "

"మీరు వెళ్ళరా ? "

" నేను ఆ సంగతే ఆలోచించలేదు. అయినా , అక్కడికి వెళ్ళి చేసేదేముంది ? " 

" ఇదింకా చోద్యము. అదంతా చేసినదే మీ కోసమంట ! మిమ్ములను సర్వజ్ఞులని అందరెదురుగా పట్టాభిషేకము చేయవలెనంట! " 

" చూడు కాత్యాయనీ , బ్రహ్మిష్ఠులైన వారు తన లోకమునకు వస్తే , చతుర్ముఖ బ్రహ్మ ఎదురువచ్చి పిలచుకొని వెళ్ళి తన ఆసనములో కూర్చోబెట్టి అర్ఘ్య పాద్యాదులను ఇస్తాడంట. అప్పుడు దానికి కూడా మోహపడక ’ నేను ముందుకు సాగవలెను ’ అని వెళ్ళిపోవలెనంట! దానిని వైరాగ్యము అంటారు. అలాంటపుడు , ఇక్కడ , ఈ సామాన్య రాజు జరిపే జ్ఞానసత్రములో సర్వజ్ఞుడనయితే వచ్చేదేముంది ? చేసేదేముంది ? చెప్పు ? "

" అంటే వెళ్ళరా ? "

" వెళ్ళనని నేనేమీ ప్రతిజ్ఞ చేయలేదు. నేను వెళ్ళకపోతే , సర్వజ్ఞ పదవి ఇంకొకరికి వస్తే గతియేమి? అంటావా ? ఈ విశ్వములోనున్న చరావరములన్నీ నేనే అయి ఉన్నపుడు సర్వజ్ఞత్వము ఎవరికి వచ్చినా నాకు వచ్చినట్లే కాదా ? "

కాత్యాయనికి ఏమి చెప్పవలెనో తెలియలేదు. ఆ లోపలి భావము అద్దములో ప్రతిబింబించినట్లు ముఖములో స్పష్టముగా కనిపిస్తుండగా అడిగినది , " వెళ్ళకూడదు అని ప్రతిజ్ఞ లేదు. వెళ్ళవలెను అని నిర్ణయించలేదు. ఇలాగంటే నేనేం చెప్పేది ? "

భగవానులు ఆమెను చూసి నవ్వినారు: " నేను వెళ్ళితీరవలెను అన్నట్లయితే యజ్ఞేశ్వరుడు ఆజ్ఞ ఇవ్వనీ , వెళ్దాము" అన్నారు

కాత్యాయని , ’ రాజే వచ్చి పిలిస్తే ? " అన్నది. 

భగవానులు లేస్తూ అన్నారు, " అప్పుడు నామీద రెండు మోపులు పడినట్లే. ఒకటి నీది , రెండోది రాజుది. అయినా సరే , యజ్ఞేశ్వరుని ఆజ్ఞ లేనిదే వెళ్ళుటకు లేదు. " 

" అదెప్పుడు తెలుస్తుంది ? "

" దేవతలు అంతటా , అన్ని వేళలా ఉంటారు. వారు ఎప్పుడంటే అప్పుడు , ఎక్కడంటే అక్కడ , ఎలాగంటే అలాగ చెప్పవచ్చు. "

" అయితే అడిగేయండి " 

" అలాగ వారు దొరికినారు కదా అని అడుగుట న్యాయము కాదు . అయినా నువ్వు నా గృహిణివి. నీ తృప్తి కోసము అడుగుతాను. "

భగవానులు శుద్ధాచమనము చేసి కూర్చొని కనులు మూసుకున్నారు. కాత్యాయని ఏమగునోయని ఆందోళనతో నిండి చూస్తున్నది. వంటింట్లోని పొయ్యి అరచింది. కట్టెలు భగభగమని మండుతూ శబ్దము చేస్తున్నాయి. కాత్యాయని సందేశము దొరికింది అనుకుంటుండగనే  భగవానులు నవ్వుతూ కళ్ళు తెరచి , " వెళ్ళ వలెనంట. ఆజ్ఞ అయినది. ఇక మంచీ చెడూ అంతా వాడిదే. తప్పకుండా వెళదాము. రేపు షష్ఠి. ప్రయాణానికి అంత అనుకూలము కాదు. ఈరాత్రికే భోజనమయినాక వెళదాము. మైత్రేయి ఇక్కడే ఉండనీ. " అన్నారు. 

" ఆమె కూడా రావలెను. "

" అలాగే కానీ. దానికి అన్ని ఏర్పాట్లూ చేసుకోండి. ’ 

అతిథి గృహమునుండీ వటువు ఒకడు పరుగెత్తి వచ్చినాడు. భగవానులు ’ ఏమి ? ’ అని అడిగినారు. వటువు , " మహారాజులు ఏనుగు మీద వచ్చినారు.  అంబారీలో కూర్చున్నారు. " అన్నాడు.

భగవానులు కాత్యాయని ముఖమును చూసి నవ్వుచూ , ’ వస్తున్నా , పద ’ అని వటువు వెనకే వెళ్ళినారు. " 

No comments:

Post a Comment