SHARE

Saturday, April 6, 2013

67. " మహాదర్శనము--అరవై యేడవ భాగము -- జ్ఞాన సత్రము


 67.  అరవై యేడవ భాగము--  జ్ఞాన సత్రము


          జ్యేష్ఠ శుద్ధ సప్తమి వచ్చినది. దానివెనుక ఎనిమిది దినములనుండీ రాజధానిలో ఒకటే కలకలము. కోలాహలము. సంభ్రమము. పదిమంది దేశాధిపతులు వచ్చినారు. ఒక్కొక్కరినీ రాజే స్వయముగా వెళ్ళి మంగళవాద్యాది పరివారములతో పిలుచుకొని వచ్చి ఒక్కొక్క భవనములో దింపినాడు. అటులనే విద్వాంసులు పల్లకీలలోనూ , మేనాలలోనూ శిష్యులతో పాటు వచ్చినారు. వారినందరినీ రాజపురుషులు పిలుచుకొని వెళ్ళి నియమిత స్తలములలో దింపినారు. 

         జ్ఞాన సత్రము ఒక జాతరవలె అయినది. దానిని చూడవలెనని జనాలు మూగుతున్నారు. " మా జన్మలో మనము ఇంతమంది విద్వాంసులను ఒక్కచోటే ఇలాగ చూచుట సాధ్యము కాదు. " అని వచ్చినవారెందరో. " జ్ఞాన సత్రమంటేనేమి , చూడవలెను " అని వచ్చినవారెందరో. అన్నిటికనా ఎక్కువగా , ’ ఇదొక వినోదము, చూడవలెను ’ అని వచ్చినవారు అసంఖ్యాకులు. మొత్తానికి రాజధాని నిండిపోయినది. ఎక్కడ చూచిననూ జనము. ఇళ్ళలో జనము , వీధులలో జనము, చెట్లకిందా జనాలు , బయలు లోనూ జనాలు. ఎక్కడెక్కడ చూచినా జనమే జనము. 

         వెనుకటి రోజే రాజు వెళ్ళి విద్వాంసులలో అగ్రగణ్యులైన వారిని చూసి వచ్చినారు. బ్రహ్మవాదిని యైన గార్గి , శ్రౌతములో ప్రసిద్ధులైన అశ్వలుడూ వెంట ఉన్నారు. శ్రౌతములో ప్రఖ్యాత విద్వాంసులైన ఆర్తభాగుడూ , భుజ్యులూ , బ్రహ్మవాదులైన ఉషస్తుడు , కహోళుడు , ఉద్ధాలకులు , విదగ్ధులనూ చూసి వచ్చినారు. విదగ్ధుడు రాజును అడిగినాడు, " ఏమిటి ? మీరు అప్పుడే మీ సర్వజ్ఞులను వరించినారంట ? "

         రాజు సహజమైన వినయముతో అన్నారు : " అటువంటిదేమీ లేదు. మా రాజ్యములో యాజ్ఞవల్క్యులు కర్మ బ్రహ్మలు రెంటిలోనూ ప్రసిద్ధి చెందిన విద్వాంసులు. అంతేగాక ఆనువంశికముగా వచ్చిన పాండిత్యమున్నవారు. కాబట్టి నేనే వెళ్ళి పిలుచుకొని వచ్చినాను. " 

       విదగ్ధుడు విస్మితుడై అన్నాడు : " దానిలో తప్పేమీ లేదు. చెవి విన్నదానిని నోరు అడిగింది, అంతే! దీనిపైన , విద్వద్బృందపు పరముగా గార్గి ఉన్నారు , మీ వారే అయిన అశ్వలులున్నారు. ఒకవేళ ఇలాగ మీరు సర్వజ్ఞాభిషేకము  ఫలానా వారికి కావలెనని నిర్ణయిస్తే వారు ప్రతిఘటించకుండా ఉంటారా ? "

        గార్గి అన్నది , " లేదు గురువుగారూ , సర్వజ్ఞత్వము మీ ఇద్దరిలో అంటే , మీరు , యాజ్ఞవల్క్యులు ఇద్దరిలో ఒకరికి కట్టి ఉంచబడిన సొత్తు. "

        " ఇది మీ అభిమానముతో చెప్పు మాట. ఆతనికి దేవతా ప్రసాదము చాలా ఉంది. ఆతడే సర్వజ్ఞుడైతే విశేషమేమీ లేదు. దానికై మేము సంకట పడునది కూడా లేదు. ఒక సంహిత , ఒక బ్రాహ్మణము, ఒక ఉపనిషత్తు పొందుట అంటే సామాన్యమా ? కానీ ఇంత అయిననూ మాకు అతడిని ఎదురించుటకు బెదురేమీ లేదు. ఏమి గార్గి , మీరేమంటారు ? మీరు ఆతని వెంట తీర్థయాత్రకు వెళ్ళినవారు. ఆతని విద్యా వైభవమును చూచి మొదటే ఓడిపోయినారా యేమి ? "

’ ఎంతైనా నేను మీ శిష్యురాలిని. ఆతనికి విద్యానుగ్రహము కావలసినంత ఉన్నదని ఒప్పుకున్ననూ , సమయము వస్తే నేను కూడా ఎదుర్కోవచ్చును. " 

        " భలే! భలే! చూడండి , ఎంతచెప్పినా , మానుషము రజోగుణ స్థానము. సమయము వచ్చినపుడు గర్జించుటయే స్వభావము. వశవర్తిని యైన భార్య కూడా ఒక్కొక్కసారి ఎదురు తిరగదా ? అందులోనూ మేము విద్వాంసులమని అహంకారము. మేము ప్రతిఘటించకుండా ఉంటే అదొక అవమానము. విద్యాదేవికి అది ద్రోహము చేసి నట్లగునని శంక. ఇవన్నీ చేరి మమ్ములను ప్రతిఘటించు నట్లు చేస్తాయి. అయితే , మా అభిమానము రాగ ద్వేషముల పట్టుకు చిక్కి , దురభిమానులమైతే మేమే చెడిపోతాము. అది సరే , పాండిత్య కిరీటమును అందరూ చూచినారా ? " 

         రాజు అన్నాడు: " పాండిత్య కిరీటము శారదా మంటపములో అందరికీ కనబడునట్లు ఉంచబడినది. అయితే అదేమీ గొప్పది కాదు. కానీ ఆ గోధనమును చూస్తే ఎంతటి అపరిగ్రాహికి అయినను మనసు లాగుతుంది. వివరాలన్నీ నేనే చెప్పరాదు. కాబట్టి అనుజ్ఞ అయితే అశ్వలులు చెప్పెదరు " 

         " చెప్పండి అశ్వలులవారూ! మీ భాషణము విని చాలా దినములయినది. పైగా , మీరేమి , సామాన్యులా ? తెచ్చుకుంటే వరము , ఇచ్చుకుంటే శాపము అనునట్టి విద్వద్వరేణ్యులు. ఏమి చేయుట ? మా అందరి దురదృష్టము. మీరు బ్రహ్మవిద్య వైపుకు గమనము సారించలేదు. మీ సర్వస్వమునూ శ్రౌతమునకే ధారపోసినారు. సరే , మీ పురోహితులు భార్గవులెక్కడ ? "

        " వారు రాజ పౌరోహిత్యమును వదలి ఇప్పుడు యాజ్ఞవల్క్యుల ఆశ్రమములో తపస్సుకు కూర్చున్నారు. అంతే కాదు , యాజ్ఞవల్క్యుల అగ్నులను తాను చూసుకుంటానని చెప్పి , మైత్రేయి గారిని పంపించినారు. "

" ఆమె యాజ్ఞవల్క్యుల మోక్షపత్ని కదా ? "

" ఔను "

      " సంతోషము. అంతటి బ్రహ్మవాదిని రాకుంటే మీ సభకు కాంతి ఎక్కడిది ? ఏమి గార్గీ ? ..సరే , అశ్వలులు ఏమో చెపుతారన్నారు కదా ? "

          అశ్వలుడు చెప్పినాడు, : ఒక వేయి గోవులు. వత్సములతో కూడిన వాటితో పాటూ రాజభవనపు ఇరవై అయిదు ఆబోతులు. వీటిని కట్టివేయుటకు కనీసము యజ్ఞమంటపానికి రెండింతలున్న ఆ ఎదురుగా ఉన్న తోపులో స్థానము ఏర్పాటు చేసినాము. ఆ మందను చూస్తేనే చాలు. కనులు చెదరి పోతాయి. వాటినన్నిటినీ కడిగి , పసుపూ కుంకుమా పెట్టిన తరువాత ఇక చెప్పవలసినదేమి ? అంతేకాక ఒక్కొక్కదానికీ పైన కప్పుటకు జరీతో కూడిన ఒక్కొక్క జలతారు వస్త్రము. కాళ్ళకు , కొమ్ములకూ వెండి మువ్వలు , కుప్పెలు , మెడకు ఇత్తడి పట్టీ , ముఖానికి జలతారుతో చేసిన కడ్డీలు గల  ముఖవాడము , వీటన్నిటికీ మించి రెండు కొమ్ములకూ ఐదైదు మను సువర్ణములు. ఒక్కొక్కదానికీ పాలు పితుకుటకు ఒక చిన్న పాత్ర ,  ఒక బిందెడైనా పాలు పట్టు మరియొక పెద్ద పాత్ర. వాటికి కావలసిన మనుషులు , తిండిగింజలు, పత్తి గింజలు , పచ్చిగడ్డి, ఎండు గడ్డి,  తవుడు , గానుగ చెక్క . ఇంతేనా , ఆ సువర్ణాలే పదివేలవుతాయి. "

" మను సువర్ణములు అంటేనేమి ? "

        అశ్వలుడు మహారాజు ముఖాన్ని చూసి , అనుమతి పొంది , నిక్షేప లాభపు వృత్తాంతమంతా చెప్పినాడు. " ఆ సువర్ణము ఒక్కొక్కటీ మూడు వేళ్ళ వెడల్పు ఉండి , మన సువర్ణములు దానితో ఇరవై అయిదవుతాయి. " 

" అంత భారీ సువర్ణమా ? "

          " రేపు తమరే చూస్తారుగదా ? ఇంకొక విశేషము , ఆ పశువులను తీసుకొని పోవుటకు లేశమైననూ కష్టము , ఖర్చు , దుఃఖమూ కారాదని , వాటికి కావలసిన కొట్టములు , పాకలు , వాటిని చూచుకొను మనుషులకు గృహములు , వాటికి ఒక సంవత్సరమునకు కావలసిన ధాన్యము , మేతలను నింపి యుంచుకొనుటకు గోదాములు,  గాదెలూ , చివరికి వాటిని కట్టియుంచుటకు గూటములను, సర్వమునూ మహారాజుగారే సొంత వెచ్చముతో కట్టించి ఇస్తారు. " 

       " కానుక అంటే అలాగ ఉండవలెను. మహారాజులు ఇలాగ చేయించుట బహు సమంజసముగా నున్నది . చివర , సర్వజ్ఞాభిషేకపు నాడు ఈ దేశాధిపతులు ఇచ్చు కానుకలూ చేరుతాయి. అన్నీ చేరి అయిదు లక్షలు కావచ్చునా ? "


" హెచ్చుతక్కువగా అక్కడికి రావచ్చును. "

         విదగ్ధుడు సంతోషముతో తలయూపినాడు. " చాలా బాగుంది. ఈ జ్ఞాన సత్రములో, లేదా జ్ఞాన పణ ద్యూతములో గెలిచినవాడు నిస్సందేహముగా , నిరాలోచనగా  రెండు మూడు తరాలు సుఖముగా ఉండవచ్చును. అలాగ చేసిన విద్య తప్పక పెరుగును , రాణించును. ఇది ఎంతో బాగున్నది. " అన్నాడు. 

       సప్తమి నాడు విద్వాంసులు , దేశాధిపతులు , పుర ప్రముఖులు , అతిథులు , ఆహ్వానితులు , రాజాధికారులు , మొదలగు అందరూ మధ్యాహ్నాత్పరము సవాహనులై దయచేసినారు. చివరగా భగవానులు తల్లిదండ్రులను పల్లకిలో కూర్చో బెట్టుకొని తామూ , తమ ప్రధాన శిష్యుడు కణ్వుడూ ముందరి కొమ్ములనూ , మైత్రేయీ కాత్యాయనీ వెనుకటి కొమ్ములనూ భుజాలకు ఎత్తుకొని ఇంకొక ప్రధాన శిష్యుడైన మాధ్యందినుడు పల్లకీ ముందర బెత్తమును పట్టుకొని , జ్ఞాన మంటపమునకు సాగుతూ వచ్చినారు. ఆచార్యుని తేజస్సు విజృంభిస్తున్ననూ , భగవానుల తేజస్సు దానికి మూలముగా ఉన్నట్లు ఉండినది. 

          భగవానుల నిరీక్షణలో నున్న మహారాజుకు ఇది తెలిసింది. " హా!  హా!  " అని పరుగెత్తి వెళ్ళి , భగవానుల బదులు తామే పల్లకీని భుజాని కెత్తుకున్నారు. ఆతని వెంట పరుగెత్తి వచ్చిన మంత్రి, దళపతి , కోశాధికారులు మిగిలిన కొమ్ములను పట్టుకున్నారు. ఆచార్యుడు తాను ఇంకా పల్లకీలో కూర్చొని యుండుట సమంజసము కాదని , ఎవరెంత బలవంతము చేసిననూ వినక , కిందకు దిగినాడు. భగవానులు సపత్నీ శిష్యులై తల్లిదండ్రులను ముందుంచుకొని వచ్చినారు. మేస్త్రీ ముందర బెత్తమును పట్టుకొని నడుస్తుండగా , అతని వెనుక రాజు , మంత్రి , దళపతి , కోశాధికారులు  దేవరాత కుటుంబమునకు దారి చూపిస్తూ పిలుచుకు వచ్చినారు. 

మహారాజులు స్వయముగా వెళ్ళి పిలుచుకొని వచ్చినారు , వచ్చిన వారెంతటివారో యని మంటపానికి మంటపమే లేచి నిలుచుంది. విదగ్ధ శాకల్యులకు మాత్రమే కాళ్ళు కడిగిన మహారాజు , ఆచార్య దంపతులకూ , భగవానులకూ , వారి పత్నులకు కూడా కాళ్ళు కడిగినారు. వారందరూ వచ్చి విద్వత్సభలో తమతమకు కేటాయించిన స్థానములలో కూర్చున్నారు. భగవానులు తండ్రికి సరిసమానముగా కూర్చోక , తమ ఆసనమును కొంచము అడ్డముగా తిప్పి కూర్చున్నారు. సభవారు, వారు యాజ్ఞవల్క్యులని తెలిసి ఉపశాంతులై , వారి తేజస్సును చూసి బహు సంతోషించినారు. అందరూ యథావిధిగా ఉపస్థితులైన తరువాత , సుశ్రావ్యమైన స్వాగత సంగీతమైన తరువాత, రాజు వేదిక పైకి వచ్చి , సభాపూజను నెరవేర్చినారు. సభలోనున్నవారికి భయభక్తులతో అన్నారు: " సర్వ సన్మాన్యులైన విద్వద్వరేణ్యులకు నమస్కారములు. జ్ఞానసత్రమును ఆరంభించుటకు తమరి అనుమతిని వేడుకుంటున్నాను. ఏ జన్మలో నేను చేసిన పుణ్యము పరిపక్వమైనదో తామందరినీ , తమంతటి వారికి ఆశ్రయము నిచ్చిన ఈ దేశాధిపతులనూ ఒకచోట చూచే సుయోగము నాకు లభించినది. ఇక నేను తమకు రెండు అంశములను విజ్ఞాపించు కొనెదను. ఈ మహాసభ , యే మహాత్ముడిని సర్వజ్ఞుడని నిర్ణయించునో , ఆతనికి ఈ పాండిత్య కిరీటమును కట్టబెట్టి సర్వజ్ఞాభిషేకమును చేయుట, రెండోది , ఈదినము తామందరూ వచ్చునపుడు , ఆ దిన్నె పక్కగా నున్న తోపులో కట్టిన వేయి గోవులను చూచినారు కదా ? అవన్నీ సాలంకృతములు , సోపస్కరములు , సపరివారములు. వాటిని తమలో బ్రహ్మిష్ఠులు ఎవరో , వారు తీసుకొనవచ్చును. "

అక్కడ కూర్చున్న విద్వాంసులు ఎన్నో సభలను ఎదిరించినవారు. కీర్తి సంపన్నులు. విద్యా వైభవమున్నవారు. అయినా , వారందరికీ ఈ సభ ముందర నిలచి నేను బ్రహ్మిష్ఠతముడను యని చెప్పుకొనుటకు ధైర్యము చాలలేదు. అందరూ గోవులను కోరిననూ, అవి మాకు కావలెను అని చెప్పలేక పోయినారు. ఎందుకో అందరికీ మనసులో జంకు కలిగింది. విద్యాకీర్తులలో పెద్దవారు కురు పాంచాలులు . వారిలోనూ పరమ శ్రేష్ఠుడు విదగ్ధశాకల్యుడు. అతడు కూడా ఎందుకో లేచి నిలబడుటకు సిద్ధము కాలేదు. 

రాజు మరలా వేదికపై నిలచి , ముందు చెప్పినదే మరలా చెప్పినాడు.  

ఒక్క ఘడియ వేచియుండినాడు. అదే మౌనము. ఇప్పుడు నిరీక్షణము ఘనముగా పెరిగి , మౌనము ఇంకా గంభీరమైనది. 

రాజు తాను చెప్పినది మూడవ సారిగా మరలా చెప్పినాడు. రాజు మాట ప్రతిధ్వనించునట్లు సభ మౌనముగా ఉంది. గట్టిగా ఊపిరి వదలనివారే లేరు అంటే అతిశయోక్తి కాదు. 

No comments:

Post a Comment