SHARE

Friday, February 8, 2013

మాఘ మాసము విశిష్టత



మాఘ మాసము
( ధర్మ సింధువు ప్రకారము )

మాఘ మాసము విష్ణువుకు (  సూర్య నారాయణుడికి ) ప్రీతిపాత్రమైనది. ఈ మాసములో  మనము అనుసరించవలసిన విధానము.

         మాఘ మాసమందు ప్రాతఃస్నానము చేయాలి. హవిష్యము ( హోమము ) , బ్రహ్మ చర్యము , మాఘస్నానము  - గొప్ప ఫలాన్ని ఇస్తాయి.  

      మాఘ మాసము వస్తే సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. 

     అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. నక్షత్రములుండగా చేసిన స్నానము ఉత్తమము. చుక్కలుపోయాక చేసినది మధ్యమము. సూర్యుడుదయించాక చేసినది అంతకన్నా హీనము.ఈ స్నానము ప్రయాగ నందు చాలా ప్రశస్తమైనది. గంగయందు , సంగమమందు చేసినది కాశీ యందలి స్నానము కన్నా నూరు రెట్లు పుణ్యప్రదము. పశ్చిమ వాహిని స్నానము దానికన్నా వేయిరెట్లు అధిక ఫలము . అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానము మిక్కిలి ప్రశస్తమైనది.  

   మాఘ శుక్ల  త్రయోదశి నుంచీ మూడు రోజులను ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ / సముద్ర స్నానము చేయాలి. 

మాఘ స్నానమున నియమములు  ; 

       స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి. వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు.   అట్లాగే తిలల స్నానము.  తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు. 

స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి. 
దానములు ;

     నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి. 

శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి. 


     నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి. 

      భవిష్యపురాణము ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు  అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి. పితరులకు , దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు ముల్లంగి తింటే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే  క్షత్రియ , వైశ్య , శూద్రులు కూడ..ప్రతిరోజు స్నానము చేయునపుడు , ఈ మంత్రాన్ని ఉచ్చరించి , మౌనముగా స్నానమాచరించాలి 

దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ 
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి. 

రథ సప్తమి


దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి  అని కూడా అంటారు

      ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.  నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి  భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిలపరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి

॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః 
వరుణాయ నమస్తే`స్తు హరివాస నమో`స్తుతే..॥

     సూర్యుణ్ణి   ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి. 

ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం )  చెరుకు గడ తో నీటిని కదిలించి ,  ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి

॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥

॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం 
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥

॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే 
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥ 

   స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి  అర్ఘ్యము ఇవ్వాలి 


॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥


శుభం భూయాత్

Thursday, February 7, 2013

" మహా దర్శనము "---- వేదములు--ఒక లఘు పరిచయము



వేదములు--ఒక లఘు పరిచయము


         యాజ్ఞవల్క్యుని కథ చదువువారు ఈ పుస్తకములో అనేక చోట్ల  సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు అనే మాటలు  చదివి కొంత అయోమయమునకు లోను యగుట సహజము. వీటి అర్థము తెలుసుకోనిదే ఇందులోని కొన్ని విషయములు అర్థముకావు. అందుకని , కొన్ని ప్రాథమికమైన విషయములను ఇక్కడ చర్చించడమైనది. 

అసలు వేదమనగానేమి ? 

        వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము. 

వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము. 

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||

      అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము. 

వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు.  అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది. 

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||

     కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

వేదములెన్ని ?

        వేదమనునది అపారమైన జ్ఞాన రాశి. ఎవరూ కూడా దానిని సంపూర్ణముగా తెలుసుకొనుటకు సామర్థ్యులు కాదు. జ్ఞానము అనంతమైనట్లే , ఆ దివ్య జ్ఞానమునకు శబ్దరూపమైన శరీరము వలెనున్న వేదరాశి కూడా అపారమే. అట్టి అపారమైన గ్రంధరాశిని అధ్యయనము చేయుటకెలాగూ సాధ్యముకాదని నిరాశ చెంది అల్పబుద్ధిగల మనుష్యులు వేదాధ్యయనమునే నిలిపివేస్తారేమోనని , వేదమే కనుమరుగౌతుందేమోనని శంకతో మహాత్ములైన కృష్ణద్వైపాయనులు వేదముల విభాగము చేసినారు. అఖండమైన ఆ వైదిక వాఙ్మయమును ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము అథర్వణ వేదము యని నాలుగు భాగములు చేసి తమ శిష్యులొక్కరితో వాటి పరంపరను కొనసాగించునట్లు చేసినారు. ఈ విధముగా నాలుగు విభాగములు గల వేదములో ఏదైనా ఒక భాగమును ప్రధానముగా అధ్యయనము చేసి మిగిలిన భాగములయొక్క సామాన్య పరిచయమున్ననూ చాలునని , అ విధముగా అనేకులు తమ తమ శాఖను అధ్యయనము చేయుటవలన వేదపరంపర కొనసాగునని ఈ యోజన చేసినారు. 

అలాగ వేద విభజన చేసిన కృష్ణద్వైపాయనులు వేదవ్యాసుడు గా ప్రసిద్ధికెక్కినారు.

       ఆయా వేద శాఖను మాత్రము విశేషముగా అధ్యయనము చేసినవారికి ప్రకృతి దోషము వలన తమ వేదశాఖయే గొప్పది , తక్కినవి అధమము అను తప్పుభావన రాకూడదని , ప్రతియొక్క శాఖా విద్వాంసులూ ఒక్కటిగా చేరి తమ తమ ప్రావీణ్యమును ప్రకటిస్తూ ఒక కర్మను నెరవేర్చినపుడు తామందరూ ఒకే వేద వృక్షమును ఆశ్రయించిన వారము అన్న ఎరుక అందరికీ కలుగును. ఇలాగ అన్ని వేదముల విద్వాంసులూ చేరి నెరవేర్చు కర్మయే ’ యజ్ఞము ’ . 

        నాలుగు వేదశాఖలలో ఏ ఒక్క వేద విద్వాంసుడు లేకున్ననూ ఆ యజ్ఞము జరగదు. అన్ని వేదముల సహకారము వల్లనే యజ్ఞము సంపన్నమగును. యజ్ఞములో భాగము వహించు ఋగ్వేదపు ఋత్త్విజుడిని " హోతా  ( హోతృడు ) "  అనీ , యజుర్వేదపు ఋత్త్విజుడిని " అధ్వర్యుడు " అనీ , సామవేదపు ఋత్త్విజుడిని " ఉద్గాతా " యనీ , అథర్వణవేదపు ఋత్త్విజుడిని" బ్రహ్మా " అనీ అంటారు. 

( ఇవన్నీ కాక , ప్రతి వేదములోనూ అనేక శాఖలున్నవి... పొడిగించుట లేదు )

        వేదమును నాలుగు భాగములుగా విభజించినట్లే , ’ సంహితా ’ , ’ బ్రాహ్మణము ’ , ’ ఆరణ్యకోపనిషత్తు ’ అని కూడా విభజించబడినది. ఈ విభాగము అన్ని వేదములకూ ఉంది. వీటిలో ఆరణ్యక , ఉపనిషత్తులను ఒకటిగా భావించి , మొత్తము మూడు విధములుగా విభజింపబడుట వలన  వేదములకు " త్రయీ " అన్న పేరు కూడా ఉంది. 

సంహిత

        వీటిలో సంహిత అంటే " ఒకచోట చేర్చిన " భాగము. వేరే వేరే ఋషులు మంత్రద్రష్టలై కనుక్కున్న మంత్రములను ఒక క్రమ పద్దతిలో చేర్చి , ఒకేచోట కలసికట్టుగా కూర్చిన భాగము. దీనినే , ఇంకో విధముగా , అంటే , పదపాఠమును స్వరము , సంధి--ఇత్యాది నియమానుసారముగా కూర్చి దండాకారముగా పారాయణ చేయుటకు అనువుగా అలవరచిన వేదమంత్రములు. వివిధములైన యజ్ఞయాగాదులలో ఉపయోగించవలసిన మంత్రములు మాత్రమే ఉన్న భాగమును సంహిత అంటారు.  ఐతరేయ , తైత్తిరీయ , వాజసనేయ , కౌథుమీయ, శౌనకీయ సంహితలు కొన్ని ఉదాహరణలు. 

     ప్రకృతి , ప్రత్యయములు లేదా, పదములు మధ్యలో విరామములేకనే చేరియుండుట కూడా సంహిత అనిపించుకుంటుంది. పైన చెప్పిన సంహితలలో అనేక మంత్రపాఠములలో కొన్ని వందల పదములు ఒకే వాక్యములో నుండుటను గమనింపవచ్చు. 

       ఇంకొక విషయము : వేదములో ’ సంహిత ’ అన్న పదము మంత్రముల సమూహములతో కూడిన భాగమునకు మాత్రమే వర్తిస్తుంది. ఋగ్వేద , శుక్ల యజుర్వేద సంహితలలో మంత్ర భాగము మాత్రమే ఉంది. అయితే , కృష్ణ యజుర్వేదములోని ( తైత్తిరీయ ) సంహితలో బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగమూ చేరి కనిపిస్తాయి. అలాగే , కృష్ణ యజుర్వేద బ్రాహ్మణములో కూడా బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగములూ కలసిపోయి కనిపిస్తాయి. 

మరి బ్రాహ్మణము అంటే యేమిటి ? 

       బ్రాహ్మణము అంటే సంహిత యొక్క మంత్రముల వ్యాఖ్యాన రూపమైన గద్య గ్రంధము. బ్రహ్మమును ( అంటే మంత్రమును ) వివరించుట వలన వీటికి ’ బ్రాహ్మణము ’ అని పేరు. ఈ బ్రాహ్మణములో , ’ సంహితా మంత్రములను యజ్ఞములలో వినియోగించుట యెలాగ ? యే కాలములో యే కర్మను యెలాగ చేయవలెను ? అనుదానినీ , దానికి సంబంధించిన ఉపాఖ్యానములనూ వివరించే వేద భాగము ఉంటుంది.

      ఐతరేయ , కౌషీతకీ బ్రాహ్మణములు ఋగ్వేదమునకు సంబంధించినవి. తైత్తిరీయ , శతపథ బ్రాహ్మణములు యజుర్వేదమునకు సంబంధించినవి. తాండ్య , జైమినీయ , షడ్వింశ బ్రాహ్మణములు సామవేదమునకు సంబంధించినవి. గోపథ బ్రాహ్మణము అథర్వణవేదపు బ్రాహ్మణము. 

       బ్రాహ్మణములను ఇంకొక రీతిలో కూడా వివరించవచ్చును. వేదములోనే వచ్చు ఇతిహాసములు , పురాణములు కొన్ని ఉన్నాయి. వాటిని బ్రాహ్మణములనే తెలుసుకోవలెను. కాబట్టి , మంత్రము మరియూ బ్రాహ్మణములను వివరించునపుడు మంత్రమనగా , " యాజ్ఞిక నిష్ఠ మంత్రత్వ ప్రకారక ప్రసిద్ధి విషయత్వమ్ " అని శాస్త్రములో చెప్పబడియున్నది. యజ్ఞము చేయువాడు దేనిని మంత్రమని గుర్తించి చెప్పునో అదే మంత్రము అని ఆ వాక్యపు అర్థము. " శేషే బ్రాహ్మణ శబ్దః " అను మాట , మంత్రములు తప్ప మిగిలినవన్నీ బ్రాహ్మణభాగమే అని తెలుపును. కాబట్టి , వేదములోనున్న కొన్ని పురాణములూ , గాథలూ , కల్పములూ , నారాశంసీ-- ఇవన్నీ బ్రాహ్మణపు అంతర్గతములే. ( నారాశంసీ అంటే మనుష్యుల కథలను తెలుపునవి )  అంతే కాక , దీనివలన వేదములో ఇవన్నీ ఉన్నాయి అని కూడా తేటతెల్లమవుతుంది. 

బ్రాహ్మణమును కూడా విధి , అర్థవాదము అని రెండు విధములుగా విభజించవచ్చు. దీనిని పొడిగించుట లేదు. 

ఆరణ్యకోపనిషత్తులు

       కర్మమును వివరించు సంహితా బ్రాహ్మణములకూ , మరియూ శుద్ధ జ్ఞానమును ఉపదేశించు ఉపనిషత్తులకూ  సేతువు వంటివి ఆరణ్యకములు. ఇవి గద్యరూపములో ఉండును. ఆరణ్యకపు చివరి భాగమునే ఉపనిషత్తు అంటారు. అందుకే ’ ఆరణ్యకోపనిషత్ ’ అని కలిపి పిలుస్తారు. యజురారణ్యకములో ’ అరణ్యేధీయీత ’ అను వాక్యమును బట్టి , ఇవి ( ఆరణ్యకములు ) అడవిలో అధ్యయనము చేయవలెను అన్న నియమమునకు లోబడినవి. ఆరణ్యకోపనిషత్తులు కొన్ని చోట్ల కర్మ కాండ , ఉపాసనా కాండ , మరియూ జ్ఞాన కాండకూ కూడా సంబంధించియున్నాయి. 

       ఆరణ్యకోపనిషత్తులు యజ్ఞములకు తాత్త్వికమైన అర్థమును ఇచ్చి , మనలను జ్ఞానము వైపుకు మరల్చును. ’ అరణులు ’ ( నివృత్తి ధర్మములోనున్న నైష్ఠికులు , సన్యాసులు ) అధ్యయనము చేయుటకు యోగ్యమై , అతి పవిత్రమూ రహస్యమూ అయిన విద్య యొక్క గ్రంధములు కాబట్టి వీటికి ఆరణ్యకములు అని పేరు. 

తైత్తిరీయ ఆరణ్యకము , ఐతరేయ ఆరణ్యకము , బృహదారణ్యకము , తలవకారారణ్యకము--కొన్ని ఉదాహరణలు. 

        ఉపనిషత్తులు జీవ , బ్రహ్మ , జగత్తు మొదలగు రహస్యములనూ , దివ్య జ్ఞానమునూ అందించు వేదభాగములు. వీటికి ’ వేదాంతము ’ అనికూడా పేరు. వేదపు సిద్ధాంతమును చెప్పుట వలననూ , వేదపు చివరలో వచ్చుట వలననూ వీటిని వేదాంతము అంటారు. ’ ఉపనిషత్ ’ అన్న పదమునకు రహస్య విద్య , ఆచార్యుని దగ్గర కూర్చొని మాత్రమే నేర్చు విద్య , ఉపాసనా విద్య , పరమాత్ముని దగ్గరకు చేర్చు విద్య , పరమ శ్రేయస్సుకు స్థానమైన విద్య , సంసార బంధనమును సడలించు విద్య --అవిద్యను నాశనమొనరించు విద్య - మొదలైన అర్థములున్నవి.

       ఈశావాస్యోపనిషత్తు , కేనోపనిషత్తు , కఠోపనిషత్తు , ముండకోపనిషత్తు , మాండూక్యోపనిషత్తు , ఐతరేయోపనిషత్తు , తైత్తిరీయోపనిషత్తు , ఛాందోగ్యోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు అను పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి. 



శుభం భూయాత్


32. " మహాదర్శనము " --ముప్పై రెండవ భాగము --ఆతని నిశ్చయము


32. ఆతని నిశ్చయము


        బుడిలులన్నారు , " మేము ఇంతసేపూ నీ విషయమే మాట్లాడుచున్నాము . నువ్వు అంతా విన్నావా ? "

       "లేదు తాతా ! నేను వచ్చేసరికి మీరు , ’ ఏడుస్తూ వచ్చినవారు నవ్వుచూ వెళ్ళినారు " అన్నారు . ఎవరు అనునది అర్థము కాలేదు . "

" ఎవరైతేనేమి , యాజ్ఞవల్క్యా ? ఏడుపును తుడిచేసి , అక్కడ నవ్వు కనిపించునట్లు చేస్తే సరి , ఔనా కాదా ? "

         బుడిలులు వాడిని ఒక ఘడియ అలాగే దిష్టి తగులుతుందేమో అన్నట్లు చూచి , " ఆచార్యా , మీ కొడుకు ముఖ లక్షణము చూచినావా ? వాడేమి చెప్పిననూ నిజమయ్యా . వాడు అబద్ధము చెబితే వాడి ముఖముపైన ఈ తేజస్సు ఉండదు . ఇప్పుడే అగ్నికార్యమును చేసి , అగ్ని తేజస్సునంతా తన ముఖములో నింపుకొని వచ్చినవాడివలె కనిపించు ఈ కుమారుడు అబద్ధములు చెప్పువాడు కాదు . అబద్ధములు చెప్పితే , ఆ నోటిలో అగ్ని ఉంటాడా ? " అన్నారు . 

       ఆచార్యుడు కొడుకు ముఖమును చూసినారు . తల్లి కూడా , వాడి వీపు వెనక ఉన్నది ముందుకు వచ్చి వంగి వాడి ముఖమును చూసినది . ఇద్దరికీ సంతోషమైనది . " సరే , పెద్దల మాటలే వేదవాక్యములు ! " అన్నారు . 

బుడిలులు యాజ్ఞవల్క్యుని అడిగినారు , " అదేమిటయ్యా ? నిన్నటి సంగతి ?"

        యాజ్ఞవల్క్యునికి ఆశ్చర్యమైనది . అక్కడ జరిగినదానినీ , ఆ కారణముగా తనకు కలిగిన ఆశ్రమ నిర్గమనమునూ , మాతా కదంబిని యొక్క పాత్రనూ , క్లుప్తముగా చెప్పి , " ఇది తమరికెలా తెలిసినది ? " అని అడిగినాడు . 

         బుడిలులు నవ్వుచూ , " విచక్షణ గలవారు ఆడిన మాట యొక్క సత్యాసత్యములను గురించి విచారించవలెనే కానీ , ఎక్కడ నుండీ వచ్చినది అని కెదక కూడదు . వార్త ఎక్కడ నుండీ అయినా రానీ , ఒకటైతే నిజమయ్యా , శిష్టాచారములో ఇప్పుడు జరిగినది ఎవరికీ ఇష్టము కాలేదు . అయినా అకారణముగా , అనుకోకుండా జరిగిపోయినది . ఇలాగ మానుష బుద్ధికి అందక ఏదో కారణము చేత అయిన దానినేనయ్యా , దైవికమనేది ! కాబట్టి నాయనా , గడచిన దానిని గురించి చింతించవద్దు . ముందేదో మంచి జరుగుట కోసమే ఇలాగయినది అనుకొని ధైర్యముగా ఉండు . ఇకపై ఏమి చేయవలెనని యున్నావు ? " 

" తాతా , మీరు దండధారి వలె అడుగుచున్నారు . చెప్పిన ఏమో , చెప్పకున్న ఏమో అను సంశయము నాకు . ఏమి చేయవలెనో మీరే చెప్పండి . "

" నీ ముఖము చూస్తే సంశయ గ్రస్తుడవైనట్టు కనిపించడము లేదు . నీ ముఖములో సందేహపు మేఘములు కదలుట లేదు. సూర్యుడు నిశ్చయముగా ప్రకాశిస్తున్నట్టుంది ." 

         " తాతా  , మీ మాట అబద్ధము కాదు . నిన్న రాత్రి అంతా ఆలోచించినాను . గురుదేవులు , ఇప్పుడు వారిని అలాగ పిలువవచ్చునో లేదో ? అయినా నాకు వారు ఎప్పటికీ గురుదేవులే ! నా విద్యను ఇచ్చివేయమన్నారు . నేను మనసులోనే ’ ఇచ్చినాను ’ అన్నవెంటనే ఏదో ఒక తేజో మండలము నన్ను వదలి పైకి లేచినట్టాయెను . అప్పటినుండీ ఇప్పటివరకూ , నా తల, నా గుండె ఏదో శూన్యమైనాయి . అలాగని ఆలోచనా శక్తి కుంఠితము కాలేదు . ఈ దినము పొద్దునే లేచి అగ్ని కార్యమును ముగించి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద కూర్చున్నవాడిని ఇప్పుడే లేచి వచ్చినాను . ఇంతసేపు చేసినదేమి అంటే వఠ్ఠి ఆలోచన. రాజకుమారునిదొకటి , గురుదేవులదొకటి. గురుదేవులు ’ ఇచ్చేయి ’ అన్నది దేనిని ? ఆ దృశ్యములో ’ విద్యను ’ అనుట సరే  , కానీ దానిని ’ ఇచ్చినాను ’ అంటే అర్థమేమిటి ? ఈ జీవితములో ఇకపై నేను అధ్వర్యమును చేయను అని నిన్న మాట ఇచ్చినాను . అయితే , మా తండ్రి గారిది కర్మఠుల వంశము .  నేను కర్మమును వదిలితే వారు సంకట పడెదరు . వారి కొడుకుగా వారిని సంకట పడునట్లు చేయ కూడదు .  దానివలన ,   నేను అధ్వర్యమును వదలిననూ , ఇకముందు అధ్వర్యమును వహించువారికి అనుకూలమగునట్లు ఒక బ్రాహ్మణమును పొందవలెను . అదయిన తరువాత బ్రహ్మ విద్య వైపుకు తిరగవలెను . అని నిర్ణయించుకున్నాను . కాబట్టి సహజముగా ఆచార్యులైన తండ్రిగారు ,  విద్యా బలము వలన ఆచార్యులు కాగలిగిన తమరు - ఇద్దరూ నా అదృష్టము వలన అగ్నివాయువులవలె ఏకత్రమైనారు . ఇకపై బ్రాహ్మణ కర్త కావలెనంటే ఏమి చేయవలెనో తమరు నాకు సెలవివ్వండి . " 

       యాజ్ఞవల్క్యుడు ’ తానన్నది సార్థకము కావలెనంటే , తాను తలచినది జరగవలె నంటే తమరిద్దరి సహాయము అత్యావశ్యకము , తమరి ఆశీర్వాదము లేకుంటే అది జరగదు ’ అన్న నమ్మకము ఉన్నవాడివలె వారిద్దరికీ మరలా ప్రణామము చేసినాడు . 

        బుడిలులు నేలపై దండమువలె ఉన్నవాడిని పట్టి పైకి లేపి , పక్కన కూర్చోబెట్టుకొని , " నువ్వు పుట్టినపుడు , నీకు తండ్రినీ , తాతనూ మించువాడివి కమ్ము అని ఆశీర్వాదము చేసినవారు నిజంగా సత్యవ్రతులు . దిగులు పడవద్దు . నువ్వు కోరుతున్న కోరిక మానవాతీతమైనది . వట్టి బ్రాహ్మణమును మాత్రము రచించినవారు ఎవరూ లేరు , దాని వెనుక ఒక వేదశాఖ యొక్క బలము ఉండి తీరవలెను . అదీకాక, బ్రాహ్మణమును విరచించుట యనగానేమి ? రాజాజ్ఞ వచ్చునట్లే , లోపలి నుండీ బ్రాహ్మణమును సంగ్రహించ వలెను అన్న ఒక ప్రచోదనము రావలెను . అలా కాక , స్వంత ప్రయత్నము చేత తెచ్చిన బ్రాహ్మణమును ఆస్తికులు అంగీకరించరు కదా ? రత్నము నైజముగా రత్న కాంతితో కూడియుంటే దానిని రత్నమని అంగీకరిస్తారే కానీ , కృత్రిమ రాగయోజితమై ఉంటే నిపుణులు దానిని పరిగ్రహిస్తారా ? కాబట్టి , నువ్వు దేవతోపాసకుడవై దేవతానుగ్రహమును సంపాదించు . అది నీ ఆశను ఈడేర్చ గలదు . అప్పుడు నువ్వు కృతకృత్యుడవవుతావు . ఐతే , నువ్వు అధ్వర్యము వద్దంటావు ? సరే  కానిమ్ము , మరి , ఏదో రాజకుమారుని ప్రస్తావన తెచ్చావే ? అదేమిటి ? " 

         " అదేమీ తమకు చెప్ప వలసినంత గొప్ప సంగతి కాదు తాతా , ఒక దినము మన విదేహ రాజకుమారుడు అటువైపు నుండీ వచ్చినాడు . ఏదో గురుకులములో ఉండి వచ్చిన వాడి లాగానే కనిపించినాడు . మేము ఒక ముగ్గురము అక్కడ కూర్చొని అగ్నిహోత్రము గురించి చర్చించుకుంటున్నాము . అతడు ఏమైననూ రాజకుమారుడు , రేపు అభిషిక్తుడై రాజ్యపాలన చేయువాడు అని లేచి నమస్కరించినాము . అతడు కూడా రథము నుండీ దిగి , మమ్మల్ని కూడా అభివాదములతో అర్చించి , " ఏమి చేయుచున్నారు ? " అని వినయముగా అడిగినాడు . ’ మేము అగ్ని తత్త్వ చింతనలో యున్నాము ’ అన్నాము . ’ నాకూ చెప్పండి ’  అని  మేము చెప్పినదంతా విని , మిగిలిన ఇద్దరితో అన్నాడు , ’ మీరిద్దరూ వినండి , ఈతడు వయోమానము చేత చిన్నవాడైననూ , మీకన్నా ఎక్కువ తెలిసినవాడు ’ అని నమస్కారాదులను చేసి రథమెక్కి వెళ్ళిపోయినాడు . 

         " అతడు వెళ్ళిపోవు వరకూ సుప్తమైయున్న వారి విచక్షణ మరలా మేల్కొని , ’ వెళ్ళి అతడిని సంధించి వాదమునకు పిలుద్దాము ’ అన్నారు . నేను వారి నిస్సారతను తెలిసినవాడిని కాబట్టి వారిని వారించి ’ మనము బ్రాహ్మణులము , అతడు క్షత్రియుడు . మనము గెలిస్తే వాచశ్శూరులు బ్రాహ్మణులు గెలుచుట ఏమి మహా ? అంటారు . మనము ఓడిపోతే , అయ్యో , బ్రాహ్మణులు ఓడిపోయినారు అని అపహాస్యము చేస్తారు . వద్దు , ఈ వాదము వలన ఏమగునో ఎవరికి తెలుసు ? "  అన్నాను.  వారు కూడా ఔను , అవును నిజమే అని ఊరకున్నారు . 

        " వారికైతే చెప్పినాను కానీ నాకు ఊరికే ఉండుటకు సాధ్యము కాలేదు . ఆశ్రమమునకు వెళితే అక్కడ గురుదేవులు కనపడలేదు . గురుపత్ని దగ్గర అంతా నివేదన చేసి వారి అనుమతిని పొంది నేను రాజకుమారుని వెదకుతూ వెళ్ళినాను . అతడు వెనుక నుండీ పరుగెత్తి వస్తున్న నన్ను చూసి రథమును నిలిపి , " రండి కుమారులవారు , వచ్చిన కారణమేమి ? పశుకాములు గానా ? ప్రశ్నకాములు గానా ? " అన్నాడు . నేను ఆ తొందరలో ’ రెండూ కావచ్చు ’ అన్నాను . అతడు అది విని సంతోషించి , " ఒకటి సిద్ధము , ఇంకొకటి సాధ్యము. అనుమతి నివ్వండి  " అన్నవెంటనే నాకు జ్ఞానోదయమైనది . ’ అయ్యో , మీదగ్గర అగ్ని రహస్యమును అడగవలెనని వచ్చినాను , కానీ తమరి సిద్ధ సాధ్య పదములు నా కళ్ళు తెరిపించినాయి . నిజమే , అగ్ని వల్లనే అగ్ని రహస్యమును తెలియుటకు సాధ్యమైనపుడు నేను మీవంటి మనుష్యుడిని అడుగ వచ్చినది తప్పయినది . మన్నించవలెను ’ అని రాజాశీర్వాదము చేసి , ఎంత చెప్పినా వినకుండా వెనక్కు వచ్చేసినాను . అప్పుడు అతడు , " కుమారా , తమరు విద్యా సంపన్నులైన తరువాత మాకు మరలా దర్శనమివ్వండి , అప్పుడు మేము కామ ప్రశ్నులమై తమ వలన ఉద్ధారమగుటకు అవకాశము ఇవ్వండి . " అని ప్రార్థించినాడు . సరేనని వచ్చేసినాను . మరుదినము రాజ భవనము నుండీ ఒక నూరు ఆవులు , ఏనుగు వంటి ఒక కోడె దూడ వచ్చినాయి . అప్పుడు గురువులు నన్ను పిలచి , " యాజ్ఞవల్క్యా , ఇదేమిటి ? " అని అడిగినారు . అంతా వివరముగా చెప్పినాను , అంతే ! ఇప్పుడు విద్యనంతటినీ వదలినా , నాకు ఈ అగ్ని రహస్యమును తెలుసుకొనుట ఒకటీ మిగిలి ఉంది . ఏమి చేయవలెనో తెలియక అల్లాడుతున్నాను " 

బుడిలులు అన్నారు , " ఇప్పుడు ఏదో సిద్ధాంతమునకు వచ్చినానన్నావు కదా , ఇంకొంత వివరంగా చెప్పు ." 

        యాజ్ఞవల్క్యుడు పలికినాడు  " ఆచార్యా , నేను యథార్థ వాదినని మీకు కోపము రాకూడదు . మా తల్లి ఈ దేహమును ఇచ్చినది , మా తండ్రిగారి దయ వలన సంస్కారమును పొంది బ్రాహ్మణుడనైనాను . అలాగ  బ్రాహ్మణుడనైన తర్వాత నేను గురుకులమునకు వెళ్ళినాను . ఇప్పుడు గురుకులమునుండీ దైవము నన్ను వెనక్కు తెచ్చింది . అలాగని నా బ్రాహ్మణ్యము ఎక్కడికి పోయింది ? గురుదేవులు ’ నేను ’  అన్న గోడపైన రాసిన చిత్రమును తీసివేయమంటే , నేను గోడనే ఎందుకు పడగొట్టవలెను ? కాబట్టి నా బ్రాహ్మణ్యము నాకు ఉండనే ఉంది . దానిని తెచ్చిచ్చిన అగ్నిని , ఆ బ్రాహ్మణ్యము ఉండుటకు సాధనములైన ప్రాణము , ఆదిత్యులను  నేను వదలుట ఏమిటి ? కాబట్టి నేను బ్రాహ్మణుడగుటకు కారణులైన ఈ ముగ్గురినీ నేను వదలను . అగ్ని దేవుని పరిచర్యను నేను శ్రద్ధతో నిర్వహించి , అతని నుండే అతని రహస్యమును తెలుసుకుంటాను . ఇక , బ్రాహ్మణమును రచించుటకు సంహిత కావాలంటిరి , సరే , ఆ సంహితను పొందుటకు ఎవరిని ఆశ్రయించవలెను అనుదానిని ఆ అగ్నిదేవుడి నుండే తెలుసుకుంటాను . తరువాత మీ అనుజ్ఞ . " 

       వయస్సుకు చిన్నవాడైననూ తపోవృద్ధుడూ , జ్ఞాన వృద్ధుడూ అయినవాడి లాగా దిట్టముగా , అపనమ్మకము లేకుండా , శ్రద్ధతో పలుకుతున్న కుమారుడి ఆ మాటను విని బుడిలులు లోలోపలే ఆనందించినారు . అలాగే , ఆచార్య దంపతులు తమ కొడుకు యొక్క , దృఢముగా నున్ననూ , మృదువైన, మధురముగానున్న వాక్కులను విని , ఆ స్వతంత్ర వృత్తిలో కూడా దేవతా నిర్భర మనస్కుడై యుండుటను గని , వీడు నిజముగా వంశ భూషణుడగును అని సంతోషపడినారు . 

        బుడిలులు ఒక్క ఘడియ ఊరకే ఉండి , " ఆచార్యా , మీ సంశయములన్నీ కుమారుని మాటలవలన పరిహారమైనట్లేనా ? " అన్నారు . ఆచార్యుడు ఔనని తల ఆడిస్తూ చేతులు జోడించినాడు . వృద్ధులు కుమారుని వైపుకు తిరిగి , " అలాగేమిటయ్యా ? నువ్వు చెప్పినది సరిగానే ఉంది . అగ్ని దేవుడే మనకు నేతృడు . అతనే మనకు గతి , అతని వల్లనే మతి , అతడే మనకు సర్వస్వమూ . అయినా ఒకమాట తెలుసుకొనియుండు . అగ్ని మనకు ఒద్దికగా ఉన్నాడని , మాటిమాటికీ అతనిని అనుసంధానము చేస్తూ కూర్చుంటే అతని అనుగ్రహమే శాపమగును . మనము మన చేతిలో ఉన్నదంతా చేసి , చివరి ఘట్టములో మనము సంశయాపన్నులమై ఉన్నపుడు అతడిని అడగవలెను . అంతేకాక షోడశ వర్ష వయస్సంపన్నులగు వరకూ ఆచార్యాధీనులై ఉండవలెను . కాబట్టి మీ తండ్రిని అడిగి మిగిలినదంతా చేయి . నేను చెప్పు మాట జ్ఞాపకము ఉంచుకో . ఇది బాగా స్మరణలో ఉండనీ . ఈ కర్మాకర్మములు కూడా జ్ఞానము కావలెను . అలాగగుటకు అవన్నీ కామోద్దేశ రహితములై , అఖిలము కావలెను . ఇప్పుడు , ఇంతవరకూ కర్మ చేయుట ఎలాగ అన్నది తెలుసుకున్నావు . ఏవో కారణముల వలన ఆ జ్ఞానమునకు హాని కలిగింది . ఇప్పుడు నువ్వు దానిని వియోగించను అంటున్నావు . బ్రహ్మజ్ఞానమును పొందవలెను అన్నావు . ఆ బ్రహ్మజ్ఞానమును ,  ఉపనిషత్తులను లేకుండా పొందినవారు ఎవరూ లేరు . కాబట్టి నువ్వు ఉపనిషత్తులను సంపాదించు . సర్వ శక్తుడైన పరమేశ్వరుడు నీకు సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు అను మూడింటినీ కరుణించు గాక " 

         " కానిమ్ము , తాతా , తమరి మాటను పరిగ్రహించినాను అనుటకు సాక్షి గా , ఇదిగో " అని మరి యొకసారి నమస్కారము చేసినాడు ..మరలా తండ్రికి నమస్కారము చేసి , " పదునారు నిండు వరకూ నేను తమరి అధీనుడను . నన్ను ఎటుల కావలెనన్ననూ తమరు ఉపయోగించుకోవచ్చును . " అన్నాడు . 

       బుడిలులు తలఊపుతూ , " ఏమో చెప్పాలని నావైపుకు తిరిగినావు , చెప్పెయ్యి . సందర్భము వచ్చినపుడు ఆడవలసిన మాట ఆడెయ్యవలెను . లేకపోతే ఆ సందర్భము గుర్తుకొచ్చినపుడల్లా , ఆ ఆడని మాట శల్యమై ఉంటుంది . చెప్పు . " అని కుమారుని దగ్గరకు పిలచి నిలబెట్టుకొని వీపు నిమురుతూ ప్రోత్సాహించినారు . 

        వారి ప్రోత్సాహముతో ఉత్తేజితుడైనట్లు సిద్ధమై , తలిదండ్రుల అనుమతి పొంది కుమారుడు అన్నాడు : " తాతా , ఉపనిషత్తును పొందు అని ఆశీర్వదించినారు . ఇంకొకరి యజ్ఞములో ఋత్త్విజుడగుట వద్దు అన్న నాకు వేరే మరియొక సాంప్రదాయము వలన కృతార్థుడనగుట వలన కదా , సార్థకత ? కాబట్టి , నేను బ్రహ్మవిద్య నైతేనేమో పొందెదను . కానీ అది , ఆ నేను పొందేది , ఉపనిషత్తు కావలెను .( ఉపనిషత్తుగా వ్యవహరింప బడవలెను ) అలాగ అనుగ్రహించు తాతా ! " అన్నాడు .

" అంటే నీ మాటల అర్థమును స్పష్టముగా చెప్పవయ్యా " 

" అనగా నేనొక ఉపనిషత్తుకు కర్తను కావలెను . ఇంకొకరి ఉపనిషత్తు వలన కృతకృత్యుడగు పరావలంబుడ నగుట వద్దు . " 

         " భలే , భలే ! యాజ్ఞవల్క్యా ! సాధు ! సాధు ! ఆచార్యా , ఇది మానోన్నతి విషయము . ఇతరులను చిన్నవారిని చేయకనే తన గొప్పతనాన్ని సాధించునట్టి మాటయొక్క వరసను చూచియైనా ఉన్నావా ? సాధు, సాధు ! అలాగే కానిమ్ము . నీ చరిత్రమే ఒక ఉపనిషత్తు కానీ ! " అని కుమారుని ఆశీర్వదించి బుడిలులు ఇంటికి బయలుదేరినారు . 

         ఆచార్యులు వారిని వైశ్వదేవమునకు అక్కడే నిలుపుకోవాలని యత్నించినారు . అయితే , తాము వైశ్వదేవమునకు ఆ దినము ఇద్దరు బ్రాహ్మణులను రమ్మన్నానని తెలిపి , బుడిలులు నిలువలేదు . 

        వాకిలి వరకూ వెళ్ళిన బుడిలులు వెనుకకు తిరిగి , " నీ కొడుకు మాటలలో పడి  నేను చెప్పవలసినదానినే మరచాను . ఆచార్యా , మా కాత్యాయనుని భార్యకు ప్రసవ కాలమని వారి ఇంటివారు పిలుచుకొని పోయినారు . కాత్యాయనుడు కూడా వారి వెంట వెళ్ళినాడు " అని చెప్పి వెళ్ళిపోయినారు . 

        వాకిట్లో ఆచార్యుని ఎడ్ల బండి సిద్ధముగా ఉండినది . బుడిలులను బండెక్కించి ఆచార్యుడు వెనుకకు తిరిగినాడు . కుమారుడు అంతవరకూ తండ్రి వెంటే ఉన్నాడని చెప్పనవసరము లేదు . 

Wednesday, February 6, 2013

31. " మహాదర్శనము "--ముప్పై ఒకటవ భాగము--మింగుడు పడని ముద్ద


 31.  ముప్పై ఒకటవ భాగము--  మింగుడు పడని ముద్ద


          ఆచార్య దేవరాతుడు ప్రాతః కర్మలన్నిటినీ ముగించి , వచ్చి కూర్చున్నాడు . కించిత్ ఉపాహారమును స్వీకరించు వేళ. కానీ అతనికి ఈ దినము ఉపాహారము సహించదు .ఆకలి దప్పులు పుట్టవు . ఏదో చింతలో ఉన్నాడు . మనస్సు యొక్క క్లేశమును శరీరము కూడా వహించినట్లుంది . యజమానుడు రోగ గ్రస్తుడైనపుడు ఇంటిలోని పశువులలో కూడా కనిపించు దౌర్మనస్యము వలె అంగాంగములూ తేజోహీనమైనవి . అధ్యయనము కోసము వచ్చి నిలచిన శిష్యులకు అధ్యయనము చేయించమని వృద్ధ శిష్యుడొకనికి చెప్పి , తాను చింతాక్రాంతుడై కూర్చున్నాడు . 

          ఆలంబినికి కూడా ఆచార్యునికి వచ్చిన జ్వరమేమిటో తెలుసు . ఆమెకు కూడా వంట చేయునపుడు పెద్దగా ఏడవవలె ననిపిస్తున్నది . అయితే అది ఆమెకు అలవాటులేని పని .  ఆడపిల్ల అని , తన తల్లి వలె తనను నెత్తికెక్కించుకోకున్ననూ , భర్త దగ్గర ఇతరులకు అధికారము లేని , అనన్యభాజమైన తన స్థానము ఒకటుందన్న నమ్మకము పొందిన మనసు ఇంటి పనులలో ఆమెకు స్వాతంత్ర్యమును ఇచ్చినది . భర్త తన మాట ప్రకారము నడవకున్ననూ , తన మాటను కొట్టివేయడు అన్న ధైర్యము ఆమెకు తాను చేయు పనులలో ఉత్సాహము శ్రద్ధ లను ఇచ్చింది . " తాను చేయుచున్న పనులు , ఏవికూడా ఇతరుల ఆక్షేపణలకు గురియగుట జరగదు , తృప్తిని తెచ్చేవి" అను నమ్మిక కావలసినంత సంతోషాన్ని తెచ్చింది . చేసే పనిలో ఏదైనా తప్పు జరిగితే , దానిని పెద్దదిగా చేసి తనను ఒక అనామకురాలిగా చేయక,  ’ కాళ్ళు నడుస్తున్నపుడు ఎప్పుడైనా ఒక  అడుగు తప్పదా ? ’ అను విశాలమైన మనసుతో చూచు గొప్పవారు . తనను దేవతయని గౌరవిస్తూ తన ప్రసాదము కోసము వేచియుండే గొప్పవారు . ఆమె కన్నీరెందుకు కార్చ వలెను ? 

         నిన్నటి ప్రసంగము మొగుడూ పెళ్ళాలిద్దరికీ మింగుడు పడని ముద్ద అయినది . గురుదేవులు వైశంపాయనుల గురుకులములోని శిష్యమండలము లన్నిటా , వీడు లేకున్న ఇంకేమీ లేదు అనిపించుకున్న కొడుకు ఇప్పుడు కులపతుల కోపమునకు పాత్రుడై ఇంటికి వచ్చేసినాడు . అధ్యయనము చేయునపుడు శిష్యుల దౌర్బల్యము వల్లనో , అనవధానము వల్లనో అక్కడక్కడా చెడిపోవుట కద్దు . అయినా అది దోషము . వేదము నకు అపరాధము అగుట వలన అది బ్రహ్మ హత్యతో సమానము . దానిని దినదినమూ తగ్గించుట కోసము ఆచార్యుడైన వాడు ప్రత్యేకముగా కొన్ని భాగములను పారాయణ చేయును . ఏ దినమైనా అతని దేహ , మనోస్థితులవల్ల అతనికి ఆ కార్యమును చేయుట సాధ్యము కాకపోతే అతని కోసము వృద్ధ శిష్యుడొకడు చేయును . అప్పుడపుడు ఆ కార్యమును చేయుట యాజ్ఞవల్క్యుని వంతు అయ్యేది . యాజ్ఞవల్క్యుడు గురు దేవులకు ఏదో అస్వస్థత ఉండుట చూచి వారి అనుమతి అయితే , ఆ ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేయగలనని తెలుపుకున్నాడు . నీరు ఉన్నట్టుండియే ఉడుకునట్లు గురుదేవులు రెచ్చి , " ఇతరులకన్నా బాగా అధ్యయనము చేసియున్నావన్న అహంకారము నీకు వచ్చింది . ఈ అహంకారము విద్యావంతునికి తగినది కాదు . ఈ అహంకారము వలన ఇతరులకు అవమానము చేసినట్లయింది . మా విద్యను మాకు ఇచ్చివేసి వెళ్ళూ ! " అని ఎగురుటయా ? 

          యాజ్ఞవల్క్యుడు సదా వినయముతో ఉండువాడు . కానీ ఆకస్మికమైన ఈ కోపమువలన అతనికి కూడా విరసమైనది . మనసు విరిగి ఆక్రోశమైనది . కంట నీరు వచ్చింది . అయినా కూడా సభ్యతను వదలక , ఆ ఆక్రోశములో కూడా , " నేను తప్పు చేసిన క్షమించ వలెను " అని నమస్కారము చేసినాడు . 

         ఎప్పటివలె అయితే , ఆ నమస్కారముతో కులపతులు శాంతులయ్యేవారు . కానీ ఆ దినము అదేమిటో , మండే మంటకు ఉప్పు తగిలినట్లాయెను . ఇంకా చెలరేగిపోయి , " అపచారానికి వినయపు ముసుగు కప్పవలెనని యున్నావా ? మేము చెప్పినట్లు చేసి వెళ్ళిపో . నువ్వు ఇకమీదట మా ఆశ్రమములో ఉండవద్దు . నువ్వు మా ఆశ్రమములో ఒక్క ఘడియ కూడా ఉండకూడదు . మా విద్యను మాకు ఇచ్చి వెళ్ళు " అని అతడు గద్దించినాడు . 

         అతడు అలాగు గదరుకోవడము చూచి కులపతి యొక్క పత్ని కదంబిని వచ్చినది . భర్త ఎదురుగా కన్నీరు కారుస్తున్ననూ , నాగుపాము వలె బుసకొట్టుతూ , కళ్ళు వెడల్పు చేసుకొని , క్రోధ తామ్రాక్షుడై నిలచిన శిష్యుడిని చూచి రివ్వుమని వచ్చి వాడిని తన వెనుకకు లాగుతూ , భర్తకు ఎదురైంది . ఆమెకు దిగులు పుట్టింది . గురుశిష్యులిద్దరూ తపస్వులు . ఇద్దరికీ కోపము మితిమీరి , శాప ప్రతి శాపముల పర్యవసానము అగునో ఏమో అని బెదరి ఆమె వెంటనే భర్తకు నమస్కారము చేసి , " ఇక్కడికే ఈ కోపము ఉపసంహరించవలెను . యాజ్ఞవల్క్యుని పిలుచుకొని వెళ్ళుటకు అనుమతి కావలెను ." అని చేతులు జోడించినది . గురుదేవుడు కోపమునంతటినీ ఉపశమించుకుంటూ , కోపముతో మండునట్లున్న కళ్ళను అటు తిప్పుకొని , సరేనని అనుమతినిచ్చినాడు . ఆమె వాడిని లాగుకొని వంట ఇంటికి వెళ్ళినది . ఆచార్యుడు లేచి స్నానమునకు వెళ్ళినాడు . మాధ్యాహ్నికములన్నీ ముగిసి కులపతి వైశ్వదేవమును అయిన తర్వాత ఆమె యాజ్ఞవల్క్యునికి భోజనము పెట్టినది . ఇష్టము లేకున్ననూ , ఆమె బలవంతానికి ఇంత తిన్నాననిపించుకుని ఎవరికీ చెప్పకుండా , దొంగతనము చేసినవాడి వలె , దుర్దానమును పట్టినవాడివలె ఆశ్రమమునుండీ బయలుదేరి వచ్చినాడు . 

          భార్యాభర్త లిద్దరూ కొడుకు ద్వారానే ఈ కథనంతటినీ విన్నారు . అకారణముగా  కోపము , అదికూడా తమ కొడుకుపై కోపము చేసుకున్నారు గదా ఆ కులపతులు ? అని భర్తకు అభిమానము ముంచుకొచ్చినది . భార్యకు , తన కొడుకు అప్పుడూ , ఇప్పుడూ వినయముతోనే ఉన్నాడుకదా అని ఒక అంతస్సంతోషము . బ్రహ్మ హత్యా నివారణకోసము ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేసెదనని చెప్పుటలో తప్పేమిటని భర్త విచికిత్స చేస్తే , " ఎంతైనా కదంబినిది తల్లి హృదయము . అప్పుడు , ఏమౌతుందో అని ఆమె అడ్డము రాకుండా ఉండి ఉంటే నిజము గానే ఏమేమి జరిగేదో ? " అని భార్యకు భయమై వణుకు వస్తుంది . అంతు , ఇద్దరికీ దౌర్మనస్యము . ఏమి చేయుటకూ మనసు ఒప్పదు . భర్తకు అభ్యాసమైన అధ్యాపనమూ వద్దనిపిస్తే , భార్యమాత్రము , అభ్యాసమును వదలలేక వంట చేస్తున్నది . ఇలాగ ఇద్దరూ తమ తమ బాధ ,  చెరువు కట్టను తెంచుకొని పరవళ్ళు తొక్కుటకు సిద్ధమైన నీటివలె పెరిగి కాల్చుతుండగా నిద్రాహారాలు లేక వ్యథ ననుభవించు వారి వలె మూగబోయి , స్తబ్ధులై తమ తమ స్థానములలో కూర్చున్నపుడు , " ఆచార్యా ! " అన్న గొంతు ఉరుము ఉరిమినట్లు వినిపించినది . ఆచార్యుడు ఆ గొంతు వినగానే కొత్తగా ఏదో దారి దొరికినట్లై , నీటిలో మునగ బోయేవాడికి మునగ బెండు ఆసరా దొరికి మరలా ఆయుస్సు లభించినట్లై , కళ్ళు చెమర్చినాయి . " రావలెను , దయ చేయవలెను " అని లేచి ఆ వచ్చినవారికి ఎదురు వెళ్ళి పిలుచుకు వచ్చినాడు . వారికి కాళ్ళు చేతులకు నీరిచ్చి పిలుచుకొని వెళ్ళి నడిమింట్లో వేత్రాసనము పైన కూర్చోబెట్టినాడు . 

         ఇటు ఆలంబినికి కూడా ఆ ఉరుము వినిపించినది . ఇంత గట్టిగా అరచువారెవరు ? అనిపించినది . మనసు ఎప్పటివలె తేలికగా ఉంటే , గొంతును గుర్తించ గలిగేది . కానీ అటుల కాలేదు . ఏమైనా సరే యని , మీగడ పెరుగును గిన్నెలో వేసి, దానికి చక్కెర కలిపి తీసుకొని వచ్చింది . 

         వచ్చినవారు బుడిలులు. " ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆచార్యుడు ’  కొడుకు  సంగతి చెప్పవలెను . ఎక్కడనుండీ ఆరంభించేది ? ’  అన్న యోచనలో ఉండగా ఆలంబిని చెక్క పళ్ళెములో , చెక్క గిన్నెలో చక్కెర కలిపిన పెరుగును తెస్తూ వాకిట్లో కనిపించినది . బుడిలులు నవ్వుచూ , " ఏమి ఆలంబమ్మా ? ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆమెకు , అలాగయిన , వీరికి కూడా తెలిసిందా ? అనిపించి కళ్ళలో నీరు నిండింది . కానీ అల్పాహారము నిచ్చునపుడు కన్నీరు పెట్టరాదని బహుకష్టముతో దానిని నిగ్రహించుకొని , " ఏదో ఒకటి ఉండే ఉంటుంది , మొదట అగ్ని దేవుడు శాంతము కానీ , ఆ మీదట మాటలు "  అని పళ్ళెమును ముందుంచింది . అయినా గొంతులో జీర లేకుండా పోలేదు . 

          బుడిలులు , ’ అటులనా ? సరే సరే ’ అని మారు మాట్లాడక , మళ్ళీ అడిగించు కోకుండా పెరుగు తీసుకున్నారు . దానిని సేవించి , " ఈ పెరుగు తోడు పెట్టుట కూడా ఒక కళ అయి ఉండాలి . అది నీకు చాలా బాగా అలవడిందమ్మా , ఇదేమిటి , పాలరాయా లేక బిగిసిపోయిన పెరుగా ? " అని దానిని ఆస్వాదించి , గిన్నెను పక్కకు పెట్టి , " ఎక్కడ యాజ్ఞవల్క్యుడు ? "  అన్నారు . 

          దంపతులకు , " బుడిలులకు అంతా తెలిసినట్లుంది " అనిపించినది . ఒకరి ముఖము నొకరు చూసుకున్నారు . ఒక ఘడియ తాళి , " వాడు పెరట్లో తోటదగ్గర ఉండవలెను , వెళ్ళి పిలుచుకు వస్తాను " అని ఆలంబిని వెళ్ళింది . బుడిలులు ఆమెకు చేత్తో నిలవమని సంజ్ఞ చేసి , " వద్దు వద్దు , వాడే వస్తాడు . ఇంకొంచము సేపైన తర్వాత వాడే రానీ . నువ్విక్కడే ఉండి నేను చెప్పునది విను " అన్నారు . ఆలంబిని లోపలికి బయలుదేరినది అక్కడే నిలిచింది . బుడిలులు ఆరంభించినారు : 

          " ఆచార్యా , మీరు కొడుకు విషయము ఆలోచిస్తున్నారు . నిన్నటి సంగతి మీ ఇద్దరి మనసులలో నిండింది . ఆ విషయమై ఆలోచనలను మానండి . ఇదంతా దేవతల ఆట. అటువైపు వైశంపాయనుడు , ఇటువైపు యాజ్ఞవల్క్యుడు , ఇద్దరినీ పట్టి ఆడించినారు దేవతలు . అది మీకు చెప్పాలనే నేను వచ్చినది . " 

" సరే , తమకెలా తెలిసింది ? "

          " అయ్యా , యాజ్ఞవల్క్యుని పంపించుటకైతే పంపించినారు గానీ ఇప్పుడు ఆ వైశంపాయనుల గోడు ఎవరూ తీర్చలేనిది . నిన్న సరిగ్గా అర్ధరాత్రి జాములో వచ్చి వాకిలి తలుపు తట్టినారు . ఈ సమయములో వచ్చువారు ఎవరు అని వచ్చి చూస్తే వైశంపాయనులు వస్తూనే పాదములు ముట్టి నమస్కరించి ’ ఒక మూర్ఖపు పని జరిగిపోయింది .  దాని వలన ముందు ముందు ఏమీ అనర్థము సంభవించకుండా చూచి కాపాడు భారము మీదే " అని కన్నీరు పెట్టుకున్నారు . " ఏమిటో చెప్పండి , సరిదిద్దుకుందాం ’ అని నేను అనునయించిన కొద్దీ అతడి దుఃఖము ఎక్కువయింది . చివరకు వారు చెప్పినదేమంటే , 

          " పొద్దుటినుండీ అతడికి ఏదో అవివేకము జరుగునని తెలుసు . దానివలన మనసు అలజడి అయింది . అయినా అభ్యాస బలము వలన అధ్యాపనము చేసినారు . చివరకు అందరూ వెళ్ళిపోయిన తరువాత యాజ్ఞవల్క్యుడు అక్కడే నిలచి , ’ ఈ దినము మీకు దేహస్థితి సరిగా లేనట్లుంది . అనుమతి అయితే నేను ప్రాయశ్చిత్తాధ్యయనము చేస్తాను ’ అన్నాడట. అదే కారణముగా అతడు రేగిపోయినాడు . అదేమో , చిలికి చిలికి భూమ్యాకాశములను ఏకము చేయునట్లయిందట . దైవ వశాత్తూ కదంబిని మాత అడ్డురాకుండిన ఏమయ్యెడిదో ? అదే కారణము వల్లనే  యాజ్ఞవల్క్యుని పంపించినది . అతడిదేమీ తప్పులేదు . తప్పుంటే , అకారణముగా రేగిపోయిన నాది . అతనికి ఈ నిర్గమనము వలన శ్రేయస్సే అగునట్లు నా తపస్సునంతటినీ ధారపోసినాను . కాబట్టి ఆచార్య దంపతులు కొడుకుపై ఏమాత్రమూ కోపము చేసుకోరాదు , గద్దించనూ వద్దు అని తమరు వెళ్ళి వారికి సాంత్వన నిచ్చి రావలెను " అని ఈ కార్యమును నాకు అప్పజెప్పి , అదే అర్ధరాత్రిలోనే అతడు వెళ్ళిపోయినాడు . మీకు ఇది చెప్పుటకు నేను వచ్చినాను " 

" ఎట్టి కారణము చేతనైనా సరే , బుడిలులు మా ఇంటికి వచ్చినారు . అదే మా భాగ్యము . సరే , మరి అతడే వచ్చి మాకు ఎందుకు చెప్పియుండ కూడదు ? "

          " దానిలో ఏదో రహస్యమున్నదట . యాజ్ఞవల్క్యుని ఎదురుగా ఈ విషయమును మీకు చెప్పకూడదు అని అతడు రాలేదట ! వటువు ఎదురుగా చెప్పకూడదు అనుటలో లౌకికమునకన్నా , అలౌకికమే ఎక్కువ అని నాకు అనిపించి , ’ పోనివ్వండి , ఆ దంపతులు ఇది తెలిసిన తరువాత వ్యథపడుట మానెదరు . అటులనే మీరు కూడా నామీద భారము వేసి మీ దుఃఖమును వదలండి . ఏదైతే తర్కమునకు అందకుండా జరుగుటకు కారణమగునో దానిని దైవికమనవలెను. కాబట్టి అది దైవ చిత్తముచేత జరిగినది . ఇది కూడా దేవకార్యార్థమే అయి ఉండవలెను ’ అన్నాను . గురుదేవులు నవ్వుచూ , నాకూ అటులే యనిపించుతున్నది . తమరు ఇంత చెప్పిన తరువాత దుఃఖము నన్ను వీడినది . ’ అంటూ , ఏడుస్తూ వచ్చినవారు నవ్వుతూ వెళ్ళినారు "  

         ఆ దంపతులకు మోయలేని భారమేదో దింపినట్లై వారికి తెలీకుండానే , వారి ప్రయత్నము లేకుండానే ఒక నిట్టూర్పు వచ్చినది . తేలికైన మనసుతో వారు బుడిలులకు నమస్కారము చేసి తమకు అయిన ఉపకారమును గురించి మాట్లాడినారు . 

         బుడిలులు నేర్పుగా మాట మార్చుతూ , " నేను వచ్చి ఇంత సేపైనది . యాజ్ఞవల్క్యుడెక్కడ ? ఇంకా రాలేదే ? " అన్నారు . యాజ్ఞవల్క్యుడు , ’ ఇగో , వచ్చినా తాతా ! " అని వచ్చి నమస్కరించినాడు . 

Tuesday, February 5, 2013

30. " మహాదర్శనము " --ముప్పైయవ భాగము --పైవాడి సంకల్పము


 30. ముప్పైయవ భాగము--  పైవాడి సంకల్పము 


         కులపతి వైశంపాయనులు సాయమగ్ని హోత్రమును ముగించుకొని , వచ్చి కూర్చున్నారు . మనస్సు , ఏ ఆలోచనలూ లేక , నిరాటంకముగా , సాత్త్వికావస్థలో యుండి , ప్రసన్నముగా ఉంది . చేతి దీపపు మంద ప్రకాశము  నడిమింట్లో లోభి యొక్క ఐశ్వర్యము వలె జ్ఞాతాజ్ఞాతముగా పరచుకొని ఉంది . కులపతులు రుద్రాధ్యాయమును పారాయణ చేస్తున్నారు . 

        ఉన్నట్టుండి ఆ నడిమింట్లో తీవ్ర ప్రకాశమొకటి కనిపించినట్లై , కులపతుల పారాయణము నిలచిపోయింది . వారు అలాగు పారాయణము చేయునపుడు ఏరోజు కూడా దేవతలను సాక్షాత్కరించుకుంటూ ఉండలేదు . పరోక్షప్రియా వై దేవాః ! దేవతలు ఎప్పటికీ పరోక్షప్రియులే . పరోక్షములోనే ఉండాలనే ఆశ ఉన్నవారు అనుదానిని సంపూర్ణముగా నమ్మినవారు . " ఈ జగత్తు యొక్క ధర్మాధికారులు వారు . కావాలంటే , వారే వస్తారు , వారు చెప్పినట్లు వింటే చాలు " అని వారు దేవతా సాక్షాత్కారములో ఉదాసీనులు . 

         ఇప్పుడు ఒక తేజస్సేదో వచ్చినది వారికి గోచరమైనది . మనస్సు వేగిర పడగా , వచ్చినవారిని ఉపచరించుటకు సిద్ధమైనది . కళ్ళు , దర్శనము పొందవలెనని , మిగిలినవాటిని దేనినీ చూచుట లేదు . వచ్చినవారి మాట వినాలని చెవులు కూడా మిగిలిన అన్నిటినీ పక్కకు తోసి , కాచుకొని ఉన్నాయి . తేజోదేహములు వచ్చునపుడు వ్యాపించు సూక్ష్మమైన సువాసనను ఆఘ్రాణించి , ముక్కు ఆవైపుకు తిరిగింది . శ్వాస నియమబద్ధముగా ఉంది . నాలుక కూడా స్తుతి చేయుటకు కళ్ళ ఆదేశమునకై వేచియున్నది . జలరాశిలో స్నానానికి దిగినపుడు నీటి చల్లదనము శరీరమునంతనూ ఆవరించునట్లు , తనకన్నా ప్రబలమైన దేవతా సన్నిధిలో ఉన్నాననుదానిని చర్మపు కణకణమూ అనుభవించినదా అన్నట్లు , రోమములన్నీ నిక్కబొడుచుకున్నాయి . కులపతులు ఒళ్ళంతా కళ్ళై వేచియున్నారు . 

         వచ్చినవారు కనిపించినారు . సూర్యుడికి అడ్డముగా వచ్చిన తెల్ల మేఘము వలె తేజస్వియైననూ కళ్ళు మిరుమిట్లు గొలపని ప్రభామండలములో ఒక మూర్తి గోచరించినది . దృగ్గోచరమైన వ్యక్తి స్త్రీయై , మాతృభావము నిండిపోగా , ప్రేమయే వాత్సల్యమే మూర్తీభవించినట్లు కరుణామయ దృష్టితో ప్రసన్నమై యుంది . రత్నమయమైన కిరీటమూ , దివ్య మాల్యాంబరములూ అలౌకిక కాంతితో కూడి , ఆమె ప్రసన్న గంభీరతను ప్రతిబింబిస్తున్నవి ."  నేను నీకన్నా పై అంతస్తు దానను . నామాటను మీరకూడదు " అను హెచ్చరిక ఇచ్చునట్లు ఆమె భూమినుండీ అంత ఎత్తులో నిలచిఉన్నది . ఆమె యొక్క స్తోత్రము చేయుచున్న వందిమాగధులెవరో మృదు మధురమైన , మంజులమైన సామగాన పరంపరను వ్యక్తావ్యక్తముగా వినిపిస్తున్నారు . 

        అతని మనసు ఎవరూ చెప్పకున్ననూ ఆమెను ,  తల్లిని గుర్తించిన దూడ వలె , శృతీ భగవతి యని గుర్తెరుగుతున్నది . ఆ వెంటనే అతడు దిగ్గున లేచి ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి , లఘుపూజను మనసులోనే అర్పించి , చేతులు జోడించి నిలుచున్నాడు . స్తోత్రము చేయవలెనన్న ఆశ మాత్రము , ఏమిటి , ఎలా చేయవలెను అనుదానిని నేరుగా తెలుసుకోలేక , ఆ ఆశను వదలలేక నలుగుతున్నది . 

        ఆమెయే మాట్లాడినది , " కులపతులు స్తోత్రము చేయలేదని వ్యథ పడనవసరము లేదు . మీ ప్రయత్నముతో రూపము చెంది , మీ కారణము కోసము వచ్చినపుడు స్తోత్రాదులు కావలెను . ఇప్పుడు మాకై మేముగా మా కార్యమునకై వచ్చినపుడు మాకు స్తోత్రాదులు వద్దు . "

         " హే జగన్మాతా , నీ మాటకు ప్రతి యాడుతున్నాననుకోవద్దు . చూడు , ఈ విద్యార్థులచేత నమస్కృతులు పొందుతున్నానన్న ఈ అహంకారము శృతీ భగవతి దర్శనమైనపుడు ఏ స్తోత్రమూ చేయలేదని ఖిన్నము కాకుండనీ . కాబట్టి , అనుమతినివ్వు , నీ స్తోత్రము చేసి కృతార్థుడనగునట్లు నా మనోబుద్ధులను అనుగ్రహించు . నీ దర్శనము చేత కృతార్థమైన ఇంద్రియములవలె , నా వాణి కూడా నీ స్తోత్రము చేత కృతార్థము కానీ " 

" కానిమ్ము , నీ ఇఛ్చ పూర్ణము కానిమ్ము " 

         కులపతి మరలా ప్రణామము చేసి , లేచి , ఉత్తరీయమును సవరించుకొని , సమాహితుడై నిలిచి , స్తోత్రమును ఆరంభించినాడు , " జగన్మాతకు నమస్కారము . జగత్తు పుట్టుటకు ముందే విరాట్పురుషుని తో పాటు , పరబ్రహ్మపు నిశ్శ్వాస రూపిణియై వచ్చి , ఆ హిరణ్య గర్భుడికి గురువై సృష్ఠి క్రమమును ఉపదేశించిన దేవికి వందనము . అణు రేణు  తృణములన్నిటా ఉన్ననూ , మహత్ప్రయత్నము లేనిదే చూచుటకు వీలు కాని విశ్వ వంద్య కు వందనము . పెరిగిన దేహములో పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపములుగా నాలుగు ఘట్టములలో ప్రకటమగు ప్రచోదనా రూపిణికి ప్రణామము . ఎవరి కృప వలన కంటికి కనపడిన దర్శనము కూడా మహా దర్శనమౌతుందో ఆ మహా దేవికి మరలా మరలా నమస్కారము . మంత్రాత్మికవై , మంత్రార్థపు బయట ఉన్ననూ , వర్ణవర్ణములలోనూ పరబ్రహ్మగా సాక్షాత్కారమగు ప్రణవ స్వరూపిణికి మరలా మరలా ప్రణామములు . " అని విధవిధములుగా స్తుతించినాడు . 

         అతడు స్తుతించుచుండగా , ఆమె సూక్ష్మ రూపము స్థూలరూపముగా మారుచూ , మొదటే మనోహరముగా సాత్త్వికముగా నున్న రూపము ఇంకా మనోహరమై సాత్త్వికమైనది. ఇంద్రియములు మాత్రమే కాక , మనోబుద్ధులూ చాంచల్యమును వదలి స్థిరముగా నిలచి తల్లి ఆజ్ఞను నెరవేర్చుటకు నడుము బిగించిన వెట్టివానివలె అయినవి . 

తల్లి మందహాసమును మెరిపిస్తూ అడిగినది , " కులపతీ , ఇప్పుడు నేను వచ్చినది దేవకార్యమునకు , దేవతల ప్రార్థనను నెరవేర్చెదవా ? "

         కులపతి ఆతురముతో అన్నాడు , " ఈ జగత్తంతయూ దేవతల అధీనములోనున్నది . దేవతలు తమకు కావలసిన కార్యములను మానుండీ మాకు తెలియకుండానే చేయించుకోగలరు . అలాగున్నపుడు , ప్రార్థనయనగా నేమి ? మాతా ! దేవతల ఆజ్ఞను నెరవేర్చుటకు సర్వథా సిద్ధుడనైయున్నాను . "

         భగవతి ప్రకటముగా నవ్వింది . ఒక మెరుపు మెరిసినట్లై ఆమె చిన్న దంతముల కాంతి చుట్టుపక్కల అంతటినీ వెలిగించినట్లాయెను . ప్రశాంతమైన ఆ వాతావరణములో ఆమె అన్నదీ , " నిజము , మేము దేవతలము పరోక్షముగానే నిలచి కావలసినదానిని చేయించుకోగలము . అయితే , కర్మాదులను చేసి పరిశుద్ధులైన వారిని మాకు సమానులుగా భావించుట మా పద్దతి . ఎవడు యజ్ఞయాగాదులను చేసి దేహమును బ్రాహ్మణముగా చేసుకొనియున్నాడో , ఎవడు తన తపోబలముచేత దేహగతమైన ప్రాణ దేవుడిని , దేహ సంసర్గ జన్యమైన జాడ్యములను పరిహరించి దివ్యభావాపన్నమగునట్లు చేసుకొని , తాను విప్రుడైయుండునో , అట్టివాడిని దేవకల్పుడని భావించుటే మా పద్దతి . కాబట్టి భవిష్యత్తును రూపించెడి మేము అంతటివారిని మాలో కలుపుకొని కార్యములు చేసెదము . ఈ దృష్టితో, దేవతలందరూ ముందు ముందు కావలసిన జగదోద్ధారమును సాధించుటకు నువ్వు కూడా సహాయకుడివి కావలెనని ప్రార్థించెదరు . దానిని నెరవేర్చి ఇవ్వగలవా ? " 

         " మహామాతా , జగత్తు యొక్క ఉద్ధారమనగానేమి ? అనుజ్ఞ ఇవ్వు . ఎప్పటినుండో , ఇవే పంచభూతములు . ఇవే సృష్ఠి స్థితి లయలు . ఇవే హాని వృద్ధులు . ఇవిలా ఉంటే , జగత్తులో మరలా ఉద్ధారమనునది దేనిని ? "

         " ఔను , నువ్వన్నది నిజము . నదిగా ప్రవహించినా , మేఘములై తేలియాడినా , జగత్తులోనున్న నీటి మొత్తము ఒకటే అయిఉన్నట్లు , జగత్తులో ఉండి సర్వమునూ పట్టి ఆడిస్తున్న తేజము ఒకే ప్రకారముగా లేకున్ననూ , ఒకే విధముగా సర్వములోనూ సమముగా ఉంటుంది . కిందకు జారిన పదార్థము తన భారమునకు తానే జారునట్లు సృష్ఠి మొదలైన క్షణమునకు దూరమవుతూ వచ్చిన ఈ జగత్తు జడమవుతూ వస్తుంది . మొట్టమొదట సర్వమూ తానై నిండిన ధర్మము ఇప్పుడు ప్రయత్నము చేత సాధింపవలసినది అవుతుంది .  అలాగయినపుడు దేవతలు ఆ ధర్మపు వృద్ధి కోసము ప్రయత్నిస్తారు . సకాములై యజ్ఞయాగాదులచేత తమను ఆరాధించు జనస్తోమము దేవతలకు బహు ప్రియమైనది . అయితే శృతి నుండి అపశృతికి దిగిన లోకమును ఆ కర్మలు మరలా శృతి మార్గమునకు తేలేవు . అలా తెచ్చుటకు బ్రహ్మ విద్యను ప్రధానముగా బోధిస్తున్న నిష్కాముడైన బ్రహ్మర్షి యొకని అవతారము కావలెను . నేను చెప్పినది మనసుకు చేరినదా , కులపతులూ ? కర్మలు ఉన్నదానిని కాపాడగలవే తప్ప , కొత్తదానిని సృష్ఠించలేవు . అలాగు కొత్త సృష్ఠిని చేయుటయే ఉద్ధారము. ఇప్పుడేమయింది ? నిజమే , కర్మలు , అనగా మనము సద్గతి ప్రాప్తికోసము విధించియున్న యజ్ఞయాగాదులు నడుస్తున్నవి . లేదనుటలేదు , అయితే తత్ఫలముగా జగత్తులో ప్రకటమవ వలసిన బ్రహ్మోపాసన అహంకారముతో కూడినది . ప్రతిఒకరూ తమకు తోచినదే బ్రహ్మ అనుచున్నారు . ఇలాగ , ఏకదేశముగా నడుస్తున్న బ్రహ్మోపాసనయే జగత్తుయొక్క వినాశనమునకు హేతువు . అలాగు ఏకదేశముగా నడవక , బ్రహ్మోపాసనము యథావత్తుగా పూర్ణముగా నడచుటయే జగత్తు యొక్క ఉద్ధారము . " 

కులపతి సరేనన్నట్టు తలఊపినాడు . " దేవకార్యమును జరిపించుటకు సిద్ధముగా నున్నాను . " 

        "  ఇప్పుడు చూడు , ఈ ఉద్ధారపు కార్యమును నెరవేర్చుటకు మనము దేవతలు , ఋషులు , పితరులు , -వీరు ముగ్గురే కదా ఈ లోకపు స్థితికి కారణము ? ఈ ముగ్గురూ వెళ్ళి , తపోలోకములో తనపాటికి తాను తపోనిరతుడైన ఒక మహానుభావుడిని , సప్తర్షి కల్పుడైన వాడిని భూమికి పంపించినారు . ఆతడు కర్మ భూయిష్ఠమైన ఈ కాలమునకు తగ్గట్టుగా కర్మమును సాంగముగా చెప్పు సంహితా బ్రాహ్మణములను ,  సర్వకాలీనమైన ఉపనిషత్తును తపోలోకములో ప్రత్యక్షము చేసుకొని , జగదుద్ధారము చేయుటకు వచ్చినవాడు , ఆతను నీ శిష్యుడైనాడు . నువ్వు జగత్కల్యాణార్థమై అతడిని వదలి వేయవలెను . "

" ఎవరు ? యాజ్ఞవల్క్యుడేమి ? "

         " అవును . ఆ తేజస్వి గురించియే నేను చెప్పుచున్నది . దేవర్షి , పితరులూ ఎవరూ ఈ కార్యమునకై నీ వద్దకు వచ్చుటకు ఒప్పుకోలేదు . నీ శిష్యుడై వచ్చినవాడిని అకారణముగా వదలమని అనుటకు ధైర్యము ఎవరికుంది ? అందుకోసము నన్ను పంపినారు . "

         కులపతులకు తన పేగులను ఎవరో బయటకు లాగివేసినంత సంకటమైనది .  ఏమి చెప్పవలెనో తోచలేదు . అయిననూ ఎండిపోయిన నోటిని నాలుకతో సవరించుకుంటూ , ఏమో చెప్పాలని ప్రయత్నించినాడు . దానిని చూచి భగవతి మనసు నొచ్చుకొని ఉండాలి . ఆమె కులపతుల అంతస్తాపమును ఆర్పివేయగల ఊరట కలిగించు మాటలను ఆడుచూ చెప్పినది : " నిజమే కులపతీ , నీ శిష్యులందరిలోనూ అతడే తేజస్వి . అతనిని వదలుట అన్నా , నీ ప్రాణములను వదలుట అన్నా రెండూ ఒకటే . ! అయినా దేవతా కార్యమని మనసు చేయి . నీకు ఒక కారణము కావలెను . దేవతలు ఆ కారణమును పుట్టించెదరు . అయితే , నువ్వుగా ఒప్పుకుంటే తప్ప వారు ఏమీ చేయలేరు . "

" దేవతలు అంతటి నిర్వీర్యులు కారు " 

        " సంకటములో ఉద్రిక్తుడవై మాట్లాడవద్దు కులపతీ . ఇప్పుడు నిన్ను అడిగి చేయనున్న దేవతలు నిన్ను అడగకుండా కూడా చేయగలరు . అయినా నువ్వు ఒప్పుకుంటే నీకు కూడా ఆ కార్యములో ఒక పాలు . ఆలోచించు . " 

         కులపతి తనకు తెలియకుండానే శాంతుడైననూ , సఛ్చిష్య లోభము మాత్రము పోలేదు . " కానిమ్ము , భగవతి యొక్క ఆజ్ఞను శిరసావహించెదను . అయితే దేవతలు ఈ మహానుభావుడిని ఇంకొక సంవత్సరము నాదగ్గరే ఉంచగలరు " అని ప్రార్థించినాడు . 

         భగవతి , " అటులనే కానిమ్ము , అయితే ఇది దేవరహస్యము . ఇంకెవరికీ చెప్పకూడదు ." అని అంతర్థానమైనది . ఆమె  తన చేతనము నంతటినీ తీసుకొని , శరీరమును మాత్రము తనకు వదలినట్లు అయిపోయి , కులపతి నిలువలేక , అలాగే కూలిపోయినాడు . 

Monday, February 4, 2013

29. " మహాదర్శనము " --ఇరవై తొమ్మిదవ భాగము --వారు వీరేమన్నారు ?


29. ఇరవై తొమ్మిదవ భాగము - వారు వీరేమన్నారు ? 


         మధ్యాహ్నము సుమారు ఒక ఘడియ గడచి యుండవచ్చును .  పక్షులు ఇంకా నీడను వదలి బయటకు రాలేదు . ఆవు-దూడలు తాము తిన్నదానిని నెమరు వేస్తూ ఇంకా చెట్ల నీడలలో పడుకుని ఉన్నాయి . కాలువ పక్కన ఆశ్రమపు ఆడవారందరూ చేరినారు . పిల్ల తల్లులు , పిల్లలను ఇంటిలో నిద్రపుచ్చి , వారు నిద్రలేచులోపల మరలి వెళ్లవలెనని , బిందెలూ , చెంబులు , ఇత్తడి ఉపకరణములను కడుగుకొని , బట్టలు ఉతుక్కొని వెళ్లవలెనని , వచ్చినారు . 

        వచ్చినవారిలో అంత త్వరగా వెనక్కు తిరిగి పోవలసిన అవసరము లేని వారుకూడా ఉన్నారు . అటువంటి వారు , నీటిలో కాళ్ళు ఆడిస్తూ , ఎండకు ఒళ్ళు కాచుకుంటూ నిదానముగా , ఆటవిడుపుగా , ఏదో పొద్దు గడవనీ యని మాట్లాడుచున్నారు . ఎండకు కాగిన ఒళ్ళు ఆ కబుర్లకు  ఏదో ఉత్తేజనము నిచ్చునట్లుంది . మాటలు అక్కడ కూర్చొని , ఇక్కడ ఆగి , ఇటుతిరిగి అటుతిరిగి చివరికి యాజ్ఞవల్క్యుని వైపుకు మరలినాయి . నిదానముగా కూర్చున్నవారిలో చాలామంది మధ్య వయస్కులు  ఇంటిలోని మగవారి భయము అను ముసుగును కొద్దోగొప్పో తీసివేసినవారు . 

ఒకామె అన్నది , " ఆశ్రమానికి వచ్చిన ఇంతమంది పిల్లలలో యాజ్ఞవల్క్యుని తరహాలో ఒక్కరూ లేరు కదా ? "

       " ఔనే ! నేనపుడే చెప్పాలనుకున్నాను . వాడు దినమూ భిక్షకు వస్తాడు కదా ? అందరిళ్ళకూ వెళ్లడట . నేను విచారించినాను . తనకు ఎంత కావలెనో , దానికి రెట్టింపు దొరకు వరకూ మాత్రమేనట , వాడు భిక్షాటన చేసేది . ! " 

" శాస్త్రమున్నది అలాగే  అన్నపుడు ?  అది వదలి , ఒక మూట ఎత్తుకొని వచ్చి వారు వీరికి వేయవలెను? దుకాణము పెట్టవలెను అని ఎక్కడుంది ? "

        " అయితే ఇది వినండి , ఆశ్రమపు వారికి భిక్షాన్నము వేయువారు చాలామంది ఉన్నారు , ఎవరి ఇంటికి పోకుంటే ఏమగునో అని బెదరి ఇంటింటికీ వెళ్ళువారు కొందరు . " 

         " ఇంకో సంగతి విన్నారా ? ఒక్కొక్క దినము , కులపతుల భార్య కదంబిని అమ్మగారు ఉన్నారు కదా , వారు , ’ యాజ్ఞవల్క్యా , ఈ పొద్దు భోజనానికి ఇక్కడికే రా ’ అంటారట. ఆ దినము వాడు ఎక్కడికీ పోవుటే లేదంట ! అందరూ అనేదేమో తెలుసా ? ఈ మధ్య కదంబిని అమ్మగారు యాజ్ఞవల్క్యుని భోజనానికి పిలువవలెనని , ఇంటిలో దానికి చాలినంత ఉండాలని మూడునూర్ల వ్రతాలు చేస్తారంట ! " 

        " అదేమి విశేషమమ్మా ? నేను వాడిని పిలిచేలా ఉంటే , వాడిని మా ఇంటిలోనే ఉంచేసుకుంటాను . ఆ పిల్లవాడి వర్ఛస్సు ఎంతటివారైనా గౌరవించతగినది . "

        " ఇంకొక విశేషము ! మీరు గమనించే ఉంటారు , అయినా చెబుతాను , వినండి . వాడు వచ్చి వాకిట్లో నిలుచొని ’ భవతీ భిక్షామ్ దేహి ’ అంటుంటేనే ఎంత ఠీవి గా ఉంటాడే ! దాన్ని చూచుటకైనా వాడు మా ఇంటికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది . మీరేమైనా అనుకోండి . " 

         " వీరు ’ భవతీ భిక్షామ్ దేహి ’ మాత్రమే చెప్పినారు . ఆ బాలుడు నిలుచోవడము , నడక , ఎత్తు , మాట  అన్నీ కొత్తగా ఉంటాయి . ఎవడో దేవకుమారుడు దారి తప్పి ఆశ్రమమునకు వచ్చినాడే అనిపిస్తుంది . " 

        " ఇంకొకటి చూచినారా ? కావాలని , ’ ఈ దినము ఏమీ లేదయ్యా , మా భోజనమైపోయింది ’ అనో , ఇంకేదైనా  అని గానీ చూడండి , వాడు పెదవి కూడా కదపడే ? "

        " ఇవన్నీ బయటి సంగతులు . వాడు ఏకసంతగ్రాహి యంట ? వేదమైనా , శాస్త్రమైనా , పురాణమైనా , ఒకసారి ఇలాగ చెప్పితే చాలు , అలాగే అప్పచెప్పేస్తాడట. " 

" అందుకే వాడికి వీణ వాయించుటకు అంత సమయము దొరకుతుంది .! "

" వాడి వీణా వాదనము మీరెక్కడ విన్నారు ? "

        " మొన్న సాయంకాలము ఆవుదూడలను చూడాలని అటువైపుకు వెళ్ళినాను . అక్కడేదో సద్దగుచుండినది . ఇదెవరు ? వీణ వాయిస్తున్నారు ? అని విచారించితిని . వీడే అని తెలిసింది "  

        " నాకు ముందే తెలుసు. ఆ దినము వారి తల్లిదండ్రులు వచ్చినారు కదా , అప్పుడు వాడి తల్లి దగ్గర కూర్చొని వాయించినాడు . ఆ దినము మమ్మల్ని , నలుగురైదుగురు ఆడవారిని పిలచి పసుపు-కుంకుమలిచ్చినారు ఆమె . అప్పుడే మాకు తెలిసింది . " 

" మీరైతే భట్టు గారి ఇంటివారు . మాకా అదృష్టము ఎలా కలుగుతుంది ? " 

         " అది ఉండనివ్వండి , ఈ రోజు ఇంకొక విశేషము . మీకు తెలుసో లేదో , వారంతా ఒకటిగా చేరి వేదాధ్యయనము చేస్తారు కదా , అప్పుడు చూడండి ,  వాడి కంఠము అందరినీ మించి , మంచి కంచు కంఠము వలె , గంట కొట్టినట్లు వినిపిస్తుంది . ఇంకెవరి గొంతూ దానిని మించునట్లు లేదు కదా ? "

" ఔను , మిగిలినవారు వాడిని అనుసరించవలసినదే తప్ప , వాడు మిగిలినవారిని అనుసరించుట అన్నదే లేదు . "

        " ముఖ్యముగా అడిగి పుట్టినవాడిలాగా పుట్టినాడు , అంతటి కొడుకును పొందుటకు కూడా అడుక్కొని వచ్చి ఉండాలి . సరే , ఇంక ఇంటికి పోదామా లేదా ? "

" పోకేమి చేస్తాం ? పశువులు వచ్చే వేళయ్యింది. ఇప్పుడు వెళ్ళి పాలు పిండి స్నానము చేసి అగ్ని హోత్రానికి సర్వమూ సిద్ధము చేయాలి "

       " ఔనే , పొద్దయిపోయింది .  "  అని అందరూ త్వర త్వరగా పాత్రలు కడుగుకున్నారు . బట్టలు తెచ్చినవారు మరి కాసేపట్లోనే అన్నీ ఉతికేశారు . అందరూ , నీరు , పాత్రలూ , బట్టలూ తీసుకొని ఆశ్రమాభిముఖముగా వెళ్ళినారు . 

         దారిలో మరలా యాజ్ఞవల్క్యుని మాట వచ్చింది . 
" ఇంకో విషయము చూడండి , వాడు ఋగ్వేద పాఠమునంతా ముగించుకొని , సామవేదమునకు వచ్చినాడు . ఆ సామములనే వాడు వీణలో పలికిస్తున్నది . "

" నిజంగానా ? "

" ఔను , నేనింకేమి చెప్పేది ? కావాలంటే మీరు విని చూడండి . "

" వాడి గుడిసె నుండీ వీణ వినిపిస్తుంది . కానీ అది సామము అనేది మనసుకు రాలేదు . నేను ఏదో పాట అనుకున్నాను "

" సరే , అలాగైతే , ఈ చిన్న వయసులోనే వాడు త్రివేది అయినాడు " 

" సందేహమే లేదు . వాడు ఇక్కడ ఇంకొక వర్షముంటే బ్రహ్మ వేదమును కూడా నేర్చి చతుర్వేది యవుతాడు , సందేహమే లేదు " 

" ఆ తండ్రి కొడుకు చతుర్వేదియగుటలో సందేహమేమున్నది ? "

" అది నిజము ... ఇక ఆశ్రమము వచ్చింది . మా ఇంటికి మేమూ , మీ ఇంటికి మీరూ . యాజ్ఞవల్క్యుడు ఎక్కడున్నా , సుఖంగా ఉండనీ ..పదండి పోదాము "  

Sunday, February 3, 2013

28. " మహాదర్శనము "--ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము


28. ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము


         ఆచార్యుడు కొడుకును ఒక సంవత్సరము ఇంటిలోనే ఉంచుకొని యుండి యజుస్సంహితను అధ్యయనము చేయించినాడు . ఏకసంత గ్రాహియైన శిష్యునికి వేదపాఠమును నేర్పించుట అదేమి కష్టము ? యజుస్సంహితలో గద్య, పద్య మంత్రములు , ఒక్కొక్కచోట బ్రాహ్మణమువలె ఉన్న మంత్రరాశి . అయిననూ కుమారుడు సునాయాసముగా ఒకే సంవత్సరములో సంహిత నంతటినీ నేర్చినాడు . 

         ప్రతిదినమూ  ఆచార్యునికి , ఈ సంహితలో అక్కడక్కడా  చేరిపోయి ఉన్న యజ్ఞ మంత్రముల నన్నిటినీ వేరు వేరుగా తీసి ఇచ్చిన , విద్యార్థులకెంత ఉపయోగపడును అనిపించెడిది . ఒక దినము , అధ్యయనము ముగిసినపుడు , తండ్రి , కొడుకుతో , " ఏమిటోనయ్యా , ఈ సంహిత అంతా ఒక  కలగూరగంప. యజ్ఞభాగము , బ్రాహ్మణ భాగము , రహస్య భాగము అన్నీ కలసిపోయినాయి . ఎవరైనా ఒక పుణ్యాత్ముడు పుట్టి వీటన్నిటినీ వేరు వేరుగా విభజించి ఉంచితే ఎంతో ప్రయోజనము అయ్యెడిది " అన్నాడు. వెంటనే యాజ్ఞవల్క్యుడు లేచి , గురువైన తండ్రికి నమస్కరించి , " నేను పుట్టినది దానికోసమే . నా ఉద్దేశము సఫలమగునట్లు అనుగ్రహించండి " అన్నాడు .

         అదివిని ఆచార్యుడు అవాక్కైనాడు . " కుమారుడు ఇతరులకన్నా తేజస్వి అనునది నిజము , కానీ , తరతరాలుగా వస్తున్న సంహితను సమంజసముగా వర్గీకరణ చేయగలడా ?  ఇదేమైనా సామాన్యమైన కార్యమా ? సుమారు ఇరవై ఐదు సంవత్సరాలనుండీ అవ్యాహతముగా , సతతమూ ప్రయత్నము చేయుచున్ననూ నా వంటి వాడికి సాధ్యము కాని కార్యము వీనివలన సాధింపబడునా ? ఈ కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదమగునా ? " అని సందేహములు అలలవలె ఎగయుచున్నవి . అయినా , ’ ఎవరికి తెలుసు ? వీడు అతి పితుడు , అతి పితామహుడు.  మా తండ్రిగారికి కూడా ఈ ఆశ ఉండినది , నాకూ ఉంది . మాఇద్దరి ఆశలూ వీని వలన సఫలమగునేమో  ? నేనెందుకు అడ్డు కావలెను ? ’ అనుకొంటూ సగము జ్ఞానము , సగము అజ్ఞానపు అవస్థలో , తెలిసీ తెలియకుండా ’ తథాస్తు ’ అన్నాడు . ఎదురుగా చేతులు జోడించి వినయ నమ్రుడైననూ , మహా విద్వాంసుడి తేజస్సుతో వెలుగుచున కుమారుని చూచి , మరలా స్పృహలోకి వచ్చి , ’ కావలసిన కార్యము , అదికూడ మా ఇంట్లో నా కొడుకు వలన అయితే మా వంశపు భాగ్యము ’ అనిపించి ఇంకొకసారి మనఃపూర్వకముగా , ఈ కార్యము జరగవలెను అన్న సదిఛ్చ మనసంతా నిండి పోగా ’ తథాస్తు ’ అన్నాడు . 

        అయితే , విఘ్నములన్నీ సత్కార్యములకే కదా ! అనిపించి , మరలా ఆ విఘ్నములన్నీ నివారణయై ఇష్టార్థము చేతికిరానీ యని మూడవ సారి ’ తథాస్తు ’ అన్నాడు . కుమారుడు మరలా నమస్కారము చేసి లేచినాడు . ఆచార్యునికి , వెనుకటి అభ్యాస కాలములో ’ సరస్వతీ గణపతుల వ్యూహములు నిరంతరముగా శరీరములో ఆడుచుండవలెను ’ అన్న ఆ మాట గుర్తుకొచ్చి , ఆ కార్యము అయినచో వీని వలననే కావలెను అనిపించెను . 

        అప్పటి నుండీ అధ్యయనమును ఇంకొక విధముగా చేయించినాడు . సంహిత వల్లెవేయుట ఉండనే ఉంది , అయితే , ముందు ముందు వర్గీకరణము నకు అనుకూలము కావలెనను ఉద్దేశముతో , క్రమాధ్యయనము అయిన తరువాత , ఈ కాండపు , ఈ ప్రపాఠకపు , ఈ అనువాకము చెప్పు అని అడిగేవాడు . మొదట్లో అది కుమారునికి కష్టమైననూ  రానురానూ అదే అలవాటై , పాఠము నడచినది . 

        అయితే ఆచార్యుడు ఒకటి ఆలోచించలేదు . పావురమును ఎగురవేయువారు , అది పైకి పోనీ యని పట్టి ఎగరేస్తారు . కానీ అది మేఘములవరకే ఎగురగల పక్షి . దానికి , వీరి ఎగురవేత వలన ప్రయోజనమేమి ? అదే విధముగా , మనిషి మేధలో వేదము ,  కావలసిన ఎత్తుకు చేరవలెనంటే దానికి దైవానుగ్రహము కావలెను . అంతేకానీ కేవలము మానవ ప్రయత్నము తో అది సాధ్యము కాదు అనునది అతడి మనసుకు తోచలేదు . మనిషి , పొలమునకు నీరు పెట్టవలెనన్న , కొంత విస్తీర్ణమునకే పెట్టగలడు . ప్రవహింప జేయవలెనంటే , ఇంకొంత ఎక్కువ విస్తీర్ణము నకు పంపించగలడు . అయితే మానవ ప్రయత్నము  వాన లాగా నేలను తడపగలదా ? 

        ఇలాగే సుమారు రెండు వర్షములు గడచినవి. ప్రథమోపాకర్మ జరిగి , ఇంకొక ఉపాకర్మ కూడా నడచినది . ఉపనయనమైన రెండు వర్షముల తరువాత కొడుకును గురుకులమునకు పంపించు ఆలోచన వచ్చినది . తనకు కావలసిన వారందరితో ఆలోచన చేసి కొడుకును వైశంపాయనుని గురుకులమునకు పంపవలెను అన్న సిద్ధాంతమునకు ఆచార్యుడు వచ్చినాడు . తత్ప్రకారముగానే , కులపతుల అనుమతి పొంది , ఒక శుభ దినమును చూచి , ఆచార్యుడు పత్నీ సమేతుడై కుమారుని తీసుకువచ్చి కులపతులకు అప్పజెప్పినాడు . 

        ఆచార్యుడు కులపతులకు విన్నవించుకున్నాడు , " కులపతులు ఒక దానిని కరుణించవలెను . కుమారుడు ఇంకే విషయములోనూ అవిధేయుడు కాలేదు , అయితే సంగీతము పైన వాడికి వ్యామోహము పెరుగుతున్నది . అదొకటీ తమరు మన్నించవలెను " 

         కులపతులు నవ్వి అన్నారు , " అదేమీ పెద్ద విషయము కాదు . మేము సంగీతమును వద్దనుటకు కారణము అది అతి త్వరగా కామ ప్రచోదనము చేయును అని . ఎవరెన్ని చెప్పినా , గంధర్వ శాస్త్రమును చూడండి , గంధర్వులకు కామము హెచ్చు . కానివ్వండి , దానిని నాదయోగముగా సరిదిద్దితే సరిపోవును . అప్పుడు బహిర్ముఖ కామనలు తప్పి , కామనలు అంతర్ముఖములగును . అప్పుడు ప్రణవము లక్ష్యమగును . దానివలన కూడా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమగును . అటులనే చేయుదము . " 

" సరే " 

        ఆలంబిని నమస్కారము చేసి , " నేను చెప్పవలసినది కూడా కొంత ఉన్నది " అన్నది . కులపతులు ఆమె ఏమి చెప్పునన్నదానిని ఊహించుకొని ముసి ముసిగా నవ్వుతూ , " చెప్పండి " అన్నారు . ఆలంబిని , " ఇంతవరకూ కుమారుడు ఇల్లు వదలి బయట ఎక్కడా ఉండి ఉండలేదు . కాబట్టి వాడికి కష్టము కాకుండా కాపాడు భారము తమది . " అన్నది . 

       వైశంపాయనులు ఉత్తరమును చెప్పుటకు ఉద్యుక్తులై , అలాగే ఆగిపోయి , " యాజ్ఞవల్క్యా , మీ తల్లి చెప్పినది విన్నావా ? ఏమంటావు ? " అన్నారు .

         యాజ్ఞవల్క్యుడు , " నది ముందు ముందుకు ప్రవహించియే తీరవలెను . ఇంతవరకూ తల్లిదండ్రుల రక్షణలో , శిక్షణలో ఉండి విద్య నేర్చితిని . ఇప్పుడు తమరి సన్నిధానములో శిక్షణ పొందవలెను అని వచ్చినవాడను . తాను విశాలమూ , లోతూ కావలెనన్న , నది ముందు ముందుకు ప్రవహించవలెను ,  కదా ? " అన్నాడు . 

        వైశంపాయనులు ఆ ఉత్తరమును విని ఆమోదిస్తూ తల ఊపి అన్నారు , " ఈ ఉత్తరము చాలు . అయినా మీతృప్తి కోసము చెపుతాను . మా గురుకులములో ఉన్న వారి నందరినీ మా సొంత పిల్లలవలె , వారు మరలా తమ సొంత ఇళ్ళను గుర్తు చేసుకొని వ్యథ పడకుండా చూచుకొనుట మా కర్తవ్యము . మా ఆశ్రమములో నున్నవారు గంగానదికి నేరుగా వెళ్ళిన , అక్కడ పెద్ద చేపలు , మొసళ్ళనూ చూచి భీతి చెందెదరని , గంగా నదీ పైభాగము నుండీ ఒక కాలువను ఇక్కడికి తవ్వించినాము . దానిలో నడుము లోతు కన్నా ఎక్కువ నీరు ఎప్పుడూ ఉండదు . అయితే , ఒక మాట , మీ కుమారుడు చన్నీటి స్నానము చేయవలెను . తన వస్త్రములు తాను ఉతుకుకొనవలెను . ఏమయ్యా యాజ్ఞవల్క్యా ! ఈ కష్టమును సహించగలవా ? " 

        యాజ్ఞవల్క్యుడు పెద్దవానివలె మాట్లాడుతూ అన్నాడు , " అదేమీ కష్టము కాదు . మా ఇంటి వెనుక తటాకములో దినమూ స్నానము చేయుట నాకు అలవాటు . ఇంతవరకూ అక్కడ స్నానము చేయుచుంటిని , ఇప్పుడు ఈ కాలువలో స్నానము చేసెదను . బట్టలు ఉతుకుటకునూ కష్టము లేదు , అలవాటైనది . " 

        వైశంపాయనులు ఒప్పుకుంటూ అన్నారు , " ఆచార్యా , తమరి అనుమతి అయితే వీడిని రెండు ప్రశ్నలు అడిగెదను " . ఆచార్యుడు సరేనన్నాడు . కులపతులు అడిగినారు , " ఏమయ్యా , నీకు వేదాంగములలో దేనిపైన ఎక్కువ అభిమానము ? " 

          యాజ్ఞవల్క్యుడు ఆ ప్రశ్నకు ఏ వికారమూ లేకయే అన్నాడు , " కల్ప  జ్యోతిష్యములు నేరుగా యజ్ఞమునకు సంబంధించినవి . నిరుక్తము వేదార్థమును వివరించునది . ఛందస్సు , మంత్రములలోని అక్షరములు సరిగా ఉన్నవో లేవో తెలుసుకొనుటకు సాధనము . శిక్ష , అక్షరోచ్చారణ యొక్క సాధుత్వ , అసాధుత్వములను చెప్పును . వీటన్నిటికన్నా నాకు వ్యాకరణము పైన అభిమానము ఎక్కువ. "

" అదెందుకయ్యా ? "

         " చూడండి , దానిలో ప్రకృతి , ప్రత్యయములు , పదములు అని విభాగములున్నవి . ప్రకృతి అనేది శబ్ద ఖండము . దానికి ప్రత్యయము చేరి , కృదంతమో , సదంతమో అయిన పదమును చేయును . ప్రత్యయమును తీసివేస్తే , పదము మరలా ప్రకృతి యగును . అటులనే , పూర్ణమైన ఈ జగత్తు పదము వంటిది . దానిలోనున్న ప్రత్యయమును తీసివేస్తే అది ప్రకృతి యై , ముందువలె పూర్ణమే అగును . ఇలాగు చూపించును యని ’ పూర్ణమదః ...’ మంత్రపు వ్యాఖ్యానము . అందుకే నాకు వ్యాకరణమనిన అభిమానమెక్కువ. " 

       "   ఒకే శబ్దము , పరా -పశ్యంతి - మధ్యమా - వైఖరీ -రూపములలో ప్రకటమగును యని శిక్ష అంటుంది కదా !  దానికి కూడా ఇలాగే వ్యాఖ్యానమెందుకు చేయరాదు ? "

        " పరా స్థానము గోచరము కాదు అనునది ఆ శాస్త్రపు సాంప్రదాయము . అయితే ప్రకృతి గోచర మగునట్టిది . దీనిని ప్రయోగ పూర్వకముగా తెలుసుకొన వచ్చును . అందుకే వ్యాకరణమును చూస్తే నాకు అభిమానము . " 

         వైశంపాయనులు , కుమారుని బుద్ధి వైఖరులను చూచి సంతోషపడి , అభిమానము చూపకుండా జాగ్రత్త పడినారు . వారికి వెనుకటి దంతా గుర్తుకు వచ్చి , ’ ఔను , వీడి వలన లోకోద్ధారమగుటలో అతిశయమేమీ లేదు . వీడు మా శిష్య వర్గమును చేరినది మా అదృష్టము ! " అని సంతోషించి , తమ సంతోషమును ఆచార్య దంపతులకు మరీ దీర్ఘముగానూ , మరీ హ్రస్వముగా కాక ప్రకటించినారు . మరలా కుమారుని పిలచి , " అయ్యా , నీకు సంహితాధ్యయనమైనది . మీ తండ్రి గారి వెంట వెళ్ళి అక్కడక్కడా ప్రయోగమును చూచి  తంత్రమును కూడా ఎంతో కొంత సాధించినావు . ఇలాంటపుడు , నీకు ఈ గురుకులము నుండీ కావలసిన ప్రయోజనమేమిటి ? " అని అడిగినారు . 

         కుమారుడు తల్లిదండ్రుల అనుమతి పొంది , చేతులు జోడించి అన్నాడు , " మాతా పితరుల దయ వలన కంకులనుండీ వడ్లు వచ్చి , ఎండి , బియ్యముగా మారు భాగ్యము కలిగినది. బియ్యము అన్నము కావలెనని తమరి దగ్గరకు వచ్చినాను . అన్నమైన తర్వాత , దానిని ఎలాగు వినియోగ పరచెదరో దానికేమి తెలుసు ? తమరు ఆ అన్నమును సద్వినియోగము చేసెదరనే నమ్మకముతో , తమ పాదమూలమును చేరి కృతార్థుడనగుటకు వచ్చినాను . అలాగు నన్ను కృతార్థుడిని చేయుట అన్నది మీకు చెందిన విషయము . "

         వైశంపాయనులు ఆ సమాధానము విని బహు సంతోషపడి వాడిని పిలచి దగ్గర కూర్చోబెట్టుకొని  వీపు నిమురుతూ తమ సంతోషమును వ్యక్త పరచినారు , " అలాగే కానీవయ్యా , మన ఇద్దరినీ గురు శిష్యులుగా చేర్చిన దైవము ,నిన్ను కృతార్థుడను చేయనీ . నువ్వు మాత్రా శిష్టుడు , పితా శిష్టుడూ అయిన యోగ్యుని వలె మాట్లాడుచున్నావు . నీకు గుర్వాశిష్టుడు కూడా అగు భాగ్యము రానీ . ఇహములో అనన్య లభ్యమగు కీర్తీ , పరములో ఉత్తమోత్తమమైన సద్గతీ లభించనీ . " అని మనఃపూర్వకముగా ఆశీర్వాదము చేసినారు . కుమారుడు ఆ ఆశీర్వాదము సత్యమవనీ అని ఇంకొకసారి నమస్కరించినాడు . 

Saturday, February 2, 2013

27. " మహాదర్శనము "--ఇరవై ఏడవ భాగము-- బ్రహ్మత్వపు కానుక


27. ఇరవై ఏడవ భాగము--  బ్రహ్మత్వపు కానుక 


         యథాకాలములో స్వస్తి వాచనము , అంకురార్పణము , గృహ యజ్ఞము , నాందీ శ్రాద్ధములు నెరవేరినవి . కుమారునికి చౌలమూ , మాతృ సహ భోజనమూ అయి , వాడిని అలంకరించి ఆచార్యుని వద్దకు పిలుచుకొని వచ్చినారు . బుడిలులు పురోహితులై లేచి నిలచి , సదస్సుకు అభివాదము చేసి , " ఇది వైదిక కర్మ. ఇది సఫలమగునట్లు సదస్సులోని వారందరూ అనుగ్రహించవలెను . తమ ఆశీస్సులు సఫలమగుటకు తామెల్లరూ దేవతామూర్తులై కూర్చోవలెను . " అని ప్రార్థించి  ఆచార్యుని వైపుకు తిరిగి తాము బ్రహ్మయై కూర్చున్నారు . 

         ఆచార్యుడు మంత్రాధిదేవతయే తానైనట్లు ప్రతియొక్క మంత్రము చెప్పునపుడూ ఆయా దేవతలను తనలో ఆవాహించుకొని కర్మమును నెరవేర్చినాడు. భిక్షాచర్య వరకూ సర్వమూ నడచింది . వటువు దేవాంశలతో కూడి , వేదములను పరిగ్రహించినాడు . సూర్యదర్శనము చేయించినపుడు సవితృడిని ప్రార్థించి సావితృ కిరణమును పొంది హృదయములో ధారణము చేసి తానే ఇంకొక సవితృడయినాడా అన్నట్టు ప్రకాశించినాడు . అతడు , ’ భో , సావిత్రీం అనుబ్రూహి ’ , అని అడిగి దానిని క్రమ క్రమముగా పదశః , అర్థశః  పూర్తిగా పొందినపుడు , వెనుక బ్రహ్మను మెప్పించి , వేదములను ముష్టి ముష్టిగా ( పిడికెళ్ళతో )  పొందిన భారధ్వాజుడే అందరికీ గుర్తుకొచ్చినాడు . 

         కులపతులకు అంతులేని సంతోషము . బహుశః వారికన్నా ఎక్కువ సంతోషమును పొందినవాడు ఆ సభలో ఒకడే ఒకడు . ఆతడు జనక మహారాజు . అతడికి వటు యాజ్ఞవల్క్యుని చూచినపుడు కనిపించినది కేవలము వటువు కాదు , లోకోద్ధార కర్త యైన మహా బ్రాహ్మణుడొకడు ఆ వామన మూర్తిలో అణగిపోయి కూర్చున్నట్టే తోచింది . " నేను రాజ్యమును ధర్మముగా పాలించుట సార్థకమైనది. కురు , పాంచాల , మద్ర , కాశీ దేశములలో ఉన్న విద్వాంసులందరి కన్నా శ్రేష్ఠుడై , కర్మ , బ్రహ్మలు రెండింటిలోనూ మిగిలినవారికన్నా జ్యేష్ఠుడైన మహానుభావుడొకడు తన రాజధానిలోనే అవతరించినాడు . " అని అతనికి కలిగిన సంతోషము అంతా ఇంతా కాదు . . వెనుకటి రోజు బుడిలులు ఆచార్యునికి బోధించినదంతా భార్గవుడి ద్వారా విన్న రాజు దానినంతటినీ కళ్ళారా చూచి ఆనంద పరవశుడైనాడు . 

          భిక్ష ప్రారంభమైనది , మాతృభిక్ష అయినది , మాతామహాది భిక్షలైనవి , కులపతుల పత్నులు భిక్షనిచ్చినారు . అనంతరము క్షత్రియుల భిక్ష అయినది . రాజు నూతన వటువుకు బంగారము , రత్నములను కానుకగా ఒసగి , " మమ్ములను ఉద్ధరించి , ’ ఈతనికి ఈ రాజ్యమును ఇచ్చినా సరిపోదు ’ , అనిపించుకొనునట్టి విద్వద్వరిష్ఠుడవు కమ్ము" అని ఆకాంక్షించినాడు . అక్కడికి వచ్చిన వైశ్యులు కూడా భిక్షను ఇచ్చినారు . 

        ఆచార్యుడు ఆ భిక్ష ద్రవ్యమునంతా తనకు అర్పించిన వటువుకు ఆశీర్వాదము చేసి , బుడిలులకు సమర్పించినాడు . బుడిలులు దానిలో కొంత తీసియుంచుకొని , మిగిలినదంతయునూ బ్రహ్మ భోజన దక్షిణాదులకని ఇచ్చివేసినారు . 

         మహారాజు తన అనుయాయులైన రాజపుత్రులతో పాటు వెడలినపుడు ఒక విచిత్రము జరిగింది . వెంట భార్గవుడు కూడా ఉన్నాడు . బయలుదేరి నిలచినరాజు , కులపతులనూ , బుడిలులనూ చూడవలెనని అనుకున్నాడు . ఆచార్యుని పక్షాన వచ్చిన మహిదాసుడు వారు ముగ్గురినీ పిలుచుకు వచ్చాడు . వారు వస్తుండగా , రాజు భార్గవులను రహస్యముగా వద్దకు  పిలచి , " అభివాదన చేయు క్రమమేది ? " అన్నాడు . అతడు కూడా రహస్యముగానే , ’ బ్రహ్మ విద్యా సంపన్నులైన కులపతులు కాబట్టి మొదట ఉద్ధాలకులకు , కర్మ విద్యా సంపన్నులైనందుకు ద్వితీయం గా వైశంపాయనులను , అనంతరము ఈదినపు బ్రహ్మత్వమును అంగీకరించియున్న బుడిలులకు ’ అన్నాడు . 

       అంతలో ముగ్గురూ వచ్చినారు . మహారాజు మొదట బుడిలులకు , తరువాత ఉద్ధాలకులకు , వైశంపాయనులకూ నమస్కారములు చేసి , " వ్యుత్క్రమమై ఉంటే , క్రమము తప్పి ఉంటే క్షమించవలెను ’ అని మరియొక సారి చేతులు జోడించినాడు . 

        కులపతులిద్దరూ , " మహారాజులు చేసినది సక్రమముగానే ఉన్నది . బుడిలులు వయస్సులోనే కాదు , జ్ఞానములోనూ మాకంటే తక్కువేమీ కాదు " అని ప్రసన్నముగా అన్నారు . బుడిలులు , " తప్పుకాదేమి , తమరు కులపతులు , మాకు చివరలో జరగవలసినది , ఏదో జరిగిపోయింది , వదిలేయండి " అని గొణుక్కున్నారు . 

      మహారాజు , " ఈ దినము వేదమూర్తులు బ్రహ్మత్వములో ఉన్నారు . మేము ఒక వరమును అడుగవలెనని యున్నాము " అని వినయముగా అన్నాడు .

వైశంపాయనులు , ’ వరమును అడుగుటకు ఇదే సకాలము . ఇక వారు లేదనుటకు లేదు ’ అన్నారు . 

        " బుడిలులకు ఒక గ్రామమును కానుకగా సమర్పించవలెనన్న మా కోరికను మన్నించి అంగీకరించవలెను . " 

         బుడిలులు నవ్వుచూ , " కులపతుల వలననూ , ఈ దినపు బ్రహ్మత్వము వలననూ మా నోరు కట్టివేయబడినది. ఇలాగ సందర్భమును గమనించి గెలిచిన మహారాజావారు ఒక నిబంధన పూర్వకముగా మేము దానిని అంగీకరించుటను ఒప్పుకోవలెను . " అన్నారు . 

" అటులనే , అనుజ్ఞ ఇవ్వవలెను " 

         " మా ఇంటికి సవారీ వచ్చి దానిని యజ్ఞేశ్వరునికి సమర్పించవలెను . రాజాస్థానము ఎంతైనా లక్ష్మీ స్థానము . అక్కడి వచ్చినపుడు ఆ వైభవాదులు మావంటి వారికి చపలమును పుట్టించగలవు. మా తల గట్టిగా ఉన్ననూ రాళ్ళు తగలరాదు కదా ? " 

         మహారాజు ఒప్పుకున్నాడు . బుడిలులు తాము నిస్సహాయంగా దొరికిపోయినందుకు అర్థం లేని నవ్వు నవ్వుచూ , ’ యాజ్ఞవల్క్యుడి యజ్ఞములో బ్రహ్మనైనందుకు ప్రత్యక్ష ఫలము దొరికింది , చూచితిరా ? ఇక మీరిద్దరూ కులపతులుగా వాడి గురువు లైనపుడు మీకెంతటి ఫలములు లభించునో ? " అన్నారు .

         కులపతులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు . " ఒక వటువు రెండు ఆశ్రమములలో గురుకులమును చేయుట ఎలాగ ? " అన్న సంశయము ఇద్దరి ముఖాలలోనూ కొండంతగా కనిపించింది . బుడిలులు దానిని చూచి , " నేను చెప్పకూడదనే అనుకున్నాను , దైవము పలికించింది . కానివ్వండి , స్పష్టమగ్రే భవిష్యతి " అని , ఆచార్యుడూ , వటువూ ఉన్నచోటికి వెళ్ళినారు . 

         అక్కడ ఆచార్యుడిని సాక్షిగా నుంచుకొని , వటువును  ’ వ్రతమెన్ని దినములు ? ’ అని అడిగినారు .  వటువు వామనుడిగా కనిపించిననూ త్రివిక్రముడిలా మాట్లాడుచూ , " మొదటగా ఆచార్యులూ , తమరూ ఎన్ని దినములంటే అన్ని దినములు వ్రతము చేయుట నా కర్తవ్యము . అలాకాక , నన్ను అడిగితే , మూడు దినములు చాలు " అన్నాడు . 

బుడిలులు తమకు కావలసినది అదేనన్నట్టు తలయూపుతూ , ’ ఆచార్యుల అనుజ్ఞ ఎలా ఉన్నది ? " అన్నారు . 

         ఆచార్యుడు అన్నాడు , " నిన్నటి దినము తమరి నోటివెంట వచ్చినదంతయూ ఈ దినము కనులారా చూచితిని . ’ ఆచార్యుని చిత్తానికి అనుచిత్తుడవు కమ్ము ,  , అతని మాట ప్రకారము  నడచుకో ’ అని తమ ఆదేశమని, శృతి విహితమనీ అన్ననూ , వ్రతములను విధాయకముగా చేసిననూ , వ్రతమెన్ని దినములు అనుదానిని నిర్ణయించవలసినది ఆతడు . ఆతడు చెప్పినట్లే కానివ్వండి " . వ్రతము మూడు దినములనీ , నాలుగవ రోజు మేధా జననమనీ నిర్ణయింపబడినది . 

Friday, February 1, 2013

26. " మహా దర్శనము "--ఇరవై ఆరవ భాగము --ఉపనయనము- 2


26. ఇరవై ఆరవ భాగము  -- ఉపనయనము- 2


         బుడిలులు కులపతుల ముఖములు చూచి , వారు ’ సరియే’ అని తలలూపగా , మరలా కొనసాగించినాడు :

         " ఇదంతా అయిన తర్వాత  వటువు  ,  ’ ఈ గోత్రము వాడినైన నేను అభివాదనము చేసెదను ’ అని ఆచార్యుడికి అభివాదనము చేసి , తన ఎడమ చేతితో ఆచార్యుడి ఎడమ పాదమును , కుడి చేతితో కుడి పాదమును తాకి నమస్కరించును . పాదములనుండీ ఎల్లపుడూ తేజస్సు రక్షకమై వెలువడుతూ ఉండును . కాబట్టి పాదములను ముట్టినవాడు అనుగ్రాహ్యుడగును . ఇటుల పాదాభివందనము చేసి వటువు ఆచార్యుని ’ నాపై కృపతో సావిత్రిని నాకు చెప్పవలెను ’ అని ప్రార్థించును . అప్పుడు ఆచార్యుడు , ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని , రెండింటినీ తన కుడి తొడపై పెట్టుకున్న వటువును , తన కుడివైపు తొడపై కూర్చోబెట్టుకొని , ఆ అంజలిని తన చేతిలోకి తీసుకొని  ప్రణవ  వ్యాహృతుల పూర్వకముగా సావిత్రిని అనుగ్రహించును . అందులోనూ ఒక రహస్యముంది . పాదముల నుండీ రక్షకమై బయల్వెడలు తేజస్సు , అరచేతులనుండీ కూడా బయల్వెడలు చుండును. అయితే , నిస్సంకల్పముగా వెడలునది రుద్రుడై ఇతరులను చంపును . : అందుకే ,   సంకల్ప పూర్వకముగా వటువు యొక్క అంజలిని తన అంజలిలోకి తీసుకొనునది . 

          " గాయత్రి యొక్క మూడు పాదములనుండీ మూడు వేదములను ఇచ్చి , ఆచార్యుడు మరలా , ’ నీ హృదయము నా వ్రతములో చేరనీ ! నీ చిత్తము నా చిత్తానుసారమవనీ . ! నువ్వు నామాటను వినువాడగుము . బృహస్పతి నిన్ను నాకు ఇవ్వనీ " అని ప్రార్థన చేసి , బృహస్పతి నుండీ అతడిని తీసుకొనును. అనంతరము రక్షణార్థమై శృంఖలను కట్టును .( దీనినే మేఖల అంటారు , మగవారికి కట్టునది శృంఖల అయితే ఆడువారికి కట్టునది మేఖల )   : అప్పటి మంత్రములలో ఇది ప్రధానమైనది , " ఈ శృంఖల చెడ్డ మాటలనుండీ కాపాడుచూ మనలను పవిత్రము చేస్తూ సుఖకరముగా ఉండుగాక ! ప్రాణాపానముల నుండీ బలమును తీసుకురానీ ! సౌభాగ్య సంపన్నమైన శృంఖల దేవతలకు ప్రియమవనీ ! "  ముంజ దర్భలతో చేయబడిన శృంఖలను( మొల త్రాడు ) ఇలాగ ప్రార్థన చేయుటకన్నా ఇంకా అవమానము ఉంటుందా ? అంటారేమో . స్వారస్యమంటే అదే ! అందరూ కట్టెపుల్ల అని తిరస్కారముతో చూచు దానిని మనము ’ సమిధ ’ అంటాము . ఎక్కడ చూసినా దొరకెడు మంట ను మంత్రపూతము చేసి ’ అగ్ని ’ అంటాము . సదా సర్వత్రా వీస్తున్న గాలిని సర్వ కర్తయైన " మాతరిశ్వ ’ అంటాము . ఎక్కడో మునిగిపోయే సూర్యుడిని ’ ఆదిత్య ’ మొదలుగానూ , ’ ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - జంగమ స్థావరముల ఆత్మ- అంటాము . ఇలాగ ముంజదర్భను మొలత్రాడుగా చేసి కట్టుకుంటే ఏమేమి చేయవచ్చును అంటే మమ్మల్ని చూడండి , అసూయపడు ఇతరుల దుర్భాషణముల నుండీ మనలను కాపాడును . అదెలాగు ? ఆ దుర్భాషల శక్తిని తగ్గించి దానిని సహించ గల మన శక్తిని ఎక్కువ చేయడము ద్వారా ! . మీరు రాజపుత్రుల శిక్షణమును చూసినారు కదా ? వారి ఒళ్ళు ఉక్కు శకలమై , సహన శక్తియే రూపము పొందినదా అన్నట్టూ , బాణ ఖడ్గముల ఆఘాతములను ఎదిరించునది . దాని వలెనే ఇది కూడా ! అలాగ ఇది మనలను పవిత్రము చేయును . మన ప్రాణాపానముల నుండే బలమును సంగ్రహించి మనకు ఇచ్చును . దేవతలను పిలుచుకు వచ్చును , అనగా , మనకు దేవతలు వచ్చి పోవుటను చూడగల శక్తిని ఇచ్చును . అయితే ఇదంతా ఎప్పుడగును ? ఆ ముంజదర్భ శృంఖలలో ప్రాణ ప్రతిష్ఠ చేసి కట్టినపుడు మాత్రమే . దీనికంతకునూ పూర్వ సిద్ధత కావలెనా , వద్దా ? " 

         బుడిలుల మాటకు ఎవ్వరూ ప్రతి చెప్పలేక పోయినారు . అప్పుడు బుడిలులు మరలా కొనసాగిస్తూ అన్నారు , " ఆచార్యుడిది అదృష్టము . పూర్వపుణ్యము అతనికి జాతవేదుడి నొకడిని కొడుకుగా ఇచ్చినది . ఏదైనా కొంచము ఎక్కువ తక్కువయితే , ’ అహ , అది అలాగు కాదు  ’ అని చెప్పగల చైతన్యముందా బాలుడిలో . ఇప్పుడే విప్రుడైనాడన్న తర్వాత ఇక చెప్పవలసిన దేమున్నది ? దానివల్లనే ఆచార్యుడికి పూర్వ సిద్ధత ను గురించి చెప్పితిని . ఏమిటి ఆచార్యా ?  నాపైన కోపము వచ్చెనా ? " 

         ఆచార్యుడు వినయ పూర్వకముగా , " మాకు కొంత తెలిసిననూ , ఇంత వివరముగా తెలియదు . తమరు అనుజ్ఞ ఇచ్చినది మాకు అనుగ్రహమైనది . " అన్నాడు . 

         బుడిలులు అంతా ముగిసినది అని ధ్వనించేటట్లు అన్నాడు , " సరే , ఇక దండ గ్రహణము . అనంతరము వ్రతోపదేశము . అక్కడికి ఉపనయనములోని ప్రధాన కర్మలన్నీ ముగిసినట్లే . దాని తర్వాత మూడు రాత్రులైనా వ్రతమైన తర్వాత మేధా జననము . చూడు , మేధా జననము సరిగా అయితే , ఏక సంతగ్రాహి యగును . అటుల కాకుండిన , త్రివేది , చతుర్వేదులు అగుటకు అవకాశమేది ? అది చాలదన్నట్టు , పురాణేతిహాసాలు , వేదాంగములు , ఇతర శాస్త్రాలు , వీటన్నిటినీ సమన్వయము చేసుకొని , ఒకదానికొకటి అవిరోధము అగునట్లు చూచుకొనుట , ఆ తరువాత తనకు తగ్గ సాధనమిది , తన సిద్ధి ఇదీ అని నిర్ధారణ చేసుకొని గృహస్థుడగుట --ఇంత ఉన్నపుడు వీటిని వదలగలమా ? "

         అందరూ మౌనముగా ఉన్నారు . కులపతులిద్దరూ ఆనందముతో కళ్ళ నీరు తిరుగాడుతుండగా ఏదో భావనలో యున్నారు . అప్పుడు శాండిల్యుడు తండ్రి వద్దకు వచ్చి , ఏదో గుసగుసలాడి , లేచి బుడిలులకు నమస్కారము చేసి పలికెను , " తమరు చెప్పినదంతయూ నిజమే , ఔను , అయితే ఇదంతా ఆస్తికులైన బ్రాహ్మణులకు మాత్రమే . నాస్తికులైన వారి గతి యేమి ? అబ్రాహ్మణుల గతి యేమి ? వర్ణాశ్రమ ధర్మమే లేని దేశముల వారి గతి యేమిటి ? " 

          బుడిలులు నవ్వి అన్నారు , " వారి స్థితియేమిటి అంటే , మన సమాజములోని పలు దారులను యోచించి చెప్పవలెను . మొదటిది , మనము జన్మాంతరములను ఒప్పుకున్నవారము . దేవతలున్నారు అనువారము . ధర్మము జగత్తుకంతటికీ ఒకటే అయిననూ , దేశ కాల పరిస్థితులను బట్టి భిన్నముగా కనపడునది యనువారము . బ్రాహ్మణుడైనా , అబ్రాహ్మణుడైనా తనకు విహితమైన , తనకు విధించబడిన కర్మను చేసిన , ఒకటే ఫలము లభించును అనువారము . విహితమైన కర్మములో దోషములున్ననూ అన్య కర్మలకన్నా శ్రేష్ఠము అనువారము . దానితోపాటు , విహిత కర్మ త్యాగము వలన ప్రత్యవాయము కలుగును అని చెప్పు వారము .

         ఇక , నాస్తికుల , అబ్రాహ్మణుల , వర్ణాశ్రమ ధర్మ రహితుల వారి స్థితి యేమిటి ? అనుమాట -- నాస్తికులకు భవిష్యత్తు ఉంటే కదా , వారు అది అలాగుండవలెను , ఇలాగుండవలెను అనవలసినది ? నాస్తికులలో కూడా భవిష్యత్తు ఉంటుంది అనువాడు , దానికి అనుకూలమగునట్లు రూపించు విధానమును తానే వెదకుకొనును . అలాగు , తన బుద్ధినీ , అది విధించిన ప్రమాణములనూ అనుసరించువాడిని మనము ’ అసురుడు ’ అంటాము . వాడికి మీమాటే అవసరము లేదు . అటువంటివి చర్చకు వస్తే వాటి రూపమే మారిపోవును . ఇక బ్రాహ్మణుల స్థితి , ఫలముల ఐక్యతను  బోధిస్తూ , సమాజమనెడి వృక్షములో ఒకదానినొకటి ఆశ్రయించుకొని బ్రతుకవలెను అను మతములో , వ్యవహారమున కోసమై బ్రాహ్మణ , బ్రాహ్మణేతర భేదముందే కానీ , పారమార్థికంగా  కాదు . 

        ఇక , వర్ణాశ్రమ ధర్మము లేని వారి స్థితి యేమిటి ? అంటే , వారిలో వర్ణాశ్రమ రూప వ్యవస్థ లేకున్ననూ , వారిలో ఉత్తమాధమ ధర్మము లేదు అనవద్దు . వారిలో కూడా ఉఛ్చ నీచ భేదములుంటాయి . అది అధికారము వలన కావచ్చు , ఐశ్వర్యము వలన కావచ్చు , ప్రేయో మార్గమును ఎక్కువగా పట్టి , కామహేతుకముగా వారు నడచినా , అప్పుడపుడు వారిలో కూడా ఎవరో ఒకడు పుడతాడు ., అతడు దైవ సాక్షాత్కారము పొంది , తన లోకమును దైవము వైపుకు తిప్పుటకు పెనుగులాడును . ఆ లోకమంతా అతనికి తల వంచి అతని ధర్మమును అంగీకరించినను , మరలా తనకు తోచినట్లే ప్రవర్తించుట సాధారణము . మొత్తానికి చెప్పవలెనంటే , ... నీ పేరేమి ? మరచాను ? "  

" నన్ను శాండిల్యుడు అంటారు "

         " శాండిల్యా , మనము దేశమును ఊషరమనీ ( చవిటి నేల )  , నదీ మాతృకమనీ , దేవమాతృకమనీ అంటాము . అయితే , దైవానుగ్రహ వంచితమని , ఊషరము , అప్రత్యక్షముగా దైవమాతృకమైనది . నదీ మాతృకము , ప్రత్యక్షముగా వర్షము వలన పెరుగునది . దైవమాతృకమంటే అర్థమైనదా ?  ఒకసారి భయంకర క్షామము వచ్చి , పన్నెండు సంవత్సరములు వానలే లేక గంగాది సరిత్తులలో కూడా నీరే లేకపోయినదట . అప్పుడు అత్రి పత్ని యైన అనసూయ తాను , గంగనూ , సర్వులనూ అనుగ్రహించినదట ! ఇది మనకు అర్థమవుతుందా ? అలాగే , నాస్తిక , అబ్రాహ్మణ , వర్ణాశ్రమ రహిత దేశముల వారి స్థితులు సామాన్యముగా అర్థము కావు . కాబట్టి , మనకు అనుసరించ వలసిన దేమిటనిన , ’ బ్రాహ్మణుడు సర్వధా సర్వథా మైత్రుడై నేను చూచునదంతా భద్రము కానీ , నేను చెప్పునదంతా భద్రము కానీ , అని అంతటినీ భద్రీకరణ చేయువాడై , స్పర్శశీలుడై బ్రతుకవలెను . ఇంకొకమాట , సావధానము , మనము నాస్తికులను అసురులు అనిననూ , ప్రాజాపత్యులు అంటాము . అంటే , వారు కూడా మన దైవ సంతానమే . అలాగే , మనుష్యుడు మాత్రమే కాదు , పుట్టిన ప్రతియొక్క భూతమూ లోనూ ఈశ్వరాంశ ఉన్నది . కాబట్టి , ఒకదానివల్ల ఇంకొకదానికి బాధ కలుగకుండా నడుచుకోవలెను . అంతేనా , నువ్వు దినదినమూ సంధ్యావందనములో చెప్పునదేమిటయ్యా ? ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ అని కదా ? బ్రహ్మ కర్మ ఎవరికీ విరోధము కాకూడదు . ..."  మరి , బ్రాహ్మణులు చేయు చాలా కర్మలు ఇతరులకు విరోధములగుచున్నాయి కదా ? " అంటావా ? 

         " ఇది కూడా అడగవలెనా , ప్రపంచం మొత్తం లో చీకటి వెలుగులు ఒకదానినొకటి తిరస్కరించకుండా బ్రతుకుటెట్లు ? అదే వాస్తవిక స్తితియని , దాన్నే లక్ష్యముగా చేసుకోరాదు . సర్వభూత హితము కోరునపుడు గురి కొంచము హెచ్చుతగ్గులు కావచ్చును . ఒకటి ఆదర్శవాదము , ఇంకోటి వాస్తవవాదము . మనము ఆదర్శవాదులము . 

        " చెప్పుతూ ఉంటే ఇంకో పదిరోజులైనా అవుతుంది , శాండిల్యా , అయితే , ఇంటిలో బియ్యము కావలసినంత ఉన్నా , దినుసులు బళ్ళకొద్దీ నిండి ఉన్నా , భోజనము చేయునపుడు కొంతే తిన్నట్లే ఇది కూడా . ఆవు ఎంత గడ్డి తిన్నది అన్నదానిపైనే దాని వెల అని పెద్దపెద్ద గురువులు చెప్పేవారంట  ! . అలాగే , పర్వతములవంటి ఆదేశములను గురించి మాట్లాడుతూ , ఆచారములో దానిలో ఒక అంశమును కూడా పాటించనివాడికి బ్రాహ్మణ ధర్మమెందుకు ? చివరి మాటగా చెప్పెదను , విను . ఇవన్నీ కేవలము ఆదర్శాలు మాత్రమే అని వాటికో నమస్కారము చేసి వదిలేసిన వాటిని తన ఆచరణ లోకి తెచ్చుటకు త్రికరణశుద్ధిగా ప్రయత్నించువాడు బ్రాహ్మణుడు . శ్రేయస్సు - ప్రేయస్సులలో శ్రేయస్సు కోసము ప్రేయస్సును బలి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నవాడు బ్రాహ్మణుడు . విశ్వమంతా ఒకటి . తన కర్మ స్వల్పమైనదిగానీ , పెద్దది ఐనా కానీ , దానివలన  విశ్వస్థితి మారితీరును అని నమ్మినవాడు బ్రాహ్మణుడు . విశ్వానికి బయట అవ్యక్తముగా నున్న సత్యమును సతతమూ లక్ష్యముగా పెట్టుకొన్నవాడు బ్రాహ్మణుడు . ఇతరులు అర్థకామములు జీవనపు లక్ష్యములు అంటే , ఇహములో ధర్మము , పరములో మోక్షము అను మహా లక్ష్యమున్నవాడు బ్రాహ్మణుడు . చాలా , ఇంకా చెప్పవలెనా ? "

శాండిల్యుడు మరలా నమస్కారము చేసి , " పరమానుగ్రహమైనది " అని చేతులు జోడించినాడు . 

         బుడిలులు , " నా మాటలను వినియే సంతోషముతో పరమానుగ్రహమైనది అంటున్నారు . మన యాజ్ఞవల్క్యుడు ప్రవచనము ప్రారంభించనీ ! అప్పుడు ఏమి చెపుతాడో చూడవలెను ! . కేవలము నా నోటి మాటగా వచ్చిన మహా దర్శనమును సాక్షాత్కరించి ఇవ్వగల మహానుభావుడతడు . " అన్నారు . వారికి ఆమాట అంటూ కంట నీరు వచ్చినది .