SHARE

Monday, November 12, 2012

వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

          వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు  మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును . 

          మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును (  ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి ||  అనే మంత్రము )

          ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన   || అనే మంత్రము చెప్పును . దాని అర్థము  , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి  ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

     తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును . 

         అటుతరువాత , భార్యతో సహా  ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును "  కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని , మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి .  అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొంది , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము . ( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ ||  అనే మంత్రము ) 

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును . 

         ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట. 

        సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి . 

3 comments:

  1. ok nice .... kasyapu maha munidi intercasta..... yenduknate mala community vaallu aa peruni (arundatini) vadukuntunnaru.... contraversion kosam kaadandi charitra telusukovadam kosam...

    ReplyDelete
  2. సప్తఋషుల భార్యలు అందరూ కూడా కర్దమ ఋషి , దేవహూతి లకు పుట్టిన వారే . ఈ విషయము అనేక పురాణాలలోనూ ప్రవచనములలోనూ , కనిపిస్తుంది . అరుంధతి కూడా వారిలో ఒకతె. ఈమే వశిష్ఠుని భార్య. అయితే అరుంధతి పేరుతో ఒక మాతంగ స్త్రీ కూడా ఉండేదని కొన్నిచోట్ల కనబడుతుంది . కర్దమ ఋషి , దేవహూతుల పెళ్ళియే ఈ జగత్తులో పెద్దలు కుదిర్చిన మొట్టమొదటి వివాహము. ఈ విషయము అంతర్జాలంలో కూడా వెతికితే దొరకును.

    ReplyDelete