SHARE

Monday, November 5, 2012

4. " జీవిత చుక్కాని " నాలుగవ అంకం సంబరం


నాలుగవ అంకం  సంబరం



         ఈ అంకం లో మా చిన్నప్పటి పండుగల ఆనందము , ఆకాలపు అలవాట్లు ,  పిల్లలు ఎంతో మురిసేలా అమ్మ చేసే పిండి వంటలు , మా మనోల్లాసము వంటివి మధుర జ్ఞాపకాలు మెదలుతున్నాయి. 


                        అనంతపురం సాయినగరు లో మా పాత ఇంటి పండగ వాతావరణం. 


                           ఇక పండుగలు వస్తే, నిజంగా మాకు పండుగే ! అలాగని, మేమేదో ధూం ధాం గా చేసుకొనే వాళ్ళమని కాదు. ఆడంబరాలు లేకున్నా, పండుగలలోని నిజమైన ఆనందాన్ని , ఆ స్పూర్తినీ, ఎంతో హృద్యమైన అనుభూతులను పొందేవాళ్ళం.  బడాయిలు లేని ఆనాటి సంబరాలు ఎంత మనసుకు హత్తుకునేలా ఉండేవో ! 

                సంక్రాంతికి ఇంటిముందర ౪౦-౫౦ గజాల స్థలంలో  అమ్మ పూర్తిగా ఆవు పేడ తో కళ్ళాపి చల్లించేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. మా అక్కయ్యలు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు. మేము వెళ్ళి గుమ్మడి పూలు, సుంకేసుల పూలు తెచ్చేవాళ్ళం. పేడతో గొబ్బెమ్మలు  చేసి ముగ్గుల మధ్యలో వుంచి, పూలతో అలంకరించి, పసుపు కుంకుమా పెట్టి  హారతి ఇచ్చేది. ఉదయాన్నే ఇంటిముందుకి హరిదాసు వచ్చేవాడు. తలపైన బొట్లు పెట్టిన గిన్నెలో  బియ్యం పోయించుకునేవాడు. గంగిరెద్దులు అలంకరణతో కొమ్ములు  ఊపుతుంటే, వాటిని తోలుకొని వచ్చిన వాళ్ళు ఎద్దుకీ, తమకీ కూడా పళ్ళు, డబ్బులు , ధాన్యము తీసుకొని వెళ్ళే వాళ్ళు. కోస్తా ఆంధ్రా లో ఉన్నంత కాక పోయినా, కోడి పందేలు జరిగేవి.  ఒక అతను హార్మోనియమ్ తెచ్చి, వాయిస్తూ, " పరమాత్మూనీ భజనా,,  పలీకీనంతటానా " అంటూ భిక్షానికొచ్చేవాడు. మిగతా రోజుల్లో కూడా వచ్చేవాడు కాబట్టి, ఆ పాట వినీ వినీ నేర్చేసుకున్నాము.  ఇంకొకాయనైతే, గోచీ పెట్టి పంచె కట్టి, ప్రతి ఇంటిముందుకూ వచ్చి, తలకిందుగా నిలుచొని, " హరి, హరి, హరి, " అంటూ ఉండేవాడు. అలా తలకిందులుగా ఉన్నప్పుడు,  ఆయన పక్కన పెట్టుకున్న బుట్ట లోని బియ్యాన్ని కోళ్ళు వచ్చి తింటుండేవి. ఒకో ఇంటి ముందూ సుమారు అరగంట అలా తలకిందుగా ఉండేవాడు. ఆయనకి వచ్చిన భిక్షమంతా కోళ్ళ పాలయ్యేది. 

           అమ్మ సంక్రాంతి రోజు భోజనంలోకి సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూరా తప్పనిసరిగా చేసేది. మేమంతా ఉదయాన్నే తలంటు స్నానం చేసి మా అమ్మతో పాటు దేవుడికి పూజ చేసి రొట్టెలకోసం కాచుకుని వుండేవాళ్లం. ఒకే పంక్తి లో కూచొని మా నాన్నతో కలిసి మేమంతా భోంచేస్తే, తాను మాత్రం మా భోజనాలు అయ్యాక చివర్న తినేది.

              సాయంత్రం కాగానే, కొత్త బట్టలు తొడుక్కుని, భోగి పళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక జంఖానా పొడుగ్గా పరచి, వరుసగా మమ్మల్ని కూచోపెట్టేది. అందరికీ హారతి ఇచ్చి, ఒక గిన్నెలో లేదా బుట్టలో రేగు పళ్ళు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు,చిల్లర నాణేలు కలిపి, మా అందరికీ తలలపైన పోసేది. మేమైతే డబ్బులకోసం పోటీపడేవాళ్లం .అలా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఏ దిష్టీ తగులకుండా ఆరోగ్యంగా ఉంటారని  అమ్మ నమ్మకం.

                        ఇక ఉగాది వస్తే, తెల్లవారే  లేచి తలంటి పోసుకుని, ఇంటి చెట్లోంచీ వేప పూత, చిగురుటాకులు తెచ్చి ఉగాది పచ్చడికి సిద్ధం చేసేవాళ్ళం.  ఆరోజు పంచాంగం చదివి, పూజయాక, హోళిగలతో ( బొబ్బట్లు ) కడుపునిండా భోజనం చేసి ఆటలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఏ మధ్యాన్నమో భోంచేసి, కాస్త నడుం వాల్చగానే పని మనుషులు, చాకలి వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెట్టి, ఇండ్లకు ప్రత్యేకంగా అన్ని పదార్థాలు వేసి ఇచ్చేది. ఎంత వంట చేసేదో కానీ, వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలనీ నిండేవి.

                          బొజ్జ గణపయ్య వినాయక చవితి కైతే సందడే సందడి. మేము పొద్దున్నే లేచి ఒక మైలు దూరంలో వున్న  " ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ " కు వెళ్లి దొంగదారిన కాంపౌండు గోడ దూకి అక్కడున్న పెద్ద తోటలోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ లేని పూల చెట్లు గాని పండ్ల చెట్టు గాని, ఇతర వృక్షాలు గాని లేవు. . పూజకు కావాల్సిన పత్రి, మర్రి ఆకులు, మామిడాకులు, మేడి, రావి ,  జువ్వి లాంటి ఆకులు, పూలూ కోసుకొని వచ్చే వాళ్ళం. మా లాగే మరి కొందరు వచ్చే వాళ్లు.

           ముందురోజే వినాయకుడి బొమ్మ తెచ్చే వాళ్ళం కాబట్టి, పొద్దున్నే పత్రి తెచ్చాక, స్నానం చేసి, వ్రతం పుస్తకం తీసుకొని వచ్చీరాని మంత్రాలు చదివి పూజ పూర్తి చేసే వాళ్ళం. అప్పటికి మేము ఏ మంత్రాలూ నేర్చుకోలేదు, నాకైతే ఒడుగు కూడా కాలేదు . అలా చేసే ఆ పూజకే తన్మయత్వం చెందే వాళ్ళం. తప్పనిసరిగా మా అమ్మ కుడుములు చేసేది. సాయంత్రం చంద్రుడు ఎక్కడ కనపడతాడో అని తల వంచుకుని  బెదురుతో నడిచే వాళ్ళం. కథ విని, మళ్ళీ పూజ చేసి ఆరుబయట కూర్చొని, పాటలూ, పొడుపుకథలూ చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. అప్పుడు మాకు ఆరు నుంచి పన్నెండేళ్లుండేవి.

                   దసరా అయితే, ఎలాగూ పదిహేను రోజులు శెలవులుండేవి. సరస్వతీ పూజ రోజున శ్రద్ధగా పుస్తకాలను పూజించేవాళ్ళం.ఆయుధ పూజకు ఇంట్లో వున్న పనిముట్లూ, కుట్టూ   మిషనూ , సైకిళ్ళకు , పూజ చేసేవాళ్ళం. అంతకు మించి మా ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు. మా అమ్మ కొన్నేళ్ళు  బొమ్మలకొలువు పెట్టేది. దశమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళం. శమీ చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి, పెద్దలకు పత్రి ఇచ్చి, కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళం. అదేదో భక్తితో అనుకునేరు, ఆరోజు నమస్కరిస్తే, తప్పకుండా డబ్బులిచ్చేవాళ్ళు, అందుకని. మా పాఠ్య పుస్తకాల్లో దసరా గురించిన పాఠంలో, ’ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ’ అని ఉండేది. స్కూల్లో టీచర్లు, అదేదో రూల్ ఐనట్టు, ప్రతి సారి పప్పు బెల్లాలు పంచేవారు. మేము ఏనాడూ అయిదు రూపాయలిచ్చిన పాపాన పోలేదు . 

         
                  మధ్యాహ్నమంతా పుల్లన్న బస్సుల్లో విహారం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సుల పుల్లన్న అని ఒకాయన " శ్రీ వెంకటేశ్వరా ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ "  నడిపేవాడు. ఆయుధపూజ రోజంతా పూలు, మామిడాకులు, గంధం బొట్లతో అలంకరించిన తమ బస్సుల్లో పిల్లలందరికీ  free ride ఏర్పాటు చేసేవాడు. ఒకోసారి అదే రోజు పీర్ల పండగ వచ్చేది. ముస్లిం సోదరులు పీర్లు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళేవారు. బస్సు కిటికీలోంచి అదంతా ఆసక్తిగా చూసేవాళ్ళం. 

          దీపావళి కి కూడా కొత్తబట్టలు తప్పనిసరిగా వుండేవి. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలంటిపోసుకుని, టపాకాయలు కాల్చే వాళ్ళం. ఇంటిబయట అంతా దీపాలు పెట్టి చిచ్చుబుడ్లు, విమానాలు, ఇలా రకరకాలుగా కాల్చే వాళ్ళం. ఒకసారి దీపావళికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మేము కేవలము పాత న్యూస్ పేపర్లు రంగు కాయితాలు మొ.. నవి కాల్చాము, నాకు బాగా గుర్తు. రంగు కాగితాలు కాల్చినా రంగు మంటలు వచ్చేవి కావు . 

                                    వైకుంఠ ఏకాదశికి మా అమ్మ తప్పనిసరిగా గుడికి వెళ్ళేది. శివరాత్రికి కూడా గుడికి వెళ్ళి వచ్చేది. ఆ రోజు మేము, రెండవ ఆట, నాల్గవ ఆట సినిమాలు చూసే వాళ్ళం. ఇలా రాస్తూ వెళితే ఇదేదో పండగలపై వ్యాసంలా కనిపించినా, ఆశ్చర్యం లేదు. 

                      పండగ అని కాకపోయినా, ఎపుడైనా స్వీట్లు , కోడు వడలు (చేగోడీలు) , చక్కిలాలు ( జంతికలు ) , అత్తి రసాలు  చేసేది. మేము ఒకే రోజులో ఖాళీ చేస్తామేమో అని ఒక డబ్బాలో పోసి, మాకు అందకుండా పైన అటక మీద పెట్టేది. అది గమనించి, మేము చల్లగా ఆ డబ్బా దింపి, నేల మీద ఒక మూల పెట్టుకొనే వాళ్ళం. అటక పైన ఏదైనా అలాంటిదే ఒక ఖాళీ డబ్బా పెట్టి ఏమీ తెలియనట్లు ఉండే వాళ్ళం. మా అమ్మ చూపులెప్పుడూ పైని డబ్బా మీదనే ఉండేవి. మేము అటు పోతూ, ఇటు వస్తూ ఆ మూల డబ్బా లోంచి స్వీట్లు లాగించే వాళ్ళం. సాయంత్రంగా అది తెలిసికొని బుగ్గలు సొట్టలు పడేలాగా స్వచ్ఛంగా నవ్వేది కానీ తిట్టేది కాదు. ఆ రవ లడ్లు , అత్తిరసాలు ( అరిసెలు ), ఇతర చిరు తిళ్ళు  చేయాలంటే రెండు రోజుల ముందే విసురు రాయి ( తిరగలి) లో పిండి, చక్కెరా లాంటివి విసిరివుంచుకునేది పాపం. ఐతే విసరడంలో ఎపుడైనా సాయం  చేసేవాళ్ళం. అపుడే తెలుసు ఏదో చిరుతిండి చేయబోతున్నదని !

           ఒకసారి మా పెద్దన్న కడుపు లో ఉన్నపుడు ఎప్పుడూ పాములు కలలోకి వచ్చేవట. ఒక రాత్రి ఏదో పని మీద దొడ్లో తలుపు తీస్తే ఎదురుగా నిలువెత్తు నాగు పాము పడగ ఎత్తి నిలుచుందట. అమ్మని చూసి, పడగ దింపి వెళ్ళిపోయిందట. అలా కడుపుతో ఉన్నవాళ్ళకి పాము కనబడితే, ఆ పుట్ట బోయే వారివల్ల కష్టాలు తప్పవంటారు. అది ఒక మూఢ నమ్మకమే ఐనా, మా అమ్మ విషయంలో నిజమే అయింది. 

           మరో సారి ఎదురింటి మేడ మీద చిన్ని కృష్ణుడు పాకుతూ, ఆడుతూ కనిపించాడట.  వాళ్ళ చిన్నప్పుడు పొలాల్లో కొరివి దయ్యాలు గున గునా నడుస్తూ పోవడం చూసిందట. ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాటి అర్థం ఇప్పటికీ విశ్లేషణ కు అందడం లేదు. ఇలాంటి విషయాలు అమ్మ చెబితే మాకు అవన్నీ మామూలు విషయాలుగా అనిపించేవి , ఏమీ ఆశ్చర్యం వేసేది కాదు . ఇప్పుడు తలచుకుంటే రోమా లు నిక్కబొడుచుకుంటాయి 


          పై వన్నీ చదివాక, చెప్పండి, అన్నీ మామూలు విషయాలే కాదంటారా ? . ఐతే, ఆర్భాటాలు, బడాయిలూ లేని అవన్నీ మధుర స్మృతులు. ఎందుకంటే, ఆ రోజులు, ఆ పరిస్థితులు మళ్ళీ రావు. అవన్నీ మా అమ్మలోని ఒక కోణాన్ని ఎంతో అందంగా  చూపుతాయి. ఆ అనుభవాలు మనిషి మానసిక ఆరోగ్యానికి కావలసిన  ముఖ్యమైన వాటిలో భాగాలు. . ఈనాడు పల్లెలలో కూడా అటువంటి సంబరాలు అంతరించి పోతున్నాయి.

2 comments:

  1. పల్లెల్లో జరిగే పండగల గూర్చి, పాత రోజులు, మళ్ళీ గుర్తుకు తెచ్చారు.రాను రాను పండగల పరమార్ధం ప్రజలు మరచిపోయే రోజులు దగ్గరపడ్డాయేమోననిపిస్తుంది.

    ReplyDelete
  2. మా ఇంట్లో భక్తి టీవీ ధర్మసందేహాలు సౌండ్‌ ఎక్కువ పెట్టారు, ఏం చెయ్యాలి? శబ్దానికి శబ్దమే జవాబు, నేను head phones తగిలించుకుని chinmaya dunster సంగీతం పెద్దగా పెట్టి మీ 'అక్షర'ప్రపంచంలో లీనమైపోయాను, ఎంత open heart సర్‌ మీది? నాకో అభిప్రాయం వుంది, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే పెద్ద కుటుంబం వుండటమే మంచిది అని ఈ వ్యాసం నా భావనకు బలాన్ని ఇచ్చింది, కానీ ఇంత ఉంటే ఆర్థికంగా ఇబ్బంది వుండదు అనడానికి లేదు కావున నా తలంపు తలంచటంవరకే పరిమితం, నాన్నాగారి పూర్వ పరిస్థితులు, అమ్మను కలిసిన తీరు, అప్పటి స్థితిగతులు, దేశకాలాలు, వాటికి తగ్గట్లు మనుషుల్లోని ఇగోలు, అవి చాలవన్నట్లు ఇబ్బందులు, అయితే నేం అన్నట్లు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు, ఉట్టినే గొప్పోళ్ళు అయిపోతారా అన్నట్లు ఇంటా బయిటా కష్టాలు, జీవితాం జీవించేందుకే అనే భరోసా, కొవ్వత్తి తలపించే అమ్మ వ్యక్తిత్వం, తాను ఆస్పత్రిలో వున్నా పిల్లల ఆకలి ఆ తల్లిని కదిలించిన వైనం, దువ్వెనకు కళ్ళజోడుకు ఇంట్లో సిగపట్లు, ఇది చాలదన్నట్టు గంపెడు సంతానం, బండెడు చాకిరి అప్పడే కదా ఆ రత్నం అంతగా మెరుగు పెట్టబడి ఎవరికీ లేని గౌరవ భావం, దైవ సమాన హోదా, కర్తవ్య నిష్ఠ ఆమెకు ఆ గౌరవం తెచ్చిందంటే అది కొంచెమే, కొందరి వ్యక్తిత్వాలంతే ఎందరి హృదయాల్లో దివ్య స్థానాన్ని సంపాదించుకుంటాయి, ఏది ఏమైనప్పట్టికి మీరు మాతో పంచుకున్నారు చాలా చాలా ధన్యవాదాలు.

    ReplyDelete