SHARE

Tuesday, October 2, 2012

" జీవిత చుక్కాని " ముందుమాట


మాతృ దేవో భవ ----------- -------పితృదేవో భవ

                                ముందుమాట

                రోజూ వార్తాపత్రికలు చూస్తే , మరణించిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఫోటో తో కూడా ప్రకటనలు వుంటాయి. ఆదివారాలు కొంచెం ఎక్కువగా వుంటాయి.  ఎందుకో  తెలీదు . కానీ,  కొన్ని మాత్రం  బడాయికి  పూర్తి పేజి లేదా అరపేజి వుంటాయి. రోజుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నే తీసుకున్నా, వేలమంది చనిపోతూ వుంటారు... పోనీ,.. వందలలో అయినా వుంటారు కదా ! అలా వందల్లోనో, వేలలోనో  పొయ్యే వాళ్ల శ్రద్ధాంజలి ప్రకటనలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకలా ? " శ్రద్ధాంజలి " కి నోచుకోని  వాళ్ళు అందుకు అనర్హులా ? వాళ్ళలో ఏ గొప్పదనమూ వుండదా ? లేక ప్రకటనలు ఇవ్వగలిగే స్తోమత లేకనా ? ఆసక్తి లేకనా ? పై కారణాలు అన్నో కొన్నో అయి వుండవచ్చును. ఏ కారణమూ లేకపోవచ్చు కూడా !

          మా అమ్మ చనిపోయినప్పుడు మేము ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. పైన చెప్పిన ఏ ఒక్క కారణమూ కాదు.   ఎందుకంటే, మా అమ్మ బ్రతికిన  రోజుల్లో ఆమెను ఎంత యధాలాపం గా  పరిగణించామో పోయినప్పుడూ అంతే యధాలాపంగా పరిగణించడం వలన.  అందుకే ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఇలాంటివి రాయొచ్చో లేదో కానీ,   ’ అలాంటివన్నీ మన సంప్రదాయం కాదు ’ అనే అభిప్రాయం ఏ మూలో వుందేమో ! ఆమె పోయేనాటికి ఆమెకు భర్తా,  ఆరుగురు కూతుళ్ళూ,  అల్లుళ్ళూ,  ఐదుగురు కొడుకులూ,  నలుగురు కోడళ్ళూ,  పదహారుగురు మనవలూ,  మనవరాళ్ళూ  వున్నారు. ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. పత్రికలో ప్రకటన ఇస్తే తప్ప ఆ పోయిన వ్యక్తికి పరిపూర్ణత వచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు  అని చెప్పడం నా ఉద్దేశం కాదు.   పత్రికలో  ప్రకటన ఇచ్చినా, ఇవ్వకున్నా, పోయినవారి గొప్పదనాన్ని మాత్రం మరచి పోకూడదు. 
ఐతే అనూహ్యంగా, మా అమ్మ మరణ వార్త ’ ఆంధ్ర పత్రిక ’ దినపత్రికలో " ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ భాస్కర కేశవయ్య గారికి సతీ వియోగం "  అనే శీర్షికతో  సమాచారంగా వేశారు. 

          మా అమ్మ ఎవరు ? ఆమె గొప్పదనము ఏమిటి ? అంటే నాదగ్గర వెంటనే ఏ సమాధానమూ లేదు . ఆమె చదువు అయిదో తరగతి . పుట్టి పెరిగింది ఒక కుగ్రామములో .. ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే . అనాకారి కాకపోయినా అందగత్తె కూడా కాదు . పెద్ద పదవులూ హోదాలూ ఏమీ లేవు . మరి ?  ..... 

           వీటితో సంబంధము లేకుండా ఒక మనిషిలో గొప్పదనము ఉండకూడదా ?  ఉండకూడదో లేదో గానీ , కొంతమందికి ఉంటుంది . ఎలా ఉంటుంది అంటే ఒకమాటలో ఎలా చెప్పగలము ? 

          ఆమె పోయి నేటికి 27 సంవత్సరాలు కావస్తున్నది. ఒకసారి వెనక్కి తిరిగి  చూసుకుంటే  పత్రికలో ని ప్రకటనలు ఆమెకు న్యాయం చేసేవి కావేమో అనిపిస్తున్నది .  ఎందుకంటే ఆమె అతి మామూలుగా పుట్టి, పెరిగి, విలక్షణంగా  బ్రతికి, మామూలుగా చనిపోయిన  అసాధారణమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎక్కడో కాని తారసపడరు. ఆమెలోని కొన్ని పార్శ్వాలు కొన్ని సినిమాలలోనూ, నవలలలోనూ ఆయా పాత్రల్లో చూసి వుంటాము కానీ పూర్తిగా ఆమె వ్యక్తిత్వం గూర్చి చెప్పాలంటే  అది నిజంగా సాధ్యం కాదు . 

           కొందరామెను అవదూతలతో పోల్చదగ్గ వ్యక్తి అన్నారు . ఈమె ఉన్న చోట ఇతరులకు సుఖ సంతోషాలు  ఉంటాయి అన్నారు .  అందులోని సత్యం ఆమె పోయాక , ఆ సుఖ సంతోషాలు దూరం అయ్యాక  గానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఒక గొప్ప వెలుగులాంటిది. చీకటిని చూస్తేగానీ వెలుగు విలువ తెలీదు. , ఆమె ఉన్నంతకాలం మాకు చీకటి అంటే తెలీదు. అలాగే వెలిగిపోతున్న ఆమె గొప్పదనమూ తెలీదు. 

          అలాంటి ఆమెను గురించి  తెలుసుకోవడం అందరికీ అంతో ఇంతో తప్పక ఉపయోగపడుతుంది అనిపించి కలం పట్టాను . . అది అందరి హక్కు కూడా ! ఎందుకంటే, ఆమె తన జీవితంలో  ఎవరు తారసపడినా , వారికి సంతోషాన్ని పంచి పెట్టింది కానీ, తర తమ భేదాలు చూప లేదు. బ్రతికినప్పుడు ఆమెను కలుసుకోలేదన్న చిన్న కారణం చేత  ఇతరులు ఆమె వలన  ఏ లబ్ధీ పొందరాదు అనే సంకుచితత్వం దేవుడి దయ వలన మాకు రాలేదు.  ఆమెను గురించి చెప్పే ప్రయత్నమే మీ చేతుల్లో వున్న ఈ పుస్తకానికి దారి తీసింది.

          అలాగని ఇదేదో జీవిత చరిత్ర కాదు. కథ అంతకన్నా కాదు. మా అమ్మ ని మేం పొగుడుకోవడం కాదు. అలా పొగడ్తలతో ఆమె గొప్పదనాన్ని చాటింపు వేయాలంటే ఆమెని అవమాన పరచినట్టే అవుతుంది. ఆమె నిజజీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల సమాహారమిది. ఆ విషయాలు, విశేషాలు ఎవరికి ఎలా ఉపయోగపడుతాయో  , ఎంత మంది మనసులు నిండుతాయో చెప్పడం కష్టం. కానీ ఒకటి నిజం. ఆమెను తలచుకున్న వాళ్ళకి మనసులో ఎంత బాధ ఉన్నా మటుమాయమవుతుంది. 

          ఆమె అతి మామూలుగా బ్రతికిన మహోన్నత వ్యక్తి అని ఆమె ఉన్నపుడు తెలుసుకోక, ఉదాసీనంగా వుండి గొప్ప తప్పే చేశాము.

          జన్మనిచ్చిన తల్లి ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియని ఆరాటం తోనూ, మానవాతీత విలువలతో నిరాడంబరంగా వుండి, తాను భరింపరాని కష్టాలు అనుభవించినా, ఇతరులకు ఆహ్లాదాన్ని ఇచ్చిన వ్యక్తిగా  నిలచిన ఆమె  ఆత్మకి   సంతోషం కలగాలనే కాంక్షతో  నిజాయితీగా  స్పందించి చేస్తున్న ప్రయత్నమిది. దీంతో నా ఋణం తీరేది కానేకాదు. కాని ఇప్పటికైనా ఈ ప్రయత్నం చేయకపోతే నైతికంగా నేరమే అవుతుంది.

          ఈ జన్మలో మా అమ్మ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని ముందే అన్నాను కదా ! దానర్థం ఏమిటంటే, గత జన్మలో పరిష్కారం కాని, పరిహారం కాని విషయాలు ఆమెకున్నాయని ! అలాగైతే ఆ  కష్టాలేవో అనుభవించి కర్మ ఫలం తీరి కాలం చేసి వుండవచ్చును .  అలా కాకుండా, తాను మాత్రం కష్టాలు పడుతూ, చెరగని చిరునవ్వుతో అందరికీ శాంతిని  సంతోషాన్నీ ఇవ్వగలిగిన గుణం ఆమెది.  కాబట్టి గతజన్మలో చాలా పుణ్యం కూడా చేసి వుండాలి. ఆ పుణ్యం ఆమెకి కాకుండా,పిల్లలము మాకు ఉపయోగపడింది.  కొన్ని ఆత్మలు,  తమ పుణ్య ఫలం ద్వారా కేవలం ఇతరులకి మంచి చేసి తాము మాత్రం వ్యథలు అనుభవించి వెళ్ళిపోతాయని ఎక్కడో చదివాను.  ఆమె ఎంత గొప్ప ఆత్మ అన్నది ఇతరులపై ఆమె ప్రభావం ఎంతగా ఉండిందో తెలుసుకుంటే అర్థమవుతుంది.  . "  ఆ భగవంతుడు తన కు మారుగా ప్రతి ఇంటిలోనూ తన  అంశని ఇలా పంపుతాడు . సందేహం లేదు. .."  . ఇలా ఎవరైనా చెపితే ఎంత బావుణ్ణు ! .

 మీ చిరునవ్వుని నేను గమనింపకపోలేదు.

      ’" ఇవేవో మహా జ్ఞానులు, తాత్వికులు తేల్చాల్సిన విషయం . నాబోటి అజ్ఞాని కి అందని విషయం ’ " అనే కదా !  ముమ్మాటికీ! కానీ, నాబోటి అజ్ఞానికి కూడా ఒక విషయం స్పష్టం గా, ఖచ్చితం గా తెలుసు. ఆమె కేవలం మామూలు ఆత్మ ఐనట్టైతే, ఇంత కాలం తర్వాత, ఈ విషయాలు  ఎంతమాత్రం  బయటికి వచ్చేవి కావు.  ఈ బయటకు వచ్చిన విషయాలు ఎవరినైనా ఆకట్టుకున్టాయో లేదో  తెలీదు. ఆమె గొప్పదనం ఏమిటో ఠక్కున అడిగితే చెప్పడానికి ఏముంది అనిపిస్తుంది. ఏ విషయం గొప్పదో, ముఖ్యమైనదో తోచడం లేదు. కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత వుంది. అది ఏమిటో ఈ పుస్తకం చదివి తెలుసుకుని,   మీలాంటి చదువరులు ఆమెను ఎలా అభివర్ణిస్తారో తెలుసుకోవాలనుంది.

          మా తండ్రి గారు భాస్కరభొట్ల  కేశవయ్య గారు, 1995, మే 22 న  ( వైశాఖ బహుళ అష్టమి )  కాలం చేసినారు. అంతకు పదేళ్ళముందు, 1985 డిసెంబరు 11 న ( కార్తీక అమావాశ్య ) మా తల్లి పరమపదించారు. మా తండ్రిగారికి శ్రాద్ధ కర్మలు చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచన ఇది. చూస్తుండగానే 15 ఏళ్ళు గడచిపోయాయి. ఎప్పటికైనా రాయగలనా అనేది నా అంతర్మధనం.

          ఎందుకు రాయలేకపోయాను అంటే రకరకాల కారణాలు వున్నా, అన్నింటికన్నా ముఖ్యమైనది, బలీయమైన సంకల్పము, నియమ నిష్టలు  పాటించడము వంటివి చాలా ముఖ్యమని ఆలశ్యంగా అర్థం కావడం. ఇంతటి మహత్తర విషయాలని  ఆషామాషీగా ఉంటూ రాయడం కుదరదనే సత్యాన్ని నాకు పరోక్షంగా తెలిపింది కూడా మా అమ్మే. 


 సమాచారం అంతా సేకరించి సర్వధారి సంవత్సరం విజయదశమి 19-10-2008 రోజున రాయడం మొదలుపెట్టాను .

          ఈ పుస్తకం రాసేముందు,  దీనికి స్పందన ఎలా వుంటుందో, అసలు రాయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అనిపించింది. కాని, రెండేళ్ళకిందట నేను దీని విషయం కొందరు మిత్రుల తో చెప్పడం, అప్పుడప్పుడు దీనిని గూర్చి వారు ఆసక్తిగా అడగడం వలన  నా ఉత్సాహం పెరిగి, నన్ను రాసేంతవరకు నడిపించింది.

నా ఈ ప్రయత్నం నా తల్లి ఆశీర్వాదంతో విజయీకృతమౌతుందని నా నమ్మకం.

          అలాగే, రాస్తున్న విషయాలను నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా చెబుతూ, ఆత్మస్తుతి, పరనిందలను దరికిరాకుండా చేసిన ప్రయత్నమిది.  ఈ పుస్తకం కేవలం మా కుటుంబీకులను, బంధువులను లక్ష్యంగా రాయలేదు. ఇది కొంతవరకూ నా వ్యక్తిగత కోణం నించీ రాసినా, ఇది సర్వులకు వివేచనా కారణం, మనోరంజకం, విజ్ఞానదాయకం కావాలనే ఉద్దేశంతో, విషయాన్ని రెండుగా విభజించి , మొదటి భాగంలో అమ్మ గురించిన సమాచారం నేరుగానూ , రెండో భాగం లో అందరికీ పనికి వచ్చే  , ’ మానసిక ఆరోగ్యము ’, ’ ధ్యానము ’ , ’ వంటలు ’,  ’ పాటలు ’ ,  ’ కలల విశ్లేషణ ’   , ’ వస్తు వాస్తు ’  వంటి మరిన్ని అనుబంధ అంశాలను జోడించడం జరిగింది. సహృదయులకు అభినందనలతో,

                           " సర్వేజనాః సుఖినో భవంతు  "

No comments:

Post a Comment