SHARE

Friday, October 5, 2012

2. " జీవిత చుక్కాని " రెండవ అంకము


రెండవ అంకం ( మా నాన్న గారి పరిచయం ) 


           అనంతపురం లో తాడిపత్రి మండలంలో చిన్న పప్పూరు అనే పల్లెటూరు ఉంది. అక్కడికి దగ్గర్లో " అశ్వథ్థం "  అనే ఊర్లో భాస్కర శేషయ్య గారని  జమీందారు లతో తూగగల ఒక భూస్వామి  ఉండే వారు. వారే మా తాత గారు. అప్పటికి ఆయన ’ గార్లదిన్నె శేషయ్య ’ గా పిలవబడే వారట. ’  వారి సొంత ఊరు నిజానికి  గార్ల దిన్నె . అదీ అనంతపురం జిల్లాలోనే ఉంది. ఆ కాలంలో ఆయన చాలా ధనికుల్లో ఒకరు.  . ఆయన తండ్రి గారు, శ్రీ సుబ్బయ్య గారు. వారికి తండ్రి గారు శ్రీ అయ్యంభొట్లు గారు. అప్పటివరకూ భాస్కరభొట్ల అని ఉన్న మా ఇంటిపేరు ఏ కారణం చేతనో  మాతాతగారి కాలంలో ’ భాస్కర ’ గా మిగిలిపోయింది. అశ్వత్థం లో మాతాతగారు  కట్టించిన శివాలయం ఇప్పటికీ ఉంది . 

          1902  నుండి 1912  మధ్య కాలంలో ఇండియాలో, ముఖ్యంగా, దక్షిణ దేశంలో ’ ప్లేగు ’ వ్యాధి ప్రబలి, ఊళ్ళకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయని, పాత తరం వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో మా నాన్నమ్మ, తాతయ్యలు కూడా ఉన్నారు. మొదట మా నాన్నకు  5 --6   ఏళ్ళ వయసులో వాళ్ళమ్మ పోయింది.  మా తాతయ్యే ( శ్రీ శేషయ్య ) అన్నీ అయి మా నాన్నని పెంచారట. మా నాన్నకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తాతయ్య మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. . ఆయనకి చాలా ఓపిక, సహనం ఎక్కువని మా నాన్న చెప్పే వారు. ఆయనకి నియమ నిష్టలు ఎక్కువ. శ్రీ విద్యా ఉపాసకులు , ఆయనే ఇంట్లో వంట చేసే వారట,  త్రికాల సంధ్యలు, ఔపోసనలు, త్రికాలాగ్నిహోత్రాలతో ఇంట్లో శ్రోత్రియ వాతావరణము ఉండేది. వేద ఘోషలతో వచ్చీ పోయే అభ్యాగతులతో సందడిగా ఉండేది. మా తాతగారి ఇంటి ఈ వివరాలను , మా నాన్న చెప్పిన ఇతర విషయాలు , మాతాతగారి నేపథ్యం , మా నాన్న మరియు మా చిన్నాన్నల  వైదీక కర్మల ఆసక్తి మరియు ఆచరణ వంటి విషయాలు ప్రామాణికంగా తెలుపుతున్నాయి . ముఖ్యంగా , మా తాతగారు రెండుసార్లు కలలో కనిపించిన వైనం కూడా వీటికి ఆధారంగా నిలుస్తున్నది .  నాన్న చెప్పలేదు గానీ, మా తాతయ్య బహుశః పౌరోహిత్యం  చేసేవారో లేక టీచరుగానో ఉండేవారనుకొంటాను. మా నాన్నపేరు శ్రీ  కేశవయ్య. , ఆయన తమ్ముడి పేరు ,  శ్రీ మృత్యుంజయ శాస్త్రి. తాతయ్య,  కొడుకులిద్దరిని కష్టపడి పెంచారట. ఐతే, మా నాన్నకి  9 -  10  ఏళ్ళకే, మా తాతయ్య గారు కూడా పోయారట. అదృష్టమో, దైవసంకల్పమో, మా నాన్నా, చిన్నాన్నా వ్యాధి బారిన పడలేదు. అప్పటికే, వీరి ఆస్థిని ఎవరికి అందింది వారు దోచేశారట. కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్థిలో సింహభాగం కాజేశారట. పోయింది పోగా, మిగిలింది కూడా తక్కువేమీ కాదట. వీళ్ళ పేరుతో ఇంకా కొంత ఆస్థి ఉండేదట. 

          అది తెలిసి, ఒకామె, "  మీ చిన్నాన్న భార్యను, నీకు పిన్నమ్మను,  నిన్ను పెంచుకుంటాను " అని చెప్పి, మా నాన్నని బళ్ళారి కి తీసుకొని పోయిందట. వెళ్ళాక, రెండు రోజులకే, చెంబు చేతికిచ్చి, బియ్యం ముష్టి ఎత్తుకుని రమ్మని పంపించిందట. చెంబుకి నామాలు పెట్టి, పిల్ల వాణ్ణి పంచెకట్టీ పంపేదట. మా నాన్న అమాయకంగా అలాగే ఒక   పది పదిహేను రోజులు   చేశాడట. అంతలో, " ఎర్ర సీతమ్మ " అనే ఒకామె, ’  నీ మేనమామ కూతురిని ’ అని చెప్పి పిలుచుకు పోవడానికి వచ్చిందట. తరువాత, మా నాన్న గుడిలో కూర్చొని ఎందుకిలా అందరూ నన్ను మోసం చేస్తున్నారు అని  జరిగిందానికి బాధ పడుతుండగా, పక్క పల్లె నుంచి వచ్చిన ఒకాయన , ’ ఈ పిల్లాడినెక్కడో చూశానే ’  అనుకొని,  వివరాలు తెలిసికొని,

           "  అయ్యో, నీవు గార్లదిన్నె శేషయ్య కొడుకువా "  అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని,  బాధ పడి, తనతో  తీసుకెళ్ళారట. ఆ పుణ్య దంపతులే , వీరికి తల్లీ, తండ్రీ అయి పెంచారట. ఆ సమయంలో,మా నాన్న గారి మేనమామ గారయిన తూముచెర్ల రామకృష్ణయ్య గారు,  వీరి పేరుతో ఇంకా భూములున్నాయని విని, తూముచెర్లకు పిలిపించారు. "  మీ అత్తా, నేను .....,ఇద్దరమే కదా, నాకు తోడుండండి. నా ఆస్థి నా తర్వాత  మీకే " అని చెప్పి దగ్గర ఉండమన్నారు. వచ్చాక, ఎనుములు ( గేదెలు ) కాచేందుకు పురమాయించాడు. అప్పుడు, హట్టి శంకర రావు గారని ఒక బంధువులాయన, వచ్చి, యోగ క్షేమాలు  విచారించి, " మా ధర్మవరానికి రా, నీకు   SSLC వరకు చెప్పించి, పంచాయతి స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తాను " అని చెప్పి, ఆయనే చార్జీలు పెట్టుకుని, పిలుచుకుని వెళ్ళి, స్కూల్లో టీచర్ గా చేర్పించారు. మా పిన్నప్ప  ( మా చిన్నాన్నని మేము పిన్నప్ప అని పిలిచే వాళ్ళం ) మాత్రం, మేనమామగారింట్లోనే ఉండి, తర్వాత పౌరోహిత్యం  నేర్చుకున్నారు.


          సరే, టీచర్ గా ట్రైనింగ్ అయి, 3 నెలలు గడచినా జీతం రాకపోయేసరికి, వెళ్ళి అడిగారట. తాసీల్దారు గారి ద్వారా , పిల్లవాడి పనితీరు గురించి విచారించి, నమ్మకం కుదిరాక, జీతం ఇచ్చారట. మా నాన్న మొదటి జీతం, 8  రూపాయలట. ట్యూషన్ లు చెప్పి ఇంకో 7  -  8  రూపాయలు సంపాదించే వారట.  మా నాన్న శ్రద్ధ, పని తీరు నచ్చి,  తాసిల్దారు గారు హోటల్ వాడికి చెప్పి, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకో వద్దని చెప్పినారట. ఆయనే ఇచ్చే వారట.  మాటల్లో, మా నాన్న విషయాలు అడిగి, తోపుదుర్తి లో బంధువులున్నారని, ములకనాటి వాడని తెలుసుకున్నాడట.

          ఆ తాసిల్దారు గారి దగ్గర డెప్యూటీ తాసిల్దారుగా వున్న శ్రీ సీతారామరావు గారే, నేను మొదట పరిచయం చేసిన మా అమ్మ మేనమామ గారు. 

          మా అమ్మంటే వాళ్ళ మేనమామ  సీతా రామయ్య గారికి చాలా అభిమానము. అసలు ఆయన మా అమ్మను పెంచుకుందామనుకున్నారట.  మా నాన్నను చూసి, పిల్లవాడు బుద్ధిమంతుడి లాగా ఉన్నాడు, పద్మావతి కి సరియైనవాడు అని చెప్పి, మా తాతయ్య నీలకంఠరావు గారినీ, అమ్మ అన్నయ్య సదానంద ని పిలిపించారు.

          " కాదయ్యా,  నేనే ఒక పనికిమాలిన వాణ్ణి , ఎన్నో సంవత్సరాలు   వృథా అయిపోయాయి ,  ఉద్యోగం కూడ ఖాయం  కాలేదు, ఇంకా SSLC   ఫలితాలు   రాలేదు, నాకు పెళ్ళి అప్పుడే ఎందుకు " అని మా నాన్న అడ్డు చెప్పితే, వాళ్ళు వినక, ఉద్యోగం ఖాయం చేయిస్తాము, ఒప్పుకో, అన్నారు. తప్పుతాననుకున్న లెక్కల పేపర్లో సరిగ్గా 36 మార్కులు రావడం తో, ఒప్పుకోక తప్పలేదు.  ఐతే, మా నాన్నకి, పుట్టిన తేదీ గానీ, జాతకం గానీ తెలియదు. పుట్టింది కూడా 1906 లోనో, 1908  లోనో అనేవాడు. ఆయనకున్న షరతు ఒక్కటే. అమ్మాయికి సుమంగళి యోగం ఉండాలి, అల్పాయుష్కురాలు కాకూడదు. మా అమ్మ జాతకంలో ఆ రెండూ సరిపోయాయి. కాని అమ్మది అత్త లేని నక్షత్రం ( ఆశ్లేష ).  మా నాన్నమ్మ అప్పటికే కాలం చేసి ఉండటంతో, ’ సరే ’ అన్నాడు.  

          అప్పటికి మా నాన్నకు 21  సంవత్సరాలు ఉండచ్చు . పెళ్ళయ్యాక, తాడిపత్రి కి  ట్రాన్స్ఫర్ అడిగి వేయించుకున్నాడు. అక్కడి సబ్-తాసిల్దారు గారింట్లో రూము తీసుకుని ఒక రెండేళ్ళు ఒక్కడే ఉండే వాడు. పెళ్ళయాక కూడా ఒక్కడే ఉండటానికి ఓ కారణముంది . ఆ కారణానికీ  మా అమ్మకు  ఏ సంబంధం లేకపోయినా ఆమె జీవితంలో పెనుతుఫానులు వచ్చాయి . 

          ఆ సబ్-తాసిల్దారు గారింట్లో ఎక్కువ రోజులు భోజనం చేస్తే బాగుండదని, వేరే వంట చేసుకొనేవాడు. అది చూసి, ఆ సబ్-తాసిల్దారు గారి భార్య రామ లక్ష్మమ్మ  వచ్చి, పొయ్యిలో నీళ్ళు పోసేసేది. ’ పెళ్ళాం వచ్చి, ఇద్దరు పిల్లలయ్యే వరకు మా ఇంట్లోనే భోజనం ’ అని ఆర్డరు వేసేసింది. ఆమెను మా నాన్న ’ అక్కా ’ అని పిలిచే వాడు.   మేము ఆమెని మా నాన్న సొంత అక్క అనుకునే వాళ్ళం. ఎందుకంటే, ఎప్పుడూ, ’ మా అక్క  ’ అనే ప్రస్తావించే వాడే కాని, అసలు విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి, మా అమ్మ పోయాక 5 -- 6  ఏళ్ళకు, తన జీవిత చరిత్ర మొత్తం చెప్పితే, మా పెద్దక్కయ్య దాన్నంతా రికార్డు చేసుకుంది.

          తరువాత, ’ గుత్తి ’ లో ఉన్న భూమా రెడ్డి అనే ఆసామి, వచ్చి, ఎలాగున్నావయ్యా? అని అడిగాడట. ఆయన మా నాన్నకి ముందే పరిచయం. ఆయనతో, ’ వీళ్ళు నన్ను వంట చేసుకోనివ్వడం లేదు, గుత్తి కి ట్రాన్స్ ఫర్ చేయించండి ’ అని అడిగి, గుత్తి కి బదిలీ అయ్యాడు.

         తరువాతి కాలంలో  అనంతపురంలో కమలా నగరులో మా నాన్న దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నాడు. అప్పుడు మా నాన్న, చిన్నాన్న, వారి మేన మామ అందరూ కలసి సమిష్టిగా ఆ ఇంట్లోనే ఉండేవారు. 

          ఆ తరువాత, ఆస్థులు పంచుకుని, మా నాన్న సాయినగరులో విశాలమైన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మా చిన్నాన్న  వారి కుటుంబం ఇప్పటికీ కమలానగరు లోని ఇంట్లోనే ఉన్నారు. 

          అప్పటికి మా నాన్నకు మిగిలిన ఆస్థి చాలా తక్కువ. చిన్న వయసులోనే, అనాథ కావడము, ఆస్థి చేతికి రావడముతో, ఉక్కిరి బిక్కిరై, మార్గ దర్శనము లేక, వృథా ఖర్చులు చేసి , అంతా పోగొట్టుకున్నాడు. మేనమామ కూడా అన్యాయం చేశాడని, తమ్ముడితో కలిసి, తనకు రావలసింది రాకుండా చేశాడనీ చెప్పేవాడు. నా చిన్నప్పుడు, ఆ విషయాల గురించి ఘర్షణలు జరగడం నాకింకా గుర్తే.

          అయితే, మా తరం వాళ్ళకి, అది మాత్రం మాకు చెందని ఆస్థి. వాటివివరాలు గానీ, హక్కుల గురించి గానీ, మా నాన్న మాకు ఏనాడూ చెప్పలేదు. వాటి గురించి మాకు ఆలోచనలు గానీ, ఆశ గానీ ఏ మాత్రం ఉండేవి కావు. ఒక వేళ ఏమైనా సెటిల్మెంటు అయి ఉండిందో కూడా మాకు తెలీదు.. అప్పటికి మేము బాగా చిన్న పిల్లలము.

          మా చిన్నాన్న మా నాన్నతో పోలిస్తే మృదుభాషి. మనిషి మంచి నిదానస్తుడు. ఆ ఆస్థి గొడవలు రాకుండా వుంటే వారి కుటుంబముతో మాకు అనుబంధము బాగానే ఉండేది. అన్నదమ్ములు విడిపోయాక, కొంతకాలము రాకపోకలుండేవి. తరువాత తగ్గిపోయాయి. పిల్లలము మేము వెళ్ళి వచ్చే వాళ్ళము. తరువాత అదీ తగ్గిపోయింది. కనీసం శుభకార్యాలకు, తద్దినాలకు కూడా కలవడం లేదు. ఎపుడైనా సినిమా హాళ్ళలోనో మార్కెట్టులోనో  కనిపిస్తే మాట్లాడే వాళ్ళం. మా బంధాలు తగ్గిపోయాక మా చిన్నాన్నకి కలిగిన సంతానముతో మాకు పరిచయము కూడా లేదు. 

No comments:

Post a Comment