అరవై మూడవ తరంగం .
భగవాన్ విశ్వామిత్రులు ఈ దినము భగవాన్ అగస్త్యుల ఆశ్రమమునకు వచ్చినారు . మంత్ర పతియైన మహా బ్రాహ్మణునికి సలుపవలసిన మధుపర్కాది సత్కారములనన్నిటినీ యథా విధిగా సమర్పించి , అగస్త్యులు సతీ సమేతులై వారి వద్ద కూర్చొని లోకాభిరామం గా రెండు మాటలను ఆడుతున్నారు . ఆశ్రమమునందంతా సంభ్రమమే సంభ్రమము . వచ్చినవారు ఒక్కరే ఒక్కరయినా , సంభ్రమము మాత్రము వేల మంది వచ్చినంత ఉంది .
భగవానులిద్దరికీ భగవతీ లోపాముద్రా దేవి వైశ్వదేవమునకు ఏర్పాటు చేసినారు . ఆమె దృష్టిలో ఈ రోజు విశ్వానికే సమారాధన జరుగుతున్నది . చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్తంభమను అగోచరమైన అణుప్రాయమైన క్రిమి వరకూ ఉన్న సమస్త జీవ జంతువులకు మాత్రమే కాదు , జడ భూతములకూ , స్థావర జంగమములతో పాటూ అన్నిటికీ ఈ దినము మహా సమారాధనము యగునని అత్యంత నియమ నిష్ఠలతో , ఉత్సాహముతో , సంభ్రమముతో, విధాయకముగా , పద్దతిగా అన్నిటినీ సిద్ధము చేసినది . విశ్వభుక్ అయిన ఆ పరమాత్ముడు నేడు తమ ఆశ్రమమునకు దయచేసినాడు . అతడికి తృప్తి యయిన , ఒక విశ్వజిత్ యజ్ఞము అయినట్టే అని ఆమె సర్వమునూ సంసిద్ధము చేస్తున్నారు .
మధ్యాహ్నమయినది . బ్రహ్మర్షులిద్దరూ మాధ్యాహ్నిక కర్మలను నెరవేర్చుకొని గృహలక్ష్మి ఆహ్వానమును అంగీకరించి వచ్చి భోజన పాత్రల ముందర కూర్చున్నారు . మంచి అరిటాకులు వేసి , చిన్న చిన్న కంచు గిన్నెలలో చోష్యములు , లేహ్యములు , మధుర రసములు నింపి , విస్తర్ల చుట్టూ పెట్టింది . ఆయుః స్వరూపమైన ఘృతము , తాను సద్యోఘృతమునని చెప్పుటకు తన పరిమళమును వెదజల్లుతూ , వైశ్వానరునికి తనను అర్పించుకొనుటకు వేచి కూచున్నది . భక్ష్య భోజ్యములు , పక్వాన్నములు , ఫలమూలములు , యథావిధిగా సంస్కారమును పొంది భోజ్యములైన ధాన్యములు , అన్నియూ యజ్ఞములో భాగము వహించుటకు సిద్ధమై యున్నాయి . మక్షికాదులనుండీ బాధ కలగకుండా చిన్న విసనకర్రలను తీసుకొని విసురుతున్నారు . చీమలు మొదలైనవి రాకూడదని , కర్పూరపు ధూళి , పసుపు కలిపి ఆకుల చుట్టూ రంగవల్లులు తీర్చినారు . ప్రతియొక్క ప్రాణి హృదయమునందూ ఉండి , సర్వ సాక్షియైన ఆత్మ జ్యోతిని , లోక నిర్వాహక భారమును వహించిన ధర్మ జ్యోతినీ సాక్షాత్కరించుకొన్నట్లు , రెండు దీపములు ఆకుల ముందర వెలుగుతున్నాయి . నిర్మలమైన ఉదకము పానీయమై సిద్ధముగా ఉంది .
బ్రహ్మర్షులిద్దరూ అన్నస్వరూపమైన పరబ్రహ్మను ధ్యానించినారు . అన్నాదుడై సర్వ ప్రాణుల అంతర్గతుడైయున్న పరమాత్మను స్మరించినారు . అన్నమును మంత్రముతో ప్రోక్షణ చేసి , దృష్టి దోషాదులు తగలకుండా దానికి పరిషేచనము చేసినారు . ప్రతిదేహములోనూ కూర్చొని ప్రాణాపాన వ్యాపారములచేత అన్నమును పచనము చేయు వైశ్వానరుడిని సంబోధించి , అన్నము జఠరమునందు నిలుచుటకు , అమృతపు ఉపస్తరణము కానివ్వమని జల ప్రాశన చేసి , పంచ ప్రాణములకు ఆహుతినిచ్చి , దేహములోని విశ్వేదేవతలను ధ్యానము చేస్తూ వైశ్వదేవమును ముగించినారు . ఈ భుక్తాన్నమునకు అమృతము పిధానము యగుగాక అని ( మరుగు పడుట ) మరలా జలప్రాశనము చేసి , ప్రత్యక్షముగా అన్నమును పొందలేక , పాపులై ’ అన్నముకోసము ఆతురము పడుచున్న , అపుణ్యనిలయము నందున్న ఆర్తులకు ’ అని ఉదకమును విడచి , భోజనమును ముగించి లేచినారు . మంత్రర్షి యైన లోపాముద్రా దేవి , ఆ వైశ్వదేవము వలన సర్వ దేవతలూ తృప్తులగుటను చూచి , " వేదవిదుడైన బ్రాహ్మణునిలో సర్వసమస్త దేవతలూ ఉన్నారు అనుమాట నిజము . లేనిచో పెద్దలు ఊరికే చెప్పెదరా ? వారు చూచినది చెప్పినారు . మనము చూడలేక , అబద్ధము అంటే , వారిదా అపరాధము ? " అనుకొని ముందరి కార్యక్రమములో నిమగ్నమైనారు .
ఒకింత సేపు విశ్రాంతి యయిన పిదప అగస్త్యులు విశ్వామిత్రులను , వారిని అక్కడికి రప్పించిన గౌరవ కార్యము గురించి విచారించినారు . వీరు కూడా , క్లుప్తముగా యైననూ , మృదువుగనూ , అర్థపూరితముగానూ పలికినారు , " భగవాన్ వశిష్ఠుల అనుజ్ఞ యయినది . ఇక్కడికి వచ్చి కొన్నిరోజులు ఉండి రావలెను అని . అది , ఆనాడు బ్రహ్మర్షి పరిషత్తు అయిన దినము , భగవతి గార్గి మొదలుగా తమరెల్లరూ ఒప్పించిన కార్యమునకై అని తోచుచున్నది . ఇదంతా అయినాక భగవాన్ వశిష్ఠులను నర్మదా నదీ తీరములో దర్శనము చేసుకొనిన, సర్వమూ ముగిసినట్లే అనిపిస్తున్నది . "
" భగవాన్ , అది అంత సులభము కాదు . నది , సముద్రములో ఐక్యమగు వరకూ నదియే ! నదియై ఉన్నంతవరకూ ప్రవహిస్తూనే ఉండాలి . భగవాన్ వశిష్ఠుల పరీక్షలో గెలిచి బ్రహ్మర్షులు అనిపించుకొని విరాజిల్లవలెను కదా ? దాని తరువాత సప్తర్షి కల్పులైన తమకు తమ కర్తవ్యమేమీ ఉండదు . నిజము . అయితే , ఈ బ్రహ్మాండమును కాపాడు భారమును వహించిన మహాదేవుడు తనకు సహాయము కోసము అపేక్షించునది , తమ వంటి కృతకృత్యులనే కదా ! . కానివ్వండి , దానికింకా దూరముంది . ఇప్పట్లో జరగవలసిన కార్యమును గురించి ఏమి ఆలోచించినారు ? "
" భగవానుల అనుజ్ఞ అయినదాని అర్థము , తమరు ఎలాగు చెప్పిన , అలాగు చేయవలెనని కావచ్చును . కాబట్టి ఇప్పటి కర్తవ్యమును నిశ్చయించు భారము తమదే అని తోచుచున్నది . తమరి అనుజ్ఞ ఎలాగయిన , అలాగు . "
" అటులనా ? కానీ , మేము కూడా మాట ఇచ్చిన వారము కదా , మావలన కావలసినదేమున్ననూ చేయుటకు సిద్ధముగా యున్నాము యని ? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి కావలెను ? ఎవరైనా బ్రాహ్మణుడు కావలెను అన్నచో వారికి బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లుగా ఒక సాధనము ఏర్పడ వలెను . మంచిది . దేవి గారిని కూడా పిలువ వచ్చునా ? "
" అవశ్యము "
లోపాముద్రా దేవి వచ్చినారు . శృతీ భగవతియే లోకమునంతా ఆర్యమయము చేయుటకు వచ్చినదా అన్నట్లు వచ్చి కూర్చున్నారు . అగస్త్యులు అన్నారు , " ఆనాడు ఉత్సాహముతో ఆడినమాట ఈనాడు నిలుపుకో వలసిన తరుణమిది , దేవీ ! బ్రాహ్మణ్యము సులభముగా లభించునట్లు ఒక సాధనము ఏర్పడు కాలము వచ్చినది . ఏర్పడవలెను . ఏమి చేసిన అది సఫలము అవుతుంది అని సలహా అడుగుటకు నిన్ను పిలచినాము . "
" ఈ దినము తమరిద్దరూ భోజనము చేస్తున్నపుడే నాకు ఈ మాట గుర్తుకు వచ్చినది . అదీకాక , ఎటుల కావలెను అని మొదటి నుంచీ తమరు ఆలోచిస్తూనే ఉంటిరి . తమ చింతనము నా మనసులో ప్రేరేపించినదానిని అనుమతి అయిన ప్రస్తావించెదను . "
" అటులనే , దేవీ "
" నాకు తోచినదేమనిన , ధ్యాన యోగము అందరికీ సాధ్యము కాదు . కొన్ని దేహములలో ధ్యానము ప్రవహిస్తుంది , కొన్ని దేహములలో ప్రవహించదు . కాబట్టి ధ్యాన యోగము మార్గము కాదు . కర్మ యోగమందామా , అనధికారుల కర్మ వలన సంకల్పము ఫలవంతము కాదు కాబట్టి , అది కూడా ప్రయోజనము లేదు . ఉపాసనా మార్గములో దేవాప్యయమవుతుందే తప్ప జీవన సంస్కారము ఉత్తమమై దేహము బ్రాహ్మణము అగుట జరగదు ( దేవాప్యయము అనగా , దేవతలను తృప్తి పరచి వారి కృప పొందుట ) , దేహము బ్రాహ్మణము కానిదే బ్రాహ్మణ్యము లభించదు . కాబట్టి , మిగిలినది మంత్ర యోగమొకటే సాధనము . "