SHARE

Friday, August 21, 2026

ఉపాకర్మ వైశిష్ట్యత

 దార్శనికులు, మంత్రద్రష్టలు అయిన మన ప్రాచీన ఋషులు కనుగొన్న దర్శనములే వేదముగా పరిణమించినవి. మానవాళి కి కావలసిన సర్వమునూ సంపాదించి ఇవ్వగల విద్యయే వేదవిద్య.


|| ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోః అలౌకికమ్ ఉపాయమ్ యో గ్రంథో వేదయతి స వేదః 


మానవునికి జీవితములో అడుగడుగునా అవసరమయ్యే / కావలసిన అన్ని కోరికలను తీర్చుకొనుటకు, ఇష్టములేని విషయాలను / సమస్యలను పరిహరించే విధి విధానాలను యే గ్రంథము చెపుతుందో అదే వేదము. గ్రంథమనగా ఇది ఎవరో వ్రాసినది కాదు, అపౌరుషేయము అన్న విషయము సర్వులకూ తెలిసినదే. 

.

 మరి ఇటువంటి సులభోపాయము ఉన్నపుడు, లోకములో ప్రజలు ఇన్ని కష్టాలెందుకు పడుతున్నారు? 

కారణము, అజ్ఞానము, ఉదాసీనత. 

ఆది శంకరులు చెప్పినట్టు, ప్రజలకు అంతా మంచి జరగాలి, అన్నీ లభించాలి అనే కోరిక ఉంటుంది కాని, వాటిని సంపాదించే కర్మలను చేసేందుకు మనసు పుట్టదు. అలాగే, ఎవరికీ సమస్యలు, ఆపదలు , కష్టాలు ఇష్టము ఉండవు, వాటిని వద్దనుకుంటారు కాని, ఆ సమస్యలు, ఆపదలు, కష్టాలు కలిగించే కర్మలే చేస్తారు. 

దీనికి కారణాలు, అజ్ఞానము, ఉదాసీనతలు మాత్రమే. 


.

ప్రస్తుత కాలములో ద్విజులు , ముఖ్యముగా బ్రాహ్మణులు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నారు, ప్రభుత్వాలనుండీ గాని, సమాజం నుండీ గాని వారికి ఎటువంటి ఆదరణ, ప్రోత్సాహము, సహాయమూ లేవు.  కారణమేమంటే, వారికి కావలసినవి పొందే ఉపాయము/ శక్తి వారి దగ్గరే ఉందని తెలియక, ప్రభుత్వం మీదా ,సమాజం మీదా ఆధారపడటమే.


ఇది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.  దీన్ని నమ్మని వారు చదవటం ఇక్కడే ఆపి, వేరే పని చూసుకోవచ్చు. అలాగే, నమ్మినా కూడా కేవలం ’ బాగుంది ’ అని చెప్పి, ఒక లైకు వేసి వెళ్ళిపోయేవారు కూడా ముందుకు చదవకండి. ఎందుకంటే అటువంటి వారు ఇది చదువుటకు అపాత్రులు. అపాత్రులకు ఇచ్చే జ్ఞానము కూడా ఇచ్చిన వారిని బాధిస్తుంది.  కాబట్టి, దీని మీద పూర్తి విశ్వాసము ఉండి,  ఆలస్యమైనా సరే  ఆచరించగలము అనుకుంటేనే పూర్తిగా చదవండి.

.

సామవేదపు  బ్రాహ్మణము లోని ఒక మంత్రము ఇలాగుంది


|| దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం

తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||


ఈ జగత్తు అంతా భగవంతుని[ దేవతల ] ఆధీనం లో ఉండి నడుస్తున్నది. ఆ దేవతలు మంత్రాధీనులు,అనగా మంత్రముల ఆధీనములో ఉంటారు. ఆ మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనములో ఉన్నాయి కాబట్టి మంత్రమును సిద్ధింపజేసుకున్న  బ్రాహ్మణుడే మనకు దేవత. 

.

బ్రాహ్మణులను దేవతలుగా అంగీకరించే వారు చాలా అరుదుగా ఉంటారు. ఒకరి అంగీకారముతో ఎవరికీ పనిలేదు, కనీసం బ్రాహ్మణులైనా మంత్రాన్ని అధీనం లో ఉంచుకుంటున్నారా? 

.

ప్రస్తుతకాలములో బ్రాహ్మణులు, ముఖ్యంగా పురోహితులు, వేద విదులు, ఆచార్యులు, ఇతర వృత్తులలో ఉన్న బ్రాహ్మణులు అనేక వివక్షలను ఎదుర్కుంటున్నారు. అవమానింపబడుతున్నారు. సమాజం లో ఒక విలువ అంటూ లేకుండా ఉదరపోషణకై పడరాని పాట్లు పడుతున్నారు. అంతా స్వయంకృతాపరాధము. దీనికి ఇతరులను, ప్రభుత్వాలను బాధ్యుల్ని చేసి నిందించే అవసరం ఎంతమాత్రమూ లేదు. సర్వశక్తులనూ సంపాదించుకోగల విద్యలను చేజేతులా దూరం చేసుకొని  అందనివాటికై అర్రులు చాచటము కన్నా మూర్ఖత్వము ఇంకోటి ఉండదు.  ప్రభుత్వాలను, ప్రజలను శాసించగల స్థాయి నుండీ వారి దగ్గర అడుక్కునే స్థాయికి తమకు తామే దిగజారినారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. 

.

 సమాజానికి ఆదర్శంగా ఉంటూ, ప్రజల హితమును కోరి  అనుష్టానాలు చేస్తూ దారి చూపవలసినవారు కేవలం పొట్టకూటి కోసము చేయకూడని పనులు చేస్తున్నారు.  అలా ఎవరైనా లేరు అంటే, మంచి స్థితిలో ఉన్నారు అంటే, వారు, వారి పూర్వీకులు యే జన్మలోనో చేసుకున్న పుణ్యఫలము మాత్రమే. మరి , మన భావి తరాలకు కూడా ఆ పుణ్య ఫలము వద్దా? వారు కడగండ్ల పాలై నశించిపోవలసినదేనా? దీనికి సమాధానము, పరిష్కారము, బ్రాహ్మణుల వద్దే ఉంది. 

.

సరే, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని సన్మార్గములో వెళ్ళాలనుకొనే వారికి ఉపాయం ఏది? 

వేదములో చెప్పిన కర్మలను ఆచరించుటే. 

.

ఇంతవరకూ వ్రాసినవి అందరికీ తెలిసినవే. నేను కొత్తగా ఏమీ చెప్పలేదు.  నేను చెప్పదలచుకున్నది అతి చిన్న అంశము మాత్రమే. 

.

తమ తప్పు తెలుసుకొని తిరిగి వైదిక జీవనములోనికి వచ్చేవారికి కొన్ని సమస్యలు/ అవరోధాలు ఉన్నాయి.  అవి ఏమిటంటే,  వారు వైదిక కర్మలు చేయాలనుకున్నా, చేసినా, అవి ఫలించాలంటే మొదట వాటిని చేయుటకు సరైన అర్హత సంపాదించుకోవాలి. 

 శ్రావణ పౌర్ణమినాడు [ యజుర్వేదులు ] ఆచరించబోయే " ఉపాకర్మ " యొక్క ప్రాశస్త్యము, ఔన్నత్యము, విలువ, ప్రాముఖ్యత తెలుసుకుని పాటిస్తే గాని ఆ అర్హత రాదు.

 ఉపాకర్మ అంటే కొత్త ఉపవీతాలు ధరించటం --అనే స్థాయికి దిగజారిన మనం దాని అర్థం తెలుసుకొని, యోగ్యత, పాత్రత, సంపాదించుకోవాలి. 

.

మనము ఏడాది పొడుగునా ఎన్ని క్రతువులు, ఎన్ని కర్మలు చేయాలన్నా, మనకు " అధికారం " అనేది ఒకటుండాలి.  ఆ అధికారం సంపాదించి ఇచ్చేదే ఉపాకర్మ అనుష్టానము. 

.

 వేదాన్ని అధ్యయనము చేయడము, మధ్యలో విరామము తీసుకోవడము , తిరిగి అధ్యయనము చేయడము ,,, అనవరతముగా చేయవలసిన విధులు.

 అధ్యయనము మొదలు పెట్టడాన్ని ఉపాకర్మ అనీ, విరామము తీసుకోవడాన్ని ’ ఉత్సర్జనము ’ అనీ అంటారు. ఉపాకర్మ కు సంబంధించిన  ఆ వివరాలన్నీ నా బ్లాగులో ముందే ఉన్నాయి. కింద లంకె ఇస్తున్నాను... చూడవచ్చు. 

ఉపాకర్మలో ముఖ్యముగా చేయవలసినవి, వేదమంత్ర ద్రష్టలు అయిన కాండ ఋషులకు హోమము, జపము, దేవ ఋషి  పితరులకు తర్పణములు.

.

వీటిలోని  ముఖ్యమైన ఒక అంశమేమంటే, సంవత్సరము పొడుగునా మనము చేసిన అనేక పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడము. దీన్ని చాలామంది అంతగా పట్టించుకోరు. కాని, ఇది చేయకపోతే మనకు వైదిక కర్మలు చేసే అధికారము లేక, ఒకవేళ చేసినా అవి నిష్ఫలమవుతాయి.  మొత్తం ఉపాకర్మ తంతులో కాండ ఋషి పూజ, [ హోమము, జపము, తర్పణము ఇత్యాదులు] బ్రహ్మ యజ్ఞము, ప్రాయశ్చిత్తము ఇవి ముఖ్యమైనవి. నూతన యజ్ఞోపవీత ధారణ అనేది కేవలము ఒక చిన్న అంశము. దానిని ఎప్పుడైనా చేయవచ్చును. సంవత్సరములో ఎన్నిసార్లైనా చేయవచ్చును. కాని ఉపాకర్మ అంటే, మిగిలిన ముఖ్యమైన వాటిని వదిలేసి కొత్త జంధ్యము ధరించడము అనే అర్థము ఎవరైనా కావాలని తెప్పించి తప్పుదారి పట్టించారో లేక, మూర్ఖంగా మనమే అలా అనుసరిస్తున్నామో గాని, ఇది ద్వితీయ ప్రాధాన్యత కలది. సంవత్సరం పొడగునా అనేక సందర్భాలలో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఉపాకర్మలో కూడా అది ఒక చిన్న అంశమే.  హోమములో కాండఋషులకు నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాము.  ఆ సమర్పించే ముందు మనము చేసుకున్న పాపాలను ప్రక్షాళనము చేసుకోవాలి.  దానికి, " కామో కార్షీత్, మన్యురకార్షీత్ " మంత్రాలతో హోమము చేయడముతో పాటు ఆ మంత్ర జపం చేయాలి. ఇదే ప్రాయశ్చిత్తం.  ఇది చేయకపోతే ఒక వేద విదుడు సంవత్సరం పొడుగునా చేసిన పాపాలు తొలగక పోగా, ఇతర శుభ కర్మల ఫలం పొందకుండా పోతాడు.


ఎందుకంటే ఉపాకర్మలో పై మంత్ర జపం ద్వారా మనము కొన్ని పాపాలు పోగొట్టుకుంటాము. మైల పోయినవాడు, గ్రహణము వీడిన వాడు, పాపం పోగొట్టుకునేవాడు ఎలాగైతే పునీతులు అవుతారో, ఉపాకర్మ చేసిన వాడుకూడా పునీతుడు అవుతాడు, సందర్భము కాబట్టి మనము కూడా కొత్తది ధరించాలి.  పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించటం శాస్త్ర సమ్మతమే గాని, అది మాత్రమే కర్తవ్యము అనుకుంటే పొరపాటు.

.

ఇంతకీ, ప్రాయశ్చిత్తములో భాగముగా ఉపాకర్మలో మనము చెప్పే మంత్రాల అర్థం యేమిటి? 

.

 మనము దేవతల యెడ చేసిన పాపాలు[ న్యూనాతిరిక్తాలు, లోపదోషాలు],

 మనుషుల పట్ల చేసిన పాపాలు [  ధిక్కరించడం, అవమానాలు చేయడము, అన్నదానము చేయకుండా ఉండటము, ]

 పితరుల పట్ల చేసిన పాపాలు- పితృ కర్మలు చేయకపోవడము,  వంటివి,

 తన పట్ల తానే చేసిన పాపాలు [ మద్య మాంసాలు తీసుకోవడము, పర స్త్రీ గమనము, తినరానివి తినడము, అబద్ధాలు చెప్పడము వంటివి], 

తనవారు చేసిన పాపాలు[ భార్యా పిల్లలు చేసిన పాపాలు ]

 ఇవికాక, సామూహికంగా కొందరు చేరి చేసిన అకృత్యాలు --ఒక కుటుంబానికో, జాతికో, ఊరికో చేసిన ద్రోహం  మొ|| నవి. ఈ విధంగా పగలూ రాత్రీ మనకు తెలిసో, తెలియకో అనేక పాపాలు చేస్తుంటాము.

 నిద్రలో కూడా పాపాలు జరుగుతాయి... నిద్రలో పెద్దవారికి కాళ్ళు తగిలించడము, సూర్యోదయానికి నిద్ర లేవకపోవడము..ఇటువంటివి.  ఇంకా ఇటువంటి అనేక తెలియని పాపాలు చేసే అవకాశం ఉంది.

.

వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా చేసే హోమం / జపం / పారాయణలో కింది మంత్రము ముఖ్యమైనది

.



|| కామోఽకార్షీ॓న్నమో॒ నమః | కామోఽకార్షీత్

కామః కరోతి నాఽహం కరోమి 

కామః కర్తా నాఽహం కర్తా 

కామ॑ః కార॒యితా నాఽహ॑ం కార॒యితా 

ఏష తే కామ కామా॑య స్వా॒హా ||

.

మన్యురకార్షీ॓న్నమో॒ నమః | 

మన్యురకార్షీన్మన్యుః కరోతి నాఽహం కరోమి 

మన్యుః కర్తా నాఽహం కర్తా 

మన్యు॑ః కార॒యితా నాఽహ॑ం కార॒యితా

 ఏష తే మన్యో మన్య॑వే స్వా॒హా ||

.

 భగవద్గీతలో, ’ మనుష్యుడు ఎవరి వల్ల ప్రేరితుడై పాపాలు చేస్తాడు"?  అన్న అర్జునుడి ప్రశ్నకు, భగవంతుడు, " కామ క్రోధాలే పాప ప్రేరకాలు " అని ఉత్తరమిస్తాడు. 


క్రోధాన్ని " మన్యు ’ అని కూడా అంటారు.

కాబట్టి, కామాన్ని, క్రోధాన్ని రెంటినీ దేవతలుగా పరిగణించి, ఆ యిద్దరికీ కూడా హోమాన్ని చేస్తారు[ ఆహుతులు ఇస్తారు ]

పై మంత్రము ద్వారా యజమాని దేవతలను ప్రార్థించేది యేమంటే, " పాపాలు చేసిన తప్పు నాది కాదు, కాముడే ఆ పాపాలు చేశాడు, నేను కాదు, నేను పాప కర్తను కాను,  ప్రేరకుడనై పాపం చేయించేది కూడా నేను కాదు, కాముడే ఆ విధంగా చేయించినాడు " అంటాడు.

 " దురాశ వల్ల ఇటువంటి పాపాలు చేసి  కాముడి మీద వేసి తప్పించుకుంటున్నాడు --అని జనాలు అనుకుంటారు, కాబట్టి, ఓ కాముడా, ఆ పాపాల పరిహారం కోసం , ఇదిగో, నీకు స్వాహాకారం తో ఆహుతి ఇస్తున్నాను.." అని దాని అర్థము.


కాముడు, క్రోధము దేవతలు ఎలా అయ్యారు? అంటే, కాముడు ప్రేరకుడు అనేదేమో నిజము, అతడి ప్రేరణయే పాపమూలము అనేది సరైనదే.  అయితే, కాముడు పాపానికి మాత్రమే కాక, వ్యవహార సిద్ధి కి కూడా కారకుడు. ఆశ అనేదే లేకపోతే మనుష్యుడు బతకలేడు. అప్పుడు కర్మనూ చేయలేడు. నేను, నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు--అనే ప్రేమాభిమానాలు లేకపోతే, ప్రపంచములో వ్యవహారాలే జరగవు. కాబట్టి, ధర్మానికి విరుద్ధముకాని కామము పూజనీయమే, స్వీకరించతగినదే.  అది కూడా పురుషార్థములలో ఒకటి. [ ధర్మార్థ కామ మోక్షాలు ]  గీత లో భగవానుడు, " ధర్మానికి విరోధము లేని కామము నేనే " అని చెప్పియున్నాడు కాబట్టి, అటువంటి కామము దేవత అనడం లో న్యాయం ఉంది. కాబట్టి ఆ కాముడిని యజ్ఞము వలన సంతోష పెట్టాలి--అని అభిప్రాయము

.

ఇలాగే రెండో మంత్రము-- మన్యువు అంటే కోపము లేదా క్రోధము. క్రోధము కూడా ఒక దేవతే. అంటే ధర్మాగ్రహము. కాబట్టి ధర్మాగ్రహము అనబడే మన్యువు ఒక దేవతే కాబట్టి, అతడికి కూడా ఆహుతులు విధింపబడినాయి. 

కామ క్రోధాలకు ఎవడు వశుడైతాడో వాడు అనర్థానికి తోయబడుతాడు. కామక్రోధాలను అదుపులో పెట్టుకున్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు, అదుపులో పెట్టుకోలేనివాడు, " నేను స్వతంత్రుడను కాదు, నాచేత కామక్రోధాలు పాపం చేయించాయి, ఈ కామ క్రోధాలబారి నుండీ నన్ను కాపాడేది ఎవరూ? అని పశ్చాత్తాపము చెందేవాడికి ఆ పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తముగా పరిణమించి పాప విమోచనము చేయించగలదు. ఎప్పుడైతే మనిషికి అహంకారము పోయి, వివేకము కలుగుతుందో, అప్పుడే కామక్రోధాలు నేను కాదు--అనే వివేకము కూడా కలుగుతుంది. అదే వివేకముతో వాటికి వశుడు కాకుండా ఉండాలి...అని అర్థము.


.

 ఉపాకర్మ కు ఇంకా సమయం ఉంది కాబట్టి, కావలసినవారు ప్రణాళికలు చేసుకోవచ్చు.  


అయినా, సాధారణముగా శ్రావణ పౌర్ణమికి కారణాంతరాల వల్ల చేయలేనివారు భాద్రపద పౌర్ణమికి చేసే వెసులుబాటు ఉంది. 

శ్రావణ పౌర్ణమికే ఎందుకు చేస్తారంటే, ఈ ఉపాకర్మను గురుశిష్యులు కలసి ఏ నదీ తీరం లోనో చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందే నదులన్నీ రజోగుణాన్ని పోగొట్టుకొని స్వఛ్ఛంగా ఉంటాయి అని ప్రతీతి.  నదులకు మామూలుగా రజోగుణ దోషం ఉంటుంది . అందుకే మిగతా మాసాల్లో చేయరు.

 ఈసారి మొన్న త్రయోదశికి నదులకు రజోగుణ నివృత్తి అయింది.

,

కాని, ఇప్పుడు నదుల వద్ద చేసేవారు ఎక్కడో వెతికితే తప్ప దొరకరు.  కాబట్టి, భాద్రపద మాసం లో చేయవచ్చును. 


|| జై జగదంబే ||


Friday, August 7, 2026

ఆచమనము , , నీటి ప్రాశస్త్యము

 ఆచమనము 


 మానవులందరికీ, అన్ని జీవుల లాగానే, ప్రాణము ఉంటుంది కదా... అయితే ఈ ప్రాణానికి అనుక్షణమూ రక్షణ అవసరము. కేవలము అనారోగ్యము, ప్రమాదాలు వంటి వాటి నుండీ మాత్రమే కాదు, ఈ జగత్తులో ఎక్కడ చూసినా మైల, అశౌచము ఉంటుంది. ఆ అశౌచము పదేపదే వచ్చి ప్రాణాన్ని ఆవరిస్తూ ప్రాణశక్తిని క్షీణింపజేస్తూ ఉంటుంది. ప్రాణ శక్తి క్షీణిస్తే మనిషి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నిర్వీర్యుడు , నిర్బలుడు అవుతాడు.   అలా అహర్నిశలూ క్షీణించే ప్రాణశక్తిని  కాపాడుటకు చేసే క్రియయే, " ఆచమనము " . ఈ ఆచమనము వలన సర్వకాలాల్లోనూ వచ్చే సాధారణ  అశౌచము నివారణ అవుతుంది. 


కాబట్టి, శరీరాన్ని వస్త్రాలు కప్పి రక్షణ ఇచ్చినట్టే,  ఆచమనము అనేది ప్రాణాన్ని కప్పి రక్షణ ఇస్తుంది. 

ఇప్పుడు ఆచమనము ఎలా చేయాలి,  ఆచమనము ఎప్పుడెప్పుడు చేయాలి,  అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకము యెప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాము. 


నిజానికి ఏ వర్ణము వారైనా సరే, ఎటువంటి శుభకార్యము గానీ, అపర కార్యము గానీ చేసినా, అందులో ఈ ఆచమనము అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రతి కార్యానికీ మొట్ట మొదట ఆచమనము చేయాలి, అది కూడా రెండు సార్లు. మొట్టమొదట చేసే ఆచమనము రెండు సార్లు చేయాలి.  ఇది చాలా మంది పురోహితులకే తెలియదు.  ఏ ప్రయోగ పుస్తకము చూసినా, " ద్విరాచమ్య " అని మొదట ఉంటుంది.  అంటే,’ రెండు సార్లు ఆచమనము చేసి, ’  అని అర్థము. 


ఆచమనము అంటే మరేమో కాదు, దోసిలిని ఆవు చెవి ఆకారములో చేసి, అందులో మినపగింజ మునిగే అంత స్వఛ్ఛమైన నీరు పోసి త్రాగుట! అదీ, మంత్ర పూర్వకముగా!! 

దోసిలిని ఆవుచెవి ఆకారముగా చేయుట ఎలా? 

కుడి చేతి బొటనవేలిని  మధ్యవేలు, ఉంగరపు వేళ్ళ కిందుగా అరచేతిలోకి మడచి పెట్టి, ఆ బొటన వేలిని కుడి చూపుడు వేలితో నొక్కిపట్టి ఉంచి, మిగతా మూడు వేళ్ళను కలిపి, కొద్దిగా పైకి వంచితే అప్పుడు అరచేయి ఒక దొన్నెలాగా తయారు అవుతుంది. ఇది చూచుటకు గోకర్ణము --అంటే ఆవు చెవిలాగా కనపడుతుంది.  ఇలా చేసిన తర్వాత, అందులో ఒక్కొక్కసారి నీరుతీసుకొని, బొటనవేలి క్రింది భాగము నుండీ, మణికట్టు కలిసే చోటు నుండీ,[ దీన్నే బ్రహ్మ తీర్థము అంటారు . తీర్థాలు వేర్వేరు ఉన్నాయి , అవి ముందు చదువుతారు ]  అరచేతిలోని నీటిని త్రాగవలెను. అది కూడా మంత్ర పూర్వకముగా!! --  ఇలా మూడుసార్లు నీరు త్రాగాక, 


ఆచమనము అంటే కేవలము నీరు త్రాగుట మాత్రమే కాదు, గనక,  మిగిలిన మంత్రాలతో వేళ్ళను తడి చేసుకుంటూ, శరీరములోని ఒక్కొక్క భాగాన్నీ తాకవలెను. ఇదంతా చేస్తే ఆచమనము పూర్తి అయినట్టు.   శరీరములోని ఒక్కొక్క భాగాన్నీ తాకవలెను అని చెప్పుకున్నాము కదా,  ఏ మంత్రముతో / లేక నామముతో ఏ భాగాన్ని తాకవలెను అనేది ఇప్పుడు తెలుసుకుందాము. 


అయితే, ఆచమనములో వేర్వేరు రకాలు ఉన్నాయి. ఏ రకపు ఆచమనములో ఏ మంత్రాలు/ నామాలు వాడవలెను అనేది ముందు తెలుసుకోవాలి. 


గమనిక : ఈ ఆచమనము విధానము యజుర్వేదము ననుసరించి వ్రాయబడినది. ఋగ్వేదములోను, ఇతర వేదములను అనుసరించేవారికి స్వల్పమైన తేడాలు ఉంటే ఉండవచ్చు  అంతేకాక, ప్రాంతీయ ఆచారాలను బట్టి కూడా కొన్ని తేడాలు ఉండచ్చు.


ఆచమనము ౩ రకాలు


౧.  శ్రుత్యాచమనము   [ దీన్నే  శ్రౌతాచమనము  అంటారు ]

౨.  స్మృత్యాచమనము [దీన్నే  స్మార్తాచమనము  అంటారు ]

౩.  పురాణాచమనము.. 


ఈ మూడు ఆచమనాలూ సంధ్యావందనములో చేయవలసి ఉంటుంది.  మిగతా కార్యాల్లో శ్రౌతాచమనము స్మృత్యాచమనము మాత్రమే చేస్తాము. కొన్ని కార్యాల్లో పురాణాచమనము కూడా చేస్తారు.  కేవలము సంధ్యావందనపు మొదట, చివర మాత్రమే శ్రౌతాచమనము  వస్తుంది కాబట్టి, చాలా మటుకు వాడుకలో శ్రౌతాచమనము బదులుగా స్మృత్యాచమనమే అనేకులు చేస్తారు. [ రెండూ వేర్వేరు కాబట్టి, అయోమయమును తప్పించుటకో, లేక శ్రౌతాచమనము అంటే తెలియకో ..]


సంధ్యావందనము మొదట్లో మరియూ చివర  మాత్రము శ్రౌతాచమనము చేయవలెను అని చెప్పుకున్నాము కదా,  కాని , స్మృత్యాచమనము సంధ్యావందనము అంతటా చేయవచ్చు...నిషేధము లేదు కాబట్టి మామూలుగా అందరు సంధ్యావందనము మొదట్లో అయినా, మధ్యలో అయినా, చివర్లో అయినా స్మృత్యాచమనమే చేస్తారు. అలా వాడుక అయింది. 



ముఖ్య గమనిక : ఈ ఆచమనములో నీళ్ళు చల్లుకోవడము, అంగాలను స్పృశించడము వంటివి  కుడిచేతితో, కుడి చేతి వేళ్ళతో నే   చేయాలి. ఎడమ చేతిలో కేవలము ప్రత్యేకముగా చెప్పినచోట నీరు పోసుకోవడము, ఉద్ధరిణ పట్టుకోవడము మాత్రమే చేయాలి. 


శ్రౌతాచమనము :-   ఈ శ్రౌతాచమన విధి అనేకులకు తెలిసియుండక పోవచ్చు .  ఇందులో కూడా నీరుత్రాగుట, అవయవములను తాకుట, నీరు చల్లుకొనుట వంటివి ఉన్నాయి. [ శ్రౌతాచమనములో విష్ణు నామాలు కాక, గాయత్రి మంత్రములోని మొదటి మూడు పాదాలతో మూడు సార్లు నీరు తాగుతారు.. ఇది చాలామటుకు వాడుకలో లేదు.  ]


అయితే ఒక్కోదాన్ని ఒక్కో ’ అంగము ’ గా పిలిస్తే [ ఇది కేవలము అర్థము కావడానికి ఇచ్చిన ఉదాహరణ ]  శ్రౌతాచమనములో మొత్తము ఇరవై నాలుగు అంగాలు ఉన్నాయి . అవి ఇలాగు ఉంటాయి 




౧. ఓం తథ్స॑వి॒తుర్వరే॑ణ్య॒గ్గ్॒ స్వాహా॓ ||

[ అని ఒకమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]


౨. భర్గో॑దే॒వస్య॑ ధీమహి॒ స్వాహా॓ |


[ అని రెండవమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]


౩.ధియో॒యోనః॑ ప్రచో॒దయా॒త్ స్వాహా॓ |


[అని మూడవమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]


౪. ఆపో॒హిష్టా మ॑యో॒ భువ॑ః | ౫. తాన॑ ఊ॒ర్జే ద॑ధాతన |


[ ౪, ౫ ఈ మంత్రాలతో రెండు అరచేతులు నీటితో తుడుచుకొన వలెను ]


౬. మహే రణా॑య చక్ష॑సే |  ౭. యోవ॑శ్శి॒వత॑మో॒ రస॑ః|


[ ౬, ౭ ఈ మంత్రాల చేత ఎడమచేతిలో పోసుకొనిన నీటిలో [ లేదా ఉద్ధరిణలో పోసుకొని ] కుడి చేతి బొటన వేలు ముంచి ఎడమనుండి కుడికి పై పెదవి ఒకసారి, కింది పెదవి ఒకసారి వేర్వేరుగా తుడుచుకోవలెను.]


౮. తస్య॑భాజయతే॒హన॑ః | ౯. ఉ॒శ॒తీరి॑వమా॒తర॑ః|


[ ౮,౯  ఒక్కో మంత్రముతో ఒక్కోసారి ఎడమచేతిలోని నీటిని దర్భలతో కానీ వ్రేళ్ళతో కానీ శిరముపై చల్లుకొనవలెను.]


౧౦ తస్మా॒ అర॑ంగ మామవః | [ ఎడమ చేతిలోని నీటిని కుడి చేతితో తాకి పైన చల్లుకొనవలెను. 


౧౧ యస్య॒  క్షయా॑య॒ జిన్వ॑థ | [ ఎడమ చేతిలోని నీటిని కుడి చేతితో తాకి రెండు పాదముల మీద చల్లుకొనవలెను ]


౧౨. ఆపో॑జ॒నయ॑థాచనః | [ ఎడమ చేతిలోని నీటిని శిరముపై చల్లుకొనవలెను 


౧౩ ఓం భూః || [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి వ్రేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను ]


౧౪ ఓం భువః || [ బొటన వేలు, చూపుడు వ్రేళ్ళతో ఎడమ ముక్కును తాకవలెను ]


౧౫ ఓగ్ం సువః || [ బొటన వేలు, చూపుడు వ్రేళ్ళతో కుడి ముక్కును తాకవలెను ]


౧౬. ఓం మహః || [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ కంటిని తాకవలెను ]


౧౭. ఓం జనః || [ [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో కుడి కంటిని తాకవలెను ]


౧౮. ఓం తపః || [ [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ చెవిని తాకవలెను ]


౧౯. ఓగ్ం స॒త్యం  || [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో కుడి చెవిని తాకవలెను ]


౨౦. ఓం తథ్స॑వి॒తుర్వరే॑ణ్యమ్ ||  [ బొటన వేలు, చిటికెన వ్రేళ్ళతో నాభిని ( బొడ్డు ) తాకవలెను ]


౨౧. భర్గో॑దే॒వస్య॑ ధీమహి॒  | [ కుడి అరచేతితో హృదయమును తాకవలెను ]


౨౨.ధియో॒యోనః॑ ప్రచో॒దయా॒త్  [ కుడి చేతి వ్రేళ్ళతో శిరసును తాకవలెను ]


౨౩. ఓమాపో॒జ్యోతీ॒ రసో॒మృతం॒ బ్రహ్మ [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి ఎడమ భుజమును తాకవలెను ]


౨౪. భూర్భువ॒స్సువ॒రోమ్  [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి కుడి భుజమును తాకవలెను ]


ఇదే శ్రుత్యాచమనము . ఈ శ్రుత్యాచమనమును సంధ్యావందనములో గాయత్రీ మంత్ర జపానికి ముందు, వెనుక చేయవలెను. 




స్మృత్యాచమనము



ఇందులో కేశవాది విష్ణు నామాలు చెపుతూ చేస్తారు.  నిజానికి ఇందులొ ౨౪ నామాలు ఉంటాయి .. మొదటి మూడు నామాలతో నీరు తాగుతారు.. మిగతా నామాలతో శరీరములోని ఆయా భాగాలు స్పృశిస్తారు. [ ఈ స్పృశించడము  పురాణాచమనము లో ముఖ్యము ] 


ఇది ఇలా చేస్తారు 


౧. కేశవాయ స్వాహా | ౨. నారాయణాయ స్వాహా | ౩. మాధవాయ స్వాహా |


( అని ఉచ్చరించి , కుడిచేతితో ఒక్కొక్క సారి ఉద్ధరిణె తో బ్రహ్మ తీర్థమున నీరు త్రాగవలెను ) 


౪. గోవిందాయ నమః  |

( అని ఉచ్చరించి కుడి అర చేతితో ఎడమ అరచేతిని తుడుచుకొనవలెను )


౫. విష్ణవే నమః [ఎడమ అర చేతితో కుడి అరచేతిని తుడుచుకొనవలెను ]

౬.మధుసూదనాయ నమః        [ఎడమ చేతిలో నీరు పోసుకొని , ఆ నీటితో పై పెదవిని కుడి చేతితో  కుడి నుండీ ఎడమకు    తుడుచుకొన వలెను 

౭. త్రివిక్రమాయ నమః | [ కింది పెదవిని కుడి చేతితో కుడి నుండీ ఎడమకు తుడుచుకొన వలెను ]

౮. వామనాయ నమః [ కుడి చేతితో నీళ్ళు శిరస్సుపైన చల్లుకొన వలెను ] 

౯. శ్రీధరాయ నమః        [ కుడి చేతితో నీళ్ళు శిరస్సుపైన చల్లుకొన వలెను  ]

౧౦. హృషీకేశాయ నమః        [ ఎడమ చేతి పైన నీరు చల్లుకొన వలెను.]

౧౧. పద్మనాభాయ నమః [ కుడి చేతితో పాదముల పై నీరు చల్లుకొన వలెను ]

౧౨. దామోదరాయ నమః [ తలపైన నీరు చల్లుకొన వలెను ]

౧౩. సంకర్షణాయ నమః [ అయిదు వేళ్ళతో గవదను తాక వలెను ]

౧౪. వాసుదేవాయ నమః [ ఎడమ ముక్కును తాక వలెను ]

౧౫. ప్రద్యుమ్నాయ నమః [ కుడి ముక్కును తాక వలెను  ]

౧౬. అనిరుద్ధాయ నమః [ ఎడమ కంటిని తాక వలెను ]

౧౭. పురుషోత్తమాయ నమః [ కుడి కంటిని తాక వలెను ]

౧౮. అధోక్షజాయ నమః [ ఎడమ చెవిని స్పృశించ వలెను ]

౧౯. నారసింహాయ నమః [ కుడి చెవిని స్పృశించ వలెను ]

౨౦. అచ్యుతాయ నమః [ నాభిని స్పృశించ వలెను ]

౨౧. జనార్దనాయ నమః [ కుడి హస్తాగ్రముతో హృదయమును స్పృశించ వలెను 

౨౨. ఉపేంద్రాయ నమః [ శిరస్సును వేళ్ళతో స్పృశించ వలెను ]

౨౩. హరయే నమః     [ ఎడమ భుజమును స్పృశించ వలెను ]

౨౪. శ్రీ కృష్ణాయ నమః         [ కుడి భుజమును స్పృశించ వలెను ]


ఇదే స్మృత్యాచమనము 


ఇక పురాణాచమనము 


సంధ్యావందనములో కాక, మిగతా అనేక సందర్భాలలో ఆచమనము చేయాల్సి ఉంటుంది..[ సంధ్యావందనము చివరిలో కూడా ఈ పురాణాచమనము చేయవచ్చు , అంతేకాక, భోజనం తర్వాత , అశౌచ గృహానికి వెళ్ళివచ్చిన తర్వాత , తాక కూడనివి తాకినప్పుడు--] ఆ సందర్భాలలో  ఈ పురాణాచమనము చేస్తారు..


ఇందులో స్మృత్యాచమనము వలె కేశవ నామాలు , అంగ స్పర్శ ఉంటుంది.  తేడా ఏమీ ఉండదు.  మరి యెందుకు రెండు పేర్లు ఉన్నాయి అంటే,


కొన్ని పుస్తకాలలో పైన చెప్పిన స్మృత్యాచమనమే నిజానికి పురాణాచమనము అనీ, నిజమైన స్మృత్యాచమనములో మంత్రాలు కానీ నామాలు కానీ ఉండక, కేవలము ఆయా అంగాలను స్పృశించాలి అని ఉంది. ఇది కొంత అయోమయాన్ని కలుగచేస్తుంది కాబట్టి,  స్పష్టత కొరకు, స్మృత్యాచమనము, పురాణాచమనమూ ఒకే లాగే చేసినా దోషము లేదని చెప్పవలసి ఉంటుంది. 


ఈ పురాణాచమనము గురించి ఎక్కువ సమాచారము ఉన్నవారు ఇవ్వవచ్చును. 


మరియొక విషయము 


ఆచమనములో శుద్ధమైన, నురుగు లేని నీటినే వాడాలి. బావి నీరు, సరస్సు, నదీ జలాలు శ్రేష్టమైనవి, వడగట్టి వాడవచ్చును. ఇప్పుడు కొళాయిలో వచ్చే నీటినే వాడవలసి వస్తోంది. కొందరు, శుద్ధత కొరకు దర్భలు/ లేక తులసీ దళములు వేసిన నీటిని వాడుతారు 


అసలు, మన క్రతువులలో నీటి ఉపయోగము ఎందుకు?   నీరు లేకుండా చేయలేమా? 


నీళ్ళు, నీరు, అంబువులు, సలిలము, జలము, తోయము, ఉదకము --వీటిలో కొన్ని సంస్కృత పదాలు.  ఆపః అంటే కూడా సంస్కృతం లో నీరే. ఈ ఆపః అనే పదం వేదంలో ఎక్కువగా కనబడుతుంది.  పంజాబ్ అంటే పంచ ఆపః  అని --జీలమ్ , చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్  ఐదు నదులు ప్రవహించే ప్రదేశము కాబట్టి పంజాబ్ అయింది ఇది విషయాంతరము...


సాధారణముగా నీరు అనేది మన దప్పిక తీర్చుటకు ఉంది ---అని మనం అనుకుంటాము.  నీరు తప్పకుండా దాహము తీరుస్తుంది, అంతేకాదు, శరీరానికి అలసట పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది, ఆకలి కూడా తీరుస్తుంది.  కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా హిమాలయాలలోని ఊటలలో దొరికే నీరు రోజుకు ఒకసారి తాగితే చాలు, ఆకలి దప్పులు ఉండవు,  స్వచ్చమైన నీరు రోగాలను రానివ్వదు, ఉన్నవాటిని పోగొడుతుంది కూడా. 


శరీరానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని జీర్ణము గావిస్తుంది,  మనో వ్యాకులతను పోగొడుతుంది.  అందుకే కొన్ని నదుల జలాలను అమృతమయము అని పిలుస్తారు. 


తియ్యటి నూతి నీళ్ళు, త్రిదోషాలను హరిస్తాయి, అగ్ని దీప్తిని [ ఆకలిని  కానపుడు ] ఆరోగ్యాన్ని ఇచ్చును.  అన్నిరోగాలకూ పథ్యమైనవి మంచినీళ్ళు. 


సరే, ఇవన్నీ అందరికీ తెలిసే ఉండును... ఇంకా తెలియనివి యేమంటే, శుద్ధమైన జలానికి జ్ఞాపక శక్తి ఉంటుంది.  అది భావాలను కలిగించగలదు, ఒకరి నుండీ ఇంకొకరికి అనుభూతులను, భావాలను, ఉద్దేశాలను కూడా పంచగలదు. 


నీరు ,తనలో సమాచారాన్ని నిలువ ఉంచుకుంటుంది. ఆ సమాచారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి పంచాలో , తెలిసిన తెలివి ఉంది. 


నీటిలో స్నానము చేసినపుడు, శుద్ధిపరచుట మాత్రమేకాక, మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  మనసును తేలిక పరుస్తుంది. భయము, విహ్వలత, ఆందోళన వంటివి ఉంటే పోగొడుతుంది.


సంధ్యావందనములో నీటిని అనేకరకాలుగా ఉపయోగిస్తాము.

మొదట ఆచమనము చేసినపుడు, అంతఃశ్శుద్ధి కోసము, మార్జనము చేసినపుడు బాహ్యశుద్ధి తోపాటు చిత్తశుద్ధి కోసము, అర్ఘ్యము వదలినపుడు చెప్పే ,మంత్రము వలన మన సందేశాన్ని సూర్యుడికి అందజేస్తుంది. మన సందేశము నీటికి చేరి, నీటి నుండీ సూర్య కిరణాలకు చేరుతుంది. 


తర్పణాలు వదిలేటప్పుడు, ఆయా దేవతలకు హవ్య కవ్యాలు గామారి, వారి సూక్ష్మ శరీరాలకు క్షుత్పిపాసలు తీరుస్తుంది. మంత్రించిన నీటిని శరీరభాగాలకు తాకిస్తే, ఆయా భాగాలలోని చెడు తత్వాలు[ గుణాలు, లేక చెడు శక్తి ] వదలి  స్వఛ్ఛంగా చేస్తుంది. 


పూజలలో దేవతలకు ఏ ఉపచారము చేసినా, దానితోపాటు ఉద్దరిణె నీరు వదలి, ’ సమర్పయామి ’ అంటాము. అప్పుడే అది ఆయా దేవతలకు చెందుతుంది.  నైవేద్యములో నీటిని  ప్రోక్షణకు, ఆచమనీయానికి, పరిషేచన కు వాడుతాము. మనము చేసే నివేదన అమృతమయము అవనీ--అని [ అమృతోపస్తరణమసి ] భావిస్తే అది అమృతమే అవుతుంది.


పుణ్యాహ వాచనము చేసిన నీరు అతి శ్రేష్టమైనది. అది గంగ వలె సర్వ పాపాలనూ పొగొడుతుంది, అందుకే ఆ నీటిని గృహ,  భూ, భాండ, పాక శుద్ధికి ఉపయోగిస్తారు. 


శ్రాద్ధాలలో నీరు లేకపోతే ఆ కార్యమే లేదు. ఆచమనాలు, తర్పణాలు, దానాలు, ఔపోశనాలు, పరిషేచనాలు, హోమాలలో హోమకుండాన్ని పరిస్తరణ చేసేదానికి, చివరికి అగ్నిని శుద్ధి చేయడానికి కూడా నీరే వాడుతాము. 


ఏదైనా దానము ఇచ్చినపుడు, మన ఉద్దేశాన్ని నీటిలోకి ప్రవేశింపజేసి, ఆ నీటిధారతో అవతలివారికి ఆ దానము అందేలా చేస్తాము.  అంతేకాదు, నీటిని దానము చేయడము వలన కూడా ఎంతో గొప్ప ఫలము లభిస్తుంది. అందుకే ఎండాకాలంలో చలివేంద్రాలు కట్టిస్తారు. భావులు, చెరువులు తవ్వించుట [ దీన్ని ఇష్టాపూర్తం అంటారు ] గొప్ప పుణ్య కార్యము . వసంత నవరాత్రుల్లో బ్రాహ్మడికి ఉదక కుంభము దానము చేస్తే విశేష ఫలితము.


 ఋషులు, మునులు శాపాలు ఇచ్చేటప్పుడు కూడా నీటికి ఆ శాపోద్దేశాన్ని ఆపాదించి, మంత్రించి పైన చల్లుతారు


మైల పోగొట్టుకొని పవిత్రులు కావడానికి కూడా మంత్రోచ్చారణతో సంప్రోక్షణ చేస్తారు. 


దేవుడికి అభిషేకించిన నీరు ఎంతో పవిత్రమైన శక్తిని పొంది ఉంటుంది. అందుకే ఆనీటిని తీర్థముగా ఇస్తారు. ప్రోక్షణ కు కూడా వాడుతారు. 


ఇక పుష్కరాలు వంటి సమయాల్లో నదుల నీరు కొత్త శక్తిని కలిగి ఉంటాయి.  ప్రకృతిలోని సకారాత్మక శక్తులన్నీ ఆ నీటిలో చేరుతాయి.  అందుకే పుష్కరాల్లో నదీస్నానం ఎంతో పాపహరము, కొత్త శక్తిని కూడా ఇస్తుంది.


నీళ్ళు అనేక రకాలు. అన్ని నీళ్ళ కన్నా గంగానది నీరు ఎంతో పవిత్రమైనది. గంగ పేరు విన్నా, తలచుకున్నా, పలికినా, పవిత్రతను ఇస్తుంది. గంగా స్తోత్రము చేసేవారు, ఎక్కడున్నా గంగా సమీపములో ఉన్నవారే.  వేదపారాయణము, యజ్ఞయాగాదులు ,క్రతువులు చేసిన ఫలము గంగా స్తోత్రముతో వస్తుంది. శ్రాద్ధాలలో అభిశ్రవణ మంత్రాలతో పాటూ గంగా స్తోత్రము చదివితే ఆ పుణ్యము మనకు అనేక జన్మలలో ఫలాన్ని ఇస్తుంది. 


సన్యాస స్వీకార సందర్భం లో, ఉత్తరాధికారి/ లేదా శిష్య స్వీకార సందర్భంలో నదీస్నానము తప్పనిసరి.  కొన్ని కొన్ని ప్రత్యేక  సందర్భాల్లో  చెరువు, తటాకము వంటివి ఉంటేనే కార్యాలు సిద్ధిస్తాయి... సర్పసంస్కారము వంటివి.


శ్రాద్ధాలలో పిండాలను నీటిలో కలిపే ఆచారము కూడా ఉంది. 

కొన్ని సాంప్రదాయాలలో యతులు మరణిస్తే, జలసమాధి మాత్రమే చేస్తారు 


అలాగే, కొన్ని ఋతువుల్లో, సందర్భాల్లో, గ్రహణాల్లో నీటికి, ముఖ్యంగా నదీజలాలకు రజోగుణము ఆవరిస్తుంది. అప్పుడు ఆ నీటిలో స్నానము చేయరాదు. 

చెడు గుణాలు, చెడు తలపులు ఉన్నవారు ఇచ్చిన నీరు తాగితే మనకు ఆ చెడు ఆవరిస్తుంది. 


అన్నిటికన్నా విశేషము, 

నీటిని ఎప్పుడూ కూడా నిలుచుకొని త్రాగకూడదు. నేల మీదో, కుర్చీ మీదో కూర్చొని మాత్రమే తాగాలి. నిలుచొని తాగితే శరీరములోని వాయువు కీళ్ళ మధ్య చేరి,  మోకాళ్ళ నొప్పులు వస్తాయి.  ఆచమనాలు కూడా ఎప్పుడూ నిలుచుకొని చేయరాదు. మామూలుగా బాసింపట్టు వేసుకొనో, సుఖాసనం లోనో, గొంతుక్కూర్చొనో చేయాలి, తాగాలి. 

తీర్థం తీసుకున్నా, కూర్చొనిమాత్రమే తీసుకోవాలి.


మనిషి నీరు లేకున్నా చనిపోతాడు, నీరు ఎక్కువైనా చనిపోతాడు. 


నీటికి ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. నీరే కదా..అని అలసత వద్దు. 


ఇక, తీర్థములు 


తర్పణము ఇచ్చునపుడు, దేవతలకు, ఋషులకు, పితరులకు వేర్వేరు తీర్థములలో ఇవ్వవలెను. ఇవి కాక, బ్రహ్మ కు ఇచ్చేటప్పుడు ప్రత్యేకము 


దైవతీర్థము  : దేవతలకు ఇచ్చునపుడు, గోకర్ణాకారములో ఉన్న   అరచేతిలోని నీటిని, అరచేయిని కిందికి వాలుగా ఉంచి, వ్రేళ్ళ చివరి భాగముల నుండీ ఇవ్వవలెను


ఋషి తీర్థము : బ్రహ్మయజ్ఞము నందు, అరచేతిలోని నీటినిచిటికెనవేలు చివర , అరచేతిని ఎడమవైపుకు వంచి ఇవ్వవలెను


పితృ తీర్థము : శ్రాద్ధాదులందు, బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య నుండి విడువవలెను


బ్రహ్మ తీర్థము : సంధ్యావందనాది శుభ, అశుభ కార్యములందు ఆచమనము చేయునపుడు అరచెయ్యి, మణికట్టు కలిసే బొటనవేలు కింది భాగము నుండీ నీరు త్రాగవలెను. బ్రహ్మకు తర్పణము ఇచ్చినా కూడా అదే చోటనుండి, అరచేతిని కొద్దిగా నిలువుగా పెట్టి ఇవ్వవలెను 


పైన చెప్పినదంతా, సంధ్యావందనములో మొదటి మెట్టు అయిన ఆచమనము గురించి మాత్రమే!!  దీనికే ఇంత విశేషము ఉంది, ఇక మొత్తం సంధ్యావందనపు  విలువ, ప్రాశస్త్యము చెప్పనవసరము లేదు. 


సంధ్యావందనము లేనిదే మరి యే ఇతర శ్రౌత కర్మలూ చేయకూడదు.  మరి ఆయా శ్రౌత కర్మలు ఎంత ఉత్కృష్టమైనవి?


సంధ్యావందనము అనేది సముద్రములో కాలి బొటనవేలి గోరు ముంచినంత చిన్న విషయము. మొత్తము వేదరాశి లోను, ఆ వేదరాశి ని ఉపయోగించి చేస్యే కర్మలు, తంతులు, క్రతువులు, యజ్ఞ యాగాదులు వంటి వాటిని అధ్యయనము కాదు, కేవలము తెలుసుకోవాలంటేనే మనిషి జన్మము సరిపోదు. అలాంటప్పుడు వాటిని కూలంకషముగా చిన్నప్పటి నుండీ అధ్యయనము చేసి, ఆయా క్రతువులను నిర్వర్తిస్తూ, పౌరోహిత్యము చేయడము మామూలు విషయమా?  అవి చేసేవారికి ఇవ్వవలసిన విలువ, గౌరవము ఇస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలెను. 


/ శుభమ్ భూయాత్ /