దార్శనికులు, మంత్రద్రష్టలు అయిన మన ప్రాచీన ఋషులు కనుగొన్న దర్శనములే వేదముగా పరిణమించినవి. మానవాళి కి కావలసిన సర్వమునూ సంపాదించి ఇవ్వగల విద్యయే వేదవిద్య.
|| ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోః అలౌకికమ్ ఉపాయమ్ యో గ్రంథో వేదయతి స వేదః
మానవునికి జీవితములో అడుగడుగునా అవసరమయ్యే / కావలసిన అన్ని కోరికలను తీర్చుకొనుటకు, ఇష్టములేని విషయాలను / సమస్యలను పరిహరించే విధి విధానాలను యే గ్రంథము చెపుతుందో అదే వేదము. గ్రంథమనగా ఇది ఎవరో వ్రాసినది కాదు, అపౌరుషేయము అన్న విషయము సర్వులకూ తెలిసినదే.
.
మరి ఇటువంటి సులభోపాయము ఉన్నపుడు, లోకములో ప్రజలు ఇన్ని కష్టాలెందుకు పడుతున్నారు?
కారణము, అజ్ఞానము, ఉదాసీనత.
ఆది శంకరులు చెప్పినట్టు, ప్రజలకు అంతా మంచి జరగాలి, అన్నీ లభించాలి అనే కోరిక ఉంటుంది కాని, వాటిని సంపాదించే కర్మలను చేసేందుకు మనసు పుట్టదు. అలాగే, ఎవరికీ సమస్యలు, ఆపదలు , కష్టాలు ఇష్టము ఉండవు, వాటిని వద్దనుకుంటారు కాని, ఆ సమస్యలు, ఆపదలు, కష్టాలు కలిగించే కర్మలే చేస్తారు.
దీనికి కారణాలు, అజ్ఞానము, ఉదాసీనతలు మాత్రమే.
.
ప్రస్తుత కాలములో ద్విజులు , ముఖ్యముగా బ్రాహ్మణులు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నారు, ప్రభుత్వాలనుండీ గాని, సమాజం నుండీ గాని వారికి ఎటువంటి ఆదరణ, ప్రోత్సాహము, సహాయమూ లేవు. కారణమేమంటే, వారికి కావలసినవి పొందే ఉపాయము/ శక్తి వారి దగ్గరే ఉందని తెలియక, ప్రభుత్వం మీదా ,సమాజం మీదా ఆధారపడటమే.
ఇది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. దీన్ని నమ్మని వారు చదవటం ఇక్కడే ఆపి, వేరే పని చూసుకోవచ్చు. అలాగే, నమ్మినా కూడా కేవలం ’ బాగుంది ’ అని చెప్పి, ఒక లైకు వేసి వెళ్ళిపోయేవారు కూడా ముందుకు చదవకండి. ఎందుకంటే అటువంటి వారు ఇది చదువుటకు అపాత్రులు. అపాత్రులకు ఇచ్చే జ్ఞానము కూడా ఇచ్చిన వారిని బాధిస్తుంది. కాబట్టి, దీని మీద పూర్తి విశ్వాసము ఉండి, ఆలస్యమైనా సరే ఆచరించగలము అనుకుంటేనే పూర్తిగా చదవండి.
.
సామవేదపు బ్రాహ్మణము లోని ఒక మంత్రము ఇలాగుంది
|| దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||
ఈ జగత్తు అంతా భగవంతుని[ దేవతల ] ఆధీనం లో ఉండి నడుస్తున్నది. ఆ దేవతలు మంత్రాధీనులు,అనగా మంత్రముల ఆధీనములో ఉంటారు. ఆ మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనములో ఉన్నాయి కాబట్టి మంత్రమును సిద్ధింపజేసుకున్న బ్రాహ్మణుడే మనకు దేవత.
.
బ్రాహ్మణులను దేవతలుగా అంగీకరించే వారు చాలా అరుదుగా ఉంటారు. ఒకరి అంగీకారముతో ఎవరికీ పనిలేదు, కనీసం బ్రాహ్మణులైనా మంత్రాన్ని అధీనం లో ఉంచుకుంటున్నారా?
.
ప్రస్తుతకాలములో బ్రాహ్మణులు, ముఖ్యంగా పురోహితులు, వేద విదులు, ఆచార్యులు, ఇతర వృత్తులలో ఉన్న బ్రాహ్మణులు అనేక వివక్షలను ఎదుర్కుంటున్నారు. అవమానింపబడుతున్నారు. సమాజం లో ఒక విలువ అంటూ లేకుండా ఉదరపోషణకై పడరాని పాట్లు పడుతున్నారు. అంతా స్వయంకృతాపరాధము. దీనికి ఇతరులను, ప్రభుత్వాలను బాధ్యుల్ని చేసి నిందించే అవసరం ఎంతమాత్రమూ లేదు. సర్వశక్తులనూ సంపాదించుకోగల విద్యలను చేజేతులా దూరం చేసుకొని అందనివాటికై అర్రులు చాచటము కన్నా మూర్ఖత్వము ఇంకోటి ఉండదు. ప్రభుత్వాలను, ప్రజలను శాసించగల స్థాయి నుండీ వారి దగ్గర అడుక్కునే స్థాయికి తమకు తామే దిగజారినారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు.
.
సమాజానికి ఆదర్శంగా ఉంటూ, ప్రజల హితమును కోరి అనుష్టానాలు చేస్తూ దారి చూపవలసినవారు కేవలం పొట్టకూటి కోసము చేయకూడని పనులు చేస్తున్నారు. అలా ఎవరైనా లేరు అంటే, మంచి స్థితిలో ఉన్నారు అంటే, వారు, వారి పూర్వీకులు యే జన్మలోనో చేసుకున్న పుణ్యఫలము మాత్రమే. మరి , మన భావి తరాలకు కూడా ఆ పుణ్య ఫలము వద్దా? వారు కడగండ్ల పాలై నశించిపోవలసినదేనా? దీనికి సమాధానము, పరిష్కారము, బ్రాహ్మణుల వద్దే ఉంది.
.
సరే, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని సన్మార్గములో వెళ్ళాలనుకొనే వారికి ఉపాయం ఏది?
వేదములో చెప్పిన కర్మలను ఆచరించుటే.
.
ఇంతవరకూ వ్రాసినవి అందరికీ తెలిసినవే. నేను కొత్తగా ఏమీ చెప్పలేదు. నేను చెప్పదలచుకున్నది అతి చిన్న అంశము మాత్రమే.
.
తమ తప్పు తెలుసుకొని తిరిగి వైదిక జీవనములోనికి వచ్చేవారికి కొన్ని సమస్యలు/ అవరోధాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, వారు వైదిక కర్మలు చేయాలనుకున్నా, చేసినా, అవి ఫలించాలంటే మొదట వాటిని చేయుటకు సరైన అర్హత సంపాదించుకోవాలి.
శ్రావణ పౌర్ణమినాడు [ యజుర్వేదులు ] ఆచరించబోయే " ఉపాకర్మ " యొక్క ప్రాశస్త్యము, ఔన్నత్యము, విలువ, ప్రాముఖ్యత తెలుసుకుని పాటిస్తే గాని ఆ అర్హత రాదు.
ఉపాకర్మ అంటే కొత్త ఉపవీతాలు ధరించటం --అనే స్థాయికి దిగజారిన మనం దాని అర్థం తెలుసుకొని, యోగ్యత, పాత్రత, సంపాదించుకోవాలి.
.
మనము ఏడాది పొడుగునా ఎన్ని క్రతువులు, ఎన్ని కర్మలు చేయాలన్నా, మనకు " అధికారం " అనేది ఒకటుండాలి. ఆ అధికారం సంపాదించి ఇచ్చేదే ఉపాకర్మ అనుష్టానము.
.
వేదాన్ని అధ్యయనము చేయడము, మధ్యలో విరామము తీసుకోవడము , తిరిగి అధ్యయనము చేయడము ,,, అనవరతముగా చేయవలసిన విధులు.
అధ్యయనము మొదలు పెట్టడాన్ని ఉపాకర్మ అనీ, విరామము తీసుకోవడాన్ని ’ ఉత్సర్జనము ’ అనీ అంటారు. ఉపాకర్మ కు సంబంధించిన ఆ వివరాలన్నీ నా బ్లాగులో ముందే ఉన్నాయి. కింద లంకె ఇస్తున్నాను... చూడవచ్చు.
ఉపాకర్మలో ముఖ్యముగా చేయవలసినవి, వేదమంత్ర ద్రష్టలు అయిన కాండ ఋషులకు హోమము, జపము, దేవ ఋషి పితరులకు తర్పణములు.
.
వీటిలోని ముఖ్యమైన ఒక అంశమేమంటే, సంవత్సరము పొడుగునా మనము చేసిన అనేక పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడము. దీన్ని చాలామంది అంతగా పట్టించుకోరు. కాని, ఇది చేయకపోతే మనకు వైదిక కర్మలు చేసే అధికారము లేక, ఒకవేళ చేసినా అవి నిష్ఫలమవుతాయి. మొత్తం ఉపాకర్మ తంతులో కాండ ఋషి పూజ, [ హోమము, జపము, తర్పణము ఇత్యాదులు] బ్రహ్మ యజ్ఞము, ప్రాయశ్చిత్తము ఇవి ముఖ్యమైనవి. నూతన యజ్ఞోపవీత ధారణ అనేది కేవలము ఒక చిన్న అంశము. దానిని ఎప్పుడైనా చేయవచ్చును. సంవత్సరములో ఎన్నిసార్లైనా చేయవచ్చును. కాని ఉపాకర్మ అంటే, మిగిలిన ముఖ్యమైన వాటిని వదిలేసి కొత్త జంధ్యము ధరించడము అనే అర్థము ఎవరైనా కావాలని తెప్పించి తప్పుదారి పట్టించారో లేక, మూర్ఖంగా మనమే అలా అనుసరిస్తున్నామో గాని, ఇది ద్వితీయ ప్రాధాన్యత కలది. సంవత్సరం పొడగునా అనేక సందర్భాలలో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఉపాకర్మలో కూడా అది ఒక చిన్న అంశమే. హోమములో కాండఋషులకు నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాము. ఆ సమర్పించే ముందు మనము చేసుకున్న పాపాలను ప్రక్షాళనము చేసుకోవాలి. దానికి, " కామో కార్షీత్, మన్యురకార్షీత్ " మంత్రాలతో హోమము చేయడముతో పాటు ఆ మంత్ర జపం చేయాలి. ఇదే ప్రాయశ్చిత్తం. ఇది చేయకపోతే ఒక వేద విదుడు సంవత్సరం పొడుగునా చేసిన పాపాలు తొలగక పోగా, ఇతర శుభ కర్మల ఫలం పొందకుండా పోతాడు.
ఎందుకంటే ఉపాకర్మలో పై మంత్ర జపం ద్వారా మనము కొన్ని పాపాలు పోగొట్టుకుంటాము. మైల పోయినవాడు, గ్రహణము వీడిన వాడు, పాపం పోగొట్టుకునేవాడు ఎలాగైతే పునీతులు అవుతారో, ఉపాకర్మ చేసిన వాడుకూడా పునీతుడు అవుతాడు, సందర్భము కాబట్టి మనము కూడా కొత్తది ధరించాలి. పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించటం శాస్త్ర సమ్మతమే గాని, అది మాత్రమే కర్తవ్యము అనుకుంటే పొరపాటు.
.
ఇంతకీ, ప్రాయశ్చిత్తములో భాగముగా ఉపాకర్మలో మనము చెప్పే మంత్రాల అర్థం యేమిటి?
.
మనము దేవతల యెడ చేసిన పాపాలు[ న్యూనాతిరిక్తాలు, లోపదోషాలు],
మనుషుల పట్ల చేసిన పాపాలు [ ధిక్కరించడం, అవమానాలు చేయడము, అన్నదానము చేయకుండా ఉండటము, ]
పితరుల పట్ల చేసిన పాపాలు- పితృ కర్మలు చేయకపోవడము, వంటివి,
తన పట్ల తానే చేసిన పాపాలు [ మద్య మాంసాలు తీసుకోవడము, పర స్త్రీ గమనము, తినరానివి తినడము, అబద్ధాలు చెప్పడము వంటివి],
తనవారు చేసిన పాపాలు[ భార్యా పిల్లలు చేసిన పాపాలు ]
ఇవికాక, సామూహికంగా కొందరు చేరి చేసిన అకృత్యాలు --ఒక కుటుంబానికో, జాతికో, ఊరికో చేసిన ద్రోహం మొ|| నవి. ఈ విధంగా పగలూ రాత్రీ మనకు తెలిసో, తెలియకో అనేక పాపాలు చేస్తుంటాము.
నిద్రలో కూడా పాపాలు జరుగుతాయి... నిద్రలో పెద్దవారికి కాళ్ళు తగిలించడము, సూర్యోదయానికి నిద్ర లేవకపోవడము..ఇటువంటివి. ఇంకా ఇటువంటి అనేక తెలియని పాపాలు చేసే అవకాశం ఉంది.
.
వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా చేసే హోమం / జపం / పారాయణలో కింది మంత్రము ముఖ్యమైనది
.
|| కామోఽకార్షీ॓న్నమో॒ నమః | కామోఽకార్షీత్
కామః కరోతి నాఽహం కరోమి
కామః కర్తా నాఽహం కర్తా
కామ॑ః కార॒యితా నాఽహ॑ం కార॒యితా
ఏష తే కామ కామా॑య స్వా॒హా ||
.
మన్యురకార్షీ॓న్నమో॒ నమః |
మన్యురకార్షీన్మన్యుః కరోతి నాఽహం కరోమి
మన్యుః కర్తా నాఽహం కర్తా
మన్యు॑ః కార॒యితా నాఽహ॑ం కార॒యితా
ఏష తే మన్యో మన్య॑వే స్వా॒హా ||
.
భగవద్గీతలో, ’ మనుష్యుడు ఎవరి వల్ల ప్రేరితుడై పాపాలు చేస్తాడు"? అన్న అర్జునుడి ప్రశ్నకు, భగవంతుడు, " కామ క్రోధాలే పాప ప్రేరకాలు " అని ఉత్తరమిస్తాడు.
క్రోధాన్ని " మన్యు ’ అని కూడా అంటారు.
కాబట్టి, కామాన్ని, క్రోధాన్ని రెంటినీ దేవతలుగా పరిగణించి, ఆ యిద్దరికీ కూడా హోమాన్ని చేస్తారు[ ఆహుతులు ఇస్తారు ]
పై మంత్రము ద్వారా యజమాని దేవతలను ప్రార్థించేది యేమంటే, " పాపాలు చేసిన తప్పు నాది కాదు, కాముడే ఆ పాపాలు చేశాడు, నేను కాదు, నేను పాప కర్తను కాను, ప్రేరకుడనై పాపం చేయించేది కూడా నేను కాదు, కాముడే ఆ విధంగా చేయించినాడు " అంటాడు.
" దురాశ వల్ల ఇటువంటి పాపాలు చేసి కాముడి మీద వేసి తప్పించుకుంటున్నాడు --అని జనాలు అనుకుంటారు, కాబట్టి, ఓ కాముడా, ఆ పాపాల పరిహారం కోసం , ఇదిగో, నీకు స్వాహాకారం తో ఆహుతి ఇస్తున్నాను.." అని దాని అర్థము.
కాముడు, క్రోధము దేవతలు ఎలా అయ్యారు? అంటే, కాముడు ప్రేరకుడు అనేదేమో నిజము, అతడి ప్రేరణయే పాపమూలము అనేది సరైనదే. అయితే, కాముడు పాపానికి మాత్రమే కాక, వ్యవహార సిద్ధి కి కూడా కారకుడు. ఆశ అనేదే లేకపోతే మనుష్యుడు బతకలేడు. అప్పుడు కర్మనూ చేయలేడు. నేను, నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు--అనే ప్రేమాభిమానాలు లేకపోతే, ప్రపంచములో వ్యవహారాలే జరగవు. కాబట్టి, ధర్మానికి విరుద్ధముకాని కామము పూజనీయమే, స్వీకరించతగినదే. అది కూడా పురుషార్థములలో ఒకటి. [ ధర్మార్థ కామ మోక్షాలు ] గీత లో భగవానుడు, " ధర్మానికి విరోధము లేని కామము నేనే " అని చెప్పియున్నాడు కాబట్టి, అటువంటి కామము దేవత అనడం లో న్యాయం ఉంది. కాబట్టి ఆ కాముడిని యజ్ఞము వలన సంతోష పెట్టాలి--అని అభిప్రాయము
.
ఇలాగే రెండో మంత్రము-- మన్యువు అంటే కోపము లేదా క్రోధము. క్రోధము కూడా ఒక దేవతే. అంటే ధర్మాగ్రహము. కాబట్టి ధర్మాగ్రహము అనబడే మన్యువు ఒక దేవతే కాబట్టి, అతడికి కూడా ఆహుతులు విధింపబడినాయి.
కామ క్రోధాలకు ఎవడు వశుడైతాడో వాడు అనర్థానికి తోయబడుతాడు. కామక్రోధాలను అదుపులో పెట్టుకున్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు, అదుపులో పెట్టుకోలేనివాడు, " నేను స్వతంత్రుడను కాదు, నాచేత కామక్రోధాలు పాపం చేయించాయి, ఈ కామ క్రోధాలబారి నుండీ నన్ను కాపాడేది ఎవరూ? అని పశ్చాత్తాపము చెందేవాడికి ఆ పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తముగా పరిణమించి పాప విమోచనము చేయించగలదు. ఎప్పుడైతే మనిషికి అహంకారము పోయి, వివేకము కలుగుతుందో, అప్పుడే కామక్రోధాలు నేను కాదు--అనే వివేకము కూడా కలుగుతుంది. అదే వివేకముతో వాటికి వశుడు కాకుండా ఉండాలి...అని అర్థము.
.
ఉపాకర్మ కు ఇంకా సమయం ఉంది కాబట్టి, కావలసినవారు ప్రణాళికలు చేసుకోవచ్చు.
అయినా, సాధారణముగా శ్రావణ పౌర్ణమికి కారణాంతరాల వల్ల చేయలేనివారు భాద్రపద పౌర్ణమికి చేసే వెసులుబాటు ఉంది.
శ్రావణ పౌర్ణమికే ఎందుకు చేస్తారంటే, ఈ ఉపాకర్మను గురుశిష్యులు కలసి ఏ నదీ తీరం లోనో చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందే నదులన్నీ రజోగుణాన్ని పోగొట్టుకొని స్వఛ్ఛంగా ఉంటాయి అని ప్రతీతి. నదులకు మామూలుగా రజోగుణ దోషం ఉంటుంది . అందుకే మిగతా మాసాల్లో చేయరు.
ఈసారి మొన్న త్రయోదశికి నదులకు రజోగుణ నివృత్తి అయింది.
,
కాని, ఇప్పుడు నదుల వద్ద చేసేవారు ఎక్కడో వెతికితే తప్ప దొరకరు. కాబట్టి, భాద్రపద మాసం లో చేయవచ్చును.
|| జై జగదంబే ||

No comments:
Post a Comment