మాఘ మాసము
( ధర్మ సింధువు ప్రకారము )
మాఘ మాసము విష్ణువుకు ( సూర్య నారాయణుడికి ) ప్రీతిపాత్రమైనది. ఈ మాసములో మనము అనుసరించవలసిన విధానము.
మాఘ మాసమందు ప్రాతఃస్నానము చేయాలి. హవిష్యము ( హోమము ) , బ్రహ్మ చర్యము , మాఘస్నానము - గొప్ప ఫలాన్ని ఇస్తాయి.
మాఘ మాసము వస్తే సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు.
అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. నక్షత్రములుండగా చేసిన స్నానము ఉత్తమము. చుక్కలుపోయాక చేసినది మధ్యమము. సూర్యుడుదయించాక చేసినది అంతకన్నా హీనము.ఈ స్నానము ప్రయాగ నందు చాలా ప్రశస్తమైనది. గంగయందు , సంగమమందు చేసినది కాశీ యందలి స్నానము కన్నా నూరు రెట్లు పుణ్యప్రదము. పశ్చిమ వాహిని స్నానము దానికన్నా వేయిరెట్లు అధిక ఫలము . అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానము మిక్కిలి ప్రశస్తమైనది.
మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులను ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ / సముద్ర స్నానము చేయాలి.
మాఘ స్నానమున నియమములు ;
స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి. వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు.
స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.
దానములు ;
నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.
శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.
నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.
భవిష్యపురాణము ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి. పితరులకు , దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు ముల్లంగి తింటే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే క్షత్రియ , వైశ్య , శూద్రులు కూడ..ప్రతిరోజు స్నానము చేయునపుడు , ఈ మంత్రాన్ని ఉచ్చరించి , మౌనముగా స్నానమాచరించాలి
దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.
రథ సప్తమి
దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి అని కూడా అంటారు
ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి. నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిలపరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి
॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తే`స్తు హరివాస నమో`స్తుతే..॥
సూర్యుణ్ణి ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం ) చెరుకు గడ తో నీటిని కదిలించి , ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి
॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వాలి
॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥
శుభం భూయాత్
No comments:
Post a Comment