45. నలభై ఐదవ భాగము-- దేహము దేవాయతనమైనది
ఆచార్యులు కనురెప్ప పాటు కాలము అలాగే అవాక్కై నిలుచున్నారు . వారు మౌనముగా నున్ననూ , వారి విప్పారితములైన కన్నులు , పైకిలేచిన కనుబొమలూ , తెరుచుకున్న నోరూ వారి ఆశ్చర్యమును తెలుపుచునవి . మరలా అంతలోనే సహజావస్థకు వస్తూ , " సర్వ దేవతలనూ పిలుచుకొని వచ్చిన కుమారునికి అర్ఘ్య పాద్యాదులకు సర్వమునూ సిద్ధము చేయండి . నేను ఇప్పుడే వస్తాను" అని బచ్చలింటి వైపుకు వెళ్ళినారు . దేవి ఆలాపిని కుమారునికి ఒక కృష్ణాజినమును ఇచ్చి కూర్చోబెట్టి , తాను అర్ఘ్యపాద్యాదులను సిద్ధపరచుటకు వెళ్ళినది . మైత్రేయి కూడా అత్త వెంటనే వెళ్లినది .
" సర్వదేవతలనూ పిలుచుకొని వచ్చినాడు " అన్న ఆచార్యుల మాట కుమారునికి అర్థము కాలేదు . ’ ఇంకేమిలే , వారే వస్తారు , అదేమిటో చెప్పెదరు ’ అని ఎక్కడో మనసుతో కూర్చున్నాడు .
అతను కూర్చున్న వెంటనే వెనుకటి వృత్తి అతడిని ఆవరించి ఎక్కడికో లాగుకు వెళ్ళింది . ఎవరో వచ్చి , ’ కావలెనంటే భవిష్యమును చెప్పెదను . ఆచార్యుల మాటకు అర్థమును చెప్పెదను ’ అన్నారు . " నువ్వు ఎవరు ? " అని అడిగితే , " నేనే నీ మనసు . మనస్సర్వము , ఇక పైన ఏమి కావాలన్ననూ నువ్వు పుస్తకము తీసి చదువునట్లే చూసుకోవచ్చు . ఏ అడ్డమూ ఉండదు . నీకు కాల పురుషుని దర్శనమైనందు వలన నీకు ఇతరుల వలె దేశ కాల వర్తమానముల అడ్డము లేదు ." అన్నారు . కుమారుని కుతూహలము రేకెత్తలేదు , ఆచార్యుల వాక్కుకు వ్యాఖ్యానము అవసరము లేదు , అలాగే , మైత్రేయి యొక్క భవిష్యత్తులో ఆసక్తి కలుగలేదు . ఆచార్యదంపతులు ఆవేళకు అటు ఇటు నుండి వచ్చినారు . ఆచార్యులు చేతులు తుడుచుకుంటూ వచ్చి , భార్యను అడిగి నీరు తీసుకొని శుద్ధాచమనము చేసినారు . ఆమె తాను తెచ్చిన పాద్య , అర్ఘ్య , ఆచమనములను కుమారునికి ఇచ్చినారు . కుమారుడు ఎందుకు , ఏమి అని అడుగకుండానే వారి అర్పణలను అనుజ్ఞయని గ్రహించినాడు . ఇంకొకసారి పాలు , పండ్లు ఇచ్చినారు . ఎప్పటివలె అయితే కుమారుడు వద్దనవలసినది . అయితే ఇప్పుడు ఆ ఫలహారమును ఆదరముతో స్వీకరించినాడు . అంతా అయిన తరువాత ఆచార్యుడు కుమారుని వద్ద వేరొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . ఆచార్యాణీ , మైత్రేయీ అక్కడే ఒక్కొక్క ఆసనములను వేసుకొని కూర్చున్నారు .
ఆచార్యులే మొదట మాట్లాడినారు వారి మాటలో వారి సంతోషము వ్యక్తమగుచున్నది .
" ఏమిటయ్యా యాజ్ఞవల్క్యా, ఇప్పుడు నిన్ను కుమారా అన వలెనా, ఆచార్యా అనవలెనా ? "
కుమారునికి గాభరా అయినది . " ఇంకా స్నాతక వ్రతము కాలేదే ? "
" స్నాతక వ్రతము క్రమముగా విద్యా గ్రహణాదులను చేసినవాడికి . కానీ యాజ్ఞవల్క్యా , సర్వ దేవతా సాన్నిధ్యమును పొందిన నీకు స్నాతక వ్రతము వలన ప్రయోజనమేమి ? నువ్వు పుట్టినపుడే నువ్వు ఇలాగవుతావని మాకు తెలిసి యుండినది . అదీకాక, నిన్ను సమర్చించే కాలమూ ఒకటి వస్తుందని మాకు నమ్మకము కూడా ఉండినది . అందువలననే , దైవ యోగము వలన నువ్వు వైశంపాయనుల ఆశ్రమము నుండీ వచ్చినపుడు , మేము అన్యశిష్యుడిని పరిగ్రహించము అని అన్నది . ఇప్పుడు నీకు ఆదిత్యుడు గురువైనందు వలన ఏమేమయినదో , చూచితివా ? మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది . బ్రహ్మ విద్యా సంప్రదాయములన్నిటా బహు విస్తారమయినదీ , ఇహములో నానా ఫలములను ఇచ్చునదీ , అన్నిటి కన్నా ఎక్కువగా సర్వజ్ఞ పదవిని ఇచ్చునదీ అయిన ఈ విద్యను నీవలె సాధించినవారు ఇంతవరకూ ఎవ్వరూలేరు . ఇకముందు మేము ఏదైనా తెలుసుకోవలె నంటే నీనుండీ తెలుసుకొను నట్లయినది . అంటే , నువ్వు మాస్థాయిని చేరినావు . మేము ఆచార్యులు అయితే , నువ్వు అత్యాచార్యుడవైనావు . అన్నిటికన్నా మిక్కిలిగా , నీకు గుణమంటే కుతూహలము లేదు . రేపు ఏమి జరుగుతుందో అన్నది ఈ దినమే తెలుసుకోవలె నన్న ఆత్రము లేదు . ఇది సర్వజ్ఞత్వపు గుర్తు . భలే , అద్భుతముగా సాధించినావు , భలే ! భలే! "
కుమారుడు లేచి వారికి నమస్కారము చేసినాడు . " తమరు అనుజ్ఞ ఇచ్చినదంతా విన్నాను . కానీ నాకు ఏమీ అర్థము కాలేదు . దయచేసి నాకు అర్థమగునట్లు అనుజ్ఞ కావలెను . "
ఆచార్యుడు తన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ అన్నాడు , " నీ ఈ వినయము శ్రేయస్సాధనము . నీకైనా, ఎవరికైనా , పరమ విభూషణము . నీ ఈ వినయమునకు వశము కాని వారెవరు ? కాబట్టి నీకు అర్థం కాలేదన్నావు కదా, ఒక్కొక్కటీ విడమరచి చెప్పెదను , విను . మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది అన్నాను , అది అబద్ధము కాదు . కానీ మీకెలా తెలిసింది అంటావేమో , చూడు , పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినవానికి కాకపోతే ఇతరులకు పంచభూత దర్శనము కాదు . నీకు పంచభూత దర్శనమైనది అనుదానిని నీ కన్నుల ప్రశాంత తేజస్సు చెప్పుచున్నది . అలాగ ఆ భూత దర్శనము కాకుండా ఈ ప్రపంచ దృశ్యపు నానాత్వము చెరిగిపోదు . ఈ దృశ్య నానాత్వము చెరిగిపోకుంటే , ఇంద్రియ లోలత్వము , ఇంద్రియ సహజమైన చాపల్యము తప్పవు . అవి తప్పకపోతే మనసు శాంత సంకల్పము కాదు . మనసు శాంత సంకల్పము కాకపోతే దేవతలు ఆ దేహమున వచ్చి విలసిల్లరు . దేవతలు విలసిల్లని దేహము దేవాయతనము కాదు . దేహము దేవాయతనము కాకుంటే, కాల పురుషుడు ప్రసన్నము కాడు . ఆతడు ప్రసన్నుడు కాకుంటే, చింత , కలవరము , కుతూహలము , ఆత్రము , తొందరపాటు తప్పవు . తెలిసిందా ? "
" ఇప్పుడు నాలో ఇదంతా జరిగినదంటారా ? "
" అయినది అనుదానిని నువ్వు చూసుకోలేదు . ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆకుల చాటున కనుమరుగైన ఫలముల వలె నున్నవి . నీకు కాల పురుషుని దర్శనము కాలేదా ? "
కుమారుడు ఒప్పుకున్నాడు . ఆచార్యుడు కొనసాగించెను," అయ్యా, ఆ దేవతల ఆట ఏమని చెప్పేది ? నీకు కావలసినదంతా అయింది . అయితే అయినట్టు నీకింకా బోధ కాలేదు . ఆ దినము నువ్వూ నేనూ కూర్చున్నపుడు పంచాత్మ సంక్రమణ విద్యను ఆదిత్యుడు నీకు అనుగ్రహించినాడు . మెట్టు మెట్టుగా ఆ దినము నీకు ఈ ఐదు కోశములూ దారినిచ్చినవి . నీకది జ్ఞాపకమున్నది కదా ? "
కుమారుడు ఔనన్నాడు . దాని తర్వాత ఏమేమి నడచినదో చూడు . నీకు పంచభూతముల దర్శనమైనది కదా ? , భూతభూతములకూ వేరే వేరే గతులున్నవి అన్నది తెలిసింది కదా ? ఆ గతులలో దేనికీ దొరకక, ఆకాశము వరకూ వెళ్ళి అక్కడ ప్రాణ దర్శనము చేసి వచ్చినావు కదా ? ఈ ప్రపంచములో శబ్దమంతయూ ఆహతముగా ఉన్నపుడు , పరమాకాశములో అనాహతమైన ఓంకారమును దర్శించినావు. ఇంతటి అదృష్టము ఎవరికి కలుగును ? ఇప్పుడు నీకేమయినదో తెలుసా ? దృశ్యముగా నున్నదంతా శ్రావ్యమై , శ్రావ్యముగా ఉన్నదంతా ఒకే ఒక ప్రణవపు సంకేతమైనది యని బోధయగుచున్నది కదా ? నువ్వు కావాలన్నా , వద్దన్నా , నీకు కలిగిన ప్రణవ దర్శనపు ఫలము నిన్ను వదలలేదు . కాదా ? "
కుమారుడు ఔనని ఒప్పుకున్నాడు .
" ఇప్పుడు చెప్పు , దృశ్య నానాత్వము ఇంకా ఉందా ? "
కుమారుడు తన అనుభవమును అబద్ధమనుటెలా ? తాను అనుభవిస్తున్నదానిని కాదని చెప్పుటెలా ? ఆచార్యుడు తనకైన అనుభవమును , తనకు కలుగుతున్న బోధను అద్దములో కాదుకదా , కళ్ళారా చూచినదానికన్నా ఎక్కువగా వర్ణిస్తున్నది చూచి ఆశ్చర్యమైనది . మరుక్షణమే ఆ ఆశ్చర్యము తిరోధానమై మనసు అంది " ఇదేమీ ఆశ్చర్యము కాదు . ఆచార్యులు జ్ఞాన చక్షువులున్నవారు . అటువంటివారికి ఏ అడ్డమూ లేక, వెనుక ముందు ఉన్న వాటిని మాత్రమే కాదు , దేశాంతర , దేహాంతర కాలాంతరములలో జరిగినదానిని చూచి చెప్పగల శక్తి ఉంటుంది . నీకు కూడా ఆ శక్తి ఉంది . దానిని ఉపయోగించమని నేను అప్పుడే చెప్పితిని , నువ్వు వద్దంటే నేను ఊరకున్నాను . "
ఆచార్యుడు మరలా అడిగినాడు , " ఈ దృశ్య నానాత్వము చెరగి పోయి నందువల్లనే ఇప్పుడు నీ ఇంద్రియములు స్థిరమైనాయి . ఇప్పుడు ’ ఈ ఇంద్రియములు వేరు వేరు కాదు . అన్నీ ఒకటే ’ యంటే నువ్వు ఔను అనే స్థితికి వచ్చినావు . చూచుటకు కళ్ళే అవసరము లేదు , కాలితో కూడా చూడవచ్చును అంటే , నువ్వు చూడకున్ననూ ’ అది సాధ్యమే ’ అను స్థాయికి వచ్చినావు . దాని వలన గోళకమే దృక్ అన్న భ్రాంతి అణగి , దృక్ , దృశ్యము , దర్శనము అన్న త్రిపుటము అణగిపోయినది . దాని ఫలమేమిటో తెలుసా ? మనసు ఇంద్రియములలో పారి బయటికి వస్తున్నది తప్పినందువల్ల , బయటికి వెళ్ళుట అను ఆలోచనయే తప్పిపోయి , మనసు శాంత కల్పమైనది . "
" చిత్తము , "
" మనస్సు శాంత కల్పమగుచున్నపుడు బుద్ధి కర్తృత్వ రహితమై , తన చేష్టలను వదలినది . దాని వలన లోకములో నీవలన కార్యములు చేయించుటకు దేవతలే రావలసి వచ్చినది . అనగానేమి ? నీ దేహములోనున్న ప్రాణమండలము ప్రాణముగా నుండుట తప్పి , అగ్నీషోమీయ మండలమైనది . అగ్ని కుండము నుండీ విస్ఫులింగములు వెదజల్లునట్లే , కావలెనన్నపుడు , ఆవశ్యకత వచ్చినపుడు అక్కడ దేవతలు సిద్ధమై తమ తమ కార్యములను లోపములు లేకుండా నిర్వహించునట్లాయెను . దానివలన నీదేహము దేవాయతనమైనది . సరియా ? "
" వింటున్నాను , సరియే "
" ఇదంతా అయినదానికి గుర్తుగా నీకు కాలపురుషుని దర్శనమైనది . కాల పురుషుని దర్శన ఫలముగా నువ్వు సర్వజ్ఞుడైనావు . సర్వజ్ఞ చిత్తము నీలో ఏర్పడింది . నీ చింత, ఆందోళన వంటివన్నీ అస్తమించినాయి , తప్పా ఒప్పా ? "
కుమారుడు ఒప్పే అన్నాడు . ఆ ’ ఒప్పు ’ అన్న రెండు అక్షరముల మాటలోనే ఆచార్యుడు చెప్పిన సర్వమూ తన అనుభవమునకు వచ్చినది యన్నది అతడు ఒప్పుకొను నట్లుండినది .
" ఈ చింత , ఆందోళన వంటివి నీ దేహపు లోపల ఉండిఉంటే , నీకు కూడ మాకు లాగే ఎన్నో సంవత్సరములు పట్టేది . కానీ దేవతలు గొప్ప మనసుతో వారి కృపాఫలము నీకిచ్చి , ఇదంతా ఒకే పక్షములో అగునట్లు చేసినారు . ఆ పక్షములో కూడా నువ్వు బహిర్ముఖుడవు కాలేదు . దేహము వైపు నీ గమనమే లేదు . దేహము తన సుఖదుఃఖములను , మూత్ర పురీషములను గురించి ఏమనుటకూ అవకాశము దొరకలేదు . ఆ దేహమునకు , చంకలో బిడ్డను ఎత్తుకొనుటే చాలయిపోయిన తల్లి వలె , దేవతల వైపుకు తిరిగి , దేవతలతో సంభాషణ జరుపుతున్న నిన్ను తట్టుకొనుటే చాలయిపోయింది . అదీకాక, అధికారము చూపతగిన నువ్వు మిత్రుడి వలె వ్యవహరించి , అన్నమయ కోశమును పూజాదులతో గౌరవించినందు వలన , అది ’ నీ పని నేను చేయను ’ అని మొండికేసి పట్టు పట్టుటకూ సాధ్యము కాలేదు . ఇప్పుడు నువ్వు జాగృత్తికి వచ్చి ఈ దేహములో వ్యాపారము చేస్తున్న దానికి గుర్తుగా , దేహమును నిర్మించిన భూతములన్నీ శుద్ధియయిన దానికి గుర్తుగా, నీ దేహములో మనోహరమైన కమల గంధము ఉత్పన్నమైనది . "
కుమారుడు మౌనముగా వారు చెప్పినదంతా ఒప్పుకున్నాడు . ఆచార్యుడు అన్నాడు : " ఇప్పుడు చెప్పు , నువ్వు సర్వజ్ఞుడవు కాకున్నా , సర్వజ్ఞ కల్పుడవైనావు . అలాగనిన ఏమిటా ? విను . శాంత కల్పమై నిర్విషయమైన మనసు అంతర్ముఖమైనపుడు తానున్నానా , లేనా అని అర్థము కానట్లు , నిద్రించినట్లు ఉండును . మనసు ఈ అవస్థలో ఉన్నపుడు ఏదైనా తెలుసుకోవలెను అనిపిస్తే , ఆ సంకల్పము దేవ కార్యార్థమై వచ్చినందు వలన , దేవతలు పరుగెత్తి వచ్చి , అక్కడ ఆ జ్ఞానము కలుగుటకు కావలసిన అనుకూలములను కల్పిస్తారు . ఇప్పుడు చూడు , నిన్ను ఇక్కడికి పిలుచుకురాలేదా ? కాబట్టి , అలాగ ’ ఇప్పుడు నేను సర్వజ్ఞుడనో కాదో ’ యని చూచుకోవలసిన అగత్యమే లేదు కాబట్టి నువ్వు ఆ విషయములో ఉదాసీనుడవైనావు . అయితే , అక్కడున్న సామగ్రి అంతా చూచినాక , ’ ఇంటిని చూడగా ఇల్లాలెటువంటిదో తెలియునట్లు ’ ఆ దేహి యొక్క యోగ్యత అవగతమగును . కాబట్టి, ఇప్పుడు నీకున్నవి రెండు దారులు . నిన్ను నువ్వే పరీక్ష చేసుకొనుట , లేదా నన్ను నమ్ముట. ఈ రెండింటిలో ఏదైనా ఒకదానిని పట్టుకో . కుమారుడు యోచించినాడు . : ’ సర్వజ్ఞుడనని నన్ను అందరూ పొగుడుటవలన , నాకు కలుగు పురుషార్థము ఏమిటి ? నన్ను నేను పరీక్ష చేసుకుంటే మాత్రం కలిగేదేమి ? కాబట్టి , ఆచార్యుల మాట చాలు . అంతేగాక , వారు అబద్ధము చెప్పి సాధించేదేముంది ? అని విచారము చేసుకొని , " తమరి మాటే చాలు , పరీక్ష అవసరము లేదు " అన్నాడు .
" అయితే సరే . ఇప్పుడు చెప్పు , ఇంతటి నిన్ను మేము మా సమానుడవంటే తప్పేమి ? "
కుమారుడు ఆ మాటకు ఉత్తరమునివ్వలేదు . నవ్వుతూ తలవంచినాడు .
" నువ్వు స్నాతకుడవు కాలేదని ఒక కుంటి సాకు వెదకుతున్నావు . అదిలోకపు పద్దతి . దానిని విడు , నీ ముందరి దారి గురించి చెప్పు . ఇప్పుడు నువ్వు మరలా ఆదిత్యుని గూర్చి తపస్సు చేయి . అతని వలన ఏమి కాగలదు అనునది నువ్వూ నిర్ణయించుకోగలవు , నాకూ తెలుసు . కాబట్టి దాని విషయమై నేను ఏమీ చెప్పను . ఆదిత్యుని అనుగ్రహమైన తరువాత కొంత కాలము గృహస్థుడవై సుఖముగా ఉండు . ముందేమవుతుందో చూద్దాము . "
" తమరి అనుజ్ఞ. ఆదిత్యోపాసనను చేస్తూనే ఉన్నాను . వదలలేదు . ఇకముందు దానిని బలపరచెదను . "
" చూడు , మరచిపోయినాను . బుడిలుల కుమారుడు కాత్యాయనుడు కూతురి పెళ్ళికి కాలాతీతమగుచున్నది ; వచ్చు మాఘాదిపంచకములో వివాహమగునట్లు ప్రయత్నము చేయవలెను అని మీ తండ్రి దగ్గర ప్రస్తావించినాడట. వారు నాకు సమాచారము పంపినారు . ఏమి సమాధానము పంపించేది ? "
" తమరు అప్పుడే అనుజ్ఞ ఇచ్చినట్లు మొదట ఆదిత్యానుగ్రహ సంపాదన. అనంతరము వివాహము ."
" సరే కానిమ్ము "
No comments:
Post a Comment