47. నలభై యేడవ భాగము-- వివాహము
దేవరాత దంపతులు కొడుకును ఆశ్రమము నుండీ ఇంటికి పిలుచుకు వచ్చినారు . ఉద్ధాలకులు , ’ అతడు ఆశ్రమములో ఇంకా కొన్ని దినములుండిన మంచిది " అను ఉద్దేశము కలవారు . ఆలాపిని మాత , దినదినమూ మైత్రేయిలో యాజ్ఞవల్క్యునిపై అభిమానము పెరుగుచుండుట చూచి , " ఇద్దరూ వయసులో ఉన్నారు , అయినంత దూరములో ఉండనీ . వారు పెద్దయ్యాక ఏమవుతుందో అదే కానీ! " అని ఏకాంతములో భర్తకు చెప్పి అతడిని తండ్రి యింటికి పంపించినది .
యాజ్ఞవల్క్యుడు ఇంటికి వచ్చినదే ఆలస్యము , కాత్యాయనుడు దేవరాతుని వెనకాల పడి తగులుకుని , " ఆలంబినీ దేవికి వయసైనది . యాజ్ఞవల్క్యుడు ఇంకా వ్రతాచరణమును వదలలేదు . కాబట్టి ఆతని సేవకైనా ఎవరో ఒకరు ఉండవలెను " అని కొన్ని కారణములను ముందుంచినాడు . ఆలంబిని నేరుగా కాకున్ననూ పరోక్షముగా ఒప్పుకున్నది . అయితే , ఆమెకు తన కొడుకుకు కాత్యాయని కన్నా , తన అన్న కూతురును తెచ్చుకుంటే ఉత్తమము అని ఒక చిన్న ఆశ. కానీ , ఆనాడు బుడిలులకు తామిచ్చిన అభివచనమును కొట్టి వేయుట ఇష్టము లేదు . అంతే కాక, ఇంటికి కోడలు వచ్చి ఇంట్లో ముత్తైదువ లాగా కళకళలాడుతూ తిరుగుతుంటే , తాను దృఢముగా ఉన్నపుడే మనవడిని ఎత్తుకొని ఆడించుట అదొక లక్షణము గా ఉంటుంది అన్న నమ్మకము .
దేవరాతునికి ఉద్ధాలకులు పంచాత్మ సంక్రమణ విద్య విషయమంతా విపులముగా చెప్పినారు . అతనికి సంతోషమూ కలిగినది , భీతి కూడా కలిగినది . తన కొడుకు సర్వ దేవాయతన మయినాడని సంతోషము . ఇదే కారణముతో కొడుకు బ్రహ్మవిద్య కడకు తిరిగి సన్యాసి అయితే ఏమిగతి యని భీతి . కాబట్టి కొడుకు ఒంటిపై అయినంత వేగముగా ఇంకొక యజ్ఞోపవీతము పడితే అది ఒంటెద్దు ముక్కుకు ముగుతాడు కట్టినట్టే కాగలదు అని ఒక భావన. ఇవన్నీ ఆలోచించి అతడు కొడుకు వివాహమునకు తన అంగీకారమును తెలిపినాడు . మొత్తానికి కాత్యాయని తండ్రికి మనసు సమాధానమై, అతడు మాఘ మాసములో లగ్నము పెట్టుకున్నాడు .
ఇక్కడ యాజ్ఞవల్క్యునికి మాఘ మాసములో సూర్యారాధన చేయవలెనని అభీష్టము . " మాఘమాసములో సూర్యుడు ఉత్తరాభిముఖముగా తిరుగును . అప్పుడు ఆరాధన చేసినవారిపై అతనికి మమత ఎక్కువ. శీఘ్రముగా వర ప్రదానము చేయును . " అని అతనికి నమ్మకము . కాబట్టి మాఘ శుద్ధములోనే పెళ్ళి అనుకున్నారు .
దేవరాతుడే స్వయముగా నిలచి కొడుకుకు సమావర్తన కర్మమును చేసినాడు . విద్యాగ్రహణము పూర్తిఅయినదని స్నాతకుడై యాజ్ఞవల్క్యుడు శోభించినాడు .
వివాహమునకు కులపతులిద్దరూ పత్నీసమేతముగా వచ్చినారు . మైత్రేయి పుట్టింటికి వెళ్ళిపోయినది . ఇటు ఆలంబినీ దేవి తల్లిదండ్రులూ , అటు అత్తగారు మొదలుగా అందరూ వచ్చినారు . అటు ఆడపెళ్ళివారి తరఫున భార్గవాదులూ , వధువు మాతామహుడూ , సపరివారముగా వచ్చినారు . ఇరు పక్కల వారికీ పరమానందము .
అందరికీ వివాహ వైభవపు వైపే గమనమయితే , యాజ్ఞవల్క్యునికి వివాహపు వైదికత్వము పైన ఎక్కువ గమనము . " ప్రాణాపానములను కలపవలెను . దంపతులిద్దరికీ యావజ్జీవమూ స్నేహమయమయిన జీవనము కలగవలెను . " అని మనసు ఆవైపే . కానీ కర్మములో ఏదైనా హెచ్చుతగ్గులయితే , కాత్యాయని చిరాకు తెచ్చుకుంటే ఏమి గతి ? అని దిగులు . అన్నిటికన్నా ఎక్కువగా , " పది సంవత్సరాల బాలిక, ఈమె నాకు అనుగుణముగా ఆదిత్య వ్రతమును నాతో చేయించగలదా ? " అని సందేహము . భీతి , సందేహములూ ఆకాశములో ముసురుకునే మేఘములవలె వచ్చి మూసుకున్ననూ లోలోపల ధైర్యము . " దేవతలు చేయు పని . వారెప్పటికీ అర్ధాంతరముగా చేయరు . అంతా బాగా , సరిగ్గానే చేస్తారు . లేక, ఒకవేళ సరిపోకుండా పోతే , ఒక హవనమో హోమమో చేస్తే సరి . " అని .
పెళ్ళి దగ్గరకొచ్చింది . మగ పెళ్ళివారు ఆడపెళ్ళి వారింటికి వచ్చినారు . రాజధానిలో ఎక్కడ చూసినా పరమోత్సాహము . అందరూ ఆచార్యుల కొడుకు పెళ్ళికి రావలెను అనుకొనువారే . కాత్యాయనుడు , భార్గవుని ప్రోద్బలముతో పెద్ద పందిరిని వేయించినాడు . పందిరిలో రాజ భవనము వారికొక ప్రత్యేక స్థానమును ఏర్పరచినారు .
వివాహము నాడు ఉదయమే వైశంపాయనులు దేవరాతుడిని ప్రత్యేకముగా పిలచి " ఈ దినము మీ యింటికి వచ్చునది కోడలు కాదు , మహాలక్ష్మి. మీ వంశమును ఉద్ధరించునది . ఆ భావము మీకు ఉండవలెను . మీ దంపతులు కన్యాగ్రహణ కాలములో ఆ భావముతో దేవతలను ఆరాధించండి . నేను ఇలాగ చెప్పినందుకు కోపము లేదు కదా ? " అన్నారు.
దేవరాతుడు వారికి నమస్కారము చేసి , " సమావర్తనమగు వరకూ మీ దగ్గర ఉండుటకు యాజ్ఞవల్క్యునికి అదృష్టము లేకనేపోయింది . అయినా వాడికి తమరు గురువులు అను భావము అలాగే ఉన్నది . అలాగే తమరికి వాడు శిష్యుడను భావము పోలేదు . బుడిలులు ఉండి ఉంటే ఇదంతా నిన్నటి దినమే చెప్పి మమ్ములను హెచ్చరించేవారు . ఇప్పుడు తమరు బుడిలుల స్థానములోనున్నారు . కాబట్టి తప్పేమీ కాదు . మాకు కూడా వివాహ మంత్రములు అర్థపూర్వకముగా తెలిసియున్ననూ వాటిని అనుష్ఠానములో పెట్టుకొనలేదు . తమరు జ్ఞాపకము చేయకున్న ఎలాగ ? " అని అభివాదములు చెప్పి నమస్కరించినాడు .
యాజ్ఞవల్క్యుడు పెండ్లి మంటపము నకు వెళ్ళుటకు ముందు వచ్చి వైశంపాయన దంపతులకు నమస్కారము చేసినాడు . వారు అతడిని లేపి హత్తుకొని , " యాజ్ఞవల్క్యా , నువ్వు సర్వజ్ఞుడవైనావు . దానిని లోకము కూడా ఒప్పుకొనునట్లు కావలెను " అని నోరారా దీవించినారు . యాజ్ఞవల్క్యుడు ’ అంతా తమరి ఆశీర్వాదము ’ అన్నాడు . కదంబిని, " నిన్ను చూచినపుడు నువ్వు మా యాజ్ఞవల్క్యుడు అనవలెను అనిపిస్తుంది . ఏమిటి చేయుట ? " అన్నారు , యాజ్ఞవల్క్యుడు , " నేను దేవరాత దంపతుల కొడుకును అన్నది ఎంత సమంజసమో , వైశంపాయన దంపతుల శిష్యుడను అనునది కూడా అంతే సమంజసము . నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా మీ యాజ్ఞవల్క్యుడనే ! " అన్నాడు . కదంబినికి పట్టలేనంత సంతోషమై , " నా యాజ్ఞవల్క్యుని విశ్వానికి విశ్వమే గౌరవించు సమయము రావలెను " అని మనసారా పొగడినారు .
యాజ్ఞవల్క్యునికి ఉద్ధాలక దంపతులకు కూడా నమస్కారము చేసి రావలెనని ఆశ. అయితే వారేమయినా అనుకుంటే ? అని ఒక వెనుకంజ. చివరికి అయ్యేది కానీ యని వారున్న వైపుకు వెళ్ళినాడు . ఉద్దాలకులు లేచి అతడిని ఆహ్వానించి , " చూడు , యాజ్ఞవల్క్యులు వచ్చినారు " , అని ధర్మపత్నికి చెప్పినారు. ఆమె వచ్చి , " రా నాయనా , ’ నిన్ను ’ అని పిలువవలెనో , ’ మిమ్మల్ని ’ పిలువవలెనో ? న్యాయంగా ’ మిమ్మల్ని ’ అని పిలువవలెను . మీరే మాకు మార్గదర్శులు. " అని నవ్వుతూ పలికినారు .
యాజ్ఞవల్క్యుడు చేతులు జోడించి , " తమరు ఏమైనా చెప్పండి , నేను మీరు నాటిన బీజమును . ఈ నారు మీదే , నీరు మీదే . అది విశ్వమాన్యమైననూ మీ మొక్కే కదా ? నాకొక వరము కావలెను . దానికోసము తమవద్దకు వచ్చినాను . " అని ఇద్దరినీ ప్రార్థించినాడు .
ఉద్ధాలకులు , " ఏమిటి ? మొన్నటిదే కదా ? ఇద్దరికీ నమస్కారము చేసి ఆశీర్వాదమును పొందవలెను, ఇదేకదా నీ ప్రార్థన ? " అన్నారు .
" ఔను "
" ఈ దినము నువ్వు ఏమి అడిగినను లేదనకూడదు . కాబట్టి ’ అటులనే ’ అనవలెను . మేము అప్పుడే చెప్పినట్లు , నువ్వు వయసులో చిన్నవాడివి అన్నది ఒక్కటీ వదలి , ఇక దేనిలో మాకన్నా తక్కువ ? అయినా కానిమ్ము , ఆలాపినీ , వెళ్ళి అక్షతలను తీసుకొనిరా. ఆశీర్వాదము చేయుదము " అన్నారు . అక్షతలను తెచ్చుటకు ఆమె వెళ్ళినది .
ఉద్ధాలకులు : " నువ్వు నాకొక మాట ఇవ్వవలెను "
" అనుజ్ఞ ఇవ్వండి , ఎంతైననూ నేను మీ అనుగ్రాహ్య వర్గమునకు చేరినవాడిని . "
" నువ్వు ఎల్లపుడూ అంతర్ముఖుడివిగా ఉంటావు యాజ్ఞవల్క్యా , నువ్వు అలాగ అంతర్ముఖుడివిగా ఉంటే , కాత్యాయని బ్రతుకు పాడైనట్టే . కాబట్టి బహిర్ముఖుడవై నువ్వు ఆమె మనసు నొప్పించకుండా సంసారము చేసుకోవలెను . " ఉద్ధాలకులకు భావావేశము పొంగింది . చివరి మాట అంటున్నపుడైతే కంఠము బిగుసుకొనే పోయింది .
యాజ్ఞవల్క్యుడు ఒక ఘడియ అలాగే నిలుచున్నాడు . అతడు ఇంతవరకూ ఆ కొత్త బాలికను తనకు కావలసినట్లు దిద్దుకొనే యోచనలో ఉన్నాడే తప్ప , ఆ బాలిక కూడా తనవలెనే సృష్టికి వచ్చిన ప్రాణియనీ , దానికీ తనవలెనే సుఖ దుఃఖములు ఉంటాయని ఆలోచించలేదు . ఉద్ధాలకుల మాట అతడి కళ్ళు తెరిపించినది . వివాహ మంత్రములలో అన్నిటికన్నా ఎక్కువగా ’ ఋక్ త్వమ్ , అహమ్ సామ ’ నువ్వు ఋక్కు , నేను సామము అను మంత్రమూ , ’ సఖా సప్తపదీ భవ ’, ఏడడుగులు కలసి నడిచి సఖీ సఖులు కండి అన్న మంత్రమూ గుర్తొచ్చింది .
ఆ వేళకు ఆలాపిని అక్షతలను తెచ్చిచ్చింది . యాజ్ఞవల్క్యుడు ఆ అక్షతలను తీసుకొని వారికిచ్చి , " ఈ తమరి ఆజ్ఞ నాకు శిరోధార్యము. ఎల్లపుడూ ఈ మాటలు నా హృదయములో ఉండి మార్గ దర్శి కావలెను " అని దంపతులకు నమస్కరించినాడు .
ఆ దంపతులు , " నీకు ఈ కల్యాణము సర్వథా, సర్వదా కల్యాణము అయి వుండనీ " అని మనఃపూర్వకముగా ఆశీర్వాదము చేసినారు .
యాజ్ఞవల్క్యుడు బయటికి వెళ్ళగనే వధూవరుల తల్లులు వచ్చి , " ఇంద్రాణీ పూజ చేయించవలెను రండి , మీ వెంట కదంబినీ దేవి కూడా రావలెను " అన్నారు .
ఆలాపినీ దేవి , కదంబినీ దేవి కలసి కాత్యాయని చేత ఇంద్రాణీ పూజను చేయించినారు . కదంబిని , " మా యాజ్ఞవల్క్యుని ధర్మపత్నివి కమ్ము . మీ దాంపత్యము ఆదర్శమగుగాక " అని నోరారా ఆశీర్వదించినారు . ఎందుకో ఏమో ఆలాపిని దేవికి మైత్రేయి గుర్తుకొచ్చినది . వారుకూడా కదంబినీ దేవి వలెనే ఆశీర్వాదము చేసినారు . అయినా , " ఈమే మైత్రేయి అయిఉంటే ? " అనిపించి , వారిని ఆ భావము ఎక్కడెక్కడికో పిలుచుకొని వెళ్ళింది .
No comments:
Post a Comment