46. నలభై ఆరవ భాగము -- గృహిణియా ? బ్రహ్మవాదినియా ?
ఆ మాట విను వరకూ మైత్రేయి ఒళ్ళంతా చెవులై వింటున్నది , వివాహపు సంగతి వచ్చేసరికి ఎందుకో చంచల యైనది . ఆమెకు ఏదో అసహనముగా అనిపించినది . తన పదార్థమును ఎవరో ఎత్తుకొని పోవుచున్నట్లు భావించినది .
ఆలాపిని మాత , మేనకోడలి మనఃస్థితిని ఆమె ముఖము మీద కనబడుతున్న భావముల నుండే ఊహించినారు . అయితే అప్పుడు మాట్లాడుట సరికాదని ఊరికే ఉన్నారు .
యాజ్ఞవల్క్యుడు బయలు దేరుతానన్నాడు . ఆచార్య దంపతులిద్దరూ నమస్కారమును గైకొని వెళ్ళివచ్చుటకు అనుజ్ఞ నిచ్చినారు . వెళ్ళుతున్న వాడిని చూచి ఆలాపిని, " మరలా కన్నులు తెరిచేది ఎప్పుడో చెప్పి ఉండవయ్యా ! ఆ పూటకు సరిగ్గా పాలు పంపిస్తాను . అంతవరకూ దినదినమూ పంపించి పాలనెందుకు వ్యర్థము చేయవలెను ? " అన్నారు.
యాజ్ఞవల్క్యుడు బయలు దేరినవాడల్లా నిలచి , " పాలు వ్యర్థమేమీ కాలేదు కదా , పాలు చెడిపోలేదు , పులిసిపోలేదు , విరిగిపోలేదు . మీకు వేరే పనికి ఉపయోగ పడినాయి కదా " అన్నాడు.
ఆలాపిని , " అదీ నిజమే . అయినా మాటవరసకు ఆడిన మాట అది . దానికింత గౌరవము ఇవ్వనక్కర లేదు " అన్నారు .
ఆచార్యుడు , " చూచితివేమయ్యా ? నువ్వు కనులు మూసుకొని కూర్చున్నావు . నీ దగ్గర పెట్టిన పాలను వీరు తెచ్చినదీ , ఉపయోగించుకొన్నదీ నీకెలా తెలుసు ? అలాగ నీకు తెలిపినది సర్వజ్ఞ బీజము కాకపోతే ఇంకేది ? దానినే కావాలన్న మొక్కగా , చెట్టుగా పెంచవచ్చు . " అన్నారు .
యాజ్ఞవల్క్యుడు , అద్దములో తన రూపమును చూచుకొని సిగ్గుపడే రూపవతి వలె తనకు తెలియకుండానే ప్రకటమైన సర్వజ్ఞత్వమును చూసి , లోపల మెచ్చుకున్ననూ , బయటికి సిగ్గుపడినవాడివలె అక్కడ నిలవకుండా వెళ్ళిపోయినాడు .
వెళుతున్నవాడిని చూస్తున్న ఆలాపిని, " ఏమంటారు , ఈ యాజ్ఞవల్క్యుని ఆ కాత్యయని సేవించుట సాధ్యమా ? మన మైత్రేయి వలె పెరిగినదయితే బాగుండెడిది . " అన్నారు .
ఆచార్యుడు నవ్వు కనిపిస్తున్న కొంటెతనముతో , " అలాగయితే కాత్యాయనునికి చెప్పి పంపుదామా , మీ కాత్యాయని వద్దు , ఇక్కడ అప్పుడే స్వయంవరమై పోయినది , మా మైత్రేయి మీ యాజ్ఞవల్క్యుడిని వరించినది యని ? ఏమంటావమ్మా , సరేనా ? " అని మైత్రేయి ముఖాన్ని చూస్తూ అన్నాడు .
ఆ మాటకు ఆలాపిని ఉత్తరమిస్తూ , " మైత్రేయి బ్రహ్మవాదిని కావలెనని ఒత్తిడి తెచ్చిన దానను నేను . అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడిని చూచి ఉండలేదు . " అన్నారు .
ఆచార్యులు నవ్వుతూ , " ఇప్పుడేమి నష్టమయింది మహా ! మైత్రేయిని , నీ కోరిక మేరకు బ్రహ్మవాదిని కానిమ్ము , ఆమెకు ఇష్టమైతే మోక్షపత్ని కావచ్చు కదా " అన్నారు .
మైత్రేయి నవ్వుతూ , " చూడత్తమ్మా , నీలాగా కావలెనని మామయ్య చెప్పుచున్నారు . అయితే నువ్వు మామయ్యకు ధర్మపత్నివి కూడా , మోక్షపత్నివి కూడా ! నీ లాగా రెండూ అగుటకు ఎవరికి సాధ్యము ? " అన్నది .
ఆ మాటల వెనుకనున్న అర్థమును గురించి ఎవరూ అంతగా ఆలోచించలేదు .
No comments:
Post a Comment