36. ముప్పై ఆరవ భాగము-- పూర్ణపు గుర్తు వైరాగ్యము
కులపతులైన ఉద్ధాలకులు ఏదో యాగమునకని కాశీ పట్టణమునకు వెళ్ళినారు . ఆశ్రమమంతా వారి పత్ని ఆలాపిని ఆధీనములో ఉండినది . ఆయా శాఖలలో జరిగినదంతా వృద్ధ శిష్యులు వచ్చి ఆమెకు నివేదిక నిచ్చేవారు . యాజ్ఞవల్క్యుడు అవకాశము కలిగినపుడు పాఠములు జరుగుతున్నపుడు ఆయా వర్గములకు వెళ్ళి అక్కడ ఉండి , వచ్చేవాడు . కులపతులుంటే వారి దగ్గర , లేకుంటే వారి పత్ని దగ్గర ఏదో ఒక విషయము చర్చిస్తూ ఉండేవాడు . అయితే అతడికి అవకాశము బహు తక్కువ. పొద్దుటినుండీ సాయంత్రము వరకూ చాలా మట్టుకు జపములోనే గడిపేవాడు .
ఆలాపిని మాత వచ్చి వేత్రాసనములో కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు సమీపములోనే నేలపై దర్భాసనములో వినయముగా కూర్చున్నాడు . ఆలాపిని మాత అంటున్నారు ,
" వారు చెప్పినది నిజము , యాజ్ఞవల్క్యా , బ్రహ్మ విద్య తనకు తానే రావలెను . స్వప్రయత్నము చేత మిగిలిన విద్యలన్నీ సాధించవచ్చు , అయితే బ్రహ్మవిద్య అటుల కాదు . పండిపోవలెను . అంటే , కాయ బలిసి ఉండవలెను . చెట్టుపైనే పండితే దాని రుచి చెప్పనవసరము లేదు . లేకున్నా , వాడవేయుటకైనా ( కృత్రిమముగా పండునట్లు చేయుట ) కాయ బలిసియే ఉండవలెను కదా ? అలాగే బ్రహ్మ విద్య కూడా . ప్రాచీనము ( పూర్వ ఫలము ) పక్వము కాకపోతే గురువు దొరకడు . గురువు దొరకని వారికి బ్రహ్మవిద్య లభించదు . "
యాజ్ఞవల్క్యుడు చేతులు జోడించి , నవ్వు ముఖముతో అడిగినాడు , " అది సరే , మరి , గురువు దొరికి కూడా కాదన్న మా వంటి వారి గతి యేమిటి ? "
" నీదొక విచిత్రము లే , నువ్వొక విలక్షణ ప్రాణివి . నీకు మానవ గురువులు లేరని , దేవతా గురువులు కలుగు యోగము వచ్చినది . వైశంపాయనులు నిన్ను పంపించి వేసినా , నీకేమి తక్కువయినది ? మీ తండ్రి నీకు స్వశాఖను అధ్యయనము చేయించినారు . బుడిలులు నీకు ఋగ్వేదమును పునశ్చరణము చేయించినారు . వీరు నీకు సామమును పునశ్చరణ చేయించినారు . ఇప్పుడు నీకు అగ్ని దేవుడు , ప్రాణ దేవులు ప్రసన్నమైనారు . ఆదిత్యదేవుడిని గురించి తపస్సు చేస్తున్నావు ! ఆదిత్యుడిని ప్రసన్నుడిని చేసుకుంటే ఇక నిన్ను పట్టేవారుండరు . అదలా ఉండనీ , బ్రహ్మ విద్య సంగతి చెబుతుంటిని , దానిని కొనసాగించనా , నిలిపివేయనా ? "
" దయ చేసి కొనసాగించండి "
" మీరు శాంతి మంత్రములలో చెప్పుతుంటారు చూడు , ’ ఆ అంగములన్నీ ఆప్యాయనమును పొందనీ ’ అని , అది నిజము . దేహపు అంగములన్నీ తృప్తితో నిండి , సంతోషపడి , దారిని వదలు వరకూ బ్రహ్మవిద్య లభ్యము కాదు , ఎందుకో తెలుసా ? అంగాంగమూ ఒక్కొక్క దేవతా స్థానము . ఏ అంగము తృప్తి తో నిండి యుండదో , అక్కడ తద్విషయకమైన కోరిక నిలచి , అంతమేరకు వైరాగ్యము కొరతయగును . వైరాగ్యమంటే , ’ వద్దని వదలుట కాదు , ఇక చాలని విముఖమగుట ’ కాబట్టి , ఎద్దు బ్రహ్మచర్యమును పాటించినది యన్నట్లు , చేప నీటిలో ఉండి తపస్సు చేసిందన్నట్లు , మృగములు అడవిలో ఉన్నాయి యన్నట్లు , విధిలేక , వేరు దారి లేక చేసినది వైరాగ్యము కాదు . మనము విధి విధించినదాని పరముగా చూచుట అగత్యము , యాజ్ఞవల్క్యా ! అప్పుడు వైరాగ్యము నిషేధము వలన వచ్చునది కాదు , పూర్ణత కోసము , అపూర్ణ మానవుడు పూర్ణుడగుట యొక్క గుర్తుగా వచ్చునది . అలాగయితేనే మార్పు అన్నది తెలిసేది . "
" ఔను , నిజమే , ఒప్పుకుంటాను . వైరాగ్యము పూర్ణము యొక్క చిహ్నముగా , పూర్ణమువైపు నడిపించు సాధనము కావలెను . సరే , అప్పుడేమవుతుంది , అమ్మా ? "
" నేను కూడా నీలాగే మనిషిని . నన్నడిగితే నేనెంతవరకూ చెప్పగలను ? కాబట్టి భువన ప్రాణుడైన మాతరిశ్వుడిని అడుగు . అతడయితే సరిగా చెప్పగలడు . "
" మీ అనుజ్ఞ , ఇక్కడే అడగమనా ? ఏకాంతములో అడగమనా ? "
" ఇది మరీ బాగున్నది . అంతటా నిండి ఉన్న ఆ పూర్ణ పురుషుని అనుసంధానము చేసిన తరువాత ,అంతటా ఏకాంతమే కాదా ? అతడే కదా , లోపలా బయటా ఉండేవాడు ? ఆతడే సర్వమునూ వ్యాపించి యున్నవాడు . కాలమో ? అంటావేమో . అదికూడా అతడినే అడిగితే సరి . "
" తమరు చెప్పునది సరియైనదే . ఇప్పుడే ఇక్కడే అతడిని అనుసంధానము చేయుదును "
యాజ్ఞ వల్క్యుడు అలాగే పద్మాసనములో కూర్చొని , కన్నులు మూసుకొని , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసినాడు . ఆతడు దర్శనమిచ్చి , " దేవి వారు చెప్పినది సరియైనది . అంగాంగములూ నా వలన పుట్టిన దేవతల స్థానములు . కాబట్టి అంగాంగములు తృప్తిచెందు వరకూ వాటి కోరికలు తృప్తి పొందవు . హఠము చేసి దేవతలను లొంగదీసుకోవచ్చు. అప్పుడు వారి ప్రసాదము దొరకదు . చెట్టుకొమ్మ స్వేఛ్చగా పెరిగి ఇవ్వవలసిన ఫలమును , చెట్టుకొమ్మను కొట్టేస్తే దొరుకుతుందా ? హఠము చేసినవాడు విఫలుడౌతాడు . కాబట్టి అంగాంగములూ ప్రసన్నము కావలెను . అవన్నీ ప్రసన్నమైనాక నేను కూడా ప్రసన్నమవుతాను . అప్పుడు బలిసిన బీజము పండును కోరకయే స్వతంత్రమగునట్లు , జీవుడు తృప్తుడై తన జీవత్వము దైవత్వమై , దైవత్వము బ్రహ్మత్వమగుటను ఆత్రముగా నిరీక్షించును. . జీవత్వము చిన్నది . దైవత్వము దానికన్నా పెద్దది . బ్రహ్మత్వము అంటే పూర్ణత్వము . అలాగ , అల్పమై , అపూర్ణమై ఉండినది , పూర్ణత్వమును -తనదైన పూర్ణత్వమును పొందుటకు సిద్ధమైనదాని గుర్తే వైరాగ్యము . "
" సరే , తెలిసింది "
" ఆ వైరాగ్యము మనసుకు రావలెనంటే దేహములోని దేవతలందరూ అనుగ్రహించ వలెనని రహస్యము . అప్పుడు మనసు అది కావలెను , ఇది కావలెను అని బయటి వస్తువును అపేక్షించు కామనలు లేకుండా పోతాయి . అంటే , వంద మనోరథములతో నిండియున్న మనస్సు , వందలకొద్దీ ఆశలతో కూడిన మనస్సు , ఆశను తన అపూర్ణత యొక్క గుర్తు అని తెలుసుకొని దానిని వదలుట. అప్పుడేమగునో తెలుసా ? ఇంద్రియముల ఉద్దీపనము లేకుండా పోతుంది . ఇంద్రియములకు శక్తి లేక , అవి దుర్బలమై ఉండిపోవును . మనసులో కామనలు బలముగా ఉన్నంతవరకూ ఇంద్రియములు బలముగా ఉంటాయి . కాబట్టి , దుర్బలములైన ఇంద్రియములు , ఓడిపోయి సారథి వశమైన గుర్రముల వలె , చెప్పినట్లు వింటాయి . ఇదంతా కావలెనంటే పూజ్య వైవస్వతుడికి నచికేతుడు విజ్ఞాపన చేసినట్లు , భోగ భోగమూ ఇంద్రియముల తేజస్సును అపహరించును అనునది తెలుసుకోవలెను . తేజస్సులేని ఇంద్రియములు భోగములను అనుభవించలేవు . భోగమును పొందుట అంటే సంతకు వెళ్ళి వెల ఇచ్చి వస్తువును తెచ్చినట్లే అన్నది మనసుకు అర్థము కావలెను . అప్పుడు మనసు లోకపు వైఫల్యమును చూచి వెనుతిరుగును . అలాగ వెనుతిరుగుట వైరాగ్యము . అర్థమైనదా ? "
" అర్థమైనది , దేవా. అలాగైతే , మనుష్యుడు భోగములను కోరునది తనకోసమా ? ఇంకొకరికి కాదా ? "
" కాదు , కానేకాదు . ఖచ్చితముగా కాదు . మనసు అపరితుష్టమైన దాని గుర్తే భోగాసక్తి . మొదట మనసులో ఆసక్తి పుట్టును . అప్పుడు , ఆ ఆసక్తిని గుర్తించలేని వాడు , అది పెరిగి ఎదురుగా ఉన్న వస్తువు పైన మోహముగా పరిణమించి , అది కాంక్షగా మారినపుడు , తనను ఆ కాంక్షకు క్షేత్రముగా భావించుకొనును . కాబట్టి , యాజ్ఞవల్క్యా , ఒకసారి నీకు ఉపనయనములో చెప్పిందేమిటో గుర్తు తెచ్చుకో . ధియో యోనః ప్రచోదయాత్ , మన వృత్తులను , బుద్ధులను ప్రచోదనము చేయువారెవరు ? దానిని మొదట చూడవలెను . "
" సరే , ఒక మాట అడుగవచ్చునా ? "
" అడుగు , అయితే , ఆ మాటను అడగమన్నది ఎవరు ? మొదట అది చూడు . "
" ఔను , ఒక తేజస్సు మనసును ప్రేరేపించును . అప్పుడు మనసులో , తూము వదలితే మరవ పారి వెడలెడు నీటి వలె , వృత్తి పారును . "
" చక్కగా చెప్పినావు . మనసు అని దేనిని పిలుస్తారో , అదికూడా నాయొక్క భాగమే ! వస్తు వస్తువు నందూ నిలచి , ఒక్కొక్క ప్రత్యేకమైన భావన ఏది ఉందో , అదే మనసు . ప్రత్యేకమన్న తర్వాత , దానికీ దీనికీ ( వస్తువుకూ భావనకూ ) ఒక సంబంధమును కల్పించవలెను కదా ? ఆ కల్పనకు సాధనమైనది మనసు . సంబంధము ఏర్పడిన తరువాత ఆ సంబంధము సుఖము కావచ్చును , దుఃఖము కావచ్చును . ఈ సుఖదుఃఖాలు మనసుయొక్క ఇఛ్చాద్వేషములను అవలంబించినవి . సంబంధము ఏర్పడినప్పుడు అనుభవము మాత్రము వచ్చును . ఇప్పుడు చెప్పు, నీ సుఖదుఃఖములు , లేదా , నువ్వు సుఖ దుఃఖములు అనునవి నిజమైనవా ? "
యాజ్ఞవల్క్యుడు పరిభావించి చూచినాడు . " ఔను , మనసు అనునది ఇంద్రియ ధర్మములనన్నిటినీ కలిగియున్ననూ , దానిని ఇంద్రియము అనుటకు వీలులేని ఏదో ఒక విలక్షణ వస్తువు . ప్రాణపు బలము చేత తనకొక ప్రత్యేకతను సంపాదించుకున్ననూ , నిజానికది ప్రాణముయొక్క ఒక అంగము . అది సుఖ దుఃఖములను ఇంద్రియ మూలకముగా పొందిననూ , అనుభవము దానిని చేరు వరకూ సుఖమూ కాదు , దుఃఖమూ కాదు . మనసులోనున్న ఇఛ్చా ద్వేషములు ఆ అనుభవములపైన , తమకు తోచినట్లు సుఖ దుఃఖపు ముద్ర వేస్తాయి . ఇదంతటినీ పరిభావించి చూచినాడు . అక్కడ ఒక అంశము అతనికి తెలియలేదు , అడిగినాడు, .
" దేవా , అక్కడ నల్లగా , సంచీ వలె నున్నదే , అది ఏమిటి ? "
" బాగా అడిగినావు యాజ్ఞవల్క్యా , అలాగే చూస్తూ ఉండు , అదేమిటన్నది తెలుస్తుంది . "
యాజ్ఞవల్క్యుడు కళ్ళకే కన్నుగా మారి చూచినాడు . ఏదో ఒక తేజస్సు మనసుపై ప్రకాశిస్తోంది . అప్పుడు ఆ సంచీ వలెనున్న వస్తువు నోరు తెరచింది . దానినుండీ ఏదో ఒక ప్రవాహము వలె వెడలి , మనసు నుండీ ఇంద్రియముల మూలముగా ప్రకటమైనది .
ప్రాణదేవుడన్నాడు , " చూడు , అదే కర్మ బీజపు గ్రంధి. వెనుక నిలచి వెలగిన తేజస్సు ఆదిత్య దేవుడిది . ఆతని తేజస్సు ఎండగా నేలపై పడినపుడు , నీటి సహాయముంటే , భూమిలోని బీజములన్నీ మొలకెత్తి పైకి వచ్చునట్లు , ఆతని తేజస్సు మనసుపైన పడగానే మనసు లోనున్న కర్మబీజ గ్రంధి నుండీ కర్మ వాసన వెడలి ఇంద్రియ మూలకముగా వ్యాపించి , లోకములో ప్రకటమై ఫలాఫలములను ప్రతీక్షించును . ఫలము ఎక్కువైనచో జయమంటారు . అఫలము హెచ్చయితే అపజయమంటారు . కాబట్టి , జయమైనా , అపజయమైనా అది ఎదుటివారి మాట. అదే సుఖ దుఃఖాలను ప్రకటముగా ప్రతిబింబించేది . లోపలి సుఖ దుఃఖాలకే అస్తిత్వము లేనపుడు , బయటి జయాపజయములకు అస్తిత్వము ఉంటుందా ? చెప్పు . "
యాజ్ఞవల్క్యునికి ఆశ్చర్యమైనది . అయినా , కనబడుతున్నదానిని లేదనుటెలా ? అన్నాడు , " లేదు దేవా, లేదు . అవి వృత్తి యొక్క ఫలములు . వృత్తి ఆదిత్యునిది . వృత్తి ప్రకటమగు మనసు నీది . వృత్తి యొక్క ఫలాఫలములను సుఖ దుఃఖములుగా అనుభవించు ఇంద్రియముల గూడైన దేహము అగ్నిది . "
ప్రాణదేవుడు నవ్వినాడు , " ఈ చివరి మాట ఎవరన్నారో చూడు . "
యాజ్ఞవల్క్యుడు చూచినాడు , ;" ఔను , ఆ వాక్యపు కర్త తానుకాదు . వెదకి చూచినాడు . కుడిపక్క ఎవ్వరో నవ్వినట్లైంది . చూడగా , అగ్ని దేవుడు . అతనికి నమస్కారము చేసి , ప్రాణదేవుడికి నివేదించినాడు , " ఔను దేవా, ఆ మాట యొక్క కర్త నేను కాదు , అగ్ని దేవుడు "
" సరే , చూచితివా ? దేవతలు తమ స్వరూపములను ప్రకటము చేయకుండానే నీతో కావలసినది పలికించగలరు . అలాగే , కావలసినది చేయించనూ గలరు . ఇప్పుడు చెప్పు , ఇలాగ పరోక్షముగా ఉండి , బొంగరమును ఆడించునట్లు మిమ్మల్ని ఆడించు దేవతలు ప్రసన్నులు కాకుంటే నీకు వైరాగ్యము ఎలా వస్తుంది ? "
" సరే "
" కాబట్టి , దేవీ మాత చెప్పినది సరియైనది . వైరాగ్యము వచ్చుటకు దేవతా ప్రసాదము కారణమగునట్లే , బ్రహ్మ విద్య కలిగితే అంగాంగములు , అంగాంగములలోనున్న దేవతలు ప్రసన్నులవుతారు . ఎందుకనగా , దానివలన వారికి అమృతాభిషేకము అయినంత తృప్తి కలుగును. "
ఆలాపినీ దేవి లేచి నిలుచున్నారు . యాజ్ఞవల్క్య , ప్రాణ దేవుల సంభాషణము వారికి వినిపిస్తుండినది ఒక ఆశ్చర్యము !. అలాగ ప్రాణదేవుడు సాక్షాత్తుగా సంభాషిస్తున్న దానిని విన్నపుడు వారు లేవకుండా ఎలా ఉండగలరు ?
No comments:
Post a Comment