SHARE

Monday, February 4, 2013

29. " మహాదర్శనము " --ఇరవై తొమ్మిదవ భాగము --వారు వీరేమన్నారు ?


29. ఇరవై తొమ్మిదవ భాగము - వారు వీరేమన్నారు ? 


         మధ్యాహ్నము సుమారు ఒక ఘడియ గడచి యుండవచ్చును .  పక్షులు ఇంకా నీడను వదలి బయటకు రాలేదు . ఆవు-దూడలు తాము తిన్నదానిని నెమరు వేస్తూ ఇంకా చెట్ల నీడలలో పడుకుని ఉన్నాయి . కాలువ పక్కన ఆశ్రమపు ఆడవారందరూ చేరినారు . పిల్ల తల్లులు , పిల్లలను ఇంటిలో నిద్రపుచ్చి , వారు నిద్రలేచులోపల మరలి వెళ్లవలెనని , బిందెలూ , చెంబులు , ఇత్తడి ఉపకరణములను కడుగుకొని , బట్టలు ఉతుక్కొని వెళ్లవలెనని , వచ్చినారు . 

        వచ్చినవారిలో అంత త్వరగా వెనక్కు తిరిగి పోవలసిన అవసరము లేని వారుకూడా ఉన్నారు . అటువంటి వారు , నీటిలో కాళ్ళు ఆడిస్తూ , ఎండకు ఒళ్ళు కాచుకుంటూ నిదానముగా , ఆటవిడుపుగా , ఏదో పొద్దు గడవనీ యని మాట్లాడుచున్నారు . ఎండకు కాగిన ఒళ్ళు ఆ కబుర్లకు  ఏదో ఉత్తేజనము నిచ్చునట్లుంది . మాటలు అక్కడ కూర్చొని , ఇక్కడ ఆగి , ఇటుతిరిగి అటుతిరిగి చివరికి యాజ్ఞవల్క్యుని వైపుకు మరలినాయి . నిదానముగా కూర్చున్నవారిలో చాలామంది మధ్య వయస్కులు  ఇంటిలోని మగవారి భయము అను ముసుగును కొద్దోగొప్పో తీసివేసినవారు . 

ఒకామె అన్నది , " ఆశ్రమానికి వచ్చిన ఇంతమంది పిల్లలలో యాజ్ఞవల్క్యుని తరహాలో ఒక్కరూ లేరు కదా ? "

       " ఔనే ! నేనపుడే చెప్పాలనుకున్నాను . వాడు దినమూ భిక్షకు వస్తాడు కదా ? అందరిళ్ళకూ వెళ్లడట . నేను విచారించినాను . తనకు ఎంత కావలెనో , దానికి రెట్టింపు దొరకు వరకూ మాత్రమేనట , వాడు భిక్షాటన చేసేది . ! " 

" శాస్త్రమున్నది అలాగే  అన్నపుడు ?  అది వదలి , ఒక మూట ఎత్తుకొని వచ్చి వారు వీరికి వేయవలెను? దుకాణము పెట్టవలెను అని ఎక్కడుంది ? "

        " అయితే ఇది వినండి , ఆశ్రమపు వారికి భిక్షాన్నము వేయువారు చాలామంది ఉన్నారు , ఎవరి ఇంటికి పోకుంటే ఏమగునో అని బెదరి ఇంటింటికీ వెళ్ళువారు కొందరు . " 

         " ఇంకో సంగతి విన్నారా ? ఒక్కొక్క దినము , కులపతుల భార్య కదంబిని అమ్మగారు ఉన్నారు కదా , వారు , ’ యాజ్ఞవల్క్యా , ఈ పొద్దు భోజనానికి ఇక్కడికే రా ’ అంటారట. ఆ దినము వాడు ఎక్కడికీ పోవుటే లేదంట ! అందరూ అనేదేమో తెలుసా ? ఈ మధ్య కదంబిని అమ్మగారు యాజ్ఞవల్క్యుని భోజనానికి పిలువవలెనని , ఇంటిలో దానికి చాలినంత ఉండాలని మూడునూర్ల వ్రతాలు చేస్తారంట ! " 

        " అదేమి విశేషమమ్మా ? నేను వాడిని పిలిచేలా ఉంటే , వాడిని మా ఇంటిలోనే ఉంచేసుకుంటాను . ఆ పిల్లవాడి వర్ఛస్సు ఎంతటివారైనా గౌరవించతగినది . "

        " ఇంకొక విశేషము ! మీరు గమనించే ఉంటారు , అయినా చెబుతాను , వినండి . వాడు వచ్చి వాకిట్లో నిలుచొని ’ భవతీ భిక్షామ్ దేహి ’ అంటుంటేనే ఎంత ఠీవి గా ఉంటాడే ! దాన్ని చూచుటకైనా వాడు మా ఇంటికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది . మీరేమైనా అనుకోండి . " 

         " వీరు ’ భవతీ భిక్షామ్ దేహి ’ మాత్రమే చెప్పినారు . ఆ బాలుడు నిలుచోవడము , నడక , ఎత్తు , మాట  అన్నీ కొత్తగా ఉంటాయి . ఎవడో దేవకుమారుడు దారి తప్పి ఆశ్రమమునకు వచ్చినాడే అనిపిస్తుంది . " 

        " ఇంకొకటి చూచినారా ? కావాలని , ’ ఈ దినము ఏమీ లేదయ్యా , మా భోజనమైపోయింది ’ అనో , ఇంకేదైనా  అని గానీ చూడండి , వాడు పెదవి కూడా కదపడే ? "

        " ఇవన్నీ బయటి సంగతులు . వాడు ఏకసంతగ్రాహి యంట ? వేదమైనా , శాస్త్రమైనా , పురాణమైనా , ఒకసారి ఇలాగ చెప్పితే చాలు , అలాగే అప్పచెప్పేస్తాడట. " 

" అందుకే వాడికి వీణ వాయించుటకు అంత సమయము దొరకుతుంది .! "

" వాడి వీణా వాదనము మీరెక్కడ విన్నారు ? "

        " మొన్న సాయంకాలము ఆవుదూడలను చూడాలని అటువైపుకు వెళ్ళినాను . అక్కడేదో సద్దగుచుండినది . ఇదెవరు ? వీణ వాయిస్తున్నారు ? అని విచారించితిని . వీడే అని తెలిసింది "  

        " నాకు ముందే తెలుసు. ఆ దినము వారి తల్లిదండ్రులు వచ్చినారు కదా , అప్పుడు వాడి తల్లి దగ్గర కూర్చొని వాయించినాడు . ఆ దినము మమ్మల్ని , నలుగురైదుగురు ఆడవారిని పిలచి పసుపు-కుంకుమలిచ్చినారు ఆమె . అప్పుడే మాకు తెలిసింది . " 

" మీరైతే భట్టు గారి ఇంటివారు . మాకా అదృష్టము ఎలా కలుగుతుంది ? " 

         " అది ఉండనివ్వండి , ఈ రోజు ఇంకొక విశేషము . మీకు తెలుసో లేదో , వారంతా ఒకటిగా చేరి వేదాధ్యయనము చేస్తారు కదా , అప్పుడు చూడండి ,  వాడి కంఠము అందరినీ మించి , మంచి కంచు కంఠము వలె , గంట కొట్టినట్లు వినిపిస్తుంది . ఇంకెవరి గొంతూ దానిని మించునట్లు లేదు కదా ? "

" ఔను , మిగిలినవారు వాడిని అనుసరించవలసినదే తప్ప , వాడు మిగిలినవారిని అనుసరించుట అన్నదే లేదు . "

        " ముఖ్యముగా అడిగి పుట్టినవాడిలాగా పుట్టినాడు , అంతటి కొడుకును పొందుటకు కూడా అడుక్కొని వచ్చి ఉండాలి . సరే , ఇంక ఇంటికి పోదామా లేదా ? "

" పోకేమి చేస్తాం ? పశువులు వచ్చే వేళయ్యింది. ఇప్పుడు వెళ్ళి పాలు పిండి స్నానము చేసి అగ్ని హోత్రానికి సర్వమూ సిద్ధము చేయాలి "

       " ఔనే , పొద్దయిపోయింది .  "  అని అందరూ త్వర త్వరగా పాత్రలు కడుగుకున్నారు . బట్టలు తెచ్చినవారు మరి కాసేపట్లోనే అన్నీ ఉతికేశారు . అందరూ , నీరు , పాత్రలూ , బట్టలూ తీసుకొని ఆశ్రమాభిముఖముగా వెళ్ళినారు . 

         దారిలో మరలా యాజ్ఞవల్క్యుని మాట వచ్చింది . 
" ఇంకో విషయము చూడండి , వాడు ఋగ్వేద పాఠమునంతా ముగించుకొని , సామవేదమునకు వచ్చినాడు . ఆ సామములనే వాడు వీణలో పలికిస్తున్నది . "

" నిజంగానా ? "

" ఔను , నేనింకేమి చెప్పేది ? కావాలంటే మీరు విని చూడండి . "

" వాడి గుడిసె నుండీ వీణ వినిపిస్తుంది . కానీ అది సామము అనేది మనసుకు రాలేదు . నేను ఏదో పాట అనుకున్నాను "

" సరే , అలాగైతే , ఈ చిన్న వయసులోనే వాడు త్రివేది అయినాడు " 

" సందేహమే లేదు . వాడు ఇక్కడ ఇంకొక వర్షముంటే బ్రహ్మ వేదమును కూడా నేర్చి చతుర్వేది యవుతాడు , సందేహమే లేదు " 

" ఆ తండ్రి కొడుకు చతుర్వేదియగుటలో సందేహమేమున్నది ? "

" అది నిజము ... ఇక ఆశ్రమము వచ్చింది . మా ఇంటికి మేమూ , మీ ఇంటికి మీరూ . యాజ్ఞవల్క్యుడు ఎక్కడున్నా , సుఖంగా ఉండనీ ..పదండి పోదాము "  

No comments:

Post a Comment