SHARE

Saturday, February 2, 2013

27. " మహాదర్శనము "--ఇరవై ఏడవ భాగము-- బ్రహ్మత్వపు కానుక


27. ఇరవై ఏడవ భాగము--  బ్రహ్మత్వపు కానుక 


         యథాకాలములో స్వస్తి వాచనము , అంకురార్పణము , గృహ యజ్ఞము , నాందీ శ్రాద్ధములు నెరవేరినవి . కుమారునికి చౌలమూ , మాతృ సహ భోజనమూ అయి , వాడిని అలంకరించి ఆచార్యుని వద్దకు పిలుచుకొని వచ్చినారు . బుడిలులు పురోహితులై లేచి నిలచి , సదస్సుకు అభివాదము చేసి , " ఇది వైదిక కర్మ. ఇది సఫలమగునట్లు సదస్సులోని వారందరూ అనుగ్రహించవలెను . తమ ఆశీస్సులు సఫలమగుటకు తామెల్లరూ దేవతామూర్తులై కూర్చోవలెను . " అని ప్రార్థించి  ఆచార్యుని వైపుకు తిరిగి తాము బ్రహ్మయై కూర్చున్నారు . 

         ఆచార్యుడు మంత్రాధిదేవతయే తానైనట్లు ప్రతియొక్క మంత్రము చెప్పునపుడూ ఆయా దేవతలను తనలో ఆవాహించుకొని కర్మమును నెరవేర్చినాడు. భిక్షాచర్య వరకూ సర్వమూ నడచింది . వటువు దేవాంశలతో కూడి , వేదములను పరిగ్రహించినాడు . సూర్యదర్శనము చేయించినపుడు సవితృడిని ప్రార్థించి సావితృ కిరణమును పొంది హృదయములో ధారణము చేసి తానే ఇంకొక సవితృడయినాడా అన్నట్టు ప్రకాశించినాడు . అతడు , ’ భో , సావిత్రీం అనుబ్రూహి ’ , అని అడిగి దానిని క్రమ క్రమముగా పదశః , అర్థశః  పూర్తిగా పొందినపుడు , వెనుక బ్రహ్మను మెప్పించి , వేదములను ముష్టి ముష్టిగా ( పిడికెళ్ళతో )  పొందిన భారధ్వాజుడే అందరికీ గుర్తుకొచ్చినాడు . 

         కులపతులకు అంతులేని సంతోషము . బహుశః వారికన్నా ఎక్కువ సంతోషమును పొందినవాడు ఆ సభలో ఒకడే ఒకడు . ఆతడు జనక మహారాజు . అతడికి వటు యాజ్ఞవల్క్యుని చూచినపుడు కనిపించినది కేవలము వటువు కాదు , లోకోద్ధార కర్త యైన మహా బ్రాహ్మణుడొకడు ఆ వామన మూర్తిలో అణగిపోయి కూర్చున్నట్టే తోచింది . " నేను రాజ్యమును ధర్మముగా పాలించుట సార్థకమైనది. కురు , పాంచాల , మద్ర , కాశీ దేశములలో ఉన్న విద్వాంసులందరి కన్నా శ్రేష్ఠుడై , కర్మ , బ్రహ్మలు రెండింటిలోనూ మిగిలినవారికన్నా జ్యేష్ఠుడైన మహానుభావుడొకడు తన రాజధానిలోనే అవతరించినాడు . " అని అతనికి కలిగిన సంతోషము అంతా ఇంతా కాదు . . వెనుకటి రోజు బుడిలులు ఆచార్యునికి బోధించినదంతా భార్గవుడి ద్వారా విన్న రాజు దానినంతటినీ కళ్ళారా చూచి ఆనంద పరవశుడైనాడు . 

          భిక్ష ప్రారంభమైనది , మాతృభిక్ష అయినది , మాతామహాది భిక్షలైనవి , కులపతుల పత్నులు భిక్షనిచ్చినారు . అనంతరము క్షత్రియుల భిక్ష అయినది . రాజు నూతన వటువుకు బంగారము , రత్నములను కానుకగా ఒసగి , " మమ్ములను ఉద్ధరించి , ’ ఈతనికి ఈ రాజ్యమును ఇచ్చినా సరిపోదు ’ , అనిపించుకొనునట్టి విద్వద్వరిష్ఠుడవు కమ్ము" అని ఆకాంక్షించినాడు . అక్కడికి వచ్చిన వైశ్యులు కూడా భిక్షను ఇచ్చినారు . 

        ఆచార్యుడు ఆ భిక్ష ద్రవ్యమునంతా తనకు అర్పించిన వటువుకు ఆశీర్వాదము చేసి , బుడిలులకు సమర్పించినాడు . బుడిలులు దానిలో కొంత తీసియుంచుకొని , మిగిలినదంతయునూ బ్రహ్మ భోజన దక్షిణాదులకని ఇచ్చివేసినారు . 

         మహారాజు తన అనుయాయులైన రాజపుత్రులతో పాటు వెడలినపుడు ఒక విచిత్రము జరిగింది . వెంట భార్గవుడు కూడా ఉన్నాడు . బయలుదేరి నిలచినరాజు , కులపతులనూ , బుడిలులనూ చూడవలెనని అనుకున్నాడు . ఆచార్యుని పక్షాన వచ్చిన మహిదాసుడు వారు ముగ్గురినీ పిలుచుకు వచ్చాడు . వారు వస్తుండగా , రాజు భార్గవులను రహస్యముగా వద్దకు  పిలచి , " అభివాదన చేయు క్రమమేది ? " అన్నాడు . అతడు కూడా రహస్యముగానే , ’ బ్రహ్మ విద్యా సంపన్నులైన కులపతులు కాబట్టి మొదట ఉద్ధాలకులకు , కర్మ విద్యా సంపన్నులైనందుకు ద్వితీయం గా వైశంపాయనులను , అనంతరము ఈదినపు బ్రహ్మత్వమును అంగీకరించియున్న బుడిలులకు ’ అన్నాడు . 

       అంతలో ముగ్గురూ వచ్చినారు . మహారాజు మొదట బుడిలులకు , తరువాత ఉద్ధాలకులకు , వైశంపాయనులకూ నమస్కారములు చేసి , " వ్యుత్క్రమమై ఉంటే , క్రమము తప్పి ఉంటే క్షమించవలెను ’ అని మరియొక సారి చేతులు జోడించినాడు . 

        కులపతులిద్దరూ , " మహారాజులు చేసినది సక్రమముగానే ఉన్నది . బుడిలులు వయస్సులోనే కాదు , జ్ఞానములోనూ మాకంటే తక్కువేమీ కాదు " అని ప్రసన్నముగా అన్నారు . బుడిలులు , " తప్పుకాదేమి , తమరు కులపతులు , మాకు చివరలో జరగవలసినది , ఏదో జరిగిపోయింది , వదిలేయండి " అని గొణుక్కున్నారు . 

      మహారాజు , " ఈ దినము వేదమూర్తులు బ్రహ్మత్వములో ఉన్నారు . మేము ఒక వరమును అడుగవలెనని యున్నాము " అని వినయముగా అన్నాడు .

వైశంపాయనులు , ’ వరమును అడుగుటకు ఇదే సకాలము . ఇక వారు లేదనుటకు లేదు ’ అన్నారు . 

        " బుడిలులకు ఒక గ్రామమును కానుకగా సమర్పించవలెనన్న మా కోరికను మన్నించి అంగీకరించవలెను . " 

         బుడిలులు నవ్వుచూ , " కులపతుల వలననూ , ఈ దినపు బ్రహ్మత్వము వలననూ మా నోరు కట్టివేయబడినది. ఇలాగ సందర్భమును గమనించి గెలిచిన మహారాజావారు ఒక నిబంధన పూర్వకముగా మేము దానిని అంగీకరించుటను ఒప్పుకోవలెను . " అన్నారు . 

" అటులనే , అనుజ్ఞ ఇవ్వవలెను " 

         " మా ఇంటికి సవారీ వచ్చి దానిని యజ్ఞేశ్వరునికి సమర్పించవలెను . రాజాస్థానము ఎంతైనా లక్ష్మీ స్థానము . అక్కడి వచ్చినపుడు ఆ వైభవాదులు మావంటి వారికి చపలమును పుట్టించగలవు. మా తల గట్టిగా ఉన్ననూ రాళ్ళు తగలరాదు కదా ? " 

         మహారాజు ఒప్పుకున్నాడు . బుడిలులు తాము నిస్సహాయంగా దొరికిపోయినందుకు అర్థం లేని నవ్వు నవ్వుచూ , ’ యాజ్ఞవల్క్యుడి యజ్ఞములో బ్రహ్మనైనందుకు ప్రత్యక్ష ఫలము దొరికింది , చూచితిరా ? ఇక మీరిద్దరూ కులపతులుగా వాడి గురువు లైనపుడు మీకెంతటి ఫలములు లభించునో ? " అన్నారు .

         కులపతులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు . " ఒక వటువు రెండు ఆశ్రమములలో గురుకులమును చేయుట ఎలాగ ? " అన్న సంశయము ఇద్దరి ముఖాలలోనూ కొండంతగా కనిపించింది . బుడిలులు దానిని చూచి , " నేను చెప్పకూడదనే అనుకున్నాను , దైవము పలికించింది . కానివ్వండి , స్పష్టమగ్రే భవిష్యతి " అని , ఆచార్యుడూ , వటువూ ఉన్నచోటికి వెళ్ళినారు . 

         అక్కడ ఆచార్యుడిని సాక్షిగా నుంచుకొని , వటువును  ’ వ్రతమెన్ని దినములు ? ’ అని అడిగినారు .  వటువు వామనుడిగా కనిపించిననూ త్రివిక్రముడిలా మాట్లాడుచూ , " మొదటగా ఆచార్యులూ , తమరూ ఎన్ని దినములంటే అన్ని దినములు వ్రతము చేయుట నా కర్తవ్యము . అలాకాక , నన్ను అడిగితే , మూడు దినములు చాలు " అన్నాడు . 

బుడిలులు తమకు కావలసినది అదేనన్నట్టు తలయూపుతూ , ’ ఆచార్యుల అనుజ్ఞ ఎలా ఉన్నది ? " అన్నారు . 

         ఆచార్యుడు అన్నాడు , " నిన్నటి దినము తమరి నోటివెంట వచ్చినదంతయూ ఈ దినము కనులారా చూచితిని . ’ ఆచార్యుని చిత్తానికి అనుచిత్తుడవు కమ్ము ,  , అతని మాట ప్రకారము  నడచుకో ’ అని తమ ఆదేశమని, శృతి విహితమనీ అన్ననూ , వ్రతములను విధాయకముగా చేసిననూ , వ్రతమెన్ని దినములు అనుదానిని నిర్ణయించవలసినది ఆతడు . ఆతడు చెప్పినట్లే కానివ్వండి " . వ్రతము మూడు దినములనీ , నాలుగవ రోజు మేధా జననమనీ నిర్ణయింపబడినది . 

No comments:

Post a Comment